మా రచయితలు

రచయిత పేరు:    వినాయకం ప్రకాష్

కథలు

చాందిని 

హలో ..!

వరలక్ష్మి గారేనా మాట్లాడేది..??

హా..!!  అవును, మీరు..? అంటూ..సందేహం నిండిన గొంతుతో అడిగింది వరలక్ష్మీ,

" మేడం మేము సంపత్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము, సుకుమార్ మీ అబ్బాయే కదా ..! ఆక్సిడెంట్ కేస్ ..! అతను ఇప్పుడు ఐ.సి.యూ లో ఉన్నారు, మీరు  వెంటనే రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది హాస్పిటల్ రిసెప్షనిస్ట్.

 

 షాకింగ్ న్యూస్ వినడంతో, వరలక్ష్మీ కి కాళ్ళూ చేతులూ ఆడటం లేదువెంటనే భర్త కి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ కి రమ్మని, తాను ఆటోలో బయలుదేరి వెళ్ళింది.

 

ఎమర్జెన్సీ వార్డు వద్దకు వెళ్లి విచారిస్తే వాళ్ళ అబ్బాయి రెండవ అంతస్థు ఇరవై ఏడో నెంబర్ గదిలో ఉన్నారని తెలిపినారో.. లేదో..!, పరిగెడుతూ క్షణాల్లో కొడుకు ఉండే గదిని చేరుకుంది, ఎదురుగా చూస్తే  సుకుమార్ కి రక్త దానం జరుగుతోంది, రక్తం ఇస్తున్నది తనకు తరచూ కనబడే చాందిని, ఆమెను చూసిన వెంటనే  ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది వరలక్ష్మి, అక్కడున్న నర్సును తిడుతూ రక్తం ఇస్తున్న ఆమె దగ్గరకు వెళ్లి.."చీ చీ నువ్వెంత..? నీ బ్రతుకు ఎంత.? నీలాంటి వారి రక్తం మా అబ్బాయిలో ప్రవహిస్తే వాడు కూడా నీలా నీచంగా ఐపోతాడుఅని కేకలు వేస్తూ, మా అబ్బాయికి  వచ్చే నెల పెళ్లి ఇలాంటి వారి రక్తం మా వాడిలో ప్రవహిస్తే వాడి భవిష్యత్ ఏమిగానూ..? అని చిరాకు పడుతూ... సుకుమార్ చేతికి పెట్టిన రక్త దానం జరిగే పైపును తొలగించేసింది, ఈమె రక్తం మా వాడికి వద్దు అంటూ బిగ్గరగా అరిచింది వరలక్ష్మి.

 

                                                                       *      *      * 

తిరుపతి టౌన్ క్లబ్ ఎదురుగా ఉన్న మలబార్ జ్యూవెలరీ వద్ద ఒక షేర్ ఆటో ఆగింది, అందులోంచి ఒక దేవకన్య లాంటి చాందిని దిగి షాప్ లోకి వెళ్తోంది , ఆమెతో పాటు వచ్చిన స్నేహితురాళ్లు వేస్తున్న జోకులకి వాళ్లంతా నవ్వుల పువ్వులను ఆ ప్రాంతమంతా జల్లుతున్నారు, ఒక్కసారిగా పెద్ద కేక వినబడటంతో వెనక్కి తిరిగి  చూస్తే  ,మహతి సెంటర్  వద్ద ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహం వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న కార్ ఢీకొట్టి ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది,అందరూ సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారే తప్ప ఎవరూ అతనికి  సాయం చేసి  ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు , రక్తం ఎక్కువగా పోతోంది, వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని లేపి ఆటోలో ఎక్కించుకుని సంపత్ హాస్పిటల్లో  జాయిన్ చేసారు చాందిని మరియు వారి స్నేహితురాళ్లు, వాళ్ళను అభినందించిన డాక్టర్  "మీరు కొద్దిగా లేట్ చేసినా ఈ అబ్బాయి ప్రాణాలు దక్కేవి కాదు ..కానీ ...! కానీ...! "అని నీళ్లు నమిలాడు డాక్టర్, వెంటనే చాందిని స్పందిస్తూ. " ఏమి డాక్టర్ ..? మీరు ఎదో చెప్పాలని అనుకుంటున్నా చెప్పడం లేదు , అతనికి ప్రాణభయం లేదు కదా..?? " అని అడిగింది .

"రక్తం ఎక్కువ పోయింది, కనుక పెద్ద ప్రమాదం తప్పినా కండీషన్ కొద్దిగా సీరియస్ గా ఉంది, అతని బ్లడ్ గ్రూప్  o-ve,  అది ప్రస్తుతం మన హాస్పిటల్ లో లేదు, తిరుపతి మొత్తం సమాచారం ఇచ్చాము కానీ దొరకలేదు, గంటలో మనం రక్తం ఎక్కించకుంటే అతను మరణిస్తాడు, వాళ్ళ ఇంటికి కాల్ చేసి రమ్మని చెప్పినాము,వాళ్ళు వచ్చాక రక్తం అవసరం అని వారికీ ఒక మాట చెప్తే వారి ప్రయత్నం వాళ్ళూ చేస్తారు "  అన్నాడు డాక్టర్.

 

సర్ నా రక్తం కూడా O -ve  వీలైతే నా రక్తం తీసుకోండి సర్ అని మెరిసిన కళ్ళతో వెంటనే చెప్పింది చాందిని, అవునా అయితే ఇంకెందుకు ఆలస్యం అంటూ చకచకా ఏర్పాట్లు చేసుకున్నారు..రక్త దానం జరుగుతోంది.

                                                                           *   *   *

 

కేకలు విన్న డాక్టర్ ఏమైందో అని సుకుమార్ బెడ్ వద్దకు చేరుకున్నాడు,అక్కడ ఉన్న నర్స్ ని ఉద్దేశించి " ఎం జరుగుతోంది ఇక్కడ..??ఏంటి ఈ న్యూసెన్స్..??చాందిని ఎక్కడికి పోయింది..??" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు డాక్టర్సర్...ఈమె .. పేషంట్ వాళ్ళ  అమ్మ ,చాందిని దగ్గర బ్లడ్ తీసుకోవద్దు అని,బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతున్న పైప్ ను  లాగేసింది సర్ ..అందుకు  చాందిని వాళ్ళ  ఫ్రెండ్స్ అవమానముగా భావించి , చాందిని ని బలవంతంగా తీసుకెళ్లిపోయారు  సర్ " అని వినయంగా సమాధానం చెప్పింది డ్యూటీ నర్స్.

 

ఎమ్మా..?? అసలు మీ అబ్బాయి  కండిషన్ అసలు మీకు తెలుసా ..? రక్తం ఎక్కించకుంటే మీ అబ్బాయి మీకు దక్కడు, కండిషన్ చాలా సీరియస్ గా ఉందిమీ ప్రాబ్లమ్ ఏంటి..?? అని కోపంగా అడిగాడు డాక్టర్, సర్ మా అబ్బాయికి ర్

వచ్చేనెల పెళ్లి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళ రక్తం ఎక్కిస్తే రేపు అతని భవిష్యత్ ఏమి గానూ..?? అంటూ కంగారుగా అడిగింది సుకుమార్ తల్లి వరలక్ష్మి,

 

మీకు చెప్పేది అర్థం అవుతోందా అసలు , మీ కొడుకే మీకు దక్కడు ఈ రోజు రక్తం ఎక్కించకుంటే, అది వదిలేసి మీరు, పెళ్లి ,భవిష్యత్..అంటారేంటి..??  ఇలా అయితే కష్టం మేము మీ  మీ అబ్బాయి ప్రాణాలు కాపాడలేము,మీరు హాస్పిటల్ నుంచి అతన్ని  తీసుకొని వెళ్ళండి, వేరే చోట చూపించుకోండి " అన్నాడు కోపంగా.

 

"సర్ ...అంత మాట అనొద్దు మాకు వాడు ఒక్కగానొక్క బిడ్డ, ఆ చాందిని" హిజ్రా" కదా , ఆమె రక్తం ఎక్కిస్తే  మా అబ్బాయి కి ఏమైనా అవుతుంది అని అలా అన్నాను, అంటే తప్ప మరో ఉద్దేశ్యం లేదు, అని డాక్టర్ కాళ్లపై పడి కొడుకును కాపాడమని వేడుకుంది వరలక్ష్మి.

 

"అయ్యో..మీ సందేహం ఒట్టి భ్రమ, మీరు పిచ్చిపిచ్చిగా ఆలోచించి చాందిని వాళ్ళని పంపేశారు ,మన  అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది, రక్తానికి భేదాలు, రంగులు ఉండవు, ఆమె హిజ్రా గా మారడానికి వారిలోని హార్మోన్ల అసమానతలు, పెరిగిన వాతావరణం, మరియు కొన్ని శారీరక క్రోమోసోముల లోపాలు..వాటికీ రక్తం కి సంబంధం లేదు..! ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, అందులోనూ చాందిని అందరిలాంటి హిజ్రా కాదు, ఆమె కష్టపడి చదివి మందుల వ్యాపారం నిర్వహిస్తోంది, బి.ఫార్మసీ వరకు చదువుకుంది, నాకు చాలా బాగా తెలుసు, చాలా మందిని కాపాడి ప్రాణదానం చేసింది, అలాంటి మంచి మనిషిని మీరు  పంపేశారు , ఇంకో విషయం ఆమె రక్తం ఎక్కించడం వల్ల మీ అబ్బాయికి ఏమి కాదు , ఆమె రక్తం మీ అబ్బాయిలో ఉండేది కొద్దిరోజులే రక్తం వయస్సు 1 రోజు నుంచి 120 రోజుల వరకు ఉంటుంది,మీ అబ్బాయికి హానికరమైన పని డాక్టర్ గా మేము చేయము కదా..! ఆ విషయం అన్నా మీరు ఆలోచించి ఉండాల్సింది మీ అబ్బాయికి తిరుపతిలో ఎక్కడా రక్తం దొరకలేదు అందుకే  మేము చాందిని రక్తం ఎక్కించే ప్రయత్నాలు చేసాము, మీరు మా ప్రయత్నాలు వృధా చేశారు, మీకు ఇప్పుడు ఒకే అవకాశం మాత్రమే ఉంది మీ కొడుకును బ్రతికించుకోవడానికి , అది చాందిని రక్తం మీ అబ్బాయికి ఎక్కించడం ఒక్కటే..!, వాళ్ళు

బాలాజీ కాలనీలో ఉంటారు వెళ్లి తీసుకొని రండి , లేకుంటే మీ అబ్బాయిని ఎవరూ కాపాడలేరు"అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు.

 

అవగాహన లేకుండా ఒక మంచి మనిషిని అవమానించింది అని తనలో తానే కుమిలిపోయింది వరలక్ష్మి, వెంటనే తన తప్పు తాను తెలుసుకొని బాలాజీ కాలనీకి బయలుదేరింది, చాందిని మందుల షాప్ లో బిజీ గా ఉంది,

వరలక్ష్మీ ని చూసిన చాందిని గమనించి కూడా  ఏమి అనలేదు, వెంటనే చాందిని కాళ్ళు పట్టుకొని "అమ్మా..!! చాందిని నీ గురించి తెలీక నిన్ను అపార్ధం చేసుకున్నాను , పిచ్చిపిచ్చిగా ఆలోచించి నిన్ను అవమానించాను ..నన్ను క్షమించి నా కొడుక్కి ప్రాణదానం చేయమ్మా..!! అని కన్నీటిపర్యంతం అయ్యింది.

 

అయ్యో మీరు ముందు నా కాళ్ళు వదలండి..! మీరు పెద్దవారు, నా కాళ్ళు మీరు పట్టుకోవడం ఏంటి..?? ముందు లేవండి అని వరలక్ష్మి ని లేపి పక్కన  కుర్చీలో కూర్చొబెట్టింది.

 

"చూడండి వరలక్ష్మి గారు..మీరు చేసిన అవమానానికి నేనేమి బాధపడలేదు, హిజ్రా గా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాము, మాకు నచ్చిన జీవితం మేము గడపాలని కోరుకోవడం మా ఫరిధిలోని అంశం, మాలో వచ్చిన శారీరక, జన్యు మార్పుల వల్ల ఇలా మేము ఉన్నాము, మా రూపాన్ని ఎగతాళి చేస్తారు,మేము కూడా మనుషులమే కదా.!! కొంతమంది నకిలీ హిజ్రాలు రోడ్ల పై వేధిస్తూ డబ్బులు వసూలు చేస్తారు, కొంతమంది మాత్రం పద్దతిగా జీవిస్తున్నారు, చెట్టును చూసి కాయల రుచిని మనం చూడలేము అలాగే అందరూ మీరు ఊహించినట్టుగా ఉండరు.స్త్రీ గా ఉండటం మాకు ఇష్టం అందుకే ఇలా ఉంటున్నాం ఎన్నో వివక్షలను ఎదుర్కొంటున్నాము. మనుషుల్లో మార్పు వస్తేనే, మాకు గుర్తింపు వచ్చి మా లాంటి థర్డ్ జెండర్లు కూడా గౌరవంగా బ్రతకగలరు.

అందరూ అర్థంచేసుకొని మమ్మల్ని కూడా సమాజంలో ఒక్కరుగా గుర్తింపునిస్తే చాలు"అనింది చాందిని.

క్షమించండి నేను మా గురించి చెబుతూ మీ  గురించి మర్చిపోయా..! ఇంతకీ  మీ అబ్బాయికి ఎలా ఉంది  ఇప్పుడు..?? ఎవరైనా రక్తదాత దొరికారా..?? అని అడిగింది చాందిని, లేదమ్మా..!నన్ను క్షమించి నా బిడ్డను కాపాడేందుకు నిన్ను పిలుచుకొని వెళదాం అని నీ కోసమే వచ్చాను"  అని వరలక్ష్మి అనడంతో ..అయ్యో..! అలాగా వెంటనే  పదండి అంటూ.తన స్కూటీ స్టార్ట్ చేసి ఎక్కండి హాస్పిటల్ కి పోదాం..! అని అనడంతో..చాందినిలో మనసున్న 'దేవత'ని చూసింది వరలక్ష్మి.

 

 

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు