ఓ నా దేశమా !
స్వేఛ్ఛా భారతమా !!
ఇక్కడ,
ధర్మం నాలుగు పాదాలా?ఏమో!
మనుధర్మం మాత్రం
నలభై నాలుగు పాదాలుగా
నల్లత్రాచులై నాలుకలు చాస్తాంది!
ఉన్నవాళ్ళకే న్యాయం
రక్షణ వ్యవస్థ అంతా ఒకేవైపు!
బాధితుడి వైపు గాకుండా
నిందితుడి వైపు నిలబడటం!
ఓ నిర్భర భారతమా!
ఆహా! ఏమి నీ న్యాయం
ఆ 'అ'సమాన వైఖరిని చూసి,
మహదానందం పొందు!
అమ్మాయి గా పుట్టటమే అపరాధం!
అంటరాని వారైతే ఇంకా ఫర్వాలేదు
భరత మాత మంత్రం జపిస్తూ
అమ్మాయిలను అమ్మ గా చూడని
దేశభక్తి ని చూసి,
ఓ నా పవిత్ర దేశమా ఎగిరి గంతేయ్!
ఖైర్లాంజీ ,ఉన్నావా,హత్రాస్---
అంటుడు ముట్టుడు అంటూ
ఊరికి ఆమడ దూరం వెలివేయబడ్డా
ఇక్కడ అంటరాని వాళ్ళందరూ
అత్యాచారానికి అర్హులే అని ధృవపరుస్తూ,
హంతకులకు శ్వేత పత్రం ఇస్తున్న
ఆ చట్టాల చుట్టరికం చూసి
ఓ నా నిర్భయ దేశమా
ఆ గొప్పదనం చూసి గర్వపడు!
నాటి శంభూకుని శిరస్సునుండి
నేటి మనీషా నాలుక దాకా
అసలు నిజం బయట పడకుండా
ఇంకా ఎన్ని అవయవాలు తెగిపడాలో!
ఆ మానభంగ చరిత్ర లు రాయటానికి
ఇంకెంత రక్తం సిర గా మారాలో!
రక్తం మడుగులు ఇంకక ముందే
అబలల బలితర్పణం చేసే ఈ ధరిత్రి లో
రక్తపింజరల వికటాట్టహాసం చూసి
ఓ కర్మదేశమా! వికృతానందం పొందు!
నిర్భయ ఉన్నా భయమేం లేదు
దిశ దశను మార్చలేదు
ఎందరో మనీషా ల ఆయువు మాత్రం
వాయువులో కలిసి పోతూనే ఉంది
ఖండిత తలలు , నాలుకలు
అబలల మర్మావయాలు అతికించబడిన
పచ్చి రక్త మరకల చరిత్రను చూసి
ఓ శాంతిని కోరే నా దేశమా!
చంకలు గుద్దుకుంటూ సంతోషపడు!
ఆవుకు ఇచ్చే గౌరవం
అమ్మకు లేని ఈ నేలలో
మతం పేర,
ఖతువా ఆయేషా అయితేనేం
కులం పేర హత్రాస్ మనీషా అయితేనేం
ఎవరైనా ఇక్కడ ఒక్కటే కదా!
కర్కశంగా తెంపి నలుపబడ్డ పూలే కదా!
మానవత్వం లేని సమాజాన్ని చూసి
మరణమే శరణం అయిన
చెరచబడ్డ నా చెళ్ళెళ్ళ చీరలను
నీ త్రివర్ణ పతాకానికి కట్టి
ఈ ప్రపంచం దశదిశలా ఎగిరేయ్!
ఓ గణతంత్ర దేశమా!
ఆ ఘనతనంతా దండోరావేయి
పంచభూతాలు దద్దరిల్లేటట్లు !