నిట్ట నిలువుగా నీడ మెదిలితే
నా కన్నా! నువ్వొచ్చావనుకున్నా.
నిను కన్న నా బిడ్డ పేగుకే తెగులొచ్చిందో ?
కోసి,తీసేసి, కరెంట్ పెడతారంట !
మూణ్ణెల్లు పారిన ఎర్ర కాలువలో
జబ్బు ఎదురీది వచ్చింది కామోసు.
కళ్ళు బైర్లు కమ్మితే,నీ మీది బెంగనుకునేను.
కాళ్ళు పీకితే,వయసు మీరిన నిస్సత్తొనుకునేను.
నోరెండిపోతుంటే వేసంగి లెమ్మని పొద్దు పుచ్చాను.
ముప్పు ముంచి మీ అయ్య చేతులు
నన్ను మోసేదాక కానుకోలేదురా!
వెన్ను మంచానికి ఆన్చి,
చేతి ముడుతలు సవరించి,
ఏ తల్లి కన్న బిడ్డ దయనో
ఎర్రగా నరం లోకి ఎక్కించిన వేళ
చెరుపు మరుపుల సందున
నీ పిలుపు 'అమ్మా' అని సోకినట్టై,
ఆశ కనురెప్పలు దాటి పొంగి,
కాలు చెయ్యాడనీదు.
అప్పుడెపుడో దూరాభారం పోయిన కొడుకా!
ఈడ ఎటు చూసినా నాలాటి అమ్మలే.
ఇంటి ముంగిట కళ్ళాపి జల్లింది మొదలు,
రోజూ ఏటి నీరు,ఇంటి బరువు మోసినోళ్ళమే.
ఎన్ని పేనాల రాక,ఎన్ని పేనాల పోక చూస్తిమో,
ఇప్పుడిక మా బతుకు గతుకుల లెక్క తేలాలి!
ఆడోళ్ళ వార్డులో ఈ ఆఖరి చూపు
ఒంటిరెక్క తలుపు కిర్రుమన్నన్ని సార్లు,
గుండె దరువును మోగిస్తూనే ఉంటుంది .
ఎవరి బిడ్డ పలకరింపు కు ఒచ్చినా,
మా అందరి ఆశలూ ఎగదోసిన దీపంలా ఎలిగిపోతాయి.
మీ నాన్న కండువాలో ఇంకిపోయే
వెచ్చని కన్నీటి చుక్కగానైనా
ఒకసారి వచ్చి పోరా!
(గైనిక్ వార్డ్ గోడల కన్నీటి చారికలు)