మా రచయితలు

రచయిత పేరు:    మూరాడి శ్యామల

సాహిత్య వ్యాసలు

కందుకూరి వెంకట మహాలక్ష్మి, జీవితం-సాహిత్యం

        కందుకూరి వెంకట మహాలక్ష్మి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో తాళ్ళూరి భాస్కర నారాయణ మూర్తి, ఛాయా మహాలక్ష్మి దంపతులకు 1943వ సంవత్సరము డిసెంబరు 10వ తేదీన జన్మించింది.

            రచయిత, కళాకారుడు అయిన తండ్రి ప్రోత్సాహంతోనే వెంకట మహాలక్ష్మి సకల కళల్లో ఆరితేరింది. తన 11వ ఏటనే బాలవాక్కు బ్రహ్మవాక్కుఅనే కథను రాసింది. ఇది టాటానగర్‍లోని ప్రవాసి అనే పత్రికలో అచ్చవడమే కాక బాలల కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది. మరోవైపు మ్యాజిక్‍ నేర్చుకున్నది. తన 12వ ఏట ప్రదర్శన ఇచ్చి సీనియర్‍ పి.సి.సర్కార్‍చే మొట్టమొదటి మహిళా మెజీషియన్‍గా ప్రశంసలు పొందింది.

             కందుకూరి సూర్యనారాయణతో 1965వ సంవత్సరం, నవంబరు 28వ తేదీన వెంకట మహాలక్ష్మి వివాహం జరిగింది. దాంతో వెంకట మహాలక్ష్మి చిరునామా ఢిల్లీకి మారింది. ఇరవై సంవత్సరాలకు పైగా వనితాజ్యోతి మాసపత్రికకు ఢిల్లీ ప్రతినిధిగా ఉంటూ విలేఖరిగా వివిధ రంగాలలో ప్రముఖులైన మహిళలనెందరినో పాఠకులకు పరిచయం చేసింది.ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో పదిహేను సంవత్సరాలకు పైగా లలితసంగీత కళాకారిణిగా పనిచేసింది. తాను పాడే లలితగీతాలకు, తానే స్వరకల్పన చేసుకొనడం ఆమె ప్రత్యేకత.

            ఢిల్లీ తెలుగు సాహితికి జాయింట్‍ సెక్రటరీగా పనిచేస్తూ, ఈ సంస్థ ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దక్షిణ భారత నటీనట సమాఖ్య కమిటీ మెంబరుగా కూడా పనిచేసింది.  ఇందులో ఆమె రాసిన ఆరు నాటికలను ప్రదర్శించటం జరిగింది.  నాలుగు నాటికలలో స్వయంగా నటించటమే కాదు దర్శకత్వం కూడా వహించింది.

            ఢిల్లీ ఆంధ్ర వనితామండలివారు ప్రచురించిన ‘‘న్యాయవాణి’’ ప్రతికకు సంపాదకురాలిగా ప్రయోజనాత్మకమైన బాధ్యతను నిర్వహించింది.  బాధాసర్పదష్టులైన మహిళలకు న్యాయసహాయ మందించే దిశగా అనేక శీర్షికలలో న్యాయవాణి వినిపించడమే కాకుండా సమావేశాల ద్వారా ఎంతో మందిని కలుసుకుంటూ, చట్టం గురించి వారికి అవగాహన కల్పిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసింది.

            కందుకూరి వెంకటమహాలక్ష్మమ్మ రచనా వ్యాసంగం 11వ ఏటనే మొదలైనప్పటికీ 1971వ సంవత్సరం రష్యా నుండి తిరిగి వచ్చిన తర్వాతనే పుంజుకుంది.  ఆమె కథలు వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలలో ప్రత్యేక సంచికలలో ప్రచురితమయ్యాయి.  వీటిలో ‘15’ కథలు ఆకాశవాణి విజయవాడ, ఢిల్లీ ఇ యస్ డి  నుండి ప్రసారం అయ్యాయి.  హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆమె రాసిన ఆడపిల్లఅనే కథను ఎం.ఎ. విద్యార్ధులకు పాఠ్యాంశంగా ఎంపిక చేసింది.  వెంకట మహాలక్ష్మి కథలేకాక సంక్రాంతి, ఉగాది పండగల మీద సంగీతరూపకాలను రాసింది.  ఇవి ఢిల్లీ ఇ యస్ డి నుండి ప్రసారమయ్యాయి.  ‘11’ నాటికలు, ‘55’ కవితలు రచించింది.  కవితలలో కొన్ని మాత్రమే అచ్చయ్యాయి.  ఇవే గాక ఆమె రాసిన 85కి పైగా వ్యాసాలు, ఇంటర్వ్యూలు, అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి.

 

*                  24-04-2005లో హైదరాబాదు వారి ‘‘ కాశీచయనుల లక్ష్మీదేవమ్మ ’’ గారి అవార్డును                             పొందింది.

*                  26-03-2007లో 2006 సం।।గాను ఉత్తమ కథల పుస్తకంగా ఆమె ‘‘ రష్యన్‍ సీత’’ పుస్తకానికి     

                   ‘‘ విశ్వసాహితీ’’ అవార్డు లభించింది.

*                  10-10-2008 లో Indian Economic Development and Research Association వారి  

                    ప్రసిద్ధమైన ‘‘ భారతగౌరవ్‍ ’’ అవార్డు లభించింది.

*                  31-08-2009 లో హైదరాబాదులోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  2008   

                    సం।।గాను ఉత్తమ రచయిత్రిగా ( నాళం కృష్ణారావు స్మారక) ‘‘కీర్తి పురస్కారం’’ ప్రధానం  

                    చేసింది.

*                  31-01-2014లో హైదరాబాదులోని అసోచాం ‘‘ద్విదశాబ్ది ఉత్తమ కథారచయిత్రి’’ అవార్డు

                   యిచ్చి సత్కరించింది.   

 

            కథాపక్రియకు సంబంధించి కందుకూరి వెంకట మహాలక్ష్మి చేసిన సాహిత్యకృషిని గమనిస్తే స్త్రీల కథాసాహిత్య చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేకమైన ముద్ర అని గమనించవచ్చు. మహాలక్ష్మి కథలన్నింటికీ కుటుంబమే కేంద్రం. కుటుంబంలో తల్లిదండ్రులకు, పిల్లలకు, తోడబుట్టినవాళ్ళకు,అత్తాకోడళ్ళకు మామాఅల్లుళ్ళకు, వదిన ఆడపడుచులకు, భార్యాభర్తలకు మధ్య ఆప్యాయత అనుబంధాలకు కాని, విద్వేషాలకు కానీ ఎన్ని కోణాలుంటాయో చూపిస్తాయి ఆమె కథలు.

            మహాలక్ష్మి రాసిన మొత్తం ‘143’ కథలలో 1959 సం।।లో ఒకటి, ఇరవై సంవత్సరాల తర్వాత 1979 సం।।లో రెండు వచ్చాయి. ఎనభయ్యవ దశకంలో ఆమె కథారచన ముమ్మరమైంది. ఆ దశకంలో ఆమె రాసిన కథలు నలభైతొమ్మిది(49) కాగా, తొంభయ్యవ దశకంలో ముప్ఫయి నాలుగు(34) కథలు వచ్చాయి. ఇరవయ్యవ శతాబ్ధి తొలిదశకంలో ఆమె రాసిన కథలసంఖ్య నలభైఏడు(47)కు పెరిగింది. 2010-14 మధ్యకాలంలో పది(10) కథలు వచ్చాయి. మొత్తంగా వెంకట మహాలక్ష్మి రాసిన కథలను పరిశీలిస్తే స్త్రీ సమస్య గురించిన ఆమె అవగాహన అర్థం అవుతుంది.

            నిజానికి కందుకూరి వెంకట మహాలక్ష్మి కథలు ఉధృతంగా వచ్చిన మూడు దశాబ్ధాలకాలం(1980-2010) తెలుగు సమాజం అనేక భావ భౌతిక సంచలనాలతో,    ఉద్యమాలతో పరిణామం చెందింది. కానీ ఆ కాలపు సామాజిక ఆర్థిక రాజకీయ ఘటనలు కానీ, స్త్రీలు, దళితులు మొదలైన భిన్నఅస్తిత్వాల ప్రజల ఆరాటాలు కాని ఆమె కథలలో ఎక్కడా ప్రత్యక్షంగా ప్రస్తావించబడలేదు, సూచించబడలేదు. ఆమె పాత్రలకు సామాజిక పరిణామాలతో సంఘర్షణ, సంవాదం ఎక్కడా కనిపించదు. అయినప్పటికీ ఆమె కథాసాహిత్యంలో స్త్రీ సమస్యే ప్రధానం కావటం విశేషం. స్త్రీ కావటం వలన అనుభవం నుండి వచ్చిన లౌకిక జ్ఞానమే ఆమె స్త్రీ సమస్యను కథావస్తువుగా చేసుకోవటానికి కారణంగా  కనిపిస్తుంది. స్త్రీల జీవితం అలా నడవటానికి స్త్రీపురుష సంబంధాలు, కుటుంబ సంబంధాలు అట్లా ఉండటానికి మూల కారణమైన రాజకీయాల గురించి అవగాహన మాత్రం ఈ కథలలో కనిపించదు.

            కందుకూరి వెంకట మహాలక్ష్మి కథలలో స్త్రీలు కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడటానికి ప్రయత్నించకపోలేదు. కానీ ఆ ప్రయత్నాలు సంస్కరణ పరిధిని దాటి పోలేదు. అది ఆమె కథలకున్న పరిధి.

            కుటుంబంలో ఆడపిల్లలు వివక్షకు గురికావటం మహాలక్ష్మమ్మ గుర్తించింది. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడకపోవడం దగ్గరనుండి చదువులు చెప్పించకపోవటం వరకు ఉన్న వివక్షను ఆమె రాసిన ఆడపిల్ల’, ‘ఇద్దరు బిడ్డలే-ఇద్దరికీ తండ్రే-కానీకథలు నిరూపిస్తున్నాయి.

ఆడపిల్లల పెళ్ళి విషయంలో కూడా తండ్రులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నాసిరకం సంబంధాలను చూసి పెళ్ళిళ్ళు చేసి వదిలించుకోవటాన్ని కూడా ఆమె కథలలో చూడవచ్చు. ముసలి మొగుడు-పడుచు పెళ్ళాం’, ‘తండ్రులకో కథవంటి కథలు అందుకు నిదర్శనం.

            అదేవిధంగా కుటుంబాలలో ఆడపిల్ల చదువుపట్ల తల్లిదండ్రులకు శ్రద్ధలేకపోవటం కూడా కనిపిస్తుంది ఆడపిల్లకథలో తండ్రి కూతురికి కొడుకుతోపాటు ఉన్నతవిద్యను చెప్పించటానికి ఇష్టపడడు. కూతురే చదువుపట్ల ఉన్న ఆసక్తితో తండ్రిపై ఒత్తిడి తెచ్చి ఎం.ఎ. చేస్తుంది. తమ మీద ఒత్తిడి తెచ్చిందని పదే పదే అనుకుంటారు వాళ్ళు. ఇద్దరు బిడ్డలే-ఇద్దరికీ తండ్రే-కానీ’  కథలో తండ్రి కూడా అదేతంతు. తనకపుడే పెళ్ళివద్దని, చదువుకుంటానని కూతురు ఎంత బ్రతిమిలాడినా చదువుకు పెట్టే ఖర్చు కలిసొస్తుంది అంటూ చిన్నప్పుడే పెళ్ళిచేశాడు. ఈ కథలో చదువుమీద ఉన్న ఆసక్తిని ప్రమీల పెళ్ళి తర్వాత వాస్తవీకరించుకోవడం కనిపిస్తుంది.

            ఆడపిల్లల చదువును నిర్లక్ష్యం చేయటం నచ్చని వ్యక్తులు కూడా మహాలక్ష్మి కథలలో కనిపిస్తారు. పర్యవసానంకథలో తండ్రి పీనాసితనంతో కూతురు భావనను పదవ తరగతి వరకే చదివించి, తక్కువ ఖర్చుతో పదవ తరగతి పరీక్షతప్పి బ్యాంకులో అటెండర్‍గా  ఉద్యోగం చేస్తున్న అనాథకిచ్చి పెళ్ళి జరిపిస్తాడు. భావన సోదరులకు అది నచ్చదు.  ఉద్యోగాలు వచ్చి ఆర్థికంగా స్వతంత్రులు అయ్యాక చెల్లెలిని, ఆమె భర్తను కూడా చదువుకోటానికి వాళ్ళు సహాయం చేస్తారు. చదువుతో అభివృద్ధి ముడిపడి వుంటుందనే ఆధునిక దృష్టి ఉన్నవాళ్ళు కనుక ఆ అభివృద్ధిని చెల్లెలికి దూరం చేయకూడదు అన్న అవగాహనతో తండ్రి చేసిన తప్పును సరిదిద్ధారు వాళ్ళు. 

            ఆడవారికి చదువు, ఉద్యోగం ఉండాలని ఆధునిక యువకులు ఆశిస్తున్నట్లు ఆమె గుర్తించింది. నచ్చినకోడలుకథలో లీల భర్త చదువు చెప్పించి, భార్య ఉద్యోగం చేయడానికి ప్రోత్సహించినట్లు చిత్రించటం ఆ అవగాహన వల్లనే. సంసారం బాగుండాలంటే ఆర్థికపరిస్థితులు మెరుగుపడాలంటే భార్యాభర్తలిద్దరూ చరువుకున్నవాళ్ళయి ఉండాలి,   ఉద్యోగం చెయ్యాలి అని ఆ కథలో లీల భర్త అనుకున్నాడు. అందుకే భార్య చదువుసాగడానికి ప్రోత్సహించాడు. ఇంటి పని, వంటపనిలో సాయంచేసి భార్యకు చదువుకోటానికి సమయాన్ని మిగిల్చాడు. భార్య ఎదుగుదలలో భర్త పాత్రను ఆ రకంగా ఈ కథలో చూపింది మహాలక్ష్మమ్మ.

             చదువు స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని జీవితంలో ఎదురయ్యే సమస్యలను చొరవతో ఎదుర్కొని పరిష్కరించుకొనే చైతన్యాన్ని ఇస్తుందని మహాలక్ష్మమ్మకు తెలుసు. మీరు ఆలోచించండికథలో శిరీష పిహెచ్‍.డి. చేసింది. కట్నమొద్దని పెళ్ళాడి తర్వాత లాంఛనాలపేరిట, విదేశీప్రయాణాల పేరిట డబ్బు గుంజిన భర్త, అత్తమామలతో తనపుట్టింటి వారి అప్పుతీరేవరకు డబ్బివ్వనని అంటుంది. మీరేంచేసినా నా నిర్ణయమిదే అని చెప్పడంలో ఆమె ఆత్మవిశ్వాసం, ధైర్యం కనిపిస్తాయి. దీనికి కారణం చదువు. నాకు చావాలని లేదు డాక్టర్‍ కథలో అపర్ణ అక్క జీవితాన్ని చూసి చదవాలనుకుంది. ఎందుకంటే అక్క అత్తింటపడిన హింసను చూసి తను అలా అనుభవించకుండా వుండాలంటే చదువుకొనడమే ఏకైక మార్గమని గుర్తిస్తుంది. నూటికొక్కరున్నాచాలుకథలో స్వాతి చదివి, తద్వారా పొందిన చైతన్యంతో వరకట్నపు పెళ్ళిని నిరసించి ఆదర్శ వివాహం చేసుకుంటుంది. కట్నం తీసుకున్న మామను అందరిముందు తలదించుకునేలా చేయటానికి కారణం తనకు చదువు నేర్పిన ధైర్యమే.

            ఉద్యోగం పురుషలక్షణం అన్న మాటను పితృస్వామ్య సంస్కృతి ప్రచారం చేసింది. దాని ఫలితమే ఉద్యోగం స్త్రీలకు సహజకార్యం కాకుండాపోవటం.  అందువల్లనే కందుకూరి మహాలక్ష్మమ్మ కథలలో తమంతటతాము ఉద్యోగం ఒక సహజాంశంగా చేయవలసిన పనిగా చేసే స్రీలు అరుదుగా కనబడతారు. మీరు ఆలోచించండికథలో శిరీష, ‘నూటికొక్కరున్నాచాలుకథలో స్వాతి, ‘ఆటబొమ్మకాదు ఆడదికథలో నీరజ, ‘ఇది ప్రసంగం-అది ప్రపంచంకథలో దివ్య, ‘ఇలాంటి వారినేమనాలికథలో లావణ్య వంటి స్రీలు ఆ కోవలోనివాళ్ళు.

             సంసారాలు విఫలమై విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు తమ బ్రతుకు తాము బ్రతకటానికి ఉద్యోగస్తులైన స్త్రీలు మహాలక్ష్మి కథలలో ఎక్కువగా కనిపిస్తారు. తండ్రులకో కథలో హేమ, తండ్రి నిర్ణయం మేరకు అక్కను చంపిన బావనే పెళ్ళాడినా అతనితో జీవితం దుర్భరమై తన బతుకు తాను బతకటం కోసం బయటకు వచ్చి స్నేహితురాలి తండ్రి సహయంతో ఉద్యోగం సంపాదించుకుంటుంది. భగ్గుమన్న నిప్పురవ్వకథలో మానవి, భర్త హింసను తప్పించుకొని స్నేహితురాలి సహయంతో  ఉద్యోగంలో చేరుతుంది.  ఇదీ ప్రేమేనంటారా?’  కథలో సుమతి, భర్త తనను వదిలి అమెరికా వెళ్ళినపుడు ఒంటరి జీవితానికి ఉపశమనంగా ఉద్యోగంలోనికి ప్రవేశిస్తుంది కాలం కరిచిననాడుకథలో శ్వేత, ‘అంతా డబ్బులోనేకథలో త్రిపుర భర్తలు చనిపోయినపుడు కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలు పొందారు . అలాంటి అవకాశాలు లేకపోయినా  నా బ్రతుకు నీకు వద్దమ్మాకథలో గాయత్రి, ‘ఎవరుగీసిందీ నుదుటిగీత?’ కథలో శాంత ఇద్దరూ కూడా పెళ్ళయి భర్తలను పోగొట్టుకున్న తర్వాతనే పుట్టింటికి చేరి చదివి ఉద్యోగాలు చెయ్యటం గమనించవచ్చు.

            ‘మనీషిగా మారిన మనిషికథలో ఆరతి, తండ్రి అనారోగ్యం కారణంగా కుటుంబపోషణకై ఉద్యోగబాధ్యతలు చేపట్టిన విధం కనిపిస్తుంది. ఎదురుదెబ్బకథలో వర్ధని, ‘మనం మారేదెప్పుడుకథలో రూప ఇద్దరూ కూడా పెళ్ళయ్యాక భర్తచేతిలో మోసపోయి తర్వాత స్వయంకృషితో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఇది ప్రసంగం-అది ప్రపంచంకథలో వల్లభ, భర్త చెడు అలవాట్లను భరించలేక అతనిని వదిలేసి ఉద్యోగ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. త్యాగం-మోసంకథలో పార్వతి, ‘ఆడదంటేకథలో శాంత  సాగనిస్తే పై చెయ్యేకథలో అర్చన, ‘మనిషికోరేదికథలో శ్రావణి, ‘మరబొమ్మకాదు మనిషేకథలో ప్రేమ, ‘మీరు ఆలోచించండికథలో శిరీష అందరూ కూడా భర్తల వలన సమస్యలనెదుర్కొని ఉద్యోగ జీవితాలలోనికి ప్రవేశించినవారే.

             మొత్తం మీద సంసారాలు వదిలెయ్యాల్సిన పరిస్థితులలోనో భర్త మరణించినపుడు తమ బ్రతుకులు తాము బ్రతకటానికి ఉద్యోగాన్ని మార్గంగా ఎన్నుకొన్న స్త్రీలే మహాలక్ష్మమ్మ కథలలో ఎక్కువ. పెళ్ళిళ్ళలో కట్నం ప్రమేయం తెచ్చిపెట్టే అనర్థాలను కూడా మహాలక్ష్మమ్మ గుర్తించింది. కట్నం ఇవ్వటం కోసం పొలాలనమ్ముకొని, ఇల్లు తాకట్టు పెట్టుకొని అప్పుచేసి అవస్థలు పడ్డ ఆడపిల్ల తండ్రులను ఆమె అనేక కథలలో చూపించింది. కట్నం కోసం వెంపర్లాడే తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గే కొడుకులు దొంగబతుకు బతకాల్సి రావడాన్ని చెప్పటం ఆమెకథలలోని ప్రత్యేక లక్షణం.

            చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ప్రేమించిన స్త్రీని పెళ్ళాడాలనుకున్న మగవాడు ఆ విషయాన్ని ధైర్యంగా తల్లిదండ్రుల ముందర చెప్పటంకాని నచ్చచెప్పటంకానీ ఎక్కడాచెయ్యరు. ప్రేమించిన వాళ్ళను వదిలేసి కట్నంకోసం తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళిళ్ళకు ప్రతిఘటన లేకుండానే లొంగిపోతారు. అలాగని చేసుకున్నపెళ్ళిలో ఒదిగిపోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఒకవైపు సంసారాలు చేస్తూనే మరోవైపు ప్రేమించినవారితో రహస్య సంబంధాలను కొనసాగించడం అనేక కథలలో కనిపిస్తుంది. వాళ్ళు అటు భార్యను ఇటు ప్రేయసిని కూడా వంచించేవాళ్ళే, తమ స్వార్ధాన్ని చూసుకొనేవారే.       

            ‘తల్లిచాటుకథలో గోపాల్‍, సహోద్యోగి కుందనను ప్రేమించినప్పటికీ తల్లికోరిక మేరకు చెళ్ళెళ్ళ పెళ్ళికోసం కట్నం తీసుకొని రూపను పెళ్ళాడి బాధ్యతలు తీరాక మళ్ళీ కుందనతో సంబంధం కొనసాగిస్తాడు. ఎదురుదెబ్బకథలో మాధవ్‍ , అమెరికాలో పెళ్ళిచేసుకొని, కొడుకును కన్నాక కూడా కట్నంకోసం భారతదేశం వచ్చి తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళి చేసుకొని వర్ధనిని మొదటి భార్యకు పనిమనిషిగా తీసుకెళతాడు. త్యాగం- మోసంకథలో ఆనంద్‍ తల్లిదండ్రుల బలవంతం మీద పార్వతిని పెళ్ళాడి, తనతో సంసార సుఖానికి పనికిరానని అబద్ధం చెప్పి విడాకులిచ్చి ప్రేమించిన హేమను పెళ్ళి చేసుకుంటాడు.

            ఈ విధంగా పై కథలన్నింటిలో కూడా పురుషులు డబ్బుకోసం తల్లిదండ్రుల కోరికమేరకు ఒక పెళ్ళి చేసుకోవడం, తమకు నచ్చిన వారితో సంబంధాలు కొనసాగించటం కనిపిస్తుంది. ఇది పురుషుడి స్వార్ధం, అవకాశవాదం.    దీనిపట్ల స్త్రీల ప్రతిస్పందన ఏమిటి అన్నది ముఖ్యం. చాలావరకు మహాలక్ష్మి కథలు ఈ విధమైన పురుష ప్రవర్తన పట్ల నిరసనగా వాళ్ళతో సంబంధాలను వదులుకొనటం కనిపిస్తుంది. ఎదురుదెబ్బకథలో వర్ధని అవమానకర కుటుంబసంబంధాలలో ఉండటానికి ఇష్టపడక అమెరికా నుండి తిరిగి వచ్చేస్తుంది. తన జీవితాన్ని తాను నిర్మించుకుంటుంది. ఓ పుస్తే నీ విలువెంతకథలో కారుణ్య భర్త విషయం తెలిసి అతనితో సంబంధాన్ని వదులుకుంటుంది. రష్యన్‍ సీతకథలో మోహిని, రష్యాలో ఒక స్రీని ప్రేమించి తనను పెళ్ళాడటానికి సిధ్ధపడ్డ ప్రదీప్‍ సంగతి తెలిసి, నిశ్చితార్ధం జరిగినప్పటికీ అతనితో పెళ్ళికి నిరాకరిస్తుంది. అంటే రెండురకాల సంబంధాలు ఒకటి తనకోసం, ఒకటి కుటుంబం కోసం ఉంచుకొనటానికి సిద్ధంగా ఉన్న పురుష ప్రవృత్తిని చూపిస్తూనే దానిపట్ల స్త్రీల నిరసనను నమోదుచేయటం మహాలక్ష్మి కథలలో కనిపిస్తుంది.          భార్యాభర్తల సంబంధాన్ని చిత్రించిన కథలలో మహాలక్ష్మమ్మ చాలావరకు అవి అసమాన సంబంధాలుగా, అవమాన సంబంధాలుగా ఉండటాన్ని గుర్తించింది. భర్త అధికార ప్రవర్తన భార్య జీవితాన్ని హింసామయం చేయటంగా కనబడుతుంది.      

            ‘తొందరపాటుకథలో వరహాలు, ‘పాపంపండిన వేళకథలో అనిల్‍,  ‘ముసలిమొగుడు-పడుచుపెళ్ళాం’  కథలో దయానందం, ‘సాగనిస్తే పై చెయ్యేకథలో ప్రభు భార్యలను అనుమానించడం కనిపిస్తుంది. మనిషికోరేదికథలో సుకుమార్‍ , ‘నిలుపుకో నీ విలువకథలో యాదవ్‍, ‘మరబొమ్మ కాదు మనిషేకథలో శ్రీకాంత్‍ , ‘ అతి వినయంకథలో గోపాల్‍ వంటివారు భార్యలను సూటిపోటీ మాటలంటూ మానసికంగా వేధించటం కనిపిస్తుంది. ఇలాంటి వారు ఉంటారుకథలో రవి, ఆర్థిక పరిస్థితికి విసిగిపోయి దాన్ని భార్యపై చూపించిన విధం, ‘నాకీడబ్బొద్దు కథలో నితిన్‍, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడానికి కారణమైన భార్యను చివరకు ‘‘నీవేంచేసావు?’’ అనే స్థితికి దిగజారిన వైనం కనిపిస్తుంది. ఎవరు విధించిన శిక్షకథలో హేమంత్‍, తన ఉన్నత స్థితికి కారణమైన భార్య, కాలిగాయాలపాలై అందవికారంగా తయారైతే ఆమెను వదిలేసి తన పి.ఎ. శిరీషను పెళ్ళాడి మానసికంగా హింసించిన విధం చూడొచ్చు. రాబందులుకథలో గోపాలం, ‘ఇదీ నా విధేకథలో గోపాల్‍ చెడు అలవాట్లకు బానిసై భార్యలను తిట్టి, కొట్టిన విధం కనిపిస్తుంది. మనం మారేదెప్పుడుకథలో  సుకుమార్‍, ‘నాకు చావాలని లేదు డాక్టర్‍ కథలో వినోద్‍, ‘భగ్గుమన్న నిప్పురవ్వకథలో చరణ్‍ భార్యలను కొట్టడం కనిపిస్తుంది. ఇంతకన్నా దిగజారి మీరేమంటారుకథలో సతీష్‍, ‘చావుపెళ్ళి- పెళ్ళిచావుకథలో రామారావు, ‘తండ్రులకో కథలో గిరీష్‍ ఆస్తికోసం, కట్నంకోసం భార్యలను చంపిన విధం కనిపిస్తుంది.

            భార్యాభర్తల సంబంధాలలోని ఈ హింస అంతా అధికార ప్రకటనలో ఒక భాగమే. స్త్రీ శీలాన్ని శంకించటం భావోద్వేగాల పరమైన హింస అయితే శారీరకంగా హింస  భౌతికమైనది. శారీరక హింసను ధిక్కరించటానికి హింసామయ సంబంధాలనుండి బయట పడటానికి స్త్రీలు చేసిన కొద్ది ప్రయత్నాలైనా, మహాలక్ష్మి కథలలో కనిపిస్తాయి. నాకు చావాలని లేదు డాక్టర్‍ కథలో రజని, ‘మనం మారేదెప్పుడుకథలో రూప అలాంటివారే. కాని విచిత్రంగా మహాలక్ష్మమ్మ కథలలో లైంగిక అవమానాలకు గురయిన వాళ్ళు ఎవరూ వాటిని అవమాన సంబంధాలుగా గుర్తించినట్లు కనపడదు. కనుకనే బయటపడే ప్రయత్నాలు కూడా ఆ పాత్రల నుండి ఆశించలేం ముసలి మొగుడు-పడుచు పెళ్ళాంకథలో మాలతి ఇందుకు నిదర్శనం. దీనికి మినహాయింపు పాపం అనూప్‍’. ఈ కథలో పెళ్ళికి ముందే తన మిత్రుడిని ఉపయోగించుకొని కాబోయే భార్య శీలాన్ని పరీక్షకు పెట్టాడు అనూప్‍. ఆ విషయం తెలిసి వైశాలి దానిని అవమానంగా భావించి అతనితో పెళ్ళిని తిరస్కరించడం ఇందులోని విశేషం.

            సమకాలీన స్త్రీల కథలలో స్త్రీవాద రాజకీయ కోణం నుండి లైంగిక వివక్ష కుటుంబ హింస ఉత్పత్తి, పునరుత్పత్తి సంబంధాలు చర్చించబడిన విధంగా కందుకూరి వెంకట మహాలక్ష్మి  కథలలో కనిపించవు. అయినప్పటికీ కుటుంబ సంబంధాలు స్త్రీపురుష సంబంధాలు సవ్యంగాలేవని మాత్రం ఆమె కథలు చెబుతాయి. అవి చక్కదిద్ధుకోవలసినవి అన్న సూచనను ఇస్తాయి.

            పునరుత్పత్తి రాజకీయాలసారాన్ని స్త్రీవాద కోణం నుండి ఆమె అర్థం చేసుకోలేకపోయిన పునరుత్పత్తి సంబంధాలలోని బాధను, భయాన్ని గుర్తించడం మాత్రం కనిపిస్తుంది. వింత కోరికకథ ఇందుకు మంచి ఉదాహరణ. ఆరోగ్యకరమైన యవ్వనం ఉండికూడా నీరజ పెళ్ళికి అంగీకరించకపోవడంలో గర్భధారణ గురించిన భయం కారణం కావడం గమనించవచ్చు.

            సామాన్య లౌకిక జ్ఞానం నుండే అయిన కుటుంబ సంబంధాలలోని అనేక వికృతులను బయటపెట్టడం ద్వారా కందుకూరి వెంకట మహాలక్ష్మి కథలు ఒక మేరకు అభ్యుదయకరమైనవే.

                                                        (((---0---)))

 

 

 

 

 

ఆచార్య సి.ఆనందారామం సంస్మరణలో... 

‘నీవు ఏదైతే ఆదర్శం అనుకుంటావో దాని ప్రకారం నువ్వు బ్రతకగలిగితే అదే నీ విజయంఅంటుంది’ ఆచార్యసి. ఆనందారామం. (You Tube – i Dream Telugu Movies - AksharaYaatra - Interview)తన జీవితం తొలినాళ్లలో అలాంటి పరిస్థితులు తనకు ఎదురుకాలేదని, తనలో తాను ఘర్షణపడుతూ, వాటిని కథావస్తువులుగా తీసుకొని రచనలు చేసానని అంటుంది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయని ఈనాటి మహిళ తాను అనుకున్న విధంగా జీవిస్తుందని సంతోషపడింది.

ఆనందారామం అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్య దంపతులకు పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో 1935 ఆగస్ట్ 20వ తేదీన జన్మించింది.అక్కడే ప్రాథమికవిద్యను అభ్యసించింది. ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాక 1957లో చిలకమర్రి రామాచార్యులుతో వివాహం జరిగింది. తన చిరునామా హైద్రాబాదుకు మారింది.  ఉస్మానియావిశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు పూర్తి చేసింది.  డా.సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో " తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ " అనే అంశంపై పరిశోధన చేసి Ph.D.పట్టా పొందింది. 1972లోకేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరి 2000లో పదవీ విరమణ చేసింది.

అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా ప్రసిద్ధులైన ఆనందారామం తపస్వి, ఇంద్రసింహాసనం, శారద, ఆనందనిలయం, స్వాతిజల్లు, తుఫాను, తపస్వి, నిశ్శబ్దసంగీతం, వర్చస్సుమొదలైన అరవై నవలలనూ, ఎన్నెన్నోకాంప్లెక్సస్, డోలిక, దశావతారాలు, పోనీ నేను వ్రాసిపెట్టనా! అనే కథాసంపుటాలను, వందకుపైగా కథలను రాసింది.

తెలుగు నవలావిమర్శ, సాహిత్యమునవలాప్రక్రియ, సమాజసాహిత్యాలు, తులనాత్మక సాహిత్యం - నవలాప్రక్రియ: వ్యవస్థాగత దృక్పథం అనే విమర్శగ్రంథాలను రాసింది.

ఈమె రాసిన జాగృతి నవలను త్రిశూలం సినిమాగా, మమతలకోవెల నవలను జ్యోతి సినిమాగా తీశారు. ఆత్మబలి అనే నవల సంసారబంధం సినిమాగా వచ్చింది. అదే నవల జీవనతరంగాలు టి.వి.సీరియల్లా కూడా వచ్చింది. తన నవలలోని పేర్లన్నీ(సౌందర్య, వామన విక్రమార్కుడు మొదలైన) ప్రతీకాత్మకంగా పెడుతుంది రచయిత్రి.

ప్రాచీన సాహిత్యగ్రంథాలను చదవడమేకాకుండా వాటిని తిరిగి ఆధునికప్రక్రియల ద్వారా పాఠకులకు అందించడం ఆనందారామం నవలల్లోని ప్రత్యేకత. సాంప్రదాయకుటుంబంలో జన్మించినప్పటికీ సృజనాత్మకరచనల్లో ఆమె అభ్యుదయభావజాలాన్నిప్రదర్శించింది.

ఆనందారామం గృహలక్ష్మి స్వర్ణకంకణము, మాలతి చందూర్ స్మారక పురస్కారాన్నిపొందింది. మాదిరెడ్డి సులోచన, సుశీలనారాయణరెడ్డి, గోపిచంద్, తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలను, ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ అవార్డునూ అందుకుంది. తెలుగు చలన చిత్రసెన్సార్బోర్డు సభ్యురాలిగా అనేక సంవత్సరాలు పనిచేసింది. అటు సాహిత్యరంగంలో, ఇటు సినీ రచనారంగంలో నూతనదైన ముద్రను వేసింది. తాను స్వీయచరిత్ర రాసుకుంటే దాని పేరు "వైరిసమాసం" అని పెడతానని అంటుండేది  రచయిత్రి.

ఈ మధ్యనే అనగా 2021 ఫిబ్రవరి 10వ తేదీన చనిపోయింది.

ఆనందారామం రాసిన నవలల్లో మహిళాసమాజం ఒకటి. ఇది 1975 నవంబరులో ప్రచురణఅయ్యింది. ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళాసంవత్సరంగా ప్రకటించింది. సమానత్వం, అభివృద్ధి, శాంతి అనే సూత్రాల ప్రాతిపదిక మీద సదస్సు నిర్వహించింది. కాబట్టి రచయిత్రిపై దీని ప్రభావం ఉందని అనుకోవచ్చు.

ఈ ప్రభావం నుండే నవలలోని ప్రధానపాత్ర సుధీర పాత్ర రూపొందింది. ఆలోచనలు, చైతన్యము కలిగి కదులుతున్నటువంటి స్త్రీ. తన తల్లి జానకి, తండ్రి మాధవయ్య. సుధీర పేరుకు తగినట్లుగానే ధీరత్వం కలిగిన స్త్రీ. ఆ ధీరత్వం ఆమెకు రావడానికి గల కారణం తన తల్లే. ఎందుకంటే జానకి బహిష్కృత, తిరస్కృత. తండ్రి మాధవయ్య ఊరివాళ్ళ మాటలు విని, అక్రమ సంబంధం అంటగట్టి తల్లిని అనుమానించి, అవమానించి ఇంటినుండి బయటకు వెళ్ళగొడతాడు. కొడుకుని తన దగ్గరే ఉంచుకొని తనను వెళ్లగొట్టిన భర్తను నిలదీయక, అధైర్యపడకుండా బయటకువచ్చింది, అప్పుడప్పుడే స్త్రీలు తమ వ్యక్తిత్వాల కోసం ఒంటరిగా బయటకువస్తున్నరోజులవి. కడుపులో పెరుగుతున్న బిడ్డను కన్నది. ఏదో ఒకపని చేస్తూ తన బ్రతుకు తాను బ్రతికింది, పిల్లను పెంచుకుంది. కూతురి దగ్గర సంగతులేమి దాచలేదు.

ఆ పిల్లకూడా దేనికి భయపడకుండా పెరిగి వ్యక్తిత్వంతో బ్రతకాలనుకుంది. హైద్రాబాదులో పుట్టి, పెరిగి, అక్కడే చదువుకున్నసుధీర, తల్లి ఆవేదన తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసం మరీ అంత పల్లెటూరు కాని ఊరిలో ఉండే మహిళామండలికి సెక్రటరీగా వెళ్తుంది. అక్కడ ఆడంబరాల ప్రదర్శనకు, డాబుకోసం పాకులాడే మహిళామణుల మధ్య తామరాకుపై నీటిబిందువులా ఉంటూ తాను వచ్చినపని చూసుకునేది.

ఇక సుధీర విషయానికి వస్తే తనతండ్రి ఇంటికే పరాయిదానిలా అద్దెకు వెళుతుంది. పట్నం వదిలి ఊరుబాట పట్టింది. సమాజానికి భయపడకుండా తనను వేశ్య అని, వేశ్యకూతురని, అందరిని చెడగొట్టుతున్నదని చులకన చేసిన, లెక్కచేయకుండా  తాను అనుకున్నపని చేయగలిగింది. సవతితల్లి కింద అనేక అవమాలను ఎదుర్కొని ఏమి అనలేక చెడు అలవాట్లకు మరిగి, రోగగ్రస్తుడైన అన్నను తిరిగి మాములు మనిషిని చేస్తుంది.

కష్టాల్లోఉన్నవారిని ఆదుకుంటూ, ఇతరుల నుండి తనను తాను కాపాడుకుంటూ జీవితాన్నిసంతోషమయం చేసుకుంది సుధీర. తనను అభిమానించే ధనవంతుడైన రావు సహాయంతో వేశ్యల జీవితాలను బాగుచేసింది. అన్నప్రయోజకుడయ్యాక తండ్రి మరణాంతరం అతనికి కోరుకున్నఅమ్మాయితో వివాహంకావడానికి కారణభూతమయ్యింది. స్త్రీజాతి క్షేమం కోసం నడుంకట్టి పనిచేసింది. చివరకు తనను ఇష్టపడ్డరావుని తన ఇష్టంతో పెళ్లిచేసుకుంది.

నీవు నిజంగా నీ కోసమే బ్రతుకు, సమాజం కోసమో, వేరే ఎవరి కోసమో నీ జీవితాన్నివదులుకోకు, నీవు నీలా బతకడమేనీ విజయం అన్నరచయిత్రి మాటలు ఈ నవలలోని సుధీర పాత్రకి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటేతనుఎవరెన్నిమాటలన్నావాటినికనీసంపట్టించుకోలేదు. రావుతో బయటకు వెళ్ళినపుడు సమాజం నీవు చెడ్డదానివని కోడైకూసింది. అయినా పట్టించుకోలేదు, ఎక్కడ తను ధైర్యాన్నిపోగొట్టుకోకుండా ఇంకా మహిళా మండలి సభ్యుల్లో మార్పును కోరుకుంది, మార్చడానికి ప్రయత్నించింది కూడా. తనకు వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేసింది. తన తల్లిలాగా తను సర్దుబాటు అయి బతకాలనుకోలేదు. అన్యాయాన్నిఎదిరించి బతకాలనుకుంది.

అయితే ఈ రకంగాఎన్నోవిధాలుగా నవలలు, కథలు రాసిన ఆనందారామం సాహిత్యాన్నిమనం ఇంకా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఈ కాలానికి ఎలా తగినవి? వాటికున్నపరిమితులేమిటివాటికున్నఆకాంక్షలేమిటి? అనే ధోరణిలో మనం చదవాల్సి ఉంది. స్త్రీలకు సంబంధించిన చైతన్యాన్ని ఆమె ఏమి ఇచ్చిందని తెలుసుకోవడమే మనం ఆమెకిచ్చే నివాళి.

                                                                      

 

 

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు