మా రచయితలు

రచయిత పేరు:    శ్రావణి గుమ్మరాజు

కవితలు

ఈ మానమే ఓ ప్రశ్నార్థకమా??

  పుణ్యక్షేత్రపు సంపర్కంలో

నక్షత్రమో నేలరాలి బ్రహ్మాండంలో చేరిపోతే!!

ఆడపిల్ల అనే మాటతో

ఆది నుండి మెరుపు తగ్గి

నలుసువే అని నలిపేసే సమాజంలో

తొలి ఏడుపేదో చెప్పకనే చెప్పిందేమో

ఇది నీకు శాశ్వత సంతకమని!!

బుడిబుడి అడుగుల వెనుక

పిడుగులు కురిపించే కళ్ళుంటాయని!!

పట్టు పరికిణీ అందాలు చూడటం మరిచి

అంగాంగపు కొలతల వెతుకులాటలు చేసే

మస్తిష్కాలు తిరుగుతుంటాయని!!

మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతీసే

మేకవన్నె పులులు నీడల్లా వస్తుంటాయని!!

అసభ్యపు పదజాల పదకేళితో

మగువ మనోబలాన్ని దెబ్బతీయాలనే

విశృంఖల పెదాలు ఉవ్విళ్లూరుతుంటాయని!!

సమస్తమూ స్త్రీ దేవతా స్వరూపమని

పైపై నీతులు వల్లెవేస్తూ.....

విశ్వములో ఆడజాతికి పూచే పువ్వులన్నింటిని  కర్కశంగా రాల్చేస్తుంటే!!

మాతృత్వాన్ని పంచే మర్మాంగం ఉలిక్కిపడుతుంది

మగవాసన వీస్తున్న చోట నాకు రక్షణ లేదని!!

కామానికి కర్మలు చేసిన

జన్మపు అభిశాపమో

మమకారపు విలువలు లేని

నేలమీద ఉండమని వాణి వినిపిస్తుంది!!

 

ఈ సంచికలో...                     

Jun 2021

ఇతర పత్రికలు