నా పల్లెనుంచి ఎంతో బరువును మోసుకొచ్చాను పట్నానికి
దింపుకోడానికి ఒక్క కొలువులో కూడా సందు దొరకట్లేదు...
చిన్న గది
మా కన్నీళ్ళతో ఇదెప్పుడో నిండిపోయింది
ఈత కొడుతూనే ఉన్నాం
ఆపట్లేదు...
అశోక్ నగర్ వరకు
నడిసి నడిసి అలిసిపోతే
పర్సుని మళ్ళీ మళ్ళీ చూసుకొని
కన్నీళ్ళతో ముందుకెళ్లడం తప్ప ఇంకేం తెల్వదు...
ఎప్పుడైనా
నా బాడీ రిపేరుకొస్తే
ఏదో ఒక నట్టు బిగించి
నేను రిపేర్ చేసుకోవడమే కానీ
దవాఖానాలో అడుగెట్టే
ప్రసక్తే లేదు...
అప్పుడప్పుడు అమ్మతో మాట్లాడాలనిపిస్తే
గుండెను గట్టిగా పట్టుకోవడం
నాన్నను చూడాలనిపిస్తే
అద్దంలో నన్నునే చూసుకోవడం
ఇంతకన్నా ఏం తెల్వదు
కొలువుకుదరిని కొడుకును కదా...
ఇంతకన్నా ఏం తెలుస్తుంది...
పద్మవ్యూహంలో చిక్కుకుపోయ్యాను నేను
ఈ శబ్దాలలో
ఈ గాలులలో
నా దుఃఖాన్ని పారేసుకోలేకపోతున్నాను..
నా పల్లెలో సీతాకోకచిలుకగా ఉన్న నేను
గొంగలిపురుగుగా మారాను
నా పల్లె పోయి మల్లి సీతాకోకలా రెక్కలు విప్పాలని ఉన్నా
ఈ లోకం నన్ను రక్కులకే పరిమితం చేస్తుంది..
అమ్మకు చెప్పలేను
నాన్నకు తెలియకూడదు
ఏదో బాధగా అనిపించి నీతో(కవిత్వం) చెప్పుకున్న
ఎవ్వరికి చెప్పవు కదూ!..