మా రచయితలు

రచయిత పేరు:    దిలీప్ వి

కవితలు

కనుక్కోండి....

ఆకలైతే కాదు

నన్ను చంపింది

పస్తులుoడి ఆకలితో

అలమటించిన

దినములెన్నో...

 

పేదరికం కాదు

నన్ను వల్లకాటికి చేర్చింది

అయితే..

ఇన్నేళ్ల నుండి దానితోనే కదా

సావాసం చేస్తున్నది

 

కరోనాకా

నేను బలిఅయినది?

కాదు కాదు... అసలే కాదు

దేనికి నేను బలి అయిందో

 తెలియదా మీకు?

 

ఇంటికి చేరుతానని

ఇంటికి దీపమైతానని

నన్ను నడిపించిన ఆశ

విగతజీవిగా మారి

కన్నవారికి మిగిల్చిన నిరాశ

 

కారకులెవరో కనుక్కోండని

ప్రశ్నగా మారి వెళుతున్న...

 

 

 

నీవెప్పుడు పరాయివే...

ఈ దేశానికి

నీవెప్పుడు పరాయివే..

 

నీ చెమట చుక్కలతో

ఈ నేలను సస్య శ్యామలం చేసిన

నీ రెక్కల కష్టంతో

ఈ నేలను సుందరభరితంగా మలచిన

ఈ దేశానికి

నీవెప్పుడు పరాయివె

 

బతుకుదెరుకై వలసబోయి

అగ్ర రాజ్యపు అధికారంలో భాగమైన కమల

ఈ దేశపు కమలానికి తోటి మొగ్గే

 

అదే పొట్టకూటి కోసం

ఈ దేశానికి ఎవడైనా వస్తే దురాక్రమణదారుడు

 

ఇస్లాం ని ఆచరించే అరబ్బు రాజులు

ఈ కమలానికి మిత్ర పుష్పాలే

 

అదే ఈ గడ్డపై పుట్టిపెరిగి

ఇస్లాం ని ఆచరించే ప్రతి ముస్లిం

ఈ కమలానికి శత్రువే

 

నీవు ముస్లిం వా

అయితే శత్రువువే

నీవు దళితుడవా

అయితే పరాయివే..

 

ఈ దేశానికి

నీవెప్పుడూ పరాయివే..

 

దాని పేరు...

నిల్చున్న చోటనే నిన్ను

కూల్చివేస్తుంది

గుండె పోటులా...

జాగురుకతతో ఉండటమే మందు

 

క్రమ క్రమంగా నిన్ను

క్షీణింప చేస్తుంది

ఎయిడ్స్ లా...

నివారణ ఒక్కటే మందు

 

మనుషులకు నిన్ను

దూరం చేస్తుంది

కరోనాలా...

రాకుండా చూసుకోవడమే మందు

 

అప్పుడప్పుడూ

అంటురోగంలా మొదలై

మహమ్మారిగా మారి

మనస్తత్వాలను

సూక్ష్మ ధర్శినిలో చూపించి

కారణాలను కనుక్కునే క్రమంలో

రూపాలను మార్చుకుంటూ

మందేదో కనుక్కోలేకుండా

సంక్లిష్టంగా మారుతుంది

నీలోని విశాల, సహృదయతే

రోగ నిరోధక శక్తని తెలుపుతుంది

దాని పేరే "అహం".

 

 

మే డే

ఎన్నో పూలు తమకు తాముగా రాలి

భావితరాలకు విత్తనాలుగా మారి

 

పేదరికానికి, శ్రామికత్వానికి

సారుప్యతలు తప్ప సరిహద్దులండవని

"ప్రపంచ కార్మికులారా ఏకంకండ"ని

ఎలుగెత్తి చాటిన దినం

 

శ్రామికత్వం,సమైక్యత్వం,సమానత్వం

ప్రపంచ ప్రగతికి ప్రదీపికలుగా

విశ్వమానవ కార్మికతత్వమే

విశ్వమానవ సౌభ్రాతృత్వమని

పిడికిలెత్తి నినదించిన దినం

నేడే..."మే" డే...

*మే 01 "మే"డే సందర్భంగా...

 

మరిచిపోకు....

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

కాసిన్ని తెల్ల గులాబీలుంటే తెంపుకురా

యుద్ధంలో మరణించిన మనవారి సమాధులపై ఉంచి

ఓ.. కన్నీటి నివాళినర్పిద్దాం

 

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

నెత్తురంటని మట్టుంటే మూటగట్టుకురా

పోరుకు బలైన ఆత్మీయుల గురుతుగా

ఇంటిముందర ఓ మల్లె మొక్క నాటుదాం

 

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

చెమ్మగిళ్ళని కళ్లేవైనా ఉంటే ఓ ఫోటో తీసుకురా

తనివితీరా నా యదలకద్దుకుని

నీ పడక గదిలో వేలాడదీస్తా

 

సైనికుడా...

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

గాయపడని తెల్లపావురమేదైన ఉంటే పట్టుకురా

యుద్ధంలో అలసిపోయావు కదా!

దానితో ఆడుకుని కాసింత సేదధీరుదువు

 

సైనికుడా...

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

శవాల మధ్యన ఆనంద గీతమాలపించే

ఆత్మీయ గొంతెదైనా ఉంటే రికార్డ్ చేసుకురా

నిదురపోయే వేళ నీకు జోలపాటగా వినిపిస్తా....

 

(రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని నిరసిస్తూ....)

 

 

 

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు