ఇది కైతల అంగడి
ఇదర్ హర్ ఏక్ చీజ్ లిఖాజాతాహై
తామెందుకు రాయబడుతున్నామో తెలియని కైతలు
వాట్స్యాప్ లో పొలోమంటూ పోస్టచేయబడుతాయ్
హృదయముప్పొంగి వచ్చినవి కొన్నైతే,
అవార్డులకై వలలుగా ఎగిసినవి కొన్ని
మేటి కవులచేతి దురదను,
బురదగా పూసుకున్న కైతలు కొన్నైతే,
సారస్వతం తెలిసిన సరసుల సంగతులు కొన్ని
ఎన్నోఎన్నెన్నో ఈ అంగడిలో కనువిందు చేస్తాయ్.
ప్రాణం లేని పేరాలెన్నో
నిట్టనిలువుగా కవితలుగా పేర్చబడి
కవుల కరనైపుణ్యాన్ని తెలుపుతాయి.
విషయమే లేని వివరాలెన్నో
నీళ్ళు చల్లబడిన పూవులై
ఎక్కువ బరువు తూగుతాయి,
గంపలకొద్దీ గులకరాళ్ళను
రత్నాలుగా భ్రమింపజేసే యత్నంలో
గాడిదలు, ఒంటెలు పరస్పరం
దుశ్శాలువాలతో కప్పబడ్డ
సరుకు నాణ్యతను పొగుడుకుంటాయ్
నిక్కమైన నీలాలను
మసిపాతలో మోసుకుపోతున్న కైతన్నలు
తావులేక, మైలసంతలలో నిలబడి
సహృదయతులసీ దళాలకై ఎదురుచూస్తారు.