మా రచయితలు

రచయిత పేరు:    నస్రీన్ ఖాన్

కవితలు

ఆంక్షల వనం

ఆమె కాలేజ్ కు సిద్ధమైంది

అంతలో అబ్బా వచ్చాడు

కోపంతో చిరాకు నిండిన 

హూంకారం

పెహ్లే బుర్ఖా పెహెనో 

అలవాటుతో 

తిరుగులేని ఆదేశం

 

ఆమెది

నానీమా ఇంటికి ప్రయాణం

నఖాబ్ తో సహా వేచి చూస్తోంది

చీకటిపడే వేళ ట్యూషన్

నుంచి తిరిగొచ్చే

చిన్న తమ్ముడు 

తోడుంటే తప్ప

ముందుకు సాగని పయనం

 

కొత్తగా పెళ్లయిన

ఊరి దుల్హన్ ఆమె

అలవాటుగా కిటికీలోంచి

బయటకు తొంగి చూస్తోంది

ఇంతలో...

మెడ ఊడి పడేలా

అకస్మాత్తుగా దెబ్బ

వెనక్కు తిరిగితే

అన్ని హక్కులు పొందిన చూపు

వారమైనా గడవని షోహర్ హోదా

 

ఎన్ని దగ్ధ గాథలు

విప్పి చెప్పను

ప్రాణమున్న బొమ్మలుగా

చెలామణి అయ్యే వైనం

అంతా ఆంక్షల వనమిది

మారే మా తలరాతలకు

నీవే నాంది కావాలి

ప్రమదల 

ప్రమోద లోకానికై వేచి చూస్తూ

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు