మా రచయితలు

రచయిత పేరు:    రాజశేఖర్ పచ్చిమట్ల

కవితలు

బతుకుపయనం

పుట్టినూరిడిచి పొట్టచేతవట్టుకొని

పాతగుడ్డల ముల్లె పైలంగనెత్తినెత్తుకొని

ఖాళీచేతుల బుగులుబాప

చేయిసంచి తలిగేసుకొని

కనిపించిన దారివెంట

కనిపించని తీరాలకు సాగే

గమ్యమెరుగని బాటసారులు వలసజీవులు!

 

అంతస్తులెరుగక నకనకలాడే ఆకలికి

కడుపులో పేగులు

ఎడతెరిపిలేకుండా

చేస్తున్న సంగీతవిభావరి నాప

పిడికెడు మెతుకులకు

వెతుకులాడే ఊరపిచుక బతుకులు

బతుకుబాటలొ దాకిన దెబ్బలకు

నొక్కులువోయిన గంజులు

కాకిబలగపు ఆకలిదీర్చలేని

అడుగంటిన గంజినీళ్లు

అలిసినతనువు నడుమాల్సుకుంటే

కునుకురాని కుక్కిమంచం

అయినా రాత్రంతా దోమలతో

మూసినకనులతో ముష్టియుద్ధంజేసి

కొనఊపిరితో సత్తువంత కూడగట్టుకొని

ఉదయాన్నే కైకిలి వెదుకుతు

చౌరస్తాల్ల ఎదురుచూస్తూ ఎండుచాపలయ్యే కూలీలు!

 

ఆకలిదీర్చే దారిలేక

చేద్దామంటే పనుల్లేక

రోడ్లపక్క తలదాచుకోలేక

పసికందుల వసివాడ్చలేక

సంపాదించిందేమిలేక

బాధ్యతల బరువులు మోస్తూ

కష్టాలవడగండ్లకు నెత్తిబొప్పిగట్టినా

గమ్యంజేర్చే దారిగానరాకున్నా

ఉన్నఊరుజేర పయనం సాగించే పాదచారులు!

 

మొలిచినరెక్కలతో దిక్కులకెగిరిపోయినా

రెక్కలుడిగి వెనుదిరిగినా

అందరినీ ఆదరించే పెద్దదిక్కు పల్లెటూరు

సంపదలు పట్నపుదారులు జూపుతే

సంబంధాలు పల్లెదారులు తెరిచి

అలసిన దేహాల బడలికబాపే

మలయమారుత వీవెనవుతుంది!

మానవత మంగళారతులు పడుతుంది!

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు