మా రచయితలు

రచయిత పేరు:    రాధ మండువ

ఇంటర్వ్యూలు

పిల్లలకి కథల పుస్తకాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి – మండువ రాధ 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మండువ రాధ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.         రాధ గారూబాలసాహిత్యంలో రాధ మండువ గారు ఒక ప్రత్యేకమైన రచయితగా గుర్తింపు పొందారు. ఇందుకు దారితీసిన పరిస్థితులు, మీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి?

మా ఊరి పేరు మండువవారి పాలెం.  ఒంగోలుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న పల్లె.  పట్టణ వాతావరణం మా ఊర్లో చాలా ఎక్కువే.   నా చిన్నతనంలో మా ఊళ్ళో ప్రతి ఇంటికీ ఒక పత్రిక వచ్చేది.  ఒకరి నించి ఒకరు తీసుకుని వాటిని చదివేవారు.  నేను వాటిని చదివేదాన్ని.  నేను పదో తరగతిలో ఉన్నప్పుడు మా ఊరి కోడళ్ళు (మా బంధువులు)  రోజూ స్కూల్ కి ఒంగోలు వెళ్ళే నా చేత నవలలు అద్దెకి తెప్పించుకునేవారు.  అవి నేను బస్ లో వస్తూనే చదివేసేదాన్ని. 

విపరీతంగా రోజుకి రెండు మూడు నవలలు, పత్రికలు చదివిని రోజులు ఉన్నాయి.  అలా నాకు సాహిత్యం పట్ల అభిలాష కలిగింది.  మావారు కూడా చాలా లోతుగా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన మనిషి కనుక తర్వాత నాకున్న చదివే అభిలాషని రాసే విధంగా మార్చుకున్నాను.  చాలానే రాశాను.  వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 

2.         సాహిత్యంలో మీకు తోడ్పాటు అందించిన వారు ఎవరు ?

కథలు రాస్తాను.  పాఠకులకు నచ్చి చదివి అభినందిస్తే ఉత్సాహం కలుగుతుంది.  కాని నేను మాత్రం నా సంతోషం కోసం రాసుకున్నాను/రాస్తున్నాను అంటాను.  ఏదైనా ఓ విషయం గురించి - అది కథైనా, సమీక్ష అయినా, కవిత అయినా రాసిన రోజు నేను ఆనందంగా ఉంటాను.  అందుకే రాస్తానేమో! తోడ్పాటు అంటే మా వారు పిడూరి రాజశేఖర్ చాలా ప్రోత్సాహం ఇస్తారు. 

3.         బాల సాహిత్యంలో వచ్చిన మార్పులు రావాల్సిన మార్పుల గురించి మీరు ఏమనుకుంటున్నారు?

- ఒకప్పుడు మన ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాల గురించిన సాహిత్యం లేదు.  ఇప్పటికీ కూడా రామాయణ భారత భాగవత కథలు ఉన్నాయేమో కాని ప్రబంధాల గురించిన కథలు లేవనే చెప్పాలి.

- సంప్రదాయ సాహిత్యం మంచిదే కానీ దేశకాలపరిస్థితులకు తగిన కథలు కూడా రావాలి. 

- బాలసాహిత్యానికి బొమ్మలు చాలా అవసరం అని గుర్తించి ప్రచురించే ప్రచురణకర్తలు దొరకడం కష్టంగా ఉంది.   ఆర్టిస్ట్ లని ప్రోత్సహిస్తూ అందమైన బొమ్మలతో కూడిన బాలసాహిత్యం ప్రచురించే దిశగా మార్పు రావాలి.

4.         వర్తమాన సమాజానికి బాలసాహిత్యం ఎందుకు, ఎంతమేరకు అవసరం అని మీరు భావిస్తున్నారు?

ఈ ప్రశ్న కొంచెం మారుద్దాం.  ఎప్పుడైనా బాలసాహిత్యం అవసరమే.  అది ఎన్నో రకాలుగా పిల్లలకి ఉపయోగపడుతుంది.  పిల్లలు కథలు చదవడమే కాదు వారికై వారు కథలు రాయడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి -

* పఠన, శ్రవణ, లేఖన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి.

* వేగంగా, అందంగా, కుదురుగా రాయడం అలవడుతోంది.

* ఏకాగ్రత, సృజనాత్మకత పెంపొందుతోంది.

* వాక్యనిర్మాణం, రాసే తీరు తెలుసుకోగలుగుతున్నారు.

* దగ్గర కూర్చోపెట్టుకుని రాయించడం వల్ల, వాళ్ళు కూడా ఆసక్తితో రాస్తున్నారు

కనుక దోషాలు పరిహరించుకోగలుగుతున్నారు.

* ఏఏ విరామచిహ్నాలను ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకోగలుగుతున్నారు.

* వాళ్ళు రాసిన కథలను వారే మళ్ళీ, మళ్ళీ తిరగ రాసే క్రమంలో సరిదిద్దుకునే

నైపుణ్యాన్ని అలవరచుకుంటున్నారు.

* నూతన పదాలను తెలుసుకుని వాటిని తమ కథల్లో ఎలా ఉపయోగించుకోవచ్చో

తెలుసుకుంటున్నారు.

5.         బాలల సాహిత్య రచయితలకు గుర్తింపు ఉందంటారా? బాల సాహిత్య రచయితలను ఏ విధంగా గుర్తించాలి? గౌరవించాలి? ప్రోత్సహించాలి?

ఫరవాలేదు.  ఇప్పుడు బాగానే ప్రోత్సహిస్తున్నారు.  మంచి కథలు, కాలానికి నిలబడే కథలు రాసినప్పుడు గౌరవం అదే వస్తుంది.  ఇక నాకు ఈ గౌరవాలు, అవార్డులు పట్ల పెద్ద నమ్మకం లేదు.  మనం రాసే అక్షరం మనకి గౌరవాన్ని ఇవ్వాలని నేను నమ్ముతాను. 

6.         మీరు బాల సాహిత్యం గురించి చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్ వివరాలు గోదావరి పాఠకులతో పంచుకోగలరా?

బాలసాహిత్యాన్ని ప్రచురించాలని సమగ్ర శిక్షా అభియాన్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ లో నన్నూ బాలసాహిత్య రచయితగా ఎన్నుకున్నారు.  నేను దాదాపు పదిహేనేళ్ళుగా చిత్తూరు జిల్లాలోని రిషీవ్యాలీ స్కూల్ లో తెలుగు టీచర్ గా పని చేస్తున్నాను.  కాబట్టి చిత్తూరు జిల్లా రచయితలు 20 మందిమి ఒక గ్రూప్ గా దాదాపు 150 కథలు రాశాము.  ఆ కథలన్నింటినీ చక్కగా కూర్చి, ప్రూఫ్ రీడింగ్ చేసే పనిని చేశాను.  ఇంకా ఎడిటింగ్ చెయ్యవలసిన పని ఉంది. 

అలాగే పత్రికల్లో వచ్చిన నా కథలు ముఖ్యంగా నేను అనుసృజన చేసిన రష్యన్ కథలను పుస్తకం గా తీసుకురావాలని ప్రయత్నంలో ఉన్నాను.  

ఒకటవ స్థాయి పిల్లలకి - అంటే అప్పుడే చదవడం నేర్చుకున్న పిల్లల కోసం "గోరుముద్దలు" అనే పేరుతో పది లైన్లతో కథలు రాస్తున్నాను.  వాటిని బొమ్మలతో ప్రచురిస్తే పిల్లలకి చాలా ఉపయోగం. 

ఎవరైనా ప్రచురణ కర్తలు ముందుకు వస్తే బావుండును అని అనుకుంటున్నాను.

7.         పిల్లలను, సాహిత్యంలోకి ఏ విధంగా ఆహ్వానించాలిఏ రకంగా ప్రోత్సహించాలి?

ప్రతి ఇంట్లోనో తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతలు పిల్లలకి చిన్నప్పటినించే కథలు చెప్పాలి.  టీచర్లు పిల్లలకి సాహిత్యం పట్ల అభిలాష కలిగించాలి.  పిల్లలు స్వయంగా చదువుకోగలిగేటట్లు ప్రోత్సహించాలి. 

8.         ప్రభుత్వ సంస్థలు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం బాలసాహిత్యానికి ఏ విధమైన తోడ్పాటును అందించాలని మీరు భావిస్తున్నారు?

ఖచ్చితంగా ప్రభుత్వమే తోడ్పాటుని అందించాలి.  పిల్లలు వారికై వారే చదవగలిగే బుల్లి బుల్లి కథలు అసలు లేవు.  అందమైన బొమ్మలతో కథలను ప్రచురించే ప్రణాళికను ప్రభుత్వం చేపట్టాలి.   పుస్తకాలు మరిన్ని ప్రచురించాలి.  ప్రతి బడిలోనూ మంచి లైబ్రరీని ఏర్పాటు చేయాలి.  లైబ్రరీ పీరియడ్ ని టైమ్ టేబుల్ లో పెట్టాలి. 

పిల్లల కోసం వేసే పుస్తకాలకు సబ్సిడీ ఇవ్వాలి.

లక్షల సంఖ్యలో ప్రచురించాలి. 

బహుమతులుగా పుస్తకాలు ఇవ్వాలి.

పిల్లలు రాసిన కథలని సేకరించి పుస్తకాలుగా ప్రచురించడానికి ప్రభుత్వం తోడ్పడాలి.

కేవలం పిల్లలు రాసిన కథలు ప్రచురించడం కోసం ప్రభుత్వం మాసపత్రిక నడపాలి.

9.         అనువాద బాల సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి ? విలువైన పుస్తకాలు తెలుగులోకి వచ్చాయా?

ఇప్పుడు వస్తున్నాయి.  ఇంకా రావాలి.  చాలా రావాలి. 

10.       తెలుగు నుండి అనువాదం కావాల్సిన బాలసాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

చాలా అనువదిస్తున్నారు.  మన సంప్రదాయ సాహిత్యాన్ని పూర్తిగా అనువదించేశారు ఇంగ్లీష్ లో.  ఇక్కడ మనం మాట్లాడుకోవలసింది.  అక్కడనించి మనం తీసుకుని రాయడం గురించి.  ఇంగ్లీష్ లో ఉన్నంత బాలసాహిత్యం తెలుగులో రావాలి.  మరిన్ని కథలను అనువాదం చేయాలి.  దానికి ప్రభుత్వం, ప్రచురణ కర్తలు రచయితలను ప్రోత్సహించాలి. 

11.       టీవీ, సినిమా, సెల్ ఫోన్స్ పిల్లలను ఆకర్షించినంత వేగంగా బలంగా సాహిత్యం కూడా ఆకర్షించాలంటే ఏం చేయాలి?

సాహిత్య స్వరూపం పిల్లలకి తగినట్లుగా ఉండాలి.  వారికి సంతృప్తిని కలిగించే కథలు సృష్టించాలి.  పుస్తకాలు బొమ్మలతో చూడటానికి అందంగా ఉండాలి.  ముఖ్యంగా అందుబాటులో ఉండాలి.  అందుబాటులో ఉండాలంటే ప్రతి ఊరికీ బాలల లైబ్రరీ ఉండాలి.  ఆసక్తి ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉద్యోగులను లైబ్రేరియన్స్ గా ఉంచాలి.  పిల్లలని లైబ్రరీ వైపుకి వచ్చేట్లు ఆకర్షణీయమైన కార్యక్రమాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.  పిల్లల చేత కథలు రాయించి ముద్రింపచేయాలి.

స్కూల్లోగాని, లైబ్రరీలల్లో గాని ఈ కార్యక్రమాలు నిర్వహించేప్పుడు టీచర్స్ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి -

* మొదట్లో ఉన్న ఉత్సాహాన్ని ఎప్పుడూ ఉండేట్లు చూసుకోవాలి.

* సమయం కేటాయించగలగాలి. ఓపికను కలిగి ఉండాలి.

* కొంతమంది విద్యార్థులలో సృజనాత్మకత తక్కువ ఉండవచ్చు లేదా అసలు

ఉండకపోవచ్చు. అది దోషం కాదు. అలాంటి వారిని నిరుత్సాహపరచకుండా వారికి

తగ్గ రీతిలో భాషానైపుణ్యాలను పెంపొందిపచేయాలి.

* రాసిన కథలన్నీ ముద్రింపబడతాయనీ, ముద్రింప పడనివి మంచివి కాదనీ,

అచ్చయిన కథలు రాసిన వారు గొప్పవారనీ మొదలైన అభిప్రాయాలు పిల్లల్లో

కలగకుండా జాగ్రత్త వహించాలి.

12.       గేయాల రూపంలో పద్యాల రూపంలో పాటల రూపంలో తెలుగు సాహిత్యం పిల్లలకు ఏమేరకు చేరువయ్యింది?

చాలా చక్కని బాలగేయాలు మనకి తెలుగులో ఉన్నాయి.  ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి.  అవి నిజంగా చాలా బావుంటాయి.  తెలుగు కాని వారిని కూడా అవి ఆకర్షిస్తున్నాయి. 

13.       రిషీవ్యాలీ విద్యా సంస్థ లో ఉపాధ్యాయురాలిగా మీ అనుభవాలు విశేషాలు..

వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం - ఈ భాషా నైపుణ్యాలలోని మొదటి మూడింటినీ విద్యార్థులకు నేర్పించడం తెలుగు భాషోపాధ్యాయులకు కొంత సులభమే. కథలు, కవితలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్ ద్వారా విద్యార్థులలో శ్రవణ, భాషణ, పఠనాసక్తులను కలిగించవచ్చు. కాని రాయడం పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించడం, వారి చేత దోషాలు లేకుండా రాయించడం కష్టంగా ఉంటోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ వాతావరణం ఎక్కువగా ఉన్న మా రిషీవ్యాలీ స్కూల్ లో తెలుగు రాయించడం పెద్ద సమస్య అనే చెప్పవచ్చు.

ప్రతి బుధవారం పిల్లలకి కథలని చదివి వినిపిస్తాను.   వారికై వారు చదవడం, రాయడం పట్ల కూడా పిల్లలకి ఆసక్తి కలిగించే విధంగా బుల్లిబుల్లి కథలని వారి చేత రాయిస్తాను. 

14.       తెలుగు బాల సాహిత్య వికాసానికి మీ సూచనలు ఏమిటి?

-  పిల్లల కథలు వర్తమాన జీవితానికి సంబంధించి ఉండాలి. 

-  పరిసరాల మీద అవగాహన కలిగించే కథలు రావాలి.

-  పిల్లల మెదడులో మౌలిక భావనలు బలంగా నాటే కథలు  - న్యాయమూ, నిజాయితీ, ధైర్యం, కార్యదీక్ష, మంచితనం, సాయం చేసే గుణం, స్నేహపాత్రత ఇలా పిల్లలకి సంతృప్తి కలిగించే కథలు రాయాలి.

- పిల్లల భావనాశక్తిని, నైతికతని పెంపొందించేలా కథలు ఉండాలి.

- పిల్లలు పెరిగేకొద్దీ వారి స్వభావాలు మారుతుంటాయి.  కాబట్టి రచనా స్వరూపం వారి వారి వయసుకు తగినట్లుగా ఉండాలి.  ప్రతి పుస్తకమూ ఏ స్థాయిలో ఉన్న పిల్లలకి  సంబంధించినది అన్న విషయం పుస్తకం మీద తప్పకుండా రాయాలి.

- వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయడం కోసం వివిధ దేశాల కథలను పిల్లలకు పరిచయం చేయాలి. 

*

స్థూలంగా చెప్పాలంటే పిల్లలకి కథల పుస్తకాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. తద్వారా పిల్లలకి కష్టం, విసుగు కలగకుండా - అసలు వాళ్ళకి తెలియకుండానే - భాషోపాధ్యాయులు విద్యార్థులకు భాషానైపుణ్యాలు - ముఖ్యంగా కష్టసాధ్యమైన లేఖనాన్ని కూడా అభివృద్ధిపరచవచ్చు.

 

****

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు