ఊరు యిడిసి అప్పుడే ఆరు సంవత్సరాలయితంది. వూరు యాదికస్తే కడుపులో దేవినట్టయితది. ఎందుకో! ఈ మధ్య కాలంలో వూరుకు పోవాలనిపించింది. పోదామని బయలుదేరాను. మనసులో ఎక్కడో చెప్పలేని ఆనందం యింకో పక్క బాధ. ఎందుకంటే! వూల్లో ఏమున్నది వూరు మొత్తం వల్లకాడులెక్కయింది....ఆ... డ్యాం అని పడి మా అందరి బతుకులను ఆగంజేసింది. ప్రజలంతా దిక్కులేని పక్షుల్లాగా అయిపోయారు. చిన్నకారు, సన్నకారు రైతులతో సహా అందరూ కూలీలయ్యారు. పదిమందికి అన్నంపెట్టిన రైతుల చేతులు యిప్పుడు కూలి అడ్డలకాడ కూలికోసం ఎదురుచుస్తున్నాయి. దీనికి తోడు వూల్లకు బ్రాండిషాపులచ్చాయి. రైతులకు మా భూములన్ని పోయి మేమిప్పుడు కూలి పనిచేయవలసి రాబట్టే అనే బాధపడేవారు. మనుషులల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మనుషులు యింతకు ముందు వారిలాగే వుంటలేరు. ఒకరి కష్టాలల్లో యింకొకరు పాలు పంచుకోవడం లేదు. తమ మనసులోని బాధను యింకొకరికి చెప్పుకుందామంటే కూడా ఎవరు వినరు. అది ఏమిటో వారికే తెలియదు. చెప్పేవారు కూడా ఎవరులేరు. దీనికి తోడు ఆర్థిక పరమైన బాధలు. ఈ బాధలు మరిసిపోవడానికి అప్పుడప్పుడు కల్లుతాగేవారు. ఈ అప్పుడప్పుడు తాగే అలవాటు క్రమంగా రోజూ తాగేటట్టు చేసింది. సర్కారు వూరును లేపిన తరువాత గుట్టకొగలు, చెట్టుకొగలు అయినారు. పనుల కోసం ప్రజలందరు చుట్టపక్కలవుండే పట్టణాలకు పనులకు పోయి మల్లా రాత్రికి యింటికి వచ్చేవారు. మరి కొంత మందైతే పూర్తిగా పల్లెను వదిలి పట్టణాలకు వలస వెల్లారు.
యింకా వూరు జ్ఞాపకాలు చాలా మట్టుకు నీళ్లల్లో మునిగిపోయాయి. సర్కారు ప్రతిదాన్ని పైసలతోటి ఖరీదు కట్టలేదు కదా! మేము ఆడుకున్న చెట్లు, పుట్టలు, చేండ్లు చెలుకలు, మా తీపి గుర్తులను ప్రాజెక్టు మింగింది. యింకా చాలా మంది సోపతిగాల్లు సచ్చిపోయినారు. అందుకే వూరుకు పోదామంటేనే చాలా బాధగా వుంది. అయినా పరువాలేదు, పోదామని నిర్ణయించుకున్నాను. ఎండకాలం కాబట్టి ప్రాజెక్టులో నీళ్లు తగ్గుతాయి. పాత వూరు నీల్లల్ల నుంచి లేచి కనబడుతుంది. కాబట్టి అంతా తిరిగి చూడవచ్చునని బయలుదేరాను.
పొద్దున బయలు దేరి సాయంత్రం కల్ల వూరుకి చేరుకున్నాను. వూరు సొర్రుదలకు అక్కడ ఎత్తైన స్థూపం వుంటుంది. ఆ స్థూపాన్ని చూసిన నాకు పాత రోజులు గుర్తు వచ్చాయి. మనస్సులో ఎక్కడో గడ్డకట్టుకపోయినట్టు అయింది. కడుపంతా సెరువైంది. ఆ స్తూపాన్ని చూస్తే ఎన్నో జ్ఞాపకాలు, వూరు దొరలను, పెత్తందార్లను, భూస్వాములను వుచ్చపోయించిన నాగన్న గుర్తుకు వచ్చాడు. ఎంతమంచివాడో నాగన్న, బక్కపల్చన మనిషి, కోలమొఖం గుబురు గడ్డం, అతను నవ్వుతే స్వచ్చమైన గలగల పారే వాగులాగుండేది. ప్రతి సమస్యను చిరునవ్వునవ్వి చాలా సులువుగా పరిష్కరించేవాడు. అతని గొంతు ఎంత తియ్యగుండేదో! మంచి పాటగాడు అతను పాట పాడితే గలగల పారే సెలఏరులాగుండేది. అన్యాయాన్ని ఎదిరించిండు, పేదలందరిని కూడగట్టి ఎన్నో పోరాటాలు చేశాడు. వూరి దొరల మెడలువంచి అన్యాయాన్ని ఎదిరించిండు. దొరల జులుం మెల్లె మెల్లెగా తగ్గింది. దొరలు ఊళ్లోని ఆడోల్ల జోలికి రావడంలేదు. కూలిరేట్లు పెరిగినయి. మాల, మాదిగల పిల్లలు, పేద ప్రజల పిల్లలు బడికి పోతున్నారు. అందరు తెలివికి వస్తున్నారు. దొరలు, షావుకార్లు, పటేండ్లు, కూలీలను పేరు పెట్టి పిలుస్తున్నారు. యింతకు ముందులెక్క ఆసి, తోసి, అంటలేరు. వూల్లో చాలా మార్పులు వచ్చాయి. అంతకు ముందు వూరిలో పేదవాల్లు టి.వి చూడటానికి షావుకార్ల యిండ్లకు పోయేవారు. వారు వీల్లను రానిచ్చేవారు కాదు. షావుకార్ల యిండ్లన్ని తిరుగంగా, తిరుగంగా ఎవరో ఒకరు రానిచ్చేవారు. అయితే అది ఆంక్షలతో కూడింది. టి.వి చూసి యింటికి వచ్చే ముందు వాళ్లు టి.వి పెట్టిన ఆరుగు కడిగి రావాలి. యిట్లా చాలా యిబ్బందులు పడేవారు. అయితే వూల్లెకు సంఘాలు వచ్చిన తరువాత సంఘం సహాయంతో వూల్లే ఒక్క షెడ్డు నిర్మించి అందులో టి.వి. పెట్టించారు. వార్త పత్రిక కూడా ఏపిస్తున్నారు. వూరిలోని ప్రజలు పని పాటలు అయినా తరువాత టి.వి. చూసేవారు. చదువుకున్నవారు వార్త పత్రిక చదివే వారు. యిట్లా వూల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నింటికి కారణం నాగన్న. కనుక నాగన్నంటే దొరలకు మంట.
వూరిలోని సంఘాలు బలపడుతున్నాయి. రైతులు, కూలీలు ఐక్యంగా వుంటున్నారు. ఒకరికొకరు పనులల్లో పాటలల్లో సాయం చేసుకుంటున్నారు. యిట్లా అందరి రెక్కల్లో బొక్కల్లో వున్నాడు నాగన్న.
అయితే నాగన్న మీద దొరలకు చాలా కోపమున్నది. ఎందుకంటే వాళ్లకు ఎవరు బయపడతలేరు. వాల్ల మాటలు ఎవరు వినడంలేదు. ఎవలు కూడా దొరలకు వంగి వంగి దండాలు పెడతలేరు. యిట్లా దొరలకు కొరకరాని కొయ్యలాగా మారిన నాగన్న మీద కసిపెంచుకున్నారు. ఎలాగైనా నాగన్నను సంపించాలని దొరలు పన్నాగాలు పన్నారు. అయితే ప్రజాబలం మెండుగావున్న నాగన్నను పట్టుకోవాలంటే అంతా సులువు కాదన్న సంగతి దొరలకు, పోలీసులకు తొందరగానే అర్థం అయ్యింది. ప్రజలు కూడా నాగన్నను తమ కడుపులో పెట్టుకొని చూసుకొనేవారు. తమ కంటి పాపాల్లాగా కాపాడుకొనేవారు.
దొరలు నాగన్నను సంపించడం కోసం చాలా ఎత్తులు వేసేవారు. వూరిలో ఏం పనిలేక తాగుతూ తిరిగే ఒక్క యువకున్ని దొరలు తమసెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఆ యువకునికి దొరలు తాగబోయించేవారు. అట్లా మారిపోయిన అతడు ప్రజల మధ్యనే తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా దొరలకు ప్రజలకు సంబంధించిన, నాగన్నకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పేవాడు. వాడు చెప్పిన విషయాలన్ని దొరలు పోలీసులకు చెప్పేవారు.
ఒక్క రోజు పొద్దుగాల ఏడుగంటల సమయంలో నాగన్న బస్టాండు ప్రాంతంలో వున్నాడు. మారువేషంలో వచ్చిన పోలీసోల్లు నాగన్నను పట్టుకున్నారు. మూడురోజులు చిత్రహింసలు పెట్టి కాల్లు, రెక్కలు విరిసి వూరు గోదావరి ఒడ్డుకు కాల్చిచంపారు.
ఆ పాత విషయాలు గుర్తువచ్చి నా మనస్సంతా చెల్లా చెదురయిపోయింది. దొరలు పోలీసులు చంపిన నాగన్న అమరుడైనాడు. అతని గుర్తుగా యిక్కడ స్తూపం వెలిసింది. అప్పుడు దొరలను వుచ్చపోయించిన నాగన్న స్తూపం, యిప్పుడు ఆ వూరి ప్రజలకు ఏం సందేశం యిస్తుందో? ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో చూడాలి. మనస్సంత కోల్లుదవ్విన పెంటలెక్క అయింది. గుండె బరువుతో ముందుకే నడుస్తున్నాను. వూరును ఏదో రాక్షసి మింగినట్టుగున్నది. వూరంతా వల్లకాడయింది.
కొద్దిగా ముందుకు పోతే దొస్తువాళ్ల యిల్లు. వూరినుంచి అందరు వెల్లిపోయి సర్కారుసూపించిన భూమలల్ల యిండ్లు కట్టుకున్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం సర్కారు యిచ్చే పైసలు పెండింగ్‍లోపడి యిక్కడనే వుంటున్నారు. వాళ్లకు పైసలు వస్తయో రావో కూడా తెలియదు. వీళ్ల గురించి పట్టించుకునే నాదుడేలేడు. యింకో కొంతమందికి పైసలు తక్కువ వచ్చి, ఆ పైసలు ఎటుసాలక, యిండ్లు కట్టుకోలేక, వున్న అప్పులు కట్టుకొని యిక్కడే వుంటున్నారు. అందులో ఒక్కటి మా దొస్తువాళ్ల యిల్లు. మనసులో ఎక్కడో కలుక్కుమన్నది. యిక్కడ ఎట్లవుంటున్నారు వీళ్లు. మనుషులు లేకపోవడం వల్ల వూరినిండ తుమ్మలు, పిచ్చిచెట్లు పెరిగాయి. వూరంతా అడవీ తీరవున్నది.
కొద్దిగా ముందుకు పోయాను. నాలుగేండ్ల కింద మిషన్‍భగీరత పనులకోసం తవ్విన పొక్కలో పడి మెడలు యిరిగి మంచానికే పరిమితమైన దోస్త్ వాళ్ల ‘అయ్య’ పోశాలు మంచంలో శవం లెక్క పడివున్నాడు. దూరం నుంచే చూశాను. అతని దగ్గరికి పోయేంత గుండే ధైర్యం నాకులేదు. దు:ఖం ఆగడంలేదు. కడుపులో ఎక్కన్నో మంట కోపం, ఏమిచేయని నిస్సాహాయకస్థితి. మధాహ్నం కావడం చేత యింటికాడ ఎవలు లేరు. అందరు కూలి పనులకు పోయినట్టున్నారు. అతకు ముందు పోశాలును అతని రూపాన్ని, తలుచుకుంటే ఎంతో బాధనిపిస్తుంది. పోశాలు ఎత్తైన బలమైన మనిషి. యిప్పుడు నాలుగు ఏండ్లనుంచి మంచానికే పరిమితం కావడం వల్ల బొక్కలు తేలి పీనుగు తీర తయారయ్యిండు. అతను వూళ్లో అందరితోని కలుపుకోలుగా వుండేవాడు. మంచి మాటకారి, పంచాయితులు కూడా చేసేవాడు. అతను మంచిగా వున్నప్పుడు వాళ్ల యింటి కాడ ఎప్పుడు మందితోని సందడిగా వుండేది. పంచాయితీలకోసం, పడావులకోసం ఎప్పుడు యింటికాడ ఎవరో ఒకరు వుండేవారు. యింకా వూరికి ఎలక్షన్లు వచ్చినయంటే పోశాలు తీరిక లేకుండా వుండేవాడు. ఎలక్షన్లో నిలవడే వ్యక్తులు పోశాలును చాలా రకాలుగా వాడుకునేవారు. అలాంటిది యిప్పుడు వాళ్ల యింటి మొఖాన వచ్చిన నాదుడే లేడు. యిది వాళ్లస్థితి.
వాళ్లస్థితి గురించి ఆలోచిస్తూ ముందుకు నడిచాను. వాళ్లియింటికాన్నుంచి వందగజాలు నడుస్తే మూడుతొవ్వలు కలిసే చోటువస్తుంది. ఈ మూడు బజార్లకాడ కూసుండుడంటే నాకు ఎంతో యిష్టం. యిక్కడ కూసుండి మాట్లాడుతూ ఎన్నిరాత్రులు గడిపినామో సోపతిగాల్లందరం కలిసి యిక్కడ ఎన్నో ఆటలు ఆడుకునేది. బొంబాయికి బతుకు దెరువుకోసం పోయిన మా సోపతిగాండ్లు వూరికి వస్తే పండగ సందడిగా వుండేది. ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమవుండేది. వాళ్లు మళ్లా తిరిగి బొంబాయికి పోయేటప్పుడు అందరం ఏడుస్తూ సాగనంపేవాళ్లం.
అట్లా ఎన్నో అనుభవాలతో నడుస్తున్న నాకు రామన్న కూలిపోయిన యిల్లు కనపడ్డది. ఆ యింటికాడ చాలా సేపు కూసున్నాను. ఆ యిల్లు ఎట్లా అయితే కూలిపోయిందో రామన్న కూడా ఆట్లా కూల్చివేయబడ్డాడు. అతను ఎంత మంచి మనసు కలవాడు.
మృదుస్వభావం కలవాడు. ప్రజలకోసం దొరలను ఎదురించినవాడు. ఎన్నో పోరాటాలు తను చేస్తూ నిర్మించినవాడు. ఎందుకోగని తరువాత రామన్న పోరాటాలకు దూరంగా వుంటూవచ్చాడు. యిప్పుడు అతను ఏ పోరాటాలు చేయడంలేదు. అయినా సరే పోలీసుల వేధింపులు మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు వేధించేవారు. వూరిలోకి కొత్తవాళ్లు ఎవరు వచ్చిన రామన్నను పోలీస్‍స్టేషన్‍కు పిలిపించి వేధించేవారు. వూరిలో చాలా మంది మాజీలు వున్నారు. కాని ఎవరిని పోలీసులు వేధించేవారుకాదు. దీనికి కారణం ఏందంటే రామన్న మిగితా మాజీలల్లాగా పోలీసులకు అనుకూలంగా వుండకపోవడం, మాజీలు కొంత మంది రాజకీయ నాయకుల అవతారం ఎత్తారు, కొంత మంది రియల్‍స్టేట్ చేస్తున్నారు. మరి కొంత మంది పంచాయితీలు, పైరవీలు చేస్తూ చాలా సంపాదించారు. లగ్జరి జీవితం అనుభవిస్తున్నారు. వీళ్లంతా పోరాటంలో వున్నప్పుడు ఏపనులయితే చెయ్యవద్దనీ చెప్పారో యిప్పుడు అవే పనులు చేస్తున్నారు. ఈ పనులు చేయని రామన్నంటే మిగితా మాజీలకు యిష్టం వుండేది కాదు.
సమాజం ఎప్పుడు మారుతూ వుంటుందికదా! మారుతున్న కాలంతో పాటే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్కెట్టు సమాజం అందరిని మాయచేస్తుంది. ఎన్నో కనపడని కుట్రలను చేస్తుంది. అందరికి చేతినిండ పని వున్నట్టే వుంటుంది, కానీ ఫలితం మాత్రం శూన్యంగా వుంటుంది. ఈ మార్కెట్టు సమాజం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుంది. ఎవరిని కలిసిమెలిసి బతకనివ్వదు, అందరిమధ్య విభేదాలు సృష్టించి విడకొడుతుంది. మనుషులను పిచ్చివాళ్లను చేస్తుంది. ఈ మార్కెట్టు కాలంలో ఒకరుకూడా సుఖంగా వుండరు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతుంది. భార్య భర్తలను సుఖంగా వుండనియ్యదు. తల్లులకు పిల్లలను పిల్లలకు తల్లులను కాకుండా చేస్తుంది. సమాజంలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ పనిని పైసలతో వెల కట్టే రోజులు వచ్చాయి. యిలాంటి సమాజంతో రామన్న లాంటి వ్యక్తులు బతికే పరిస్థితి లేదు. ఈ విషపు సమాజాన్ని చూడలేక రామన్న ఒకనాడు ఆత్మహత్య చేసుకున్నాడు.
రామన్న జ్ఞాపకాలు గుర్తుకు వస్తె మెదడు కోల్లు తవ్విన పెంట తీర్గ అయితది. బరువెక్కిన హృదయంతో నడుస్తున్నాను. ఈ లోకంలో ప్రతీది ఒక్క అనుభవమే కదా! ప్రతీ అనుభవం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ సమాజమే ఒక పెద్ద పాఠశాల. ఎంత నేర్చుకుంటే అంతా నేర్పిస్తుంది. ఈ తలకిందుల సమాజాన్ని సీదచెయ్యటంకోసం ఎంత మంది తల్లులు తమ కడుపుకోతను అనుభవించారు. వాళ్ల మరణాల రక్తపు గుర్తులు మనకు ఏమ్ చెప్పుతున్నాయి. ఏ సందేశాన్నిస్తున్నాయి. ఈ ఉల్టా పల్టా సమాజాన్ని సక్కదిద్దడానికి మనం ఏం చేస్తున్నామా? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద వున్నది.
యిలాంటి ఆలోచనలు మెదుడులో మెదులుతుంటే! తేరుకొనీ ముందుకేసి చూశాను. చెంత చెట్టు కనపడుతుంది. అదే దాసరోల్ల చింత చెట్టు. ఆ చెట్టు కింద మేమందరం ఎన్నొ ఆటలు ఆడుకొనేది. చిర్రగోనే ఆట, గోలీలాట, కోతికొమ్మాట, అంగుడుదునుకుడు లాంటి ఆటలు ఆడేది. ఆ చింత చెట్టు పంచాయితీలకు అడ్డ. అక్కడ ఎన్నో పంచాయితులు జరిగేవి. చెట్టు కింద చీకట్ల ఏమో మీటింగులు జరిగేవి. చీకటయితే చెట్టుకింద ఎవరెవరో కొత్తవాల్లు కనపడేవారు. ఈ కొత్తవాల్లతో మా వూరి యువకులు కలిసేవారు. ఏమెమో విషయాలు రాత్రంతా మాట్లాడుకొనేవారు. వీళ్ల రాకతో వూళ్లో దండగలు, కల్లు తాగడాలు బందు అయినాయి. యింతకు ముందటి పంచాయితీలల్లో లెక్క తిమ్మిని బొమ్మ, బొమ్మను తిమ్మిచేయడం లేదు. నిజంవైపు ఎక్కువ మంది నిలబడుతున్నారు. యిట్లా వూళ్లో చాలా మార్పులు జరిగాయి.
ఈ ప్రాజెక్టు ఆ గుర్తుల మీద బురద జల్లింది. ఆ చింత చెట్టు కూడా నీటిలో మునిగిపోయింది.
అక్కడి నుంచి ఎడం చేయి పక్క మీదుగా పోతే పీరీల గుండం (మొహంర్రం) వస్తుంది. పీరీల పండుగ వచ్చిందంటే వూరిలో అదొక పెద్ద సందడి. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాటలు పాడుతూ గుండం చుట్టు ఎగిరేవారు. వూరి జనమంతా అక్కన్నే వుండేవారు. ఈ పీరీలగుండాన్ని కూడా మాయదారి ప్రాజెక్టు మింగేసింది.
పీరీలగుండం కాన్నుంచి కొద్దిగా ముందుకుపోతే రాంబాయిగడ్డ. రాంబాయి గడ్డను ఆనుకొని ఎత్తైన మట్టిగోడ, దాని మీద పాత కుమ్మరి గూనలు కప్పివున్నాయి. ఈ గోడ దాదాపుగా చుట్టు పది ఎకరాలతో వున్నది. యిదే మా వూరి దొరగడి. గడిలోనికి పోవటానికి ఎత్తైన పెద్ద దరువాజ వుంది. ఆ దరువాజ ముందు, ఆపక్క, ఈపక్క, కూసూండటానికి బండతో గద్దే కట్టించివున్నది. గోడల మీద అక్కిరి, బిక్కిరి జాజురాతలున్నాయి. ఆ జాజు రాతల మీద సున్నం వేసి వున్నది. సున్నం చాటుకు వుండలేని ఆ రాతలు ఎరర్రగా కనిపిస్తూ వేలాది ప్రశ్నలు, నాకో, మరి ఈ సమాజానికో సందిస్తున్నట్లుగా వున్నాయి.
యిప్పుడు గడిలో మొత్తం తుమ్మలు మొలిశాయి. అండ్లకు పోవటానికి వీలు లేకుండా వున్నాయి చెట్లు, చేమలు. ఈ గడిలో ఎంత మంది తల్లుల మాన, పాణాలు, మన్నులో కలిసిపోయాయో, ఎంత మంది యువకులు పాలేర్లుగా తమ నెత్తురును ఈ దొరల పొలాలు దున్నటానికి దారవోశారో! ఎంత మంది ఈ గడీలో తన్నులు, గుద్దులు తిన్నారో, ఎన్ని నరకయాతనలు పడ్డారో. ఎంతో మంది జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ గడీలు యిప్పుడు మట్టిలో మట్టి అయినాయి. వూళ్లెకు సంఘాలు వచ్చి దొరలు పట్టణాలు వలసపోయారు. వందల ఎకరాల భూములు బీల్లు వడ్డాయి. దొరలు కూడా ఈ భూములు మీద ఆశవదులుకున్నారు. పట్టణాలకు పోయిన దొరలు వ్యాపారాలు చేస్తూ, కాంట్రక్ట్లు చేస్తూ, పెట్టుబడుదారులు అయినారు. పెట్టుబడుదారులు రాజకీయనాయకులయినారు. రాజకీయనాయకులయిన దొరలు ప్రభుత్వాలను ఏర్పటు చేసినారు. తొండ మారి వూసరవెల్లి అయింది. భూస్వాములుగా వున్నప్పుడు దొరల దోపిడి, దౌర్జన్యాలు వూల్లకే పరిమితంగా వుండేది. వాళ్లు యిప్పుడు రాజకీయనాయకులై ఏకంగా దేశాన్నే దోపిడి చేసే స్థితికి ఎదిగిపోయారు. ప్రాజెక్టు కూడా వాల్లకే న్యాయం చేసింది. వుత్తపుణ్యానికి పోతయనుకున్న భూములు కోట్లు తెచ్చిపెట్టాయి. కూలిపోయిన యిండ్లకు కూడా వాళ్ల పలుకుబడితో ఎక్కువ పైసలు తెప్పించుకున్నారు.
వూరిలో సెంటు భూమి లేని పేదలను ఈ ప్రాజెక్టు నిండాముంచింది. ఎకురమో, ఆర ఎకురమో వున్న వాళ్లకు ఆ డబ్బులు ఎటు సాలక అప్పుల పాలయినారు.
హనుమండ్ల గుడి, గుడివద్ద పెద్ద వేపచెట్టు, సుట్టు బండతో కట్టిన గద్దె, ఆ గద్దే మీద సాయంత్రం పూట షావుకార్లు, పటేండ్లు, దొరలు కూసుండేవారు. ఆ గద్దే కాడికి గాని, గుడి వద్దకుగాని మాల, మాదిగలకు రావడానికి అర్హతలేదు. ఆ గుడికి పోవడానికి మాల, మాదిగలు ఎన్ని పోరాటాలు చేశారో తలుసుకుంటేనే గుండెబరువెక్కుతుంది. ప్రతి దసరాకు ఏదోరకంగా మాల, మాదిగలతో వూరిలోని మిగితా కులాలు లొల్లికి దిగేటివి. లొల్లీలన్ని దొరలు వెనుక వుండి నడిపించేవారు. కులాలమధ్య అంతరాలు సృష్టించి ప్రజలు ఏకం కాకుండా చేసేవారు. గొడవల గురించే ఆలోచిస్తారు. దొరల దోపిడి గురించి ఎవరికి ఆలోచన రాదు. ఈ రకంగా దొరలు తమ పబ్బం గడుపుకునే వారు. తరువాత వూరికి వచ్చిన సంఘాలవల్ల సబ్బండ కులాలు ఒక్కటయ్యాయి. దొరలు వెలివేయబడ్డారు. దొరలను వూరి ప్రజలు తరిమి, తరిమి పొలిమేరలు దాటించారు. మాల, మాదిగలకు గుడికి పోయే రోజులు వచ్చాయి. అయితే అప్పుడూ ఈ ప్రాజెక్టును గాని, ప్రాజెక్టును నిర్మించే ప్రభుత్వాన్ని గాని ఎదురించలేక పోతున్నారు....ఎందుకోమరీ....
మా వూరి బడి ఎన్నో సంవత్సరాల చరిత్ర గలిగిన బడి, యిప్పుడు వెలవెలబోయింది. బడిని చూస్తే ఎన్ని మధుర జ్ఞాపకాలో గుర్తుకు వస్తాయి. మమ్ములను మనుషులుగా తీర్చిదిద్దిన బడికి కూడా తప్పలేదు ప్రాజెక్టులో మునుగుడు. దాదాపు నలబై, యాబై సంవత్సరాలుగా ఏడవ తరగతికే పరిమితమైన బడిలో యిప్పుడు పదవ తరగతి వరకు వున్నది. దొరల కాలంలో బల్లకు ఎక్కువ ప్రాధాన్యత యిచ్చే వారు కాదు. పేదవాళ్లు ముఖ్యంగా మాల, మాదిగలు చదువుకుంటే తెలివిమంతులు అయితారని బడిని అభివృద్దికాకుండా చూసెవారు. బడికోసం వచ్చే పంతుల్లను కూడా వాళ్ల చెప్పుచేతుల్లో పెట్టుకొనేవారు. వాళ్ళ యిండ్లల్లోనే వుంచుకొని తమ పిల్లలకు చదువు చెప్పించుకునేవారు. యిది ఆ రోజుల్లో బడి పరిస్థితి.
అలాంటి బడి 10వ.తరగతి వరకు అవడానికి ముఖ్యకారకుడు ‘రెడ్డి’ సారు. ఆయన రాకతోనే వూరి బడి స్థితిగతులు మొత్తం మారిపోయాయి. సారు బడికోసం ఎంత తపన పడేవాడో తలుసుకుంటే చాలా బాధకలుగుతుంది. ఎంతో మందికి కంటు అయి మా బడిని 10వ. తరగతి వరకు తీసుకవచ్చాడు. మా బడితో మొట్టమొదటి సారి తల్లి దండ్రుల కమిటి వేసి నవాడు. ప్రతినెల మీటింగు పెట్టి, వూరిలోని ప్రజలందరికి బడియొక్క స్థితి గురించి చెప్పేవాడు. తల్లి దండ్రులకు పిల్లల చదువు గురించి చెప్పేవాడు. అట్లాగే బడిలోనికి యూనిఫామ్ తీసుకవచ్చిన వాడు కూడా ‘రెడ్డి’ సారే. ఈ విధంగా బడి అభివృద్దిచెందడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. 10వ. తరగతి వరకు బడిని అభివృద్ది చేయడం ఒక ఎత్తు అయితే తరగతులు నిర్వహించడం కోసం గదులు నిర్మించడం పెద్ద సమస్య అయ్యింది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కోక్క తరగతికి పరిమిషన్ రావడం జరిగింది. మొదటగా 8వ.తరగతికి, ఆ తరువాత 9వ.10వ. తరగతులకు పరిమిషన్ రావడం జరిగింది. యిప్పుడు ఉపాధ్యాయుల సమస్య మొదలయింది. తరగతులు పెరిగినయి కనుక టీచర్లు కావాలి. ప్రభుత్వం టీచర్లను పంపించేటట్టులేదు కనుక విద్యార్థులకు చదువు విషయంలో యిబ్బందికలుగకుండా బడిలో తల్లి దండ్రులమీటింగ్ ఏర్పాటు చేసి ప్రైవేటు టీచర్ల అవసరం గురించి చెప్పాడు. మనకు గవర్నమెంటు టీచర్లను పంపించాలంటే సమయం పడుతుంది. అప్పటిదాక పిల్లలకు చదువు విషయంలో అన్యాయం జరుగుతుంది. కనుక మీరందరు ఒప్పుకుంటే ప్రైవేటు టీచర్లను పెట్టుకుందాం అన్నాడు. మీటింగ్‍లోని తల్లి దండ్రులు కొంత సేపు ఆలోచన చేసి, చివరకు అందరు ఒప్పుకున్నారు. గవర్నమెంటు టీచర్లు, ముగ్గురు, ప్రైవేటు టీచర్లు ముగ్గురు కలిపి బడిని నడిపించారు. ఒక్కొక్క టీచరు మూడు నుంచి నాలుగు సబ్జెక్టులు చెప్పేవారు. అలా చెప్పడంకోసం సార్లు చాలా కష్టపడేవారు. మొత్తానికి బడిని మాత్రం నడిపించేవారు.
ఇక పోతే గదులు గవర్నమెంటు బడి బిల్డింగ్ నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. కనుక మనం తాత్కలికమైన షెడ్లు నిర్మించుకోవాలని అందరం నిర్ణయించుకున్నాము. తక్కువఖర్చుతో షెడ్లు కావాలంటే కర్రతో కూడా షెడ్లు నిర్మించాలి. అలా నిర్మించాలంటే అడవికిపోవాలి. కనుక వూరిలోని పెద్దమనుషులతో ప్రజలతో మాట్లాడి ఎడ్లబండ్లు కట్టుకొని టీచర్లు, రెడ్డిసారు, మోహన్‍సారు, సురేష్‍సారు పిల్లలం, మా తల్లిదండ్రులు, వూరిలోని బడిమీద ప్రేమ వున్న కొంతమంది యువకులు, యిట్లా అందరం కలిసి అడివికి పోయి, వాసాలు, కంకలు, పొరక మొదలైన వాటిని కొట్టుకొని వచ్చాము. మీది కప్పుకోసం వూరిలో చందాలు జమచేసి డాంబరు వట్టలు తెచ్చి కప్పాము. ఈ విధంగా 8వ,9వ,10వ తరగతులకు సంబంధించిన షెడ్లు ఏర్పడినాయి.
10వ తరగతి మొదటి బ్యాచ్ మాది. 10వ తరగతికి పరిమిషన్ తేవడం కోసం సారు చాలా కష్టపడ్డాడు. అయినా పదవ తరగతికి పరిమిషన్ రాలేదు. మేము పదవ తరగతి ప్రైవేటుగా వేరే స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్షలు రాశాము. మా పదవతరగతి అయినపోయిన తరువాత బడికి 10వ తరగతి పర్మిషన్ రావడం జరిగింది. అట్లా మా పదవ తరగతి పూర్తి అయ్యింది.
ఎన్నో అనుభవాలు నేర్పిన బడిని దాటి ముందుకు పోతే గుండోల్ల మూల, దీన్ని అనుకొని గ్రామపంచాయితి ఆఫీసుంటుంది. వెనుకట ఎందరో దొరలు పాలించినటువంటి ఈ గ్రామపంచాయితి తరువాత వూరితో వచ్చిన మార్పులతో ఆ అధికారం కిందిస్థాయి వాళ్లకు కూడా రావడం జరిగింది. ఎవరు అధికారంలో వున్న ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమిలేదు. ఎన్నికలలో గెలిచే అధికారం చేజిక్కించుకున్నవారు దొరల మాదిరి రాజకీయాలనీ చేయడం జరిగింది. వూరిలో కొత్తరకమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చులు పెట్టేవారు. లంపెన్ రాజకీయాలు నడిపేవారు. యువకులను రెండు వర్గాలు చేసి లొల్లీలు పెట్టించేవారు. పోలీసుకేసులు పెట్టించేవారు. వూరిలోని పేద ప్రజలు ముఖ్యంగా మాల, మాదిగలు రెండు పక్షాలుగా విడిపోయారు. ఒకటి పాలక పక్షం, రెండోది ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షానికి నాయకత్వం వహించేవ్యక్తి పాలక పక్షంలోని వ్యక్తి మీద వాళ్ల మనుషుల మీద ఎప్పుడూ ఆరోపణలు చేస్తూ వాళ్లమీద ప్రజలకు పూర్తి వ్యతిరేకం వచ్చేటట్టుగా చేసేవాడు. సర్పంచ్ విల్ల మీద కేసులు బనాయిస్తు పోలీసుల ద్వారా వేధింపులు చేపించేవాడు. సర్పంచి చేసిన కొన్ని స్కాంలు ఋజువు కావడం జరిగింది. మెల్లెమెల్లగా సర్పంచి మీద ప్రజలకు వ్యతిరేకత ఏర్పడ్డది. దీనిని ఆసరచేసుకొని ప్రతిపక్షంలోని వ్యక్తి సర్పంచిని ప్రజల మధ్య నిలవకుంట చేసినాడు. యిట్లా కొట్లాటలు జరుగుతుండగానే ఎలక్షన్లు రావడం, మల్లా ఈ యిద్దరు వ్యక్తులే పోటిలో వుండటం జరిగింది. సర్పంచి మీద వున్న వ్యతిరేకత అతను ఓడిపోవడం జరిగింది. ప్రతిపక్షంలోని నాయకుడు పాలకపక్షం లోకి రావడం జరిగింది. అధికారమార్పిడి జరిగింది.
కొన్ని రోజులకు వూరికి యిసుక టెండర్ రావడం జరిగింది. వూరిని అనుకొని గోదావరి వుండటం అండ్ల విపరీతమైన యిసుక వుండటంతో యిసుక కాంట్ట్రర్లకు యిక్కడి యిసుక మీద కన్ను పడ్డది. ఎలాగైనా యిసుకను యిక్కడి నుంచి తీసుకపోవాలి. అనుకున్నారు. అయితే కొంత మంది యువకులు యిసుక తీయడాన్ని వ్యతిరేకించారు. యిసుక తీస్తే భూగర్భ జలాలు యినికిపోతాయని యువకులు వాదించేవారు. ఫలితంగా తాగునీరు, సాగునీరుకు చాలా ఇబ్బందులు వస్తాయని కొందరు యువకులు ప్రజలకుచెప్పేవారు. యిసుక టెండరు కోసం వచ్చిన కాంట్రక్టరుతో యువకులు కొందరు గొడవపడ్డారు. యిట్లా గొడవలు జరుగుతుండగానే కాంట్రక్టర్, ఎవరితోనైతే పనిసులబంగా అయితదో వాన్నే పట్టుకున్నాడు. ఆ వ్యక్తీ మా వూరి కొత్త సర్పంచి యిట్లా మా వూరి సర్పంచి కాంట్రక్టర్ యిచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి మా వూరిని, మన్ను పాలు చేశాడు. వూరిలోని ప్రజలు, యువకులు, ఎంత ఆశతోటి గెలిపించుకున్నారో, అంతా నిరాశే మిగిలింది.
ప్రజల మర్మం తెలిసిన సర్పంచి వాళ్లను ఎట్లా మాయల పడగొట్టాలో అట్లా పడగొట్టాడు. యిక్కడ వున్నటువంటి పెద్ద సమస్య ఏందంటే! మా వూరి యువకులు బొంబాయిలాంటి ప్రదేశాలకు పనికోసం వలస వెల్లేవారు. అటువంటి పాయింట్‍ను పట్టుకున్న సర్పంచి యువకులను మచ్చిక చేసుకొన్నాడు. ఒక రోజు గ్రామ పంచాయితికాడ మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీటింగుకు వచ్చిన ప్రజలనుద్దేశించి! చూడుండ్లి....మనకు యిసుక టెండరు పడుతే మన బతుకులు బాగుపడుతయి, మీ రందరు బొంబాయికి వలస పోవడం బందు అయితది. అట్లాగే మన గ్రామ పంచాయితికి నిధులు కూడా వస్తాయి. ఆ నిధుల ద్వారా మన గ్రామ పంచాయితిని అభివృద్ది చేసుకోవచ్చు. అని చెప్పుకొచ్చాడు. అయితే చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. కొంత మందియువకులు వ్యతిరేకించారు. కానీ ఫలితం లేకుండా అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల వూల్లల్ల యిసుక టెండర్లు నడుస్తున్నాయి. పనికిపోయిన కూలీలకు రోజువారి కూలికంటే ఎక్కువగానే పైసలు రావడంతో మా వూరి ప్రజలకు కూడా టెండర్ అయితేనే బాగుండు అనుకున్నారు. మొత్తానికైతే మా వూరి యిసుకటెండరు పట్టిన కాంట్రక్టరు పనులు ప్రారంభించాడు.
యిసుక పనులు జోరుగా నడుస్తున్నాయి. ప్రజలచేతుల్లో పైసలు గలగల మంటున్నాయి. వూరికి బ్రాండిషాపులు వచ్చాయి. యిసుక పనులకు పోయిన కూలీలు ఎక్కువగా మధ్యానికి అలవాటు పడ్డారు. కూలికి పోతే వచ్చిన డబ్బులను మధ్యం షాపులకు దారబోసేవారు. వూరిలోని యిసుకంతా పట్టణాలకు తరలిపోయింది. కాసులు కాంట్రక్టర్ జేబులు నిండాయి. కమీషన్లు సర్పంచికి దక్కాయి. ప్రజలకు మాత్రము కష్టం తప్పా ఏమి మిగులలేదు. గోదావరిలోని యిసుక తీయడంతో వ్యవసాయ బావులు, తాగునీటి బావులు ఎండిపోయినాయి. ఫలితంగా పంటలు పండకుంట అయినాయి. వూరిలో గోరమైన కరువు తాండవించింది. యిట్లా నడుస్తున్న క్రమంలోనే వూరిని ప్రాజెక్టు కింద లేపుతమని అధికారులు వచ్చారు. ప్రజలకు ఏం అర్థం కాని అయోమయస్థితి ఏర్పడ్డది. ప్రజలంతా పిసపిస అయితండ్లు. యిలాంటి అయోమయ పరిస్థితిలో ప్రజలంతా ఒక్క నిర్ణయానికి వచ్చారు. వూరికి వచ్చే సర్వేర్లను అడ్డుకోవాలి అనుకున్నారు. మన వూరు మునుగుతే మనం బతకలేము. గుట్టకొక్కలం, చెట్టుకొక్కలం అయితం, ఆగన్నపక్షులం అయితం, అనీ అందరు సర్వేర్లను వూరికి రానీయద్దని నిర్ణయించుకున్నారు.
వూరికి వచ్చిన సర్వేర్లను ప్రజలు అడ్డుకున్నారు. ఏం చేయలేక సర్వేర్లు తిరిగివెళ్లిపోయారు. అయితే అధికార్లు సర్పంచితోని మంతనాలు జరిపి వూల్లోకి వచ్చారు. మళ్లా యిప్పుడు కూడా ప్రజలు ప్రతిఘటించారు. అయితే సర్పంచి కలిపించుకొని, ప్రజలారా సూడుండ్లి ప్రాజెక్టు అనేది మనం కట్టేది కాదు. యిది సర్కారు నిర్ణయం కావున మనమందరం దీనికి సహకరించాలి. అందుకు తగ్గట్టుగా మనకు నష్టపరిహరం యిప్పిస్తాను. భూములు పోయిన వాళ్లకు పైసలు యిస్తారు. అని అన్నాడోలేదో ప్రజల నుంచి ఒక్కసారి లొల్లి మొదలయింది. మందిలో నుంచి ఎవరో లేచి మాకు భూములకు పైసలు వద్దు, భూములకు బదులుగా భూములు యిప్పించుండ్లి, అని అన్నాడు. మేము మా తాతల ముత్తాతల నుంచి గీ భూమినే నమ్ముకొని బతుకుతున్నాము. మాకు భూమి లేకుంటే మేము బతకలేము. అని లొల్లి పెట్టారు. అప్పుడు ఒక అధికారి కలిపించుకొని సూడుండ్లి మీరు మాకు యిష్టమున్నా లేకపోయినా భూములు యివ్వాలి. లేకపోతే సర్కారు పోలీసులను పెట్టి జబర్దస్తిగా భూములు గుంజుకుటుంది. ఆ తరువాత మీ యిష్టం అన్నాడు. మా భూములను గుంజుకోవడానికి వాడెవడు. యిది ఎవరి జాగీరుకాదు. ఎట్లా గుంజుకుంటరో మేము చూస్తం అని ప్రజలన్నారు. గుంపులో నుంచి ఒక్క ముసల్ది లేసి సర్పంచి కెల్లి సూసి, ఏమయ్యా! బెల్లంకొట్టిన రాయోలే సూత్తన్నవ్, ఏంది మన బతుకులన్నది? ఆ మాటలకు సర్పంచి ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తండు. అప్పుడు ఒక్క యూవకుడు లేసి యింకా సర్పించి ఏంది గిర్పంచేంది, వాడు ఎప్పుడో అమ్ముడు పోయిండు. అని కుండ బద్దలు గొట్టినట్టున్నడు. ఆ మాటలకు కూడా సర్పంచి ఏం మాట్లాడలేదు. అధికార్లు, సర్పంచి ఏం మాట్లాడలేదు. అధికార్లు, సర్పంచి, ప్రజలు ఎటొల్లటు వెల్లిపోయిండ్లు.
మల్లా తెల్లారి అధికార్లు పోలీసులను తీసుకొని వచ్చారు. ప్రజలు ప్రతిఘటించారు. పోలీసులు లాఠిచార్జి చేశారు. ఒక్క సారిగా కొట్టుకొల్లు, మొత్తుకోల్లు. లాఠీలు పెడీలు, పెడీలుమని ప్రజల మీద తిరిగాయి. ఎవలయితే ఎక్కువగా మాట్లాడిండ్లో వాళ్ల మీద కేసులు అయినయి.
యిట్లా ఒక్క వారం రోజులు గడిచిన తరువాత వూరికి మళ్లా అధికార్లు, పోలీసులను తీసుకొని వచ్చారు. కాకపోతే యిప్పుడు రాయబారిగా ఆర్డివో వచ్చాడు. ఆర్డివో సర్పంచి ద్వారా వూరిలో మీటింగు పెట్టించాడు. జమ అయిన ప్రజతోని ఆర్డివో యిట్లా చూడండి! మీరు పంతానికి పోతే ఏంరాదు. గవర్నమెంటు యిచ్చే కాంపన్‍జేషన్ తీసుకొని మాకు సహకరించండి. అన్నాడు. మీరు సహకరిస్తే మీమీద పెట్టిన కేసులు ఎత్తివేస్తం, అన్నాడు. అయితే చేసేది ఏమిలేక విసిగిపోయినటువంటి ప్రజలు సరే అన్నట్టుగా తలలూపారు.
సర్వేర్లు సర్వేచేయడం ప్రాంభించారు. సర్వేలల్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి. వున్న వాళ్లు పైసలు బెట్టి వాళ్ల యిండ్లకు ఎస్టిమేషన్లు ఎక్కువగా వేపించుకున్నారు. మరో కొత్త విషయం ఏందంటే? వూరికి దొరలు రావడం, వారి యొక్క యిండ్లను దగ్గెరవుండి, తమ పలుకు బడితో ఎక్కువ ఎస్టిమేషన్లు తెప్పించుకోవడం జరిగింది. వుత్తపుణ్యానికి పోతయనుకున్న భూములకు కోట్లు రావడం దొరలకు సంతోషకరమైన విషయం. యిట్లా వాళ్ల భూమలకు, యిండ్లకు కోట్లు రావడం జరిగింది.
మామూలు యిండ్లున్న పేద ప్రజలకు చాలా తక్కువగా పైసలు రావడం జరిగింది. అయితే ఏం చేయలేక ప్రజలు నోర్లు మూసుకున్నారు.
ప్రజలల్లో ఒకరకమైన అసహనం ఏర్పడ్డది. అన్నలు జెండలు పాతిన భూములన్నీ దొరలకు పిల్లలు జేసి పైసలు తెచ్చిపెట్టే, ఎప్పటికైనా దొరలు, దొరలే అనుకున్నారు. కొంతమంది మాత్రం అన్నలు భూములల్లా జెండాలు పాతి దున్నుకోండ్లంటే ఎవరన్న ముందుకువచ్చిండ్లా? మన చేతకాని తనానికి వాళ్లనంటే ఏం లాభం అనుకున్నారు.
దొరలు మాత్రం విజయగర్వంతో మీరు మమ్ములను ఏం చేయలేరు? మాకు అండగా గవర్నమెంటున్నది. పోలీసులున్నరు. అని వాళ్లకే వాళ్లే అనుకుంటా వూరిమీద కోపంతో వెళ్లిపోయారు.
మా వూరి సర్పంచికి కూడా లాభం బాగానే జరిగింది. తనయొక్క యిల్లుకు ఎస్టిమేషన్ ఎక్కువగా ఏపించుకున్నాడు. కుక్కపేరునక్కపేరు బెట్టి కూలి వేతనాలు దొబ్బాడు. యిట్లా సర్పంచి కోట్లు గడించాడు. యిప్పుడు అతనికి ఇరువై ముప్పైమంది మనుషులు. యిప్పుడు వూరికి నయా దొర అయ్యిండు.
‘అధికారం డబ్బు, పలుకుబడి ఎవరి దగ్గెర వుంటుందో వాడే దొర’ ఎంంతో మంది కరుడుగట్టిన భూస్వాములను, నరహంతక దొరలను వూల్లల్లనుంచి తరిమి కొట్టిన ప్రజలు ఈ నయా దొరకు ఏ విధంగా గుణపాఠం చెప్పుతారోమరి చూడాలి.
ఈ జ్ఞాపకాలన్ని గుర్తుకువచ్చేటప్పటికి నా గుండె మొద్దు బారిపోయింది. అయినా సరే ముందుకే పోవాలి. యిట్లా ఆలోచిస్తూ! గ్రామపంచాయితి దాటిపోతున్నా నాకు ఎడుమవైపు పడమరదిక్కుగా ఎన్నో బీడు భూములు కనిపించాయి. గ్రామపంచాయితి కాన్నుంచి చూస్తే కంటినదరుకు కనిపియ్యనంత దూరం మొత్తం దొరల భూములే. ఈ భూములల్లో ఎంతమంది రక్తం ఏరులై పారిందో, ఎంతమంది తల్లులను కైకిల్లకు తీసుకపోయి చెరిచారో, ఎంతో మంది ప్రాణాలతో ఈ రూపం తీసుకున్న భూములు, యిప్పుడు ప్రాజెక్టులో మునిగిపోయాయి. మల్లా ప్రాజెక్టువల్ల దొరలకే లాభం జరిగింది. కొన్ని కోట్ల రూపాయాలు దొరలకు వచ్చాయి.
అంతా....తల్ల కిందుల సమాజం. ఈ తల్లకిందుల సమాజం సీద అయ్యే వరకు ఈ లోకంలో ఈ దేశంలో పేదలు, కష్టజీవులు, శ్రమజీవులు బతకలేరు....బతకరు.....బతకలేరు....
యిట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకు పోయినకొద్ది ప్రాజెక్టునీల్లు కనబడుతున్నాయి. ‘‘ప్రాజెక్టు మున్నుతిన్న మంజేరుగున్న తీరుగాకనపడుతంది’’ ఈ నీల్లను చూస్తే ఒకపక్క సంతోషం, యింకోపక్కబాధ. ఈ నీల్లు ఎవరికి వుపయోగపడుతున్నాయి. యిక్కడి భూములను, మనుషుల బతుకులను, సర్వం మింగిన ప్రాజెక్టు యిక్కడి ప్రజలకు మాత్రం వుపయోగపడదు. ఎక్కడో రెండు, మూడు వందల కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దనగరాలకు వుపయోగపడుతున్నాయి నీల్లు. మా పక్కనే పెద్ద సముద్రం లెక్క ప్రాజెక్టువుంటుంది. మాకు మాత్రం తాగుదామంటే గుటికెడు నీల్లుండవు. మా ఒక్క గుంటెడు భూమిని కూడా ఈ నీల్లు తడుపవు. మాకు ఎంత మాత్రం వుపయోగపడని ఈ ప్రాజెక్టు మాకెందుకు? ప్రాజెక్టులకు భూములు యివ్వడమంటే తాము సచ్చి యింకొకరికి నీల్లు యివ్వడమే. యిది ఈ దేశంలో ప్రాజెక్టుకింద భూములు పోయిన ప్రజల దుస్థితి.
యిప్పటికైనా ప్రభుత్వాలు కల్లు తెరిసి ప్రాజెక్టు చుట్టుపక్కల వున్న చెరువులకు పంపింగ్ ద్వారా ప్రాజెక్టునీల్లు పంపించి స్టోరేజ్ చేసి రైతులకు వుపయోగపడేవిధంగా చేయాలి. యిట్లా చేస్తే పంటలు పండే అవకాశం వుంటుంది. అలాగే ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రజలకు తాగునీరిందంచాలి.
చీకటి అయితంది...నేను తిరుగు ప్రయాణమయ్యాను. ఆ సూర్యుడు చీకటిలోకి ఎట్లా వెళ్లిపోతున్నాడో నా మనసు కూడా దు:ఖం అనే చీకటిలోకి వెళ్లి పోతుంది. ‘‘అస్తమించిన సూర్యుడు వుదయించకమానడు. అట్లాగే చీకటితో గడ్డకట్టుకపోయిన నా హృదయం వెలుగునివ్వక మానదు’
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు