“ఏది సత్యం ఏదసత్యం
ఓ మహాత్మా ఓ మహర్షి" అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. మరి ఆ సత్యాన్ని తెలియజేసేదేమిటి ? సైన్సు. సైన్సు అంటే శాస్త్రం.
ప్రతి రోజు టీవీల్లో జ్యోతిష్యశాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది అని
చెబుతుంటారు. చాలా మంది అవి కూడా సైన్సే అనే భావించే అవకాశం ఉంది.
సైన్సు ఆధునిక పరిణామం. పందొమ్మిదో శతాబ్దం వరకు సైన్సును తత్వశాస్త్రంలో భాగంగా చూశారు.
అంతకుముందు కనుగొన్న సత్యాలను పందొమ్మిది శతాబ్దంలో విడదీసి వాటిని ప్రకృతి నియమాలుగా సూత్రీకరించారు.తరువాత కాలంలో భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడమన్న భావనతో సైన్సును పరిగణించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్త, శాస్త్రీయత, శాస్త్ర పరిశోధన భావనలు రూపుదిద్దుకొన్నాయి.
ప్రశ్నించడం శాస్త్ర విజ్ఞానంలోనూ శాస్త్రీయ భావనలోనూ ప్రథమ లక్షణం.
ఎందుకని? ఎందుకని ? ఎందుకనెందుకని ? ఎందుకనెందుకని ?పస్తులెందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ? అంటూ దేవి 'ఎందుకని' అనే పాటలో ప్రశ్నించడం ద్వారా ఆలోచింపజేస్తుంది.
ప్రశ్నించడంతో మొదలైన శాస్త్రీయ విజ్ఞానం (సైన్స్) ప్రకృతిలో అంతర్గతంగా ఇమిడివున్న అనేక నియమాలనుకనుగొనేటట్లు చేసింది.
ఆపిల్ కిందకే ఎందుకు పడుతోంది ? అని ప్రశ్నించిన న్యూటన్ భూమికి ఆకర్షణ ఉందని కనుగొన్నాడు. రాత్రి, పగలు ఎలా ఏర్పడుతున్నా యనే మథనం ద్వారా భూమి తన చుట్టూ తాను తిరగడమని తెలుసుకున్నారు.ఇలా ప్రకృతిని పరిశీలించడం ద్వారా అనేక సత్యాలు ఆవిష్కృతమైనాయి.
ముందు భూమి బల్లపరుపుగా ఉందన్నారు. తరువాత భూమి గుండ్రంగా ఉందన్నారు. భూమి చుట్టూ సూర్యుడుతిరుగుతున్నాడన్నారు. కాదు సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగు తున్నాయన్నారు. గెలీలియో కనుగొన్న దూర దర్శినితో ఇది నిర్ధారణయింది.
ప్రకృతి నిరంతరం మారుతుందని, మార్పు నిరంతర ప్రక్రియ అని, ఏదీ శాశ్వతం కాదని సైస్సు గుర్తించింది.
సైనులో (శాస్త్రీయ విజ్ఞానం)లో ఉన్న గొప్ప లక్షణం ఏమంటే.. పాత జ్ఞానం తప్పని తేలితే వెంటనే దానిని తిరస్కరించి కొత్తదాన్ని స్వీకరిస్తుంది. అందుకే కవి గుమ్మావీరన్న ..
"సత్యం సాపేక్షం/లేదు పూర్వ సత్యం/నిన్నటి జ్ఞానం కన్నా/నేటి జ్ఞానమే మిన్న"అనంటాడు.
పరిణామక్రమంలో భాగంగానే జీవం పుట్టిందని తేల్చింది. జీవపరిణామక్రమంలో మనిషి రూపొందాడని, మనుషులంతా ఒక్కటేనని సైన్సు తేల్చింది.
ఇవన్నీ ప్రశ్నించడంతో ప్రారంభమై పరిశీలన చేయడం, సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం దాకా సాగింది.తరువాత ప్రయోగం చేశారు. ఆచరించి చూశారు. ప్రయోగం ద్వారా వచ్చిన ఫలితం ఆధారంగా ఒక సూత్రీకరణ లేదా ఒక ప్రతిపాదన చేశారు. ఇలాంటి పద్ధతుల ద్వారా ఒక సత్యాన్ని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతుల ద్వారా లభించిన జ్ఞానాన్ని శాస్త్రీయ విజ్ఞానం అన్నారు.
శాస్త్రీయ విజ్ఞానం అందించిన సూత్రాలను నిత్యజీవితంలో మన జీవనానికి అన్వయిస్తే వచ్చినవే శాస్త్రీయ భావాలు. ఇవి మనలో తరతరాలుగా గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను పటాపంచలు చేశాయి, చేస్తున్నాయి.
ఒక వస్తువు ను సృష్టించలేం.నాశనం చేయలేం అని సైన్సు నిరూపించింది. ఒక పదార్థం మరో రూపంలోకి మారుతుందేగానీ అది పూర్తిగా నాశనం కాదని శాస్త్రవిజ్ఞానం నిరూపించింది.
ఎవరైనా సైన్సు తెలిసినంత మాత్రాన వారికి శాస్త్రీయ భావాలు ఉంటాయని చెప్పలేం. శాస్త్రం రుజువు చేసిన వాటికి వ్యతిరేకంగా, రోజువారి జీవితంలో నమ్మినా, ఆచరించినా మూఢనమ్మకాల్లో ఉన్నట్లే లెక్క.
మన దేశ సాహిత్యంలో ఎలాంటి శాస్త్రీయ భావనలున్నాయో చర్చిద్దాం. మనదేశంలో ప్రాచీన సాహిత్యం వేదసాహిత్యంతో మొదలవుతుంది. తెలుగు సాహిత్యం పాల్కురికి బసవపురాణం,
నన్నయ మహాభారతంతో మొదలవుతుంది.
వేదసాహిత్యం క్రీ.పూ. 2000 నాటిది. ఆనాటి ప్రజలకు ఆహార సేకరణ మాత్రమే తెలుసు. ప్రకృతి గురించి వారికున్న అవగాహనను కవితాత్మకంగా రుగ్వేదంలో చెప్పారు. వ్యవసాయం కూడా తెలీనిదశ అది. కానీ వేదాలోలనే అన్నీ ఉన్నాయని చాలా మంది ప్రకటిస్తుంటారు. 'వేదాల్లో అన్నీ ఉన్నాయష"
అంటూ ఉంటాడు గురజాడ రాసిన కన్యాశుల్కంలో 'అగ్నిహోత్రావధాన్లు'. ఇటీవల ఒక కేంద్రమంత్రి వేదాల్లో కోతి నుంచి మానవుడు వచ్చినట్లు చెప్పలేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతం వాస్తవంకాదని ప్రకటించాడు. రోజూ టీవీల్లో చెప్పే ప్రవచనకారులు శాస్త్రం ఏం చెపుతుందంటే అని అంటుంటారు. వీరు చెప్పే శాస్త్రం 'వేదాలే'.
క్రీ.పూ. 1000 నాటికి ఇనుము కనుగొన్నారు. దాంతో నాగలితో భూమిని దున్ని వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. అప్పటి నుంచి కొత్త భావాలు ఏర్పడ్డాయి. ఆత్మ, పరమాత్మ భావాలు ప్రవేశించాయి. కర్మ సిద్ధాంతం వచ్చింది. విత్తనం నాటితే అది మొలకెత్తి చెట్టుగా మారి ధాన్యాన్ని, ఫలాల్ని ఇస్తుంది. దీని ఆధారంగా ఈ జన్మలో మనం చేసేపని (కర్మ),మళ్లీ జన్మలో ఫలితాన్నిస్తుందనే భావన ఏర్పడింది. మంచి పనిచేస్తే వచ్చే జన్మలో మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. ఇదేకర్మ సిద్ధాంతం.
వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి ఆత్మ వస్తుందనుకున్నారు వేదకాలంలో. దీనినే భగవద్గీతలో'అన్నాధ్భవంతి భూతానీ' అనే శ్లోకంలో చెప్పారు. ఉపనిషత్తుల కాలానికి ఆత్మ,పరమాత్మ భావాలు ఏర్పడ్డాయి. ఇది జ్యోతి రూపంలో ఉంటుందన్నారు ముండకోపనిషత్తులో.ప్రతి జీవిలో ఆత్మ ఉంటుందన్నారు. ఇది నాశనం కాదు. ఏ శాస్త్రం దీన్ని ఛేదించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. వాయువు ఆర్పలేదు అంటూ దీని స్వభావాన్ని విపరించారు.
ఈ ఆత్మ ఆధారంగా అనేక కథలు పుట్టాయి. రామాయణం, భారతంలో చాలా ఉపకథలున్నాయి. పరకాయ ప్రవేశం అనే భావన కూడా వచ్చింది. కోరికలు తీరకుండా మనిషి మరణిస్తే ఆత్మ దయ్యంగా మారుతుందని ఇప్పటికీ చాలా మంది భావిస్తుంటారు.
పల్లెల్లో ఆత్మలు దయ్యంగా మారి తిరుగుతుంటాయని భ్రమపడుతుంటారు. గతంలో కొరివి దయ్యాలుండేవని ఇప్పుడు కరెంటు రావడంతో అవి పోయాయని చెపుతుంటారు. ఆత్మలను వీడియో తీశామని యూట్యూబుల్లో పెడుతుంటారు.
ఆత్మ భావన ఎలా పుట్టిందంటే ఆదిమకాలంలో మనిషి శత్రువుల చేతిలో, జంతువుల చేతిలోనూ మరణించేవాడు. ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోయేవాడు. అతను మళ్లీ మేల్కోనేవాడు. మరణించిన మనిషి కూడా మేల్కొంటాడనే భావన ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని అదృశ్యశక్తి ఉందనే నమ్మకం ఏర్పడటానికి కారణమైంది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటాడు. నిద్రించిన మనిషికి మరణించిన వారికి పెద్ద తేడా కనిపించదు.మనిషి నిద్రిస్తున్న ప్పుడు శరీరంలోని ఒక అదృశ్యశక్తి బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ నిద్రలేవగానే శరీరంలోకి వస్తోందనే భావన వచ్చింది. ఈ భావనే ఆత్మ భావనకు దారితీసిందన్నాడు గ్రాంటో అల్లెన్ తన 'ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్'లో. ఉపనిషత్తుల తరువాత కాలంలో దర్శనాలు వచ్చాయి. ఇవి న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగ,పూర్వమీమాంస, ఉత్తరమీమాంస.
మీమాంసలో చర్చించే వారు అంతకుముందున్న సిద్ధాంతాన్ని తీసుకుని,దాన్ని తర్కిస్తారు. దీన్ని పూర్వపక్షం చేయటం అన్నారు. తరువాత మరో సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. దీన్ని ఆధునిక తత్వవేత్తలు థీసిస్, యాంటి థీసిస్, సింథసిస్ అన్నారు.
సాంఖ్యులు వేదాలను తిరస్కరించారు. సృష్టికర్తను తిరస్కరించారు. వీరు క్రీ.పూ. 600-500 కాలంనాటి వారు. వీరిలో కణాదుడు ప్రపంచమంతా కణముల సముదాయమన్నారు.
అసితకేశకంబరుడు నిప్పు, నీరు, మట్టి, గాలి కూడికతో జీవం ఏర్పడిందన్నారు. జీవి మరణించగానే ఆ జీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో, వేడి నిప్పులో,మట్టి నేలలో కలసి పోతుందన్నారు. స్వర్గం, నరకం, దేవతలు ఏమీలేవు. ఉన్నవి ఈ నాలుగే అని అన్నారు.
ప్రకృతి కాత్యాయనుడు నీరు, నిప్పు, గాలి, నేలతో పాటు దు:ఖం, సుఖం, చైతన్యంల కలయికతో జీవి ఏర్పడుతుందన్నాడు.
మీమాంసకులు ప్రతి ప్రదార్థంలో అణువు ఉంటుందన్నారు.
బుద్ధుడు దైవభావనను తిరస్కరించాడు. ప్రకృతి నిత్యం మార్పు చెందుతూ వుంటుందన్నాడు. అయితే ఈ మార్పు సంఘర్షణ ద్వారానే జరుగుతుందని ఏంగెల్స్ చెప్పాడు. కార్యాకారణ సంబంధాన్ని ప్రతిపాదించాడు బుద్ధుడు.
క్రీ.పూ. 300లో చార్వాకులు ఉండేవారు. వీరిని లోకాయతులు కూడా అంటారు. చార్వాకులు మంచివాక్చాతుర్యం గలవారని అర్థం. వీరు నాస్తికులు. పరమాత్మభావాన్ని తిరస్కరించారు. వీరు దేవుడు లేడు. ఆత్మలేదు. మరణానంతరం మిగిలేదేమిలేదు అంటూ బోధించారు.
పరమాత్మను, ఆత్మను నమ్మేవారిని భావవాదులన్నారు. కనిపించే భౌతిక ప్రపంచాన్ని గురించి మాట్లాడేవారిని భౌతికవాదులన్నారు. భావవాదులు పరమాత్మను, ఆత్మను మానసికంగా నమ్మినా ఆచరణలో భౌతికవాదులుగా ప్రవర్తిస్తుంటారు.
చార్వాకులు ఇలా చెప్పినారు ...
"కోదదర్శ ప్రథమం జాయామాస మస్థస్వంతం
యదన వస్థావిభక్తి భూమ్యా అసుర సుగాత్మా కృస్విల్ కోవిద్వాంస ముపగాత్ ప్రస్టుమేతత్"
“ప్రకృతి సహజంగా ఈ ప్రపంచ నిర్మాణం జరిగేటప్పుడు ఎవడు చూశాడు ? చూసినవాడు న్నాడా ? ప్రాణంగాని రక్తంగాని ఈ భూమి నుండి ఏర్పడ్డాయి. వీటికి సృష్టికర్త భగవంతుడనేవాడు ఎవ్వడూలేడు. ఆత్మ అనేది లేదు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ అవివేకుల భావాలు' అన్నారు చార్వాకులు.
ఈ ప్రపంచం వాస్తవమైనది. దీనికంటే భిన్నమైన మరోలోకం లేదు. పరలోకం ఉందని చెప్పేమాట అబద్ధం. మోసం. వంచన.కపటం. ఒక పురుషుడు స్త్రీకి తోడేలు పాదాలు చూపిస్తానని వేళ్లతో ఏదోచేసి చూపి భ్రమింపజేస్తాడు. అట్లాగే భావవాదులు పరలోకాలను కూడా భ్రమింపజేసి అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తారన్నారు.
జైనులు, బౌద్ధులు, చార్వాకులు (లోకాయతులు) వీరంతా ఆత్మ, పరమాత్మ భావాలను వ్యతిరేకించారు. వీరిని భౌతికవాదు లన్నారు.
జనపదాల స్థాయి నుంచి రాజ్యాలు, సామ్రాజ్యాలు క్రీ.పూ. 600 నాటికి ఏర్పడ్డాయి. రాజరికపు వ్యవస్థ వేళ్లూనుకునింది. వారు తమ ఆధిపత్యాన్ని నిరంతరంగా ఉంచుకోవడానికి, దోపిడీని మరుగుపరచుకొనడానికి సాహిత్యాన్ని సాధనంగా చేసుకొన్నారు. వాటిని ప్రజల్లో ప్రచారం చేశారు. కర్మసిద్ధాంతం, తలరాత సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ, పాపం, పుణ్యం, స్వర్గం-నరకం, ఆత్మ, పరమాత్మల భావాల్ని రామాయణ, మహాభారతాల్లో రచింపజేశారు. వాటిని నిరంతరం ప్రచారం చేస్తూ వచ్చారు.
కౌటిల్యుడు (చాణక్యుడు) తన అర్థశాస్త్రంలో రాజుకు మూఢవిశ్వాసాలుఉండరాదన్నాడు. ప్రజల్లో మూఢవిశ్వాసాలు ప్రేరేపించి వారిలో భయ భ్రాంతులను సృష్టించాలి. రాజే వాటిని మళ్లీ
రూపుమాపాలి. ఆవిధంగా తాను ప్రజల రక్షకుడని ప్రజలు భావించేటట్లు చేసుకోవాలని చెప్పాడు.
మూఢ విశ్వాసాలకు అధికారానికి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే (1) అధికారులిచ్చే ఆజ్ఞలకు ప్రజలు విధేయులుగా ఉంటారనుకునేవారు (2) దైవభక్తిని ప్రదర్శించేవారు ప్రతి విషయంలో చట్టబద్ధంగా వుంటారని ఆశించేవారు.
మధ్యయుగాల్లోని రాజరిక వ్యవస్థ ప్రజల్లో తార్కిక దృక్పథానికి అవకాశం లేకుండా చేసింది.
ఇలాంటి పరిస్థితి ఆంగ్లేయులు మనదేశానికి వచ్చేవరకు కొనసాగింది.అయితే వేమన, వీరబ్రహ్మంలు (17వ శతాబ్దంలో) మాత్రం వీరు రాకముందే అనేక సామాజిక మూఢాచారాల పైన, లోకరీతుల పైన ధ్వజమెత్తారు. వీరు ఆచరణాత్మకంగా కూడా చేసి చూపించారు. వీరు సాహిత్యాన్ని సాధనంగా చేసుకొన్నారు.
“రాతిబొమ్మల కేల రంగైన వలువలు
గుళ్ళు గోపురాలు కుంభములను
కూడు గుడ్డ తాను కోరునా దేవుడు'
అని ఒక పద్యంలో చెపుతాడు. అలాగే మరో పద్యంలో
"తోలు కడుపులోన దొడ్డవాడుండగ
రాతి గుళ్ళలోన రాశిబోయ
రాళ్ళు దేవుడైన రాసులు మ్రింగునా " అని ప్రశ్నిస్తాడు.
వీరబ్రహ్మం కూడా తన తత్వబోధలో ‘చిల్లర రాళ్ళకు మొక్కుతూ వుంటే చెడిపోదువురా ఒరే ఒరే' అని బోధ చేస్తాడు. వీరిద్దరూ విగ్రహారాధనను ఖండించారు. తల్లిదండ్రులు బ్రతికుండగా చూడని వారుకూడా మరణించగానే పిండప్రధానం చేస్తారు. కర్మకాండ పేరుతో పెద్దగా కార్యక్రమాలు చేస్తారు. దీన్ని చూసిన వేమన
పిండములను చేసి పితరులందలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలారా
పెంట దినెడు కాకి పితరుడెట్లాయెరా ? అంటూ ప్రశ్నిస్తాడు.
వేమన శ్రమకు ప్రాధాన్యత నిచ్చాడు. శ్రమే సమాజానికి మూలమని ఆయన భావించాడు.
“భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబుతానౌను'
అంటూ శ్రమ జీవన సౌందర్యానికి పెద్దపీట వేశాడు. దీన్నే ఆధునిక కవి గద్దర్
" నువ్వు భూమిదున్న కుంటే వాడు బువ్వ బుక్కలేడు' అంటూ పాట పాడారు.
వేమన కులవ్యవస్థను తిరస్కరించాడు.
'కులముచేత విర్రవీగువాగు వారు, గోత్రంబుగలవారు / విద్యచేత విర్రవీగువారు
/ పసిడి గల్గువాని బానిస కొడుకులు' అనన్నాడు.
అలాగే... 'మాలమాలగాదు మహిమీదనే ప్రొద్దు | మాట తిరుగువాడు | వానిమాలయన్న వాడెపో పెనుమాల' అంటూ ఆశాస్త్రీయంగా ఏనాడో ఏర్పడిన కులవ్యవస్థను తిరస్కరించాడు.
వీరబ్రహ్మం 'కులమెంచగానేల గుణమే కారణం' అన్నాడు. సిద్దయ్యను, కక్కయ్య మాదిగను తన శిష్యులుగా చేసుకున్నాడు.
'మతం మత్తుగూర్చు మార్గమ్ము కానరాదు
హితము కూర్ప వలయు నెల్లరకును
హితము కూర్పలేని మతము మారగవలె"
అని మతం మత్తుమందని మార్క్స్ చెప్పిన భావాన్ని పదిహేడవ శతాబ్దంలోనే వీరబ్రహ్మం చెప్పినాడు.
'సర్వమానవులను సమముగా ప్రేమించు
కులమతాలనెంచి కోపపడకు
కాపు జాతినెల్ల కరుణించుమనే శ్రుతుల్'
అంటూ కుల, మతాలకతీతంగా మనిషి మనుగడ సాగించాలనే ఆధునిక భావాలను వీరబ్రహ్మం తన కాళికాంబ శతకంలో చెపుతాడు. 19వ శతాబ్దంలో ఆంగ్లేయుల రాకతో ఆంగ్ల విద్య అభ్యసించిన పలువురు మనదేశంలో అనేక మూఢా చారాలను, ఛాందసభావాలను, అంధవిశ్వాసాలను ఖండించారు. వాటిని ఖండించడానికి ప్రాచీన సాహిత్యమైన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను ఆధారం చేసుకున్నారు. వీరు కూడా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని ప్రజల్లో వీటికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
బెంగాల్ లో రాజారామ్ మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఉత్తరభారతంలో ప్రేంచంద్, ఆనాటి తెలుగు రాష్ట్రాలలో గురజాడ, వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి,దాశరథి, కాళోజీ, శ్రీశ్రీ మొదలైనవారు శాస్త్రీయ భావాలను ప్రచారం
చేశారు.
ఫ్రాన్స్ రచయిత బోదిలేర్ సైన్సుతోనూ, తత్వంతోనూ కలసి కాలుకదపని సాహిత్యం మానవ హత్యా సదృశ్యమే,ఆత్మహత్యా సదృశ్యమే నంటాడు. ఇది వంటబట్టని చాలా మంది రచయితలు అనేక మూఢవిశ్వాసాలను ఛాందస భావాలను తమ రచనల్లో ప్రతిఫలిస్తున్నారు. లేదంటే సూడో సైన్సును రాస్తున్నారు.
ఐన్‌స్టీన్ కనుగొన్న సాపేక్షతా సిద్ధాంతం ప్రతి విషయాన్ని స్థలకాలాదుల్లో చూడాలన్న జ్ఞానం నేర్పింది.
ప్రాచీన సాహిత్యం స్థలకాలాదులను విస్మరించింది. అందువల్ల పురాణాలను ప్రాచీనమైనవని చెబుతారేగాని అవి ఏ కాలానివో చెప్పరు. అవి క్రీ.పూ. 400 కాలం నాటివని వాటిల్లోని కథల ద్వారా తెలుసుకున్నారు. ఆధునిక రచయితలు స్థలకాలాదుల్లో చెప్పడం మొదలు పెట్టారు.
సైన్సుకు మానవత్వ ముఖం ఉండదు. ఇది ఐనిస్టీన్ తన E=mc^2 సూత్రం ద్వారా రూపొందించిన ఆటంబాబునుఅమెరికా జపాన్ పై ప్రయోగించినప్పుడు గుర్తించాడు. ప్రకృతి విధ్వంసాన్ని గుర్తించాడు. దీన్ని ఆయన వ్యతిరేకించాడు.రచయితలు కూడా పర్యావరణ విధ్వంసాన్ని, అణుబాంబు ప్రయోగాన్ని, యుద్ధాలను నిరసించారు.
చాలా మంది రచయితలు తలరాత సిద్ధాంతాన్ని, మిధ్యావాదాన్ని తిరస్కరిస్తూ రాశారు. సామాజిక మార్పును గుర్తిస్తూ సామాజిక స్పృహతో సామాజిక పురోగతిని ఆకాంక్షించారు. అశాస్త్రీయంగా మనుషులలో విభజించిన వర్ణ
వ్యవస్థను ధిక్కరించారు. బాల్య వివాహాలను ఖండించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. పంచములుగా పిలువబడే దళితులకు మద్దతుగా నిలిచారు. వీరిని అభ్యుదయ రచయితలన్నారు.
పాత సంప్రదాయాలను, ఛాందసభావాలను కీర్తించే వారిని సంప్రదాయ రచయితలన్నారు.
గురజాడ శాస్త్రీయ భావాలను తన రచనల్లో ప్రతి చోటా ప్రతిఫలింపజేశారు.
'మనిషి చేసిన రాయిరప్పకి, మహిమ కలదని సాగిమొక్కుతు | మనుషులంటే రాయిరప్పల/
కన్న కనిష్టంగానూ చూస్తావేల బేలా ?' అంటూ గురజాడ ప్రశ్నిస్తాడు.
బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణుడు, భుజం నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు వచ్చాడని మనుధర్మం చెపుతోంది. శూద్రులు తక్కిన వారందరికి సేవకులుగా ఉండాలని కూడా చెప్పింది.పంచములను ఊరికి దూరంగా ఉండాలని చెప్పింది. మనషులంతా సమానమేనని విజ్ఞాన శాస్త్రం తేల్చింది. అందరికీ అన్ని హక్కులున్నాయని, ఒకరినొకరు పరస్పర సహాయసహకారాలతో జీవించాలని అదే ప్రకృతి ధర్మమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పింది.
గురజాడ వీటిని అందిపుచ్చుకున్నాడు. అందువల్లనే 'తిండి కలిగితే కండ కలదోయి / కండ కలవాడేను మనిషోయి' .... అనడమేకాక 'అన్నదమ్ములవలెను జాతులు | మతములన్నియు మెలగవలెనోయి' అనన్నాడు. అంతేగాక 'మలిన దేహుల మాలలనుచును | మలినచిత్తుల కధికకులముల/ నెలవొసంగిన వర్ణధర్మ మధర్మ ధర్మంబే" అనంటాడు. అధర్మమైన వర్ణధర్మం ధర్మమైందా? అని ప్రశ్నిస్తాడు.
'ఎల్లెలోకము వొక్కయిల్లై / వర్ణభేదములెల్ల కల్లై / వేల నెరుగని ప్రేమ బంధము /వేడుకలు కురియ' ... అని కూడా చెపుతాడు 'మీ పేరేంటి, పెద్ద మసీదు' కథల్లో మత విశ్వాసాల్లోని అహేతుకతను తేటతెల్లం చేస్తాడు. 'మతములన్నియు మాసిపోవును / జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును' అని గురజాడ మత విశ్వాసాలు, దానికి కనుబంధంగా వున్న ఛాందస భావాలు పోయి మనుషుల మధ్య జ్ఞాన సంబంధాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింల తరువాత మానవవాదులు మూడవ స్థానంలో వున్నారు. విజ్ఞానం అందరికీ అందే కొద్దీ అజ్ఞానం పటాపంచలవుతోందని తెలుస్తోంది.
తోకచుక్క అరిష్టమని సమాజంలో ఒక మూఢనమ్మకం ఉంది. టి.వీలలో నేటికీ కొంత మంది ఇదే చెపుతూవుంటారు. గురజాడ "హేలీ తోకచుక్క'ను దూరపు బంధువుగా ఇలా వర్ణించాడు.
"దూర బంధువు యితడు భూమికి / దారిచూపుచూ చూడవచ్చును / డెబ్బదెనుబది ఏండ్లకొక తరి/
నరుల కన్నుల పండువై".
పురుషాధిక్య సమాజంలో భార్య, భర్తల సంబంధాలు ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే.
కానీ గురజాడ మాత్రం భార్య, భర్తల సంబంధాన్ని స్నేహితుల మధ్య సంబంధంగా చూచాడు. భర్త దేవుడని చెప్పే మాటను తిరస్కరిస్తూ 'మగడు వేల్పన పాతమాటది / ప్రాణమిత్రుడనీకు.... అని చెపుతాడు. అంతేకాక "ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును / ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును..." అని చెపుతూ ప్రేమ భావన తోనే భార్య, భర్తల మధ్య సఖ్యత నిలుస్తుందంటాడు.
గురజాడ కన్యాశుల్కం నాటకం బాల్య వివాహాల ద్వారా మహిళలకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపుతుంది. ఇందులో బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మలు బాల్య వివాహాల ద్వారా వితంతువులు, వారు పడే బాధలను నాటకంలో
వ్యక్తీకరించాడు.
సి.వి. అనేక రచనలు చేశాడు. విషాద భారతం, జాబాలి మొదలైనవవన్నీ ప్రాచీన సాహిత్యంలోని ఆహేతుక విషయాలను ఎత్తిచూపుతాయి.
వర్ణవ్యవస్థను సంప్రదాయవాదైన విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలుగా కీర్తిస్తే, అదే వర్ణవ్యవస్థను బూషువా "కసరిబుసకొట్టు నాతని నాల్గు పడగల హైందవ నాగరాజు' అంటూ ఈసడించుకున్నాడు.
శ్రీపాద రాసిన 'అరికాళ్ళ మంటలు, ఇళ్ళు పట్టిన వెధవాడ పడుచు కథలు' బాలవితంతువుల సమస్యలను చిత్రీకరించాయి.
కొడవటిగంటి కుటుంబరావు జ్యోతిష్యం కథ జ్యోతిష్యంలో ఉన్న బూటకత్వాన్ని బయట పెడుతుంది. ఇందులో ఒక వ్యక్తి తన చనిపోయిన తమ్ముని జన్మ వివరాలిచ్చి జాతకం అడగుతాడు జ్యోతిష్యున్ని. అవేమి తెలియని జ్యోతిష్యుడు ఆ వివరాలు తెచ్చిన వ్యక్తివేననుకొని వంద సంవత్సరాలు జీవిస్తాడని జాతకం చాలా బాగుందని చెపుతాడు. ఈ కథ ద్వారా జ్యోతిష్యంలోని అశాస్త్రీయతను ఎత్తిచూపుతాడు కొడవటిగంటి.
'మనుష్యుడే నా సంగీతం | మానవుడే నా సందేశం' అని మానవుని కేంద్రంగా కవిత్వం రచించి శాసించిన శ్రీశ్రీ మిథ్యావాదంలోని మర్మాన్ని బయటపెడతాడు. ఈ మిధ్యావాదాన్ని ఆదిశంకరుడు ప్రతిపాదించాడు. బ్రహ్మసత్యం జగన్మిధ్య అన్నాడు. రజ్జు సర్పభ్రాంతి సిద్ధాంతం చెప్పాడు. తాడును సర్పం అనుకుంటారు చీకట్లో, వెలుగులో అది తాడని తెలుస్తుంది. అలాగే బ్రహ్మ జ్ఞానంతో ప్రపంచం మిథ్య అని తెలుస్తుందన్నాడు. నాశనమయ్యేది వాస్తవం కాదన్నాడు. ప్రదితీ మాయవుతుందని, రూపాంతరం చెందుతోందని చెప్పిన బౌద్ధులు, జైనులు, వైశేషకులు చెప్పిన వాటినివ్యతిరేకించాడు. ప్రపంచం మిథ్య అన్న శంకరుడు, విగ్రహాన్ని మాత్రం పూజించడం ఆయన సిద్ధాంతానికి విరుద్ధం. ఇతడు ప్రతిపాదించిన మిథ్యావాదం శాస్త్రీయ భావన వ్యాప్తికి అవరోధమైంది. దేశ పురోగతికి ఆటంకంగా నిలిచిపోయింది. దీన్ని బ్రద్దలు కొట్టడానికి తన కవిత్వంలో ఇలా చెపుతాడు శ్రీశ్రీ.
'మాయంటావా? అంతా
మాయంటావా ? ఓ మిధ్యా వేదాంతి ?
ఏమంటావూ ? లోకం మిధ్యంటావూ ?
జమిందారు రోల్సుకారూ
మహారాజు మనీపర్సు
మాయమంటావు ? స్వామీ ఏమంటావు ?
ఏయ్ ఏమంటావు?
పాలివాని నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
మాయంటావూ?
పాలు, పెరుగుగా మారటానికి మజ్జిగ తోడు ఎంత అవసరమో, మనిషిని సమాజాన్ని చైతన్యం చేసేందుకు శాస్త్రీయ భావాలూ అంతే అవసరం. ఈ భావాల వ్యాప్తి రచయితల ద్వారా జరుగుతుంది.
'జపతపంబుల కన్నా / చదువు సాములకన్నా ఉపకారమే మిన్న / ఓ కూనలమ్మా' ... అని ఆరుద్ర అంటే 'నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి / కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి' అనంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ.
సమాజంలో ఉన్న కులోన్మాదం పై కవితాగ్రహం ప్రకటిస్తాడు అశోక్ కుమార్ ఇలా...
'కమ్మో రెడ్డో కాపో అంటాడు కాని
మనిషని చెప్పడేం ? హిందువో, ముస్లీమో, క్రిస్టియనో
అంటాడు కాని మనిషని చెప్పడేం ?
అమెరికనో, రష్యనో, జపనీయో అంటాడు కాని
మనిషని చెప్పడేం ?
అసలిక్కడ మనుషులే లేరా ? లేక
ఉన్నవాళ్లు మనుష్యులు కారా ? "అని ప్రశ్నిస్తాడు ఆగ్రహంగా.
విధిరాత, తలరాత సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ శ్రమతోనే చరిత్ర సృష్టించవచ్చని చెపుతాడు సినారె.
అంతా నుదుట రాసి వుందంటే
యంత్రాలు నడిచేవికావు
విధి పరిధిలో చంక్రమిస్తుంటే
వివేకం పెరిగేది కాదు
సంకల్పం నడుము చుట్టకుంటే
చరిత్ర తిరిగేది కాదు
మనిషి జీవితం / అనుభవాంకితం
శ్రమజీవన సౌందర్యఫలం.
కాలానుగుణంగా ప్రకృతే కాదు సమాజంలోని భాషా సంస్కృతులు కూడా మారుతుంటాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. ప్రస్తుతం ప్రపంచీకరణలో అన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. కరోనా కాలంలో చాలా మార్పులు సంభవించాయి. పర్యావరణం విధ్వంసం ఆగిపోయింది. ఓజోను పొర రంధ్రం పూడిపోయింది. ఢిల్లీలో కాలుష్య స్థాయి తగ్గి సాధారణ స్థాయికి వచ్చింది. అందరినీ రక్షిస్తాడని నమ్మే అన్ని మతాల దేవుళ్ళ ప్రార్థనా మందిరాలన్నీ మూసివేయ బడినాయి.
దేవరకొండ బాలగంగాధర తిలక్ శాస్త్రీయంగా ఆలోచించే కవి. సామాజిక సందర్భాలను చారిత్రక మార్పులను గుర్తించినకవి. అందుకే
'ఏ సంస్కృతీ కాదొక స్థిర బిందువు | అది నైకనదీనదాల అంత:స్సింధువు / కనిపించని ప్రభావాల కది లొంగుతుంది" అనంటాడు తన అమృతం కురిసిన రాత్రిలో...
ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదో ఉందని చాలా మంది భావవాదులు భావిస్తుంటారు. కొంత మంది భగవంతుడన్నారు. మరికొంత మంది అదృశ్య శక్తి అన్నారు.
చెరబండరాజు మాత్రం "నత్వం కామయే,
రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, మోక్షం కూడా వద్దు
నాకు కావాల్సిందల్లా ప్రజల కష్టాలన్నీ తొలగించే శక్తి ఒక్కటే' అనంటాడు.
అదే తిలక్ అయితే... "దేవుళ్ళని తన రూపంలో సృష్టించుకొని / తన భయాన్ని వాళ్ళకు తగించుకుని / అడిగినప్పుడెల్లా వరాలిమ్మని ఒప్పందం చేసుకుని పరవాలేదని ప్రమత్తుడయ్యాడు మానవుడు... "అని చెపుతాడు.
మరో కవి రాచాపాళెం రఘు 'సర్వాంతర్యామి సామి వుంటే/ సామి శిలలు చౌర్యమందు టేల?/ సామిరక్షకు రక్షకభటులేల ?' అని ప్రశ్నిస్తాడు.
ప్రజలంతా శాస్త్రీయ దృక్పథం తో నడుచుకోవాలని చెప్పడమే గాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ ప్రకారం శాస్త్రీయదృక్పథాన్ని ప్రజల ప్రాథమిక విధిగా పేర్కొంది.
సమాజంలోని ఆకలి, దారిద్ర్యం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత, వనరుల దుర్వినియోగం, పర్యావరణ విధ్వంసం వంటి వాటికి శాస్త్రీయ ఆలోచనే పరిష్కార మార్గాలను సూచించగలదు.
దాశరథి తన అగ్నిధార కావ్యంలో రాసిన 'ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో | ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో / భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మనవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో' అనే గీతంలో మానవ పరిణామం పైన, భూమి పుట్టుక గురించి సమాజంలోని అసమానతల పైన స్ఫూర్తిదాయకమైన, శాస్త్రీయ భావాలున్నాయి.
'రచయిత అన్నవాడు సైంటిస్ట్ కానక్కర్లేదు. కానీ అతడికి శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఇది లేకపోతే అతడి రచనలు అర్ధసత్యాలు - రసవిహీనతా సంక్రమిస్తాయి. జీవితానికి ప్రాణవాయువు ఎంత అవసరమో అలాగే రచయితలకు సైంటిఫిక్ దృక్పథం అవసరం' అని శ్రీశ్రీ ఏనాడో చెప్పినాడు.మతం ఓడిపోతూ వుంది. సైన్సు గెలుస్తోంది. ఇదే ఈనాటి చారిత్రక పరిణామమని నొక్కి వక్కాణించాడు.
'ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి వస్తాయో
ఎక్కడ అవిరామమైన సత్యాన్వేషణ పరిపూర్ణతవైపు చేతులు చాస్తుందో
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని ఎలాంటి విశ్వాసపు దారిలో ఇంకిపోదో
అలాంటి స్వేచ్ఛాపథంలోకి పయనించాలి... దేశం మేల్కొనాలి' అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కోరినట్లు
రచయితలు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రీయ దృక్పథంలో సమాజాన్ని ముందుకు తీసుకెళతారని ఆశిద్దాం.
ప్రకృతిలో ఒకదానితో మరొకటి ఆధారపడి ఉన్నట్లే అన్ని శాస్త్రాలు ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి. అయితే అన్నింటికీ అనుసంధానమైనది గణితం. అందుకే గణితం అన్ని శాస్త్రాలకు రాణి లాంటిదని కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అంటాడు. దీన్నే సాపేక్షమన్నాడు ఐనిస్టీన్. విశ్వంలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. ప్రతి ఒక్కటి ఇంకో దానిపై ఆధారపడి ఉంది. విశ్వం స్థల కాల సమాహారమన్నారు.
ప్రపంచంలో ఏదీ ఒంటరిగా మనలేదు,
ఏదోఒక సూత్రానికి కట్టుబడినట్లు
ఒకదానితో మరొకటి ఆధారపడి వుంటాయి
నీవులేక నేనెలా వుండగలను
ప్రియతమా!
అంటూ షెల్లీ తన సాపేక్షతను కవిత్వకరిస్తాడు తన ఫిలాసఫీ కవితలో. ఫై (pi) నుంచి ఫిబొనాకే అంకెల శ్రేణి (fibonaacci) దాకా కవులు తమ కవిత్వంలో గణితాన్ని తమ సొంతం చేసుకున్నారు. అంతెందుకు ప్రకృతి కూడా గణితాన్ని పలు రూపాల్లో వ్యక్తం చేస్తోంది. ప్రొద్దుతిరుగుడు పుష్పంలో విత్తనాలు ఫిబొనాకే అంకె శ్రేణి పోలి ఉంటుందంటే ఆశ్చర్యం కాదూ! విశ్వమే నాదమయమన్న పైథాగరస్ అంకెలకు, సంగీతానికి సంబంధముండటాన్ని గమనించాడు.
సరిగమపదనిసలను ఎన్ని రకాలుగా పలకవచ్చో !
ఫైథాగరస్ సిద్ధాంతాన్ని తేలిగ్గా ఆరుద్ర తన 'పెద్ద ముళ్ళు' కవితలో ఇలా చెపుతాడు.
చిన్న చిన్న చీమలు వగైరా
అడుగు భుజం అనుకోండి
బలవంతమైన సర్పం/గట్రా ఎట్ సెట్రా/అడుగు భుజం ఉత్పత్తి చేసే ఆహారం మీద ఆధారపడ్డం వల్ల లంబం అవదా మరి
ఈ భుజాల పరస్పర సంఘర్షణల ఫలితం
భుజాల కర్ణాల మీది చతురస్రం
అవునా! సరి
ఈ చతురస్ర వైశాలం/
రెండు విభిన్న భుజాలపై గల చతురస్రాలు
కష్ట జీవుల శ్రమ ఫలితం, పెట్టుబడిదారుల దోపిడీ మొత్తానికి సమానమని ఫైథాగరస్ సిద్ధాంతాన్నుప యోగించి నిరూపిస్తాడు.
ప్రేమ కవితల షెల్లీలా ఆల్జీబ్రా సూత్రాన్ని ఉపయోగించి ఓ అజ్ఞాత కవి ఇలా చెపుతాడు తన ప్రేమలేఖలో.
నువ్వు 'a అయితే నేను 'b నవుతా
నీలో నేను కలిసి a+b అవుతాం
మనిద్దరం ఏకమైతే a+b హెూల్ స్వేర్ !
మనిద్దరి ప్రతిరూపాలు a,b లైతే మన జీవితం విచ్చుకుంటుంది a+b+2abలా.
సైన్స్ అభివృద్ది చెందే కొద్దీ గణితం కూడా అభివృద్ధి చెందుతూ పోయింది. ఈ గణిత భాషని సామాన్య భాషలోకి కవిత్కీరించడం కవికి అసాధ్యంగా పరిణమించింది. ఆధునిక గణితంలో ప్రవేశించిన linear algebra ,sapces,
functions, integration, differentiation, లాంటి వాటిని సాహిత్యంలోకి తీసుకురావడం కష్టతరమైంది. అయితే ప్రకృతి భాష మాత్రం గణితమే. ప్రకృతిలోని ప్రతి ఆకారం రేఖా గణితం చెప్పే ఆకారాల్లో చెపుతారు. మనకు కనిపించే ప్రతి ఆకారాన్ని రేఖా గణితం ద్వారానే బంధిస్తాం. క్రీ.శ. 150 లోనే గ్రీకు ఖగోళ పరిశోధకుడు క్లాడియస్ టాలమీ గ్రహాల, నక్షత్రాల ఉనికిని నిర్ధారిస్తూ ఒక చిత్రపటం తయారు చేశాడు. ఆయన మన భారతీయులు భావించినట్లే భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుడు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని భావించాడు. ఇప్పటికీ పంచాంగ కర్తలు అదే విధంగా లెక్కగడుతున్నారు.అందుకే అవి అశాస్త్రీయాలయ్యాయి. క్రీ.శ.1619 లో జోహాన్స్ కెప్లర్ గ్రహాల చలనం అండాకారం (Elliptical)లో జరుగుతుందన్నాడు. దాంతో వృత్తాకార చలనానికి అంతం పలికే గణితశాస్త్రం కూడా అంతరించింది.దీనికి తోడు కాలం కూడా జత చేరింది. దీని అర్థం చేసుకోవడానికి డిఫరెన్షియల్ క్యాల్కులస్ అవసరమైంది.దీన్ని న్యూటన్ fluxionsఅన్నాడు.
"సైన్స్ తోను, తత్వంతోను కలిసి కాలు కదపని సాహిత్యం మానవ హత్యా సదృశ్యం, ఆత్మహత్యా సదృశ్యం”అనంటాడు ఫ్రాన్స్ రచయిత బోదిలేర్. సున్నను భారతీయులు కనుగొన్నారని అందరికి తెలుసు.అయితే సున్నను ఎలా కనుగొన్నారనడానికి సరైన ఆధారాలు లేవు. రాళ్లను నేలపై (అంకెల బదులు) పెట్టి లెక్కవేసేవారు. అప్పుడు రాయిని తొలగించినప్పుడు అక్కడ గుండ్రంగా పడిన అచ్చుల నుంచి సున్నా ఆకారాన్ని తీసుకున్నారని భావిస్తున్నారు. ఆర్యభట్ట క్రీ.శ. 476 లోనే సున్నను ఉపయోగించాడు. ఆర్యభట్ట ఫై (pi) విలువను 3. 1416గా ఐదు గణాంకాల వరకు లెక్కించాడు. దీని సాయంతో భూమి చుట్టూ కొలత 39968 కి.మీగా నిర్ధారించాడు. (ఇప్పుటి లెక్కల ప్రకారం 40075 కి.మీ ).అంతేకాక ఆర్యభట్ట చంద్రుడు స్వయం ప్రకాశకం కాదని సూర్యుని కిరణాలు పడడం వల్లే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని తేల్చాడు. గ్రహణాలు ఎలా ఏర్పడుతున్నాయో తన దగ్గరున్న కోణమాని ద్వారా భూమిపై పడే నీడలను బట్టి లెక్క గట్టాడు. ఇవన్నీ తన ఆర్యభట్టీయంలో రాశాడు.
ఆర్యభట్టాను గణితానికి పితామహుడని పిలుస్తున్నారు. గ్వాలియర్ కోటలో ఉన్న 9వ శతాబ్దానికి చెందిన ఒక ఆలయంలో సున్నాను నమోదు చేసినట్టు ఆధారాలున్నాయి. మెసపటోమియా, చైనా, ఈజిప్టులలో సున్నా భావన ఉంది. కానీ దానికి వారెలాంటి గుర్తు వాడలేదు.
ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయంలో ఖగోళ పరిశోధనాలయంలో తన ఆర్యభట్టీయాన్ని క్రీ.శ. 499 మార్చి 21న సమర్పించాడు. ఇతను ఒక రోజును అర్ధ రాత్రి నుంచి అర్ధ రాత్రి వరకు అని నిర్వచించాడు తన గ్రంథంలో.
అరబ్బులకు గణితంలో ఆసక్తి ఎక్కువ. ఊహలలో సమస్యలను సృష్టించి వాటికి సమాధానం రాబడుతుంటారు. వీళ్లే రోమన్ అంకెల పద్దతి బదులు అంకెల విధానాన్ని రూపొందించింది. అంకెల విలువ దశాంశ క్రమంలో ప్రారంభమౌతుంది. దీనికి సున్నా అవసరమైంది. క్రీ.శ. 750 ప్రాంతంలో ఇండియా నుండి అరబ్బులు దశాంశ పద్ధతిని,సున్నను తీసుకున్నారు.జీబ్రా,ఆల్ జీబ్రా అరబ్బీ పదాలే.
క్రీ.శ.7 వ శతాబ్దంలోనే బ్రహ్మ గుప్తుడనే గణిత శాస్త్రవేత్త సున్నా లక్షణాలను వివరించాడు. 1+0 =1
1-0 = 1, 1*0=0 అని స్పష్టం చేసినాడు. 1/0= అనే విషయాన్ని భాస్కరాచార్యుడు 12 వ శతాబ్దంలో ఆవిష్కరించాడు. ఏ అంకెనైనా,ఏ సంఖ్యనైనా 0తో భాగిస్తే అనంతం అని తేల్చి చెప్పాడు. ఈ భాస్కరుడే లీలావతి గణితాన్ని రచించింది. ఇందులోఅనేక అంక గణిత సంఖ్యలను చర్చించాడు. ఆక్టేయోపాజ్ అన్న కవి భారతీయుల సున్నపై ఒక కవితను రాశాడు.
భారతీయ తాత్వికులు సున్నాను ఊరకనే సృష్టించలేదు
ఒకటికి సున్నాకు మధ్య నిరంతర
ఘర్షణా ఉంది
సమైక్యత ఉంది
ఒకటి గణాంక సత్యం
మరొకటి అధిభౌతిక సూచిక
ప్రకృతిలో ఏ దృశ్యాన్ని చూసిన అది ఏదో ఒక రేఖ చిత్రంలోకి ఒదిగిపోతుంది. కవులు తమ భావాలను
ప్రతీకలతోను,పద చిత్రాలనో వ్యక్తం చేయటానికి కూడా ఇలాంటివేఉపయోగిస్తుంటారు. మనం పొడవు,వెడల్పు, ఎత్తు అనే మూడు కొలతల ప్రపంచంలో ఉన్నాం. అందువల్లనే సింధునాగరికత కాలంనాటి ప్రజలు ఐదువేల
సంవత్సరాల క్రితమే (క్రీ.పూ.3000 ) ఇటుకలను చేసి వాటిని పేర్చి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇప్పటి ఇళ్ళలాగానే
పై అంతస్థు ఇళ్లను నిర్మించారంటే వారికి గణిత శాస్త్ర పరిజ్ఞానం బాగా తెలిసుండాలి. భూమిని దాటి
అంతరిక్ష్యంలోకి పొతే పొడవు, వెడల్పు, ఎత్తులే కాక కాలం అనే నాలుగో కొలతను కూడా చేర్చుకోవాలి. అలాగే
మరో ఏడు కొలతలను కూడా విశ్వాంతరాళంలో శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు.
నండూరి రామ మోహనరావు తన విశ్వరూపం గ్రంథంలో ఒక చోట ప్రకృతి కవి కీట్సు గురించి ఇలా చెపుతాడు.ఒక అందమైన పాత్ర పైన ప్రేయసీ ప్రియుల చిత్రాన్ని చూసి ఆయన “అయ్యో ప్రేమికుడా ! నువ్వామెను ఎన్నటికీ ముద్దుపెట్టుకోలేవుగదా!"అని
అన్నాడట.నిజమే పొడవు, వెడల్పు ప్రపంచంలో ఉండడ మంటే ఒక కాగితం పైనో, ఒక బల్ల పైనో ఉన్నట్లే గదా !
ఆదిమానవుడి ఆశ్చర్యం, ఆలోచనలు ఆకాశమంతా విస్తరించాయి. రాత్రి పూట నక్షత్రాలు, పగటి పూట వాతావరణ మార్పులు వీటన్నింటికి కారణాల్ని అన్వేషించాడు. ఫలితంగా రాశులు, ఖగోళ రహస్యం, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఒకటేమిటి విశ్వాన్ని, విశ్వాంతరాళాన్ని శోధించాడు.
త్రికోణమితి ఆధారంగా భూమికి సూర్యునికి, భూమికి చంద్రునికి మధ్య దూరాలను కొలిచారు. అంకెలు కొనుక్కోకముందు చిత్రలిపి వాడేవారు.ఒకే వరుసలో నాలుగు చిహ్నాలు/ అక్షరాలు చెక్కబడి మొత్తం మీద 132 చిహ్నాలతో ఉంటుంది. బ్రాహ్మీ లిపి ఆధారంగా మన దేశంలో అంకెలు రూపుదిద్దుకున్నా యట. క్రీ.శ.224-383 కాలానికి చెందిన తాళపత్ర గ్రంథం. నేటి పాకిస్తాలోని పెషావర్ కు దగ్గరలోని భిక్షాలి గ్రామంలో 1881 ఒకటి లభించింది.అందులో సున్నాను ఉపయోగించడం కనిపించింది.
ఆకాశ వీధిలో కనిపించిన నక్షత్ర గుంపును మూడు ఆకారాల్లో గుర్తించారు.ఇవి సర్పిలాకారం (spiral)_80%, దీర్ఘ వృత్తాకారం (elliptical)17%, ఏ ఆకారం లేనివి (irrelavant)3%.
క్రీ.శ.1500 నాటి రుగ్వేదంలో 'భూమి వృత్తాకారపు అంచున ఉన్నవారు'అని వ్యాఖ్యానించారు ఆనాటి ప్రజలు (1:33:8). అంటే భూమి గుండ్రంగా వృత్తాకారంలో ఉందని భావించారు. అంటే వారికి వృత్తం గురించి తెలుసు. క్రీ.శ. 505లో “గుండ్రని భూమి, పంజరంలో వేలాడే ఇనుప పంజరంలాగా ఖగోళంలో మధ్యలో నిలుచివుందన్నాడు”. ఇతను ఆర్యభట్టాకు సమకాలీకుడు. ఇతనే Sin^2x+Cos^2x=1,
Sinx = Cos(π/2- x), (1-Cos2x)/2 = sin^2 x
మొదలైన సూత్రాలను కనుగొన్నాడు.
సైన్స్ నిండా గణితముంటుంది. కవిత్వం ఒళ్లంతా సంగీతముంటుంది. సంగీతమంటే ధ్వనుల గణాంక స్వభావమే కదా అనంటాడు క్రిస్టఫర్ కాడ్వెల్ ప్లేటోతో ఏకీభవిస్తూ. సూర్యుడు, చంద్రుడు, భూమి గోళాకారంలో ఉన్నాయని తెలుసుకునే క్రమంలో గ్రీసు లో రేఖా గణితం (geometry) ఆవిర్భవించింది. geo అంటే భూమి, metry అంటే కొలవడం అని అర్థం. యూక్లిడ్ దీనికి పితామహుడు. ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 అని చెప్పింది ఈయనే. దేవుని గణితమయ ఆలోచనల రూపమే ఈ ప్రకృతంటూ వర్ణించాడు యూక్లిడ్.ఇతనుఐదు స్వీకృతాలను (axioms) ప్రతిపాదించాడు.
అందుకేనేమో గణితంపై ఆసక్తి కలిగిన ముకుందాపురం పెద్దన్న అంతరాంతరాల్లో కలియబెట్టే ఓ సంక్లిష్టతను/అవలీలగా నా మునివేళ్ళపై/ ఫార్ములాల్ని పూయించ/ వైశ్లేషిక రేఖాగణితం/నన్ను ఓ మాంత్రికునిగా నిర్వచిస్తుంది" అనంటాడు తన 'శిఖరపు లోయ కవితలో. శ్రీశ్రీ చతురస్రం, 1+1 =1 నాటికలు కూడా రాశాడు. టి.ఎస్. ఎలియట్ "ఫోర్ క్వార్టెట్స్ రాశాడు. శ్రీశ్రీ."5,9,2 ఆముక్తమాల్యద ఆటవెలది ద్విపదకత్తగారు” అంటూ అంకెలతో సర్రియలిజం కవిత్వీకరించాడు.
విశ్వాన్ని సున్న ఆధారంగా వక్రంగా ఉంటుందని భావించారు . లేదు చదరంగా ఉంటుందన్నారు కొన్నాళ్లు.
కొన్నాళ్ళకు విశ్వంపై చర్చించే విశ్వోద్భవశాస్త్రం (కాస్మొలజి) కూడా ఏర్పడింది. విశ్వాకారాన్ని చివరకు అతిగోళం(hypersphere) గా నిర్ధారించారు. బంతి కడుపులో మరొక బంతి ఆకారాన్ని ఉండటాన్ని అతిగోళం
అంటారు. ఉల్లిపాయలాగా కేంద్రం చుట్టూ ఒకదానిమీద ఒకటిగా ఉన్న పొరల దొంతరలతో విశ్వముందని భావిస్తున్నారు. విశ్వానికి పొడవు,వెడల్పు, ఎత్తు, కాలంతో పాటు మరో ఏడు కొలతలున్నాయి. దీన్ని
M theory అన్నారు.
ప్రకృతి భగవత్స్వరూపుడు కాదు.అదొక పద్మ ప్యూహం. చూడటానికి గజిబిజిగా ఉన్నా బాగా పరిశీలిస్తే అందులో ఒక ప్రణాళిక ఉంది. కాంతికి, కాలానికి సంబంధముంది. రోదసికి, కాలానికీ సంబంధముంది.శక్తికి, పదార్థానికి సంబంధముంది. రోదసికి, గురుత్వాకర్షణ శక్తికి సంబంధముంది. ఆయన వీటన్నింటినీ పరిశీలించారు. ప్రకృతిని అధ్యయనం చేయడమంటే భగవంతుని రహస్యాన్ని గ్రహించడమేనని చెప్పిన ఐనిస్టీన్ ప్రకృతిలోనున్న ఒకానొక కాంతి వేగం (C= 3x10^5 km/sec ) తో హెచ్చిస్తే అది ప్రకృతిలోని పదార్థ శక్తిగా నిరూపించాడు. ప్రపంచ విజ్ఞానాన్ని మేలిమలుపు తిప్పిన శక్తి సిద్ధాంతంతో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి; జరుగుతున్నాయి కూడా.
ప్రకృతిని ఎంత చేధించినా మనిషి మనిషిగా, దేవుడిగా మారేదెన్నడు అన్న ప్రశ్న ఇంకా వేధిస్తూనే ఉంది.అందుకు బౌద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలు,పంచశీల మళ్లీ నేడు అవసరమయ్యాయి. అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ “దేవుడిని తిరగేస్తే మానవుడు, మానవుణ్ణి తలకిందులు చేస్తే దానవుడు” అంటూ 'ప్లస్ ఇంటూ మైనస్' లో చెపుతూనే ఆ మనిషి దేవుని రూపంగా మారే విషయాన్ని చెపుతూ"మానవుడు మానవుడిగా దేవుడిగా రూపొందే ప్రయాణం అనంత దీర్ఘం పునః పునర్వర్థం బహుయుగ విస్తీర్ణం" అని చెపుతాడు.
* * *
క్రీ.పూ. 1500లోని రుగ్వేదంలో 164వ సూక్తంలోని కవితల్లో దివి, పృథ్వి ఎవరు ముందుపుట్టారు? ఎవరు తరువాత పుట్టారు? పృథ్వి నుంచి ప్రాణం ఎలాపుట్టింది? ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమికి అంతం ఎక్కడ? లోకాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న ప్రశ్నలు ప్రాచీన మానవుడు వేసుకున్చాడు. ఆనాటికి విజ్ఞానం వికసించని దశలో సమాధానంగా అంతా దేవుడే అన్న విశ్వాసంలోకి వెళ్ళిపోయినాడు.
భారతదేశంలో క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో వచ్చిన ఉపనిషత్తులలో బృహదారణ్య కోపనిషత్ సృష్టి ఎలా జరిగిందనే విషయంపై పెద్దగా చర్చ చేశారు. ఈ ఉపనిషత్తులో (1-2-2)లో విశ్వమంతా శూన్యంగా ఉండేదని అందులో జీవరహితమైన ఆకలి మృత్యు రూపంలో ఉండేదని చెప్పారు. ఆకలి శరీరం కావాలనుకొంది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించాడు. దాని నుండి నేలను సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు (వీర్యం)అగ్నిగా మారిపోయింది. ఇందులో మొదటి భౌతిక పదార్థం నీరుగా చెప్పినారు. వీరి ప్రకారం సృష్టికి మూలం నీరే.
ప్రకృతిలోని భౌతిక పదార్థం, దానిలోని జీవం కలయిక వల్లే జీవం ఏర్పడుతోందని ప్రశ్నోపనిషత్ (క్రీ.పూ. 500-400) చెపుతుంది. ఇలా కొన్ని ఉపనిషత్తుల్లో దార్శనికులు కొద్దిపాటి భౌతికవాద దృష్టితో చెప్పినారు.
ప్రాచీన సాహిత్యంలో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి విషయాలను ప్రపంచ విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రారంభదశ అని భావించారు. దీన్నే ప్రత్యక్ష ప్రమాణం అన్నారు.ప్రత్యక్ష పరిశీలన ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వస్తువు గురించి కొంత జ్ఞానంఏర్పడుతుంది. ఏ కారణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సూత్రీకరణ చేయమన్నారు. దీన్నే అసమాన ప్రమాణం” అని అన్నారు. ఈ సూత్రీకరణలు వాటంతటవే సత్యాలు కాజాలవు. వీటిని ఆచరణలో చూసి రుజువైతే సత్యంగా అంగీకరించమని చెప్పినారు. ఇది నేటి పరిశీలన, విశ్లేషణ, ప్రయోగం, సూత్రీకరణ పద్ధతులను పోలి ఉంది. చరకుడు, అసితకేశ కంబరుడు, కణాదుడు మొదలైన భౌతికవాదులు మత గ్రంధాలలో చెప్పిన వాటికన్నా భిన్నమైన అభిప్రాయాలు చెప్పినారు. ప్రధానంగా అవి;
1. భూమి, నీరు, అగ్న్ని ఆకాశం, గాలి కలయికతో (పంచభూతాలతో) ప్రకృతి ఏర్పడింది.
2. ఈ పదార్థాల విభిన్న కలయికల వల్లే ప్రకృతిలోని విభిన్న వస్తు జాలం ఏర్పడింది.
నిర్దీవదశనుండి సజీవదశకు, సజీవదశనుండి నిర్దీవదశకు నిరంతరం రూపాంతరం చెందుతాయి. ఇది నేటి వస్తు నిత్యత్వ సూత్రాన్ని పోలివుంది.
3. నిరంతరం మార్పు చెందే లక్షణం వాటిసహజ లక్షణం. నిప్పువేడిగా, నీరుచల్లగా ఎట్లానో అట్లా మార్పుకూడా.
4. ప్రకృతిలోని పంచభూతాలలో మనిషి తయారుచేయబడినాడు. దీనిని రసోత్పత్తి అన్నారు.రసమంటే నిరంతర చలనం అని అర్థం. అగ్ని వలన ఆహారం రస గా మారుతుంది. ఈ రస మరల రక్తం, మాంసం, కొవ్వు, మూలుగ, ఎముక, నీరులాగా మారుతుంది.
బుద్ధుడు (క్రీ.పూ. 563–483) ఒక పదార్థం వేరొక పదార్థంగా మారుతుందేగాని ఎన్నటికీ ధ్వంసం కాదని చెప్పాడు. మార్పునకు లోనుకానిదేదీ లేదు. ప్రపంచమంతా చలసశీలమైనది. మార్పు ప్రపంచ అస్థిత్వానికి మూలసూత్రమని చెప్పాడు. గ్రీసు దేశపు ' హెరాక్లిటస్' కూడా ఇదే సూత్రాన్ని చెప్పినాడు.
క్షణక్షణం మనం చూసే ప్రపంచం కొత్తదని బుద్ధుని భావన. ప్రపంచం గతిశీలమైనదని (మార్పుకు లోనవుతుందని) చెప్పిన బుద్ధుడు పరిణామవాదాన్ని అంగీకరించాడు.కార్యాకారణ సంబంధ సూత్రాన్ని ప్రతిపాదించాడు.
పూర్తిగా భౌతిక వాదంతో చెప్పినాడు అసితకేశకంబరుడు. ఇతను బుద్ధునికి (క్రీ.పూ. 500) సమకాలికుడు. ఇతను జీవం అనేది నీరు, నిప్పు, గాలి, మట్టి కలయికతో ఏర్పడిందన్చాడు. ఒకజీవి మరణిస్తే ఆజీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో నిప్పు నిప్పులో మట్టి నేలలో కలిసిపోతుందన్నాడు. స్వర్గం, నరకం, దేవతలు అంటూఏమీలేవు. ఉన్నవి ఈనాలుగే అని అన్నాడు.
ప్రకృతి కాత్యాయనుడు బుద్ధుని సమకాలికుడు. ఇతని ప్రకారం ప్రకృతి అచంచలమైనదీ, నిత్యమైనది. ప్రకృతిని ఎవరూ సృష్టించలేదు, ఎవరిచేతా నిర్మింపబడలేదు, అది స్వయం సిద్ధంఅని చెప్పినాడు. ప్రకృతి 7 తత్వాలుగా ఉందన్నాడు. పృథ్వీతత్వం, జంతు తత్వం, వాయుతత్త్వం, సుఖం, దు:ఖం, జీవితం. ఇవి ఒకదానికొకటి కారణం కావు. పరస్పరం హాని చేసుకోవు. నీరు నిప్పు, గాలి నేలతోపాటు సుఖం, దుఃఖం, చైతన్యంల కలయికతో జీవం పుట్టిందన్నాడితను.
క్రీ.పూ. 400లో కపిలుడు సాంఖ్య దర్శనాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన ప్రకారం “ప్రకృతి ముందువుంది. ఇప్పుడూ ఉంది. భవిష్యత్తులో ఉంటుంది. అది నిత్యమైనది. ఈ సృష్టంతా దాని రూపాంతరాలే” నన్నాడు. నీరూ, గాలి, నిప్పు, నేల - ఈ నాలుగు అంశాలతో జీవం (చైతన్యం) పుడుతుందని చెప్పారు చార్వాకులు.
కొంత మంది అభిప్రాయంలో క్రీ. శ. 150లో కణాదుడనే రుషి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను వైశేషిక దర్శనానికి కర్త. ఇది షడ్దర్శనాలలో ఒకటి. ఇతని సిద్ధాంతం ప్రకారం ప్రతిపదార్థం పరమాణువులనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైంది. సృష్టికర్తను ఆమోదించలేదు. సృష్టి నిర్మాణానికి పరమాణువుల్లో చలనం అవసరమన్నాడు. కణాదుడు వైశేషిక దర్శనంలో ప్రతిపదార్థం పరమాణువు అనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైనదన్నాడు. పరమాణువులో చలనం ఉంటుందన్నాడు. ఇదే సృష్టికి మూలం అన్నాడు. అణువుల సంయోగవియోగాల వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయన్నాడు. ఇవి నేడు కనుగొన్న అనేక సైన్సు సత్యాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రతి పదార్థంలో పరమాణువు ఉంటుంది.పరమాణువులో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ వెలుపల ఎలక్ట్రాన్లు చలిస్తుంటాయి. న్యూక్లియస్ లోపల ప్రొటాన్లు, న్యూట్రాన్లు చలిస్తుంటాయి. ప్రతి అణువు పరమాణువుల ద్వారా ఏర్పడి ఉంటుంది. అణువుల కలయికల వలనే పదార్థాలు ఏర్పడుతున్నాయి.
అణువుల సంయోగ వియోగాలవల్లే పదార్థాలు రూపొందుతాయన్నది కణాదుడి దృఢమైన అభిప్రాయం. ఇలా సాగిన భారతీయ భౌతికవాదం శంకరుని మాయావాదంతో మళ్లీ భావవాదంలోకి కూరుకుపోయింది. భగవద్గీతతో అది పరాకాష్టకు పోయి తిరిగి లేవలేనంతగా చతికిలపడిపోయింది. భారతీయ విజ్ఞానాన్ని అంధకారం అలుముకుంది. ఇదంతా మాకెప్పుడో తెలుసు, అన్ని వేదాల్లోనే ఉన్నాయంటూ నైరాశ్యంతో మాటలు వల్లించే అజ్ఞానులుగా మతఛాందసవాదం తయారుచేసింది భారతీయులను.
బుద్ధుని కాలంలోనే పాయసి అనే రాజు ఇహ పరలోకాలు లేవన్నాడు. చనిపోయినవారు తిరిగిపుట్టరు. ఇంతవరకు చచ్చిన వాడెవుడూ తిరిగి వచ్చి పరలోకముందని చెప్పలేదు. ధర్మాత్ములు, ఆస్తికులు (దేవుని నమ్మేవారు) చావంటే భయపడుతున్నారు. నిజంగా మోక్షం ఉన్నదని నమ్మితే చావంటే వారికి భయమెందుకు? చనిపోయిన శరీరాలనుండి ఆత్మ వెళ్ళినట్లు గుర్తు ఎక్కడుంది?అని ప్రశ్నించాడు.
చార్వాకులు, లోకాయతులు కూడా సృష్టి పరిణామాన్ని చెప్పినారు. వాక్చాతుర్యం గలవారిని చార్వాకులు అన్నారు. లోకమంతా విస్తరించినవారిని లోకాయతులు అన్నారు. వీరి ప్రకారం ఈ ప్రపంచం నిత్యం, సత్యం. ఈ ప్రపంచాన్ని గాని మానవున్ని గాని ఎవరూ సృష్టించలేదు. ప్రపంచం తనకు తానుగా ఆవిర్భవించింది.
జ్ఞానం పొందాలటే ఆచరణలో చూడాలన్నారు. ఆత్మ ప్రబోధం, అంతర్ దృష్టి వలన జ్ఞానం రాదన్నారు. అగ్ని, నీరు, భూమి, గాలి పదార్థానికి మూలం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అచేతన పదార్ధాలకు చెతన్యం వస్తుంది. ఆత్మ చైతన్యంతో ఉంటుంది. అది శరీరాన్ని విడిచి బయట విడిగా ఉండలేదు. మనిషి మరణిచగానే శరీరం, ఆత్మ రెండూ నశిస్తాయని చెప్పినారు. ఇది నేడు ప్రాణం ఎలా ఆవిర్భవించిందో చెప్పే దానికి దగ్గరగా ఉంది. నీటిలో కొన్ని వాయువులు ప్రత్యేక పరిస్థితుల్లోకలిసినపుడు ప్రోటోప్లాజం ఏర్పడి ప్రాణం వచ్చిందని నేడు సైన్సు చెపుతోంది.
సృష్టిని గురించి ప్రాచీన సాహిత్యంలో రెండు రకాలు వాదనలు సాగినాయి. పై వాదనలు ప్రజాసామాన్యంలో ప్రచారంలో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ పైవాదనలకు భిన్నంగా ఉన్నవన్నీ మత సాహిత్యంలో భాగంగా ఉండి పోయినాయి. మొట్టమొదటగా హిందూ మతంలో ఉన్న భావనలు పరిశీలిద్దాం.
హిందూమతం ప్రకారం ప్రారంభంలో విశ్వం ఓంకారం నుంచి జనించిందన్నారు. ఓంకారం నుంచి ఆదిశక్తి పుట్టిందన్నారు. ఆదిశక్తి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చారు. బ్రహ్మ సృష్టికర్త పాత్రను, విష్ణువు పాలననూ మహేశ్వరుడు లయకారకుని పాత్రను తీసుకున్నారన్నారు.బ్రహ్మ తన ముఖం నుంచి బ్రాహ్మణులను, భుజాల నుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించినట్లు చెప్పినారు. చండాలుర గురించి, గిరిజనుల గురించి ఎక్కడా చెప్పలేదు.
బ్రహ్మఆకాశాన్ని సృష్టించాడు. దాని నుండి జలం, జలం నుండి అగ్ని దాని నుండి వాయువు పుట్టించినాడు. అగ్ని వాయువుల కలయికతో భూమి ఏర్పడింది. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు.
బైబిల్ ప్రకారం దేవుడు ఒకరోజు ఆకాశాన్ని, మరోరోజు భూమిని, ఇలా సముద్రాన్ని, వృక్షాలను, జంతువులను చివరిగా ఆడమ్, ఈవ్‌లను సృష్టించాడు. వారిని ఒక ఆపిల్ పండు తినొద్దని చెప్పినాడు. కానీ వారు దేవుడు పంపిన దేవదూతల్లో ధిక్కార స్వరం వినిపించిన ఒకదేవదూత(దయ్యం) ఆ ఆపిల్‌ను తినమని చెపుతుంది. ఆడమ్, ఈవ్‌లు ఆపిల్ తినడంతో జ్ఞానం కలుగుతుంది.తాము దిగంబరులమని తెలుసుకుంటారు. వారి మధ్య సెక్సు కోరికలు ఏర్పడతాయి. వారికలయికతోమానవులు పుట్టుకొచ్చారు. ఇలా సృష్టి జరిగిందని క్రైస్తవ మతం చెపుతుంది.
ఇస్లాం మత (గ్రంథం ఖురాన్ (ప్రకారం సృష్టినంతా ఇల్లాహ్ ఎనిమిది రోజులలో చేశాడు.ఆకాశాన్ని, భూమిని, తన రాజ్యపీఠాన్ని సృష్టించాక సూర్యున్ని, చంద్రున్ని నక్షత్రాలను సృష్టించాడు.తరువాత మానవున్ని మట్టితో తయారుచేసి అతనిలో ఇల్లాహ్ తన ఆత్మను ఊదాడని రాసినారు. ఆ మానవుని పక్కటెముక నుంచి ఒక స్త్రీని తయారుచేసి ఆమెకు కూడా తన ఆత్మను ఊదినాడు. ఇలా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడని ఖురాన్ చెపుతుంది.
క్రీ.శ. 1440లో యూరప్ సమాజం సాంస్కృతిక పునరుజ్జీవనం పొంది చీకట్లను తెంచుకొని విజ్ఞానపు వెలుగులోకి దౌడుతీస్తే భారతదేశం మాత్రం ఛాందసవాదపు చీకట్లలోనే ఉండిపోయింది.
డార్విన్ ప్రకృతిని విపరీతంగా పరిశీలించి, శోధించి చివరకు జీవజాతుల పుట్టుక (ఆరిజన్ ఆఫ్‌స్పీషీస్)ను ప్రపంచానికి అందించాడు. సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను తోసేసి అదికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ తరువాత జరిగిన అనేక పరిశోధనలు ఆయన సిద్ధాంతాన్ని నిరూపించాయి. ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్న పరిణామ వాదం ప్రకారం ప్రకృతిలో ఉన్న కార్బన్, హైడ్రోజన్, ప్రాణవాయువు(ఆక్సిజన్), నైటోజన్ ఇవి అనేక విధాలుగాకలియడం వల్ల సేంద్రీయ పదార్థాలు వాతావరణంలో ఏర్పడి, అవి వానలతో పాటూ కలిసిసముద్రంలో చేరివుంటాయి. ఆ సేంద్రీయ పదార్థాలు తిరిగి అనేక విధాలుగా కలవడం వల్ల సంకీర్ణమైన కొత్త పదార్థాలు ఏర్పడినాయి. అలా ఏర్పడిన క్రమంలో ఆల్టిహైడ్స్, కీటోన్స్, ఎమైనోయాసిడ్స్ మొదలైనవి ఏర్పడినాయి. జీవానికి కావలసిన ఎమైనోయాసిడ్లు (ప్రోటీన్లు) ఏర్పడటం తద్వార ప్రాథమిక జీవలక్షణాలను ప్రదర్శించే కణాలు ఏర్పడటం జరిగింది. 1924లో రష్యాకు చెందిన శాస్త్రవేత్త 'ఒపారిన్', 1929లో ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త హాల్డెన్ 'లు నిర్జీవ పదార్థం నుంచే జీవం ఆవిర్భ వించిందనే దానికి బలమైన ఆధారాలు కనుగొన్నారు. దానితో దీన్నే ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసమ్మతంగాఆమోదిస్తున్నారు. 1995లో బైబిల్ చెప్పింది మాత్రమే నమ్మేమ పోప్ జాన్ పాల్ (వాటికన్ సిటీ)పదార్థం నుంచే జీవం వచ్చిందని, భగవంతుని సృష్టికాదనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించాడు కూడా.
జీవానికి ప్రోటీన్ల వలెనే న్యూక్లియోటైడ్స్ కూడాచాలాఅవసరం. న్యూక్లియోటైడ్స్ రకరకాలుగా చేరడం వల్ల డి.ఎన్.ఎ, ఆర్.ఎన్.ఎ మాలిక్యూల్స్‌ఏర్పడతాయి. ఇవి జీవుల వారసత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయోతెలుసుకోవడమేగాకుండా వాటిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. భారతీయ శాస్త్రవేత్తహరగోవింద ఖొరానా అమెరికాలో కృత్రిమ జీన్స్ సృష్టించాడు.ఈ రకంగా జీవం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు కనుగొని ప్రపంచానికి సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పడంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు
ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రకృతిలో ప్రతి పదార్థంలోనూ చలనం ఉంటుంది. అది మార్పు చెందుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఏది స్వతంత్రంగా ఉండలేదు. అది ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలో ప్రతిదీ పరస్పర ఆధారితం. పైగా రెండు వస్తువుల మధ్య ఆకర్షణ వికర్షణ సమానబలాలతో ఉంటుంది. దీనినే వైరుధ్యాలు అన్నారు. అలాగే పాతవి నశిస్తూ కొత్తవి వస్తుంటాయి. ఇవన్నీ ప్రకృతి సూత్రాలు.
ప్రకృతి లోని పదార్థంలో మార్పు జరుగుతూ ఉంటుంది.దాన్ని పరిశీలించడానికి తోడ్పడే వాటి ని చలనసూత్రాలు అంటారు. ప్రతి పదార్థానికి స్థలం, కాలం ముఖ్యమైనవి. ఒక విషయాన్ని చెప్పడానికి దాని కాలాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి చెప్పాలి .దాన్ని అర్థం చేసుకోవాలన్నా దాని స్థల కాలాదుల్లోనే అర్థం చేసుకోవాలి. అంటే చారిత్రక సందర్భంలో దాన్ని చెప్పాలని అర్థం.
ఇంతవరకు చర్చించిన విషయాలను చలన సూత్రాలను సమాజానికి వర్తింప చేస్తే దాన్ని మార్క్సిజం అన్నారు. ఇదే విధమైన పరిశీలనను తెలుగు సాహిత్యం పై చేస్తే అది మార్క్సిస్టు ధోరణి అవుతుంది.ఈ ఆలోచనా విధానాన్ని క్రిస్టఫర్ కాడ్వెల్, జార్జి థాంప్సన్, జార్జ్ లూకాస్, ఎర్నెస్ట్ ఫిషర్ ,రేమండ్ విలియమ్స్ మొదలైన వాళ్లు అభివృద్ధి చేశారు. తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ దృక్పధాన్ని ప్రవేశపెట్టిన వారిలో రా రా ,మద్దుకూరి చంద్రశేఖరరావు ,కొ.కొ., శ్రీ శ్రీ., కె.వి రమణ రెడ్డి ,త్రిపురనేని మధుసూదనరావు ,చేకూరి రామారావు, రాచపాళెం, కాత్యాయని విద్మహే, తెలకపల్లి రవి, రంగనాయకమ్మ మొదలైనవారు ప్రసిద్ధులు.
సాహిత్యం సమాజానికి దర్పణం వంటిది. సాహిత్యం ఒక సామాజిక ఉత్పత్తి. సమాజం లేందే సాహిత్యం లేదు. సాహిత్యానికి స్వతంత్రంగా ఉండే లక్షణం లేదు. సమాజంలో అది ఒక భాగం. సమాజంలో పీడిత వర్గం, పీడించే వర్గం ఉన్నాయి. వారి మధ్య ఘర్షణ , ఐక్యత ఉంటుంది. ఈ సమాజం నుంచి వచ్చిన సాహిత్యకారుడు కూడా అనివార్యంగా ఏదో ఒకవర్గం వైపు మొగ్గు చూపుతాడు.అందువల్ల సాహిత్యకారులకు ఉన్న వర్గ దృక్పథం బట్టే సాహిత్యం పుడుతుంది.
సమాజానికి ఆర్థికం పునాది వంటిది. సమాజంలో మానవుని అవసరాల రీత్యా సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ఉంటాయి. దీని అభివృద్ధిని బట్టే సాహిత్యం కళలు ,ఉత్పత్తి అవుతాయి. సమాజంలో ఉన్న రెండు వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మనదేశంలో కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు, మతాల మధ్య వైరుధ్యాలు, దోపిడీ వర్గం పీడితవర్గం మధ్యనున్న వైరుధ్యాలు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి..
సాహిత్యకారుడు తన రచన కోసం, తనకున్న కుల దృక్పథంతోనూ, వర్గ దృక్పథంతో నో,మత దృక్పథంతోనో,ఆరోజుల్లో సమాజంలో నెలకొన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి , ఒక వస్తువును స్వీకరిస్తాడు. తనకున్న ప్రత్యేకమైన శైలితో ఆ రచనను పూర్తి చేస్తాడు. ఆ రచనను అధ్యయనం చేసేటప్పుడు పైన చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయడాన్ని మార్క్సిస్టు దృక్పథం అంటారు.
మహాభారతాన్ని పరిశీలించినప్పుడు వ్యాసుడు అందులో బ్రాహ్మణ క్షత్రియ వర్గాలను సమర్థించడం మనం చూస్తాం.ఇది రచయిత ఎవరి వైపున్నాడో తెలియజేస్తుంది.
రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని, వేమారెడ్డి హరివంశాన్ని,మామిడి సింగన్న శృంగార నైషధాన్ని, రాయలు మనుచరిత్రను కవులతో రాయించడం వెనుక వారి వర్గ ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లనే ఆయా రచనలు వచ్చాయి.
పీడితవర్గం వైపు నిలబడిన చెరబండరాజు ప్రపంచ పురోగతి మొత్తం శ్రమజీవి నెత్తుటి బొట్టులో ఇమిడి ఉందని చెబితే, మహాకవి శ్రీశ్రీ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరని ప్రశ్నిస్తాడు.వీరిద్దరూ శ్రామిక వర్గం వైపు నిలబడిన రచయితలు.
ఇలా సాహిత్యకారుడు ఏదో ఒక వర్గం ఉండాలంటే అతనికి సామాజికచైతన్యం ఉండాలి.సమాజిక జీవితం ఉండాలి. మానవ చైతన్యం భౌతిక ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాదు దానిని సృష్టిస్తుంది కూడా అని లెనిన్ అన్నాడు. అంటే రచయిత తన సమాజాన్ని అధ్యయనం చేసి సరికొత్త సమాజ ఆవిష్కరణ కోసం తన కల్పనతో రచనలను చేస్తాడు.
సమాజంలోని వైరుధ్యాలను గుర్తించడానికి మార్క్సిస్టు ఆలోచనా విధానం దోహదపడుతుంది. రచయిత చైతన్యం అతను తీసుకున్న వస్తువును బట్టి తెలిసిపోతుంది ఆ రచయితకున్న అవగాహన నుకూడా తెలియజేస్తుంది.
రచయితకు చైతన్యం ఎలా వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా రచయిత ప్రాపంచి దృక్పథం,అతను నమ్మిన విలువలు, అతని నిబద్ధత ఇవన్నీ అతని చైతన్యాన్ని పెంపొందిస్తాయని రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి చెపుతారు. చైతన్యాన్ని బయట నుంచి అందించాలని లెనిన్ చెప్పినారు. రచయితకు కూడా సామాజిక సంబంధాలను గురించి,అందులోని వైరుధ్యాల గురించి పరిష్కారాల గురించి ఎవరో ఒకరు చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు రచయిత స్వానుభవం కొంత తోడ్పడుతుంది. అంతేగాక గురజాడ, జాషువా, శ్రీశ్రీ, రంగనాయకమ్మ మొదలైన వారి రచనలు కూడా రచయిత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినంత చైతన్యాన్ని అందిస్తాయి.
రచయిత సామాజిక చైతన్యం పెంపొందించుకునే క్రమంలో అభివృద్ధికరమైన ఆలోచనలు చేస్తాడు .వాటిని సమాజ పురోగతి కోసం ప్రజా ప్రయోజనాల కోసం తన రచనలో వ్యక్తీకరిస్తాడు. ఈ వ్యక్తీకరణ కళాత్మకంగా ఉండాలి. సామాజిక వాస్తవికతను చెప్పడమేగాక భవిష్యత్ పరిణామాన్ని గుర్తించగలిగే శక్తి మార్క్సిస్టు దృక్పథం తోనే సాధ్యం అవుతుంది దీనినే సామ్యవాద వాస్తవికత అని కూడా అంటారు.
రచయిత తన రచనలో నవ్యత, గాఢత, క్లుప్తత తీసుకురావాలని తెలకపల్లి రవి చెపుతారు. పూర్వం చెప్పని విషయాలను ఆధునిక భావాలను రచనలో ప్రవేశపెట్టాలన్నారు.
పాఠకుని హృదయాన్ని కదిలించి, మనసును స్పందించిన జేసి భావప్రక్షాళన చేసేదే ఉత్తమ రచనగా అరిస్టాటిల్ పేర్కొన్నారు. దీన్నే శిల్పం అని కూడా అంటారు. కళాత్మక రచన అని కూడా అంటారు. రచయిత తన రచనకు తీసుకునే వస్తువును తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.
రచయిత శిల్పం కోసం తపన చెందినప్పుడు వస్తువుని పక్కన పెట్టేస్తాడు. దాంతో రూపం ముందుకొస్తుంది. రూపమంటే అది పద్యమో,గద్యమో, వ్యాసమో,కథో,కవితో కావచ్చు. వస్తువు,రూపం లో రూపం ప్రధానమనే భ్రాంతి లో పడి పోతాడు రచయిత. పద్యంలో చెప్తేనే బాగుంటుందని ,వచనం సరైంది కాదని , నానీలు మంచివని ఇలా రూపాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. రచనలో సామాజిక స్వభావం లేనప్పుడు రూప వాదం మొదలవుతుందని ఫ్లెఖనోవ్ అంటారు.
జీవిత సంక్షోభాలను గుర్తించి పరిశీలించి పరిష్కారం సూచించి మనిషిని మరింత చైతన్యవంతుల్ని చేసేదే గొప్ప సాహిత్యం అవుతుందంటారు పాపినేని శివశంకర్.
సాహిత్యం మనిషిని సంస్కారవంతుని చేస్తుందని గురజాడ అన్నారు.సాహిత్యం చేసే పని భావ ప్రచారమేనని అమెరికా రచయిత ఆప్టన్ సింక్లెయిర్ అంటారు. సాహిత్యం ఒకవైపు భావ ప్రచారం చేస్తూనే మానవ సంస్కారం లోనూ ,ఆలోచనా ప్రవాహంలోనూ మార్పు తీసుకువస్తుందని బాలగోపాల్ అన్నారు. ఇది ఒక రకంగా బయటనుంచి చైతన్యం అందించే ఒక విధానం.
సాహిత్యకారులు చాలామంది మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి బుద్ధిజీవులలో ఎక్కువ భాగం ద్వంద్వ స్వభావం ఉంటుంది . దీని వల్ల వారిలో మానసిక సంఘర్షణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది . ఈ సంఘర్షణలో ఏది పైచేయి సాధిస్తే అటు వైపు మొగ్గు చూపుతారు మధ్యతరగతి బుద్ధిజీవులు. ఇలాంటి సంక్లిష్ట సామాజిక జీవితం నుంచి వచ్చిన కవులు రచయితలు తమ రచనలకు సమాజం నుంచి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత ప్రపంచీకరణ ప్రపంచంలో సామాజిక జీవితం సంక్షోభంలో ఉంది దీనికి సరైన పరిష్కారాన్ని గుర్తించి అందించాల్సిన బాధ్యత సాహిత్య కారులదే. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో అసమానతలు,పేదరికం, మూఢనమ్మకాలు, దోపిడీ, అజ్ఞానం కొన్ని వర్గాలు నిరంతరం వాటినే ప్రచారం చేస్తున్నారు. వాటిని పోగొట్టడానికి, రూపుమాపడానికి సాహిత్యకారులకు మార్క్సిస్టు ఆలోచనా విధానమే సరైన సాధనం.
ప్రపంచీకరణ ప్రారంభమై మూడు దశాబ్దాలు గడిచాయి. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు మొదలైన సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ 90వ దశకంలో ప్రారంభమైనప్పుడు చాలామంది మేధావులు దీనిని వ్యతిరేకించారు. అప్పట్లో సాహిత్యకారులకు దీని పర్యవసానాల పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పడలేదు.
ప్రపంచీకరణ అన్ని రంగాల్లోకి చొచ్చుకుని వచ్చిందిప్పుడు ఆక్టోపస్‌లా. అదొక మట్టికాళ్ళ మహారాక్షసి. నోరులేని పులి. అయితే అది అనేక సవాళ్ళతోపాటు అనేక అవకాశాలనూ తీసుకొచ్చింది. ప్రపంచంలోని మారుమూల వున్న సంస్కృతి, భావాలను విశ్వవ్యాప్తం చేయగలిగింది. అన్ని దేశాల భాషా సంస్కృతులను మిళితం చేస్తోంది. ప్రపంచీకరణ, ప్రపంచంలో లభించే ఉద్యోగావకాశాలను అన్ని దేశాల వారికి అవకాశాలను కల్పించింది. భారతదేశానికి చెందిన చాలామంది నేడు వివిధ దేశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచీకరణకు సాధనంగా అంతర్జాలం (ఇంటర్నెట్), సోషల్ మీడియా, సమాచార సాంకేతిక రంగాలు పనిచేస్తున్నాయి.
గతంలో పెట్టుబడి, వస్తు వినిమయం పరిమితులకు లోబడి వుండేది. ప్రపంచీకరణ వాటి హద్దులను చెరిపేసి అన్ని దేశాలకు విస్తరించడానికి మార్గం ఏర్పరిచింది. దీనినే స్వేచ్చా వాణిజ్యం అన్నారు. దాంతో పెట్టుబడుల తరలింపు ఫైనాన్స్ పెట్టుబడి రూపంలో సంపన్న దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోకి వెల్లువలా ప్రవేశించింది. ఇది అన్ని దేశాల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక భావాలను మార్చివేసింది. గతంలో వున్న సోషలిస్టు భావాలను, సంస్కృతి పరంగా వున్న వైవిధ్యాన్ని కకావికలం చేసింది.
అన్ని దేశాల్లోకి సులభంగా స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని విస్తరించడానికి చట్టాలను సరళీకరించి సవరించేటట్లు చేయించడం, అందుకు అడ్డంకిగా వున్న ఆయాదేశాల భాషా సంస్కృతులను రకరకాలుగా ధ్వంసం చేయడం మొదలు చేపట్టాయి సంపన్న దేశాలు.ప్రజల్లో ఎన్నో ఏళ్ళ నుంచీ వేళ్ళూనుకున్న భావాలను మార్చడానికి, సాంస్కృతిక భావాల్లో మార్పు తేవడానికి కార్పొరేట్ సంస్కృతిని పెంచడానికి అనేకమార్గాలు అన్వేషించారు వారు.
మెల్లమెల్లగా ప్రపంచీకరణను అర్థం చేసుకున్న సాహిత్యకారులు దీన్ని పడమటి గాలిగా వర్ణించారు. ఈ పడమటి గాలి పర్యావరణాన్ని, భ్రష్టుపట్టించింది. గాలి, నీరు, నేల కాలుషాన్ని పెంచింది. సైబర్ నేరాలు పెంచింది. అభివృద్ధి చెందుతున్న సైన్సును ఉపయోగించుకుని దారుణ ఫలితాలను అది మోసుకొచ్చింది. వర్తకంలో, వ్యాపారాల్లో, మనిషి జీవన గమనంలో, ప్రతి అడుగులో పడమటిగాలి ప్రవేశించి అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అర్థం కాని అయోమయ జీవితాన్ని అది అందించింది. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, కోవిడ్ లాంటి వ్యాధుల్నీ ప్రపంచవ్యాప్తం చేసింది. ఎక్కడో ఎవరికో జలుబుచేస్తే అది అందరికీ అంటుకునే విధంగా ఈ గాలి వీస్తోంది. కోవిడ్ 19 అలాంటిదే. స్ట్రెయిన్ కరోనా అలాంటిదే. స్వైన్‌ఫ్లూ అలాంటిదే.
భిన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు, విభిన్నతతో, వైవిధ్యంతో ఉన్న ప్రజల భాషలు, భావాలు భారతీయ సంస్కృతిలో కలిసిపోయాయి. విడివిడిగా వున్నా అవి ఏకత్వాన్ని సంతరించుకున్నాయి. భారతీయ ప్రజాస్వామిక గుణం విశిష్టమైనది. పరమత సహనం కలిగి వుండటం ఇక్కడి ప్రజల విశిష్ట లక్షణం. పాటలు, సంగీతం, భిన్నమైన శిల్పం జానపదం భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా వున్నాయి. అదేసమయంలో ఈ సంస్కృతి సంప్రదాయాలు ఆధిపత్య వర్గాల చేతిలో బలంగా ఉండి ఇతర వర్గాలను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి తోడ్పడ్డాయన్న విషయం మనం మరువరాదు.
ప్రపంచీకరణ గాలుల ప్రభావం వీటన్నింటిపై పడింది. ఇంకో మాట చెప్పాలంటే పాశ్చాత్య సంస్కృతి భారతీయుల సంస్కృతిలో పెనుమార్పులు తెచ్చింది. పీఠాలను ధ్వంసం చేసింది.దీంతో భారతీయ సమాజం అనేక కుదుపులకు లోనయ్యింది.
పెట్టుబడీదారీ వ్యవస్థ కు ఊతమిచ్చే కుటుంబ వ్యవస్థ భారతీయ సమాజంలో కి ప్రవేశించింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయాయి. దానితో పేద, ధనిక కుటుంబాలన్న తారతమ్యం లేకుండా అంబానీ, టాటాల కుటుంబాల నుంచి గ్రామసీమల్లోని కుటుంబాల వరకూ ఈ విచ్ఛిన్నత పెరిగిపోయింది. పర్యవసానంగా గతంలో లేని అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగింది. పల్లెల్లో తల్లిదండ్రులు, పట్టణాలలో వారి పిల్లలు నివసించే పరిస్థితి ఏర్పడింది. చిన్న పిల్లలకు అవ్వ, తాతలు అప్పుడప్పుడు వచ్చే అతిథులయ్యారు. వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి. కొన్ని నగరాలలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటే పిల్లలు విదేశాల్లో జీవిస్తున్న పరిస్థితి వచ్చింది.మనిషి సమాజంలో ఒంటరైన పరిస్థితి ప్రపంచీకరణ కల్పించింది. కొన్ని కుటుంబాలలో తల్లి ఒకచోట, తండ్రి మరో చోట కొడుకు ఇంకోచోట, కూతురు వాళ్ళకు దూరంగా ఇంకోచోట ఉన్న పరిస్థితి కూడా ఏర్పడింది. పిల్లలు తల్లితండ్రులను భారంగా పరిగణించే పరిస్థితి వచ్చింది. కుటుంబ సంబంధాలలో సహజంగా ఉండాల్సిన ప్రేమ సంబంధాలు పోయి డబ్బు సంబంధాలు ఏర్పడ్డాయి. ఆస్తులకోసం తల్లితండ్రులను హింసించే కూతుళ్లు,కుమారులు తయారయ్యారు. అన్నదమ్ముల తగాదాలు చంపుకునేంత విపరీతంగా పెరిగాయి.
భారతీయ వివాహ వ్యవస్థ పెనుమార్పులకు లోనయ్యింది. వివాహ బంధం నూరేళ్ళ బంధంగా పరిగణించే పరిస్థితి పోయింది. ఈ రోజు పెళ్ళి, రేపు విడాకులు అనే పరిస్థితి పెరిగింది. వివాహ బంధంలో స్త్రీ, పురుషుల మధ్య సహజంగా వుండాల్సిన, ఇచ్చి పుచ్చుకోవడాలు మాయమయ్యాయి. వ్యక్తి ప్రాధాన్యత, కోపతాపాల స్థానంలో వారి వ్యక్తిగత ప్రయోజనాలు, పెరిగాయి.స్వంత ఆసక్తులు వదులుకోకుండా కేవలం వృత్తిపర సంబంధాలుగా పరిణమించాయి. ఒక రకంగా బంధం పేరుతో స్త్రీల అణచివేత కు కొంతమేరకు ఎదురు దెబ్బ తగిలింది.
కుటుంబం ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. న్యూక్లియర్ కుటుంబం స్థానంలో వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు ఎక్కువైపోయారు. సోలో బతుకే సో బెటరూ అనే నానుడి కూడా ఏర్పడింది.
భారతదేశ సంస్కృతికి ఏమాత్రం సరిపడని కొత్తరకం వైవాహిక సంబంధాలు పెరిగాయి. ఇది పతనమవుతున్న సామాజిక విలువల ను ప్రతిబింబిస్తోందిి. వయసు తారతమ్యాలు లేకుండా, వావివరుసలు లేకుండా లైంగిక సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఎలాంటి వివాహ బంధం లేకుండా కలిసుండే పద్ధతి వచ్చింది. వివిధ మీడియాల ద్వారా మనుషుల మెదళ్ళలో పర్వర్షెన్ ఏర్పడి బలాత్కారాలు, చిన్నా తేడా లేకుండా లైంగిక దాడులు పెరిగాయి.
అతిథి దేవోభవ అనేవారు పూర్వులు. అతిథులు వస్తే వాళ్ళు పోకుండా చెప్పులు కూడా దాచేవారు. ఇప్పుడు అతిథులు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఇతరులతో సంబంధాలు వారి హోదాను బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి ఉంటుంది. పెద్దలంటే గౌరవం పోయింది. నేటి యువతరంలో ప్రేమికుల రోజు జరపడంలో ఉన్న ఉత్సాహం, హోలీ, ,ఉగాదులు జరపడంలో లేదు.
భారతదేశంలో భిన్న సంస్కృతులున్నాయి. వారి భాషలు, వేషధారణ వేరు వేరుగా ఉంటాయి. గిరిజనుల వేషభాషలు వేరు. గడచిన 30 ఏళ్ళలో వారి వేషభాషల్లో చాలా మార్పులొచ్చాయి. బంజారాల ప్రత్యేక వేషధారణ మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. స్వంతమంటూ ఏమీలేని ఒకానొక పరిస్థితి ఏర్పడింది. చిరుధాన్యాల స్థానంలో వరి అన్నం వచ్చి చేరింది. ఏ రాష్ట్రం వెళ్ళినా ఒకే ఆహారం దొరుకుతుంది. ఆయా ప్రదేశాల విభిన్న ఆహారపు అలవాట్లు మాయమయ్యాయి.
వస్త్రధారణల్లో అనేక మార్పులు వచ్చాయి. మహిళలు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. సహజంగా వేసుకునే లంగా ఓణీల స్థానంలో పంజాబీ డ్రెస్సు వచ్చింది. పైట దాదాపు కనుమరుగవుతోంది. పురుషులు షార్ట్స్ ధరిస్తున్నారు. ధనికులు కోట్లు ధరిస్తున్నారు. ఆఖరకు దేశ ప్రధాని కూడా అదే ధరించే పరిస్థితి నెలకొంది. గిరిజనులు, యానాదులు, ఎరుకలు తమ స్వంత అస్తిత్వ వేషభాషలను వదిలి నేటి నాగరిక ప్రపంచంలోని దుస్తులనే ధరిస్తున్నారు. పంచెలు, చీరల తయారీలో పెనుమార్పులు వచ్చాయి. ఇది ఒక రకంగా ఏక సంస్కృతి నుంచి పెంచి పోషిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు ఆధిపత్యంలో వుంది. ఆంగ్లభాష రాకపోతే మనిషి మనుగడ లేదన్న భావనను పెంపొందించారు. దీనికోసం పాఠశాలల అభివృద్ధికోసం, అందరినీ అక్షరాస్యులను చేయడంకోసం అనేక నిధులు ఇచ్చారు. ఈ భూమిక సంపన్న దేశాల మార్కెట్ విస్తరణకు ఉపయోగపడింది. దాంతో ఇంగ్లీషు, స్పానిష్, జర్మన్ భాషల వంటి విదేశీ భాషల ప్రాముఖ్యత పెరిగింది. ఇంగ్లీషు భాష ప్రధానమై ఆఖరుకు తెలుగు మాధ్యమాన్ని కూడా పాఠశాల స్థాయిలోనే వద్దనే పరిస్థితి వచ్చింది. సాహిత్యకారుల్లో కొద్ది మంది మాత్రమే తెలుగు భాష కావాలని కోరుతున్న దుస్థితి నెలకొంది. ఇంగ్లీషు నేర్చుకుంటేనే విదేశాలకు వెళ్ళేదానికి వీలవుతుందని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు లభిస్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఇప్పుడు దేశంలో కనుమరు గవుతున్న మాతృభాషల్లోకి మెల్లగా తెలుగు కూడా చేరే పరిస్థితి దాపురించే పరిస్థితి నెలకొంది.
ఆంగ్ల భాష ప్రాధాన్యతతో కొర్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు రెయిన్ రెయిన్ గో అవే అనే పాట పాడుకుంటున్నారు. వానల్లు కురవాలి వరిచేలు పండాలి మాయిల్లు కళకళలాడాలి' పాటలు కరువవుతున్నాయి.
గతంలో సామ్రాజ్యవాదమంటే ఒక దేశం మరో దేశాన్ని బలవంతంగా ఆక్రమించడంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక సామ్రాజ్యవాద రూపం మారింది. అది ఆయాదేశాల ఒప్పుదల మేరకు ఆ దేశంపై ఆధిపత్యం వహించడంగా మారింది. తుపాకీ మనిషిని భయపెట్టి శరీరాన్ని వశం చేసుకుంటుంది. భాషతో వశపరుచుకుంటే మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోయి మనసునే అప్పగిస్తాడు. అదే ఇప్పుడు జరుగుతోంది.
మన దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం ఒక జీవన విధానం. పల్లె సీమలు వ్యవసాయానికి జీవగర్రలు. ప్రపంచీకరణలో వ్యవసాయానికి సాయం దూరమైంది. యువత రైతుగా ఉండడటం నామోషీగా మారింది. వ్యవసాయం దండగ మారిగా మారిపోయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. జైకిసాన్, జైజవాన్ అన్నవి కేవలం నినాదాలుగా మారాయి.
ఉద్యోగాల కల్పనంతా పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు చేస్తున్నాయి. వాటిల్లో ఉద్యోగులుగా చేరన యువత ఇతర దేశాల ప్రగతికి తోడ్పడుతోంది. మెల్లగా మనదేశం ఆర్థిక పరాధీనతలోకి వెళ్లిపోతోంది.
మార్కెట్ విస్తరణకు ఆటంకంగా వున్న సంస్కృతి, సంప్రదాయాలపై దాడి మొదలైంది. దీనికోసం సినిమాలను, ఇంటర్నెట్‌ను, టి.వి.ని, సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించు కున్నాయి. ఇవి ప్రజల మెదళ్ళ, ఆలోచనలను మసకబార్చి పాశ్చాత్య సంస్కృతిని విస్తరింపజేసుకున్నాయి. దాని పర్యవసానమే నేడు సమాజంలో జరుగుతున్న అనేక మానవ సంబంధాల విచ్ఛిన్నత. సంస్కృతే సామ్రాజ్యవాదంగా మారిపోయిన పరిస్థితి నేడుంది. ఈ రకంగా ప్రజలను మానసికంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. పర్యవసానంగా సాహిత్యం అప్రధాన అంశంగా మారింది. చాలామంది కవులు, రచయితలు ముందుకు వస్తున్నా సాహిత్యం చదివే వారు తక్కువైపోతున్నారు. పుస్తకాల అమ్మకాలు తగ్గిపోవడమే దీనికి సాక్ష్యం. పుస్తకాలు గ్రంథాలయాల్లోకి పోవడం అంటే స్మశానానికి పోవడమన్న అభిప్రాయం రచయితల్లో నెలకొంది. దానికితోడు ప్రభుత్వాలు సాహిత్యానికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. ఇప్పుడు సాహిత్య సంఘాలే సాహిత్యాన్ని ఒక ఉద్యమం గా ముందుకు తీసుకెళుతున్నాయి.
ఇరవైయ్యోవ దశకం వరకు వ్యక్తిత్వ వికాస గ్రంథాలు విరివిగా వచ్చాయి. అవికూడా మెల్లగా తగ్గుముఖం పట్టాయి. సాహిత్యంతో పాటు పల్లెపదాలు, జానపదగేయాలు, హరికథ, తోలుబొమ్మలాట, బుర్రకథ, ఒగ్గుకథ, పగటివేషగాళ్లు, నాటకాలు, జానపద బృంద గీతాలు, లంబాడీ నృత్యాలు మెల్లగా కనుమరుగయ్యే దశలో వున్నాయి. వాటి అస్తిత్వం ప్రశ్నార్థకంగా ఉంది. కరోనా కాలంలో సినిమాలు కూడా మందగించాయి. యూట్యూబ్ ఛానెల్లో ఓటిటి లో సినిమాలు వస్తున్న పరిస్థితి ఉంది. టి.వి.లు, సోషల్ మీడియా విస్తరణతో కళారూపాలకు ఆదరణ తగ్గింది. వాటిని నేర్చుకునే వారే కరువయ్యారు. నేడు డిస్కోతెక్‌లు, పబ్‌లు, జాజ్, రాక్ వంటి సరికొత్త పాశ్చాత్య సంగీతం, కళాశాలల్లో విద్యార్థుల విచిత్ర నృత్య ప్రదర్శనలు ఇవన్నీ దేశవాళీ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నాయి.
అందాల పోటీలు నిర్వహించి అందం పట్ల భ్రమలు పెంచి అందానికి ఉపయోగించే ఉత్పత్తుల మార్కెట్‌ను విస్తరింపజేసుకొన్నారు. అందానికి ప్రాముఖ్యత నిచ్చేలా చేసింది ప్రచారం. సినిమాలలో, టి.వి.ధారావాహికల్లో కాస్ట్యూమ్స్, విపరీత అలంకరణ చూపెట్టి ప్రజల మనసుల్లో అందంగా వుండాలంటే ఆ విధంగా ఉండాలేమోనన్న భ్రమలు కల్పించారు.
జనవరి ఫస్ట్, వాలంటైన్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే, మదర్స్‌డే లాంటి కొత్త పండుగలు ప్రచారం చేసి ఆయా దినాలకు సంబందించిన ఉత్పత్తులను తమ వ్యాపార విస్తరణకు ఉపయోగించు కున్నాయి. ఉగాది, హోలీ లాంటి పండుగల ప్రాముఖ్యత తగ్గిపోయింది. మల్లవిద్య, చెడుగుడు, కబాడ్డీ, కర్రసాము, చదరంగం, పులిమేక లాంటి గ్రామీణ క్రీడలన్నీ కనుమరుగ వుతున్నాయి.
నేడు ఖర్చుపెట్టు, నెమ్మదిగా దానిని కట్టు అని ప్రచారం చేశారు. ఎప్పుడో సుఖపడడం కాదు. ఇప్పుడే సుఖపడండి అన్నారు. ఇది వినియోగవస్తువుల మాయాజాలంలోకి లాగింది మనిషిని. మనిషి ఒక వస్తువుగా మారాడు.
తెల్లతోలు, విలాసంగా ఖర్చుపెట్టడమే జీవితంగా భ్రమించే ధోరణి ప్రబలింది. ధనమేరా అన్నిటికీ మూలం, ధనం మూలం మిదం జగత్ అన్న నానుడులు ముందునుంచి ఉన్నా, ధనమే లోకమన్న భావన నేడు ఊపందుకుంది. స్త్రీ పురుష సంబంధాలలో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో, ప్రేమలకు ధనం ప్రధాన కారణంగా నిలుస్తోంది.
టి.వి., ఫ్రిజ్, ఎ.సి., కార్లు, బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ హోదా చిహ్నాలు. ఇవి లేకుండా నీకు సమాజంలో గుర్తింపు , గౌరవం లేదు. మనిషిగా నీ శక్తి, కొనుగోలు శక్తి మాత్రమే. మనిషిగా నీ సంస్కృతి వస్తు సంస్కృతి మాత్రమే. అప్పుడే నీ విలువ, ప్రతిష్ట పెరుగుతాయి. వీటిని పలు ప్రచార మాద్యమాల ద్వారా ప్రచారం చేసింది. వీటన్నింటిని ప్రజల మెదళ్ళలోకి ఎక్కీఎక్కక ముందే ఐకియా, రిలయన్స్ మార్ట్, వాల్‌మార్ట్ లాంటి విదేశీ, స్వదేశీ మార్ట్‌లు ప్రవేశించి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇవన్నీ చిల్లర వ్యాపారస్థులను దెబ్బతీస్తున్నాయి.
మనిషికంటే నిర్జీవమైన డబ్బే ప్రధానమైన ఆర్థిక ప్రయోజనవాదం వల్ల సమాజంలో అమానవీకరణ (డీ హ్యూమనైజేషన్) జరుగుతోందని గుర్తించారు సామాజిక వేత్తలు. దీంతో ప్రేమ, శ్రమ మొదలైన ప్రాథమిక జీవన ప్రాతిపదికలుగా ఉన్న విలువలు కోల్పోతాయి. మనుషుల మధ్య మానవీయ సంబంధాలు వస్తు సంబంధాలుగా మారిపోతాయి. ఈ అమానవీకరణే నేడు సమాజంలో పరాయీకరణకు నేపథ్యం. సమూహంలో ఒంటరితనం, తన్ను తాను వంచించుకోవడం, అసంబద్ధత మొదలైనవి పరాయితనానికి అనేక ముఖాలు.
సోషలిజంపై వ్యతిరేక భావజాలాన్ని రచయితలు పోస్టుమోడ్రనిజం (ఆధునికానంతరవాదం) ముందుకు తీసుకొచ్చారు. ఇది అనేక అస్తిత్వవాద ఉద్యమాలకు ఊపిరిపోసింది. దీనిలక్ష్యం ప్రపంచీకరణ వ్యతిరేకులను విచ్ఛిన్నం చెయ్యడమే. ఇది ప్రపంచీకరణ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది. ఈ అస్తిత్వ ఉద్యమాలు ఈ విషయంలో విజయం సాధించాయి. దానికితోడు మతవాదులు, మనువాదులు చెపుతున్న ఒకేదేశం - ఒకే సంస్కృతి నినాదానికి ప్రపంచీకరణ రుద్దిన సాంస్కృతిక ఉగ్రవాదం తోడయ్యింది.
మనువాదులు అధికారంలోకి రావడానికి మత విద్వేషాలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ప్రపంచీకరణ విధానాలను అంతకంటె ఎక్కువగా ముందుకు తీసుకెళుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా సిద్ధమయ్యారు. రాజ్యాంగం చెప్పే మౌలిక ప్రజాస్వామిక విలువలను ధ్వంసం చేస్తూ, మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ, రైతుల పోరాటాలను, విభజన రాజాకీయాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని అణచివేస్తూ, కార్మికుల వెతలను నిర్లక్ష్యం చేయడమే గాక, వారి కోసం చట్టాలను రద్దుచేస్తూ అమెరికా పాలకుల పాదాల దగ్గర నిలుచుని వారి కరుణా కటాక్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
అభివృద్ధి పేరుతో సమాజంలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఖనిజ ఉత్పత్తులకోసం అడవులను ఆక్రమిస్తున్నారు. పరిశ్రమల పేరుతో యురేనియం వంటి కాలుష్య కారక, వ్యాధి కారక పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. ఇదంతా అభివృద్ధి పేరుతోనే జరుగుతోంది. ఇది ప్రజల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతోంది.
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గత 20 ఏళ్ళలో అనేక ఉద్యమాలు వచ్చాయి. 2000లో మాంట్రియల్‌లో, 2001లో జెనీవాలో ఉద్యమాలు వచ్చాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ ఉద్యమం వచ్చింది. మరో ప్రపంచం సాధ్యమేనని ప్రపంచ సోషల్ ఫోరమ్, గ్రీన్‌పీస్ లాంటి సంస్థలు ఉద్యమాలు నడిపాయి. మనదేశంలో వందనాశివ, అరుంధతీ రాయ్ లాంటి రచయితలు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటీకరించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్లా తెరుస్తూ దూకుడుగా ముందుకెళుతున్న నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఇటీవల రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటం మనం గమనించవచ్చు. ప్రపంచీకరణకు నేడు ప్రతిదేశంలో ఏదో రకమైన ప్రతిఘటన ఎదురవుతూనే వుంది.
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు