మా రచయితలు

రచయిత పేరు:    గుండేటి సుధీర్

కవితలు

ఇక ఊకునేది లేదు

పారిశుద్ధ్య కార్మికుణ్ణి

ఈ దేశ ప్రేమికుణ్ణి....

కుల కంపుతో వెలెస్తే

దేశ కుల్లంత కడిగేస్తున్నవాణ్ణి

 

అభివృద్ధి దేశం

అంతరిక్షంలోకి రాకెట్లు

పంపిస్తుంటే

అండర్ డ్రైనేజీలో

ముక్కు మూసుకొని

మునుగుతున్నా నేను

 

నా గాలి కూడ సోకకుండా

బగ్గ బలిసినోల్లంత

బంగ్లాలో ముక్కు మూసుకుంటే

నా పెయ్యికి పట్టిన పియ్యితో

మూడు రంగుల జెండా

ముంగిట నిలబడ్డ

ఫోటో ఫోజులకు

పేపర్ కట్టింగులకు

 

చదువు దూరంజేసి

చీపురు పట్టించి

చిత్రాలు చేస్తూ

స్వచ్ఛ్ భారతంటూ

సల్లగా ఉండినోడు

సంకలు గుద్దుకుంటూ

దేశమంతా పొగుడుతూ

నా పెయ్యిని మళ్ళ

పియ్యికే పరిమితం జేస్తిరి

ఏమి చాణిక్యంరా మీది

 

కలిగినోడు కరోనాని

తగిలించుకస్తే

కండ్లన్నీ మూతలుపడ

దేశమంత కడుగుతున్నా

 

కడిగినందుకు

కరోన కాటేస్తే

మీరు

కుల కంపు కొట్టి

కాటికి పంపిస్తిరి

 

రోడ్లన్ని ఊడిస్తూనే

బతుకంత ఊడిస్తిరి

ఊడిగం చేయాలంటూనే

ఊపిరితిస్తిరి

 

ఇక ఊకునేదిలేదు

ఊడిగం చేసేదిలేదు

తలుచుకుంది చాలు

ఇక తేల్చుకునుడే

మిగిలింది

చదువుకొని చరిత్ర

తిరగరాసుడే

చరిత్రలో నా జాతి నిలుసుడే

 

సపాయి సైనికుణ్ణి...

కుల్లంత కడిగేస్తూ

కాటికి కట్టెలేరుకుంటూ

దేశానికి సేవచేస్తూ

దేహాన్ని సుస్తిచేసుకుంటూ

కాకి కూసింది మొదలు

పురుగు పూసే కోసకు

పూటపూటకు పస్తులుండి

ఆరుగాలమంత పనిజేస్తే

అంటరానితనంతో

ఆరడుగులు దూరముంచి

అక్షరాలకి దూరం జేస్తే

చెదిరిన మా బతుకులను

చక్కబెట్టడానికి చీపురుపట్టిన

సపాయి సైనికుణ్ణి

 

యుద్ధమైన

అంతర్యుద్ధమైన

ప్రజలకి.....కాక

ప్రభుత్వానికే సైనికులయ్యే

సిపాయిలు

అందెలమెక్కే అవార్డులు

అందుకుంటూంటే

 

పొద్దునైతే చాలు

ప్రజలకి సైనికుణ్ణి ఐనా...

అంటరానోడినై

అన్నం దొరకక

ఆకలి కేకల

పేగుల మోతల రివార్డులు..

అవమానాల అవార్డులు

అందుకుంటూ

తనువు చాలిస్తే

తొవ్వలోనే మమ్ము

తన్ని పారేస్తుంటే

ఆరడుగుల మట్టినైనా

ముద్దడని

ప్రకృతి ప్రేమికుణ్ణి

సపాయి సైనికుణ్ణి...

 

ఈ సంచికలో...                     

Nov 2020