మా రచయితలు

రచయిత పేరు:    పి.శ్రీనివాస్ గౌడ్

కవితలు

ఆకుల మీద మంచు

తియెన్ హంగ్ ( క్రీ.పూ.3 శతాబ్దం )

ఆంగ్ల మూలం : కెన్నెత్ రెక్స్ రాత్

 

ఆకుల మీద మంచు

సూర్యరశ్మి రాకతో మాయమౌతుంది.

ఉదయం ఆవిరయిన మంచు

మళ్లీ రేపు తెల్లవారుజామున

పొటమరిస్తుంది.

 

మనిషి మరణించాక

ఎప్పుడైనా ఎవరైనా

అలా తిరిగొచ్చారా..?

 

మహమ్మారి పద్యాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పెనుమార్పులు తీసుకువచ్చింది.మానవాళిని అతలాకుతలం చేసింది.

దాని వల్ల మనం ఊహించని ఎన్నో పరిణామాలు మన మధ్య చోటు చేసుకున్నాయి.మానవ సంబంధాలు సరికొత్తగా నిర్వచించబడినవి.ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అయినాయి.

మానవ జీవితాల్లో సరికొత్త విషయాలు వచ్చిచేరి అందరి జీవన శైలిని ప్రభావితం చేసాయి.కొండొకచో కొన్ని విషయాలు మాయమయాయి..కొన్ని విషయాలు రూపాలు మార్చుకున్నాయి..

లోకాన ఇన్ని మార్పులు సంభవిస్తున్న సమయంలో .. హైకు కవులు ఎలా స్పందించారు..ఎలా మారిన మానవ సంవేదనలు పట్టుకున్నారు..ఎలా ఈ కల్లోల కాలాన్ని

ఈ చిన్న చిన్న పద్యాల్లోకి కూర్చారో చూడండి.

 

కరోనా వైరస్-

కొన్ని పనులు కొట్టేసాను

నా దినచర్య నుంచి

 *                 -- మైఖేల్ డిలాన్ వెల్చ్/గ్యారీ హాథమ్

 

భౌతిక దూరం-

ద్వారం దగ్గర ఆహారం వదిలెళ్తూ

ఓ మిత్రుడు

*                   -- సి.జె.ప్రిన్స్

 

భౌతిక దూరం-

కేఫ్ లో ఎవరికి వారు

ఫోనుల్లో మునిగి

*                   -- డేవిడ్ జె.కెల్లీ

 

భౌతిక దూరం-

అందరితో కలిసి

పార్కులో ఒంటరిగా

*                   -- మైఖెలె రూట్- బెర్న్ స్టైన్

 

భౌతిక దూరం-

నవ్వులు మార్చుకున్నాం

మాస్క్ ల లోంచే

*                   -- రష్మి వెస

 

భౌతిక దూరం-

రోజూ శ్మశానం పక్క నుంచే

నా షికారు.

*                  -- ఒలివర్ స్కూఫర్

 

ఓ రిపబ్లికన్..

ఓ డెమోక్రాట్..

ఒకటే వైరస్-

*                  -- బ్రూస్ హెచ్.ఫెయిన్ గోల్డ్

 

క్షీణిస్తూ చంద్రుడు-

ఇప్పుడు అందరం

మూసుకొని లోన వున్నాం

*                 -- మ్యాథ్యూ కెరెట్టి

 

కరోనా వైరస్-

బంధించి వుంచాను

నా భయాలని

*                 -- రోజర్ వాట్సన్

 

క్వారంటైన్-

జనమున్నట్టు ఊహించుకొని

అతను బాస్కెట్ వేసాడు.

*                    -- డేవిడ్ గ్యారిసన్

 

క్వారంటైన్-

ఎక్కడున్నామా అని 

పక్షులు ఆశ్చర్యపోతాయా..

*                       -- టిమ్ మర్ఫీ

 

*******    ********

 

క్రూర ప్రపంచమా...

" Never ever seek for greatfulness from mankind, you shall always see ungrearfulness. Do what you must do as a solemn duty "     --- Ernest Agyemang Yeboah

       1.

ఇక్కడంతా ఇంద్రజాలం..

నమ్మకాల కనికట్టు..

 

కనిపించే మనిషి మాయమై

అంతలోనే కోరల్తో కనిపిస్తాడు.

స్నేహంగా చేయి చాచినవాడు

ఇంకో చేతిని కరవాలంగా దూస్తాడు.

 

సన్నగా కనిపించని కత్తివాదరకు

గొంతు తెగుతుంది.

తెగినట్టు అనిపించదు.

రక్తం కారుతుంది.

కారినట్టు అనిపించదు.

గుండె గాయమోడుతుంది.

గాయం ఎక్కడా గొంతు విప్పదు.

 

నీ ముందు ప్రపంచం నవ్వుతుంది.

వెనుక ముఖచిత్రం మారుస్తుంది.

 

ఎవ్వరెందుకు దగ్గరౌతారో 

దూరమౌతారో అంతుపట్టదు.

 

ఎందుకో ఎలానో ఎవరూ చెప్పరు.

ఏ చిక్కుముడి ఎవరూ విప్పరు.

 

నీరేదో..పాలేదో చిలక్కొట్టేసరికి

ముప్పాతికపాళ్లు జీవితం జారిపోతుంది.

       2.

చిన్న చిన్న విషయాల వెనుక

జీవితం దాక్కుంటుందంటారు..

ఈ ప్రపంచం మన ప్రపంచం కావడం

చిన్న విషయం కాదు.

 

మాలిమి అయిన ఏనుగు

ఒక్కోసారి క్రూరంగా తిరగబడినట్టు

క్రూరంగా పెడబడుతుంది ప్రపంచం.

 

పారే నీటి మీద

మంచు గడ్డ కట్టినట్టు

గడ్డ కట్టి వుంటుంది ప్రపంచం.

స్వార్థపు చెక్కు కట్టి వుంటుంది.

 

అప్పుడు అది

కన్నీటిప్రార్థనలకు కరగదు.

దానికి కన్నీరు కలుషిత పదార్థం.

అవసరమే దాని అత్యవసర లక్షణం.

       3.

దయను అడుక్కోవడం

దయనీయం.

 

భిక్షపాత్రలో

ఒకింత ప్రేమకబళం పడటం

ఒక ఉత్సవం.

 

ఈ భూమిపొరల్లో అరుదుగా దొరుకుతున్న

మూలకం మానవత్వం.

మనిషి- సాటి మనిషి కష్టంపై

కంపించడం..స్పందించడం

ఇప్పుడు చారిత్రాత్మకం.

        4.

మహా మహా మానవ హననాల తర్వాతా

మనిషి కాగడా వెలిగించాడు.

 

శవాల కుప్పల మీద నిలబడి

శాంతి మంత్ర జైత్రయాత్ర జరిపించాడు.

 

మళ్లీ మళ్లీ మొదలకంటా నరికేసినా

మళ్లీ ఓం ప్రథమం నుంచి 

మొలకలా మొదలయ్యాడు.

 

అన్ని క్రూరత్వాల్నీ, కుత్సితాల్నీ

ఎదుర్కోవడానికి

ఒకడుంటాడు ఎక్కడో

దీపం పట్టుకొని -

      5.

క్రూరత్వం 

నీ సహజ గుణం కాదు.

నువ్వేసుకున్న పై ముసుగు.

 

ఏదీ శాశ్వతం కాదు.

నీ క్రూర నడత కూడా.

 

క్రూర ప్రపంచమా..

నీ క్రూరత్వంపై నువ్వే

తిరగబడే రోజు

తప్పక వస్తుంది.

 

చిన్ని చిన్ని సంగతులు

ఒక పని

ఎత్తుకున్నాడతను.

 

విరిగిన కలల్ని

అతుకేసే పని.

 

చెదిరిన బతుకుల్ని

కూడేసే పని.

 

సడలిన గుండెల్లో

ధైర్యం రాజేసే పని.

 

ఒక పనిని

తలకెత్తుకున్నాడతను.

 

వెనుదిరిగి చూసే

చరిత్రకు

ఎప్పుడో ఒకప్పడు

అతనితో

పని పడుతుంది.

******

నీకు తెలీదు.

 

వేర్లకి నీళ్లు పోస్తే

పైన పూలు పూస్తాయని..

కాయలు కాస్తాయని..

 

ఒక్కోసారి 

నీకు తెలీదు.

 

ఒక తడివిత్తనం పాతేసి

నువ్వెళ్లిపోతావు.

 

మాను మొలిచి కొమ్మలు చాచి

ఆకులనీడ పరిచినప్పుడు

కోటిలో ఒక్కడయినా

చల్లని కొమ్మల కింద కూచొని

తల్చుకుంటాడు నిన్ను

గుండెచేతులు జోడించి.

 

నువ్వప్పుడు

తల నెరిసి వుంటావో..

తల వాల్చేసి వుంటావో..

నువ్వు చేసిన పని మాత్రం

తల ఎత్తి నిలబెడుతుంది.

 

నీకు తెలీదు.

( కె.వి.రమణారెడ్డి తలపులో )

******

కాసిని

చెట్ల గుబురుల మధ్య

వున్నాను.

 

పక్షుల కూజితాలకి

పసరిక పచ్చి వాసనకి

లోన ఎండిపోయిన 

ఎదబీళ్ల మీద

వీస్తున్న పైరగాలికి

ఒక్కొక్కటిగా

నన్ను నేను కూడేసుకుంటున్నాను.

 

పిట్టలాగో పశువులాగో

తన ఇచ్ఛగా ఎగిరే

సీతాకోకలాగో

జీవించడానికి

ఒక అదను కోసం

వెతుకుతున్నాను.

 

అదేదో అభివృద్ధి

ఇక్కడిక్కూడా వెంటబడి

రాకుండా వుంటే

బాగుణ్ణు.

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు