మా రచయితలు

రచయిత పేరు:    జి వెంకట కృష్ణ

ఇంటర్వ్యూలు

నా కథలన్నీ ప్రజలతో ఎదురైన అనుభవాలే – జి వెంకటకృష్ణ  

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు జి వెంకటకృష్ణ  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.      మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నాకు తాత తండ్రులు నుంచి సంక్రమించిన స్వంతూరంటూ లేదు. ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళు గాజుల వ్యాపారం చేసుకుంటూ వూర్లో తిరిగే జీవనోపాధి గలవారు. యెలాగో మా నాన్న బడిపంతులయినాడు. మా నాన్న అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె లో పనిచేస్తున్నప్పుడు నేను పుట్టాను. ఆతర్వాత చాలా వూర్లు తిరిగాం. ఇట్లా కాదని హైస్కూల్  చదువు ఒకచోట జరగాలనిబెస్తరపల్లి (కంబదూరు మండలం) సోషియల్ వెల్ఫేర్ హాస్టల్ లో చేర్పించారు . SC, ST, BC పిల్లలందరూ వుండే ఆ వసతి గృహమే నా భవిష్యత్తు జీవితాన్ని నిర్ధేశించిన మొదటి ప్రభావం. మా స్కూల్ లైబ్రరీ లోని చందమామ, బాలమిత్ర, కాశీమజలీ, యితర జానపద కథల పుస్తకాలు చదువుతూ చదువుతూ యెనిమిదీ తొమ్మిది తరగతులకు శ్రీ శ్రీ, తిలక్, దాశరథి, రంగనాయకమ్మ, లత,యుధ్ధనపూడివాసిరెడ్డి సీతాదేవి లాంటి రచయితలనూ చదివాను. పుస్తకాల పురుగుగా మారాను.  నేను డిగ్రీ, యీవినింగ్ కాలేజీ లో చదివాను. బెంగళూరు లో ఒక ఇండస్ట్రీ లో పనిచేస్తూ చదువుకున్నాను . ఆదివారాలలో   పబ్లిక్ లైబ్రరీ లలో యెన్నో పుస్తకాలు చదివాను. పబ్లిక్ లైబ్రరీలే నా తర్వాతి ప్రభావం. నాకు  విద్యార్థిగా ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు. నేను చదివిన పుస్తకాలే నేను  యిప్పుడున్న స్థితికి కారణం. డిగ్రీ రోజులకే 'ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ'  'టేల్ ఆఫ్ టు సిటీస్'  'జానకి విముక్తి' 'బలిపీఠం ' ' మట్టి మనిషి ' ' మరీచిక ' ' ఋక్కులు '    లాంటి పుస్తకాలు చదివి వాటి ప్రభావంలో పడ్డాను. డిగ్రీ లో ఒక సబ్జెక్టైన ఎనకనామిక్స్ లోని థీరీస్ లో భాగంగా మార్క్స్ కాపిటల్ గురించీ తెలుసుకున్నాను. ఇవన్నీ నా మీద ప్రభావం వేసినవే. 

2.   మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.

నేను చదివిన పుస్తకాలు, నా చుట్టూ వుండిన గ్రామీణ పరిస్థితులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి. నేను చదివిన పుస్తకాలలోని ఆదర్శాలే నా జీవితాన్ని నడిపించాయి. శ్రీశ్రీ ప్రభావంతో ఇంటర్ రోజుల్లోనే మహాప్రస్థానంను అనుకరిస్తూ కవిత్వం రాసాను. అప్పట్లో వస్తుండిన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక లోని కథలు చదివి నేనూ కథలు రాయాలని అనుకున్నాను. నా డైరీలనిండా నాకు తోచిన రీతిలో కవిత్వం రాసుకున్నా. డిగ్రీ అయిపోయాక మా నాన్న వద్దంటున్నా బెంగళూరు లో వుద్యోగం (లేత్ మిషన్ మీద పనిచేసే టర్నర్) వదిలేసి అనంతపురం SK  యూనివర్సిటీ లో MA హిస్టరీ లో చేరా. మా నాన్న అర్ధాంతర మరణాన్ని యెదుర్కొని M. Phil చేస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ గవర్నమెంట్ వుద్యోగం తెచ్చుకున్నాను. నా MA రోజుల్లో చదివిన తుర్గినోవ్  'తండ్రులూ కొడుకులూఎమిలా జోలా 'ఎర్త్'   బుచ్చిబాబు 'చివరకు మిగిలేదినా మీద విపరీతమైన ప్రభావం వేశాయి.  ఈ పుస్తకాలే నాలాగే పుస్తకాలను యిష్టపడే నా జూనియర్ సుభాషిణి ప్రేమలో పడేసాయి. బాల్యం నుంచే నా చుట్టూ వుండిన బహుజన కులాల (ఈ పదం అప్పుడు తెలీదు) సాంగత్యం, నా చదువరితనం, నన్ను అభ్యుదయ భావాల వైపు నడిపించాయి. నేరుగా చెప్పాలంటే సాహిత్యం చదివి జీవితాన్ని మలచుకున్నాను. నా కులాంతర వివాహానికి నా సాహిత్యాభిలాష నే కారణం. రచయిత గా మారడానికి యే సంస్థలూ కారణం కాదు. నేను రచయితగా మారుతూ యితర రచయితల స్నేహం లోనుంచి వాళ్ళు సభ్యులైన సంస్థలను చూసాను. ఏ సంస్థ లోనూ సభ్యుడ్ని కాను. 

3. మీ రచనల గురించి చెప్పండిమీ మొదటి రచన ఏది? అది కథనా, కవితనా ? అది  ఏ సందర్భములో  నుండి వచ్చింది?

కవిత్వం ఇంటర్ రోజుల నుంచే రాస్తున్నాను. ఆ రోజుల నుంచే వారపత్రికలు చదువుతున్నాను. యండమూరి ఆంధ్రభూమి లో రాస్తుండిన తులసీదలాల ప్రభావంలో పడకుండా రంగనాయకమ్మ కాపాడారు. ఆంధ్రప్రభ లో మంచి కథలు వస్తుండేవి.90ల నుంచి కథలు రాయడం ప్రారంభించాను. నేను చూసిన మా వూర్ల కరువు మీద, నా సహచరి సుభాషిణి వూర్లలోని ఫ్యాక్షన్ మీదా కథలు రాసుకున్నా. 1994 నవంబర్ లో ఆంధ్ర ప్రభ లో నా మొదటి కథ 'పామును మింగిన కప్పఅచ్చయ్యింది. ఆత్మన్యూనతకు గురైన వ్యక్తి మానసిక స్థితి వస్తువుగా రాసింది. 2000సంవత్సరం లో నా డైరీలలోని కవిత్వం లోంచీ నలభై కవితలను (అన్నీ అచ్చుకానివే) లోగొంతుక పేరుతో సంపుటిగా ప్రకటించాను. అప్పటి నుంచి రెగ్యులర్గా రాస్తున్నాను. ఇప్పటికి నాలుగు కవితాసంపుటులు, రెండు దీర్ఘకవితలు, మూడు కథా సంపుటులు ప్రచురించాను. 

4. మీ కథల్లో రాయలసీమ  ప్రజల జీవితాలే కథా  వస్తువులు కదా. దీనికి కారణాలు ఏమిటంటారు?

   ముందే చెప్పినట్లు నేను పుట్టి పెరిగిన, తిరిగిన రాయలసీమ వూర్లలోని జీవితాలే నా కథలు. బహుజన అనే పదమే తెలియని రోజుల నుంచే నా కథల్లో SC BC సమూహాల బతుకులనే రాస్తున్నాను. దానికి పునాదులు నా హైస్కూల్ రోజుల నాటి సోషియల్ వెల్ఫేర్ హాస్టళ్లో వున్నాయి. నేను ఎదిగే క్రమంలో విప్లవ అభ్యుదయ శిబిరాల  మిత్రులతో తిరిగినా నా చూపులు సహజంగా నా ప్రాంతం, నా సహ సమూహాల జీవితమే నేను చెప్పదగిందనే ఎరుకతో వున్నాను. అరుణతార లో 1999 లో కాలినగూడు అనే కథ అచ్చయ్యింది. రాయలసీమ ఫ్యాక్షన్ లో రెక్కలిరిగిన ఒక చాకలి కులస్థుడి కథది. నాకు తెలిసినవస్తువురాయలసీమ అణగారిన కులాల వారి కథలు, ఆ జనాలు మాట్లాడే రాయలసీమ యాస. రాయలసీమ నిరాడంబర, నిష్టురతే నా కథల శిల్పం. సీనియర్ రచయితలను చదివి నేను నేర్చుకున్నదే నా దారి. 

5. కర్నూల్ సాహిత్య వాతావరణం మీ మీద చూపిన ప్రభావం ఏమిటి ? ప్రస్తుతం కర్నూల్ లో  సాహిత్య వాతావరణం ఎలా ఉంది ?

నేను, నా సహచరి సుభాషిణి వెంట కర్నూలు కు వచ్చాను. ఆమె కర్నూలు లోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో గణితంలో వుపన్యాసకురాలిగా వుద్యోగం చేస్తుంటే నేనూ నా ప్రభుత్వ వుద్యోగాన్ని కర్నూలు లో ఎంచుకోవాల్సి వచ్చింది. కర్నూలు లో నాకు తెలిసిన యేకైక వ్యక్తి కాశీభట్ల వేణుగోపాల్. ఆయన రచయిత కాని రోజుల నుంచే తెలుసు. ఆయన అజ్ఞాతంగా కవిత్వం, నవలలూ రాస్తున్న రోజుల్లో వాటి మొదటి పాఠకుడ్ని నేనే. ఆయనలోని చదువరి తనమే మేము కలవడానికి కారణం. 1993 లో కర్నూలుకు వస్తే, యింట్లో మా సుభాషిణి తోనూ బయట వేణుగోపాల్ తోనూ నా సాహిత్య సంభాషణ నడచేది. 1998 నుంచి కర్నూలు కథాసమయం మిత్రులు పరిచయం అయ్యారు. బృందంగా మా కథా ప్రయాణం మొదలైంది. 2000సంవత్సరంలో మా కథలతో   'కథాసమయం' కథాసంకలనం వేసాం. ఆ క్రమంలో హంద్రీకథలు, కర్నూలు కథ, గుర్నూలుపూలు వంటి కథాసంకలనాలు కథాసమయం మిత్రులనుండి వచ్చాయి. ఆ బృందం సభ్యులు హరికిషన్, తుమ్మల రామకృష్ణ, జి. వెంకటకృ‌‌ష్ణ, జి. ఉమామహేశ్వర్, నాగమ్మ ఫూలే, ఇనాయతుల్లా, కె. సుభాషిణి రాయలసీమ అధ్భతమైన కథకులుగా పరిచయమైనారు. నన్ను కథాసమయం చాలా ప్రభావం చేసింది. నేను కూడా కథాసమయానికి చిరునామాగా నిలబడ్డాను. సంస్థ కాని సంస్థ కథాసమయం. ఒక సంస్థ చేయవలసిన పనులన్నీ చేసింది. పుస్తకాల ప్రచురణ, వర్క్ షాపుల నిర్వహణ చేసింది. 1996నుండీ 2010 దాకా కర్నూలు కథాసాహిత్యాన్ని నడిపించింది. కథంటే బృందగానమని నిరూపించింది. ఇప్పుడు కర్నూలు సాహిత్యంలో కొత్త శక్తులు పనిచేస్తున్నాయి. కథా కవిత్వం విమర్శ యీ మూడు ప్రక్రియలతో ఒక వైపు(పాణి)   విరసం, మరోవైపు సాహిత్య ప్రస్థానం (కెంగార మోహన్ రఘుబాబు)  బృందాలు పనిచేస్తున్నాయి. సాహిత్య కార్యక్రమాలు కర్నూలు లో ముమ్మరంగానే జరుగుతున్నాయి. నేనూ అందులో భాగస్వామిని అవుతున్నాను. 

6.   తెలుగు సాహిత్యంలో రాయలసీమ సాహిత్యంకు గల  ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలి

రాయలసీమ జీవితాన్ని రాయలసీమ సాహిత్యం మాత్రమే చెప్పగలదు. రాయలసీమకే ప్రత్యేకమైన కథావస్తువులైతేనేమీ, ఆ వస్తువుల్ని కథనం చేసిన రాయలసీమ భాషైతేనేమీ తెలుగు సాహిత్యానికి ఒక కాంట్రిబ్యూషనే కదా. రాయలసీమ నుడికారాన్నీ, సంస్కృతీ ఆచారవ్యవహారాలనూ పట్టుకున్న కథలు తెలుగు భాషకు గొప్ప సంపద. ప్రాంతీయ అస్తిత్వ కోణం నుంచి మాత్రమే ఆ ప్రత్యేకతనూ ఆ అరుదుతనాన్నీ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఇంకొక విషయం, రాయలసీమ లో మొదట్నుంచీ బ్రాహ్మణ రచయితల ప్రభావం లేదు. దాదాపు రచయితలంతా శూద్రులే. అందుకే శూద్ర కులాల జీవిత చిత్రణ రాయలసీమ కథలో  అతి సహజంగా వుంది. 

7.  ప్రస్తుత సాహిత్యం  జీవ లక్షణాన్ని కోల్పోయిందని అంటున్నారు.  ఇది నిజమేనంటారా?

పాత సూత్రీకరణల్లోంచీ మనం యిలా అనుకుంటున్నామేమో. ఈ కాలపు సాహిత్య లక్షణాన్ని పట్టుకోవడానికి కొత్తగా ఆలోచించాలేమో. ఇప్పుడు నడుస్తోంది ఆన్లైన్ యుగం. దీన్ని ఆ కళ్లతోనే చూడాలి. ఏ కాలపు సాహిత్యమైనా ఆ కాలపు జీవలక్షణాన్ని కలిగివుంటుంది. ఏ కాలమైనా తనను తాను రికార్డు చేసుకుంటూ వుంటుంది. ఒక తలం మీద ఒక కోణంలో చూస్తున్నందువల్ల అది కనిపించకుండా వుండవచ్చు. మన దృష్టి కోణం మార్చి చూస్తే యీ కాలపు లక్షణం సజీవంగా అవగతమవుతుంది. 

8.  ఇప్పుడు వెలువడుతున్న సాహిత్యాన్ని  మీరు ఎలా చూస్తున్నారు?

సానుకూలంగానే చూస్తాను. ఇప్పటి ఆన్లైన్ యుగంలో తక్కువ నిడివి గల రచనలు అన్ని సాహిత్య ప్రక్రయలలోనూ వెలువడుతున్నాయి. సామాజిక మాధ్యమంలో పబ్లిష్ అవుతున్నాయి. చిన్న కవితలూ, చిన్న చిన్న రైటప్ లూ సూటిగా విషయం ను వివరించే లఘువచన (స్మాల్ నర్రేటివ్) కాలపు లక్షణం యిదే. ప్రింట్ మీడియా లో కూడా చిన్న కథలూ చిన్న నవలల కాలం నడుస్తోంది. ఇటీవల చతుర లో నూరు పేజీల పుస్తకంలో రెండు చిన్న నవలలు వేస్తున్నారు. దీనికి కారణం జీవితంలో వేగం. ఇటీవల షార్ట్ ఫిలిమ్స్ కు గిరాకీ పెరిగింది. వేలాది లఘు చిత్రాలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఆహ్వానించక తప్పదు. 

9.  ఇప్పుడు వెలువడుతున్న తెలుగు సాహిత్య విమర్శను ఎలా చూడాలంటారు?

తెలుగు లో విమర్శ లేదు. తెలుగు లో కథా కవిత్వం, నవల విశ్వప్రదర్శన చేశాయి. ఆ స్థాయిలో కాదుగదా యే స్థాయిలోనూ విమర్శ లేదు. వున్నది కాస్తా పరామర్శ, ప్రశంస, కొండొకచో నిందా, అభిశంస. నిండైన విమర్శ యే రచయిత రచనపైనైనా తెలుగు లో అరుదు. యూనివర్శిటీ ఆచార్యులు మనకేమీ కొదవలేరు. వాళ్లంతా థీసిస్సులు రాయిస్తూంటారు. థీసిస్ అంటే అక్కడ తీసి కొంత, యిక్కడ తీసి కొంత రాసేదే. అదే మన విమర్శ స్థాయి. 

10. ఇంతవరకు నవల రాయకపోవడానికి కారణం ఏమిటి

నిజమే నవల రాలేకపోయాను. దీనికి కారణం నా బధ్ధకమే. ప్లాన్ లేకపోవడం. నా యవ్వన కాలం నుంచి నా సాహిత్య సంభాషణలో వుంటున్న స్వామి, కాశీభట్లా యిద్దరూ చెప్తూనే వున్నారు నవల యెత్తుకోమని. నేనే ప్లాన్ చేసుకోలేకపోయాను. తప్పకుండా రాస్తాను. 

11. కథకుడిగా, కవిగా, సాహిత్య విమర్శకుడిగా, సామాజిక కార్యకర్తగా మీ అనుభవాలు ఏమిటి?

కవిత్వంతో ప్రారంభమైనాను. తర్వాత కథాసాధన ఆరంభించాను. ఈ రెండింటిలో యేమీ అంతగా సాధించకుండానే విమర్శ అనే చేతగాని పనిలోకి దిగాను. ఇక సామాజిక కార్యకర్త అనే పదాన్ని వాడడానికి అర్హత లేనివాడ్ని. ఉద్యోగం చేసుకుంటూ భద్రజీవితంలో వుంటూ నేనేం సామాజిక కార్యకర్తను. కవిత్వం కంటే కథతో కొంత సంతృప్తి చెందాననిపిస్తుంది. కవిత్వంలో యెంతైనా అస్పష్టతకు చోటుంటుంది. కవి దాక్కోగలడు. కథతో అట్లా కాదు. నువ్వేమిటో నీ శక్తేమిటో అందరికీ తెలుస్తుంది. కథ రాయడం కష్టమని నా అనుభవం. 

 12.  కథా సమయం గురించి చెప్పండి.

కర్నూలు కథాసమయం -  ఒక కథకుల బృందం. రాప్తాడు గోపాలకృష్ణ, శ్రీనివాస మూర్తి, పూనికతో పుట్టింది. ఈ ఆలోచన వెనుక తుమ్మల రామకృష్ణ, పంచాగ్నల చంద్రశేఖర వున్నారు. 1994-2010 మధ్య కాలంలో కర్నూలు కేంద్రంగా ఆధునిక కథ కోసం యీ బృందం పనిచేసింది. సింగమనేనీ నారాయణ గారు 1990 లో సీమకథ కథాసంపుటి వేసినప్పుడు ఆ సంకలనంలో కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. కర్నూలు లో ఆధునిక కథ లేదని సింగమనేనీ గారు చెప్పినప్పుడు  నుంచి రాప్తాడు గోపాలకృష్ణ గొడవపడ్డాడు. కథాసమయం బృందం ద్వారా ఆధునిక కథ కోసం ప్రయత్నాలు చేసాడు. ఈ బృందం, పల్లె మంగలి కథలూ, ఫ్యాక్షన్ కథలూ, కథాసమయం కథల సంకలనం, హంద్రీకథలు, కర్నూలు కథ, గుర్నూలుపూలు లాంటి కథాసంకనాలని వెలువరించారు. రాప్తాడు గోపాలకృష్ణ మరణంతోనూ, శ్రీనివాస మూర్తి వ్యక్తిగత కారణాల వల్ల దూరమైనా మిగతా సభ్యులు  రాయలసీమ లో కథకు కర్నూలును కేంద్రం చేసారు. వ్యక్తిగతంగా యీ బృంద సభ్యులు, గోపాలకృష్ణ, తుమ్మల రామకృష్ణ, హరికిషన్, వెంకటకృ‌‌ష్ణ, ఉమామహేశ్వర్, సుభాషిణి, ఇనాయతుల్లా తమ తమ కథాసంపుటులు ప్రచురించి కథకులుగా నిలబడ్డారు. 

13. మీరు వర్క్ షాపులకు హాజరయ్యారు కదా ఆ అనుభవాలు ఏమిటి?

లెక్కలేనన్ని కథా సమ్మేళనాలకు హాజరైవుంటాను. కథాసమయం తరఫున మేమూ అలాంటి సమావేశాలు నిర్వహించాము. ఖదీర్ బాబు - సురేష్ నిర్వహించిన మొదటి కీసర కథాసమావేశం నుంచి వాళ్ళవి ఏడెనిమిది సమావేశాలకు వెళ్లుంటాను. విరసం వాళ్ళు నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ పాల్గొన్నాను. వీటన్నింటిలో రచయితలను కలవడమే గొప్ప అనుభవం. అల్లం రాజయ్య, బండి నారాయణ స్వాములను వినడం, గొప్ప అనుభవం. కారా మాస్టర్ ను కలుసుకోగలిగాను. తెలుగు లో ప్రసిధ్ధులైన నా ముందు తరంనా తరం కథకులను యీ సమావేశాల్లోనే చూడగలిగాను, వినగలిగాను. ఎంతో నేర్చుకున్నాను. నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి యీ సమావేశాలు వుపయోగపడ్డాయి. 

14. మీ ప్రాంతం నుండి కొత్త రచయితలు అంతగా రాకపోవడానికి కారణం ఏమిటి

మా ప్రాంతమనే కాదు, యే ప్రాంతం నుంచి యే కాలంలో కూడా ఎక్కువ సంఖ్యలో రచయితలు రాలేదు. ఒకవేళ ఒక ప్రాంతంలో సంఖ్యలో యెక్కువ వున్నా, తప్పాతాలూ వుండేవుంటుంది. సీరియస్ గా, దృక్పథంతో, ఒక ఆత్మవిశ్వాసంతో తన కాలానికి ప్రతినిధిగా నిలబడేవాళ్లు యెప్పుడూ యెక్కడైనా తక్కువే. రాయలసీమ కూ యిది వర్తిస్తుంది. ఇప్పుడు కూడా పాత కథకులే రాయాల్సొస్తుంది. అయితే దృశ్యాన్ని యింకో కోణంలో చూస్తే, ఆన్లైన్ మాధ్యమాలలో రాయలసీమ నుంచి చాలా మంది రాస్తున్నారు. వందలాది మంది వుంటారు. అందులో యెంత మంది నిలబడతారు. ఏ దృక్పథంతో రాస్తున్నారు. అనేది చర్చనీయాంశమే అయినా వారు రాస్తుండటం, వాళ్ళ చుట్టూ పాఠకులుండటం మాత్రం నిజం. 

15.   యువ రచయితలు ఎక్కువమంది మీ ప్రాంతం నుండి రావడం లేదంటారా? కారణాలు గమనించారా?

రాయలసీమ నుంచి యువరచయితలు రాస్తున్నారు. ఎక్కువ మంది ఆన్లైన్ మాధ్యమాల్లో రాస్తున్నారు. కవిత్వం యెక్కువగా రాస్తున్నారు. ఎడిటింగ్ చేసుకుంటే, కొంత శిక్షణ తో నేర్చుకుంటే పరిణితి సాధించగలరు. సంస్థలు వారిని పట్టించుకోవాల్సుంది. 

 16.   దీర్ఘ కవితలు రాశారు కదా. ఎలాంటి స్పందన వచ్చింది?

రెండు దీర్ఘకవితలు రాసాను. మొదటిది, 2009లో కర్నూలు నగరాన్ని ముంచెత్తిన వరదలను చిత్రిస్తూ రాసింది. "నదీ వరదా మనిషి". రెండోది, రాయలసీమ వుద్యమానికి వెన్నుదన్నుగా రాసిన "హంద్రీగానం". ఈ ప్రాంతీయ అస్తిత్వఘోషను రాయలసీమ వాదులు బాగా ఆదరించారు. 

17. కోవిడ్ మీ జీవితం లో ఏమైనా మార్పు తీసుకు వచ్చిందా?

నా జీవితంలో యిప్పటికి నేను చూసిన రెండు అరుదైన సంఘటనలలో యిదొకటి. తెలంగాణ యేర్పడటం మొదటిది. వొళ్లంతా కళ్లు చేసుకుని ఆశ్చర్య ఆనందాలతో చూసాను దాన్ని. ఇప్పుడు కరోనా విజృభణనూ అలాగే చూస్తున్నా. ఈ వైరస్ వల్ల ఆగస్టు పదకొండు న మా అక్క చనిపోయారు. నిస్సహాయంగా అనాథలా పంపించాము. భయం నీడ అంటే యేమిటో కరోనా చూపిస్తోంది. కరోనా తాత్వికంగా మనిషి దుర్మార్గానికి, నిస్సహాయతకూ ప్రతీక. ఇంకా అర్థం కాని ప్రకృతి, మనిషి కి విసురుతున్న సవాల్ యిది. ప్రకృతి లోని అణువణువుకూ వినయంగా వుండి జీవించాలనే  సత్యాన్ని యింకో సారి కరోనా నేపథ్యంలో గుర్తుచేసుకుంటున్నాను. 

18.   అస్తిత్వ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలంటారు

ఏ రచయిత కైనా అతడి ప్రాంతం, కులం, లింగభేదంలో వేళ్లుతన్నుకొని వుంటాయి . వ్యక్తి చైతన్యం యీ మూడింటినుంచీనే వస్తుంది. ఇట్లాంటి తన చైతన్యాన్ని అర్థం చేసుకోవడాన్ని సంకుచిత దృష్టిగా అపోహపడ్డారు విమర్శకులు. ఆధునికత రచయితలు అంతర్జాతీయ (మెగా కథనాల) అవగాహన పేరట, కమ్యూనిస్టు (మార్క్స్ చెప్పని) ఆదర్శాల పేరట హృదయవైశాల్యాన్ని రుజువు చేసుకొనే తొందరలో చిన్న చిన్న వే అయిన కీలకమైన విషయాలకు దూరమయ్యారు. ఆయా చిన్న చిన్న వుపాధులు ప్రాంతీయ అస్తిత్వ కోణం నుండే సాకారమవుతాయి. సాహిత్యం లో సూక్ష్మ అంశాలు అర్థం కావాలంటే అస్తిత్వవాదమే దారి. చిన్న చిన్న చిక్కుముడులు విడిపోతేనే మెగా అల్లికలూ విడిపోతాయి. తెలుగు సాహిత్యాన్నీ, సాహిత్య సంస్థలనూ అగ్రవర్ణాల భావజాలం నడపడం వల్ల వాళ్ళ నాయకత్వాలకు భంగం కలిగించే విషయాలను తక్కువ స్థాయీ విషయాలుగా చెప్తూ అపార్థం చేయించారు. అస్తిత్వవాద సమస్యలే మొదట తలకెత్తుకొని పరిష్కరించాల్సినవి. దాచేయాల్సినవీ కాదు. 

19.   రాయలసీమ అస్తిత్వ ఉద్యమంలో మీరు భాగస్వాములు కదా.  మీరు ప్రజల మధ్యకు వెళ్ళి వారితో మాట్లాడినపుడు మీకు ఎదురైనా అనుభవాలు ఏమిటి?

నా కథలన్నీ ప్రజలతో ఎదురైన అనుభవాలే. కరువుబారినపడ్డ రైతులూ రైతు మహిళలూ, ఫ్యాక్షన్ లో నలిగిపోయిన కింద కులాల వ్యక్తులూ, వూర్లల్లో యెదురై, మా కథల్లో పాత్రలుగా మారారు. అవి వస్తువులుగా అస్తిత్వవాదానికి చెందినా, ఆ కథల పరిష్కారాలు మాత్రం ఆదర్శీకరించబడినవే.  నిజానికి అవి పాత పరిష్కారాలు.   తెలంగాణ విడిపోయి కొత్త ఆంధ్రప్రదేశ్ యేర్పడ్డాక యిప్పుడు అసలు విషయాలు కన్పిస్తున్నాయి. అప్పుడు వాన రాని కథలు రాసి బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగామని యిప్పుడు అర్థమవుతుంది. కళ్ల ముందే కృష్ణ తుంగభద్ర ప్రవహిస్తూ వెళ్లిపోతున్నాయి గానీ  ఇక్కడ యెందుకు నిలబడడమే లేదనే ప్రశ్న యిప్పుడు ప్రజల్నుంచి స్పష్టంగా వినిపిస్తోంది. ఆ కథలు రాయమని నిలదీస్తోంది. 

20.  సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా?

ప్రత్యక్షంగా సాధ్యం కాదు. సాహిత్యం వల్ల విప్లవం రాదు. విప్లవమోద్యమం వల్లే సమాజంలో మార్పులు వస్తాయి. అయితే సాహిత్యం మనుషుల్లో అనుభూతిని కలిగిస్తుంది. సెంన్సిటైజ్ చేస్తుంది. తద్వారా ఆలోచనల్లో మార్పుకు దోహదం చేస్తుంది. నా తండ్రి తరానికీ, నా తరానికీ స్త్రీలను చూడ్డంలో మార్పు వచ్చింది. నా ఆలోచనల్లో స్త్రీ వాద సాహిత్యం, ప్రవర్తన లో మార్పు కు దోహదం చేసింది. అట్లే దళితుల పట్ల సంవేదనల్ని పెంచింది. సాహిత్యం ఆధునిక విలువల్నీ, ఆకాంక్షలనీ ప్రసారం చేసి మార్పుకు తానూ ఒక కారణం అవుతుంది. 

21.  పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు  గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు?

సందేశాలిచ్చేంత వాడిని కాదు. అంత పరిజ్ఞానం లేదు. అయితే    గోదావరి పత్రిక యిటీవల విద్యార్థుల యువకుల రచనలను ప్రచురిస్తోంది. ఇది మంచి పరిణామం. రాసేవాళ్లు కొత్త తరం లోంచీ రావాలి. రాస్తూ రాస్తూ వాళ్లే మెరుగవుతారు. సాహిత్య సృజన వ్యక్తిగతమైందే, కానీ అదీ సమూహ క్రియగా మారిపోతుంది. రాసింది, రాసిన వాడిని మెరుగుపరుస్తుంది. చదివినవాడిని సంస్కరిస్తుందీ. యువతకు ప్రాధాన్యత యివ్వడం ద్వారా గోదావరి పత్రిక వాళ్ళను వాళ్ళ సామాజిక బాధ్యతకు దగ్గర చేసినట్లేనని నేను భావిస్తున్నాను. 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు