మా రచయితలు

రచయిత పేరు:    విశీ

కథలు

కొన్ని ప్రేమలంతే!

ఐదు సెకన్లు.. ఐదంటే ఐదే సెకన్లలో జరిగిందది! పొయ్యి మీద టీ గిన్నె మరుగుతూనే ఉంది. హాల్లో టీవీ శబ్దం చిన్నగా వినిపిస్తోంది. ఎప్పుడొచ్చాడో చూడలేదు. వెనక్కి తిరగ్గానే టక్కున నా పెదాల మీద ముద్దు పెట్టాడు. నా వంక చూడకుండా హాల్లోకి వెళ్లిపోయాడు. గొంతులోంచి చిన్న శబ్దం కూడా రాలేదు. మెదడులో మాత్రం ఏదో గుచ్చినట్లు అనిపించింది. అతను వెళ్లిపోయాక ఆ నిశ్శబ్దం భరించడం కష్టమైంది. ఎందుకు? ఎందుకు చేశాడిలా?

నిమిషం తరువాత టీ కప్పు తీసుకుని హాల్లోకి వెళ్లాను. అతని ముఖంలో నవ్వు, బాధ, పశ్చాత్తాపం.. ఏమీ కనిపించలేదు. అసలేమీ జరగనట్టే టీవీ చూస్తూ ఉన్నాడు. వేడి వేడి టీ అతని ముఖం మీద పోయాలనిపించింది. అంత పనీ చేసేదాన్నే! ఏదో గుర్తొచ్చి ఆగిపోయాను. కళ్లలోంచి దుఃఖం పొంగుకొస్తోంది‌. ఎవరూ చూడకుండా ఏడవాలనిపిస్తుంది. అతను మాత్రం హాయిగా నేనిచ్చిన టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఏంటి? ఏమీ జరగలేదా? ఆ ముద్దు?

"అత్తమ్మ ఎలా ఉంది?"

"ఏమో!"

"ఊర్నుంచి రాలేదా నువ్వు?"

"బెంగళూరు నుంచి.. మళ్లీ సాయంత్రం వెళ్లిపోవాలి."

అక్కడ ఉండబుద్ధి కాలేదు. పక్కన గదిలో అత్తయ్య పడుకుంది. తను గానీ లేచి ఆ క్షణంలో చూసి ఉంటే? అమ్మో! మామూలు గొడవ జరిగేది కాదు. ఇద్దర్నీ నమిలేలా చూసి, తనని తిట్టి, వీలైతే కొట్టి బయటకు గెంటేసేది. ఆ తర్వాత నన్ను మాత్రం వదులుతుందా? చూడకపోవడం మేలైంది. ఛీ! ఏంటిలా ఆలోచిస్తున్నాను? జరిగింది ఎవరూ చూడకపోతే చాలా? అయినా ఇతనేంటి ఇంత హాయిగా ఉన్నాడు. అసలెందుకు వచ్చాడు?

"అతనెప్పుడొస్తాడు?"

ఏమో! ఎవరికి తెలుసు? ఆఫీసు ఐదింటికే అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్‌ని కలిసి కాసేపు బాతాఖానీ కొట్టి, గంటసేపు ట్రాఫిక్‌తో అల్లాడి ఏడు.. ఏడున్నరకు ఇంటికి చేరతాడు. అంతసేపూ కాపాడుకున్న ఉత్సాహం, ఓపిక ఇంటికి రాగానే మాయమవుతాయి. ఉసూరుమంటూ సోఫాలోనో, బెడ్రూంలో మంచం మీదే వాలిపోతాడు. మళ్లీ ఎనిమిదిన్నరకి భోజనానికి లేస్తాడు. రోజూ జరిగేదిదే!

"సాయంత్రం.."

"ఆఫీసు దూరమా?

"ఊ.."

ఏదన్నా పరుషంగా మాట్లాడి తనని బాధపెట్టాలని అనిపిస్తోంది. ఎందుకొచ్చావ్ ఇక్కడికి? ఏం పని నాతో? ఇన్నాళ్ల తర్వాత వచ్చి ఏం సాధిద్దామని? అని చొక్కా పట్టుకుని అడగాలని అనిపిస్తూ ఉంది. ఆ కోరికను బలవంతంగా అణుచుకున్నాను. మూడేళ్ల తర్వాత అతణ్ణి చూసిన ఆనందం నిమిషాల్లోనే మాయమై, కోపం పెరిగిపోతోంది. తను మాత్రం మాములుగా ఉన్నాడు. అత్తారింట్లో నేనేమీ అనలేనన్న ధీమాతో నన్నలా..!

పెళ్లయిన రెండు నెలల తర్వాత ఇంటికి అత్తమ్మ వచ్చింది. తను మా అత్తయ్యతో మాట్లాడుతూ ఉండగా బావ సంగతి వచ్చింది. "మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? పెళ్లిలో కన్పించలేదే" అని అత్తయ్య అడగ్గానే అత్తమ్మ ముఖం మారిపోయింది. అది బయటికి కనిపించనీయకుండా "బెంగళూరులో ఉద్యోగం. కొత్తగా చేరాడు. రావాలని చాలా అనుకున్నాడు. ఆఫీసులో లీవు దొరకలేదు" అని సర్దిచెప్పింది. అలాగా అని మా అత్తయ్య ఊరుకుంది కానీ, అది అబద్ధమని నాకు తెలుసు. లీవు దొరికినా బావ రాడు.

చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే పెరిగాం. చుట్టాలందరికీ మేమంటే మొగుడు పెళ్ళాలన్న ఆలోచనే ఉండేది. స్కూల్లో కూడా ఫ్రెండ్స్ 'మీ బావ.‌. మీ బావ' అని ఆటపట్టించేవారు. మరి ఆ వాతావరణం వల్లనో, ఏమో నాకూ మేం భార్యాభర్తలం అన్నట్టే అనిపించేది. తనతో కలిసి మెలిసి ఉన్నా ఎవరూ కాదనేవారు కాదు. నాన్న మాత్రం కోప్పడేవాడు. ఆయన మనసులో ఏముందో తెలిసేది కాదు. "బావమరదల్లేగా!" అని అమ్మ అంటే 'అయితే ఏంటి?' అన్నట్టు కొరకొర చూసేవాడు.

ఆ సాయంత్రం అత్తమ్మతో కలిసి బజారుకు వెళ్తుంటే చెప్పింది. "వాడు చాలా బాధపడుతున్నాడే! ఏం చేస్తాం? తలరాత. రోజూ ఫోన్ చేసి నీ గురించి అడుగుతాడు. తప్పు చేశానమ్మా అంటూ ఒకోసారి బాధపడతాడు. పోతే పోయిందిలే ఎక్కడో చోట సుఖంగా ఉండనీ దాన్ని అంటాడు. లోపల ఎంత బాధుందో తెలియదు" అత్తమ్మ మాటలకు ఏడుపొచ్చింది. కళ్లు తుడుచుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ తను మా ఇంటికి రాలేదు. నేను ఊరెళ్లినప్పుడు పలకరించడం తప్ప వాళ్లింటి సంగతులేవీ తెలియదు. బావ ఫోన్ నెంబర్ మారింది. కొత్తది తీసుకొని తనతో మాట్లాడాలన్న ఆసక్తి పోయింది. బావ ఊరికి రావడం మానేశాడు. మూడేళ్లు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. ఇవాళ మళ్లీ కనిపించాడు.

నాన్నకు తెలియకుండా బావతో సినిమాకో, గుడికో వెళ్లడం తప్ప అంతకు మించి మా మధ్య జరిగిందేదీ లేదు. ప్రేమ, విరహం లాంటి మాటలు కూడా ఎప్పుడూ మా మధ్య రాలేదు. నేను ఇంటర్ పూర్తయ్యే నాటికి బావ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాడు. అతని తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. వాళ్ల బాధ్యత తనదే! నన్ను పెళ్లి చేసుకుంటాననీ, నాతోనే జీవితం పంచుకుంటాననీ మాటలేమీ ఇవ్వలేదు. కానీ తనకో ఉద్యోగం దొరికితే నాకేదో మేలు జరుగుతుందనిపించి, ఎదురు చూస్తూ ఉన్నా. రానే వచ్చింది. తన ఉద్యోగం కాదు, నాకు​ పెళ్లి సంబంధం.

"అప్పుడే పెళ్లేంటి? ఇంకా చదువుకోవాలని ఉంది" అని నాన్నకు చెప్పేంత ధైర్యం లేదు. అమ్మతో చెప్పినా తను నాన్నను ఒప్ఫించగలుగుతుందన్న నమ్మకం లేదు. బావ ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది. నేను​ ఇంట్లో లేనప్పుడు అత్తమ్మ రావడం నాన్నతో ఏవో మాట్లాడటం తెలుసు. బావతో నాకు​ పెళ్లి చేయమని అడిగేందుకు తను నా బావ అన్న ఒక్క కారణమే ఉంది. వద్దు అనేందుకు నాన్న దగ్గర చాలా కారణాలున్నాయి. 'మంచి సంబంధం. ఆడబిడ్డలు​ లేరు. ఒకడే కొడుకు. గవర్నమెంట్ ఉద్యోగం. ఇంతకంటే ఏం కావాలి?' నాన్న చెప్పే ఈ కారణాలు​ కాదని ఎవరు మాత్రం ఏం చెప్తారు? సరిగ్గా నా పెళ్లికి వారం రోజుల ముందు బావకి బెంగళూరులో ఉద్యోగం వచ్చిందన్న​ విషయం తెలిసింది. శుభలేఖలు పంచేశాక ఇంక పెళ్లిని అడ్డుకునేదెవరు? అప్పుడైనా బావ ఏదైనా చేస్తాడేమో, పెళ్లి ఆగిపోతుందేమో అనిపించింది. ఊహూ..! తనసలు మా ఇంటి ఛాయలకు కూడా రాలేదు. మరి నన్ను ప్రేమించలేదా? అదొక్కటి తెలుసుకోవాలని చాలా అనుకున్నా. కుదరలేదు.

"వెళ్లొస్తాను మరి!"

ఏమని చెప్పాలి? ఉండమనాలా? ముద్దెందుకు పెట్టావ్ అని అడగాలా? అసలు నన్ను ప్రేమించావా, లేదా అని నిలదీయాలా? ఇన్నాళ్లు రాకుండా ఇప్పుడెందుకు వచ్చి నా మనసులో చిచ్చు పెట్టావ్ అని అరవాలా?

తను లేచి బయటకు అడుగులేశాడు. వెనకాలే నేనూ వెళ్లాను. గేటు దాటాక నా వంక చూసి 'సారీ' అన్నాడు. "దేనికి?" కోపంతో అడిగాను. "అన్నింటికీ.." వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. ఇక ఎప్పటికీ ఇటు వైపు రాన్నన్న నిశ్చయమేదో అతని నడకలో కనిపించింది.

ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను. వదిలెళ్లిన జ్ఞాపకంలా అతను తాగిన కాఫీ కప్పు టీపాయ్ మీద ఉంది. ఎందుకొచ్చాడన్న ప్రశ్నకు సమాధానం దొరికింది​. కొన్ని ప్రేమలంతే అనుకుంటూ కప్పు తీసుకుని వంటింట్లోకి​ వెళ్లాను.

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు