వచన కవితకు నిర్దిష్ట చట్రముండదు. వృత్త, గీత, మాత్రా ఛందో పద్యాలకున్నట్టు ముందే నిర్ణయింపబడిన రూప సంబంధి చట్రముండదు. అసలు చట్రానికే వ్యతిరేకం వచన కవిత. అందుకే దీనిని ఆంగ్లంలో Free verse, verse libre అన్నారు. అంటే ఛందస్సు నుంచి, నియతి నుంచి విముక్తమైన కవితారూపం అని భావం. అందుకే దీనిని తొలి రోజులలో తెలుగులో ముక్త చ్ఛందం, స్వచ్ఛంద గీతం,స్వచ్ఛంద కవిత అన్నరు.అంటే దీనికి మాత్రల నియమం గాని, అక్షర నియమం గాని, పద నియమం గాని, గణ నియమం గాని, యతి ప్రాసల నియమం గాని ఉండవని అర్థం
ఏ చట్రం, ఏ నియమం ఉండదు గనుక వచన కవిత రాయడం చాలా సులభం. అందుకే ఈ కవితా రూపం వచ్చిన తర్వాత కవుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి కవి, ప్రతి కవితకు దానిదైన ప్రత్యేకమయిన చట్రం ఎప్పటికప్పుడు రూపొందించుకోవాలె. ముందే నిర్ణయించబడిన చట్రమేదీ సహాయంగా రాదు. అసహాయ శూరుడిగా ముందుకెళ్ళాలి. అందుకే వచన కవిత రాయడం ఎంత ఈజీనో అంత కష్టం.
“ఆశలేదు ఆస్కారం లేదు
ఫలానా రాజు శాపం ఆఖరవుతుందనే హామీ లేదు
ఫలానా రోడ్డు గమ్యం చేరుస్తుందనే సూచన ఎక్కడా ఏమీలేదు
జీవితం ఎప్పుడూ ఇలా కన్నీళ్ళ ప్రవాహంగానే సాగుతుందనుకుంటాను
రోడ్డు పొడుగునా చెట్లు కూలుతున్న దృశ్యాలనే చూపుతుందనుకుంటాను
పోతే ఇప్పుడు అక్షరాలా నిజం
మిత్రుడు వెంకట్రావు జీవితంలో చెట్లు కూలుతున్న మాట నిజం
లేకుంటె ఎంతో అందమైన సాయంత్రం కూడా ఇలా
అపస్వరాలు వినబడటం జరగదు.
రోడ్ల మీద ధూళీ దారిద్య్రం సమస్తం
వెంకట్రావు ముఖం మీదనే టచ్చాడుతూ ఉండడం సంభవం కాదు
.......’’
ఇది ఒక అచ్చమైన వచన కవిత. ఇందులో పాద నియమంగానీ, అక్షర నియమంగానీ, గణ,యతి ప్రాస నియమంగానీ లేదు. అంటే పూర్వ నియత చట్రం ఏదీ లేదు. అంటే వచన కవిత రాయటానికి ముందే రూపపరంగా ఒక చట్రం రూపొందించుకోవడం కుదరదు. కవిత రాస్తున్న ప్రాసెస్‍లోనే అది ఏర్పడుతుంది. మిగతా అంశాలు కూడా ముందే అనుకోవడం కూడ కుదరదు. ఒక వస్తువు గురించి మాత్రం ముందే రేఖామాత్రంగా ఒక చట్రాన్ని రూపొందించుకునే అవకాశం ఉంటుంది.
వస్తువు ఎంపిక
కవి తాను రాయబోయే కవితకు ‘వస్తు నిర్దేశం’ చేసుకోవడం, అంటే వస్తువు ఎన్నిక చాలా ముఖ్యం. బిచ్చగాడి గురించి రాయొచ్చు. రైతు గురించి రాయొచ్చు. రిక్షా తొక్కే వాడి గురించి రాయొచ్చు. సెక్స్ వర్కర్ మీద రాయొచ్చు. అమ్మ గురించి, చెల్లె గురించి, పల్లె గురించి, మారుతున్న మానవ సంబంధాల గురించి గ్లోబలైజేషన్ గురించి రాయొచ్చు. సమాజ పరిణామంలో తలెత్తే విభిన్న సంఘర్షణల గురించి రాయొచ్చు. అయితే ఇంతకుముందు ఏ కవీ స్పృశించని అంశాన్ని కొత్త అంశాన్ని ఎన్నుకోవాలె. ఇందుకు ఎంతో అధ్యయనం అవసరం. కనీసం కవి ఏ భాషలో రాస్తున్నాడో ఆ భాషా సాహిత్యాన్నైనా అధ్యయనం చేయడం అవసరం. అంటే ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని మొత్తం (కనీసం ఆధునిక సాహిత్యాన్నైనా) అధ్యయనం చేయాలె. అలా చేసినప్పుడే ఇంతకుముందున్న కవులు ఏయే అంశాల మీద రాశారు, మనం ఏ అంశం మీద రాయాలనేది బోధపడ్తుంది.
ఒక కొత్త కవి ‘రైతు’ మీద ఓ కావ్యం రాయాలనుకుంటాడు. అంతకుముందే వచ్చిన గంగుల శాయిరెడ్డి ‘కాపుబిడ్డ’, వానమామలై జగన్నాధాచార్యులు ‘రైతు రామాయణం’, దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’ లాంటి కావ్యాల్ని చదవకపోతే వాటిల్లో లేని కొత్త అంశాల్ని ఏం చెప్పగలుగుతాడు?
ప్రపంచీకరణ గురించి రాయాలనుకుంటే, ప్రపంచ సాహిత్యాన్ని పక్కనబెడితే కనీసం తెలుగులో రాసిన జూకంటి జగన్నాధం, నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పగడాల నాగేందర్ (పరాయి స్పర్శ), కాసుల ప్రతాపరెడ్డి, నాళేశ్వరం శంకరం లాంటి కవుల కవిత్వాన్ని చదవకుంటె కొత్తగా ఏం చెప్పగలడు. అందుకని వస్తువు ఎన్నికకు సాహిత్య అధ్యయనం తప్పనిసరి షరతు.
సామాజిక అధ్యయనం లేదా పరిశీలన మరొక షరతు. సమాజాన్ని లోతుగా పరిశీలించినప్పుడు అనేక కొత్త అంశాలు స్ఫురిస్తాయి. ఈ లోతుగా చూడడాన్నే మన ప్రాచీనాలంకారికులు దార్శనికత అన్నారు. (కవయః క్రాంత దర్శినః; నా-నృషి కురుతే కావ్యం, దర్శనాత్ వర్ణనాత్) పాశ్చాత్యులు Vision nHsÁT. Insight అన్నారు. ‘తమ లోతు కనుక్కోమంటాయి.’ ‘కళ్ళంటూ వుంటే చూసీ’ అనే పాదాలు అదే చెప్తున్నవి. రవి కానని కవి కాంచే చూపు అది.
‘‘వస్తువు మీద యవనికును తొలగించడం ఆవిష్కరణ
కంటి మీది పొరను కరిగించడం సత్యావిష్కరణ ’’
కవి తనతో పాటు పాఠకుడి చూపుకు నైశిత్యాన్ని అందించే లోచూపు అది. సాధారణ మానవుడికన్న మిన్న అయిన లోచూపు కవి కుండాలె.
‘గరకపోస’ను సామాన్యులు చూసే చూపుతో కాకుండా దానిలో తిరుగుబాటును దర్శించిండు నారాయణ బాబు. సామాన్యుడు సౌందర్యాన్ని చూసే తాజ్‍మహల్‍లో శ్రీశ్రీ రాళ్ళెత్తిన కూలీలను దర్శించిండు. బైరాగి రాయీ రాయీ విడగొట్టమన్నాడు. అలానే అని కాదు, మామూలు చూపుకంటె భిన్నంగా అర్ధవంతంగా కవి చూపు ఉండాలని.
వస్తువు ఎంపికలో అంశంతోపాటు మరొక ముఖ్యమైన విషయం దృక్పథం. ఒక కవి ఒక అంశాన్ని, సంఘటనను చూసే దృష్టి కోణం. దీన్ని తాత్త్వికత, Outlook, poetic justic, Ideology, భావజాలం,ప్రాపంచిక దృక్పథం - ఇలా అనేక పదాలతో పిలుస్తరు. ఈ దృక్కోణం లేదా దృక్పథం కూడ వస్తువులో భాగమే.
ఉన్నతమైన వ్యక్తుల్ని, జీవితాల్ని, విషయాల్ని కవితా వస్తువుగా స్వీకరించాలనేది చాలా కాలం రాజ్యమేలింది. ప్రజాస్వామిక భావన వస్తు స్వీకరణలో మార్పు తెచ్చింది. ఉదాహరణకు గాడిద అనగానే చిన్న చూపు చూస్తరు అసహ్యించుకుంటరు. కవిత్వానికి అనర్హమనుకుంటరు. కాని సురవరం ప్రతాపరెడ్డి-
జడదారులెల్ల నీ నడవడి గాంచియే బూడిద మైనిండఁ బూసి కొనిరి భవదీయ గాత్ర సంస్పర్శచే పూతమౌ నుడుపుల నందరు తొడిగికొనిరి
అని ‘గాడిద’కు కావ్య గౌరవం కలిగించిండు.
అగ్గి పుల్లా కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ కవిత కనర్హం. అని శ్రీశ్రీ మార్కిస్టు దృక్పథంతో అల్ప విషయాలూ కవిత్వాని కర్హమేనని చెప్పడమే కాక ‘కళ్ళంటూ వుంటె చూసి’ అని దృష్టి కోణం ప్రాధాన్యతను చెప్పిండు.
కులాంతర ప్రేమను, అసలు ‘ప్రేమ’నే తక్కువ చేసి మాట్లాడే రోజుల్లో కులాంతర వివాహాన్ని సమర్ధిస్తూ -
కులముగాని సర్వం సహాబలముగాని ధనముగాని నిశిత ఖడ్గధారగాని లేశమై నిరోధింపలేవు సుమ్ము నిర్మల ప్రేమశక్తిని నిశ్చయముగ
అని సురవరం ప్రతాపరెడ్డి రాయడానికి ప్రజాస్వామిక దృక్పథమే (అన్ని కులాలు, స్త్రీ పురుషులు సమానమని, వివాహానికి స్త్రీ పురుషుల పరస్పర ఇష్టం తప్ప మరేదీ కారణం కారాదని ఈ దృక్పథం చెప్పింది) కారణం. కార్లు కడిగే, ఇళ్లు తుడిచే, విత్తనాలు నాటే మామూలు చేతులను గురించి చెప్తూ -
‘అన్నలు తోడుగా ఉంటె కత్తుల్తో కాలాన్ని కడిగేందుకు మాకున్నవి ఆ రెండు చేతులే’
అని చేతుల్లో సాయుధ విప్లవ సాధనాల్ని చూస్తూ నందిని సిధారెడ్డి రాయడానికి విప్లవ దృక్పథమే కారణం.
గులాబీలా, మల్లెలా, మందారంలా, పద్మంలా, కలువలా, ఏ విలువకూ నోచుకోని తంగేడు పువ్వును -
‘తంగెడు పూలు అంటె ఒప్పుకోను బంగారు పూలు... వాసన లేకున్నా వలపు బాసలు నేర్చిన పూలు పేద పూలు... పేదల పూలు...’
అని ఎన్.గోపి పేద స్త్రీకి, తెలంగాణకు ప్రతీకగా చేసి కవిత్వార్హత కల్పించడం అభ్యుదయ దృక్పథ ఫలితమే.
ఇట్లా సరైన అంశాన్ని సరైన దృక్పథం ఎంచుకోవడమే వస్తువు ఎంపిక. ఇది సరిగ్గా జరిగితే కవితలో సగ భాగం విజయవంతం అయినట్టే. మిగతా సగ భాగం కవిత్వ రూపానికి సంబంధించింది. ఇందులో చాలా అంశాలు ఉంటవి.
శీర్షిక
ఏ కవిత్వంలోనైనా ముఖ్యంగా వచన కవిత్వంలో కవితా శీర్షికకు కీలకమైన స్థానం ఉంది. కవితాసారభూతం శీర్షిక. కవి శక్తికి నిదర్శనం శీర్షిక. నదీప్రవాహ తీరునుబట్టి, నదీ జల గుణాన్ని బట్టి ఒక నదికి పేరు నిర్ణయమైనట్టు, ఒక పర్వత సముదాయానికి దాని స్వరూప స్వభావాలననుసరించి పేరు నిర్ణయమైనట్టు కవిత మానవ హృదయాల్ని ఒరుసుకుని ప్రవహించే తీరునుబట్టి, అది తాకే హృదయాలను బట్టి తాకాల్సిన హృదయాలను బట్టి, దానిలో నిక్షప్తం చేసిన తాత్త్వికతను బట్టి, అప్పటి సామాజిక, రాజకీయ Context ను బట్టి కవిత పేరు నిర్ణయమవుతుంది. ఒక్కోసారి అది వాచ్యంగా ఉంటుంది. ఒక్కోసారి ధ్వని గర్భితంగా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి ఉండాలె.
నేను శీర్షికను ముందు నిర్ణయించుకుని కవితనెప్పుడూ రాయలేదు. రాసింతర్వాత తగిన పేరు నిర్ణయించలేక దానిని బయటకు వదలడానికి నెలలు సంవత్సరాలు ఆగిన సందర్భాలున్నవి. ‘దాలి’ దీర్ఘకవిత రాసిన. దాని పేరు కోసం చాలాకాలం ఆగిన, ఎందుకంటే శీర్షిక నవ్యంగా ఉండాల్సిరావడమేగాక ఆ కవితకి టోటల్‍గా ప్రాతినిధ్యం వహించాలె. ఒక టాబ్లెట్ పేరులా, ఒక మనిషి స్వభావాన్ని తెలిపేదిలా వాచ్యంగానైనా, వ్యంగ్యంగానైనా ఉండాలె. శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’లా, గురజాడ ‘దేశభక్తి’లా, సురవరం ‘హంవీర సంభవం’లా. అపు డెప్పుడో ‘జాగ్వార్ స్మైల్’ అనే నవల పేరును చూసి అచ్చెరువంది ఆ నవలను తెప్పించిన. అదీ పేరు మాహాత్మ్యం.
నగ్నముని ‘కొయ్యగుర్రం’ కవితా శీర్షికల్లో తలమానికం. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ అలాంటిదే. దాశరథి ‘అగ్నిధార’ అలాంటిదే.
తెలంగాణ అంశం రగులుతూనే ఉందని ఇంకా రగులుతూనే ఉంటదని చెప్పే శీర్షిక ‘దాలి’ (2001). ఇవి, పుస్తకాల శీర్షికలు. శీర్షిక ప్రాధాన్యతను చెప్పటానికి వీటిని పేర్కొన్న.
‘గింజను కొరికి పండిన భూమేదో
రేకను సప్పరించి తాటి తావేదో చెప్పగలడు
నాలుకలో రసశాల గలవాడు’ ఇలా అనేక రకాలుగా రైతు ఔన్నత్యాన్ని వర్ణించి,
‘గింజమీద ధరనీ గంజిమీద పేరునీ రాయలేని ఏగాని’ అని ముగిస్తడు. దీనికి ‘ఏగాని’ సరైన శీర్షిక.
పైన పేర్కొన్నట్టు కవిత సారాంశాన్ని ప్రతిబింబించాలె శీర్షిక. లేదా కవిత తాత్వికతను చెప్పాలె. కవి ఉద్దేశాన్ని చెప్పాలె. కవి హృదయాన్ని విప్పాలె. కవిత రచనా కాలపు రాజకీయ, ఆర్థిక ఘర్షణల లోతుల్ని విడమర్చాలె. మనిషి అంతరంగానికి సూచిక కావాలె. ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటుంది శీర్షిక. సూటిగా ఉండొచ్చు. ప్రతీకాత్మకంగా ఉండొచ్చు. ధ్వని గర్భితంగా ఉండొచ్చు.
కోదాటి రామకృష్ణరావు ‘సుమవిలాపం’, కరుణశ్రీ ‘పుష్పవిలాపం’, తిలక్ ‘నా అక్షరాలు’, గార్లపాటి రాఘవరెడ్డి ‘ధనగర్వితులు’, పల్లా దుర్గయ్య ‘సెలయేరు’, రాజారాం ‘రంగూ రంగులమారి నెవురయ్య’, చిత్రం ప్రసాద్ ‘సిచ్చ’, కె.శ్రీనివాస్ ‘కొంచెం నీరు కొంచెం నిప్పు’, గఫార్ ‘అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి’, గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు’, స్కైబాబ ‘సాంచ’ - కొన్ని మంచి శీర్షికలు. ఎన్.గోపి ‘అరుగు’ సూటిదనానికి మంచి ఉదాహరణ. ‘సాంచ’ ప్రతీకాత్మకమైన శీర్షికకు మంచి ఉదాహరణ. అన్నవరం దేవేందర్ ‘మంగులం’ ధ్వనాత్మకమైన శీర్షికకు ఒక మంచి ఉదాహరణ. తెలంగాణ ప్రజలు మంగులంలా వేడి మీద ఉన్నరనేది ధ్వని.
‘పిల్ల పుట్టక ముందు పేరు పెట్టినట్టు’ అని ఒక తెలంగాణ సామెతలో అన్నట్టు, శీర్షికను ముందే నిర్ణయించుకోకూడదు.కవిత రాయడం పూర్తయిన తర్వాతనే పేరు పెట్టాలె. కాల సందర్భాన్ని బట్టి, కవిత్వ వస్తువును బట్టి, చేరాల్సిన పాఠకుడిని బట్టి, కవి ఉద్దేశాన్ని బట్టి పేరు పెట్టొచ్చు.
మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో వచ్చిన దీర్ఘకవిత ‘నల్లవలస’ (గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శివకుమార్, కె.శ్రీనివాస్). ఉత్తమ శీర్షికకు ఉదాహరణ ఇది. తెలంగాణ గురించిన కవిత అని వాచ్యం చేయలేదు. ఆంగ్లేయుల దురాక్రమణను ఆనాడు తెల్లవాడి వలస అన్నారు. వలస పాలన అన్నారు. తెల్లవాళ్ళు భారతదేశానికి వలస వచ్చినట్టు ఆంధ్రవాళ్ళు తెలంగాణకు వలస వచ్చి అన్ని రంగాలలో తెలంగాణను ఆక్రమించినారు. ఆధిపత్యం చెలాయించినారు. తెలంగాణ ఉద్యమానికి మూలకారణమిదే. ఇక్కడికి వలస వచ్చింది నల్లవాళ్ళు (తెల్లవాళ్ళతో పోల్చి చూస్తే). దీన్నంతటినీ ఈ దీర్ఘకవితలో చిత్రీకరించినారు కాబట్టి దీనికి ‘నల్లవలస’అనే ఔచిత్యవంతమైన పేరు పెట్టిండ్రు.
మరొక మంచి శీర్షిక పెన్నా శివరామకృష్ణ ‘వైరస్’. పాత అర్థంలో కాకుండా కంప్యూటర్ పరిభాష అర్థంలో ఈ పేరు పెట్టిండు కవి. కంప్యూటర్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అర్థచ్ఛాయను మాత్రమే తీసుకొని దాన్ని వవిస్తృతం చేసి మానవ సంబంధాలను, దేశీయ మూలాలను విచ్ఛిన్నం చేసే, స్థానికతను విచ్ఛిన్నం చేసే స్థాయికి తీసికెళ్లి ప్రపంచీకరణకు ప్రతీకగానూ అమెరికా సామ్రాజ్య వాదానికి గురిపెట్టే విధంగాను అనేక పొరలుగా అనేక అర్థాలు స్ఫురించేవిధంగా ఈ పేరు పెట్టిండు. Depth ఉన్న శీర్షిక ఇది.
ఈ చర్చ ఏం చెప్తుంది? వచన కవిత్వ నిర్మితిలో కవిత పేరుకు అడవిలో పువ్వు పేరుకున్నంత, ఆకసంల సుక్క పేరు కున్నంత, నీళ్ళల్ల చేప పేరుకున్నంత, ప్రాధాన్యత ఉందని.
ఎత్తుగడ
కవిత ప్రారంభాన్ని ఎత్తుగడ అంటం. దాన్నే ఎత్తుకోవడం అంటం. నిజంగా వేరే అర్థంలో అది ఎత్తుగడే. శీర్షిక కవితకీ, కవికీ, కవితల సారాంశానికీ సంబంధించిందయితే, ఎత్తుగడ కవికీ పాఠకుడికి మధ్య వారధిలాంటిది. కవీ పాఠకుల ప్రధమ సంబంధం. కవి, పాఠకుల సంభాషణలో మొదటి వాక్యం. పాఠకుణ్ణి తన కవిత్వంలోకి తీసుకెళ్ళే మ్యాజిక్. మాంత్రిక వాక్యం. అంతుపట్టని పాఠకుడి గుండెలోతులోకి పాతాళ గరిగను వేసి అతణ్ణి బయటికి తేవడమో, వెంట తీసుకెళ్ళడమో కవి చేస్తాడు.
ఒక సినిమా ఓపెనింగ్‍కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కవిత ప్రారంభానికి అంత ప్రాధాన్యత ఉంటుంది.
నా కవితల డైరీ చూస్తే తెలుస్తుంది ఒక్కో కవితను ఎన్ని రకాలుగా మొదలుపెట్టి చూసిననో. ఒక్కసారి ఏ మొదలూ నచ్చక ఆ కవితను ఎంతకాలం ఆపిననో. ఊర్లల్లో మొదలేయడం అంటారు. ఒక అల్లికను సాప,శిబ్బి, మంచం నులక, నవారా మొదలైనవి మొదలేసి ఇస్తే ఎవరైనా దాన్ని పూర్తి చేస్తారు. అలా కవితకు మంచి మొదలు వస్తే గొప్పగా పూర్తవుతుంది. అందుకే మొదలేస్తే సగం కవిత పూర్తయినట్టే అంటరు. పాఠకుణ్ణిలోగొనే టెక్నిక్ అది.
‘‘అట్లా అని పెద్ద బాధా ఉండదు’’ - వేగుంట మోహన్ ప్రసాద్ ఒక కవిత ప్రారంభం ఇది. పూర్వాపరాలు చెప్పకుండా ఇలా ఎత్తుకోవడం వల్ల పాఠకుడిలో ఒక ఆసక్తి కలుగుతుంది. ఇక పాఠకుడు తతిమ్మ పాదాల వెంట పడతడు.
‘‘కాల్వ జాగేనా గండయ్య’’ ఎం.వెంకట్ దీర్ఘకవిత ‘వర్జి’ తొలిపాదం ఇది. తెలంగాణ సందర్భాన్ని గుర్తుంచుకుంటె కాలమై కరువు దీరి కాల్వ సాగుతదా? ఆంధ్రోళ్ళు కాల్వను సాగనిస్తరా? తెలంగాణ ఉద్యమకాలువ కొనసాగుతదా అనే ప్రశ్నలు పాఠకునిలో కలుగతయి. ఇగ పాఠకుడు జవాబుకోసం కవిత యెంట ఎల్తడు.
సింబోర్స్కా అనే పోలండ్ కవయిత్రి కవిత ఒకటి ఇలా మొదలవుతుంది.
‘‘ఏదీ మారలేదు శరీరం బాధల చెరువు’’
ఆదిమ కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నిమారినా ‘బాధ’ మాత్రం మారలేదు అంటూ సాగుతుందీ కవిత, ఎత్తుగడలోని బిగువును కోల్పోకుండా.
మెక్సికన్ కవి ఆక్టేవియా పాజ్ కవిత ‘వంతెన’ ఇలా మొదలవుతుంది.
‘‘ఇప్పటికి ఇప్పటికి మధ్య నీకూ నాకూ మధ్య పదం వంతెన’’
పదం భౌతిక పదార్థం కాదు. అది వంతెన కావడమేమిటి? అనే ఆశ్చర్యం కలుగుతుంది పఠితకు. అలా ఆశ్చర్యానికి గురి చేసే మాంత్రిక శక్తి ఆ పద బంధంలో ఉంది. అది పఠితను లోగొంటుంది.
‘దానిలోకి ప్రవేశిస్తే నీలోకి నువ్వు ప్రవేశిస్తావు ప్రపంచం చట్రంలా కలుపుతుంది మూస్తుంది ఒక తీరం నుండి మరో తీరానికి ఒక శరీరాన్ని అలా సాగదీస్తే ఇంద్రధనుస్సు నేను దాని కమూనుల కింద నిద్రపోతాను’. (అనువాదం - ముకుంద రామారావు)
బెల్లి యాదయ్య కవిత ‘పాదాలు...’ మొదలు ఇదీ.
‘‘పాదాలు చాలా గొప్పవి’’
శరీరంలో హీనంగా చూడబడేవి పాదాలు. ‘బ్రహ్మ పాదాల నుంచి పుట్టిన శూద్రులు’లాంటి సూక్తుల వల్ల ఈ హీన భావన ఏర్పడింది. ఈ ఇంప్రెషన్‍తో ఉన్న చదువరికి ఈ ‘పాదం’ వింతగా అనిపిస్తుంది. ఆ వింతను కలిగించిన కవి, చదువరిని తనవెంట తీస్కపోయి, అనేక రకాలుగా వాటి ఔన్నత్యాన్ని వర్ణించి
‘‘పాదాలు చాలా గొప్పవి పాదాల నుంచి పుట్టినందుకు చరిత్ర హీనున్ని కాదు నేను చరిత్రకారుణ్ణి’’
ముగించడంతో, అరె బలె మొదలుబెట్టిండె కవితను అనుకుంటడు చదువరి. మోహన రుషి కవితలన్నీ ఇట్లా ఆశ్చర్యాన్నీ, ఆసక్తినీ రేకెత్తిస్తూ హఠాత్తుగా మొదలవుతయి.
నిర్వహణ :
ఎంపిక చేసుకున్న వస్తువును పాఠకుడికి తాననుకున్న పద్ధతిలో చేరవేసే విధానమే నిర్వహణ. శీర్షికతో, ప్రారంభంతో మొదలుబెట్టిన వ్యూహాన్ని ముగింపు దాకా కవిగా తననూ, వస్తువునూ, పాఠకుణ్ణీ ముప్పురిగా పేనుకుంటూ తీసికెళ్ళడమే నిర్వహణ.
ఈ నిర్వహణ తీరును బట్టే అనేక కవితా నిర్మాణ పద్ధతులు ఏర్పడుతవి. వాటిలో కొన్ని ఇవి :
సంభాషణాత్మకం ధ్వని గర్భితం రసాత్మకం ఆలంకారికం ప్రతీకాత్మకం వర్ణనాత్మకం
నిర్వహణ, వస్తువును వస్తువులో భాగమైన దృక్పథాన్ని బట్టి కూడ ఉంటుంది. అది ఎవరికి చేరాలో ఆ పాఠకుడిని బట్టి కూడ ఉంటుంది. ఈ అన్నింటిని అనుసరించి కవిత నిడివి రూపొందుతుంది.
నిర్వహణా సామర్ధ్యానికి గురజాడ ‘దేశభక్తి’,‘పూర్ణమ్మ’, శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ ‘కవితా ఓ కవితా’, సురవరం ‘పద్మినీ పరిణయం’, చెరబండరాజు ‘వందేమాతరం’, నగ్నముని ‘కొయ్యగుర్రం’, శివారెడ్డి ‘వృద్ధాప్యం’,నందిని సిధారెడ్డి ‘చేతులు’, గుడిహాళం ‘మంచు’, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘వాగు’, జూకంటి జగన్నాధం ‘వాస్కోడిగామా.కాం’, బైరెడ్డి కృష్ణారెడ్డి ‘వీడ్కోలు నామా’, సతీశ్ చందర్ ‘పంచమవేదం’ కొన్ని ఉత్తమ ఉదాహరణలు.
నిర్వహణ పద్ధతిని శివసాగర్ ‘కుట్ర’ అనే కవిత నిర్మాణం ద్వారా విశ్లేషించొచ్చు. విప్లవ రచయితల మీద, కార్యకర్తల మీద, విప్లవకారులమీద అప్పటి ప్రభుత్వం పెట్టిన పార్వతీపురం, సికింద్రాబాద్ కుట్ర కేసులు, ఈ కేసుల గురించి న్యాయమూర్తుల ముందు హాజరయి ‘‘విప్లవం కుట్రకాదు, రచయితలు కుట్రదారులు కాదు’’ అని చేసిన వాదన ఈ కవిత నేపథ్యం. ఈ అంశాన్ని ఇలాగే చెప్తే కవిత అయ్యేది కాదు. తద్భిన్నంగా ఇలా మొదలు పెట్టి డ్రై సబ్జెక్టును కవితాత్మకం చేసిండు కవి.
‘‘న్యాయమూర్తులుంగారూ సూర్యోదయం కుట్ర కాదు సూర్యుడు కుట్రదారుడు కాదు’’
‘కుట్ర’ పదానికున్న నెగెటివ్ అర్థాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజ వైరుధ్యాల ఫలితంగా జరిగే సహజ పరిణామాన్ని ‘సూర్యుడు’ అనే ప్రతీక ద్వారా స్పష్టం చేసిండు. ఈ మార్పు (విప్లవం) రాకుండా చేసే ప్రయత్నాలను -
‘‘భూమిని చాప చుట్టగా చుట్టి చంకనపెట్టుకున్న రాక్షస భూస్వామ్యం కుట్ర నా దేశాన్ని విదేశాలకు తెగనమ్మే దళారీదనం కుట్ర భారత మహతంత్రం కుట్ర, బాలెట్ బాక్స్ కుట్ర గరీబు హఠావో కుట్ర ఇందిరమ్మ మందహాసం కుట్ర’’
అని చెప్పి ఒక సంఘర్షణను( conflict ) ను చెప్పడం ద్వారా కవితాంశాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళిండు. సాధారణ అర్థంలో మొదలుపెట్టి పాఠకుడి సమ్మతిని సాధించుకుంటూ నిర్ధిష్టతకు తీసుకొచ్చి,
‘‘శ్రీకాకుళ సూర్యోదయం కుట్ర కాదు
గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు’’
అని నక్సల్బరీ, శ్రీకాకుళ, తెలంగాణ విప్లవోద్యమం జరగాల్సిందేనని పాఠకుడి చేత అనిపిస్తూ ముగిస్తాడు. ఇక్కడ కవి, పాఠకుడు తాదాత్మ్యం చెందుతరు. ఈ నిర్వహణ ద్వారా కవి సాధించిన విజయం ఇది. వ్యంగ్యాత్మక నిర్వహణకు ఒక మంచి ఉదాహరణ ఏనుగు నరసింహారెడ్డి రాసిన ‘వాళ్ళు కష్టపడతరు సార్’ అనే కవిత.
ముగింపు
సాంప్రదాయికార్థంలో ముగింపు అంటే సందేశం. ఆధునికార్థంలో కవి దేనిని లక్ష్యిస్తున్నడో అది, పాఠకుణ్ణి చేరడం. ఏ అంశం కవిని కలవరపరుస్తుందో కల్లోలం రేపుతుందో ఒక చోట కూసోనివ్వకుండ నిలబడనివ్వకుండా చేస్తుందో దానిని అదే స్థాయిలో పాఠకుడిలో కలిగించడం. కవీ పాఠకుడూ కలగలిసిపోయి ఏకీకరణ చెందడం. దీన్నే ప్రాచీనులు సాధారణీకరణం అన్నరు. ఆధునికులు ఐడెంటిఫై కావడం అన్నరు. ఇద్దరూ అద్వైత స్థాయిని పొందడం ముగింపు. నాకు తెలిసి సిద్ధాంత కర్తలు తప్ప ముగింపును ముందే నిర్ణయించుకొని రాయరు. రామాయణం అట్లా రాసింది. భారతం తద్భిన్నంగా రాసింది. అందుకే రామాయణం మూస. భారతం ఆర్గనిక్.
ముగింపు కవి నిర్ణయం కాక కవిత్వ నిర్ణయం కావాలె. కవితలోంచి Evalve కావాలె.అదే సహజమైన ముగింపు. అట్లా లేనివి సినిమాటిక్ ముగింపులనిపించేది అందుకే.
నేను విప్లవ తాత్వికత ప్రభావంలో ఉన్నంత వరకు రెడీమేడ్ ముగింపుల్నే ఇచ్చేవాడిని. అది ‘తోవ ఎక్కడ’ సంకలనంలో తొలిదశ కవితల్లో కనబడుతుంది.
తదనంతర కవితల్లో ఆ కవిత అంశం దాని పరిణామం ముగింపును నిర్ణయించింది.
ముగింపు కవిత మూలాల్లోంచి చెలిమెలోంచి మొదలు కావాలె. అది తంగెడ పూలనందిస్తుందా, మోదుగు పూల నందిస్తుందా, గోగుపూల నందిస్తుందా, గునుగు పూలనందిస్తుందా-నేల ప్రతిఫలనం పువ్వు.
ముగింపు అనేది ఎత్తుగడలా టెక్నిక్ కాదు, కవికీ పాఠకుడికీ సంగమ స్థలం.ఇరు హృదయాల ఐక్యతా స్థలం.
90 దశకంలో పెనుగాలిలా వీచిన దళిత కవిత్వం అగ్రవర్ణాలను బోనులో నిలబెట్టింది. అది తట్టుకోలేని ఒక అగ్రవర్ణ కవి ‘నేనూ దళితుణ్ణే’ అని ఒక డిఫెండింగ్ కవిత రాసిండు. దీనికి సమాధానంగా పగడాల నాగేందర్ Offencive tone లో రాస్తూ
‘‘ఆ రోజే మీతాత నా కుల కవి పాదానికి గండపెండేరం తొడిగితే’’ ‘‘వైతాళికులు’’లో నా జాషువా లేడెందుకని?..’’. అని ప్రశ్నిస్తూ -
’’నువ్వు నాలాగా సహ బాధితుడివైతే నిత్యం ఆకలితో చస్తున్నవాడివైతే ధైర్యంగా నాయింటికి రారా గుండెల్నిండా ప్రేమ నింపుకొని గొడ్డు మాంసంతో అన్నంపెడతాను... తరతరాలుగా అస్పృశ్యుడ్ని చేసిన ఆ శాస్త్రగ్రంథాలనూ వేదపఠనాలనూ ఎడమకాలతో తన్ని మనిషిగా బతకడానికి నాతో కలిసి రారా’’
అని ముగిస్తాడు. ఈ ముగింపుతో ‘నేనూ దళితుణ్ణే’ అనే అగ్రవర్ణ కవి ‘బాధలో నిజంలేదు’ అని స్ఫురింపజేస్తాడు. అది పాఠకుడికి కూడ అవుననిపిస్తుంది. అట్లా అవుననిపించేలా చేయడం మంచి ముగింపు.
‘కాళ్లు కవాతులై చేతులు ఎక్కుపెట్టిన ప్రశ్నలై దేహమంతా ఒక పేరిణి తాండవమై ఆర్తిలోంచి ఆత్మలోంచి వెలువడే సప్త సముద్రాల హోరుపాట’
అని పాటను గురించి వివిధరకాలుగా వర్ణించిన ఎన్.గోపి ఆ కవితను ఇలా ముగిస్తాడు.
‘‘తెలంగాణ పాడిందే పాట తెలంగాణను కాపాడిందే పాట’’
ఈ ముగింపుతో పాఠకుడు ఝటిత్ స్ఫూర్తికి లోనౌతడు.
ఒక కోస్తాంధ్రుడు మంగలి వృత్తిని అవహేళన చేసినప్పుడు వనపట్ల సుబ్బయ్య ఆత్మవిశ్వాసంతో జవాబుగా రాసిన కవితను ఇలా ముగిస్తాడు -
“నీ కుర్చీలో నీ వొక్కడివే రాజు నా కుర్చీలో జనమంతా రాజులే నీ కుర్చీకి ఐదేళ్ళే నాకుర్చీ అనంతం’’
మంచి ముగింపు కొక ఉదాహరణ ఇది.
శిల్పం
కవితా శిల్పంలో పైన పేర్కొన్న అన్ని అంశాలు భాగాలే. ‘ఆలంకారికత’ కూడా శిల్పంలో భాగమే.కవిత్వ అభివ్యక్తి పద్ధతులలో ‘ఆలంకారిక’ మార్గం ఒకటి.
మామూలు Communicative భాష నుంచి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఉపకరణాల్లో ఆలంకారికత ఒకటి.
ఒక ఊర్లో పెండ్లం మొగల పంచాయితీ నడుస్తుంది. పెద్దమనిషి అడిగిండు.
‘మొగుడ్ని ఎందుకొద్దంటున్నావమ్మా’
ఆమె అన్నది -
‘‘మూడు సొప్పకట్టల్దినే ఆవుకు ఒక్క సొప్పకట్టి ఏస్తే సాల్తదా? అది అవతలి దొడ్డికై జూస్తదా లేదా’’ (నా చిన్నప్పుడు విన్న మాటలివి.అప్పుడర్థం కాలేదు. మా నాయనకు పెద్దమనిషిగా మంచి పేరు కాబట్టి తలాకిట్ల ఇసొంటి పంచాయితీలు చాలా నడ్సేయి.)
ఇక్కడ అలంకార ధ్వని ఉన్నది.అంటే చెప్పదల్చుకున్నదాన్ని వాచ్యం చేసి (అంటే బాహాటంగా చెప్పి) తనను పల్సన జేసుకోకుండా, పోలిక ద్వారా అర్థం కావలసిన వాళ్ళకు అర్థమయ్యే ఆలంకారిక భాషను ఆమె వాడింది. ఇది ఆలంకారిక భాష. దీనినే కవిత్వ భాష అంటరు. (ఇలాంటివి వెనుకుబడిన సమాజాల్లో కోకొల్లలు. అసొంటి సమాజానికే చెందిన గాథాసప్తశతిలో ఇసొంటి వెన్నో ఉన్నయి)
కవి చెప్పదల్సుకున్న విషయాన్ని (వర్ణనీయ అంశాన్ని) వినేవానికి (పాఠకుడికి) కళ్ళకుకట్టినట్లు చెప్పడానికి అంటే దృశ్యమానం చేయటానికి వినేవాడికి తెలిసిన పోలిక తెచ్చి అతనికి అర్థమయ్యే విధంగా (హృదయాని కత్తుకునే విధంగా) వర్ణిస్తడు. ఈ పోలికే (ఉపమానం) అన్ని అర్థాలంకారాలకు మూలం. పాశ్చాత్య సాహిత్యంలో వచ్చిన Imagism ఉద్యమ ప్రభావంతో మన ఉపమ, రూపకాలంకారలను మిళితం చేసి ఇమేజ్ అంటున్నరు. దీన్ని భావచిత్రం, పదచిత్రం, భావ ప్రతిమ అని తెలుగులో అంటున్నరు. ఇందులో కూడ పోలికే ముఖ్యం.
ఈ పోలిక తేవటానికి కవికి గొప్ప భావనాశక్తి (Imaginative eye) నిశితపరిశీలనా శక్తి అవసరం. ఇవి ఉన్నవాడే కవి.
‘‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాయి నా అక్షరాలు ప్రజాశక్తులనావహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమయిన ఆడపిల్లలు’’ (తిలక్)
ఇక్కడ కవి తన కవిత్వం ఎలాంటిదో చెప్పడానికి మూడు పోలికల్ని తెచ్చిండు. తన కవిత్వం కరుణరసాత్మకం, ఉత్తేజాత్మకం, ఆనందదాయకం అని చెప్తే అది కవిత్వమయ్యేదికాదు. ఆ మూడు పోలికల్ని తేవడం వల్లే కవిత్వమయ్యింది. అట్లా చెప్పడం వల్లే హృదయానికత్తుకుంది. అందుకే ఇంతకాలమూ పాఠకులకు గుర్తుంది. ఈ పోలికలు తేవడం వల్ల కవిత్వ ప్రయోజనంలోని మూడు పార్శ్వాలను చెప్పడం సాధ్యమయింది.
సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం ఎగరేసిన ఎర్రని జెండా... కావాలోయ్ నవ కవనానికి’’ (శ్రీశ్రీ)
ఇవన్నీ అప్పుడు కొత్తగా రాబోతున్న అభ్యుదయ కవిత్వానికి వస్తువులు. కాదు ఆ కవిత్వం ఎలా ఉండాలో చెప్పే పోలికలు.
‘‘ప్రజలను సాయుధం చేస్తున్న రెవెల్యూషనరీ నేడు కవి’’ విప్లవ కవి ఎలా ఉండాలో చెప్పడానికి ‘రెవెల్యూషనరీ’ పోలికను తెచ్చిండు.
దళిత కవిత్వం ఎలా ఉండాలో, ఉంటుందో చెప్పడానికి మరొక కవి ఇలా అనేక పోలికలు తెచ్చి చెప్పిండు.
‘‘కవిత్వమే నా ఎండు తునకలదండెం కవిత్వమే నిప్పుల సెగ మీద కాపబడ్తున్నడప్పు కవిత్వమే మా తోలు చెప్పు మీది ఉంగుటం అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితవాడ కార్చుతున్న నెత్తుటి మరకా కవిత్వమే’’ (పసునూరి రవీందర్)
ఈ అన్ని కవితల్లో కవిత్వం ఎలా ఉంటుందో చెప్పటానికి తెచ్చిన పోలికలు తెలుగు కవిత్వ పరిణామాన్ని గూడ సూచిస్తున్నవి.
కవిత్వం నిరంతరం మారుతుందని, అనవరతం నవనవంగా వస్తుందని అట్లా ఎప్పుడూ కొత్తగా వచ్చేదే కవిత్వమవుతుందని సూచించడానికి ఒక కవి ఇలా పోలికలు తీసుకొచ్చి మన కళ్ళముందు పరిచిండు.
‘‘స్వరాలన్నీ నెమలిరెక్కలైతే అపస్వరమై పలికే కాకి కవిత్వం కాకులన్నీ కలభాషిణులైతే కనుమరుగైతున్న కోయిల గండస్వరమే కవిత్వం కప్పలకు రెక్కలొచ్చి ఆకసంలో ఎగరడం పక్షులకు మొప్పలొచ్చి సంద్రంలో ఈదడం కవిత్వం’’ అద్దం అద్దకంగా మారితే బద్దలు చేసే రాయి కవిత్వం
భావ కవులంతా పదలాలిత్యంతో కవిత్వం రాసి అది చర్విత చర్వణమైనప్పుడు
‘పమోధర ప్రచండ ఘోషం ఖడ్గ మృగోదగ్ర విరావం ఝంఝానిల షడ్జధ్వానం’
అని రాస్తే కవిత్వం అయింది. మళ్ళీ అందరూ అదే పద్ధతిలో రాసి అది పాతబడ్డప్పుడు, తిలక్ మృదువుగా రాస్తే కవిత్వం అయింది. ఇది అలంకారలకు, ఇమేజ్‍లకూ వర్తిస్తుంది. ఒకప్పటి కవికి స్త్రీ కళ్ళు చేప ఆకారంలో కనిపించి ఆమె ఆకర్షణీయంగా ఉందనేదాన్ని దృశ్యమానం చేయడానికి ‘మీనాక్షి’ అన్నడు. ‘మీన నయన’ అన్నడు. ఇమేజ్‍లు పాతబడి దృశ్య ప్రసారం చేయలేని స్థితి ఏర్పడినప్పుడు కవి కొత్త పోలికలను తేవాలె.కవి భాషా సృష్టికర్త అయ్యేది అలాంటి సందర్భంలోనే. ఇప్పుడు కొన్ని అలంకారల సొగసులను చూద్దాం -
‘‘తంత్రి నుండి నువ్వొక నవ్వు రువ్వుతావు ఆకాశం నుండి మృదుల సాంద్రపు వడగండ్లు కురిసినట్లు నేల నీటి నిశ్చలత్వం మీద ఒక వింత అలజడి మొదలవుతుంది’’ (ఏనుగు నరసింహారెడ్డి)
నవ్వు అది కలిగించిన అలజడి -ఇవి అమూర్తమైనవి. ఎన్ని పదాల్లో చెప్పినా నవ్వు స్వభావం, అలజడి స్వభావం అభివ్యక్తం కావు. అందుకే కవి ‘మృదుల సాంద్రపు వడగండ్ల’ పోలిక ద్వారా నవ్వు స్వభావాన్నీ, ‘నిశ్చలమైన నీటిలో కలిగిన ప్రకంపన’ పోలిక ద్వారా అలజడి స్వభావాన్నీ దృశ్య మానం చేసినాడు. అలంకారం వల్ల కలిగే ప్రయోజనమిదీ.
కూరల్లోకి తలా ఒక రెమ్మా తుంచుకెళ్ళితే మిగిలిన కరేపాకు మొక్కలా వున్నాడు (శివారెడ్డి)
‘‘కళ్ళు చూపుల ముత్యాలు పొదిగిన చర్మపు దోనెలు చర్మపు పత్రాలు తొడిగిన చైతన్యపుష్పాలు గుండెల సముద్రాల బాధల బడబాగ్నుల్ని తోడి బొట్టు బొట్లుగా కార్చే అనుభూతుల ఏతాలు కళ్ళు’’ (నిజం)
ఇక్కడ కవులు వాడిన అద్భుతమైన పదచిత్రాల వలన వారు చెప్పదలచుకున్న భావం ఎఫెక్టివ్‍గా చదువరిని తాకింది.
క్లుప్తత
నిజానికి క్లుప్తత, గోప్యత రెండు వేరు వేరు లక్షణాలు. కొన్ని సందర్భాల్లో రెండూ మిళితమవుతవి. ముందు క్లుప్తత గురించి మాట్లాడుకుందాం. కవిత్వ అభివ్యక్తిలో రెండు రీతులున్నవి. ఒకటి Discriptive రీతి, రెండు Prescriptive రీతి. మొదటిది వర్ణనాత్మకం. ఈ రీతిలో అలంకారాల ఉపయోగానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రతి సూక్ష్మాంశ వర్ణన ఈ రీతిలో ఉంది. కాబట్టి అలంకార మయంగా ఉంటుంది. రెండవది సూచనాత్మక రీతి. ఈ రీతిలో క్లుప్తతకు లేదా సంక్షిప్తతకు అవకాశం ఉంటుంది. పద్య ఛందస్సులో సీసం, వృత్తాలు వర్ణనాత్మక రీతికి వాహికలైతే కందం, తేటగీతి ఆటవెలదులు సూచనాత్మక రీతికి వాహకాలు అని అందరికీ తెలిసిందే. వచన కవిత్వంలో మినీ కవితలు, హైకూలు, నానీలు క్లుప్తతకు వాహికలు. పెద్ద కవితల్లో కూడ విడి అంశాత్మక భాగాలు కూడ వాహికలే. వర్ణనాత్మక రీతికి ఊహ,భావుకతలు(Imagination), రసాత్మకత, కాల్పనికతలు ప్రాతిపదికలు. సూచనాత్మకరీతికి ఆలోచనాత్మకత, వాస్తవిక దృష్టి, సూత్రీకరణ, తాత్వికీకరణ, సాధారణీకరణ, ధ్వన్వాత్మకత ప్రాతిపదికలు. ఈ రీతిలో కవికి దార్శనికత, ఎంతో పరిశీలనా శక్తి అవసరం. మానవుల అనుభూతుల్లోని,ఉద్వేగాల్లోని, ఆలోచనల్లోని Generality ని కవి పట్టుకోవాలె. సామాజిక పరిణామంలోని ఘర్షణని గుర్తించాలె.సామాజిక చలన దిశను పసిగట్టాలె. అప్పుడు ఒక తత్త్వవేత్తలా సూత్రీకరించాలె. ఇక్కడే కవి తాత్త్వికుడు కావాలె. తాత్త్వికుడు కవి కావాలె. ప్రజల్లోని వేలాదిమంది అజ్ఞాత కవులు, తాత్వికులు రూపొందించిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ళ క్లుప్తతకు తిరుగులేని ఉదాహరణలు.
‘ఆకలి తీరిన వాడికి తెలుసు గురి పేల్చే గుండె ఏ గుండెను చీల్చనుందో ట్రిగ్గర్ నొక్కే వెలికి తెలుసు హంతకులెవరో నాకు తెలుసు’ (నగ్నముని - కొయ్యగుర్రం)
ఇక్కడ కవి ఒక సూత్రీకరణ చేసిండు. అంటే ఎన్నో పేజిల్లో చెప్పవలసిన విషయాన్ని అయిదు వాక్యాల్లో చెప్పిండు. అయితే అందువల్లనే ఇది కవిత్వం కాలేదు. ఆ అంశాన్ని తార్కికంగా చెప్పినందువల్ల గూడ కవిత్వం కాలేదు. క్రమబద్ధమైన వాక్యాల్లో చెప్పినందువల్ల కవిత్వమయింది. అది క్లుప్తతకూ కారణమైంది.
తనుపుండై వేరొకరికి పండై
తను శవమై వేరొకరికి వశమై
తను ఎడారై ఎందరికో ఒయాసిస్సై (అలిశెట్టి ప్రభాకర్)
బాగా ప్రసిద్ధి చెందిన ఈ కవిత, దేశంలోనే కాదు ప్రపంచంలోని వేశ్యలందరికీ ప్రాతినిధ్య కవిత. వెయ్యి పేజీల వేశ్యా జీవితాన్ని ఆరులైన్లలోకి కుదించి క్లుప్తతకు ఉదాహరణగా నిలబెట్టిన కవిత. (అయితే ఈ కవిత నిర్మాణాన్ని కొద్దిగా మార్చి ప్రతి రెండు పాదాలయూనిట్‍లో పై పాదం కిందికి వస్తే మరింత ఔచిత్యవంతమూ మరింత కరుణ రసాత్మకం అయి ఉండేది. ఎందుకంటే తను పుండైన తరువాత పండుకాలేదు. పండైన తర్వాతే పుండయింది. తను శవమై వశం కాలేదు. వశమయినంకనే శవమయింది. తను ఎడారైనంక ఒయాసిస్సు కాలేదు. ఒయాసిస్సైనంకనే ఎడారైంది.)
‘‘అప్పుడు గడీని చూస్తే ఉచ్చ బడేది ఇప్పుడు గడీలోనే ఉచ్చబోస్తున్నరు’’ (అన్నవరం దేవేందర్)
ఇది సామాజిక పరిణామాన్ని నిశితంగా పరిశీలించినందువల్ల వచ్చిన క్లుప్తత. ఇక్కడ గూడ క్రమబద్ధమైన (Rythematic) పదాల ఎన్నిక, వాక్య నిర్మితి వల్ల కవిత్వమైంది. ఇక్కడే తాత్వికుడి కంటె కవి ఉన్నతుడయ్యేది. తాత్వికుడు ఇంత కన్నా గొప్పగా సూత్రీకరించగలడు కాని ఇలా హృదయాన్ని తాకేలా చెప్పలేడు. వినసొంపుగా చెప్పలేడు.
ఉదయం కానేకాదనడం నిరాశ ఉదయించిన సూర్యుడు అలానే ఉండాలనడం దురాశ (కాళోజీ)
ఇలాంటివెన్నో కవితలు - శ్రీశ్రీ ‘‘ఆః’’, స్మైల్‘‘ఈ బాధకు టైటిల్ లేదు’’, నా.రా ‘‘అపస్వరాలు’’ కొన్ని. అలాంటి కవితల్ని లోతుగా చదివితే క్లుప్తతను ఎలా సాధించవచ్చో అవగతమవుతుంది.
గోప్యత
ఇక గోప్యత గురించి, గోప్యత అంటే వాచ్యానికి విరుద్ధమయినది. బయటికి చెప్పే అర్థం వాచ్యార్థం. దీని వెనుక దాగి ఉండే మరొక అర్థమే గోప్యం. దీనినే లాక్షణికులు వ్యంగ్యం, ధ్వని అన్నరు. పాశ్చాత్య విమర్శకులు suggestion అన్నరు. ఈ రీతిని సి.నారాయణరెడ్డి గారు ‘కప్పి చెప్పడం’ అని సరళంగా చెప్పిండ్రు. దీనివల్ల కూడ కవితకు క్లుప్తత సమకూరుతుంది. పైన పేర్కొన్న అన్నవరం నా.రా కవితలు ధ్వనికి కూడ మంచి ఉదాహరణలు. ‘గాథాసప్తశతి’లోని అనేక పద్యాలను ఆనందవర్ధనుని లాంటి లాక్షణికులు ధ్వనికి ఉదాహరణలుగా తీసుకున్నరు. అలాంటి పద్యమొకటి ఇది.
‘‘ఇచట నే పరుందు, నిచ్చట నత్తగా రిచట పరిజనంబుల్లెల; వినుము రాత్రి నీకు గానరాదు; నా పడుకపై తప్పి పడెదవేమొ దారికాడ!’’(గాథా సప్తశతి)
ఇక్కడ వాచ్యార్థం (పైకి చెప్పేది) మీద పడొద్దని, స్ఫురింప జేసే అర్థం (ధ్వని) మీద పడుము అని. దీనిలోని స్వారస్యమేమిటంటే వాచ్యార్థం తన అత్త, పరిచారికుల కోసం. వ్యంగ్యార్థం బాటసారి కోసం. ఎవరికి అర్థం కావలసింది వారికి అర్థమవుతుంది.
తమిళ తంబికి భయపడి మా నగరానికి వలస వచ్చిన వాడా నగరం మాది భాగ్యం మీది (నల్లవలస)
భాగ్యనగరం (హైదరాబాద్) శబ్దాన్ని విరవడం ద్వారా సంపదంతా కోస్తాంధ్రుల వశమైందన్నది ఇక్కడ గోప్యంగా చెప్పబడినది.
‘ఇద్దరి కిద్దరం వొక అబద్దాన్ని మోస్తూనే భరిస్తూనే ఖర్మ ఖర్మ అంటూనే... చూడూ ఈ చరిత్రలోకి మనిద్దరం ఎవరో తోస్తే ఎక్కినట్టు ఎక్కి తకధీమ్ తకధీమ్ తై నీ పాత్ర నేనూ నా పాత్ర నువ్వు ఎవరూ ఎవరి పాత్రకి న్యాయం చేయలేక ఇద్దరికిద్దరం అన్యామయ్యి తోస్తూనే ఉన్నాం’...
‘చూడు, ఈ విస్తరిలోకి మనిద్దరం మనికి తెలియకుండానే వచ్చాం..’
‘‘నువ్వు నాకు కనీసం ఎంగిలిమెతుకులు కూడా విదిలించని ఉషారు పిట్టవని నాకూ తెలుసు నేను నీమోచేతి నీళ్ళ కోసం కాచుక్కూచోని కావు కావుమనే పిచ్చికాకి కాదని నీకూ తెలుసు సర్లే ఈ నాటకం ఆడింది చాలు నన్ను నాదారిన పోనీ నీకెటూ వందదారులు’’ (అఫ్సర్)
ఇట్లా ఈ కవితను చదువుకుంటూపోతే, పోసగని సంసారం లేదా సహజీవనం చేస్తున్న స్త్రీ పురుషుల గురించి రాసినట్టు అనిపిస్తుంది. పురుషుడి మీద స్త్రీ ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తుంది.
‘నవంబరు వొకటి రంగస్థలమ్మీదకి’ అనే పాదం ద్వారా ఇది ‘సంసారం’ గొడవ కాదని తెలంగాణ - ఆంధ్ర గొడవని స్ఫురించడం మొదలవుతుంది. ‘ఇద్దరికిద్దరం అన్యాయమయ్యి’ అనే మాటల ద్వారా పొసగని భార్యాభర్తల (ఎందుకంటె నవంబర్ 1, 1956లో జరిగిన తెలంగాణ ఆంధ్రల విలీనం తర్వాత నష్టపోయింది ఇద్దరు కాదు. తెలంగాణ ఒక్కటే) గొడవ అని అనిపింపజేస్తాడు. కాని -
‘నా పొలాల్నీ నా నీళ్ళన్నీ నువ్వు నా చేతుల్లోంచీ మోచేతుల్లోంచీ కాలివేళ్ళలోంచీ కంటి నీడల్లోంచీ ఎటుకనిపిస్తే అటు దోచేస్తూపోతావ్’
అనే మాటల ద్వారా తెలంగాణ వేదనని స్ఫురింపజేస్తాడు. అంటే ఈ కవితలో తెలంగాణ అంశం వాచ్యంగా కాక ధ్వన్యాత్మకంగా చెప్పడం జరిగింది.
పొడుపు కథలు ధ్వన్యాత్మకతకు లేదా గోప్యతకు గొప్ప ఉదాహరణలు. ఒక ఉదాహరణ;
ఒక స్త్రీ విటుడితో ఇంట్లో ఉంటుంది. అప్పుడు దూర ప్రాంతాలకెళ్ళిన భర్త వచ్చి తలుపు కొడతడు. అప్పుడామె తలుపు తీయడానికెల్తూ ఈ పాట పాడ్తది.
‘సగం జచ్చేను నీ కోసం (ఎర) సాంతిం జచ్చేవు నాకోసం (చేప) వచ్చికూసున్నడు మన కోసం’ (భర్త)
బ్రాకెట్లో రాసిన అర్థం భర్త కోసం చెప్పే వాచ్యార్థం. తన భర్త వచ్చాడు పారిపొమ్మని చెప్పే హెచ్చరిక గూఢార్థం. కవిత వాచ్యమైతే పేలవమవుతుంది. సూచ్యంగా రాస్తే సొగసుగా ఉంటుంది.
సంపూర్ణత-సమగ్రత
కవితకు సంపూర్ణత, సమగ్రతలను చేకూర్చే అంశాలు ప్రతీకలు, పదచిత్రాలు, అభివ్యక్తులు మాత్రమే కాదు. వస్తువును బట్టి ఉంటుంది అది. conflictను ప్రెజెంట్ చేసే వస్తువైతే అనుకూల ప్రతికూల వాదనను ఉద్వేగాత్మకంగా నిలబెట్టే పద్ధతి ద్వారా సమగ్రత సిద్ధిస్తుంది. వస్తువు పాతదైనప్పుడు పై మూడింటి(ప్రతీకలు, పదచిత్రాలు, అభివ్యక్తులు)కి ప్రాధాన్యత ఉంటుంది. సమగ్రత దృష్ట్యా మాత్రమేగాక ఇతరత్రా కూడ వీటికి సముచిత స్థానం ఉంది.
అసలైతే కవితను ఒక ప్రాణిగా, ఒక జీవిగా భావించాలె. తల్లి నవమాసాలు మోసి తన సమస్తాన్ని ఆ జీవిలోకి ప్రసరించి సలక్షణమైన ( సకల అవయవాలు సమనిష్పత్తిలో ఉండే ఒక ప్రాణి) బిడ్డకు జన్మనినిచ్చినట్టు,కవి నుంచి పుట్టిన కవితకు కూడా ఆ సలక్షణత ఉండాలె. ఈ సలక్షణతనే సమగ్రత లేదా సంపూర్ణత అనొచ్చునేమో. చిత్రకారుడికి కన్ను ఇష్టమైతే కన్నును చన్ను ఇష్టమైతే చన్నును Unproportionate గా గీస్తే అది అనౌచిత్య చిత్రమవుతుంది. సకలవయవాలు తగిన నిష్పత్తిలో ఉంటేనే ఆ చిత్రానికి సమగ్రత చేకూరుతుంది. లేకపోతే అది అతని వికృత మనస్సుకు ప్రతిరూపమై ఎబ్బెట్టుగా ఉంటుంది.
ఈ దృష్టితో పై మూడింటిని గురించి మాట్లాడుకోవాలె
“ఒకటి తెలుసా నేను రాయి విసిరినపుడు నీకు పగిలిన అద్దం మాత్రమే కనిపిస్తుంది నాకు తెలంగాణ చిత్రపటం కనిపిస్తుంది’’ (అంబటి వెంకన్న)
‘‘ఈ దాడి పరాయీకరణ మీద ఓ ప్రతీకారం ’’(వఝల శివకుమార్)
‘‘ప్రజాగ్రహానికి పరీక్షపెడితే విగ్రహాలేం కర్మ విద్రోహులూ నేలకూలక తప్పదు’’ (గాజోజు నాగభూషణం)
కాకి కన్ను ఎండుగు మీదున్నట్లు గద్దకన్ను కోడిపిల్లల మీదున్నట్లు మొగకండ్లు ఆడోళ్ళమీదనే బిడ్డా (శ్రీదేవి)
మా ఊరు మధ్య ఓ బురుజు బురుజు మీద ఒక చెట్టు మహా గొప్ప దృశ్యం మనిషి గొడుగు పట్టుకుని నిలుచున్నట్టుండేది (కందుకూరి శ్రీరాములు)
నేలతల్లి గుండెల్లో నిక్షిప్తమయిన నల్ల వజ్రం కాంతి వాడు జీవితాన్ని చుట్టచుట్టి బరువు నెత్తుకున్న చూలాలి తట్ట కింద మెత్తగా ఒత్తుకున్న చుట్టబట్ట వాడు (దేశపతి శ్రీనివాస్)
నిత్య విస్ఫోటనం చెందనిదే సూర్యుడు నిప్పులు చెరిగేనా తనువు నిలువెల్లా చీలనిదే భూమి ప్రాణదాతయై నిలిచేనా (గాజోజు నాగభూషణం)
‘‘అరవయ్యేళ్ళ క్రితం ముందు అరవయ్యేళ్ళ క్రితం అరవై నెలల క్రితం అరవై వారాల క్రితం నన్ను చంపేశారు. అరవై రోజుల క్రితం అరవై గంటల క్రితం అరవై నిమిషాల క్రితం అరవై ఘడియల క్రితం నన్ను చంపేశారు. రేపూ ఎల్లుండీ వచ్చేవారమూ వచ్చే నెలా వచ్చే సంవత్సరమూ చంపేస్తారు నన్ను’ (దెంచనాల శ్రీనివాస్)
‘‘ఉలి నాదే నేర్పు నాదే శిల్పమూ నాదే శిల్పిని తానంటడు ’’ (కాసుల ప్రతాపరెడ్డి)
లేగదూడ నాలుకపై పాల పొదుగు కురిసినట్లు తుమ్మెద నోరు తెరిస్తే పువ్వులో తేనె ఊరినట్టు మేఘంతో వాగు జతగూడిన చోట నా తెలంగాణ తంగెడు పువ్వులా పలకరించేది (సి.కాశీం)
పజ్జొన్న విత్తుల్లో పలికి పగిలి దాక్కున్న పొద్దులం మనం పోరులం మనం (సిద్దార్థ)
యేండ్ల నుండి సున్నం జాజుల్లేక పాతమట్టి గోడల యిల్లు అల్‍కబకు తీసుకుపోతున్న బక్కావులెక్క బొక్కల్దేలింది (నారాయణస్వామి)
ఇంటింటికో ఇంజినీరు అమెరికా వెళ్తాడు వలస వస్తున్న డాలర్లు కన్నీళ్ళను మోసుకొస్తాయి (రామా చంద్రమౌళి)
‘‘ఆర్థిక వచనమే రాస్తానిక నుంచి రూకలిస్తావా తోడేళ్ళు తప్ప ఏవీ తినకుండా ఈ మేకలకు కాపలా వుంటాను మానాలు అమ్ముతాను నా ఇష్టానికి కొంటాను మలమూత్ర పిండాల్ని ఏదో ధరకి గిట్టించుకొంటాను సరేనా’’ (సీతారాం)
కోట్లు గడించినా చీట్ల పేక మేడ నీ బతుకు అద్దరూపాయి సంపాదించినా అమృత తుల్యం నా మెతుకు... జ్వలించడం తెలియని మంచు ముద్దవు గమించడం తెలియని గోడ సుద్దవు (నీకూ నాకూ ఏం పోలిక- సి.నారాయణరెడ్డి)
పశువుల కాపరి
అనుభవ గీతాన్నె
రైతు వేసిన పోలికేక పిలుపునై
వేసవినై వెన్నెల వన్నెలు కురిసిన పువ్వునై
వడ్ల పిట్టనై వర్షం బొట్టునై
వెలుగు చుక్కనై
చలినై చాపబొంతనై
గొంగడి కొప్పెరనై
వేడినై కాలిబేడినై
దండెకడియాన్నై
చెవిపోగునై కరుకు చుట్టనై
ఆకునై
ఆకుసందుకాయనై
పండునై.... బండినై
బండి చక్రం చప్పుడునై
తాడునై తాడు ఒరుస్తున్న చేతినై
పదం అందుకున్న నోటి తమలపాకు వాసనై
దగాపడ్డ గుండెలో ఊసునై (రంగులూ రాగాలు - బి.నరసింగరావు)
‘తన్నుకొచ్చే ఏడ్పుని కంటి పెదాల కింద దాచడం సూర్యుణ్ణి కొండల వెనుక దాచినంత కష్టం’
‘కన్నీటి తడి గడియారం ముళ్ళకి దొరక్కుండా నన్ను నాలోని సుడిగుండాల్లోకి విసిరేశారు’ (జిలుకర శ్రీనివాస్)
‘నీటి ధార కింద సాలె గూడల్లుతున్నం’ (జ్వలిత)
‘‘ముల్లు గుచ్చుకున్న పాదమే గొంతు విప్పాలె అరిటాకే ముల్లు గురించి తీర్పు చెప్పాలె’’(సుంకిరెడ్డి నారాయణరెడ్డి)
ఇన్ని ఎందుకు పేర్కొన్న అంటే ఈ ప్రతీకలు పదచిత్రాలు అభివ్యక్తి విభిన్నతలు ఆయా కవుల కవితలకు పుష్టిని చేకూర్చినవి కాబట్టి.
ఒక్కోసారి కవిత ఉత్తవచనమైనప్పుడు, కేవలం Skeletin గా ఉన్నప్పుడు, ఇలాంటివి ఆ కవిత మొత్తాన్ని వెలిగిస్తవి. దానికి రక్తమాంసాల పుష్టి నిస్తవి.
కవిత శీర్షిక, ప్రారంభం, ముగింపు- ఇవికాక మిగతా కవిత Body ని structure ని నింపి పాఠకుడిని తాధాత్మ్యం చెందే దిశగా కవితాంశాన్ని నడిపే చట్రం ఇది. కవీ పాఠకుడూ సమాంతరంగా నడిచి ఇద్దరూ వాహ్ అనే స్థాయి వరకూ తీసికెళ్ళే నిర్మాణమిది. మన ఆలంకారికులు చెప్పిన విభానుభావ వ్యభిచారీ భావాల మీదుగా peak దశకు తీసికెళ్ళే పూర్వరంగ మిది. కవి అందించదల్సిన అంశాన్ని పాఠకుడి గుండెలో ముద్రించే దిశగా సాగే నిర్మాణమిది. ప్రాచ్య, పాశ్చాత్య లాక్షణికులందరూ వేరువేరు పారిభాషిక పదాల్లో చెప్పింది దీన్ని గురించే. విభావానుభావాలు అంటె తికమక పడాల్సిందేమీ లేదు.కవితాంశాన్ని పాఠకుడి అనుభవంలోకి చేర్చే దిశగా ఒక వాతావరణాన్ని కల్పించి ఆ వాతావరణంలోకి పాఠకుణ్ణి గుంజుకొచ్చి కొలిమిలో మండించి అంశ శిఖరాగ్రం, పాఠకుడి అనుభూతి ఒకే దగ్గర Orgasm చెందే దిశగా సాగే ప్రయాణం. అలా జరిగినప్పుడు అది గొప్ప కవిత. ఆ దిశగా తీసికెళ్ళేవే అభివ్యక్తులు పదాచిత్రాలు తదితరాలు.
పదాల ఎంపిక
పదాల ఎంపిక, Better word in better place కవిత్వ నిర్మాణంలో ముఖ్యమైంది అంటాడు రోమన్ జాకొబ్‍సన్. కవి అందివ్వదలచిన అర్థాన్ని సూచించడానికి అనేక పర్యాయ పదాలుంటవి. వాటిలో ఏ శబ్దం తన భావాన్ని సరిగ్గా బట్వాడా చేయగలదో ఆ శబ్దాన్ని కవి ఎన్నుకోవాలె.పాతబడి అర్థస్ఫురణను కోల్పోయిన పదాలను వదిలేయాలె.
విరిదండలు దాల్చిన వాడూ
అరి గుండెలు చీల్చినవాడూ
అందరూ ధరించే నగయిది (చిరునవ్వు - సి.నారాయణరెడ్డి)
పూలను ఆఘ్రాణిస్తూ ఆనందం పొందేవాడు కాదు ఎప్పుడూ సీరియస్‍గా ఉండే వీరుడు కూడ ధరించేది నగ చిరునవ్వు అని కవి చెప్పదలచుకున్నడు.ఈ ఉద్దేశాన్ని ఎన్నో పర్యాయపదాలతో చెప్పొచ్చు. ఎన్నో రకాల వాక్యాలలో చెప్పొచ్చు.
‘విరిదండలు దాల్చినవాడు‘ అన్న తర్వాత ‘అరి గుండెలు చీల్చిన’ పదాల్ని కవి జాగ్రత్తగా ఎన్నుకున్నడు. అందువల్ల కవితకు (ప్రాస, పదాల, అక్షరాల, సమతూకం కుదిరి) శ్రవణ సుభగత్వం సిద్ధించింది.
అట్లాగే పదాల ప్లేస్‍మెంట్ కూడ ముఖ్యమైంది.వేరే సందర్భంలో పైన పేర్కొన్న ‘కొయ్యగుర్రం’ కవితా పాదాల్లోని ఒక పాదం ఇలా ఉంది.
‘హంతకులెవరో నాకు తెలుసు’
ఇందులోని ‘నాకు’ అనే శబ్దాన్ని ఆ ప్లేస్ నుంచి ఎక్కడికి మార్చినా ఫోర్స్ దెబ్బతింటుంది. అదీ suitable place అంటే.
ప్రామాణిక భాష ‘మాండలికం’
ప్రామాణిక భాషలోనే రాయాలనే రూలేమీ లేదు.వచన కవిత లక్ష్యమే కవితా రూపంతో పాటు భాఫను కూడా ప్రజాస్వామికీకరించడం కాబట్టి ఏ భాషలోనైనా రాయొచ్చు. ఈ వ్యాసంలో పేర్కొన్న కవితలను పరిశీలించినా మిగతా కవితలను పరిశీలించినా తెలుస్తుంది. ఈ రెండు భాషలో రచించి మెప్పించవచ్చని.
ఈ విభజనంతా అవగాహన కోసమే. ఇట్లానే ఉండాలనడం వచన కవితకు మరో ‘చట్రం’ అనే గుదిబండను కట్టినట్లే.ఇట్లానే రాయాలనడం వచన కవితా తత్త్వానికే విరుద్ధం. ఇట్లా ప్రణాళికాబద్ధంగా కాక గుండె నుంచి ఎట్లా పొంగితే అట్లా పారే వచన కవిత కూడ ఉంటది. కాలాన్నిబట్టి, context ను బట్టి, భాషాపరిణామాన్ని బట్టి, భావజాల ప్రభావాన్ని బట్టి, ఒక నదిలా ఎన్నో రూపాల్ని సంతరించుకుంటది. కన్పించకుండా కూడా గాలిలా మనల్ని తాకుతది. నీరు ఎన్ని మూసల్లోనైనా ఒదిగినట్లు, ఏ మూసలోనూ బందీకానట్లు - flexibility వచన కవిత ప్రాణవాయువు.
కవిత్వానికి ఇప్పటికిది అంతిమ రూపం. కేవలం రూప సంబంధి చర్చ వచన కవిత సారం కాదు. రూపానికే పరిమితమయితే ఆనంద పర్యవసాయి అయి ప్రబంధ, భావకవితగా పరిణమిస్తుంది. అందువల్ల వచన కవితకు సంబంధించిన రూపచర్చకు మాత్రమే పరిమితం కాకూడదు. వస్తురూప సమన్వయంగా ఈ చర్చ సాగాల్సి ఉంటుంది.
ఒక కవిత విశ్లేషణ
ఈ అంశం కింద నా ‘వాగు’ కవితను విశ్లేషిద్దామనుకున్న. అది సముచితం కాదని భావించి ఈ కింది కవితను విశ్లేషించిన.ఇది చైతన్య ప్రకాష్ కవిత
అర్హత
నేనేమంటి నేనేం పాపంజేత్తి
నాకు నీకూ పోలికేడిది పోటేంటిది
సీసపక్కలేరితివా ఐస్‍క్రీట్లమ్మితివా
పార్కుల పొంటి బటానిలమ్మితివా
ఊరవతల నా పొంటి గుడిసేసుకుంటివా
ఎండ్రికాయలు, శాపలు, బుడుబుంగలు పడ్తివా,
ముంగీసలు, ఎలుకలు దింటివా
నీ బల్లెకత్తిమా? గుళ్ళెకత్తిమా?
నీకు నాకూ పోటేంది దొరా? సోపతేంది పటేలా
ఎవ్వన్నో మరిచి నన్ను తిట్టుడేంది పటేలా?
సాపలల్లితివా సారద కథలు చెప్తివా
సలి బువ్వడుక్కుంటివా
సిన్గిన పేల్కలు దొడుక్కుంటివా
పదవంటిమా? పదెకరాల పొలం మలుపు కొంటిమా?
నీ అంటేంది? పొంటేంది?
నా జోలేసుకుంటివా? నీ జోలికొస్తిమా?
ఇంకెందుకు దొరా?
ఒచ్చోరకున్నోళ్ళ బజార్లేసి పజీత దీసుడు
ఇగ ఎప్పుడైనా మాట్లాడెటప్పుడు
పదవి పొందినట్టు పైసలు సంపాదించినట్టు
పెద్ద కులంల పుట్టినట్టు
మూతినాకుడు ముచ్చట్లు వెట్టినట్టు
మాయజేసి ఓట్లు గుంజుకున్నట్టు కాదు
రోకలి బండలు మోసి
ఇనుప రేకులేరుకచ్చి
అక్రమ దొంగకేసుల్లో ఇరికి
చావతన్నులు పడి సిప్పకూడు తిని
చచ్చిబతికి బతికిచచ్చిన జైలు
పుట్టుడు సచ్చుడు ఒక్కటే తీర్గ
బతికినన్నాళ్లు పాడె మీద పన్నట్టు
ఇంక చెప్పలేనన్ని అర్హతలుండాలె
ఇగ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు
యాది మర్వకు
నువ్వెన్నన్న ఇద్దెలు నేర్చుకో
నా లెక్క కాలేవుగాక కాలేవు
మాట మాటకు నన్ను తిట్టకు
నువ్వు సచ్చి మళ్ళా పుట్టినా
పిచ్చకుంట్లోనివి కాలేవు గాక కాలేవు
పిచ్చకుంట్ల పనులు నీకు రానేరావు
నువ్వు నేను కావాలంటే
ఉత్త ముచ్చట గాదు
పుట్టెడు తవుసెల్లదీయాలే
ఈ తాప మళ్ళ గిట్ల పిచ్చకుంట్లోడివంటే
సి..... పలగొడ్తం.... (చైతన్య ప్రకాశ్)
ఎవరూ ముట్టని పిచ్చకుంట్లోని జీవితాన్ని ఎన్నుకొని వస్తు నవ్యతను ప్రదర్శించి,సరియైన దృక్కోణంతో కవితను నడిపి కవి తన ప్రతిభను చాటుకున్నడు. అర్థవంతమైన శీర్షిక.కవితలోని వాద ప్రతివాదులకిరువురికీ వర్తించే శీర్షిక,ఒకరికి పాజిటివ్ అర్థంలో మరొకరికి నెగెటివ్ అర్థంలో.
‘‘నేనేమంటి నేనేం పాపంజేత్తి’’ ఆసక్తిని రేకెత్తించే మంచి ఎత్తుగడ.
మంచి నిర్వహణ.ప్రతివాది కవితలో కనిపించకున్నా
‘‘ఎండ్రికాయలు, శాపలు, బుడుబుంగలు పడ్తివా,
ముంగీసలు, ఎలుకలు దింటివా
నీ బల్లెకత్తిమా? గుళ్ళెకత్తిమా?
నీకు నాకూ పోటేంది దొరా? సోపతేంది పటేలా
ఎవ్వన్నో మరిచి నన్ను తిట్టుడేంది పటేలా?
సాపలల్లితివా సారద కథలు చెప్తివా
సలి బువ్వడుక్కుంటివా
సిన్గిన పేల్కలు దొడుక్కుంటివా
పదవంటిమా? పదెకరాల పొలం మలుపు కొంటిమా?
నీ అంటేంది? పొంటేంది?
నా జోలేసుకుంటివా? నీ జోలికొస్తిమా?’’ అంటూ సంభాషణాత్మకంగా సాగి పాఠకుడిలో ఆసక్తిని కొనసాగిస్తుంది.ఇట్లా కవిత నిర్మాణమంతా ఎక్కడా పక్కకు జరగకుండా కవి చెప్పదలచుకున్న అంశాన్ని జస్టిఫై చేస్తూ పాఠకుడిలో ఒక ఉద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది.
‘‘నువ్వెన్నన్న ఇద్దెలు నేర్చుకో
నా లెక్క కాలేవుగాక కాలేవు
మాట మాటకు నన్ను తిట్టకు
నువ్వు సచ్చి మళ్ళా పుట్టినా
పిచ్చకుంట్లోనివి కాలేవు గాక కాలేవు
పిచ్చకుంట్ల పనులు నీకు రానేరావు’’ అని
పిచ్చకుంట్లోని పట్ల సమాజంలో ఉన్న నెగెటివ్ భావనను పాజిటివ్‍గా మార్చి
‘‘ఈ తాప మళ్ళ గిట్ల పిచ్చకుంట్లోడివంటే
సి..... పలగొడ్తం....’’ అని అర్థవంతమైన ముగింపుతో పిచ్చకుంట్లోని వేదనతో పాఠకుడు తాదాత్మ్యం చెందేటట్లు చేస్తడు కవి.
(ఈ వ్యాసం రాయించిన తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లూరి శివారెడ్డి, జె.చెన్నయ్య గార్లకు ధన్యవాదాలతో)
(తెలంగాణ సారస్వత పరిషత్ “వచన కవిత్వం - వస్తు శిల్పాలు” తెస్తున్న సందర్భంగా )
May 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు