మా రచయితలు

రచయిత పేరు:    డా. ఎన్. గోపి

కవితలు

గొంగడి

మ్యూజియం వస్తువు కాదు

గొంగడి ఇప్పటికీ

మా యింట్లో వుంది.

దాన్ని చూసినప్పుడల్లా

గొర్రెల జ్ఞాపకాలు

మృదువుగా గుచ్చుకుంటాయి.

అడవి వాసనలు పరిమళిస్తాయి.

 

మా తాత సంగతి చెప్తా వినండి

గొంగడిని ఆయుధంగా మలిచి

ఎలుగుబంటిని తరిమికొట్టాడు

ఆనాటి వీరగాథలు

మా గూటిలో వెలిగే దీపకళికలు.

 

మా వూరి బాలుడు

చనిపోయినప్పుడు

గొంగడిలో చుట్టి

మోసుకెళ్లినట్టు గుర్తు.

చాలా రోజుల దాకా

అతడు మళ్ళీ లేచి వస్తాడని

ఎదురుచూసే వాళ్లం.

 

గొంగడిని కప్పుకుంటే

చలి భయం భయంగా

బయటనే తిరిగేది.

ఎంత మొండి ఎండైనా

కొంత సాధువైపోయేది.

వానచినుకులు

షవర్‌ధారల్లా జారిపోయేవి

అన్ని రుతువుల్లో తెరుచుకునే

అసితపుష్పంలా ఉండేది మా గొంగడి.

 

ఆకాశంలో మేఘాలు

గొంగళ్లలా పరుచుకుంటే

కింద బీరప్పలు ఆడుతున్నట్టు లెక్క.

ఎక్కడ వేసిన గొంగడి అక్కన్నే లేదు

దాని సంతానం

మంచుకొండల్లోని సైనికులను

ఉన్నికవచమై కాపాడుతుంది.

ఇవాళ గొంగడిలో కూర్చొని

వెంట్రుకలు కాదు

ఆత్మీయ ముచ్చట్లను ఏరుకుంటున్నాం.

 

నల్లని గొంగడిపైన

తెల్లని అంచు

కారుచీకటిలో

కాంతిరేఖలా వుండేది.

కొప్పెర వేసుకునే పెద్దాయన

ఎస్కీమో వేషం కట్టినట్టుగా వుండేది.

 

గొంగడి

తరం నుండి తరానికి

మొలకలు వారే నారుమడి.

చరిత్ర ఊటలూరే

బతుకుతడి.

 

పిల్లలూ!

గొంగడి పరుస్తున్నాను

రండి! కూర్చోండి!

ఏదీ ఇప్పుడు ఓసారి అనండి

Ba ba black sheep’

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు