మా రచయితలు

రచయిత పేరు:    డా. కొమర్రాజు రామలక్ష్మి

సాహిత్య వ్యాసలు

దళిత మహిళా చైతన్యాన్ని ఎత్తిపట్టిన ‘కెరటం’

        దళిత రచయిత్రి తాళ్ళపల్లి యాకమ్మ జీవితంలో కష్టనష్టాలను అధిగమించి ఉన్నతస్థాయికెదిగినా ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలి అన్నట్లు తను పుట్టి పెరిగిన మూలాలను మరచిపోకుండా తెలంగాణాలో దళితుల పేదరికం, ఆకలి, అమాయకత్వం, అసహాయత, కష్టాలు, కన్నీళ్ళు, ఇతర వర్గాల నుండి వాళ్ళు ఎదుర్కొనే వివక్ష, అణచివేతలాంటి అనేక అంశాలను చూసి, విని వాటిని ఇతివృత్తంగా చేసుకొని రాసిన తన మొదటి నవల కెరటం’.

            ఈ నవలలో భిన్న మనస్తత్వాలు గల వివిధ పాత్రలున్నప్పటికీ ప్రధానపాత్ర మల్లమ్మది. నర్సయ్య, ఎల్లమ్మల అధిక సంతానంలో ఒకతైన మల్లమ్మ పెళ్ళి ప్రస్తావన, ప్రయత్నాలతో కథ మొదలవుతుంది. పెళ్ళంటే ఏమిటో తెలియని పసి వయసులో పెద్ద వయసువాడు, రెండవ పెళ్ళివాడు, అమాయకుడు అయిన మల్లయ్యతో మల్లమ్మ పెళ్ళవుతుంది. అంటే వాళ్ళలో బాల్య వివాహాలు సాధారణమని అర్థమవుతుంది. పెళ్ళి పిల్లను పెళ్ళి పిలగాని ఇంటికి తోలుకొని పోవడం, పోలు పొయ్యడం, కాని పెట్టడం, పాటలతో జరిగే పెళ్ళి తంతు, ఒడి బియ్యం పొయ్యడం లాంటి అంశాలు వాళ్ళ కుల ఆచారాన్ని సంప్రదాయాలను సూచిస్తాయి.

            చిన్న పిల్ల అయిన మల్లమ్మ అత్తగారింట్లో మల్లయ్య అన్న, వదినల అధీనంలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఆమెను చాలా రకాలుగా కష్టపెట్టడం, ఆమె ఓర్పుతో సహించడం అమాయకుడైన మల్లయ్య అన్న, వదినల ఆగడాలను ప్రశ్నించలేక భార్య పడే కష్టాలను చూడలేక బాధపడడం వంటి అంశాలతో కథ సహజంగా సాగుతుంది. భార్య బాగు కోసం ఆలోచించే మల్లయ్య ఆమెను వాళ్ళ అమ్మమ్మగారింటికి తీసుకెళ్ళడం, అక్కడ అందరూ ఆనందంగా ఉండడం ఒక ఊరటగా అనిపిస్తుంది. ఇక్కడ పురుషాహంకారం లేకుండా మల్లయ్య భార్యను ప్రేమించడం, ఆమె గురించి ఆలోచించడం మంచి పరిణామంగా అనిపిస్తుంది. పొలాలు, పూట గడవడమే కష్టమైన పరిస్థితులు, కూలీల వ్యధలు అవసరాలకు దొరల దగ్గర అప్పు చేయడం, అప్పు తీరేదాకా వాళ్ళ దగ్గర పని చేయాల్సి రావడంతో పాటు రజాకార్ల సమస్య, దొరల ధాష్టీకం వంటి అంశాలను చదివినప్పుడు రచయిత్రికి వాటి పట్ల ఆవేదన, సంబంధిత విషయాలపై ఆమె నిశిత పరిశీలనా దృష్టి అర్థమవుతుంది.

            మల్లయ్య, మల్లమ్మలకు మొత్తం సంతానం అయిదుగురు ఆడపిల్లలు అందులో ముగ్గురు కేవలం సరైన పోషణ లేక పాలు కూడా దొరకని పరిస్థితిలో చనిపోతారు. బతుకు పోరులో భాగంగా అదే పనిగా ఎదురయ్యే కష్టాలను తట్టుకోలేని మల్లయ్య వేరే ప్రాంతాలకు వలస వెళ్తాడు. కొత్త చోటులో తెలిసిన వాళ్ళెవరూ లేక పరాయిగా ఉంటూ బతుకుల్ని వెళ్ళదీసే వలస కూలీల జీవితాలు ఎంత దుర్భరమో, అక్కడ నిలదొక్కుకోవడం, మంచితనంతో మనగలగడం ఎంత కష్టమో ఈ నవలలోని అనేక సంఘటనలు తెలియజేస్తాయి. అయితే మనషుల్లో ఉండే మంచితనం ఎవరో తెలియని వాళ్ళను కూడా అయిన వాళ్ళను చేస్తుందనడానికి వాళ్ళ దగ్గరలో ఉండే ఒక ముస్లిం కుటుంబంతో వాళ్ళకు ఏర్పడిన అనుబంధం, రెండు కుటుంబాల మధ్య పెరిగిన ఆత్మీయత ఒక నిదర్శనం. ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే సంభాషణలు, ఒకరికి ఒకరు తోడుగా నిలవడం హిందూ ముస్లింల ఐక్యతను చాటే విధంగా ఉంటాయి.

            ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. పుట్టుక నుండే కష్టాలు, చేదు అనుభవాలతో రాటుదేలిన మల్లమ్మ, ఒక సాధారణ గృహిణి అయిన మల్లమ్మ కష్టపడే తత్వంతో, నిజాయితీతో చుట్టుపక్కల అందరి మన్ననలు పొందుతుంది. ముగ్గురి పిల్లల తరువాత పుట్టిన బిడ్డ ఆకలిని తీర్చాలనే ఆశతో, ఆ బిడ్డకు వరి అన్నం పెట్టాలనే బలమైన ఆకాంక్షతో కల్లం దగ్గర ఉన్న పొల్లు తూర్పారపట్టి వడ్లను తియ్యాలని వెళ్ళిన చోట ఒక పాము వెంటబడుతుంది. దండంపెట్టి భయపడుతూ వేడుకుంటుంది. అయినా అది తన వెంటే రావడంతో వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితిలో తెగువ చేసి ఒక కర్రతో దాన్ని చంపుతుంది. ఆ సమయంలో లింగయ్య అనే అతను లేని పాము ఉన్నట్లుగా చెప్పి ఆమెను భయపెట్టి పంపించి మోసంతో ఆమె కష్టఫలాన్ని పొందాలనుకుంటాడు. ఆ మోసాన్ని గ్రహించిన మల్లమ్మ పట్టు వదలకుండా తను కష్టంతో సంపాదించుకున్న వడ్లను దక్కించుకుంటుంది. అప్పటినుండి ఆమె పడిలేచే కెరటమై తమకు ఎదురయ్యే ప్రతి సమస్యనూ ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుంటుంది.

            ఆ తరువాత మల్లమ్మ మళ్ళీ ఇంకో బిడ్డకు తల్లయ్యే క్రమంలో ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడుతున్న మల్లమ్మను హాస్పిటల్‍కు తీసుకెళ్ళడం దగ్గర నుండి ఇంటికి చేరడం వరకు అన్నీ సమస్యలే మనుషుల స్వార్థం, సంకుచితతత్వం అలాంటి సమయాల్లోనే బయటపడతాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రయివేటు ఆసుపత్రిని నడుపుతూ వృత్తిని వ్యాపారంగా మార్చాలనుకునే డాక్టర్‍, నర్సుల ప్రవర్తన, అదే ప్రభుత్వ ఆసుపత్రిలో మానవతావాదంతో ఆదుకునే ఒక డాక్టర్‍. ఆ డాక్టర్‍ మల్లమ్మను ప్రాణాపాయస్థితి నుండి కాపాడుతుంది. కానీ బిడ్డను మాత్రం బతికించలేకపోతుంది. ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటళ్ళలో ఉండే నిర్లక్ష్యం, అలసత్వం, ఒకరినొకరు పట్టించుకోక పోవడం అదే సమయంలో వెల్లివిరిసే మంచితనం లాంటి విషయాలను వివిధ సంఘటనల ద్వారా నిరూపిస్తుంది రచయిత్రి. అక్కడ డాక్టర్‍ సుశీల మాటలతో ప్రభావితురాలైన మల్లమ్మ ఎట్లా అయిన బిడ్డ అనితను బాగా చదివించాలని సంకల్పిస్తుంది.

            తరువాత మల్లయ్య మల్లమ్మలు వాళ్ళకు యజమాని కేటాయించిన కొంచెం భూమిని సాగు చేయడం కోసం రెక్కలు ముక్కలు చేసుకోవడం, ఆడపిల్లకు చదువెందుకు అని ఎవరెన్ని అన్నా వినకుండా అమ్మాయిని చదివించాలనుకోవడంతో వాళ్ళ జీవితాలలో మార్పుకోసం ప్రయత్నం మొదలవుతుంది. ఇంకో ఆడపిల్లకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి ఆడపిల్లలు అని బాధపడకుండా వాళ్ళిద్దరినీ పెద్ద చదువులు చదివించి ఒకమ్మాయిని టీచర్‍ను ఇంకో అమ్మాయిని డాక్టర్‍ను చేస్తారు. ఇది ఒక సానుకూల పరిణామం. ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళకు ఒక సవాల్‍. కష్టేఫలి అని నమ్మిన మల్లమ్మ అనుభవం నేర్పిన పాఠాలే కాదు చదువునూ నేర్చుకుంటుంది. అభ్యుదయ దృక్పధంతో ఆలోచించి అంచెలంచెలుగా ముందుకెళ్తుంది. అసలు మీటింగ్‍ అంటే ఏమిటో తెలియని మల్లమ్మ వివిధ సమస్యలపై మీటింగుల్లో మాట్లాడే స్థాయికి ఎదుగుతుంది. రాజ్యలక్ష్మి అనే ఒక ఆదర్శ మహిళ స్ఫూర్తితో గ్రామ నాయకత్వాన్ని చేపడుతుంది. ఆచరణాత్మకతతో అడుగు ముందుకేస్తుంది. అభివృద్ధిని సాధిస్తుంది. అంబేద్కర్‍ భావజాలంతో ప్రభావితురాలై దళితులంతా తమ దృష్టిని చదువు, రాజకీయాలపై పెట్టాలని బోధిస్తూ, దళితులు, బహుజనుల పక్షాన నిలిచి అభివృద్ధి  ఫలాలు అందరికీ దక్కే విధంగా కృషి చేస్తుంది.

            రాజయ్యలాంటి దుర్మార్గుల ధాష్టీకాన్ని ప్రశ్నించి, ఎదిరించడం, కుల వివక్ష ఉన్న సమాజంలో కుల పట్టింపులు లేని ఉప్పలయ్య పాత్ర, అందరి బాగునూ కోరుతూ మల్లమ్మ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆమెను రాజకీయంగా ఎదిగేలా చేసే రాజ్యాలక్ష్మి పాత్రను సృష్టించడంతో పాటు, బిడ్డలను చదివించి, ఉన్నత స్థాయిలో ఉంచడం, ముఖ్యంగా వాళ్ళ కులాంతర వివాహాలను ప్రోత్సహించడం దళితులు, మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం వల్ల మాత్రమే బహుజనుల బతుకుల్లో మార్పు సాధ్యమవుతుందనే ఆలోచనా ధోరణి రచయిత్రి అభ్యుదయ భావాలకు అద్దం  పడుతుంది. నవల చాలావరకు తెలంగాణా మాండలికంలో సాగడాన్ని బట్టి తెలంగాణా భాష, యాస పట్ల రచయిత్రికున్న  మక్కువ అర్థమవుతుంది.

            చివరకు ఏ రాజకీయ పార్టీ ప్రలోభాలకు లొంగక శ్రమశక్తిని నమ్ముకొని స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి, అసెంబ్లీ స్థాయికి చేరుకొని ప్రజావారధిగా మారి తన ఊపిరి ఉన్నంత వరకు దళితులు, బహుజనుల పక్షాన పోరాడాలని నిర్ణయించుకొని ఉన్నత వ్యక్తిత్వంతో ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మల్లమ్మ. ఒక సాధారణ మహిళను అసాధారణ మహిళగా తీర్చిదిద్ది, దళితుల, మహిళల చైతన్యాన్ని కాంక్షిస్తూ కెరటంను సృజియించిన డా।। తాళ్ళపల్లి యాకమ్మకు అభినందనలు.

                                                                                               

సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే శివరాజు సుబ్బలక్ష్మి కథలు

ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి 1925 సెప్టెంబర్‍ 17న ఆంధప్రదేశ్‍లోని తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరంలో జన్మించారు. తల్లిదండ్రులు సత్యవతి, ద్రోణంరాజు సూర్య ప్రకాశరావుగార్లు. సుబ్బలక్ష్మిగారికి 12 ఏళ్ళ వయస్సులో చివరకు మిగిలేదినవలతో విశేష గుర్తింపు పొందిన రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు)తో వివాహమయింది. పురాణాలు చదివి అర్థం చెప్పగల బుచ్చిబాబు నాయనమ్మ సుబ్బమ్మగారి వద్ద భారత భాగవతాలు చదవటం అలవాటైంది. నిత్యపాఠకుడు, రచయిత అయిన బుచ్చిబాబు సాహచర్యం, ఆయనకోసం ఇంటికి వచ్చిపోయే మొక్కపాటి, విశ్వనాధ సత్యనారాయణ, ఆచంట జానకీరామ్‍, ఆచంట శారదాదేవి, పింగళి లక్ష్మీకాంతం లాంటి వారితో సాహిత్య సంభాషణలలో పాల్గొనటం సుబ్బలక్ష్మి గారిలో సాహిత్య సృజన చేయాలనే కోరికను కలిగించాయి. భర్త బుచ్చిబాబు కథలకు మొదటి పాఠకురాలు కావడం ఆమెలో కథ నడిపే నైపుణ్యాన్ని పెంచింది. దాంతో 1960లలో  ఆమె కథారచన ప్రారంభం అయింది. ఆమె మంచి చిత్రకారిణి కూడా తండ్రి దగ్గర కావ్యాలను చదువుకున్న సుబ్బలక్ష్మి రచనలకు, చిత్రలేఖనాలకు బుచ్చిబాబు స్ఫూర్తినిచ్చేవారట.

   అదృష్టరేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు నవలలతోపాటు కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనో వ్యాధికి మందుంది, కాపురం, మగతజీవి చివరి చూపు మొదలైన కథలను సుబ్బలక్ష్మి రచించారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం, ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.  తన స్నేహాన్ని, ప్రేమను ఎందరికో పంచి ఇస్తూ నిండు జీవితాన్ని (95 సం।।లు) అనుభవించిన శివరాజు సుబ్బలక్ష్మి ఈ ఫిబ్రవరి 6న బెంగుళూరులో మరణించారు.

   సుబ్బలక్ష్మిగారు రచించిన ఎనిమిది కథలతో మగత జీవి చివరి చూపుఅనే కథా సంపుటి 1964లో వచ్చింది. దీనిని ఆదర్శ గ్రంధ మండలి, విజయవాడ వారు ప్రచురించారు. మగత జీవి చివరి చూపుఅనే కథలో ఒక అసహాయురాలైన స్త్రీ (కాంతమ్మ) సంవేదనకు సంబంధించిన పాత్ర ప్రధానమైనది. చిన్న వయసులోనే ఒక ముసలాయనతో పెళ్ళి కావటంతో కష్టాల పాలైన కాంతమ్మ చిన్న పిల్లతో అనేక అవస్థలుపడుతూ ఉంటుంది. మొదటి నుంచీ ఆమె అసహాయతను ఆసరా చేసుకొని వెంకటేశం అనే అతను వెంటపడి ఆమెను ఏడిపిస్తూ ఉంటాడు. ముసలాయన కూతురు, అల్లుడు వాళ్ళ ఎదురింట్లోనే ఉంటారు. సవతి తల్లిని భరించలేని కూతురు ఆమెను అనుమానిస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచి మనిషైన అల్లుడు ఆమెకు అవసరమైన సహాయం చేస్తూ ఉంటాడు. అది భరించలేని కూతురు, వెంకటేశం, చుట్టు పక్కలవారు ఆమెను అపార్థం చేసుకొని మాటలతో బాధిస్తూ ఉంటారు. చివరకు కూతురు కాంతమ్మ మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఆమె కావాలనుకుంటుంది. చివరి క్షణాల్లో పశ్చాత్తాపంతో చూసే కూతుర్ని, వెలిగిపోయే అల్లుడి కళ్ళను తృప్తిగా చూస్తుంది. ఈ కథలోని పాత్రలన్నింటినీ చాలా సహజంగా చిత్రించారు సుబ్బలక్ష్మి. ఇది చదువుతున్నంత సేపూ వీళ్ళంతా మన చుట్టూ ఉన్నవాళ్ళే అనిపిస్తుంది. ఎప్పుడైనా చివరకు మంచితనమే గెలుస్తుంది కదా ! ముందు అపార్ధంతో చెడుగా ఆలోచించినా, తరువాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపాన్ని వెల్లడించడం ద్వారా చివరి దశలో ఉన్న మనిషికి తృప్తి కలిగించడం సమాజానికి ఒక మంచి సందేశం.

   మరొక కథ కాపురంజానకి పెళ్ళితో మొదలై పెద్ద కోడలుగా అత్తగారింటికి వెళ్ళడం, అక్కడి పద్ధతులు, పరిస్థితులు కొత్తగా అనిపించడం, తరువాత అలవాటుపడడంతో కథ మొదలవుతుంది. అత్తగారి పెత్తనం, అజమాయిషీ, తోటికోడళ్ళ నిర్లక్ష్య ప్రవర్తన పెద్ద కోడలైన జానకికి బాధ కలిగిస్తాయి. మామగారి మంచితనం కొంత ఊరట పెద్ద కోడలికి బాధ్యతలు, బంధాలను భరించడంతోపాటు ఉమ్మడి కుటుంబంలోని మనుషుల మధ్య కోపతాపాలు, అపోహలు, అపార్థాలు, అపేక్షలు, అలకలతో కథ కొనసాగుతుంది. చిన్న కోడళ్ళతో సమస్యలను ఎదుర్కొన్న అత్తగారికి పెద్ద కోడలి మంచితనం అర్థమవుతుంది. జానకి భర్త రామం జానకిని తీసుకొని వేరే ఊరికి వెళ్ళాలని బయలుదేరడం, చివరకు అపార్థాలు తొలగి సామరస్యంతో అర్థంచేసుకోవడం లాంటి కుటుంబ సంబంధాలతో నడిచే కథ ఇది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జలసూత్రం రుక్మిణినాధశాస్త్రి బుచ్చిబాబుగారికి రాసిన ఒక ఉత్తరంలో సుబ్బలక్ష్మిగారి కాపురంకథ సరళంగా మనుషుల మధ్య సంబంధాలు ఎంత సామరస్యపూర్వకంగా, సంస్కారవంతంగా ఉండాలో చూపింది అని మెచ్చుకుంటూ, ఇంత శుభ్రంగా నువ్వు కథలు రాస్తావా అని బుచ్చిబాబుగారిని సవాల్‍ చేశారట. నిజంగా ఈ కథను, కథలోని పాత్రలను అంత బాగా చిత్రించారు రచయిత్రి.

   ఇంకో కథ ఆడవాళ్ళ పెట్టెలో ప్రయాణంరైళ్ళలో కేవలం ఆడవాళ్ళకే సంబంధించిన బోగీ ఒకటుంటుంది. సాధారణంగా ఒంటరిగా ప్రయాణం చేసే ఆడవాళ్ళ ఆ పెట్టలోనే ఎక్కుతారు. ఆ పెట్టెలో ఎక్కిన రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళ ప్రవర్తనలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎట్లా ఉంటాయో తెలియజేసే కథ ఇది. కొన్ని గంటలు కలిసి ప్రయాణం చేసే వాళ్ళ మధ్య సాగే సంభాషణలు, కొందరంటే మంచి భావం, కొందరంటే అస్సలు పడకపోవడం, మద్దతునిచ్చేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, కూర్చున్నవాళ్ళు, పడుకున్నవాళ్ళు ఒక రకంగా ఆలోచించడం, నిలబడిన                      వాళ్ళు మరో రకంగా ఆలోచించడం, సామాన్లు సర్దే సమస్య, ఒకరిపై ఒకరు మాటలు విసురుకోవటం లాంటి విషయాలతో సాగే కథ ఇది. అయితే ఈ కథ శాంత అనే పాత్ర స్వగతం చెప్పినట్లుగా ఉంటుంది. రైలులో శాంతతో గొడవపడిన వాళ్ళే భర్త రామారావు స్నేహితుడి భార్య ఆమె చెల్లెలు వాళ్ళిద్దరూ తమ ఇంటికి రావడం, వాళ్ళ ప్రవర్తన ఆమెకు నచ్చదు. అయినా వాళ్ళను భరించాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడి నుండి ఒక పెళ్ళికి వెళ్ళాల్సి రావడంతో వాళ్ళను రైలు ఎక్కించడానికి, రామం, శాంత స్టేషన్‍కు వెళ్తారు. అయితే ఆ పెళ్ళి ఆగిపోయిందన్న విషయం రామంకు తెలిసినా వాళ్ళకుగానీ, శాంతకుగానీ చెప్పడు. అది తెలియని ఆ అక్క చెల్లెళ్ళు రైలెక్కి వెళ్ళిపోతారు. విషయం చెప్పకుండానే శాంతకిష్టంలేని వ్యక్తులను పంపించి భార్యను సంతోషపరుస్తాడు రామం. ఈ కథలో భార్యాభర్తల అనుబంధంతో పాటు ప్రయాణంలో తారసపడే వాళ్ళ వింత ప్రవర్తనలను, మాటలను కళ్ళకు కట్టినట్లు చూపించారు రచయిత్రి.

   ఇంకా మగతజీవి చివరి చూపుఅనే ఈ కథా సంపుటిలో కొత్త చోటైనా పాత మనుషులే, నేనూ అంతేనేమో, నల్లమబ్బులు, కర్త, కర్మలు పూర్తి చేసిన కథ, ఊహించని కోరిక అనే కథలున్నాయి. ఇవనీ కూడా ఆలోచింపజేసేవే అనుబంధాల విలువలను తెలియజేసేవే, బంధాలు, బాధ్యతలను గుర్తు చేసేవే, ముఖ్యంగా మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉండాలనే సందేశాన్నిచ్చేవే. కుటుంబ సంబంధాల గొప్పతనాన్ని చాటి చెప్పేవే. వీటన్నింటిని కలయికతో కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది అన్న భావాన్ని ఈ సంపుటి కలగజేస్తుంది. ఈ కథా సంపుటికి ముందుమాట రాస్తూ పింగళి లక్ష్మీకాంతం గారు ఇట్లా అంటారు సుబ్బలక్ష్మి కథల విశిష్టత చాలా భాగం ఇది స్త్రీ మాత్రమే వ్రాయగలదు అనిపించటం’. ‘పురుషుడు స్త్రీ ప్రకృతిని చిత్రించినప్పుడు అతడెంత నిపుణ రచయిత అయినా పురుష నేత్రాలతో ప్రతిఫలించిన దృశ్యమే చిత్రించగలడు. స్త్రీల స్వభావాన్ని సాటి స్త్రీ వర్ణించినప్పుడు అది అన్యునాతిరిక్తంగాను, వాస్తవికతకు సన్నిహితంగానూ ఉండడంలో ఆశ్చర్యం లేదు అని కూడా పేర్కొన్నారు.

   ‘‘ ప్రశాంతంగా ఉండాలంటే పాత వాటిని కలుపుకొని కొత్త ఊహల్లో జీవించటం అలవరచుకోవాలి’’ అని ప్రతిపాదించిన శివరాజు సుబ్బలక్ష్మి గారిని స్మరిస్తూ ఆమె సాహిత్యాన్ని అధ్యయనం చేయటం అవసరమని భావిస్తూ ఆ సాహితీమూర్తికి వినమ్రంగా అక్షర నివాళిని సమర్పిస్తున్నా.

                                                                                                         

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు