అల ఈశాన్య రాజ్యంలో ఊహాన్ నగరిలో
జనించెనట జీవం లేని వైరస్, క్రొవ్వుపొరలో!
చేసెనే కరోనా కణ సేన భువిపైన ఆక్రమణం!
పట్టెనే పుడమికి సూర్యచంద్రరహిత సుదీర్ఘ గ్రహణం!
గబ్బిలాలు, పాంగోలిన్ వంటలతో నిండె ప్లేట్లు,
క్రూరమైన, అడ్డగోలు ఆహారపు అలవాట్లు,
దానితోనె ఆరంభం మానవాళికి అగచాట్లు,
క్రమ్మెనంట పృథ్విపై కానరాని కారు చీకట్లు!
కాలేదు ఈ మహమ్మారి చైనాకే పరిమితం,
కలిగించెను కల్లోలం, చూడలేదె అంతక్రితం,
వ్యాపించెను వేగంగా ఆ దేశం ఈ దేశం,
విడువలేదు భూమి మీద ఏ ఒక్క ప్రదేశం!
విశృంఖలమై విజృంభించె కరోనా కణాలు,
ఘడియ ఘడియ నమోదయ్యె లెక్కలేని మరణాలు,
ఖననానికె కష్టాలు, కడతేర్చని ప్రాణాలు,
మరలెన్నడు రాకూడదు ఇటువంటి తరుణాలు!
అన్నిటినీ త్యజించి, సేవించే సిబ్బంది,
తోడుండగ దరికి రాదు ఏ ఒక్కరికి ఇబ్బంది!
'కలిసుంటె కలదు సుఖం' ఆలనాటి నినాదం,
'కలిసుండుట వలదు' అనె ఈనాటి ఈ వేదం!
పరిశుభ్రతే బ్రహ్మాస్త్రం,
మనోబలమే మన శస్త్రం,
చింతించక చితినిపెట్టు,
కరోనారక్కసిని మట్టుబెట్టు!
క్లిష్టమైన ఈ యుద్ధంలో ప్రతిఒక్కరు సైనికులే
కరోనా 'పద్మవ్యూహం' ఛేదించే అర్జునులే,
భస్మమవును త్వరలోనే వైరస్సు కణం కణం,
అదిగో అల్లదిగో మానవులు గెలిచే ఆ క్షణం!
అదిగో అల్లదిగో 'మనమంతా' గెలిచిన క్షణం!