మా రచయితలు

రచయిత పేరు:    జానకీ బాల

కథలు

వాళ్ళకి డబ్బు చేసింది

పద్మకి మెలకువ వచ్చేసరికి ఒళ్ళంతా పుకపుక లాడిపోతోంది. తల పగిలిపోయే తలనొప్పి. ఒక్కక్షణం ఆమె కెక్కడుందో అర్థం కాలేదు. నెమ్మదిగా స్పృహలోకొచ్చినట్టయి తను హాస్పటల్‍  రెస్టురూంలో రాత్రి డ్యూటీ అయ్యాక వచ్చి పడుకున్నది గుర్తు కొచ్చింది. అవును రాత్రి ఒంటిగంటకి డ్యూటీ నిర్మలకి హాండవర్‍ చేసి వచ్చి మంచం మీద పడిపోయింది. టైము చూస్తే ఇంకా అయిదు కూడా కాలేదు. తన తరువాత వచ్చిన మేరీని తను సరిగ్గా పట్టించుకోలేదని, పలకరించలేదని గుర్తుకొచ్చింది పద్మకి. తనకి అప్పటికే ఏలాగో వుందని గ్రహించింది. బట్టలు తీసేసి నైట్‍డ్రస్‍ వేసుకుని, కాస్త ముఖం కడుక్కుంటుంటే చలిగా అనిపించింది. అక్కడే వున్న ఫ్రిజ్‍లోంచి పాలుతీసి, మైక్రోవేవ్‍లో వేడిచేసి, ఇన్‍ష్టింక్ట్ కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి, ‘‘మేరీ - ఈ కాఫీతాగు. నేను వెంటనే పడుకుంటా - తలపగిలి పోతోంది’’ అంటూ పారాసిటమాల్‍ మింగి, కాఫీ తాగి మంచం మీద ఒరిగిపోయింది పద్మ.

మేరీ ఆమె దగ్గరగా వచ్చి, ఫీవర్‍ చూసింది. అరె! టెంపరేచర్‍ వుంది’’ అని బాత్‍రూంలో కెళ్ళిపోయింది అవసరంగా.           పొద్దున్న లేచేసరికి పద్మ వొళ్ళు కాలిపోతూనే వుంది - ముక్కులోంచి రొంపనీరు కారి పోతోంది. తల నొప్పి కాస్త తగ్గినా ఇంకా వుంది.

మధ్యాహ్నం వరకు డ్యూటీ లేదు కనుక బ్రష్‍ చేసుకుని కాఫీ తాగి, మంచం మీద ఒరిగింది.

మేరీ వెళ్ళి డాక్టర్‍కి చెప్పింది. ఆయన చూసి, వెంటనే కోవిడ్‍ టెస్టు చేయడం మంచిదని సలహాయిచ్చాడు. ‘‘ముందు పెద్దాయినతో చెప్పు’’ అన్నాడు కొసరుగా. మేరీ, నిర్మల, రోజీ కలిసి మాట్లాడి ఏర్పాటు చేశారు. కానీ ఆ పెద్దాయిన ముందుగా డబ్బుకడితేగానీ టెస్టు చేయడం కుదరదని స్పష్టంగా చెప్పాడు. కాస్సేపు తర్జన పడ్డాక ‘‘మేమిక్కడి స్టాఫ్‍ కదా’’ అందొక నర్స్ నెమ్మదిగా - ‘‘అదేం కుదరదు. దేనికదే, డబ్బుకట్టి రా - త్వరగా’’ అన్నాడు.

మేరీ, పద్మతో విషయంచెప్పి కాస్తసేపు గుంజుకుంది. దానివల్ల ఫలితమేం లేకపోయింది.

‘‘నా బ్యాగ్‍లో ఏ.టి.ఎమ్‍ కార్డు వుంది’’ అంది నీరసంగా పద్మ. ‘‘ఇప్పుడేం వద్దు, నా కార్డు మీద కట్టేస్తాను తర్వాత చూసుకోవచ్చు’’ అంటూ పరుగెట్టింది మేరీ.

‘‘ఓ మాత్ర వేసుకుని డ్యూటీ చెయ్‍’’ అన్నాడో డాక్టరు.

‘‘నా వల్లకాదేమో’’ అంది పద్మ.

‘‘మంచిది కూడా కాదు. టెస్టు రిజల్ట్ రానీయండి’’ అంది నిర్మల.

అదొక మల్టీ సూపర్‍ స్పెషాలిటీస్‍ హాస్పిటల్‍ - ప్రయివేటు సంస్థ. అక్కడ సుమారు మూడు వందల మంది నర్సులు పనిచేస్తున్నారు - ఇంక డాక్టర్లు - హెడ్‍ నర్సులు - వార్డ్బాయ్స్ రాత్రి కూడా ఆ హాస్పటల్‍ పగలు మాదిరి గానే వుంటుంది. తళతళ మెరిసిపోయే నేల - మిలమిల మెరిసి పోయేలైట్లు. ఎంతో హంగుతో - మరింకెంతో ఆధునిక వసతులతో, పేషెంట్లకే కాదు వారితో వచ్చిన కుటుంబ సభ్యులకి కూడా ఎంతో సౌకర్యంగా వుంటుంది. పక్కనే అద్భుతమైన క్యాంటిన్‍. అందులో అన్ని వేడివేడిగా శుభ్రంగా పేషెంట్సుతో వచ్చే వారికి ఫైవ్‍స్టార్‍ హోటల్లో వున్నట్లనిపిస్తుంది. మనస్సుల్ని ఆవరించుకుని వున్న దిగుల్ని పోగొట్టలేకపోయినా, పై పై కష్టాల్ని పారత్రోలి ఊరటకలిగిస్తూంటుందా వాతావరణం.

ఆ హాస్పిటల్‍ - ఈ మధ్యనే కోవిడ్‍ - 19 - కరోనా కేసులు టేకప్‍ చేసే నిర్ణయం తీసుకుని, దానికి సంబంధించిన ఒక స్పెషల్‍ వార్డు ఏర్పాటు చేసింది. స్టాఫ్‍ కొందరు అందులోకి కేటాయింపబడినా, అటూయిటూగా అందర్ని అవసరాలకి డ్యూటీ వేస్తూనే వున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ స్పెషల్‍గా వచ్చే ఆదనపు జీతం కోసం పనిచేద్దామని ముందుకొచ్చారు. పద్మకి పాజిటివ్‍ అని తేలింది. వెంటనే ఆమెని గవర్పమెంటు హాస్పిటల్‍కి వెళ్ళమని సలహాల పరంపర...

‘‘అదేమిటి సార్‍! ఇక్కడ స్పెషల్‍ వార్డు వుంది కదా’’ ఆమె మాట పూర్తికాకుండానే

‘‘అదేం కుదరదు మిస్‍ - మీరు వెంటనే గవర్పమెంటు హాస్పిటల్‍కో సెంటర్‍కో వెళ్ళండి’’ అన్నాడా పెద్దాయన అక్కడ్నించి కదిలిపోతూ...

పద్మని తీసుకుని నిర్మల, రమ ఎంత తిరిగినా, ఆమెకి అడ్మిషన్‍ దొరకలేదు. ఆమె నిలబడలేని స్థితిలో వున్నా ఎవ్వరూ కరుణ చూపించలేదు - మూడు హాస్పిటల్స్ తిరిగాక ఒక గవర్నమెంట్‍ ఆరోగ్య కేంద్రంలో ఒక బెర్త్ దొరికింది. తన డబ్బులు పెట్టి టెస్టులు, మందులు, కొనుక్కుని పద్మ నెమ్మదిగా కోలుకుంది. క్వారంటైన్‍లో వున్న రోజులకి జీతం కట్‍. అదేమంటే - ‘‘మీరు స్పెషల్‍ డ్యూటీకి అడిషనల్‍ అలవెన్స్ తీసుకున్నారు కదాఅంటూ దబాయించారు. ప్రాణాల పణంగా పెట్టి సేవచేసే నర్సులకి అందిన బహుమానం యిదా అంటూ కొన్ని గొంతులు లేచాయి. అన్ని గొంతుకల్నీ చాకచక్యంగా మూసివేశాయి పెద్ద తలకాయలు. చేసేది లేక బతుకు జీవుడా అంటూ బయిటపడింది పద్మ. వందేళ్ళ అనుభవాన్ని మూట కట్టుకుని ఊరకుండి పోయారు ఆమె స్నేహితురాళ్ళు మేరీ, నిర్మల, రోజీ, రమ.

నెలకి పాతిక, ఇరవై వేలు సంపాదించుకునే నర్సులు వేలకి వేలు పోసి, ఇలాంటి వైద్యాలెలా చేయించుకోగలరు అని నోటిమాటలు చెప్పినా, సమయానికెవ్వరూ సాయం చేయలేక పోయారు.  రెండు లక్షలు దాటిన బిల్లు, వాళ్ళనీ వీళ్ళనీ పట్టుకుని తగ్గించుకునేసరికి అది ఒకటిన్నరకి వచ్చి ఆగింది. మొత్తం డబ్బు మేరీ కట్టింది. పద్మ వెంటనే కొంత డబ్బు ఆమెకి ట్రాన్స్ఫర్‍ చేసింది.

‘‘నెమ్మదిగా ఇద్దువుగానీలే అందామని నాకు వున్నా, అది కుదరదు. మా అమ్మ నా పెళ్ళికోసం డబ్బు కూడబెడుతోంది. పైసలతో ఆమెకి లెక్కలు చెప్పాలి’’ అంది మేరీ తలవంచుకుని...

పద్మ చాలా నొచ్చుకుంది ‘‘నయంలే - నీ ప్రాణమిచ్చినన్ను కాపాడావు - నీ రుణం డబ్బులిచ్చేసినా తీరదు’’ అంది. ‘‘మనలో అంత పెద్ద మాటలెందుకు - కరోనాకి కులంలేదు మతంలేదు అంటూ డబ్బావాయిస్తున్నారు - మన స్నేహానికి మాత్రం అవి వున్నాయా?’’ అంది మేరి.

‘‘నిజం చెప్పావు. మనం మనుషులం అంతే’’ అంది పద్మ. ఇంతకీ సురేష్‍ విషయం ఏం చేశావు? అంది రమ మేరీ దగ్గరగా వచ్చి.

‘‘ఆ... ఏం చేస్తాను? లక్షలు కట్నం పోసైనా మా వాళ్ళలో కుర్రాడినే నాకు కట్టబెడుతుందట’’ అంది మేరీ విసుగ్గా.                ‘‘మేమందరం వున్నాం - హాయిగా పెళ్ళి చేసేసుకో. సురేష్‍ మంచివాడే’’ అంది నిర్మల.

డిశ్చార్జయి వెళ్ళిపోతున్న పద్మకోసం టాక్సీవచ్చి ఆగింది. ‘‘పెళ్ళి చేసేసుకో - కానీ ఒక్కనెల్లాళ్ళు ఆగు. నేనూ వస్తా పెళ్ళికి’’ అంది పద్మ.

షేక్‍ హాండ్లు - హగ్‍లు వద్దు వద్దు - మూడు గజాల దూరమే ముద్దు. కాబట్టి దూరం - దూరం - మేరీ డియర్‍! నేను ఇంటికి చేరగానే మిగిలిన డబ్బు ట్రాన్స్ఫర్‍ చేసేస్తాను.

 ‘‘అబ్బే ఫరవాలేదు’’ అంది మేరీ...

‘‘లేదు - మా బ్రదర్‍తో మాట్లాడాను. డబ్బు రెడీగా వుంద’’ని చెప్పాడు.

టాక్సీ నెమ్మదిగా కదిలింది.

‘‘పద్మక్కని దింపేసి, తిరిగి వచ్చేస్తాను’’ అన్నాడు అక్కడ అందరికీ కామన్‍ తమ్ముడు నగేష్‍...

అందరి మనసుల్లోను ఒకటే భావం...

మనిషికి మనిషీ - తోడు...

మనమే సృష్టించుకున్న డబ్బుకి మనమెప్పుడూ బానిసలం కాకూడదు... అని.

‘‘డబ్బు ఎర చూపించి, నేనెవరినో ఎందుకు పెళ్ళి చేసుకోవాలి? థూ...’’ అనుకుంది మేరీ గట్టిగా...

దూరంగా కనుమరుగవుతున్న కారుని ఎనిమిది కళ్ళూ వెంటాడుతూ వుండి పోయాయి.

 ఇంటికి ఫోన్‍ చేయబోతే....

"దేశమంతా కరోనాతో యుద్ధం చేస్తొంది.  భయపడకండి - పోరాడి గెలవండి..."

  ‘‘అమ్మా’’ అంది పద్మ...

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు