ఆడపిల్ల పుట్టగానే ఋణావేశితంగా చూడడం ఈరోజుల్లో ఎక్కువగా తారసపడుతున్న సందర్భాలున్నాయి. మగపిల్లవాడు పుట్టంగనే వారసుడొచ్చాడని సంబరాలు చేసేవాళ్లే ఎక్కువ. అయినా...ఆడపిల్ల అయితేనేమీ...మగపిల్లవాడయితేనేమీ... మొత్తానికి కన్నబిడ్డలే కదా... చిన్నచూపు ఎందుకు..? అని తమనితాము ప్రశ్నించుకుంటే బాగుంటుంది.
డాక్టర్ భారతిగారు రచించిన హస్బెండ్ స్టిచ్-1లోని కథలన్నీ కౌన్సిలర్ గా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళ యొక్క మనోవ్యధని తెల్సుకొని వాళ్ల జీవితగాధలని కథారూపంలో తీసుకురావడానికి చాలా ధైర్యం చేశారు. రచయిత్రి పొందుపర్చిన కథలలో ఎవర్ని కదిలించినా...దు:ఖం పొంగి పొర్లుతుంది. జరిగిన సంఘటనలను విశదీకరించడానికి రచయిత్రిగారు అక్కడక్కడ వాడిన శ్రుతిమించిన అసభ్య పదజాలం కాకుండా కలాన్ని కదిపితే ఇలాంటి కథలు "మచ్చలేని చంద్రుని"గా పాఠకుల మనసులో బలంగా నిలిచి,సాహిత్యం పట్ల మరింత గౌరవం పెరిగేదేమో అనిపించింది.
ఆధునిక ప్రపంచంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు,దారుణాలు పత్రికలలో తరుచుగా చూస్తున్నాం. కానీ... ఈ కథలలో మాత్రం కట్టుకున్న భార్యను రేప్ చేయడం జరిగింది. ఇలాంటి దుర్ఘటన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడమేగాక ఇంటిల్లిపాది కలిసి ఆ అమ్మాయిని మంచంపై తాళ్ళతో కట్టి తన భర్తతో రేప్ చేయించడం దుర్మార్గం. విషయం తెల్సికూడా తన తండ్రి బిడ్డని తిడుతుంటే భరిస్తున్న... ఆ నొప్పి కంటే కన్న తండ్రి మాటలే తనని సచ్చిన శవంలా మార్చాయి.
పేదరికంలో పుట్టడమే అనసూయ పాలిట శాపమైంది. హరిజనుల ఇంత పుట్టిన ఆ బిడ్డని ఇంటి అవసరాల నిమిత్తం అందరు కడుపునిండ బువ్వ తినడానికి కొడుకుని చదివించడానికి పెద్దమనిషి కూడా కాని పిల్లను "జోగి"ని చేయాలని ఆ తల్లిదండ్రులు చేసిన నీచమైన పని. నువ్వు దేవుని భార్యవని చెప్పి తల్లిదండ్రులు ఇంటిముందట కావలి ఉండి బిడ్డ దగ్గరికి ఊళ్ళో మగవాళ్ళని పంపించి పైసలు తీసుకునుడేమోగానీ ఆ తల్లిదండ్రులు ఆ పైసల్ని సూశి కళ్లలో కాంతులు నిండేవి. ఆబిడ్డ జీవితం అంధకారం అయ్యిందన్న సోయిలేదు. ఒక డబ్బు సంపాదించే యంత్రంలాగ చూడడం...తల్లిదండ్రులు చేసిన తప్పుకు అనసూయకి సుఖవ్యాధులు అంటుకుంటే దగ్గరికి కూడా తియ్యలేదు ఏం మనుషులో ఏమో!
ఇలా చెప్పుకుంటూపోతే కన్నతండ్రి కూతుర్ని పదేండ్ల సంధి అనుభవిస్తూ...కడుపు వస్తే గర్భం పోవడానికి అరకొర మాత్రలు వేసి మరీ అనుభవించడం ఒకడు చేస్తే..,ఇంకొకడు ఏకంగా కూతుర్ని రేప్ చేసి ఒక బిడ్డను కన్నాడు. ఇప్పుడు నాబిడ్డ...నా తండ్రిని తాత అని పిలవాలా..,లేక నాన్న అని పిలవాలా...అని ఆ ఆడబిఢ్ఢ ఏడ్చిన తీరు వర్ణనారహితం.
స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలు జరగకుండ ఆపాలంటే మొదటగా మార్పు రావాల్సింది భార్యాభర్తల బంధములో...భార్యతో భర్త ఎలా మసులుకోవాలి? ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలన్న సంగతులు తెలిసి ఉండాలి. స్త్రీలను కేవలం పిల్లలను కనే యంత్రంలా కాకుండా స్త్రీకి మనం ఇవ్వగలిగే గౌరవం ఇస్తే చాలు. పుట్టిన పిల్లలను పెంచే క్రమంలో తల్లిదండ్రులు ప్రతీ విషయాన్ని పిల్లలలో అవగాహన కల్పించడమే కాకుండా వాళ్లని స్వేచ్ఛగా ఉండేలా చేసి తప్పుడుదార్లు తొక్కకుండా గమనిస్తూ ఎప్పటికప్పుడు వాళ్లకి తెలియకుండానే స్త్రీలపై గౌరవం,సమాజం పట్ల అవగాహన వచ్చేలా తల్లిదండ్రులే చేయాలి. ముందుగా తల్లిదండ్రులు మారి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి.
భారతిగారు రాసిన కథలే కాకుండా ఈ సమాజంలో ఇంకెంతమంది ఆడబిఢ్ఢలు తమ తండ్రి,అన్న,బావ,బాబాయి,మామ,భర్త లాంటి క్రూర జంతువుల నోటికి ఆహారమవుతున్నారో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.
రచయితలుగానీ..,రచయిత్రులుగానీ... ఇలాంటి మరెన్నో కథలను సమాజంలోకి తీసుకురావాలి. అలాగే ఇలాంటి ఆకృత్యాలను ఆపగలిగేటువంటి కథలను తీసుకువస్తే అటు మగవాళ్ళలోమార్పు... ఇటు ఆడవాళ్ళలో కొంతవరకైనా... చైతన్యం కలిగించినవారవుతాము...
ఇలాంటి నిజ జీవిత గాథలకు అక్షరరూపం ఇచ్చిన డాక్టర్ భారతి గారికి కృతఙ్ఞతలు.