నీవు
గుర్తొచ్చిన నిశిరాత్రి
తోపులాట..
తొక్కిసలాట
చీకటి తోడుకోక....
నిద్ర తోడు రాక.....
పూత వేయని కలతో
గొడ్రాలైంది రాత్రి.
ఉదయానే కన్నీటిబొట్లను
ఒడిసిపట్టిన కాగితం
కవితను ప్రసవించి
నీకే
బహుమతి చేసింది.
1
మాటలు
మొలకెత్తక మానవు
పచ్చగా
చిగురించక ఆగవు.
మానుగా అగుపించాలని
కాదు.
ప్రేమగా పలకరించాలని
మాత్రమే.
2
కొందరు కాలికి తగిలే రాళ్లు.
ఏదో ఒక చోట గాయమై బాధిస్తారు
అది మానినా మచ్చగా మిగిలుంటారు
మరికొందరు కంట్లో మెరిసే వాళ్లు.
అందంతో పాటు ఆనందానిస్తారు
విలువగా జీవితమంతా గుర్తుంటారు
3
"నా ప్రేమదేవత కోసం
కొన్ని ఊహలను
ఊసులతో
ముడుపు కట్టాను.
ఓ వరమిచ్చే రోజుకు
మొక్కు తీర్చి
నా పెదవుల పల్లకితో
ఊరేగించాలని."
4
ఎవరి కథలోనైనా
మలుపు ఓ అవకాశమే
అలుపు తీర్చుకోవడానికి
గెలుపు నేర్చుకోవడానికి
జీవితంలో
నిజం అబద్ధమైనప్పుడు
అనుభవం నిజమౌతుంది.
జీవితానికి జీవితాన్ని చూపిస్తుంది.
5
ఒత్తిడిలో
మనిషి శత్రువు
మనసు
ఒంటరిలో
మనసు మిత్రుడు
మనిషి
మనోశాస్త్రాలను
యంత్రరూపంలోకి తెస్తే
మానవరక్తంలో విషం విరిగి
రంగు మార్చుకున్న రక్తం
ఒక్కక్కోరిలో ఒకోరకంగా
ఒక్కరికి ఒక్క ముఖాన్నే
బొడ్డుతాడుతో అనుసంధానం చేసి,
ప్రేమామృతాన్నిఇంధనంగా స్రవించి
మనసు మరబొమ్మలా
మనిషిని నడిపిస్తుంది.
అవిశ్రాంతంగా
మెదడులో గూడు కట్టుకున్న
ఊహాలకు రెక్కలు మొలిచి
మనసు సంకేతాలను
సాంకేతికంగా గౌరవిస్తూ,
ప్రతి అనుభవాన్ని అద్ధంగా మార్చి
మరకల్ని తుడిచే
అదృశ్య హస్తమొకటి
తప్పటడుగులు లేని దారిలో
స్వచ్ఛగా నడిపించాలని
ఓ చిరునామాతో
చిరుస్వాగతం పలుకుతుంది.
అడుగు వేస్తే అనుమానాల అడుసు.
కునుకు తీస్తే భీకరమైన కల.
కురుకుపోతున్న భావోద్రిక్త వేళలో వేలాడుతున్న భావాలకు
వాలిపడే మాటకు
రాలిపడే అర్ధాలు
గాజుపెంకుల్లా గుచ్చుకొంటే...
దూరమైన మనిషే
ఒంటరిలో దగ్గరైన నరకం.
ఎండమావిగా నమ్మకంతో
నడి రాతిరి వడగాల్పుల
సెగలు కమ్మే ఆలోచనకు
మనసు చాపలా ముడుచుకొని
చింతల్ని తలచుకొని
చీకటిని కప్పుకొని
వెలుగు గువ్వను కంటి ఇంటి దరిదాపుల్లో వాలకుండాక పారద్రోలిన
ప్రతి పలుకులోని అంతర్ధాల కింద
నలిగిన మనిషికి నిద్ర దూరమైనా
నిజాలు దగ్గరయ్యాయి.
కలలు రాకపోయినా
కపటాలు తెలిసాయి.
అంగుళం వదలకుండా
మనసును ఆక్రమించి
ఆక్రందనకు గురి చేసే కళ తెలిసిన
ఓ విద్యాలయం ఒంటరితనం.
గతాన్ని తవ్విపోసికొద్ది రాసులుగా
బయటపడే నిజాలు
గుట్టలుగా పేరుకుపోయి
మనిషిలోని అహాన్ని సమాధి చేస్తుంటే
జీవితం నల్ల కలువ.
మెల్లగా ముడుచుకొని
తెలుసుకొనే తెల్లని పొద్దులో
హృదయంలో మృదుకదలికకు
మాటలు నేర్పే తల్లిదనం సహనం.
ఆకారణ అసందర్భ వేళలో
నిరాదరణ నిప్పులా
నీడను హరించి
ఒక్క క్షణం
పిడుగులా నడినెత్తిన తాకింది.
వణికిన వర్తమానం
కాలిన ఒంటితో
ఒంటి కాలి పరుగుతో
ఒంటరిగా ఓటమి ఒడిని చేరి
రేపు ఉదయాన్ని శాసించే
ఓ కిరణమై ఎలా మెలాగాలో
ఓ పుంజమై ఎలా మెదలాలో
ఆ రాతిరి రేపటికి గురిపెట్టిన
బాణంగా మార్చి
ఓటమి ప్రేమతో కౌగిలించుకొని
నేర్పిన విలువిద్య ఆత్మస్థైర్యం.
తాకడానికి వీలుకాని జ్ఞానాన్ని,
పుస్తకలోకి నడచివెళ్లలేని సోమరితనానికి
చేరదీసుకోలేని విజ్ఞానం
ద్రావక రూపంలో
మెదడు పొరల్లో విస్తరించి
కళ్ళకు మెరుపులు పూస్తున్నాయి.
నాలుక నడక నేర్చుకుంది.
మనిషిలో మరో మనిషి విడివడి
అనుభవ భావజాలంతో
శుభ్రపడిన మనసులోని ప్రతి పొర
సూక్ష్మ ప్రశ్నలకు స్పందించే
శుభసమయంలో
మనిషి వేసి ప్రతి అడుగు శబ్దం ప్రపంచానికి ఓ శుభసంకల్పమే.
...
అప్పటికది
బొట్టు ఆలోచనే...
వయచొచ్చిన ప్రవాహానికి
హృదయం సంద్రమైనది.
కాళ్లోచ్చిన ఒక్కో కల అల
ఆశల ఒత్తిడిలో
ఒడ్డును ఢీ కొడుతూ
ఎత్తుకి ఎదగాలనదే తపన.
ఆపలేని ముసురులో
ఆగని ఆవేదనకు
రాలే ఒక్కో కన్నీటి చుక్క
ఒక్కో తుఫాను.
తడిసిన బతుకున
మొలిచిన విధికి
పూసినవన్ని ఉప్పుపూలే.
కోయక తప్పని ప్రేమకి మూలం
ఆ బొట్టు ఆలోచనే
ఆ కన్నీటి ఆరాధనే.
...
ఆ ఒక్క చూపు
నాలో పెట్టిన పుటానికి
సెగలు తొడిగిన అర్ధాలను
రవ్వలు రువ్విన బంధాన్ని
మనసు మిరుమిట్లగొల్పిన వింతల్ని
మడతేసి ఎంత అడుక్కినెట్టినా....
నాలుక నడివీధిలో
పరుష పదజాలపు పలకల కింద
చీకటితో అర్థాన్ని పూడ్చి సమాధి చేసినా..
నిర్లలక్ష్యపు నిప్పులలో
ఆశను కాల్చి మసిచేసినా
కసిగా కళ్ళు దృశ్యాలను
కసిరి నేలకేసికొట్టినా...
ఆ ఒకే ఒక్క చూపు
రక్తాన్ని ఏతమేసి తోడటం మానలేదు...
ఎర్రగా తడిసి ఏ జ్ఞాపకం ఆరడంలేదు.
ప్రతి అనుభవం అర్దరాత్రి చీకటిని ఉదయస్తుంది.
ప్రవహించే మాటల్లో తేలాడే
ఊహలు గురిచూడటం మానలేదు.
ప్రసరించే భావాల్లో పారాడే
ఊసులు గుచ్చుకోవడం ఆగలేదు.
వెచ్చని శ్వాసనాళంలో
పచ్చని ధ్యాస దారులలో
మనసును ఒడిసిపట్టి
వడగొట్టిన భావాలని ప్రశ్నలుగా
బతుకును వెలకట్టి సంధిస్తే....
జీవితమంతా తాకట్టు పెట్టి
మనసును వేలం వేసినా
తీరని బాకీలా బంధంలో
తరగని వడ్డీలా అనుబంధానికి
లోపల కొలువైయున్న నీ ప్రేమకు బానిసనై ఋణపడే ఉన్నాను
పాతకాలంలో మట్టిమనుషులు
చెమటతో నింపినదే
మా ఊరి "మాలపల్లె చెరువు".....
ఊరికి దోసిలితో దాహం పట్టినట్లు
ఊరి గర్భానికి తేమను దానం చేసినట్లు
చల్లని మనసుతో చలువలూరిస్తూ
ఉమ్మడి ఆస్తిగా ఊరికి వ్రాసిన వీలునామాలా ఉంది.
ఆ చెరువులో మొలిచిన
ఓ మంచి నీటిచుక్క మొక్క వరమై
ఊటకు కట్టిన గుడి
దప్పికతీరగా కోలిచే దేవత
మా మంచినీటి తల్లి
మా పల్లె బావి.
వేసవి సెగకు
ఆవిరి పగకు
ఎండే ఊరి గొంతుకు అండగా
పక్కనే కొలువున్న
పోలేరమ్మ చల్లని చూపుకు ప్రక్కగా
నిండుగా వెలిసినది ఈ తీపిధార.
నలుదిక్కుల
గిలకల సవ్వడితో ఊరు,
పలుప్రాంతాల
కడవల అలికిడితో ఇళ్ళు,
ఉదయించే మా ఊరి ముఖంలో
చిందే సందడిదే అందమంటే.
చెరువు ఒడ్డున
కొంగలబారులా కడవల అందం,
దారిపొడవునా
కవాతు చేసే సైనికుల్లా జనం,
ఆ తీయని దృశం
ప్రతివాని గుండెలో తీపి జ్ఞాపకం.
చేతిలో చెంతాడు
నెత్తిన కుదుర్లు
బాజారు బజార్లు జట్లు జట్లుగా
ఆడవాళ్లు రంగురంగుల కబుర్లు,
కుర్రకార్ల సైకిళ్ళు జోరు,
కష్టజీవుల జంట బుంగల కావిళ్ళు
రోజులో అందరి తొలిపనిగా
ఊరు ఉరుకుల పరుగులు
ఒక సంబరాన్ని తలపిస్తుంది.
వందలపాదాలు నడిచి నడిచి
మెత్తగా మారిన పల్లె బాట
మంచినీటికి చెప్పని చిరునామాగా మారింది.
చేతికొద్ది చేదే ఊపుకు
నడుములు విరిగె గిలకల అరుపులు
వీధులన్నీ వినపడే చప్పుళ్ళతో
చట్టు చుట్టూ బావిని చుట్టేసుకున్న జనాన్ని చూస్తే తిరుణాల గుర్తొస్తుంది.
వడివడిగా పోటీపడుతూ
నీటిని తొడే ఉత్సహనికి,
నీట జారిన బిందెలు
లాగి లాగి తెగిపోయే చేతి తాడులతో
తిట్లతో కాసేపు
పోట్లాటతో మరికాసేపు అలిసిపోయి
గ్రామ పురోహితుడు గారిఇంటికీ గాలానికి పరుగెత్తటనమే
అనుభావాన్ని ఇచ్చిన
భావి ఎంత సంతోషమో?
కలిసిమెలిసే పంచుకునే
నీరు ఎంత ఆరోగ్యమో?
"రాత్రి కావాలి" నాకు
వీధుల్ని తోసుకొని ఊరిను నెట్టేసి,
పొలిమేర దాటి పొలాలు తిరుగుతుంటే..
చీకటి చెవిపట్టి ఇంటికి చేర్చింది.
దీపం వెక్కిరిస్తూ లోపలికి పిలిస్తే
మంచం ఉరిమిచూస్తూ సర్దుకుంది.
* * *
"రాత్రి కావాలి" నాకు
మళ్ళీ అదే ప్రశ్న వీధిలోకి నెట్టుకొస్తుంటే
తట్టుకోలేక కళ్ళు
లోపల నుండి బయటకు చూశాయి.
"చుట్టూ రాత్రే...
మనసే ఖాళీ."అని తెలిసి
నిద్రను కౌగించుకొని పడుకున్నా..
* * *
నాలుగు గోడల మధ్యలో
ఒక సోఫా చూస్తుండగా
రెండు కుర్చీలు దగ్గరగా
రెండు కప్పులు కాఫీ వాసనతో
నాలుగు కళ్ళు ఒక చూపుతో...
రెండు మనసులు ఒకే తలపుతో....
మెరిసే మాటలకు రూపం తెచ్చే
ఆ రోజుకు కాళ్లకు మ్రొక్కుతూ
నీలో నన్ను చూసుకుంటా
నాలో నిన్ను చూపుకుంటా
ఒక మల్లె తోడుగా
ఒక క్షణం నీడగా
ఓ తీపి జ్ఞాపకాన్ని
మనసు కాగితంపై
కవితగా వ్రాసి ఇస్తాను
జీవితాంతం గుర్తుండేలా...
ఆ క్షణం
గాలికి ఊపిరాడలేదు
వెలుగు చిట్లి చీకటిగా ముక్కలైంది.
మౌనజలపాతానికి
కాలం మెత్తగా కరిగి కొట్టుకుపోతుంటే
భావం బరువుగా తెలియాడుతూ
చూపలను వాటేసుకుని
సన్నని ప్రయాణంలో
ఇరుకుమాటల అర్థాలఒత్తిడిలో
తీయని తెల్లని మాట
ఛాయలెక్కడని వెదుకుతూ
ఒంటరిగా నాలో నేను ఇంకిపోయాను
నీ ఆలోచనల తేమను దాటుకుంటూ...
ఒకరుంటారు జీవితంలో
సజీవంగా
మనసును మోస్తూ ...
ఒకరే ఉంటారు బతుకులో
రహస్యంగా
మనసును ఆరాధిస్తూ
నమ్మలేని
రహస్యం వాళ్ళ తీరు.
మనసులు నిర్మించుకున్న
కలల కోటలో
కిక్కిరిసిన రాత్రులు
సముద్రం సహితం
చూడని లోతును
ప్రేమలో చూసి ...
భరించలేని ఆశ్చర్యాన్ని
భూమితో
పంచుకుంటే...
సహనాన్ని అస్త్రంగా
ప్రయోగించిన
భావఫలితం...
ప్రేమకు దాసోహం
" మనిషి, మనసు, మనుగడ".
* * *
వాడేదో..వాడికేదో ....
లోపల...బయట
ముందు...వెనుక
లోపమో?... శాపమో?
భారమో?..నేరమో?
ఆ రెండు పదాలకే అల్లుకొని
పూత లేయని శబ్దాలకు
చిగురించని తరంగాలకు
చెవులు నోళ్లు తెరుచుకోవడం
అవసరమో?...అగత్యమో?...
పుస్తకంలా...మస్తకంలో
పుట్టుమచ్చలా....మనసుముద్రలో
ఆ పదాల గుర్తులే
కళ్లకు గుచ్చుకునే బాధలు.
వాడేదో......వాడికేమిటో
నేల గిట్టడం లేదు..
నింగి నచ్చడం లేదు..
వానతో మాట్లాడడు
తేమతో కలిసుండడు.
ఆ రెండు పదాలే
ప్రకృతిని శత్రువుగా
తనను మోసగించుకోవడమే
రుచి ముందు
ఆకలి మారిపోయింది
దప్పిక దూరమైనది.
ఆకారం మార్చుకొని
ఆలోచన కొట్టే దొంగదెబ్బకు
ప్రత్యక్ష సాక్ష్యాలైన
అరుపుల్లేని బాధ
ఆవిరౌతున్న కన్నీరు
సొంత దేహంలో
పరాయిలా తప్పించుకుని
ఎప్పుడూ చివరే ఉంటాయి.
ముందుకొచ్చి కాపాడింది లేదు.
ఎంత లోతుకు మునిగాడో
ఈ మాటల గజఈత ...
ఏ ఒడ్డుకు తేలేనో..
ఏ అర్థం ఎప్పటికో...
ఏ దూరం పిలుపో
ఈ అడుగుల అలసట
ఏ వేళకు ఈ దప్పికను
ఏ గమ్యం తీర్చునో...
దారివ్వండి వాడికి.
కెరలించడం దేనికి?
జరుగుతున్న కాలాన్ని
వాడిలోనే జారనీయండి.
జాలితో మనసుని
చిలికి చిలికి చంపొద్దు
ప్రేమ మనిషిలో
పొగిలి పొగిలి పారనీయండి.
ప్రశ్నలతో గుండె తలుపు కొట్టొద్దు
కాలంలోని జుట్టుపట్టుకొని ముంచొద్దు. కసిగా చూడద్దు..
కక్షను నేర్పద్దు..
బయటకు లాగొద్దు
బయటపడేద్దు
చీకటి చిత్తడిలో కూరుకపోతే
వెలుగు వెలికి వెలివేస్తే
ఆ పాపం గొంతులో కట్టడి కాదు.
ముక్కలైన ముఖంలో
ఆనందాలను వెతకొద్దు
ఒక్కడిని చూసి
వెన్నుపోటు పొడవద్దు.
సందుచూపులతో
మర్మాలను మరిగించి
ముఖాలపై పోయొద్దు.
మనసులు మాడ్చద్దో.
వాడేదో
వాడిలోఏదో
ఈ కాలపరీక్ష వ్రాయలేక
కూరుకుపోతున్నాడు...
తేల్చుకులేకపోతున్నాడు...
జీవితాన్ని మరణిస్తూ
బతుకుతున్నాడు..
బతుకును చంపుకుంటూ
జీవిస్తున్నాడు...
పొందిన ఆ రెండు పదాలకు
అర్థాలను వెతకలేని అనుభవం
చేతకాక చేతులు కట్టుకున్నా
ఆ రెండు పదాలు కింద పడ్డ
చచ్చిపోయిన ఆ నిజమంటే
ఇప్పటికీ ఇష్టమే..
..
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు