మా రచయితలు

రచయిత పేరు:    ఇనుగుర్తి లక్ష్మణాచారి

కవితలు

చదువే..! 

కం.    కులముకతీతము చదువే

          కలముకు యింధనమునిచ్చి కదుపును చదువే

          విలువలు తెల్పును చదువే

          మలుపుల బతుకులను సరిగ మలుపును చదువే

 

కం.    మహిని సరి వరము చదువే

          మహిని మనిషి మదిని మార్చు మూలిక చదువే

          మహినుత్తమ పని చదువే

          మహిని కులాగ్నిని చెరిచె హిమము యీ చదువే

 

కం.     కరగని సరి సిరి చదువే

           మెరుగైన మెరుపులు దిద్దు మనిషికి చదువే

            చెరగని చరితము చదువే

            మురిగిన సంఘానికి తగు మందూ చదువే

 

కం.      తీరని దాహం చదువే

            కోరని భోగమిడు క్షీరకడలీ చదువే

            యేరుగ పారును చదువే

             కోరగ కాపాడు గొప్ప ఖడ్గం చదువే

 

 

 

ఎవరితరం ( గజల్ )

చర్చించుట కోరువాన్ని భేదించుట ఎవరితరం

గొడవలన్న ఇష్టముంటె వాదించుట ఎవరితరం

 

ప్రతిఒక్కడు సంపదకే దాసోహం అంటుంటే

మానవతా రాజ్యమునే స్థాపించుట ఎవరితరం

 

బొనుకువాని వణుకుతున్న ప్రతిమాటకు వాస్తవాలు

తూటాలుగ తాకుతుంటె తప్పించుట ఎవరితరం

 

విద్యార్థులు గెలవాలని నిరంతరం పాటుపడే

కోటిగారి ధీరత్వము ఛేదించుట ఎవరితరం

 

లక్ష్మణుడే అందరికీ అనురాగం విలువలతో

పంచుతుంటె తననింకా ద్వేషించుట ఎవరితరం

 

 

ఈ రోజు నీ కోసమే..

నీ కోసం ఈ రోజు ఒక రోజు

నవోదయాన్ని ప్రభవిస్తుంది

ఆ రోజు నిను చుట్టిన కుళ్ళు బూజు

విజయాదిత్యుని ప్రచండ ప్రకాశంలో

ముప్పై కుప్పలుగా రాలిపోతుంది

కుళ్ళును నల్లగ అల్లిన

కపట కుటిల జటిల సాలీడులే

చమత్కార చీమిడి ముక్కులతో

నీ విజయరుక్కుల స్పర్శకై

ఆరాటపోరాటాలు చేస్తాయి

అవి నీ యశః వాహినికి

స్వయం చోదకులౌతాయి

మనస్సు మానవతతో సాగనీ ఓ సోదరా!

జయోషస్సులన్ని నీలోనే జనిస్తాయి కదరా..

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు