మా రచయితలు

రచయిత పేరు:    వురిమళ్ల సునంద

కవితలు

ఆమె

అమ్మ పొత్తిళ్ళను వీడిన పసికూనలా

కాలం అలారానికి ఉలిక్కి పడి

నిదురమ్మ వంక నిస్సహాయంగా చూస్తూ

తరమబడుతున్న లేడి పిల్లోలె

వంటింట్లోకి పరుగులు తీస్తుంది!

 

సమయం సింహమై గర్జిస్తుంటే

ముసుగుతన్నిన ముద్దుబిడ్డలను

గుండెల్లో పొదువుకొని 

కూడా ఉండలేని తనపై కోపగించుకుంటూ

బడికి తయారు చేస్తుంది... !

 

సూటి పోటి మాటల చేదు

 మనసును గాయం చేస్తున్న

నడుస్తున్న పూల తోటై

తన ప్రేమ పరిమళాలను 

అవిశ్రాంతంగ పంచుతూనే వుంటుంది!

 

కదిలే కాలాన్ని కాళ్ళకు  రాసుకున్న

 ఓపిక ప్రవర లేపనంతో అధిగమిస్తూ

ప్రతి నిత్యం ఆమె స్వేదంతో

 దారిపొడవునా పచ్చదనంతో నింపి

ఇంటికి నక్షత్రాల తోరణాల మధ్య

వెలుగుల దీపమై గుబాళిస్తుంది... !

 

ఆకాశంలో సగమన్న మాటలకు

వెన్నెలంత చల్లగా నవ్వుతూ 

అనంతమై విస్తరించిన తన 

అనురాగ హృదయాన్ని చూసుకొని

మౌనంగా సాగిపోతుంది... !

 

ఉగాదులు ఉషస్సులు

 రావడమెంత సహజమో

మహిళా దినోత్సవాల ఆర్భాటాలు

 అంతేనని తెలిసిన స్థితప్రజ్ఞ  ఆమె!

 

అందుకే ఉత్సవాలు జరిపే వాళ్ళంతా

అవార్డుల పేరిటో రివార్డుల పేరిటో

ఆమె సేవలను కొనియాడుతుంటే... !

 

ఇవన్నీ అవసరం లేదని 

సున్నితంగా తిరస్కరిస్తూ

ఒక్కరోజు ఆమెలో /తనలో

పరకాయ ప్రవేశం చేసి

ఆమె సృష్టికి రూపమో 

సహనానికి కొలమానమో

ధైర్యానికి ప్రతీకగానో

నచ్చిన రంగంలో ఎదిగిన 

ఆమె విశ్వత్వాన్ని చూడమంటుంది!!

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు