మా రచయితలు

రచయిత పేరు:    డా.సి ఉదయశ్రీ

కవితలు

ఎదురుచూపుల తీరం

అల్లంత దూరంలో కనిపిస్తోంది తీరం

తీరం దరిచేరే వారే లేరు

 కారణం

కారణాలు వెతుక్కుంటే దారి కనిపించదు

కనిపించని గమ్యం కోసం వెతుకులాటలో

జీవితాంతం నడిచినా

 తీరం దరి చేరటం లేదు

నడిచే జీవనగమనంలో

తీరం ఒకటుందని మరిచిపోయాం

తీరానికి చేరాలంటే తీరం దగ్గరే మొదలవ్వాలి

పాపాలతో చేతులు రక్తంలో మునిగి తేలుతున్నాయి

మోసాలకై ఆలోచనలు వేలం వెర్రి లా పరిగెడుతున్నాయి

తీరం గురించి ఆలోచించేది ఎవరు

నువ్వా నేనా ఎవరు

తీరం గురించి ఆలోచించేది ఎవరు

లేరు ఎవరూ లేరు

రారు ఎవరూ రారు

ఆలోచించినా తీరం దరి చేరుటకు రారు

వచ్చే సాహసం చేయరు

చేయరు గాక చేయరు

మెరుగులద్దిన జీవితపు రుచికి మరిగి

తీరం వైపు చూడరు

జీవించి ఉన్నప్పుడే జీవనానికి అర్థం తెలియదు

జీవనంలోని నీతి న్యాయం తెలియదు

ప్రకృతిలా నిశ్శబ్దం తెలియదు

పశువుల్లా విశ్వాసం తెలియదు

అయినా ఉత్తమమైన జన్మ

అర్థం తెలియని అర్థం లేని జన్మ

మానవ జన్మ

అర్థం తెలుసుకుందామని ఆలోచన లేని జన్మ

ఎదురుచూపుల తీరం కై ఎదురుచూడని జన్మ

 

లోకంపోకడ

కూర్చుని తింటూ కాలం గడిపితె సాధన ఏమిటి ఇంక

ఎన్నో విధాల చదువులు చదివీ లాభమదేమిటి ఇంక

 

రాక్షస మూకలు కత్తుల మొనలో రాజ్యం నడిపిరి ఇచట

ప్రాణం పోసిన వీరుల చావుకు అర్ధమదేమిటి ఇంక

 

ధనమే పాముగ మెదడునుచుట్టీ ఆడిస్తోందీ లోకం

ధర్నాలంటూ  జెండాపట్టీ చేసేదేమిటి ఇంక

 

చిన్నాపెద్దా మత్తుకు తెలియవు ఆడబొమ్మైనా చాలు

విలువల వలువలు  ఒలిచేస్తుంటే చెప్పేదేమిటి ఇంక

 

ఆర్ధిక ప్రగతికి మందుషాపులే మూలంఅంటూ అరచి

మద్యపానమే హానికరమని బోధనలేమిటి ఇంక

 

అన్యాయాలకు దారులు ఎక్కువ లోకం పోకడ ఉదయ

కళ్ళుమూసుకుని కాలంగడపక మార్గమదేమిటి ఇంక

 

ఉదయం

పచ్చని పైరులపై

నులివెచ్చని కాంతులతో

బంగారాన్ని అద్దుతూ

ఉదయిస్తున్నాడు

పల్లెల్లో సూర్యుడు

 

పండు వెన్నెల బద్ధకపు

పొరలకు  వీడ్కోలు చెప్తూ

ఒళ్ళు విరుస్తున్నాడు

భానుడు

 

దుప్పటి సందుల్లోంచి తొంగి చూస్తూ

వెచ్చని స్పర్శను

శరీరానికి అందిస్తూ

పల్లెను తట్టి లేపుతున్నాడు

అరుణుడు

 

కుంచెకు రంగులు అద్దుతూ

సూర్యోదయ పల్లె అందాలను కాగితంపై భద్ర పరుస్తున్నాడు

 ప్రకృతి చిత్రకారుడు

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు