మా రచయితలు

రచయిత పేరు:    కళ్యాణి యడవల్లి

కథలు

కొంచెం టైం ఇవ్వాలి కదా!!

నాన్న నిన్నిలా ఎప్పుడైనా ఇన్సల్ట్ చేశారా అమ్మాఅని వైష్ణవి అడుగుతుంటే నవ్వొచ్చింది. ఈ కూతుళ్ళు, భార్య విషయానికి వచ్చినప్పుడు, నాన్న కూడా ఒక మామూలు మగాడే ఆన్న విషయం నమ్మటానికి కూడా యిష్టపడరు ఏమిటో అనుకున్నాను. నా కూతురు, అల్లుడు సాఫ్ట్ వేర్ లో పని చేస్తున్నారు. ఈ కరోనా, లాక్ డౌన్ వల్ల ఇద్దరూ ఇప్పుడు ఇంట్లో నుండి పని చేసుకుంటున్నారు. నిన్న పొద్దున్నే ఇక్కడకు వచ్చేసింది వైష్ణవి. వచ్చిన దగ్గర నుండి అల్లుడు మనీష్ తనకి ఎలా తగనివాడో, వాళ్ళ నాన్నలా మంచిగా ఎలా ఉండడో చెప్తూ, అవసరమైతే విడాకులు తీసుకుంటా అన్నట్లు మాట్లాడుతోంది. వైష్ణవి తెలివి తక్కువది కాదు కొంచెం కోపం ఎక్కువ. స్కూల్ లో, కాలేజీ లో టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఈ తరం పిల్లల్లాగే, చిన్నప్పటి నుండి తనకొక లక్ష్యం ఏర్పరచుకుంది. అది సాధించింది. ఏ రోజూ తనకి నేను సలహా ఇవ్వవలసిన అవసరం రాలేదు. నా వైపు నుంచి తనకు నేను చేసింది ఏదన్నా ఉంది అంటే, ఇంట్లో మంచి వాతావరణం ఎప్పుడూ ఉండేలా, మా భార్యాభర్తల గొడవల్ని పడకగది దాటి బయటకు రానివ్వకపోవటం. అందుకే తన తండ్రి చాలా మంచి భర్త అని అది అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

నాకు తెలిసి అల్లుడు చెడ్డవాడు కాదు. ఈ కరోనా వలన జీతం తగ్గిందని, ఉద్యోగం మారే ప్రయత్నాల్లో ఉన్నాడని, ఈ సమయంలో అది కూడా అంత తేలికగా అయ్యేపని కాదని ఒకసారి వైష్ణవి చెప్పింది. వాళ్ళ గొడవలకి ఈ చిరాకులు కూడా కారణం అయ్యి ఉంటాయి. అది చెప్తున్నది వింటూ ఏమి జరిగి ఉంటుందో ఊహించటానికి ప్రయత్నిస్తున్నాను. విడాకుల విషయం అది ప్రస్తావించినా నాకేమీ భయం వేయలేదు. దాని తెలివితేటలు, విచక్షణ మీద నాకు నమ్మకం. అయినా తరతరానికీ అంచనాలు, విలువలు, మంచీ, చెడూ మారుతూ ఉంటాయి కదా అందుకే నేనేమీ సలహా ఇవ్వట్లేదు. అదెప్పుడూ మనసుతో మాత్రమే కాదు, మెదడుతో కూడా ఆలోచిస్తుంది. ఈ సమస్య నుండి తేలికగా బయటపడుతుందని నాకు తెలుసు. కాబట్టే వాళ్ళ నాన్నకి కూడా ఏమీ చెప్పలేదు నేను.

ఇన్నేళ్ల నుండీ వంట చేస్తున్నావు. ఉప్మాలో నీళ్ళు ఎన్ని పోయాలో మాత్రం నీకు తెలియదు. గ్లాస్ లో పోసియ్యి తాగుతానువెటకారంగా అంటున్న తండ్రిని మొదటిసారి చూస్తున్నట్లు తెలియని భావంతో చూసింది వైష్ణవి. పెళ్లి కాకముందు తండ్రితో పాటు అదీ నవ్వేది. ఎక్కడో గుచ్చుకున్నట్లు ఉన్నా నేను వాళ్ళతో పాటు నవ్వేసేదాన్ని. ఇప్పుడు మాత్రం దాని మొహమే చూశాను. నా కళ్లలోకి చూడలేక కళ్ళు దించేసుకుంది. మొన్న అదేదో వంట పాడు చేసినప్పుడు అల్లుడు చేసిన వెటకారం గుర్తొచ్చి ఉంటుంది. అప్పుడు కూడా ఫోన్ చేసి ఏడ్చేసింది. వెనక నుండి అమ్మలూ సారీ, సారీ అంటూ అల్లుడి మాటలు కూడా ఆ రోజు నాకు వినిపించాయి. మా ఇంట్లో వెటకారాలని, తిట్లని ఫాలో అవుతూ సారీలు వినిపించవని ఈ మధ్య గమనిస్తూ ఉండే ఉంటుంది.

ఈయనను ఆఫీసుకు సాగనంపి, “కాఫీ తాగుతావా వైష్ణవీఅని నేను అడుగుతున్నా పట్టించుకోకుండా టీవి మీద దృష్టి పెట్టిన వైష్ణవిని చూసి నవ్వుకున్నాను. కళ్ళు ఇక్కడ, ధ్యాస తన ఇంట్లో ఉండి ఉంటుందని అర్ధం అయింది. అంట్లు సర్దేసి జ్యోతి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. జ్యోతి మా ఇంట్లో పని చేసే పిల్ల. మహా మాటకారి, ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది. పాపం కరోనా వాళ్ళ బుజ్జి సంసారాన్ని కూడా బాగానే కష్టపెట్టింది. వాళ్ళ ఆయన పని చేసే హోటల్ మూసేశారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఈ పిల్లే నాలుగు ఇళ్ళల్లో పని చేస్తూ, ఏవో చిన్న చితకా పనులు చేస్తూ నెట్టుకొస్తోంది. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేది కాదు. ఈ మధ్య తరచుగా ఆలస్యంగా వస్తోంది.

ఆలోచనలో ఉన్న నేను అంట్ల చప్పుడుకి ఉలిక్కిపడ్డాను. జ్యోతి అంట్లు తోముతోంది. వైష్ణవి ఆ పక్కనే తిరుగుతూ ఉంది. గలగల మాట్లాడే పిల్ల అసలేమీ మాట్లాడట్లేదు. ఏమైంది జ్యోతిఅని అడిగాను. జ్యోతి మళ్ళీ రాము ఏమైనా గొడవ చేస్తున్నాడా? నిన్నేమన్నా పోషిస్తున్నాడా ఏమిటి. ఇంట్లో నుంచి బయటకి పొమ్మను. తిక్క కుదురుతుందిఅంది వైష్ణవి. అదేం లేదక్కా. ఈ మధ్య లాక్ డౌన్ అప్పుడు ఇంట్లోనే ఉన్నాము కదా ఇద్దరమూ. డబ్బుల ఇబ్బంది, పని దొరుకుతుందో లేదో అనే భయం. ఇదే కాకుండా ఎప్పుడూ ఒకరికొరము ఎదురుగా కూర్చోకూడదు అక్కా. మరీ ఎక్కువ దగ్గరగా ఉన్నా ఒకళ్ళంటే ఒకళ్ళకి విసుగు వస్తుంది. దానితో గొడవలు. లాక్ డౌన్ తర్వాత తన ఉద్యోగం పోయింది. అదొక బాధ. ఆ విసుగంతా నా మీదనే చూపిస్తున్నాడుఅంది. అదే చెప్తున్నాను. ఇంట్లోనుంచి పంపించు. తెలిసి వస్తుంది. ఫ్రస్ట్రేషన్ చూపించటానికి నిన్ను ఔట్లెట్ లా వాడుకుంటాడా, అహంకారం కాకపోతేఅంది వైష్ణవి.

చేతులు తుడుచుకుని నేనిచ్చిన కాఫీ తాగుతూ నవ్వేసింది. పురుషోత్తమ్ అయ్యగారితో మాట్లాడాను అమ్మా. వాళ్ళ కారుకి డ్రైవర్ కావాలట. రేపటి నుండే రాముని రమ్మన్నారు. పనిలో పడితే అన్నీ సర్దుకుంటాయి. మనసు కుదురుకోవడానికి, ఉద్యోగంలో కుదురుకోవడానికి రాముకి కూడా కొంచెం టైమ్ ఇవ్వాలి కదాఅంది. దాని ఆత్మ విశ్వాసాన్ని, సమస్యని అనలైజ్ చేసిన తీరుని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది.

సాయంత్రం మొక్కల దగ్గర కూర్చుని టీ తాగుతుంటే, వైష్ణవి వచ్చింది. అమ్మా రేపు నేను ఇంటికి వెళ్తాను, మనీష్ కి కూడా మనసు, ఉద్యోగం కుదురుకోడానికి కొంచెం టైమ్ ఇవ్వాలి కదాఅంది చిన్నగా నవ్వుతూ. నేనేమీ సలహా ఇవ్వలేదు, ఈ సమస్య నుంచి అది తేలికగా బయటపడుతుందన్న నమ్మకం నాకు ఉంది. 

 

 

అనుబంధాలు 

మీ అక్క ఊర్లోకి వచ్చారటండీ. బజారులో రవి కనపడి చెప్పాడుఅనిత  చెప్తుంటే అభావంగా వింటూ ఆహాఅన్నాను. ముఖంలో భావాలు పసికడితే ఎప్పుడూ డబ్బుల గురించే కాదు, బంధాలు, బాధ్యతల గురించి కూడా ఆలోచించాలిఅంటూ మళ్ళీ నాకు పాఠాలు చెప్పటం మొదలు పెడుతుంది. ఆ మాటల్లో నిజాలు కాదనలేను, అవుననే పరిస్థితి లేదు అందుకే మౌనం వహించటం ఉత్తమం అని ఊరుకున్నాను.

మౌనంలో భావాలు అనితకి బాగా అర్ధం అవుతాయి. అందుకే తానూ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అక్క... పోయిన నాన్నా, అమ్మల గుర్తుగా నాకు ఈ లోకంలో మిగిలిన ఒకే ఒక బంధం. నా కన్నా పది, పన్నెండు సంవత్సరాలు ముందు పుట్టింది. రక్త సంబంధం అయినా ఆర్ధిక అసమానతల ముందు నిలబడలేదు అని అక్కను చూసే నేర్చుకున్నాను. 

నాన్న ఆ రోజులలో అక్కకి వైభవంగా పెళ్లి చేశారు. అప్పులే తెచ్చారో, ఆస్తులో అమ్మారో తెలిసే వయసు నాకు లేదు, తెలుసుకోవాలనే ఆలోచన పెళ్లి వయసులో ఉన్న అక్కకి రాలేదనుకుంటాను. కాన్వెంట్ లో చదివే నా చదువు ప్రభుత్వ బడులలోకి ఎలా వచ్చిందో, ఇంజనీరింగ్ చదవాలనే ఆశ కనీసం డిగ్రీ పూర్తవుతే చాలనే నిరాశగా ఎప్పుడు మారిందో తెలియనే లేదు.

తెప్పరిల్లేసరికి, అమ్మ, నాన్న గోడ మీద చిత్రాలుగా, అక్క అక్కడ అమెరికాలో, ఇక్కడ నేను అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లల సంసారాన్ని ప్రైవేట్ ఉద్యోగంతో ఈదుతూ మిగిలిపోయాము. ఎప్పుడైనా ఊరికి వస్తే అక్క వాళ్ళ అత్తగారి ఇంట్లోనే దిగుతుంది ఇంటికి అలా వచ్చి ఇలా వెళ్తుంది, అక్కడ నుంచి తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు పిల్లలకి ఇస్తుంది.

అక్క బాగున్నందుకో, నేను బాగా లేనందుకో తెలియదు, అక్క వస్తే ఏదో తెలియని బాధ. అనితకి మాత్రం ఇవేం పట్టవేమో. అక్క ఊరిలోకి వచ్చిందని తెలిస్తే చాలు ఇంట్లో పిండి వంటలు, చెయ్యటం మొదలు పెట్టేస్తుంది. ఆవిడ ఇంటికి వచ్చి ఉండే పది నిమిషాలలోనే సకల మర్యాదలూ చేసి చీర సారెలు, పిండి వంటలు, పచ్చళ్ళు ఇచ్చి పంపిస్తుంది. అక్క వచ్చిందంటే అనిత  చేసే హడావుడి అంటే నాకు భయం. ఆ నెల మళ్ళీ లోటు బడ్జెట్తో మిగిలిపోవాలని. అనిత  మాత్రం పుట్టింటికి వస్తే ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అంటుంది. చెప్పద్దూ అందరి భార్యల్లా నా భార్య గయ్యాళిలా, అసూయతో ఎందుకుండదు అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. ఇప్పుడు మళ్ళీ నాకు ఖర్చు…. అనుకుంటూ కుర్చీలోంచి లేచాను.

ఆఫీస్ లో పరధ్యానంగా, యాంత్రికంగా పని చేసుకుంటుంటే అనిత  ఫోన్. సాయంత్రం అక్క వస్తారట తొందరగా రండి అని. రెండు రోజులుగా ఇంట్లో పచ్చళ్ళు, పిండి వంటల వాసనలు వస్తూనే ఉన్నాయి. అక్క కోసం పక్కింట్లో వాయిదాల మీద తెచ్చిన, నా జీతంలో సగం ఖరీదు చేసే చీరని కూడా నా కళ్ళు చూసి గుండెని ఓదార్చాయి. నిట్టూరుస్తూ లేచాను పర్మిషన్ తీసుకోటానికి.

ఇల్లు చేరే సరికి అక్క వచ్చి ఉంది. ఏరా ఎలా ఉన్నావు అంటూ పలకరించింది. ఇల్లంతా చూస్తూ దరిద్రాన్ని కొలుస్తున్నట్లు అనిపించింది. అనిత  మర్యాద చెయ్యటంలో మునిగిపోయింది. అక్క కబుర్లు మాత్రం బాగా చెప్తుంది గలగలా.  అలా వింటూ కూర్చున్నాను.

ఇంతలో ఇంటి యజమాని వచ్చాడు. ఇల్లు అమ్మాలనుకుంటున్నాను, మీరు ఖాళీ చెయ్యాల్సి ఉంటుంది అని చెప్తుంటే గుండెల్లో రాయి పడింది. అక్క ముందు తల కొట్టేసినట్లు అయ్యింది. అన్నిటికి సౌకర్యంగా, దాదాపు పెళ్ళైనప్పటి నుంచి ఉంటున్న ఇల్లు. పిల్లల చదువులు, డబ్బు సర్దుబాటు, ఇల్లు మారటంలో కష్టాల గురించి అనిత చెప్తుంటే అక్క ముభావంగా టక్కున లేవటం చూసి ఎక్కడో చివుక్కుమంది. అక్క బయలుదేరుతుంటే కారు శబ్దం కంటే, బంధాల దారప్పోగు తెగిపోతున్న చప్పుడు గట్టిగా వినిపించింది.

అక్క వెళ్లిన మూడు, నాలుగు రోజుల తరువాత ఇంటికి రాగానే అనిత  ఏదో కవర్ తెచ్చి ఇచ్చింది. తెరిచి చూస్తే  ఉత్తరం. " తమ్ముడూ , నా తమ్ముడికి సహాయం చెయ్యండి అని నా భర్తని అడగటానికి అహం అడ్డం వచ్చింది ఇన్నాళ్లు. ఇంటికొచ్చి వెళ్ళినప్పుడల్లా బాధతో వెళ్లేదాన్ని. మీకు భారమేమో అని ఎప్పుడూ పట్టుమని నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండలేకపోయాను. నాన్న పెళ్లి కానుకగా పసుపు, కుంకుమ కింద నాకు ఇచ్చిన స్థలం అమ్మటానికి వచ్చాము ఇప్పుడు. అంటే ఇది అచ్చంగా నా  డబ్బు. డబ్బు పంపిస్తున్నాను. అనిత పేరున ఇల్లు కొను. పుట్టింట్లో ఇప్పుడు నాకు ఉన్న అమ్మకి ఇంతకంటే ఏం చెయ్యాలో నాకు తోచలేదు. ఆశీస్సులు".  నాలుగే నాలుగు ముక్కలు ఉత్తరంలో.  అభావంగా ఉండటం బహుశా మా కుటుంబ లక్షణమేమో. అక్క ఎప్పుడూ ఏ భావాలు ముఖంలో చూపించలేదు.

తలెత్తి చూస్తే అనిత  నన్నే చూస్తోంది. నా మొహంలో ఆనందం, ఆశ్చర్యం, అపనమ్మకం లాంటివి ఏవైనా ఇప్పుడైనా కనిపిస్తాయేమో అని.  క్షేమంగా చేరానని అక్క ఫోన్ చేసిందాఅని ఎన్నడూ లేని విధంగా నేను అడుగుతుంటే నా గొంతు నాకే కృతకంగా వినిపించింది. నవ్వుతున్నాయో, ఎగతాళి చేస్తున్నాయో తెలియని అనిత  కళ్ళల్లోకి చూడలేక నేనే కళ్ళు దించేసాను.

 

 

పసి మనసు 

సుధకి చిరాకుగా ఉంది. వారం నుంచి కూతురు తలనొప్పిగా తయారయింది. ఐదు వేల రూపాయలు కావాలని ఏడుస్తోంది. ఐదవ తరగతి  చదివే పిల్లకి వేల రూపాయలతో అవసరాలు ఏముంటాయి. స్నేహితుల దగ్గిర ఏవో కొత్త బొమ్మలు చూసి ఉంటుంది వాటి కోసం ఏడుస్తూ ఉన్నట్లుంది అని పట్టించుకోలేదు. వారం నుంచి తనకూ సమయం ఉండట్లేదు. తమ మహిళా సంఘం తరఫున చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో హడావుడిగా ఉంది. మంత్రులతో సమావేశాలు, సభలు, మీడియా సమావేశాలు ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు.

సుధకి కోపంగా ఉంది. అలా అని కూతురికి తానేమీ తక్కువ చేయదు.మంచి స్కూల్ లో చదివిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఎలా చదువుతుందో చూస్తుంది. పాఠాలు చెపుతుంది. టెస్ట్స్ ఉంటే హెల్ప్ చేస్తుంది. బొమ్మల దగ్గర నుంచి బట్టల వరకూ, బిస్కట్ల దగ్గర నుంచి బిర్యానీ వరకూ అన్నీ చూస్తుంది. నలుగురికి సహాయం చేయాలనే తన ఆశయం వలన ఈ మధ్య కొద్దిగా బిజీగా తిరుగుతోంది.

సుధకి సందేహంగా ఉంది. ఈ మధ్య కూతురికి తనకి ఎందుకో దూరం పెరిగినట్లు అనిపిస్తోంది. దానికి భర్తే కారణమా అని కూడా ఎక్కడో ఒక మూల అనుమానంగా ఉంది.. కూతురిని మరీ గారాబం చేస్తున్నారు ఈ మధ్య. తాను బయటికి వెళ్తుంటే చాలు నోటితో వద్దనరు కానీ తన ఫీలింగ్స్ అలాగే కనిపిస్తాయి మొహంలో. టీవీలో కనబడి, పేపర్లో ఫోటోలు పడితే తనకి కూడా గొప్పే కదా. సొసైటీ లో ఎంత పేరు. అర్ధం చేసుకోరు.

సుధకి గందరగోళంగా ఉంది. నిన్నటికి నిన్న అనాధ శరణాలయానికి విరాళాలు ఇచ్చినందుకు తమ మహిళా సంఘానికి కృతఙ్ఞతలు చెప్తూ ఒక కార్యక్రమాన్ని పెట్టారు. మీడియా కవరేజ్ కూడా ఉంది. వెళ్లే సమయానికి కూతురు మొదలు పెట్టింది. స్కూల్ కి వెళ్లనని, టీవీ వాళ్ళని కెమెరాలు తీసుకొని ఇంటికి రమ్మను అని. చిరాకు వచ్చి చెయ్యి చేసుకుంది కూతురి పైన మొదటిసారి. ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అర్ధం కావట్లేదు. సైకియాట్రిస్ట్ కి చూపించాలా అని సందేహం వస్తోంది.

సుధకి విసుగ్గా ఉంది. కూతురు ఏమి చేస్తోందో చూద్దామని వెళ్ళింది. తండ్రికి అంటుకుపోయి కూర్చుని ఉంది. తల నిమురుతూ ఆయన అడుగుతున్నారు ఏమయిందమ్మా అని. వెంకట్ ని టీచర్ కొడుతున్నారు నాన్నా. స్కూల్ కి రావద్దంటున్నారు. మమ్మీ వల్లనే కదా అంటోంది. నేనేమి చేశాను మధ్యలో. వెంకట్ తమ వాచ్ మ్యాన్ కొడుకు. ఆరు నెలల క్రితం తనకి సన్మానం జరుగుతున్నప్పుడు స్టేజి పైననే అందరిలో చెప్పి వాడిని కూడా తన కూతురు చదువుతున్న స్కూల్ లోనే డబ్బులు కట్టి మరీ చేర్పించింది. వెంకట్ అమ్మా, నాన్న వద్దమ్మా అన్నా తాను వినలేదు. అందరూ ఎంత మెచ్చుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఏమి అయింది?

సుధకి గిల్టీగా ఉంది. కూతురు మాటలు విన్నప్పటి నుంచి. మొదటిసారి ఫీజు కట్టింది కానీ తరువాత టర్మ్ ఫీజు కట్టకపోవటంతో వెంకట్ ని కొడుతున్నారట. స్కూల్ కి రావద్దంటున్నారట. టీవీ వాళ్ళు ఉంటేనే మమ్మీ డబ్బులు ఇస్తుంది డాడీ అందుకే కెమెరా వాళ్ళని ఇంటికో, స్కూలుకో తీసుకురా డాడీ అని కన్నీళ్లతో అది చెప్తుంటే సుధకి ......నిజంగానే చాలా గిల్టీగా ఉంది.

 

బ్రతుకు చిత్రం 

ఆసుపత్రి వరండాలో కూర్చుని ఉన్న సుగుణమ్మకి కాళ్ళు వణుకుతున్నాయి. గుండే వేగంగా కొట్టుకుంటోంది. కూతురు. అల్లుడు లోపల ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడుతున్నట్లున్నారు. వాంతులు చేసుకునే వాళ్ళు, పడిపోయిన వాళ్ళు రకరకాల వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. భయం కూడా ఎక్కువైపోతోంది. కొడుకు ఇంకా రాలేదు. పొద్దున్నే కొడుకుకి ఫోన్ చేసి చెప్పినట్లున్నాడు అల్లుడు. అదృష్టమో, దురదృష్టమో తాను రాత్రి ఇరవై కిలోమీటర్ల దూరం ఉండే కూతురి ఇంటికి వెళ్ళింది. కూతురికి ప్రాణం బాలేదంటే చూసి వద్దామని వెళ్ళింది. పక్కనే ఉండే తన మరిదికి, తోటికోడలికి కొంచెం తన మొగుడిని చూసుకోమని చెప్పి వెళ్ళింది. పొద్దున్న అయ్యేసరికి ఈ వార్త వినాల్సి వచ్చింది. తమ ఇంటి చుట్టుపక్కల ఉండే చాలా మంది దగ్గరలోని కంపెనీ నుండి వచ్చిన విషవాయువు బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. తన మొగుడు పక్షవాతం మనిషి కావటంతో దూరంగా వెళ్లలేక అక్కడే పడిపోయాడు. ఏ పుణ్యాత్ములో తెచ్చి ఇక్కడ చేర్పించి  అల్లుడికి ఫోన్ చేశారు. ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మనసంతా గుబులుగా ఉంది. పెనిమిటిని అలా ఒక్కణ్ణే వదిలేసి వెళ్ళినందుకు తప్పు చేసినట్లు కూడా అనిపిస్తోంది. పక్కన ఎవరివో చావు ఏడుపులు వినిపిస్తుంటే ఇంకా భయం ఎక్కువవుతోంది.

పెళ్ళైనప్పటి నుంచీ ఉన్నంతలోనే తనని ఎంతో బాగా చూసుకున్న మొగుడు గుర్తు వస్తుంటే పొగిలి పొగిలి దుఃఖం వస్తోంది. కొడుక్కి చదువబ్బలేదు. కూతురు చదువుకుంటుండగానే తన ఆరోగ్యంలో ఏదో తేడా వస్తున్నదని గమనించి, తొందరగా కూతురికి సుగుణమ్మ మేనల్లుడితోనే పెళ్లి చేసేశాడు. కొడుక్కి ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా ఇప్పించాడు. తరవాత కొన్ని రోజులకే పక్షవాతం బారినపడ్డాడు. చెయ్యి, కాలు పని చేయటం మానేశాయి. అప్పటినుంచే తనకి కష్టాలు మొదలయ్యాయి. కొడుకు ఎవరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని వచ్చి పట్నంలో పని చేసుకుంటానని వెళ్ళిపోయాడు. ఇల్లు జరిగే మార్గం లేక తాను సెంటర్ లో ఒక కూరగాయల కొట్టు పెట్టుకుని నెట్టుకొస్తోంది. మొగుడ్ని మూడు చక్రాల బండిలో కూర్చోబెట్టుకుని వెంట పెట్టుకుని వెళ్ళి పొద్దున్నే కొట్టు తెరవడం. రాత్రికే ఇక ఇల్లు చేరడం.

కొన్ని రోజుల నుంచీ కొడుకు, పట్నంలో ఏదో కొట్టు పెట్టుకుంటాను డబ్బులు కావాలని విసిగించడం మొదలుపెట్టాడు. తమ వద్ద ఉన్నది, పక్షవాతం వచ్చినప్పుడు పెనిమిటి పని చేసే కంపెనీ వాళ్ళు దయతలచి ఇచ్చిన కొద్ది డబ్బు, ఉండే చిన్న గుడిసె.. డబ్బులు ఇచ్చేసి తమని కూడా అక్కడకే రమ్మంటున్నాడు. కొడుకుకి కుదురు లేదని తెలిసి తాను అంత సాహసం చెయ్యలేకపోతోంది. దానితో ఇంట్లో గొడవలు. కొడుకు మాట చెల్లకపోవటంతో ఒకోసారి వచ్చి ఏడుస్తున్నాడు, ఒకోసారి బతిమాలుతున్నాడు, మరొకసారి తండ్రిని చంపేస్తానని బెదిరించి వెళ్ళాడు. ఆ డబ్బులు ఏవో ఇవ్వగలిగితే కొడుకు బాగుపడతాడేమో అనే ఆశ కూడా ఏదో మూల లేకపోలేదు. అసలే బ్రతుకు ఇలా ఉంటే, ఇప్పుడు కూతురికి అనారోగ్యం. తప్పనిసరిగా ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు ఆసుపత్రి వాళ్ళు, రోగిష్టి పిల్లని ఇచ్చి మావాడి గొంతుకోశారు, ఆపరేషన్ మీరే చేయించాలి అని తన వదిన బెదిరిస్తోంది. అల్లుడు మంచి వాడు కాబట్టి, తమకి కావలసిన డబ్బు చూసుకునే ప్రయత్నాలు  వాళ్ళే  చేసుకుంటున్నారు. ఉన్న డబ్బు కూతురి ఆపరేషన్ కి ఇస్తే తన బ్రతుకెలా, కొడుకు ఊరుకుంటాడా అని ఆలోచనలో ఉంటే ఇప్పుడు ఇలా జరిగింది. తాను కూడా రాత్రి ఇంట్లోనే ఉండి ఉంటే హాయిగా ఈ బాధల నుండి విముక్తి దొరికేది అనుకుంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేసింది.

పక్కన ఏవో మాటలు వినపడుతుంటే అటు వినడం మొదలు పెట్టింది. బాధితులకి, చచ్చిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పరిహారం గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరో. బాధితులకి వేలల్లో, చచ్చిపోయిన వాళ్ళకి లక్షల్లో పరిహారం ఇస్తారట. వేలల్లో వస్తే ఏమి సరిపోతుంది. లక్షల్లో వస్తే కొడుక్కి డబ్బులు ఇచ్చెయ్యచ్చు, కూతురి ఆపరేషన్ కి సాయం చేయవచ్చు. కొడుకుని మళ్ళీ జోలికి రావద్దని చెప్పి, కూతురితో కలిసి ఉంటూ జీవితం వెళ్ళదీయవచ్చు. సమస్యలన్నీ తీరిపోతాయి. చెళ్ళున దెబ్బ తగిలినట్లు ఉలికిపడింది. ఏమిటి ఇలా ఆలోచిస్తుంది. ఎంత తప్పు. మొగుడి చావు కోరుకుంటున్నదా తాను??? ఏమైంది తనకి? తప్పు ఏముంది, మొగుడి వలన పైసా ఆదాయం లేదు, తనకు బరువు తప్ప. కొన్ని సంవత్సరాల తరువాత జరిగేది ఇప్పుడే జరిగితే, పైగా దాని వలన కుటుంబానికి మంచి జరిగితే తప్పేముంది. ఛా.. ఛా..దరిద్రం ఎంత దారుణంగా ఆలోచించేలా చేస్తుంది. చెంపలు వేసుకుంది. అంతా మంచే చేయాలని దేవుడిని వేడుకుంది.

కూతురు హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది. దేవుడు ఏ రకంగా మంచి చేశాడో..... ఆ పిల్ల వచ్చి విషయం ఏమిటో చెప్తే గాని సుగుణమ్మకి తెలియదు.

 

 

          

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు