మా రచయితలు

రచయిత పేరు:    రమ

కథలు

పోరాటమే బతుకు

అంత చలిలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా రోడ్లనే నివాసాలుగా ఏర్పరుచుకున్నా వేలాది మంది రైతులే సుధ ఆలోచనల్లో మెదులుతున్నారు. ఎంత పట్టుదల వాళ్లది ,వాళ్లకు జరిగిన అన్యాయం కాదు, భవిష్యత్తు తరాలకు జరగబోయే అన్యాయం గురించి వాళ్ళ పోరాటం అంటూ సుధ తన రోజువారీ డైరీలో రాసుకుంటుంది. సుధ ఒక సామాజిక కార్యకర్త.రోజు పడుకునే ముందు తన రోజు వారీ కార్యక్రమాలు డైరీలో భద్ర పరుచుకోవడం సుధ కు అలవాటు. ఆ వ్రాసే క్రమంలోనే ఆ తీవ్రమైన చలిలో చివరి శ్వాస వరకు పోరాడి చనిపోయిన రైతులు గుర్తుకు రాగానే సుధ మనసు చలించి పోయింది ,ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై పోయింది. కాసేపటికి తనని తాను కొద్దిగా తమాయించుకుని ఏదైనా పుస్తకం చదివితే కొద్దిగా ఆలోచనల నుంచి బయట పడవచ్చు అని అనుకుంటుండగానే ఫోన్ మోగడం మొదలైంది.

ఈ సమయంలో ఎవరూ అనుకుంటూనే చూసేసరికి కవిత నుంచి ఆ ఫోన్.

అప్పుడు గుర్తొచ్చింది."ఈరోజు ఆ బస్తీకి వెళ్లి వాళ్లను కలుస్తాను అని చెప్పిన విషయం, కవిత ఏమనుకుందో" రాలేకపోయానని బాధపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది సుధ.

"హలొ కవిత... సారీ నేను రాలేకపోయాను" అని సుధ మాట పూర్తి కాకముందే..

 "సర్లే అక్క ఎదో పనివల్ల రాలేకపోయావేమో..." అని కవిత చెప్పడం మొదలుపెట్టింది.

"ఈ రోజు బస్తీకి ప్రభుత్వం ద్వారా బోరు మంజూరు అయింది అక్క" అని చెప్పగానే...

"అరే మంచివిషయం చెప్పావు కవిత,ఇక కొద్దీ రోజుల్లో మీ నీళ్ల కష్టాలు తీరబోతున్నాయన్న మాట" అని సుధ సంతోషపడింది.

 ఎందుకంటే సుధ కు తెలుసు ఆ బస్తీ వాసూలు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకంటూ ఒక స్థిరమైన  గూడును ఏర్పర్చుకోవడం కోసం ఎంత పోరాటం చేస్తున్నారో, నీళ్ల కోసం ఆ బస్తీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వారం రోజులకు ఒకసారి వచ్చే నీళ్ల ట్యాంకరు, అది కూడా వీళ్లు ఫోన్లు చేసి,చేసి బతిమాలుకుంటేనో లేకపోతే నేరుగా పోయి తీసుకువచ్చుకుంటేనో వచ్చే ట్యాంకర్ దగ్గర అప్పటివరకు కష్టసుఖాలు మాట్లాడుకునే వారు కూడా ఒక్కసారిగా అసలు ఒకరికి ఒకరు ఎవ్వరో తెలియనట్లుగా ప్రవర్తించేవారు, మరి ఆ విధంగా ఉండేది వాళ్లకు ఆ నీళ్ల సమస్య. ఎవరింటికైనా చుట్టాలు వచ్చారు అంటే పాపం వాళ్ళు ఎప్పుడు వెళ్లి పోతారా అనుకునేంతగా.. ఎండాకాలం అయితే ఆ బాధలు వర్ణనాతీతం. "మొత్తానికి సమస్య కొలిక్కి వచ్చింది అన్న మాట కవిత" అని సుధా అనగానే,

"కొలిక్కి లేదు, పాడు లేదు అక్క... ఎక్కడున్నా సమస్య అక్కడే ఉంది" అని చెప్పింది.

"ఏమైంది కవిత ...?" సుధా అడిగింది.

"ఎక్కడైతే ఒక మంచి పని వల్ల అందరి సమస్య తీరుతుందో అక్కడ తప్పకుండా ఆ మంచి పనికి అడ్డుపడే వారు ఒకరు ఉంటారు.అలాగే ఆ బస్తీలో ఒక వ్యక్తి ఉన్నాడు సరిగ్గా అక్కడే వాళ్ళ ఫ్లాట్ ముందే పాయింట్స్ చూపించిందని" చెప్పి కవిత ఒకేసారి నిట్టూర్చింది.మళ్లీ కవితనే మొదలు పెడుతూ "ఇన్ని రోజులు ఎక్కడో ఉన్న నీళ్లను బస్తీలో కి తెప్పించడానికి పోరాటం, ఇప్పుడేమో బస్తీ లోనే భూమిలో ఉన్న నీళ్లను బయటికి తీయడానికి పోరాటం బతుకంతా పోరాటమే అవుతుంది కదా అక్క" అని అన్నది.

"నిజమే కవిత... బతుకంతా పోరాటమే ఇప్పుడు ఏకంగా మనిషి జీవనానికి ముడిపడి ఉన్న పోరాటం జరుగుతుంది" అన్నది సుధా.

 "ఏమైంది అక్క... ఏ పోరాటం, ఎవరి గురించి చెప్తున్నావు" అని అడిగింది కవిత.

మనం తినే బుక్కెడు బువ్వ కోసం వారు నిరంతరం శ్రమ లో, మట్టిలో మగ్గిపోయి వాళ్ళు మట్టి బుక్కి,మనకు నాలుగు మెతుకులు పెడుతూ వాళ్ళ జీవితాన్ని మొత్తం మట్టిలో ధారపోసే రైతన్నలు ఈరోజు ప్రభుత్వం చేసిన చట్టాల వల్ల తమ ఉనికిని కోల్పోయే స్థితిలోకి రైతు నెట్టివేయబడుతున్నాడు, తన పంట పొలంలో తనే కూలీగా మారబోతున్నాడు, ఆనాడు మన తాతల, తాతలు అనుభవించిన బానిసత్వం, వెట్టిచాకిరీ లోకి తిరిగి మళ్ళి నేటి రైతన్నలు నెట్టి వేయబడ బోతున్నారు కవిత. భారతదేశాన్ని మొత్తం అమ్మకానికి పెట్టిన ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరంచేస్తూ, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వాలు ఈరోజు పిడికెడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చే రైతును ,బుక్కెడు బువ్వను కూడా ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చాయి.ఆ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో కొన్ని వేల మంది రైతులు ఇంత చలిలో కూడా చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా కొన్ని రోజులుగా జీవించే హక్కు కోసం పోరాడుతున్నారు కవిత.

"ఎం చట్టాలు అక్కా అవి? “అన్నది కవిత...

ప్రభుత్వం కొత్త చట్టాల ద్వారా  రైతులు పండించిన పంటను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా అమ్ముకోవొచ్చు అంటుంది.ఎక్కువ లాభాలకు అమ్మొచ్చు , మద్దతు ధర కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు అంటుంది..కానీ ఇలా చెప్పడంలోనే అసలు మోసం దాగి ఉంది కవిత.. ఉన్న కొద్దీ పాటి భూముల్లో దుక్కి దున్ని పంట వేసుకోలేక అప్పుకోసం అర్తి దుకాన్ల దగ్గర పంటను తాకట్టు పెట్టుకొనే రైతు ఉన్న దగ్గర పంట అమ్ముకోకుండా ఎక్కడికో పోయి ఎట్లా అమ్ముతారు. "మధ్యలో కవిత కల్పించుకుంటు ఇప్పటికి ఊర్లల్లో కాలం దగ్గర పడుతుంది అంటే రైతు కంటికి కునుకే ఉండదు కదా అక్కా.. "అవును కవిత"..ఇప్పటికి ఊర్లల్లో రైతు దుక్కి దున్నే ముందే అర్తి దుకాణం కాడా అప్పుతెచ్చుకుంటాడు, అట్లా పండించిన పంటను ప్రభుత్వం ఎక్కువ ధరకు అమ్ముకొండి మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం ధరల విషయంలో అంటుంది.పండించిన పంట విలువ రైతుకు తెలుసుకాబట్టి దానికి తగ్గట్టు గానే గిట్టుబాటు ధర అడుగుతాడు,కానీ ముందే ఒక ధర నిర్ణయించుకొని రైతుల దగ్గరికి వచ్చే ప్రైవేటు దళారులు రైతులు చెప్పిన ధరకు ససేమిరా ఒప్పుకోరు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అడ్డికి పావు సేరు అమ్ముకోలేరు కదా కవితా... పోనీ నిల్వ చేసుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకుందాం అంటే రైతుకు అక్రమ గోడౌన్లు ఏమి లెవయే..ఈ కొత్త చట్టాలతో రైతుల కేమి ఒరిగేది  లేదు కవితా.ఇంకో కొత్త రకం ఊబి లోకే రైతు నెట్టివేయబడతాడు."మరి రైతులకు నష్టం తెచ్చే ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎవరి బాగు కోసం తెస్తుంది అక్కా..? ఇంకెవరి బాగుకోసం కవితా.. బడా,బడా పెట్టుబడిదారుల కోసం..కార్పొరేట్ శక్తుల కు భారతదేశాన్ని దారాదత్తమ్ చేస్తూ ఈ రోజు తినే తిండిని కూడా కార్పొరేట్ కబందా హస్తాల్లో బందించాలని ప్రయత్నిస్తుంది.మరోవైపు రైతులకు ఎదో మేలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటుంది..ఈ విషయాలన్నీ కింది స్థాయి ప్రజానీకానికి చాలా వరకు తెలియదు కవితా."

 నిజంగా ఇదంతా మాకు తెలియదు అక్క, అంత పెద్ద పోరాటం గురించి తెలుసుకోలేక పోయినందుకు కొంచెం బాధపడుతూ...

ఎప్పుడూ మా బస్తీ సమస్య, ఇంటి సమస్యల గురించే ఆలోచించు కుంటాం,ఇదే పెద్ద పోరాటం అనుకుంటున్నాం. అసలు మనం బ్రతికీ ఉండడానికి కారణమైన రైతుకు కష్టం వస్తే మనం ఎలా చూస్తూ ఊరుకుంటం అక్క ,అందరి నోటి కాడి బుక్క రాబందుల్లా వచ్చి తన్నుకు పోతుంటే ఎలా చూస్తూ ఊరుకొంటాం..రేపు నువ్వు బస్తీకి రా అక్క..అందరిని జమ చేసి మనమేం చేయాలో ఆలోచిద్దాం..  అంది కవిత.

"సరే కవిత తప్పకుండా రేపు కలుద్దాం,అంటూ ఫోన్ పెట్టేసింది" సుధా..

 కవిత మాటలతో కొత్త ఆలోచనలో పడింది సుధ. ఏం చేయాలి ,ఎలా మాట్లాడాలి.అందరినీ ఒకచోట ఏలా చేర్చాలి ఇవే ఆలోచనలు... ఏదో మగతగా నిద్ర పట్టింది సుధ కు.

ఆ నిద్రలో "ఒక బుట్ట పట్టుకొని దాంట్లో రొట్టెలు పెట్టుకొని రైతుల నిరసనలో అందరికీ పంచుతున్న చిన్నారి".ఆ దృశ్యం కళ్ళ ముందు అవిష్కృతం కాగానే..సుధ పెదాలపై చిన్న చిరునవ్వు మొలకెత్తింది.

 

ఈ సంచికలో...                     

Sep 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు