లలిత రాగమున అరుదెంచి లాలించావు
వసంత కాలములా ఏతెంచి బంధించావు
హిందోళమున ఆందోళనలను పోషించావు
శిశిరములా జీవన గమనాన్ని శాసించావు!
నడకకు నర్తించెనే పురివిప్పి ఒళ్ళు నెమలి
నడవడిక శోధించెనే ఆ వందల కళ్ళు వొదిలి
అతిశయాన నిర్ఘాంతపోయానే నీళ్లు నమిలి
బిగుసుకునిపోయి రానన్నవి కాళ్ళు కదిలి!
వడివడిగా వాడితివి వడిసెలతో కొడితివి
ఎదసడినే మార్చితివి తపనలనే రేపితివి
పెళపెళమనే ఉరుములని ఉరిగా విసిరితివి
తళతళమనే మెరుపులని దూరం చేసితివి!
అంగరాజునంతమొందించె అంజలికాస్త్రము
అంగాంగముల అంతు చూసె అబలాస్త్రము!
నువు తోడుండ కదిలె జగన్నాథ రథచక్రాలు
నను ఒంటరి చేయ ఆగుతున్న కాలచక్రాలు!
మధురమైన భావనలు నాలో నింపుకున్నా
మధుమేహము బహుమతిగా తెచ్చుకున్నా
కూటి ముందు సూది మందు కుచ్చుతున్నా
పూట పూట నీ జ్ఞాపకాలనే నే భుజిస్తున్నా!
మరలిరావనే సత్యముతో వేసావు శిక్షలు
తిరిగొస్తావనే స్వప్నాన్ని కంటున్న అక్షువులు
సత్యాలు స్వప్నాలు కావాలనే నా ఆకాంక్షలు
స్వప్నాలు సత్యాలు కావని చూపె నీ ఆంక్షలు
కన్నీళ్ళతో చెప్పనా వేరే కళ్లు చూసుకోమని
నా కలలను వేరే కనుపాపలని కనమని
నా బరువులు మరో భుజాలని మోయమని
నా బాధలు నా బదులుగా భరించమని!
కనులు మూసిన కలలొస్తాయని
నీ తలపులు కలవరిస్తాయని
కంటి సుడులు నిను ముంచేస్తాయని
కలల అలలు నిను మింగేస్తాయని!
కిటకిట తలుపులు మూసేస్తున్నా
తడిబారిన ఎద మోసేస్తున్నా
కనుపాపలకిక సెలవిస్తున్నా
చెలియ చెలిమికై విలపిస్తున్నా!