మా రచయితలు

రచయిత పేరు:    సింగరాజు రమాదేవి

కథలు

శ్రావణ మాసం

 సాయంత్రం నాలుగు అవుతోంది. శ్రావణ మాసం..

    కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని బయట పడుతున్న చిరుజల్లులని చూస్తూ కూర్చుంది విశాలాక్షి. శ్రావణ మాసం ఆమెకెంతో ఇష్టమైన నెల. చిన్నప్పటి నుండీ శ్రావణ మాసం అనగానే పండుగలు.. పేరంటాలు...పట్టు చీరెలు, పసుపు పూసిన పాదాలు.. జడల్లో చేమంతులు..గడపలకి మామిడి తోరణాలు...ఇవే గుర్తుకు వస్తాయి!

        చిరుజల్లులలో తడుస్తూ, ఒకరింటి నుండి ఒకరింటికి పట్టు పరికిణీలు ఎత్తి పట్టుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళటం..పసుపూ గంధం పూయించుకుని.. వాళ్ళిచ్చిన అరటిపళ్ళు, శనగలు తెచ్చుకుని.. గుగ్గిళ్ళు చేసుకుని తినటం... అమ్మవారి నైవేద్యానికని అమ్మ చేసే పూర్ణం బూరెలు, పాయసాలు.. పులిహారలు, దద్ధోజనం ఇష్టంగా తినటం...

        ఇప్పుడు ఆమె వయసు అరవై అయినా.. మాసం మోసుకొచ్చే తీయటి జ్ఞాపకాలు మాత్రం ఇంకా కొత్తగా, అపురూపంగానే ఉంటాయి!

        బయట వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చల్లటి గాలులు.. చిరు జల్లులు.. స్కూలు నుండి ఇంటికి పరిగెడుతున్న పిల్లల కేరింతలు..పక్క ఇళ్ళల్లో నుండి పరిచితమైన గొంతులు.. మాటలు.. మధ్యలో గిన్నెల చప్పుళ్ళు... అన్నీ అలవాటుగా చెవిన పడుతూనే ఉన్నాయి. కాని ఆమె మనసు మాత్రం  చిందరవందర ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది... నిందాక ఆమె చెవిన పడ్డ, కింద ఫ్లాట్ వనజ , సుగుణల సంభాషణ చుట్టూ తిరుగుతోంది.

        పేరంటానికి పిలవటానికి వచ్చినట్టున్నారు. పక్కింటి తలుపు తట్టి స్వప్నని పిలుస్తుంటే మాటలు వినపడ్డాయి. పక్క పక్క అపార్ట్ మెంట్లు అవటంతో... పైగా వీళ్ళ తలుపు ఎప్పుడు తీసి ఉండటం వలన మెట్ల పైన గానీ, కారిడార్లో గానీ ఎవరు ఏమి మాట్లాడినా స్పష్టంగా వినిపిస్తాయి.

        "సాయత్రం ఆరింటికల్లా రండి!" స్వప్నకి చెపుతోంది సుగుణ .

        "అందరినీ పిలిచేశారా.." అడుగుతోంది స్వప్న.

        ".. కింద నుండి ఒక్కో ఫ్లోర్లో వాళ్ళని పిలుస్తూ వస్తున్నాం. ఇక్కడ మీరు.. లలితగారూ.. లక్ష్మీ వాళ్ళు..పైన ఫ్లోర్ లో నలుగుర్ని పిలిస్తే అయిపోతుంది.." సుగుణ చెప్తోంది.

        "మరి మన విశలాక్షి ఆంటీ వాళ్ళు.." స్వప్న స్వరం తగ్గించి..

        "వాళ్ళు ఎలాగు పనికి రారు కదా!".. వనజ అంటోంది..

        "నిజమే కదా.. పాపం..  అయినా ఒక పని చెయ్యచ్చు.. గడపకి  బొట్టు పెట్టి చెప్పచ్చు.. వాళ్ళూ ఎలాగు రారులే కానీ..మనము మరీ చెప్పలేదు అనుకోకుండా..."  స్వప్న గొంతులో ఆరిందా తనం!

        "అవుననుకో .. నిజానికి వచ్చినా తాంబూలం ఒకటీ ఇవ్వచ్చు.. తప్పు లేదు!" సుగుణ గొంతులో నాకూ తెలుసులే అన్న భావం!

        "అదేలే .. గడపకి పెట్టచ్చు!.. నాకూ తెలుసు... ఇప్పుడు శుభలేఖ అయినా అంతే..  ఇంట్లో ముత్తైదువులు ఎవరూ లేకపోతే ..నేరుగా వీళ్ళ చేతికి ఇవ్వకుండా దేవుడి దగ్గర పెట్టాలి!. ఊరికే చెప్పటం మాత్రం చెప్పచ్చు!" వనజ అంటోంది.     

        వింటున్న విశలాక్షికి వొళ్ళు మండిపోతోంది.. అబ్బ ! ఒకళ్ళని మించి ఒకళ్ళు విషయ పరిజ్ఞానం ఒలక బోస్తున్నారు. మొన్న మొన్నటి దాకా వీళ్ళు కాదూ.. విశాలాంటీ...విశాలాంటీ...అంటూ చుట్టూ తిరిగింది. పండగ అయినా పేరంటం అయినా.. పెద్ద ముత్తైదువు అంటూ తీసుకువెళ్ళేవాళ్ళు కాదూ. ఫ్లాట్స్ లో ఎవరి పిల్ల సమర్తాడినా.. ఎవరి ఇంట్లో పెళ్ళి పనులని పసుపు కొడుతున్నా.. సీమంతమైనా.. శుక్రవారం నోమైనా ముందు తను ఉండాల్సిందే!. పిన్ని గారూ మీకైతే అన్ని పద్ధతులూ బాగా తెలుసు అని తీసుకు వెళ్ళే వాళ్ళు.

         అలాంటిది ఇప్పుడు... ఏడు నెలల క్రితం ఈయన పోయాక..ఇటు తొంగి కూడా చూడట్లేదు! ఇప్పుడు తను పనికి రాదుట! హు... అప్రయత్నంగానే నిట్టూర్పు ఒకటి బయటకు వచ్చింది

        ఫ్లాట్స్ లో పెద్ద తలకాయలు ఎక్కువ లేకపోవటంతో..ఉన్నా ఆమె అంత ఉత్సాహం చూపకపోవటంతో , నోములు నోచుకునే వాళ్ళు.. వ్రతాలు పట్టే వాళ్ళు ఆమెనే పిలిచేవాళ్ళు. ఆమె కూడా కాదనకుండా.. పొద్దునే చక్కగా తయారయి, వెళ్ళి దగ్గరుండి అన్నీ పద్ధతిగా జరిపించి, వాయనం తాంబూలం పుచ్చుకుని ఇల్లు చేరేది.

        చాలా మంది పూజలు అవీ మొదలుపెడతారు కానీ పద్ధతులు తెలిసి చావవు!అన్నీ చెప్పాల్సిందే!.. అన్నిటికీ కంగారు... అనుమానం! ఆమె అన్నీ ఓపికగా చెపుతూనే , చనువుగా మందలించేది కూడా..!

         "ఇదిగో దీపం లో అలా ఒక్క ఒత్తి వేయకూడదు!...అబ్బా... వెలిగించే ముందు... కుంది కి పసుపు కుంకుమ పెట్టాలి!... నువ్వు ముందు కాళ్ళకు పసుపు రాసుకున్నావా?.. గడప కి రాశావా? గడప మహాలక్ష్మి"!

 "పసుపు రాసి బొట్లు పెట్టక పోతే అమ్మవారు అటే వెళ్ళి పోతుంది మరి! ... !"..

        "బొట్టు పెట్టేటప్పుడు కూడా అంతే.. నువ్వు పెట్టుకున్నాకే... ఎదుటి వారికి పెట్టాలి!".

        "అమ్మవారికి జాకెట్ ముక్క ఎర్రది పెట్టాలి!. పూలు కూడా ఎర్రవి శ్రేష్టం!" ఇలా.. ఒకటి కాదు..  అన్నీ కొంత మందలింపు గా కొంత హాస్యంగా చెపుతుండేది.

        అవును మరి ఎన్నేళ్ళు ఆమె తన అత్తగారి కనుసన్నల్లో జరుపుకోలేదు పూజలు, నోములు!. వణికించేసేది ఆవిడ!. చిన్న తప్పు చేసినా .. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది..

        ఆవిడ పైన ఆవిడ అత్తగారు! ఆవిడ ఇంకా చండ శాసనురాలు. విశాలాక్షి కాపురానికి వచ్చేసరికి ఆవిడ ప్రతాపం ఇంకా సగం తగ్గిపోయిందట! మొత్తానికి వాళ్ళిద్దరి శిక్షణ లో రాటు దేలింది విశాలాక్షి! అందుకే అనీ తు..తప్పకుండా తెలుసు మరి.

        అలాంటి ఆమెకు పరిస్థితి అస్సలు ఊహించనిది! అసలు అనారోగ్యం ఎరుగని భర్త ఉన్నట్టుండి పోయారు. హార్ట్ ఎటాక్ . మొదటిసారి రావటమే ఎక్కువగా వచ్చిందట.ఇదిగో ఆమెను ఇలా దేనికిపనికి రాకుండావదిలేసి వెళ్ళిపోయాడు.

        విశాలాక్షి దీర్ఘాలోచనలో మునిగిపోయింది.

        ఆయన పోయిన దుఃఖం తట్టుకోలేననే అనుకుంది. ఎలా ఉంటానో అనుకుంది. కానీ చూస్తూనే ఏడు నెలలు గడిచిపోయాయి. కానీ చుట్టూ ఉన్న మనుషుల వైఖరి మరీ దుఃఖం తెప్పిస్తోంది. పదో రోజు తంతు పూర్తి చేసి తెల్ల చీర కట్టుకుని కూర్చుంటే ముఖం చూట్టానికి వచ్చిన ఒకొక్కరు చూడాలి!. అదీ తన ఖర్మకి శుక్రవారం వచ్చింది! ..

        సగం మంది రాలేదు. వచ్చిన వాళ్ళలో, జాకెట్ లో పసుపుకొమ్ము దాచుకొచ్చిన వాళ్ళు, గుమ్మం దగ్గర నిల్చుని చూసి వెళ్ళిపోయిన వాళ్ళు.. పలకరిస్తే ఏం కొంప మునుగుతుందో అన్నట్టు మాట మాట్లకుండా వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప తన దుఃఖం పంచుకున్న వాళ్ళు లేరు. రోజుల్లో కూడా ఇదేమిటి?.. అన్న వాళ్ళు లేరు. అవును! ఎవరూ అనలేదు... ఎవరూ.....

        ఛెళ్ళున ఎవరో ముఖం మీద చన్నీళ్ళు కొట్టినట్టు ఒక జ్ఞాపకం!..

        రోజున తను... తను అందా..ఇవేమీ వద్దు అందా... ఊహూ.. అనలేదు! మనసు ఇంకా వెనక్కి తొంగి చూసింది.. ఆరేళ్ళ క్రితం ఇదే దృశ్యం.. చెట్టంత కొడుకు ఆక్సిడెంట్ లో పోయాడు! తల్లి కి రాకూడని కడుపుకోత అది!

         కాని తనకి ధైర్యం చెప్పటానికి అప్పుడు ఆయనున్నారు, చిన్న కొడుకుకూతురు ఉన్నారు.

         కోడలి పరిస్థితే ఇంకా దారుణం! పెళ్ళి అయి నాలుగేళ్ళే.. చంకలో రెండేళ్ళ పిల్ల.. ముప్ఫై దాటని వయసు.

         అందుకే వాళ్ళ మొహం చూసి లేని ధైర్యం తెచ్చుకుంది. కాని కోడలికి.. భర్త పోయాక చేసే తంతు మాత్రం...అన్నీ పద్ధతి ప్రకారం జరిపించింది. అది తప్పనో.. తప్పించచ్చు అనో అసలు అవసరమా అనో అన్న ఆలోచన రాలేదు. గుడ్డిగా జరగాల్సిన తంతులో భాగంగా జరిపించేశారు.

        బాధ పడ్డారు అందరూ.. పడలేదని కాదు. చిన్న వయసులో కోడలు ఉష కి జరిగిన అన్యాయానికి అందరూ ఏడ్చారు.

        ఏడుస్తూనే పనులు కానిచ్చారు. గాజులు పగలగొట్టారు!

         పసుపు కుంకుమలు తుడిచారు!.. తెల్ల చీర చుట్టారు!..

         ఎక్కడా పద్ధతి లో లోపం రానీయకుండా అన్నీ జరిపించారు!...

        ఆనాడు తనూ అవన్నీ సహజంగానే భావించింది. అప్పటి నుండి దాని ఉద్యోగం అది చేసుకుంటూ, పిల్లను చూసుకుంటూ బతుకుతోంది.పిల్లనొక్కదాన్నే కాదు, తామిద్దరిని కూడా చూసుకుంది. చిన్న వాడు ఎలాగూ అమెరికా, కూతురు బెంగళూరు కాబట్టి తామే ఇక్కడ కలిసి ఉన్నది..

         పాపం ఎవరు శుభకార్యానికి పిలవటానికి వచ్చినా ఉష కి బొట్టు పెట్టే వారు కాదు.. తన ఒక్క దానికే బొట్టు పెట్టి చెప్పేవారు. ఉష అలాంటప్పుడు ఏదో పని ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోయేది. అదంతా చాలా మామూలుగా జరిగిపోయేది. కొడుకు,కోడలు, అల్లుడు కూతురు అందరూ పండగలకి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా, వాళ్ళకి బొట్టు పెట్టి బట్టలు, ఒళ్ళో చలివిళ్ళు... అన్నీ యధావిధిగా జరిగేవి. అన్నిటికీ ఉష దూరమే.. కానీ నాడు తనకి కోడలు ఉన్న స్థితిలో అన్యాయం కనపడలేదు.

        మన పద్ధతి ఇది.. దాని తలరాత అది! అనుకుంటూ గడిపేసింది.

        ఇప్పుడు తనకీ పరిస్థితి కలిగాక ..ఇప్పుడు అనిపిస్తోంది..ఇదంతా సహజమేనా... తనకు ఇన్నాళ్ళు ఇచ్చిన గౌరవం తనది కాదా? తన వెనుక ఉన్న మొగుడు అనే మనిషికేనా? మనిషి లేనినాడు తనకే విలువ లేదా? దేనికీ పనికి రాదా? ఎవరు పెట్టారు నియమాలన్నీ... అసలు తనకే ఇలా ఉంటే ఇన్నాళ్ళుగా ఉష మనః స్థితి ఏమిటో! కొడుకు గూర్చి తల్చుకుని అప్పుడప్పుడు బాధ పడటం తప్ప మోడు వారిన కోడలి జీవితం గూర్చి ఎన్నడూ ఆలోచించలేదు. కనీసం ఇంట్లో జరిగే శుభకార్యాల్లో ఆమెని వేరుగా చూడకూడదు అనే ఆలోచన రాలేదు.

        కూతురు వచ్చి మంగళవారం నోములు, శుక్రవారం నోములు అన్నీ నోచుకుంటుంటే, ఉష పొద్దున్నే లేచి వంట కి , పూజకి అన్నీ అమర్చి నిర్లిప్తంగా ఆఫీస్ కి వెళ్ళిపోయేది.

        ఒక సారెప్పుడో కూతురు సరిత " ఏం..కాస్త శలవ పెట్టి మనం పూజ చేసేటప్పుడు పిల్లల్ని పట్టుకోవచ్చుగా.." అన్నది.

        "అది ఎలాగు పూజ చెయ్యదు కదే.." అని తన చెల్లెలు విమల అంటే..

         సరిత "అది కాదు పిన్నీ.. మనం ఏమీ.. నువ్వు అసలు ఏమీ ముట్టుకోవద్దు, ఇక్కడ ఉండద్దు అని అనట్లేదు కదా.. మామూలు గానే ట్రీట్ చేస్తున్నాం కదా.." అంది. రోజు విమల అదోలా నవ్వుతూ అన్న మాటలు తనకింకా గుర్తే..

        " అవునే సరితా... ఉషని మనం మాములుగానే ట్రీట్ చేస్తున్నాం!... రంగు చీరలు కట్టుకోనిస్తున్నాం!.. ఎర్ర టిక్లీ బొట్టు బిళ్ళ పెట్టుకోనిస్తున్నాం!...  బయట కి వెళ్ళి ఉద్యోగం చేయనిస్తున్నాం!...పొద్దున్నే నీ ముఖం మాకు చూపించకు అనకుండా ఉంటున్నాం!...

         ’మామూలుగానేట్రీట్ చేస్తున్నాం!కానీ మన ఔదార్యపు.. అభ్యుదయపు సరిహద్దులు అంత వరకేనే!...

         నీ ముత్తైదువు వాయనానికి మాత్రం ..నేనో అమ్మో కావాలి.. అది పనికి రాదు!...అదే అది ధైర్యం చేసి మగాడు అనబడే వాడ్ని ఎవరినైనా పెళ్ళి చేసుకుంటే మళ్ళీ ముత్తైదువ అవ్వచ్చు!.

         కానీ భర్త పోయినా, మరో పెళ్ళి ధ్యాస లేకుండా, పిల్ల, అత్త మామల బాధ్యత తీసుకుని వాళ్ళే లోకంగా బతుకుతున్న అది మాత్రంపతివ్రతాకాదు, మనకిపనికీరాదు" అంది.

        సంభాషణ ఎటో వెళ్తోంది అనిపించిన తను.. ఇదిగో ఇవన్నీ మనం పెట్టిన పద్ధతులు కావు, మనం మారిస్తే మారేవి కావు. ఊర్కోండి ఇంక... అంటూ అక్కడితో తుంచేసింది.

        దయ చేసి తలుపు వెయ్యండి..ప్లీజ్... క్లోజ్ డోర్... లిఫ్ట్ తలుపు ఎవరో సరిగా వేయనట్టున్నారు. చప్పుడుతో గతకాలపు జ్ఞాపకాల గొలుసు తెగింది. కుర్చీలో నుండి భారంగా లేచింది విశాలాక్షి. తలంతా బరువెక్కి పోయింది. వేడి వేడిగా కాస్త టీ కలుపుకుందామని వంటింటిలోకి వెళ్ళింది.

        రోజు విమల అన్న మాటల్లో నిజం ఇప్పుడు అర్ధం అవుతోంది. ఆడదానికి వ్యక్తి గా గౌరవము, స్థానము లేదా? భర్త అనే ఒక సంఖ్య పక్కనున్నప్పుడే సున్నాకి విలువా? లేక పోతే ఆమె విలువ శూన్యమేనా? ఆడవారు చేసుకునే వేడుకల్లో వాళ్ళకే స్థానం లేదా? పద్ధతులు తెలుసు తెలుసు అని గర్వ పడ్డ తను.. ఎప్పుడూ వాటిలో పరమార్ధం ఏమిటో... న్యాయం ఎంతో ఆలోచించలేదు.. వాటిని ప్రశ్నించచ్చు అన్న ఆలోచనే రాలేదు.

        టీ తాగుతున్నా ఆలోచనల దారం కొనసాగుతూనే ఉంది. హఠాత్తుగా ఉష మీద ఆమెకు ఒక్క సారిగా ఆపేక్ష పొంగి పొరలింది. నాడు తను నోరు విప్పి తాము చూపుతున్న వివక్షని ప్రశ్నించలేదు.. అలాగని తమని శత్రువుల్లా చూడడమో.. పరోక్షంగా దెప్పిపొడవటమో చెయ్యలేదు.

        పైగా తను.." మన ఇంట్లో ఎలాగు రాత లేదుగా .. బయట పేరంటాలకన్నా వెళతా" అని బయలుదేరేది..

        . ఎన్ని సాయంత్రాలు ఈయన బయటికి వెళ్ళిపోయి... తను, మనవరాలిని తీసుకుని..ఫంక్షనో, పేరంటమో అని వెళ్ళి పోతే ఒంటరిగా గడిపిందో ఉషతాము నిత్యం చూపుతున్న వివక్ష ఆమెకు ముల్లులా గుచ్చుకుంటూ ఉంటుందని... అది ఆమె జీవితంలో వెలితిని మరచిపోనివ్వ కుండా చేస్తుందని తను తెలుసుకోనేలేదు.మనసంతా అపరాధ భావన నిండిపోయింది విశాలాక్షికి.

        పాపం ఈయన పోయినప్పటి నుండి.. కార్య క్రమాలు.. ఇంట్లో హడావిడి.. ఎక్కువైన పని.. అన్నీ ఒంటి చేత్తో నెట్టుకొచ్చింది ఉష!. తన దుఃఖంలో తను ఉండి ఇంటి ని అసలు పట్టించుకోక పోతే తనే అవస్థలు పడుతూ... అన్నీ చేసుకుంటూ పై నుంచి, తను ఒక్క పూట సరిగా తినకపోయినా, బతిమాలి బుజ్జగించి తినిపిస్తూ ఉండేది.

        ఆలోచిస్తున్న కొద్దీ విశాలాక్షికి తన ప్రవర్తన పట్ల సిగ్గు అనిపించసాగింది.వెంటనే ఉష కోసం ఏదైనా చెయ్యాలన్న బలమైన కోరిక కలిగింది. అవును చిన్నదే అయినా తనకు కాసేపైనా..సంతోషం కలిగించే పని ఏదైనా ఒకటి..

        బయట ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఉష ఆఫీస్ నుంచి రావటానికి ఇంకా గంట టైమ్ ఉంది. కొంగు దోపి గబగబా పనిలో పడింది. పొయ్యి మీద మూకుడు పెట్టి నెయ్యి పోసి జీడిపప్పు, కిస్మిస్  దోరగా వేయించింది. తర్వాత రవ్వ కూడా వేయించి.. చక్కెర వేసి వేడివేడిగా రవ్వ కేసరి చేసి పక్కకి పెట్టింది. ఉల్లిపాయలు పొడుగుపొడుగ్గా తరిగి శనగపిండితో కలిపి కరకరలాడే పకోడీలు వేసింది. టీ చేసి ఫ్లాస్క్ లో పోసి పెట్టింది.అవన్నీ అందంగా డిష్ లలో పెట్టి డైనింగ్ టేబుల్ పై పెట్టింది. ఇంతలో బెల్ మోగింది. మనవరాలు వర్ష కాబోలు.. ఉష వచ్చే పావుగంట ముందు అది వస్తుంది స్కూల్ నుండి. వెళ్ళి తలుపు తీసి లోపలికి వచ్చిన వర్షకి తను చేసినవన్నీ చూపించి.. ఇవాళ మమ్మీ కి సర్ప్రైజ్ ట్రీట్ గుసగుసగా చెప్పింది. అవునా! ...అంటూ మెరుస్తున్న కళ్ళతో వర్ష ఉత్సాహంగా తల ఊపింది.

        ఇద్దరూ కలిసి బాల్కనీ లో కేన్ కుర్చీలు వేసి టీపాయ్ వేసారు . దాని మీద లేసు టేబుల్ క్లాత్ వేసింది వర్ష. జాగ్రత్తగా డిషెస్ తెచ్చి అమర్చారు.   ఇద్దరూ తొందరగా ముఖాలు కడుక్కుని తయారయ్యి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉష కోసం ఎదురు చూడసాగారు. బెల్ మోగింది. వర్ష నోటి మీద వేలు ఉంచుకుని ఉష్..ఉష్.. అంటూ నువ్వు బాల్కనీ లో ఉండు... నేను మమ్మీని తెస్తా.. అంది.

        విశాలాక్షి లేచి చిన్న పిల్లలా బాల్కనీ లోకి పరిగెత్తి.. ఏం తెలీనట్టు కుర్చీలో కూర్చుంది. తలుపు తీసిన వర్ష మమ్మీ ... తొందరగా ఫ్రెష్ అయి బాల్కనీలో కి రావాలి . నీకొకటి చూపించాలి అంటోంది. ఏంటే.. నీ హడావిడి.. నానమ్మ ఏది.. అంటున్న ఉష ని అబ్బ... నువ్వు వెళ్ళు అంటూ తరిమింది.

        కాసేపటికి ... టట్ట.. డావ్.. సర్ ప్రైజ్!.. అంటూ ఉషని బాల్కనీ లోకి తీసుకొఛ్చింది వర్ష. నానమ్మ నీకోసం ట్రీట్ అరేంజ్ చేసింది అంటుంటే సంభ్రమంగా చూస్తున్న ఉష ముఖంలోకి నవ్వుతూ చూసి.." వర్షం కురుస్తుంటే ... వేడి వేడి పకోడి నీకు ఇష్టం కదా.. రా తీసుకోండి... " ఇద్దరికి ప్లేట్లు అందించింది. . కుర్చీలో కూర్చుని ప్లేట్ అందుకుని" రవ్వ కేసరి కూడానా..ఇదీ నా ఫేవరెటే" అంది ఉష.

        "కాదు అది నా ఫేవరెట్..  నానమ్మా.. నీ జీడిపప్పులు కూడా నాకే" అంటూ ఆబగా ఆమె ప్లేట్లో జీడి పప్పులు ఏరుతున్న వర్ష ని చూసి ఇద్దరూ ఫక్కున నవ్వారుఉష ముఖంలో నవ్వు.. వాన వెలిసిన రోడ్డు మీద సూర్య కాంతిలా తళుక్కున మెరిసింది. కోడలి ముఖంలో చాలా రోజుల తర్వాత కనిపిస్తున్న చిరునవ్వుల పూవులు ఆమెకు చాలా తృప్తినిచ్చాయి.ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకునే ప్రయత్నం చేస్తున్న ఉష ముఖం ఆనందంతో వింతశోభ తో మెరుస్తోంది.

         ఆమెనే చూస్తున్న విశాలాక్షికి హఠాత్తుగా వసంత్ గుర్తొచ్చాడుఉషా వాళ్ళ చుట్టాలబ్బాయి! అప్పట్లో తరచూ వచ్చేవాడు.కుర్రాడు మర్యాదగా ఉండేవాడు. ఉషకి ఏమంత వయసు అయిందని... ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో...

        పసుపుకుంకాల కోసం కాదు. ఒక తోడు కోసం! ఆడపిల్ల అన్న కారణంగా తాము ఇన్నాళ్ళు ఉషకు దూరం చేసిన సుఖ సంతోషాల కోసం! అదే తన కొడుకుకి ఇలా అయితే ఊరుకునేదా.. ఎప్పుడో రెండో పెళ్ళి చేసేది కాదూ..

 

        విశాలాక్షి మనసులో శ్రావణ మాసంలో వసంతకాలపు ఆలోచనలు చిగురిస్తున్నాయి!

 

                  ***************** 

 

 

 

 

 

 

 

 

 

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు