మా రచయితలు

రచయిత పేరు:    కుందుర్తి కవిత

కవితలు

జ్ణాపకాల పేటిక

ఇల్లంటే 

ఇటుక గోడలూ, గదులూ తలుపులూ

వాటి రంగులూ ...ఇవేనా?

గోడల పైనున్న రంగురంగుల బొమ్మల మొహాలపై

విరసిన నవ్వుల కిలకిలలు

కళ్ళల్లో మెరుస్తున్న కాంతుల చమక్కులూ కావా ?!

గదుల్లో విశ్రమిస్తున్న కనురెప్పల పైన 

నిశ్చలంగా నిలచి ఉన్న ప్రశాంతత కాదా?

ఆ కనుపాప తలుపుల వెనుక 

నిర్భయంగా కదలాడే తలపుల మెరుపు కలలు కావా?

 

ఇంటిని కోట్ల లెక్కల్లో, ఫీట్ల లెక్కల్లో, ఫ్లోర్ల  లెక్కల్లో కొలుస్తారా?

కోటానుకోట్ల గుర్తుల పునాదులు పోసి

 ఆకాశమంత ఎత్తుకి ఎగసి దూసుకెళ్ళే స్మృతుల  స్థంభాలు వేసి,

తీపి చేదు జ్ఞాపకాల్ని గుట్టలుగుట్టలుగా పోసిన కప్పుతో

త్రికరణసుద్ధితో కట్టుకున్న ఇంటిని ఏ లెక్కన కొలుస్తారు?

 

 ఓ ఆడపిల్ల పెళ్ళిచేసుకొని

 అత్తారింటికి వెళుతూ

తనతో ఏం తీసుకెళ్ళాలనుకుంటుంది ??

 అత్తగారికిచ్చే కట్నం డబ్బులా

 లేక అమ్మ ప్రేమగా తన చేత్తో చేసిచ్చిన కాటుక డబ్బానా ?

 లక్షా యాభైవేల ఆడపడుచు లాంఛనమా

 లేక అక్కని విసిగించి, వేదించి, సవాలక్ష ప్రశ్నలు వేసి,

  దానిదగ్గర సంపాదించిన టైటాను వాచీ నా ?

 మామగారికి చదివించిన మారుతీ కారా

  నాన్న నాకు కొడుకైనా కూతురైనా నువ్వే తల్లీఅని  

  తల నిమిరి తనకోసం కొనుక్కున్న స్కూటీనా ?

 తీయని సారెలు మోసుకెళుతుందా

 అన్నదమ్ముల ఆత్మీయతల్నీ

 పుట్టినింట మరువపు సుగంధాల్నీ 

 మరువకుండా గుండెలనిండా నింపుకెళుతుందా ?

 

ఒక విద్యార్ధి ...పై చదువులకోసం

అయిన వాళ్ళని వదిలి పరాయి దేశం తీరాల్ని తాకినా,

 

ఓ రైతన్న....అప్పులు తీర్చలేక ,గత్యంతరం లేక

 బ్రతకలేక, చావలేక, కూలిపనికి పట్నం పోవాల్సొచ్చినా,

 

ఓ ఉద్యోగి ... బ్రతుకు తెరువు కోసం 

పెళ్ళాం పిల్లల్ని విడిచి వేరే ఊరు వలస వెళ్ళాల్సివచ్చినా ,

 

ఒక సైనికుడు ....దేశ రక్షణకై , జన సంరక్షణకై ,

బలికావడానికి , సరిహద్దుకి యుద్థానికి దూసుకుపోయినా,

 

విద్యాధర్మమైతేనేం, విధి వైపరీత్యమైతేనేం...

కార్యాచరణకైతేనేం, కర్తవ్యనిర్వహణకైతేనేం...

 

తన ఇంటినీ, తన ప్రేమల పొదరింటినీ,

తన చిన్నతనాన్నీ , తన గతాన్నీ

తన గూటినీ, తన వారినీ ,

తన భూమినీ, తన నేల తల్లినీ ,

తన ధర్మాన్నీ , తన దేశాన్నీ ,

వదిలి వెళ్ళాల్సిందే కదా !!

 

 అలా ఇంటిని వదిలి వెళ్ళడమంటే..

 దాని భౌతిక కాయాన్ని వెదిలెళ్ళడం కాదు,

 నువ్వు జీవం పోసి ప్రేమతో పెంచుకున్న

 పంచుకున్న జ్ఞ్యప్తుల పంజరాన్ని వదిలెళ్ళడం,

 నువ్వక్కడ నేర్చుకున్న పాఠాలని,

 తీపీ చేదు అనుభవాలని, అనుభూతులని

  మూట కట్టుకొని పోవడం,

 నీ ఆత్మనీ, పంచుకున్న ఆత్మీయతనీ ,కలబోసి ,

  ఒక అమూల్యమైన జ్ఞ్యాపికగా మార్చి

  దాన్ని జాగ్రత్తగా సర్దుకొని

  ప్రేమతో చుట్టి , హృదయపేటికలో ప్యాక్ చేసి..

 నీ వెంటబెట్టుకొని వెళ్ళడం...

 

 ఆ తరువాత 

 ఎన్ని రెక్కలొచ్చినా , ఎంత ఎత్తుకి ఎదిగినా

 ఏ దేశమేగినా, ఎందుకాలిడినా,....

 దాన్ని భద్రంగా నీ మనసు పొరల్లో

 హృదయపు అంతరాంతరాల్లో , దాచుకోవడం..

 నీకు ఉనికినిచ్చిన

 నువ్వు ఉరుకునందుకోడానికి దన్నునిచ్చిన 

 నీ వేర్లనీ, నీ మూలాన్నీ, మర్చిపోకుండా ఉండడం !!

 మనిషిగా నిలిచి ఉండడం !!

                                    

 

ఈ సంచికలో...                     

Nov 2020