తాకలేని హరివిల్లుకి సప్తవర్ణాలను అద్దిందెవరో ??
అసలు లేని ఆ ఆకాశానికి నీలి రంగు ఎక్కడిదో ??
ఎత్తైన ఆ కొండలకు పచ్చని చీర కట్టిందెవరో ??
అల్లంత దూరాన ఉన్న ఆ వెన్నెలకు చల్లదనం పూసిందెవరో??
గల గలమంటూ పారే నది - అది ఎవరి మంజీరా శబ్దమో??
తళుక్కుమనును తారలు - అవి ఎవరి నవ్వుల మెరుపులో ??
ఊపిరాడని సంచిలోంచి సీతాకోకచిలుకకు ప్రాణం పోసిందెవరో ??
జీవం లేని రాయి పలికే ఓంకార నాద స్వరం ఎవ్వరిదో ??
ఏ రుచి లేని మట్టి నుండి పుట్టిన చెరుకుకు తీయదనం ఎక్కడిదో ??
జారిపోయే నీటిని నిలిపి ఉంచే శక్తి ఆ మేఘాలకు ఎవరిచ్చారో ??
పురి విప్పి నాట్యమాడే నెమలికి నాట్యం నేర్పిందెవరో ??
పాడే ఆ కోకిలకు తీయనైన కుహు కుహు రాగాలు ఎక్కడివో ??
అందమైన నెమలి పింఛానికి సింగిడి రంగులు వేసిందెవరో ??
చిలుకకు రామ నామం నేర్పిన గురువు - అది ఎవ్వరో ??
ఈ భువిపై సముద్రాలు నింపేందుకు బావులు తవ్విందెవరో ??
ఆ బావుల సరిహద్దులు ప్రతి సాగర తీరాన ఇసుకను పోసిందెవరో??
అద్భుతమైన ఈ ప్రకృతి సృష్టికర్త ఎవరో ??
ఈ వైవిధ్య జీవజాల రూపకర్త ఎవరో ??