మా రచయితలు

రచయిత పేరు:    సర్ఫరాజ్ అన్వర్

కవితలు

ఆ శోకవనంలో విశాఖ నగరి

చుట్టురా ప్రశాంతవాతావరణం

విన్పించని రణగొణధ్వనుల సవ్వడి

చీకటి నిశ్శబ్ద రాజ్యాన్నేలుతుంది

పల్లె ప్రకృతి ఒడిలో సేదదీరుతుంది

పట్నంలో అక్కడక్కడ నాగరికత ఆనవాళ్లు

నిశీధిసంస్కృతికి తూట్లు పొడుస్తున్నాయి

 

తరువు కొమ్మలు పుడమి తల్లి జోలపాటకు

లయబద్దంగా ఊగుతుంటే

సాగరకెరటాలు అలజడి అలలపై ఊరేగుతుంటే

ఆదమర్చి నిద్రపోతున్న అలసిన దేహాలు

పొద్దున్నుండి చేసిన శ్రమను మరిచి నిద్రాదేవి

విశ్రాంతి వనంలో పవళింపు

పొద్దున్న బంగాళఖాతం తన తరగలతో 

ఆ నగరి పాదాల్ని ప్రేమతో స్పృశిస్తుంటే

రేయి చల్లని వెన్నెల జలతారు పరదాల్ని

కప్పి ఆ సోయగాల్ని ద్విగుణీకృతం చేస్తుంటే..

 

అది చూడలేని కాలం అకారణంగా అభివృద్ధి కాళరాత్రి అవతారమెత్తి నెమ్మదినెమ్మదిగా ఆ చీకటి రాత్రిని కమ్ముకుని నగరంతో పాట

చుట్టున్న గ్రామాల్ని ఆవరించింది

ఉదయం సాగరఘోష నగరం శ్వాసయితే

రాత్రికి మృత్యుభూషిత విషవాయువు

విపత్తు మిషతో నగర సుషమ శోభను శోషించి శ్వాసకోశాన్ని ఆక్రమించి

ఊపిరి తీగల్ని కోసేసి, జీవిత తిత్తుల్ని కాల్చేసి, భవిష్యత్తు ఆశల ఆకుల్ని రాల్చేసి

ఆయువు గుండెకు రంధ్రం చేసి ప్రాణాన్ని తనతోపాటే మూటగట్టుకుపోయింది

 

ఒక మొరటు కెరటం వచ్చి స్వప్నాన్ని ధ్వంసం చేసి

ఏమి తెలీని పసిదానిలా తిరిగి కడలిగర్భంలో దాక్కుంది 

ఒక సుడిగాలి వచ్చి మృత్యు కౌగిలితో

అలజడి లేపి తిరిగి ప్రకృతి ఒడిలో మెల్లిగా కలిసిపోయింది

 

ఎన్నో అలజడి కెరటాల్ని ముళ్ళకిరీటంగా

ధరించిన ఆ విశాఖ నగరి వైశాఖ మాసంలో

కాలం చేసిన పచ్చి గాయాన్ని మాన్పలేక

మర్చిపోలేక తల్లడిల్లి అశోకవనంలో

సీతలా కన్నీరుకారుస్తుంది 

బతుకు చెట్టుపై తనతోపాటు ఉండి

రాలిన ఆ ఆకుల్ని తలుచుకుంటూ

బిక్కుబిక్కుమంటూ గుండెల్ని బిగవట్టి

రేపటిపై ఆశతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని జీవిస్తుంది..

 

ఈ సంచికలో...                     

Jul 2021

ఇతర పత్రికలు