మా రచయితలు

రచయిత పేరు:    కళ్యాణ సుందరి జగన్నాథ్

కథలు

ఒక కథ

(కళ్యాణ సుందరి జగన్నాథ్ తన అలరాస పుట్టిల్లు ముందుమాటలో  తన మొదటి కథను, దాని వివరాలను  గురించి ప్రస్తావించారు. ఈ కథ “అలరాస పుట్టిల్లు”లో లేదు  అలా  ప్రస్తావించిన వివరాల ఆధారంగా సజ్జా వెంకటేశ్వర్లు భారతి పత్రికను వెతికి ఆ కథను వెలికి తీసారు.  “ఒక కథ” పేరుతో “అజ్ఞాత్” అనే కలం పేరుతో ఈ కథను వ్రాసారు.  ఈ కథ 13-7-2020 నాడు  సాక్షి దిన పత్రికలో ఒక యుద్ద కథ  అనే పేరుతో సంక్షిప్తం చేసి వేసారు.  కళ్యాణ సుందరి జగన్నాథ్ మొదటి కథను పాఠకుల కోసం పూర్తి కథను అందిస్తున్నాం)

08-01-39

బొంబాయి.

          ‘‘ఇప్పటికి సరిగా వారంరోజులయింది మిమ్మల్నందరిని వదిలిపెట్టి. ధర్మవరం దాటగానే నాకు వెనక్కి తిరిగి ఇంటి కొచ్చెయ్యాలనిపించింది. కాని దాసు చాలా ప్రోత్సాహించాడు మళ్లా. అంచేత అంత బెంగ లేకుండా ఇక్కడికొచ్చాను.

                  నిన్ను చూచిచూచి రావడానికి కాళ్లడలేదు. కాని లక్ష్మీ, భగవంతునిదయ యుంటే, ఏమో మనం అనుకున్నట్టూ ఈ యారు నెల లయిన తరువాత సర్కారు ఓ పదెకరాలిస్తే! ఇస్తారుట ఎట్లాగైనా ఆఖరికి నాలుగైనా. ఏమో మన కలలన్నీ నిజమవుతాయేమో? హాయిగా కూర్చుని పండించుకోవచ్చు. పిల్లలదృష్టం. ఇప్పుడేగదూ ఈ రాత్రనక పగలనక ఈ కష్టం. యుద్ధమా మాట్లా? తరవాత రోజులన్నీ మన ఇష్టం. గువ్వల్లా గూట్లో పడి ఆ కాస్తగింజలూ పండించుకోవచ్చు.

          పిల్లలు కళ్లల్లో కట్టినట్టున్నారు. నేను బయలుదేరేటప్పుడు కారు కదిలేవరకూ నీ ముఖం చూడడానికి ధైర్యం లేకపోయింది. ని వ్వెంత దు:ఖమాపుకున్నావో నాకు తెలుసును. ఏం చేస్తాం. బెంగపెట్టుకోకు. కోతలవంగానే తిరిగీ వచ్చేస్తా. దేవుడిచ్చిన ఆయుస్సు తిన్నగా వుంటే మనకేం భయంలేదు.

            చేను జాగ్రత్తగా చూచుకొంటూండు. రాముణ్ణి నూతిదగ్గెర ఆడుకోనివ్వవద్దు. అమ్మనీ పిల్లల్ని ఎంత భద్రంగా చూచుకొంటావో. ఓడ ఎక్కగానే వ్రాస్తా మళ్లీ. అమ్మకి దణ్ణాలు.’’

            ఉత్తరం చదివించి విన్నది. అత్తగారితో పిల్లలిద్దరూ వాకిట్లో ఆడుకుంటున్నారు. గుమ్మంలోకి వచ్చింది లక్ష్మి కర్ణంగారింటి నుంచి. కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. రాముడి వేపు చూచింది. రాముడు కనబడలేదు. నీళ్లడ్డం. రాముడు చిన్ని ముఖం ఎత్తి పలుకరించాడు.

            ‘‘అమ్మా, నాన్నెప్పుడొత్తాడే? నాక్కుక్కబండి తెత్తాడా?’’

               లక్ష్మికి  యేడు పాగలేదు. రాముడు తల్లి కాళ్లు చుట్టేసుకున్నాడు.

                                                                        ----

 

            కోడి కూసింది... మలుకోడి.

            లక్ష్మి యథాప్రకారం లేచింది. రాత్రంతా ఏమేమో కలలు. ఒక దారీ తెన్నూలేని ఊహలు. ఒకళ్లనొకళ్లు చంపుకోడం, రక్తప్రవాహాలు, గుఱ్ఱాలు, పెద్దపెద్ద ఓడలు, రైలుబండ్లు. నారాయణా తానూ చేలో కలిసి కలుపు తీస్తూ ఎందుకో పకపక నవ్వేశారట. ఇంకా చాలా. అర్థంలేదు.

            మంచుతో బరువుగా చిన్ని గాలి వీస్తోంది. రాత్రి ఒకజల్లు కురిసి ఆగినట్టుంది వాన. వాకిలి కొంచెం చెమ్మగా వుంది. వెన్నెల. లక్ష్మి ముఖం కడుక్కుని చల్లచేసుకుంది. గొడ్ల సావిట్లోకి వెళ్లి పనిచేసుకుంటూంది. తెల్లవార్తోంది తూర్పున. ఇప్పటికి పదిహేనుసార్లు ఈ విధంగా తెల్లవారింది నారాయణ పటాలంలోకి వెళ్లిన తరువాత. ఇన్ని రోజులకీ ఈ నాడు ప్రొద్దున్న మాత్రం హృదయం కాస్త భారం తగ్గినట్టుంది లక్ష్మికి. ఆరుమాసాలే గదూ. ఆరమావాస్యలు, ఆరుపున్నాలు అంతే.  యెర్రావు ఈనేటప్పటికి తిరిగి రావాలి మరి. అదృష్టం వుంటే పుల్లావూ కోడె దూడ్నికూడా వెయ్యాలి. లక్ష్మి భావాలు పరిగెడుతున్నాయి. పాలు తీసి లేగల్ని విప్పింది.

            తూర్పున దేవుడికి దణ్ణం పెట్టి, పిల్లలకి అన్నం పెట్టి తలలు దువ్వి చొక్కాలు తొడిగి బడిలోకి పంపేసింది.

            అత్తగారు, లక్ష్మి చద్దన్నం పెట్టుకున్నారు. సోమవారం, ఓడలోనుంచీ వ్రాసే వుత్తరం వస్తుందని చెప్పుకున్నారు, ఇద్దరూను.

            ఆనాడు లక్ష్మి చేలోకి వెళ్లింది. ప్రతిరోజూ కంటే ఆనాడు కొంచెం సంతోషంగానే వుంది. కాని ఈ పదిహేను దినాలనుంచీ వున్న వెలితి మాత్రం పోలేదు.

            ఊడ్చిన చేనంతా నాటుకుంది. ఈ చేను పెరిగి పండేటప్పటికి నారాయణ తిరిగి వస్తాడు. వేసవి అంతా ఇంట్లోనే వుంటాడు. ఆ తరువాత కూడాను. ఈ తలంపుతోనే ఒక విధమైన ధైర్యంకూడా వచ్చింది లక్ష్మికి.

               ఆకులు పోసిన వెంటనే వెళ్లాడు నారాయణ.

               లక్ష్మి తల్లిలేనిదవడం వల్ల నున్నూ మేనరికమవడం వల్ల నున్నూ పెండ్లి అయిన తరువాతా, అవక ముందూ కూడా ఆ ఇంట్లోనే పెరిగింది. నారాయణ దగ్గరగా ఇన్నాళ్లు వరసాగ్గా కళ్లకి కనబడకుండా వుండడం పెండ్లి అయిన తరువాత ఇదే మొదటిసారి నారాయణ, ఈ యెనిమిది సంవత్సరాలకి. భర్తవైపున బంధువులు అసలే లేరు లక్ష్మికి. అంచేత తానే నడుం కట్టుకుని ఆకు తీయించి ఊడ్పించింది. లక్ష్మి తండ్రి దూరాన్నున్నాడు. పండుగలకు వచ్చి పోయేవాడు.

            నారాయణ తనంతట తానే అయితే వెళ్లకనే పోనేమో. కాని అతని బాల్య స్నేహితుడు దాసు ప్రోత్సహం జాస్తి అయింది. దాసు బలగం గలవాడు. బ్రహ్మచారి. వీళ్లకంటే కాస్త బాగా బ్రతుకుతూన్న వాళ్లు కూడాను. గడిచిన పదిసంవత్సరాలలో  సంతకు బస్తీ వెళ్లడంతప్ప మరేమీ బయట పనిలేని నారాయణకి పటాలం కొలువంటే కాస్త సరదాగానే వుంది. యుద్ధం లేని రోజుల్లో ఒకపుడు పటాలంలో చేరివచ్చేసాడు కూడాను. అదికాక పటాలం పనివాళ్లందరికి తిరిగి వచ్చాక పొలాలిస్తారనే ఆశ ఒకటి.

            మరునాడు తలంటిపోసుకొని లక్ష్మి శనివారం సోమవారానికి ఒక్క రోజే మధ్య వుంది. ఆ రెన్నాళ్లూ రెండు గడియలలా గడిచినాయి.

            సోమవారం: 17-02-39

            ‘‘మేము ఓడలో వున్నాం. మన తెలుగు భాష రాని వాళ్లు కూడా చాలా మంది మా ఓడలో వున్నారు. నాకే విధమైన లోటూ కనబడడం లేదు. చాలా సరదాగా ఉంది. ఒహ ఆటలూ, ఒహపాటలూ గావు. అన్నీ తిరిగి వచ్చాక చెబుతానులే.

            ‘‘పిల్లల మీద మాత్రం చాలా బెంగగా ఉంది. మరీ రాముడు కళ్లల్లో తిరుగుతున్నాడు. వాడు జాగ్రత్త సుమా.’’

            ఉత్తరం వచ్చింది. ఏమిటో ఆ సరదా లక్ష్మికి అర్థంకాలేదు. ఇహ తరుచు ఉత్తరాలు వస్తూ వున్నాయి.

                                                                                                                                    23-07-39

                                                                                                   బస్రా.

            ‘‘మా పటాలం ఇక్కడే దిగి పొమ్మన్నారు. మాతో పాటు ఇంకారెండు రెజిమెంట్లు దిగాయి. దాసు బాగానే ఉన్నాడు. ఏమీ పని లేదు. రోజూ కవాతు చేయిస్తారు మాచేత. అది అయిన తరవాత కోరిన తిండి, పేకాట. ఒక్కొక్కప్పుడు ఊళ్లోకి వెళ్లి నాలుగు వీధులు తిరగడం. బలేగా ఉంది.’’

            మనస్సులో బాధగా ఉన్నా లక్ష్మి ఆ ఉత్తరాలు చూసుకొని ధైర్యం తెచ్చుకుంది. ఆయన సుఖంగా ఉన్నదీ లేనిదీ తెలుస్తోంది. అంతే చాలు.

            పొరుగింటి పిల్లల్ని చూసి లక్ష్మి పిల్లలు గోల పెడుతూంటే వాళ్లకు కూడా కుడుములు చేసియిద్దామని చేసింది. ఆఖర్ను తనూ ఒకటి తీసుకొంది. నారాయణకు చాలా యిష్టం కుడుములంటే. తలవని రీతిగా తలంచుకుంది. కుడుము నోట్లో పెట్ట బుద్ధి వెయ్యలేదు.

            ఇంకా నారాయణ దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి.

            లక్ష్మి విన్నదీ ఉత్తరం. హృదయంలో గాయం పడ్డది. ఇంటికొచ్చింది.

                                                                                                                                    10-08-39

     బస్రా

            ‘‘యుద్ధం ఆరంభం అయింది. మా రెజిమెంటు ఈ రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరాలి.’’

            ‘‘అబ్బ! ఎన్నెన్నో కొత్తకొత్త మరతుపాకీలు తెచ్చారు. నిన్నంతా మాకు చూపించారు. మొహాలకి గంతలు ఎన్నోరకాలు. ఈ వింతలన్నీ తిరిగి వచ్చాక చెబుతాను.’’

            ‘‘నిన్నంతా నువ్వే కనపడ్డావు కళ్లకి’’

            ‘‘అమ్మా పిల్లలూ జాగ్రత్త! రాముడు జాగ్రత్త సుమా’’

            లక్ష్మి పనంతా చేసుకొని తీరికగా ఉన్నప్పుడు కర్ణంగారి వాకిట్లోకి పోవడం కద్దు. కరణంగారి భార్య రంగమ్మగారు, చాలా మంచిది. నలుగురూ కలిసి కాస్త ముచ్చట్లాడుకొని నీళ్లవేళకి ఇళ్లకు జేరుకుంటారు. ఈ సంవత్సరం రంగమ్మగారి పెద్దబ్బాయి రామ్మూర్తి చెన్నపట్నంలో బియ్యేపాసై ఇప్పుడింట్లోనే ఉన్నాడు. ఇంగ్లీషున్యూస్‍ పేపరు తెప్పిస్తూంటాడు. చదివి ఎప్పటికప్పుడు రంగమ్మ గారితోను తండ్రిగారితోను చెబుతూంటాడు వాట్లల్లో సంగతులు. వాట్లల్లో భయంకరమైన మరతుపాకీలు, శిథిలమైపోయిన పట్నాలు, శత్రువులు ధ్వంసం చేసిన కట్టడాలు, మరణిస్తూ ఉన్న సిపాయీలు వీట్ల అన్నిటి బొమ్మలూ చూపించి అర్థం చెబుతూంటాడు.

            నారాయణ వుత్తరాలన్నీ ఆయనే చదివి చెప్పేవాడు లక్ష్మికి. లక్ష్మికి అక్షరజ్ఞానం లేదు.

            నారాయణ వుత్తరం తిరిగి వచ్చేవరకూ అదే కాలక్షేపం లక్ష్మికి. రంగమ్మగారి ద్వారా యుద్ధ సమాచారాలు తెలుసుకోడం, ఆ బొమ్మలాశ్చర్యంగా చూస్తూండడం, ఇదీ వరస.

                                                                                                                                    20-08-39

                                                                                                    బస్రా

            ‘‘ఇన్నాళ్లూ ఈ తాగుడు ఎల్లా తాగేనో, ఇప్పుడు అసహ్యమేస్తోంది. ఈ అన్నం మనగొడ్లు కూడా తినవు. ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే మేలు. తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదు. దోమలు వీపు మీద ఒక గేదె బరువు. ఏదో పాపం చేస్తే తప్ప యుద్ధంలోకి రారు.’’

            తప్పంతా తనదే ననుకుని దృఢం చేసుకొంది మనస్సులో. తానే వెళ్లనిచ్చింది ఒంటరిగా. అంత దూరదేశం. ఏడవకూడదూ? చిన్నా పెద్దచే చెప్పించకూడదూ? నారాయణ పెద్దమనిషి. పెద్దలమాట కెదురుచెప్పడే! అయినా తన పూర్వజన్మ ప్రాలుబ్ధం అంతేనేమో! ఇంకా ఎన్నో తలంపులు వచ్చాయి ఆ రాత్రంతా. నిద్రపట్టలేదు. నారాయణ సుఖంగా తిరిగి వస్తే ఒక మేకపోతును మొక్కుకుంది మహలక్ష్మీ అమ్మవారికి.

                                                                                                                                    30-08-39

బస్రా.

            ‘‘గడిచిన రెండుదినములూ ఘోరమైన యుద్ధం చేశాము. ఇటువంటి ఘోరం యమలోకంలో కూడా ఉండదు. నీవు ఊహించుకోలేవు. నా హృదయాన్ని చంపుకున్నాను. యుద్ధానికి ఎందుకొచ్చానా అని పరితపిస్తున్నాను. నేను వెంటనే తిరిగీ మీ అందరినీ చూచే వరకూ ప్రాణాలు కుదురుగా ఉండవు.’’

            ‘‘అమ్మ ఏడస్తోందా?’’

10-09-39

బస్రా

            ‘‘నాకు మతి పోతోంది. పదిమైళ్లు ముందుకి సాగాం. నిన్నంతా మురికినీళ్లలో, కందకంలో శవాల మధ్య ఉన్నాము. నాకు ప్రాణస్నేహితులందరూ చస్తూంటే వాళ్ల కేకలు విని కూడా వాళ్ల మీదనుండి ముందుకు నడిచిపోయాం. హృదయం రాయి చేసుకొన్నాను. తోటివాళ్లందరూ గాలిలో పురుగుల్లా కనిపించవలసి వచ్చింది. కన్నుమూసి తెరిచేటప్పటికి  కెవ్వున కేకలు పెట్టి చుట్టూ కూలిపోతున్నారు. ప్రాణం పోకముందే కదలి ముందుకు పోవలసి వస్తుంది. ఏ ఘడియ కేమో?’’

20-09-39

బస్రా.

            ‘‘నేనింకా బతికే ఉండడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు మతిపోయింది. నా కీపాపం ఇష్టంలేదు. ఇక్కడ చస్తే వీరస్వర్గం అంటారు. నాకు నమ్మకం లేదు. నన్ను డిశ్చార్జిచేస్తే బాగుండును. మీ అందరిలోకి వచ్చి పడిపోతాను.’’

            ఈ ఉత్తరాలు విని లక్ష్మి చాలా దిగులుపడింది. ఆయన బయలు దేరేటప్పుడు కాళ్లమీద పడి భోరున ఏడ్చినట్లయితే వెళ్లకపోనేమో? ఎందుకు అంత ఏడ్పూ ఆపుకొన్నాను అని చాలా విచారించింది. నల్లని మబ్బు కమ్మినట్టు మనస్సుని విషాదం కమ్ముకుంది. చేను పచ్చమూస వేసింది. రోజులు గడుస్తూన్నాయి. ఒక నెల వుత్తారాలు లేవు.

            లక్ష్మితండ్రి కన్నయ్య పదిమైళ్ళ దూరంలో వున్న మంగళూరుబస్తీలో వున్నాడు. ఏదో శనిపట్టినట్టు ఒక ఆరు సంవత్సరాలు వరసాగ్గా పంటలు సరిగా పండక కాస్తభూమీ పెట్టుబడి పెట్టిన షాహుకారికి విక్రయించేశాడు. భుక్తి జరిగే మార్గం లేదు. పాలి కాపుగా ఎవ్వరికైనా పనిచెయ్యడానికి పువ్వలమ్మిన వూళ్లో కట్టె లమ్మినట్టనిపించిం దాతనికి. అందువల్ల వూరు మారి బుచ్చిరాజుగారి దివాణంలో పంకా లాగడానికి కూరలు తేవడానికీ నాల్గురూపాయిల జీతానికి నౌఖరీ కుదిరాడు. ఆ విధంగా 9సంవత్సరాలు చేశాడు. బుచ్చిరాజుగారు కాలం చేశారు. ఆయన అల్లుడు దివాణాని కధికారై చాలామంది నౌకర్లపన్లు తీసివేశాడు. కోచిమాన్‍లీని గుఱ్ఱపాళ్ళని తీసి మోటారు కార్లు కొన్నాడు రెండు. పంకావాళ్లని తీసి ఎలక్ట్రిక్‍ పంకాలు నవనాగరీకంగా పెట్టించాడు. ఇల్లాగే అన్నీ, ఆ సందర్భంలో కన్నయ్య నౌకరీ కాస్తా పోయింది. కాని చాలా కాలం ఇల్లు కని పెట్టుకున్నాడనీ బాగా ముసలివాడనీ బుచ్చిరాజు గారి భార్య వాళ్లదొడ్లో పువ్వులచెట్లూ అవ్వి వుండగా కాస్త మెల్ల వుంటే దానిలో ఉచితంగా పాకా వేసుకుని బ్రతకమని హుకుం ఇప్పించింది. కన్నయ్య నాలుగు ఆవుల్ని కొని పాలవర్తకంవల్ల జీవిస్తూన్నాడు. బ్రతుకు సుఖంగానే వుంది. మంగళూరు చాలా పెద్దబస్తీ, పాలకి ఖర్చు జాస్తి. తిండికీ బట్టకీ వెలితిలేకుండా జరుగుతూంది.

            ఓ నాడు కన్నయ్యకి జబ్బుచేసింది. విషజ్వరం. బాగా పెద్దవాడైనందున తిప్పుకోలేక పోయాడు. మనుమల్ని కూతుర్ని ఒక్కమాటు చూచి వున్న నాల్గు దూడల్ని కంచరిసామానూ వప్పజెప్పి బాధ్యత వదిలించుకోవాలని దివాణంగుమాస్తాగారి చేత వుత్తరం ఒకటి వ్రాయించి పంపిచాడు లక్ష్మికి, వెంటనే బయలుదేరి రమ్మని.

            ఎప్పటిలా కర్ణంగారింటికి తీసికెళ్లింది. లక్ష్మి వుత్తరం రామ్మూర్తిగారు చదివి చెప్పారు.

            చేలో ఒక నెలవరకూ అట్టే పని వుండదు. అందవల్ల పక్కింటివారిని బ్రతిమాలి విషయం చెప్పి చెల్లమ్మ అనుమతి పుచ్చుకుని చిన్నపిల్లల్ని ఇద్దర్ని తీసుకుని బయలు దేరింది మంగళూరు లక్ష్మి. ఆనాడు కర్ణంగారి వెట్టి ఎంకడు మంగళూరు తాలూకా ఆఫీసుకు వెడుతూంటే వాడివెంట వచ్చింది. భద్రంగా పడవ దాటించి, కన్నయ్యపాకలో ఒప్పజెప్పి వెళ్లాడు వెట్టి.

            తండ్రి కూతురు చూచుకుని ఏడ్చినారు. నారాయణ పటాలంలోకి వెళ్లడం కన్నయ్యకి అంత ఇష్టం లేదు. తన కూతురు బ్రతుకేమవుతుందో అని దిగులుగా వున్నాడు. పిల్లల్ని దగ్గరికి పిల్చి ముద్దులాడాడు.

            రెండవనాడు, కన్నయ్యకు మందిస్తున్న సాతాని తాత, నమ్మకం లేదని చెప్పాడు లక్ష్మితో. లక్ష్మికి జీవితంలో తండ్రితో ఎక్కువ కలిసి బ్రతకకపోయినా ఆదేదో కొండంత ధైర్యంగా వుండేది తండ్రి వున్నాడంటే. అదీకాక తన తండ్రి అని ఎవ్వరిని పిలిస్తే కడుపు నిండుతుంది? - ఇంతగా. అతి చిన్నతనంలో తల్లిని మురిపించి పెంచాడు కన్నయ్య కూతుర్ని, తరువాత దూరంగా మేనమామగారింట్లో ఇచ్చేశాడుగాని, బుచ్చిరాజుగారి భార్య కాశీకి వెళ్లారు. ఊళ్లో లేరు. ఆమెవున్నా ఏ ఇంగ్లీషు డాక్టరైనా పిలుపించునేమో, గొప్పమందు లిప్పించునేమో. ఇప్పుడు ప్రపంచంలో తన్ని కాపాడి రక్షించగలిగినవాళ్లు ఎవ్వరూ లేరు కన్నయ్యకి. కూతుర్ని చూచి నిశ్శబ్ధంగా కన్నీళ్లు కార్చాడు.

            పటాలాల్లోకి వెళ్లినవాళ్ల సంగతి కొంతవరకు పెద్దవాడు గనక కన్నయ్యకి అనుభవం. వాళ్ల భార్యా పిల్లలు పడుతూన్న కష్టాలకు గుండె నీరయిపోయేది కన్నయ్యకి పిల్లల్ని తల్లినీ చూస్తోంటే. కాని లక్ష్మికి తెలుసు. నారాయణ తొందరలో వస్తాడని. తండ్రిది వట్టి వెఱ్ఱి ప్రేమ. జ్వరతీవ్రత అని అనుకుంది.

        మూడవనాడు, అమావాస్య తగిలింది. కన్నయ్య క్రొత్తసంగతులు మాట్లాడుతున్నాడు. క్రొత్తమనుషులని పలకరించాడు. సంతోషంగా నవ్వాడు. సంధి!

            లక్ష్మికి దిక్కులేదు. నారాయణ దూరాన్నున్నాడు. దివాణంలో వున్న వారికి ఈ పల్లెటూరి పిల్ల వింత, హాస్యం. ఎవ్వరూ పలుకరించరు హృదయపూర్వకంగా. ఈ పిల్లని ఎరుగరు వాళ్లెవ్వరూ. కన్నయ్య వీళ్లకొలువులోకి రాడానికి రెండేండ్ల ముందే పుట్టింది. తండ్రి నడివయసులో ఈవూరెరుగదు. ఈ పేరు లెరుగదు. ఈ ప్రజలనెరుగదు.

            నిండు అమావాస్యనాడు కన్నయ్య రెండు గంటలు కలతలేని నిద్ర పోయాడు. లక్ష్మికి మనస్సు కుదురుపడ్డది. ఈ విధంగా జబ్బు నిమ్మళిస్తే చాలు ఎన్నాళ్లకి లేచి తిరిగితేం? ప్రాణం వుంటే బలుసాకు ఏరుకుని బ్రతకొచ్చు. ఇది తేలేక ఇక్కడ ఒంటరిగా బ్రతకనివ్వను. నయాన్నా భయాన్నా చెప్పి మా ఇంటికే తీసుకుపోతాను. కళ్ల ముందుంటాడు. ఇక్కడెవ్వడూ? అండ లేనిచోట వుండ దోషమన్నారు పెద్దలు. ఇప్పుడు తప్పదుగా. ఈ జబ్బు తేలేవరకూ కదలకూడదు. తేలిన వెంటనే, బయలుదేరాలి. ఈ తలంపులతో, తూర్పున తెల్ల వారినట్టూ, ఆనందం తొలకాడింది. లక్ష్మిముఖం మీద, తాను కాచిన బార్లీగంజి చల్లార్చి నెమ్మదిగా లేపింది. అయ్యాలెమ్మని.

            అయ్య పలుకలేదు.

            నుదుటి మీద చెయ్యివేసి లేపింది, నుదురు చలువరాయిలా తగిలింది చేతికి. చైతన్యం లేదు.

                                                                              *****

            ఈ ఆవుల్ని ఈ సామాను విషయం ఏదో తెవుల్పుకునే వరకూ లక్ష్మి మంగళూరు విడువలేకపోయింది. వీల్లేదు? దివాణంవారు కన్నయ్య అంత్యకర్మలకు అయిన ఖర్చు క్రింద వాళ్లవద్ద కన్నయ్య  దాచుకున్న సొమ్ములో సగం మినహాయించుకున్నారు. అందువల్ల దివాణంవారి మీద ఎంత అసహ్యం వేసినా లక్ష్మి వాళ్లతో పేచీ వదులుకుంటే గాని కదల్లేకపోయింది. పైగా ఆవుల్ని  శుక్రవారం సంతకి పంపించి పోకదం పెట్టాలి. లేకపోతే ఆవుల్ని ఎట్లా తోలుకేళ్లడం అంతదూరం? ఈ ఆస్తి విడిచిపెట్టి తిరిగీ వెళ్లిపోదామా అంటే, కన్నయ్య విల్లు వ్రాసి వుంచాడు.  సంవత్సరం క్రితమే - కూతురుకేనని - లేక కూతురుపిల్లలకనీ. తనకవసరం లేకపోతే పిల్లలికో - పిల్లల నోటిదగ్గర నుంచీ తియ్యడం ద్రోహం. గుండె నిలుపుకుని ఈ వారం ఇక్కడే వుండి తెవుల్చుకుని వెళ్లాలి. పోయిన తండ్రికొరకు గొగ్గోలు పెట్టి ఏడ్చింది. తల తిరిగిపోయింది.

            ఓ వారం గడిచింది. దివాణంలో దాసీలు పని తీరికయినప్పుడల్లా వచ్చి పలుకరించేవారు. నీభర్త ఎక్కడ? నీ కెంతమంది పిల్లలు? అని తోచిన ప్రశ్నలన్నీ వేశారు. విచారంలో వుండి పటాలంలో వున్నాడని ముభావంగా చెప్పి తన పని తాను చూచుకునేది. పట్టణాలలో దుష్పప్రవర్తన కలవాటుపడి శీలంపోయిన కొంతమంది దాసీలు, లక్ష్మికి భర్త విషయం చెప్పటం ఇష్టంలేదని భావించుకున్నారు. వాళ్లల్లో వాళ్లు తర్కంలోకి దిగారు, భర్త విడిచిపెట్టి వెళ్లాడు అని నిశ్చయించుకున్నారు. ఈ దాసీల భోగట్టాలు అంతపురం చేరినాయి. బుచ్చిరాజుగారి భార్యకి బుచ్చిరాజుగారి కుమార్తెకూ చాలా భేదం వుంది. ఈమె వివేకం లేని స్త్రీ, దాసీలు చెప్పిన మాటలు నమ్మి నవ్వింది. హృదయం లేదు. మంచీ చెడ్డ వివక్షత తెలియదు. తన వినోదం కోసం లక్ష్మిని బురుపెట్టి పిలిపించింది. క్రమేపి దివాణంలో మగనౌకర్ల దాకా పాకింది ఈ లక్ష్మికి భర్తలేడనీ, లక్ష్మి భర్త అధీనంలో లేదనీ, లక్ష్మి నీళ్లకి వెళ్లినప్పుడు మగవాళ్లు వెకిలి నవ్వులునవ్వారు. కిచకిచమని చెప్పుకున్నారు.

            ఒక వూరు కాపు ఒకవూరు వెట్టి అన్నట్టు ధర్మవరంలో నారాయణ భార్య, ఇల్లాలని గౌరవంగా బ్రతికిన లక్ష్మి ఈ వేళ దిక్కులేని దానిలా అందరి వెకిలి చూపులకు హాస్యాలకి గురి అయ్యింది. లోటు తనదీ కాదు. లక్ష్మికి ఈ ప్రజలు ప్రవర్తనలు చాలా కాలం పరిశీలనంలేదు. కాని రోజు పైబడ్డకొద్దీ లక్ష్మి మనస్సు కలత పడుతూంది. వీళ్ల కామె మీద కలిగిన తేలికదనానికి కారణం తెలియదు. పట్టణపు ప్రజ ఇంతే కాబోలనుకుంది. తనకు తెలిసిన పట్టణ ప్రజ అంతే. సాధ్యం మైనంత తొందరగా ధర్మవరం వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది.

            ఆనాడు కోడికూతకి మెళుకువ వచ్చింది లక్ష్మీకి. తను మామూలువాడు కది. పైగా ఇది క్రొత్తవూరవడం వల్ల మరీనిద్ర సరిగ్గా పట్టడమేలేదుగూడాను. దివాణం దొడ్లో చిన్నమాటలు వినిపించినాయి. లక్ష్మి కర్థం కాలేదు. పిల్లల్ని దగ్గరగా లాక్కుని మళ్లీ పడుకుంది. తెల్లవారేవరకూ బస్తీలో ఏం పని వుంటుంది? - అందులోనూ, లక్ష్మివున్న పరిస్థితుల్లో? వుదయాన్న ఇద్దరు ముగ్గురు దాసీలొచ్చి అతిగర్వంగా అమ్మగారు పిలుస్తున్నారని చెప్పారు. వెళ్లింది. వెళ్తోంటే దారిలో ‘‘ఇదే, ఇదే, దొంగ’’ అన్న మాటలూ నవ్వులూ వినిపించాయి. ‘‘300రూ. బంగారు గొలుసు పోయింది. నీవుతప్ప ఈ అవరణలో క్రొత్తవాళ్లు లేరు. ఎవ్వరూ రానూలేదు. పైగా రాత్రి నీగుడెసె వైపు, అరటి చెట్టు క్రింద నిన్ను మా పెద్దగుమస్తా చూశాడట. అంతరాత్రి నీవు కాంపౌండులో ఎందుకుండవలసి వచ్చింది? కనుక పోలీసుకు కబురు పెడతాను. నిజం వప్పుకుని తెస్తావా తెచ్చి ఇయ్యి గొలుసు, లేకపోతే చూచుకో. మరి నీయిష్టం. ఆవులూ దీవులు అమ్మి గొలుసు ఖరీదు  తీసుకుంటాం. పైగా ఎన్నాళ్లైనా సర్కారు ఖైదువేస్తే, పిల్లలకి ఎడమవుతావు. ఏం ఏం చెబుతావు?’’ అని వినిపించింది లక్ష్మికి మేడ ఎక్కగానే. అమ్మగారు గర్జించింది. లక్ష్మికి కాళ్ల క్రింద భూమి తిరిగిపోయింది. నోట మాట రాలేదు. ఏదో నూతిలో వున్నప్పుడు పైనున్న వాళ్ల మాటలు వినుపించినట్టూ ఈ వేళ గడువిస్తాం. సాయంత్రం లోపుగా ఇవ్వకపోతే రేపు పోలీసు స్టేషనుకి వెళుతావు. సరేపో. ఇక  వెళ్లు ఆలోచించుకో’’ అనీ వినిపించింది. కాస్సేపటికి లక్ష్మి తనకు తెలియకుండానే నడిచి వచ్చింది తండ్రి పాకలోకి. తన కేమీ అర్థం కాలేదు. తండ్రిలేని కొరత చెప్పలేనంతగా కనిపించింది. ఏం చెయ్యగలదు? ఒక్కతె ఆడుది. తెలియని మూక. తన వూరు గాదు తనపల్లె గాదు. భర్త దూరాన వున్నాడు. మగ దిక్కులేదు. బ్రతుకు దుర్భరంగా కనిపించింది. ఏది ఈ కల్లోలంలోనుంచి తప్పించుకునే మార్గం? ఎవరు తప్పిస్తారు? ఎందుకు ఈ దుస్థితికి కావాలి? ఎల్లాగైనా దేనిలోనైనా పడి, కళ్లు మూసుకుంటేనో? అమ్మో! పిల్లలో! ముసలమ్మో!

            పిల్లలు తల్లిద:ఖం చూచి వెర్రిపట్టినట్టేడుస్తున్నారు. సాయంత్రం అయింది. దివాణం నుంచి పెద్దకారు బయలు దేరి యజమానులనిద్దర్ని ఎక్కించుకువెళ్లింది రైలు స్టేషన్‍కి. మరి రెండు కార్లు ఎదురు వెళ్లినయ్‍. పెద్దమ్మగారు కాశీనుంచి వచ్చేరోజు ఈ వేళ.  వచ్చారు.

            ఈ తగాయిదా ఆమె చెవిలో వేశారు పెద్ద వంటవాడూ దాసీలూ, లక్ష్మిని పిలిపించమన్నారు అమ్మగారు. ఈలోపుగా స్నానం చెయ్యడానికి వెళ్లితే ఆమెకే గంగాళంలో నీళ్లళ్లో అడుగున గొలుసు మెరుస్తో కనిపించింది. లోపలి కెళితే తలుపు మూల ఆదుర్దాగా నక్కాడు వంటవాడు. ఆమె చూచి నిజం చెప్పమంది. చెప్పాడు. పనిలోనుంచీ తీసివేశారు. కుమార్తెను గద్దించారు. లక్ష్మిని ఓదార్చి, రెండు చీరలు పెట్టి, కన్నయ్య సొమ్మంతాను, ఆవుల్ను ధరలు కట్టి మరోపది రూపాయలు ఎక్కువవేసి పంపించారు పెద్దమ్మగారు, బంట్రౌతుని పడవ వరకూ వెంట ఇచ్చి.

            ఇవతల వడ్డున దిగేటప్పటికి తూర్పు తెల్లపడుతూంది. ఈ గడచిన నెలరోజుల చర్యా ఒక పెద్ద పీడకలలా కనిపించింది లక్ష్మికి. స్వప్నంలో తిరిగొచ్చినట్టు వింతనడక జరిగింది. లక్ష్మి తనూ ఎప్పుడూ అనుకోని సంగతి. ఎప్పుడూ ఎరుగని అనునభవాలు. మరియెక ప్రపంచంతో సంబంధం. జీవితమే వింత. ఇది కలకాదు. చేతిలో బిళ్లకుడుముల్లా 200పైగా రూపాయలున్నవి. తన ఆస్తి తండ్రి కిచ్చినది. తాను తన పిల్లలికి దాచవలసినది. మూట భద్రంగా చూచుకుంది.

            అదృష్టం కొద్దీ తిరుగుబండ్లు ధర్మవరంవి కనిపిస్తే వాట్లల్లో ఎక్కి ధర్మవరం చేరింది. చెల్లమ్మతో ఇది యావత్తు చెప్పింది. చెల్లమ్మ గుండె కొట్టుకుంది.

            తిరిగీ తాను యాథారీతిని బ్రతుకుతూంది నారాయణ వచ్చేవరకూ రోజులు లెక్క పెట్టుకుంటూ - తనపశువులూ, పొలం, పిల్లలు, తన ఇల్లూ - ఈ చిన్ని ప్రపంచం తనది. ఈ ప్రపంచం తన్ని గౌరవిస్తుంది. తన బాల్యం తెలుసు. తా నెవ్వరో తెలుసు. ఈ చిన్ని ప్రపంచంలో తానొకతె వేరు కాదు. ఈ ప్రపంచ మంతా తన్నెరుగుదురు.తానా ప్రపంచానికి పొరుగుగాదు.

            మరియొక్క నెల గడిచింది. ఇప్పటికి రెండునెలలయింది. నారాయణవద్ద నుంచి వుత్తరం వచ్చీ.

            యుద్ధం మాత్రం జరుగుతూనే ఉందని ప్రతి రోజూ తెలుస్తూనే ఉంది లక్ష్మికి రంగమ్మ గారి ద్వారా. కాని ఉత్తరం రాకపోడానికి కారణం ఏమిటో తెలియలేదు. ఒక వేళ సెలవు తీసుకొని బయలు దేరాడేమో తిరిగి వచ్యెయ్యడానికని ఒక ఊహ కూడా పుట్టింది.

            ఈ సంవత్సరం ములక వస్తుందన్నారు. ఆ గింజలు కాస్తా రాకపోతే పిల్లలూ, ముసలమ్మా, లక్ష్మి ఏం గావాలి? లక్ష్మి కృశిస్తోంది కొద్ది కొద్దిగా. ఇంతట్లో దాసు ఉత్తరం వేశాడు.

15-11-39

బస్రా

            ‘‘దురదృష్టంవల్ల చాలా బలమైన గాయాలు తగిలి నారాయణను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే రాయాలంటే చేతు లాడాయికావు. ఇప్పుడు తప్పదు. రాత్రి మాపై అధికారిని అడిగాను. నిన్ననే ప్రాణం పోయిందని చెప్పాడు. దు:ఖపడి ఏమీ లాభం లేదు. పిల్లల ముఖం చూసి బ్రతకాలి. ముసలమ్మను జాగ్రత్తగా చూడాలి. ఎప్పటికయినా తప్పనిదే ఈ చావు.’’

            లక్ష్మి విరిగిపోయింది. చీకటి. అంధకారం. తాను చేయని పాపానికి శిక్ష అనుభవించింది.

            ఇరుగుపొరుగువాళ్ళు చాలా సహాయం చేశారు. లక్ష్మి ప్రాణం నిలిచింది. ముసలమ్మ మనసు రాయిచేసుకొంది. రెండు సార్లు పొద్దు పొడిచింది. లక్ష్మికి తెలియదు.

మూడవనాడు తిరిగి ఒక ఉత్తరం.

17-11-39

బస్రా

            ‘‘ఏనాటి పాపమో ఈ విధంగా అన్ని విధాలా బాకి అనుభవిస్తున్నాను. దాసు ఈ విధంగా నీకు ఉత్తరం రాశానని నాతో చెప్పాడు. నా గుండెలు బారిపోయినై. తప్పు అతనిదీ కాదు. మా యజమాని తాగి నెంబరు పొరపాటు చెప్పాడు. నాకు స్పహతప్పి పోయాక ఆస్పత్రికి తీసుకొచ్చారు. నాలాంటి పరిస్థితులలోనే ఉన్న మరొకాయన మూడు రోజుల క్రితం పోయాడు. నీ నోముబలం వల్ల నేనిప్పటికి తేలాను. కాళ్లూ చేతులూ బాగానే ఉన్నాయి. వీలయినంత త్వరలో వచ్చేస్తాను.’’

            ‘‘ఇంకా ఈ వారం ఉంటుందేమో ఈ యుద్ధం రాజీ చేసుకునేటట్లు ఉన్నారట ఉభయ పక్షాల వాళ్లూ.’’

            ‘‘పిల్లలు కళ్లకు కట్టినట్టున్నారు.’’

            ‘‘అమ్మకి దండాలు’’

            ఈ సారి నారాయణే రాశాడు లక్ష్మికి.

            ఆ మరునాడంతా స్వప్నంలో తిరిగినట్లు తిరిగింది లక్ష్మి. రోజులు గడుస్తూన్నాయి.

            ములక రాలేదు. చేను పండి ఒరిగింది. నిండు పంట. పై ఊళ్లవాళ్లు గట్టు మీదనుంచి వెళ్తూ ఒక మాటు పరాయించి మరీ వెడుతున్నారు.

            నారాయణ మళ్లీ రాశాడు. కొత్తసంగతులు ఏమీ లేవు. నారాయణ లేకుండానే కోతకూడా జరిగింది. కుప్ప లేశారు. నారాయణ దగ్గరనుంచి ఉత్తరం మళ్లీ రాలేదు. ఇంకా బహుశా బయలుదేరి ఉన్నా ఈ పాటికి ఓడలో ఉండాలి. ఎల్లాగా నురిపిడి అయ్యేటప్పటికయినా రాడా మొదట చెప్పిన ప్రకారం?

            నురిపిడి అయింది. పనిపాటలన్నీ అయ్యాయి. లక్ష్మి ఇంటినిండా ధాన్యం కూర్చింది. భర్తకోసం, సుఖంకోసం, ఎదురుచూస్తోంది.

            నెల అయింది. ఏమీ జాబు లేదు, ఏకబుర్లూ తెలియటం లేదు. కోసినవడ్లు కోసినట్లే ఉన్నాయి. నారాయణ వచ్చి గరిసె కడతాడని నమ్మకంతో అది అల్లాగే ఉంచింది. నేడో రేపో రావాలి. ఆఖరికి ఉత్తరమైనా.

            ఆనాడు పెందలాడే పనంతా తెమల్చుకొని కరణంగారి యింటికి వెళ్లింది. రంగమ్మగారు పెద్దబ్బాయిగారు ఆరుగుమీద కూచున్నారు. ఎప్పటిలా ఇంగ్లీషు కాగితం వచ్చింది. ఒక తెల్ల దొర గొప్పవిందు బల్ల ముందర ప్రముఖలతో మాట్లాడుతూ ఉన్నట్లు ఏదో బొమ్మ ఉంది. దాన్లో నారాయణ దగ్గరనుంచి ఉత్తరం వచ్చినంత ఆదుర్దా కలిగింది లక్ష్మికి. రామమూర్తిగారిని అడగబోతోంది దానిలో సంగతులు. ఇంతలో రంగమ్మగారే పలకరించారు.

            ‘‘ఏం! లక్ష్మీ! యుద్ధం అయిపోయిందట. అందరూ సమాధానపడి సంధి జేసుకొన్నారు. మన దేశం నుంచి వెళ్లిన పటాలాలన్నీ తిరిగీ పంపించేశారు. ఇంక రెండు వారాలలో మన నారాయణ కూడా వచ్చేస్తాడన్నమాట. బయలుదేరే డన్నమాట.’’

            లక్ష్మికండ్లు చుక్కల్లా మెరిశాయి. ఒక్క పరుగున ఇంటి కొచ్చింది. పిల్లల్ని పేరుపేరు వరసన పిల్చింది చెప్పింది, ‘‘నాన్న వస్తున్నాడు’’ అని. వీధి కేసి చూసి ఏడని ఆదుర్దాగా అడిగారు వాళ్లు.

            ‘‘ఇంకేముంది. ఇంక పదిహేనురోజులు! ఓడలో ఉన్నారు.’’

            అత్తగారికి చెప్పింది సంగతంతా. చెల్లమ్మకి సముద్రమంత అంతులేని సంతోషం కలిగింది. బోసి ఒక్క మాటు ఇకిలించింది. కన్నకడుపు. ఆకాశమువైపు చూసింది. ఒక్కదణ్ణం పెట్టింది. పొంగి పొంగి వచ్చినై కళ్లల్లోకి నీళ్లు.

            రాత్రి లక్ష్మి పడుకొంది. ఎప్పుడు తెల్లవారుతుందో అనిపించింది. తెల్లవారితే ఒక్కరోజు గడచిందన్నమాట. ఓడ మరికొంత దగ్గరకొచ్చి ఉంటుంది. ఇంకా పద్నాల్గుపొద్దులూ పద్నాల్గురాత్రుళ్లూ గడవాలి. పువ్వల్లాంటి చక్కని కలలొచ్చాయి. ప్రకృతిలో సౌందర్యమంతా లక్ష్మిదే. సృష్టిలో ఇమిడిన ఆనందమంతా తనదే. ఆదినుంచి తుదివరకూ ఆనందమే కనిపించింది. ఒకప్పుడు తను అనుభవించిన దు:ఖం లక్ష్మి మరిచిపోయింది. కష్టాలు తీరిపోయినవి. ఇహ జీవితంలో ఒక వెలితిలేని ఆనందం.

            మరునాడు పొలంగట్టుమీద బెండకాయలకోసం వెళ్లి అటూ చూసి, చిన్నతనంలో తాను నేర్చుకున్న పాట మెల్లగా గొంతెత్తి పాడింది లక్ష్మి. పిల్లబోదులలో నీళ్లన్నీ ఎండిపోయినా అంగలేని దాటి వచ్చింది.

            అత్తగారికీ పిల్లలకీ వడ్డించింది. నాన్న వస్తాడని ఊరించి మరొక ముద్ద తినిపించింది రాముడికి. తనూ భోంచేసింది. పట్టెడన్నమే. కడుపు నిండింది. ఆకలి కూడా లేదు.

            సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నాడు. పడమట కావిరి కమ్మింది. ఆవులు పొలంనుంచి తిరిగి వచ్చినై. ఎఱ్ఱావు కోడెదూడ అల్లరి చేస్తో రాముడితో ఆడుకొంటోంది. లక్ష్మి సూర్యుడి కెదురుగా నీళ్ల కెడుతోంది. లక్ష్మినీడ పొడవుగా పడ్డది. రాముడు ఆడుకుంటూ నీడలో కొచ్చాడు. ఎదురుగా కాకిబట్టలు వేసుకొని ఒక మనిషి వచ్చి ఒక పెద్ద కాకికవరు యిచ్చాడు.

            ఇంకెవరు ఉత్తరం రాస్తారూ, నారాయణ తప్ప? కవరు కళ్ళకద్దుకుంది. కొంగులో ముడివేసుకొని బిందె నింపుకొని ఇంటికి గాలిలో నడచి వచ్చింది.

            ఇది విప్పి చదివించే వరకు తృప్తిలేదు. పిల్లల మాట అత్తగారిమాటా తరవాత. ముందర తాను వినాలి. ఏరోజు కారుకి దిగుతారో ధర్మవరం!

            ఈ వుత్తరం ఏదో మామూలుకంటే భేదంగా వుంది. కాని ఇల్లాంటి కవర్లు ఇదివరకు కొన్ని మార్లు చూచినట్లు జ్ఞాపకం వచ్చింది. కరణం గారి ఇంట్లో రంగమ్మగారి నడిగితే సర్కారు కాగితాలు, సర్కారు ఉత్తరాలు అని చెప్పింది. కనుక ఇదీ సర్కారుదేనేమో? సర్కారు కేంపని నాతో అనుకుంది లక్ష్మీ. కాని వెంటనే అర్థమయింది. సర్కారు పొలాలు ఇస్తారుగా యుద్ధమయింతరవాత. ఆ హుకుము అయి ఉంటుంది. ఎన్ని యకరాలిచ్చారో! చదవగలిగితే బాగుండును.

            ఉత్తరం చదివి సర్కారు అన్నమాట రంగమ్మగారు చెప్పాలి.

            అ ఉత్తరం వళ్లోపెట్టుకొని చిరునవ్వుతో కరణంగారి యింటికి పరుగెత్తింది - లక్ష్మి.

      రామమూర్తిగారు చదివారు... రెండవ రెజిమెంటు 120 నెం. నారాయణ ఆఖరునాటి యుద్ధంలో పోయాడు. అతని కుటుంబానికి సర్కారు వారు కృష్ణాజిల్లా పోలవరం తాలూకా నెం. 5/459 సర్వీభూమి 5 ఎకరాలు గ్రాంటు చేశారు.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు