ఔను..
నేనిప్పుడు
గతాన్ని తలచుకొని
వగచడం సరికాదనిపిస్తోంది.
విశ్వమానవ మనుగడలో
ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న నేను
వజ్రసంకల్పంతో సాగిపోవాలి
చీకటి పొరల్లోంచి
తలెత్తిన అంకురాన్ని
రేపటి సూరిన్నయి వెలుగులు పంచాలి.!
తరతరాల అణచివేతలోంచి
రగిలిన నిప్పుకణికను
నింగి అంచులదాకా దూసుకుపోవాలి
మిరుమిట్లు గొల్పుతూ..
ఇప్పుడు
నేను వంటింటి కుందేలుకు కాను
ఒంటిచేత్తో ప్రగతిరథాన్ని
నడిపే సామ్రాగ్నిని..
అన్నట్టు..
ఇప్పుడెవరి చుట్టూతా తిరిగే
ఉపగ్రహాన్నీ కాదు..
నన్ను నేను వెలిగించుకుంటున్న స్వయం ప్రకాశిని.
ఇప్పుడు
తొక్కుడుబండనీ..
వాడి పాడేసే కరివేపాకునూ కాదు
ఇంటిల్లిపాదికి
కడుపునింపే అన్నం ముద్దనీ
అంతకన్నా మించి అవనికే ప్రాణంపోసే
అమ్మనీ ...
ఆకాశంలో సగాన్ని నేనే..
ఇప్పుడు
అగాధం నుంచి అంతరిక్షం దాకా..
అన్నీ రంగాల్లో విస్తరించిందీ నేనే
ఏక కాలంలో
ఇంటినీ.. మింటినీ అలవోకగా మోసే
సవ్యసాచినీ ..
ఇప్పుడు
నా తొవ్వలున్న పల్లేర్లూ నల్లేర్లనీ నలిపేసే
ఆత్మవిశ్వాసం నాది
వెరసి ఒక జాతి జెండాకుండే
ఆత్మగౌరవం కూడా నాదే..
ఇంతకన్నా..ఎమ్ కావాలి..!
మరు జన్మంటూ ఉంటే
మల్లా మహిళ నై పుట్టాలనే కోరుకుంటా..!