మా రచయితలు

రచయిత పేరు:    ఆర్ ఉమాదేవి

కథలు

 మార్పు మనతోనే 

(మలిశెట్టి  సీతారాం స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ )

సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది.

పగలంతా ప్రచండ ప్రతాపం చూపించిన భానుడు మెల్లగా పడమటింటికి జారుకుంటున్నాడు.

నేను పొద్దున్న మిద్దె పైన వేసిన వడియాలు తీసి పెట్టి, శ్రీవారు వచ్చే టైం అయింది అనుకుంటూ కిందకు దిగి వచ్చాను.

అప్పుడే స్కూల్ నుండి వచ్చిన చిన్నూ బ్యాగు లోపల పెట్టి, డ్రెస్ కూడా మార్చుకోకుండా టీవీ ముందు కూర్చుని వాడికిష్టమైన కార్టూన్ ఛానెల్ పెట్టుకుని చూస్తున్నాడు.

చిన్నూ! లే! వెళ్లి డ్రెస్ మార్చుకొని మొహం కడుగు. టీవీ  తర్వాత చూద్దువు గానీ....చెప్పాను వాడితో.

కాసేపు అమ్మా!గారంగా అడిగాడు వాడు.

కుదరదు వెళ్లుమరో సారి గట్టిగా చెప్పేసరికి లేచి లోపలికెళ్ళాడు వాడు.

గబా గబా డ్రెస్ మార్చి, మొహం కడిగాడనిపించాడు.

ఆయన వచ్చేలోగా తినడానికి ఏదైనా చేద్దామని, కింద కూర్చుని ఉల్లిపాయలు తరుగుతున్న నా మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతూ   “ అమ్మా! ఐ వాంట్ ఏమన్నా...అన్నాడు గోముగా. 

వాడు అడిగే పద్ధతికి నవ్వొచ్చింది. ముద్దుగా వాడి బుగ్గలు పుణికి, ముందు రోజు చేసిన జంతికలు ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చాను. అవి పట్టుకెళ్ళి టీవీ ముందు కూర్చున్నాడు. 

రోజు ఐదున్నర లోపు వచ్చేసే మా వారు ఆ రోజు ఆరవుతున్నా రాలేదెందుకో....

మరో అరగంట గడిచాక వచ్చారు. బాగా అలసిపోయినట్టున్నారు. కొంచెం చిరాగ్గా కనిపించారు. రాగానే టీవీ చూస్తున్న చిన్నూ కనిపించేసరికి అతడి చిరాకు కోపంగా మారిపోయింది. 

ఎప్పుడూ టీవీ చూస్తూనే ఉంటాడు వెధవ. హోం వర్క్ చేసావా?” అడిగాడు అదే కోపంలో.... తను బజార్లో కొనుక్కొచ్చిన అరటిపళ్ళ కవర్ నా చేతిలో పెడుతూ.

బిక్కమొఖం వేసాడు చిన్నూ. వచ్చినప్పటి నుండి టీవీ చూడటమే సరిపోయింది.ఇక హోం వర్క్ ఎప్పుడు చేసాడు?

ఏంటి సుజా! వాడిని చదువుకోమని చెప్పకుండా నువ్వు ఏం చేస్తున్నావ్? వాడిని నెత్తికి ఎక్కించుకుని పనికిరాకుండా చేస్తున్నావ్?” నా మీద ధుమ ధుమలాడారు.

నేను మెల్లగా వాడికి లోపలికి వెళ్ళమన్నట్టు సైగ చేసాను.

వాడు గప్ చుప్ గా వెళ్లి పుస్తకాలు ముందేసుకున్నాడు.  వాడు చదువుతున్నది ఏడో క్లాసే అయినా చదువులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆయనకు నచ్చదు. అలాగని చిన్నూ మొద్దబ్బాయి ఏం కాదు. క్లాసులో మొదటి ముగ్గురిలోనే ఉంటాడు. అయినా సరే.. వాడి చేతిలో ఎప్పుడూ పుస్తకం లేకుంటే వాళ్ళ నాన్న అరుస్తూనే ఉంటారు.

తను ఫ్రెష్ అయి రాగానే కాఫీ అందించాను.                                                                                           “లాభం లేదు సుజా! వీడు ఇక్కడ ఉంటే చదవడు. ఎప్పుడూ టీవీ లేదా ఆటలు. నెక్స్ట్ ఇయర్ వీడిని హాస్టల్ లో వేసేయ్యాలి. మంచి ఐఐటి కోచింగ్ సెంటర్ చూసి చేరిస్తే ఇంటర్ లో మంచి మార్కులు,ఐఐటి లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందిఅన్నాడు కాఫీ తాగుతూ.

ఇప్పటి నుండి హాస్టల్ ఎందుకు? వాడు అసలు ఉండగలడో...  లేదో...ఇక్కడ బాగానే చదువుతున్నాడు కదా!అన్నాను మెల్లగా.

నువ్వు వాడిని ఇలా ముద్దు చేసి ఇప్పటికే చాలా పాడు చేసావ్.. ఏం...వీడోక్కడేనా? మా కొలీగ్స్ చాలా మంది ఇప్పటికే వాళ్ళ పిల్లలను హాస్టల్ లో పెట్టేశారు. మన వాడు ఇప్పటికే వెనుక పడ్డాడని నేను అనుకుంటుంటే....నువ్వు ఇంకేం చెప్పకు. ఈ సారి వాడిని హాస్టల్ లో వేయాల్సిందే..అతడి గొంతులో ఖచ్చితత్వం నన్ను మరి మాట్లాడనివ్వలేదు.

చదువుల పేరుతో పిల్లల్ని ఇలా రాపాడించేయడం, ఆడుతూ పాడుతూ గడపాల్సిన వారి బాల్యాన్ని హరించేయడం  నాకు అసలు ఇష్టం ఉండదు. కాని ఆ మాట అంటే అందరూ నన్ను పిచ్చిదానిలా చూడటం నేను ఎరుగుదును. అందుకే నోరు మెదపలేదు. 

పడుకోబోయేముందు మరో సారి చిన్నూను హాస్టల్ లో చేర్చే విషయంలో తను స్థిర నిర్ణయమే తీసుకున్నట్టు మా ఇద్దరినీ మరో సారి హెచ్చరించాడు.

ప్రతి సారిలా ఆయన హాస్టల్ అనడం...నేను వాడింకా చిన్నపిల్లాడని వాయిదా వెయ్యడం ...ఈ సారి జరగలేదు. ఆయన   నిర్ణయం గట్టిగానే తీసేసుకున్నారు. మాకు రెండొందల కిలోమీటర్ల దూరంలో ఓ కార్పొరేట్ స్కూల్ లో ఫీజు కూడా కట్టేసి సీట్ బుక్ చేసేసారు. చేసేదేం లేక చిన్నూ గాడిని నేనే కాస్త మానసికం గా సమాయత్తం చెయ్యసాగాను. అక్కడ ఇంకా మంచి టీచర్లు ఉంటారు.బాగా చదువు చెప్తారు. నువ్వు బాగా చదువుకోవాలని కదా..డాడి అంత ఫీజు కట్టారు. నువ్వు బాగా చదివి పేద్ద ఉద్యోగం తెచ్చుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా... ఇలాంటి మాటలతో  వాడి బుర్రని రోజూ కాస్త శుధ్ధి చేసాను.

నిండా పన్నెండేళ్ళు కూడా లేని పసివాడు. ఏ చిన్న పని చేసుకోవడం చేతగాని వాడు. వాడిని అలా పంపడానికి నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళ నాన్నకు ఎదురుచేప్పే సాహసం చేయలేక పోయాను. ఎప్పుడూ అమ్మా అమ్మా అని నా చుట్టూ తిరిగే వాడిని వదిలి నేను ఉండగలనా...ఏమో వాడు వెళితే గాని తెలీదు. నేను చెప్పింది వాడికి ఏం అర్థమయ్యిందో తెలీదు కానీ హాస్టల్ లో చేరడానికి ఒప్పుకున్నాడు.

ఆ రోజు వాడిని హాస్టల్లో చేర్చడానికి వెళ్ళాం. ఏ నేరం చేయని బాలఖైదీలు అక్కడ చాలామందే ఉన్నారు.  చదువుల పందేరంలో  పిల్లలు పందెం కోళ్ళుగా  మారిన ఈ కాలంలో పుట్టడం వాళ్ళు చేసిన పాపం. తల్లి తండ్రులే ఆ జైలు శిక్షవిధించే జడ్జీలు అవడం మరో దారుణం.

కొంతమంది పిల్లలు తల్లి తండ్రులు వెళ్లిపోతుంటే ఏడుస్తున్నారు. మరికొంతమంది ఏవేవో కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది నిర్లిప్తంగా చూస్తున్నారు. మరికొంత మంది పిల్లలు అక్కడికి వచ్చిన పెద్దవారి దగ్గర, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి కాసేపు ఫోన్ ఇవ్వమని బతిమాలుకుంటున్నారు. ఆ సందట్లో పిల్లలు పారిపోకుండా అక్కడక్కడా వార్డెన్లు అనబడే జైలర్లు కాపలా కాస్తున్నారు. అలాంటిచోట నా చిన్నుని వదిలి వెళ్ళడానికి నాకు మనస్కరించడం లేదు. ఆయన కూడా ఆ వాతావరణం చూసి కాస్త మెత్తపడ్డ మాట నిజమే కానీ అంతలోనే తను కట్టేసిన లక్ష రూపాయల ఫీజు గుర్తొచ్చినట్టుంది.  ఇదంతా వాడి భవిష్యత్ కోసమే కదా..... అని తనను తాను, నన్ను కూడా సమాధానపర్చారు. చిన్నూకి మరి కొన్ని బుద్ధి మాటలు చెప్పి వాడిని అక్కడే వదిలి ఇంటికి తిరిగొచ్చేసాం.

ఆ రోజు రాత్రి కాలేజీ నుండి ఫోన్. కొత్తగా చేరిన పిల్లలకు మాత్రం మాట్లాడటానికి అనుమతి ఇచ్చారట. 

ఎలా ఉన్నావ్ చిన్నూ!..తిన్నావా!ఆత్రుతగా అడిగాను. వాడిని వదిలి కొన్ని గంటలే అయినా ఎన్నో యుగాలు అయినట్టుంది నాకు.

నాకిక్కడ ఏం బాలేదమ్మా! నువ్వు గుర్తొస్తున్నావ్...వాడి కంఠం లో ఏడుపు.

నాకు గుండె మెలిపెట్టినట్టు అయింది. తమాయించుకున్నాను.

కొత్త చోటు కదా నాన్నా! రెండు రోజులు పోతే అలవాటు అవుతుంది. ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకో.. మేము మళ్ళీ వచ్చే ఆదివారం వస్తాంగా ...నీకు వచ్చేటపుడు ఏం కావాలో చెప్పు. అవన్నీ తీసుకొస్తా...నా గొంతులో జీర వాడు గుర్తించకుండా జాగ్రత్త పడ్డాను.

నాకేం వద్దు....నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను...” 

అలా అనకూడదు నాన్నా! నీ కోసమేగా ....నువ్వు బాగా చదువుకోవాలనేగా ....అనునయించాను.

వాళ్ళ నాన్న కూడా కాసేపు బుజ్జగించారు. చివరకు టైం అయిపోయిందని వాళ్ళు ఫోన్ పెట్టేశారు.

నాది ఎంత రాతి గుండె! నువ్వు గుర్తొస్తున్నావమ్మా అని వాడు ఏడుస్తుంటే పరుగున వెళ్లి వాడిని తెచ్చుకోకుండా ఇంకా ఇక్కడే ఇంత నిబ్బరంగా ఉన్నాను.....తల్లికి, పిల్లలకు ఇంత వేదన కలిగించే ఈ చదువులు అవసరమా...అనిపించింది.

ఇక నాకు తిండి కూడా సహించలేదు. నిద్ర పట్టలేదు....అలా భారంగా నాలుగు రోజులు గడిచాయి.

  రోజు మావారు ఆఫీస్ కు వెళ్లి పోయాక మనసును కాస్త మళ్లిద్దామని టీవీ ఆన్ చేసాను. నా కర్మకొద్దీ ఒక ఛానల్ లోతారే జమీన్ పర్సినిమా వస్తోంది. సరిగ్గా నేనున్న మానసిక స్థితికి అద్దం పడుతున్నట్టు  ఆ సినిమా లో కూడా ఇలాగే చిన్న పిల్లాడిని హాస్టల్ లో చేర్చి వస్తున్నపుడు బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తోంది.

అమ్మా! నేనెపుడు నీకు చెప్పలేదు...కాని నాకు చీకటంటే చాలా భయం...నీకెపుడు చూపలేదు కానీ నువ్వంటే నాకెంతో ప్రేమ..నీకన్నీ తెలుసుగా అమ్మా....నీకు నా పిలుపు వినిపించనంత  దూరంగా నన్ను వదిలేయకమ్మా ........నేను మరీ అంత చెడ్డ వాడినా అమ్మా....”  ఆ పాటలో ఒక్కొక్క వాక్యం శూలమై గుండెల్లో దిగుతూ ఉంటే  నా కనులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. టీవీ లో ఆ కుర్రాడు మాయమై నా చిన్నుగాడు కనిపిస్తున్నాడు. పాటలో తర్వాతి వాక్యం నా గుండెని నిట్టనిలువునాచీల్చింది. క్యా ఇత్నా బురా......మేరీ మా...... నా గుండె నిజంగానే పగిలి ముక్కలయింది. ఇక నా వల్ల కాలేదు. టీవీ కట్టేసాను. సాయంత్రం ఆయన వచ్చేసరికి ఏడ్చి ఏడ్చి వాచిపోయిన నా ముఖం  చూసి కంగారు పడ్డారు.

ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?” ఆందోళనగా అడిగారు.

చిన్నూ లేకుండా ఉండలేక పోతున్నానండి. ప్రతి క్షణం వాడే గుర్తొస్తున్నాడు.మళ్ళీ నా కళ్ళలో నీళ్ళూరాయి.

నువ్విలా అయిపోతావని నేను ఊహించనే లేదు. నాకు మాత్రం వాడి మీద ప్రేమ లేదంటావా..ఈ పోటి ప్రపంచం లో వాడు ఎక్కడ వెనుక పడతాడో అనే తాపత్రయం నాకు ఉండదా...ఇప్పుడు వాడు అక్కడ అడ్జస్ట్ అయిపోయే సమయానికి నువ్విలా అయిపోవటం ఏం బాగాలేదు.ఆయన గొంతులో కాస్త బాధ, కాస్త కోపం....

తను ఏం చెప్పినా నాకు ఎక్కటం లేదు. వాడి దృష్టిలో నేను చెడ్డ తల్లిని ఎప్పటికీ అవలేను.వాడెలా చదివినా సరే... చదవకున్నా పర్లేదు...వాడిని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ప్రతి క్షణం నువ్వు గుర్తొస్తున్నావమ్మా అని వాడన్న మాటే చెవుల్లో  వినిపిస్తోంది.అన్నాను. 

సరే! ఈ ఆదివారం వెళదాం. వాడు పూర్తి ఇష్టంతో అక్కడే ఉండిపోతానంటే ఉండనివ్వు. దాన్ని నువ్వు చెడగొట్టకు. అలా కాకుండా వాడు వచ్చేస్తానంటే తీసుకొచ్చేద్దాం. ముందు నువ్వు ఆ ఏడుపు ఆపెయ్యి. నేను చూడలేను.అనునయించారు నన్ను.

ఆదివారం ఇద్దరం వెళ్ళాం. మమ్మల్ని చూసి పరుగెత్తుకుంటూ వస్తాడనుకున్నా....దూరం నుండి మమ్మల్ని చూసి నెమ్మదిగా వచ్చాడు. మనిషిలో గానీ, నడక లో గానీ ఉత్సాహమే లేదు. అన్ని రోజుల తర్వాత మమ్మల్ని చూసిన ఆనందo కూడా  లేదు వాడి ముఖంలో.

ఎలా ఉన్నావ్ చిన్నూ!వాడిని దగ్గరకు తీసుకుని అడిగాను.

మౌనంగా తల ఊపాడు. నేను తీసుకెళ్ళిన వాడికి ఇష్టమైన తినుబండారాలు ఇచ్చాను. కనీసం అవి ఏమిటో అని కూడా తెరిచి చూడలేదు. ఏమడిగినా ఆ...ఊ...అని తల ఊపుతున్నాడు గాని పన్నెత్తి మాట్లాడటం లేదు. 

ఇక్కడ ఎలా ఉంది నాన్నా! నీకు బాగో లేకుంటే చెప్పు...నాతో వచ్చేద్దువు గానీ....అడిగాను.

వద్దు అన్నట్టు తల ఊపాడు.

ఒక మాటకు పది మాటలు మాటలాడే కబుర్ల పోగు వాడు. వాడి మౌనం నన్నెంతో బాధ పెడుతోంది.

మాట్లాడు నాన్నా! నా మీద కోపమా!

వాడు పెదవి విప్పాడు.ఇక్కడే ఉంటాలేమ్మా! నాన్న ఫీజు అంతా కట్టేసాడుగా...నేను వచ్చేస్తే వాళ్ళు వెనక్కి ఇవ్వరుట....ఇక్కడ బాగానే ఉందిలే

వాళ్ళ నాన్న కట్టిన ఫీజు వృధా అవుతుందని అక్కడే ఉండిపోవడానికి సిద్ధం అయ్యాడన్న మాట. అలాంటి పిచ్చిసన్నాసి ని వదిలి నేనెలా ఉండటం? ఆయన సైగ చేశారు ఇక ఎక్కువ వాడిని కదపకు అని.

తిరిగి ఇద్దరం ఇల్లు చేరాం. కానీ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయాను. చిన్నూ ఇంట్లో ఉన్నపుడు ఎప్పుడూ లొడలొడా మాట్లాడుతూ ఉండేవాడు. బంధువులు ఎవరు వచ్చినా చక్కగా కబుర్లు చెప్పేవాడు. మిగతా పిల్లల్లా ఫోన్ తోనో... కంప్యూటర్ గేమ్స్ తోనో ఉండిపోకుండా అందరితో బాగా కలిసి పోతాడని అందరూ వాడిని మెచ్చుకునేవారు. వారం రోజుల్లోనే వాడి కళ్ళలో ఎంత నిర్లిప్తత....ఎంతో చనువుగా ఉండే నాతో కూడా అపరిచితుడిలా ఉండిపోవడం.....ఇవన్నీ చూస్తుంటే చదువు అయిపోయే సరికి మాతో అసలు ఏదైనా అనుబంధం మిగిలి ఉంటుందా అని అనుమానం కలుగుతోంది.

ఈ పసివయసులో పెద్దల్ని ఎదిరించలేని నిస్సహాయత లోంచి రేపు ఎవరి మాట వినని మొండివాడు తయారు కావచ్చు. ఆ నిర్లిప్తత లోంచి తల్లిదండ్రులయందు దయలేని పుత్రులు పుట్టుకురావచ్చు. లేక మనమెవరం గుర్తించలేని ఒక అసాంఘిక శక్తి గా కూడా మారవచ్చు.ఇవేవీ కాక చదువుల ఒత్తిడి తట్టుకోలేక తమ జీవితాలను తామే అంతం చేసుకోవచ్చు.        పసి హృదయాలు ప్రేమాభిమానాల మధ్య ఎదగాలి కాని అభద్రత, ఆందోళనల మధ్య  కాదు.  ప్రేమ రాహిత్యంతో తయారైన యువత ఆ ఇంటికే కాదు....  సమాజానికి కూడా చేటే.                                         

అందరూ చేసే తప్పు నేను చేయదలుచుకోలేదు. మనసులో గట్టి నిర్ణయం తీసుకుని, వాడిని ఇంటికి తీసుకొచ్చేయమని మావారిని  మళ్ళీ అడిగాను.

వాడు ఉంటానంటే మధ్యన నీ గొడవ ఏమిటి?” విసుగ్గా అన్నారు మా వారు.

వాడు ఎందుకు ఉంటానంటున్నాడో మీరు వినలేదా? మీ కట్టిన డబ్బు వృధా అవుతుందని అన్నాడే గాని వాడికి కూడా ఇష్టం లేదు. మీకు వాడి కంటే డబ్బు ఎక్కువా.... అదంతా నాకు తెలీదు. వాడిని ఇక్కడికి తీసుకొచ్చేయండి..మొట్ట మొదటి సారిగా ఆయన నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాను.

నీకు ఏమైనా పిచ్చా? లక్ష రూపాయల ఫీజు కట్టాను. కాలేజీ వాడు ఒక దమ్మిడి కూడా వెనక్కి ఇవ్వడు. ఇక్కడ చేర్చాలంటే మళ్ళీ ఫీజు కట్టాలి. ఇదంతా నా వల్ల కాదు...ఆయన కూడా ఖరాఖండిగా చెప్పారు.

నేను ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయాను. కాసేపు ఏడ్చి ఊరుకుంటుందని ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ తను ఊహించినట్టు జరగలేదు. వారం రోజులైనా నేను నా పట్టు విడువలేదు.

 నా నిరాహార దీక్షలకి,మౌన వ్రతాలకు ఆయనకు దిగి రాక తప్పలేదు. మా పెళ్లి అయిన ఇన్నేళ్ళలో నేనిలా దేని కోసమైనా గొడవ చేయడం ఆయన చూడలేదు. చిన్నూ మీద చూపిన కఠినత్వం నా మీద చూపలేకపోయారు. ఆ పై ఆదివారం ఆయన ఒక్కడే వెళ్లి చిన్నూ ని తీసుకొచ్చేసారు. 

ఎలా అఘోరిస్తారో మీ ఇష్టం. వాడి భవిష్యత్ ను తీర్చి దిద్దుకుంటావో ....నాశనం చేస్తావో నువ్వే  తేల్చుకో.”  ఆ జైలు  నుండి వాడిని తీసుకు రావడం ఆయనకు కూడా లోలోపల సంతోషం కలిగించినా పైకి కోపాన్ని ప్రదర్శించారు నా మీద. బంధువులు, స్నేహితులు కొంతమంది నేను చాలా తెలివితక్కువ పని చేసానని విమర్శించారు. నేను దేన్నీ లెక్క చేయలేదు. చిన్నూ మునుపటిలా మారడానికి మరో వారం రోజులు పట్టింది.

మూడేళ్ళు గడిచిపోయాయి. పదో క్లాసు మంచి మార్కులతోనే పాసయ్యాడు.  వాడికి మార్కులు తక్కువ వచ్చినపుడు దానికి నేనే కారణం అని అరవటం....ఎక్కువ వచ్చినపుడు లోలోపల మురిసిపోవడం.....ఇదీ మా ఆయన గారి తంతు.

వాడి చదువు విషయం లో నేనెప్పుడూ బలవంత పెట్టక పోయినా చదువుకోవడం వలన ఎవరెవరు ఏమేం సాధించారు అనే ప్రేరణాత్మక విషయాలు వాడికి అప్పుడప్పుడు నూరిపోస్తుండే దాన్ని.చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే అని ప్రోత్సహించే దాన్ని. ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయాలని నేర్పేదాన్ని. తన కంటే చిన్నవారి పట్ల ప్రేమతోనూ పెద్దవారి పట్ల గౌరవంగానూ మెలగాలని చెప్పేదాన్ని. వాడు మంచి విద్యార్థిగా కంటే మంచి వ్యక్తిగా రూపు దిద్దుకోవాలని  నా తాపత్రయం. అంతేకాదు వాళ్ళ నాన్నగారు వాడిని చదువుకోమని చెప్పడంలో కూడా వాడి ఉన్నతి గురించి ఆకాంక్షే గానీ వాడి మీద ప్రేమ లేకపోవడం కాదు అని తనకు అర్థమయ్యేలా చెప్పడం లో కూడా సఫలీకృతురాలిని అయ్యాను.

ఇంటర్ లో చేర్చాలని అన్నపుడు కూడా మళ్ళీ హాస్టల్ అని చెప్పి చేతులు కాల్చుకోవటం ఎందుకని మా ఊర్లోనే ఓ కాలేజీ లో చేర్చారు వాళ్ళ నాన్న. వాడి మిగిలిన స్నేహితులు అంతా తలో దిక్కున కార్పోరేట్ కాలేజిల్లో చేరారు. 

ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి రిజల్ట్ వచ్చిన రోజు.....

చిన్నూకి ఎంసెట్ లో మంచి రాంక్ వచ్చింది. టౌన్ లోనూ, కార్పొరేట్ కాలేజీల్లో చదివిన వాడి స్నేహితులందరి కంటే కూడా మంచి రాంక్ వచ్చింది. వాడి కాలేజీలో ఇంతకుముందు వచ్చిన రాంకులలో కూడా వాడిదే బెస్ట్. కాలేజీ వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి వాడిని కాలేజీకి రమ్మనడంతో  చిన్నూ తయారై కాలేజికి వెళ్ళాడు. సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చే సమయానికి లోకల్ న్యూస్ ఛానెల్ లో చిన్నూ గాడి  ఇంటర్వ్యూ వస్తోంది. కాలేజీ పేరు, చిన్నూ గాడి పేరు వినగానే పరుగున వంటింట్లోంచి వచ్చాను.  పసివాడు కెమెరాలను,మైకుల ను చూసి భయపడతాడనుకున్నా.... నా కళ్ళకు వాడెప్పుడు పసివాడే మరి. నన్ను ఆశ్చర్యపరుస్తూ మైకు తీసుకుని చక్కగా మాట్లాడాడు.

నా విజయానికి కారణమైన మా అమ్మా నాన్నలకు నా ధన్యవాదాలు. సాధారణ కాలేజీలో కూడా బాగా చదవగలనని నన్ను నమ్మిన మా అమ్మ, ఆమె నమ్మకాన్ని నమ్మి లక్ష రూపాయల ఫీజు కూడా వదులుకుని ఇక్కడ చేర్చిన మా నాన్న, నాకు చదువు చెప్పిన నా గురువులు.....అన్ని వేళల తోడ్పాటు అందించిన కళాశాల యాజమాన్యం అందరికీ నా కృతజ్ఞతలు. నిర్భంధంగా కాకుండా స్వేచ్చగా చదువుకోనిస్తే అందరూ నాలాగే  అద్భుతాలు సాధించగలరు.అని ముగించాడు. వాడికి చదువు చెప్పిన గురువులు వాడెంత బుద్ధిమంతుడో అంటూ ఆకాశానికి ఎత్తారు. టీవీ లో  చూస్తున్న నాకు ఆనందభాష్పాలతో  కళ్ళు చెమర్చడంతో బొమ్మలు మసకబారాయి. వీడెప్పుడూ నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు వెధవ అని మనసులో ప్రేమగా వాడిని తిట్టుకున్నా.

బయట అన్ని రకాల పళ్ళను పక్వానికి రాక ముందే చెట్టునుండి వేరు చేసి కార్బైడ్ వేసి మాగపెడుతున్నారని....అలా చేయడం వల్ల అవి రుచి పచి లేకుండా పోతున్నాయని,ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయని మనమే గగ్గోలు పెడుతుంటాం. మరి పిల్లల విషయం లో మనం ఏం చేస్తున్నాం? పన్నెండో తరగతి లో చదవాల్సిన విషయాలు ఆరో తరగతి లోనే చదివించేయాలనుకుంటున్నాం. పాతికేళ్లలో సాధించాల్సినవి టీనేజ్ లో సాధించడం లేదని బాధ పడుతున్నాం. వెరసి వారిని కూడా రుచి పచి లేని పళ్ళ లాగే... ప్రేమ, పాశం లేని మరబొమ్మలుగా తయారు చేస్తున్నాం. సమాజానికి చేటు తెస్తున్నాం. మరి మార్పు మనతోనే మొదలు పెడదామా........

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు