మా రచయితలు

రచయిత పేరు:    యం.ఆర్.అరుణకుమారి

కవితలు

తలపాగా

 

 పంచ భూతాలే పరబ్రహ్మ  స్వరూపాలని

అనాదిగా నమ్మి కొలిచినాడు రైతన్న తొలికోడి కూయక ముందే                    

నోరులేని చేనుకు నీరు తాపడానికి గట్టు పుట్టా, పురుగు పుట్రా లెక్కచేయక

చుక్కలకే దిక్కులు  చూపే వేగుచుక్క

తొలకరి చినుకుల పలకరింపు కు పరవశించి

 నాగేటి  చాళ్ళ దుక్కులు సాగే ఏరువాక

విత్తులు చల్లి నీరు గట్టి మురిసే మొలకల పున్నమి 

మందులు  కొట్టి,ఎరువులు పెట్టి పచ్చదనం నేత నేసే నిరంతర శ్రామికుడు

నిండు చీకట్లో పంట కాచే మిణుగురు దివ్వె

 మన్ను తప్ప అన్య మెరుగని స్వచ్ఛ పరిమళ మట్టి పువ్వు       

ఆరుగాలం కష్టించి ఆబాలగోపాల ఆకలి తీర్చే అన్నదాత

రవి కవీ గాంచని మట్టి పొరల మరుగు లెరిగిన ధార్మికుడు        

తన ఆశల సిరులన్నీ ప్రకృతి  బ్యాంకులో దాచిన స్వేద సూరీడు ఆగ్రహంతోనో అమితానుగ్రహంతోనో వరుణుడు

 ఐ పి పెట్టినా,

రుణ పాశాలు యమ పాశాలై వికటాట్టహాసం చేస్తున్నా బెదరక భూ దేవమ్మ కు  శ్రమదానం చేసే నిత్య కృషీవలుడు

మృత్తిక నుండి జీవామృతాన్ని ప్రాణకోటికి అందించే ఆపద్బాంధవుడు

రైతు గా పుట్టి రైతు గానే గిట్టాలన్న  రైతు

 నోట మట్టి గొట్టే సాగు చట్టాల రద్దుకై

 ఊరే వదలి పోరుబాట పట్టినాడు దేశ రాజధానిలో హఠం పట్టి ఉద్యమ శంఖం పూరించాడు

నెలల తరబడి సాగుతున్న  దీక్ష లో నిద్రాహారాలు, లాఠీచార్జీలు, ఈతి బాధలు పట్ల ఇసుమంత చింత లేదు

 అర్బక అసువులు(170 మంది రైతులు) సమిధలవుతున్నా మడమ తిప్పలేదు

మిలియనీర్ ఐనా బతికేది తిని అన్నం మెతుకులు

అన్న ఇంగితం మరచిన వినాయకులు

దేశ విదేశ పర్యావరణ ప్రేమికుల  హితవులు పెడచెవిన పెడుతున్న పెద్దరికాలు

అన్నదాతకు అండగా మనమంతా ఇవ్వాలి మద్దతులు

మెలేసిన కర్షక పౌరుష మీసం మీద నిలబెట్టాలి వారి ఆత్మగౌరవ నిమ్మకాయలు

జై కిసాన్ అంటూ పొగరుగా ఎగరేసిన తలలమీద అలంకరించాలి విజేత తలపాగాలు అదే సమస్త మానవాళి నిజమైన ఫ్లవ నామ ఉగాది పండుగ!

కథలు

ఏడడుగులు

          "సునీతా! రేపు సెకండ్ సాటర్డే నీకు సెలవే కదా .ఓ సారి ఇంటికి వస్తావా ?" సుజాతక్క ఫోన్ చేసింది . 
    "షాపింగా అక్కా? " అక్క కూతురు సుప్రజ పెళ్లి కుదిరింది. దాదాపు షాపింగంతా చేసేసాము. అయినా అక్కకు కంగారే ఇంకా ఏమన్నా మర్చిపోయామేమో అని.
      "ఏమిటో సునీతా! అసలు కథే  కంచికి పోయేటట్లు ఉంది. నాకు బావకు ఏం చేయాలో తోచడం లేదు" సుజాతక్క బాధగా అంది.
  " ఏమిటక్కా? ఏం జరిగింది ?" ఆతృతగా అడిగాను "పెళ్ళికొడుకు తరపున ఏదైనా " నాకెలా అడగాలో కూడా తోచలేదు.
  " లేదు.  సుప్రజ ఈ పెళ్ళి ఇష్టం లేదంటోంది. ఆ అబ్బాయి ఫోన్ చేసినా తీయడం లేదట.  అతను నాకు ఫోన్ చేసి అడిగాడు 'సుప్రజ బాగానే ఉంది కదా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా ' అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మామూలు జలుబు, జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమోనని మనం భయపడ్డమే కాదు ..ఎవరికన్నా చెప్పాలన్నా భయంగా ఉంది. ఎవరి భయాలు వారివి కదా! 'అదేం లేదు పని ఎక్కువైనట్లుంది నేను చెప్తాలే' అని అబ్బాయికి సర్ది చెప్పాననుకో."
  " మరి సుప్రజ ని అడిగావా ఎందుకు మాట్లాడలేదో?" అడిగాను.
"ఆ ..ఆ ..అప్పుడే కదా చెప్పిందా మాట.!"
" ఏ మాట ?"
"అదే ! తనకీ పెళ్లి ఇష్టం లేదని ."
" ఇష్టం లేదందా? నిజమా?"
"అవును" అదిరి పడ్డాను అక్క జవాబుకు
" నీలాగే నేనూ కంగారు పడిపోయాను.  కుదరక.. కుదరక కుదిరిన సంబంధం. మంచి కుటుంబం.ముఖ్యంగా అబ్బాయి చాలా బాగున్నాడు కదా."
"సుప్రజ చాలా అదృష్టవంతురాలు అని మనమంతా కూడా అనుకొన్నాం కదా. సుప్రజ కూడా సంతోషంగానే ఉంది. ఇద్దరూ ఇష్టపడ్డాకే కదా నిశ్చితార్థం చేశాము. ఇప్పుడు హఠాత్తుగా ఇష్టం లేదు అనడం ఏమిటి?" నాకు అయోమయంగా అనిపించింది.
" అదే మాకూ అర్థం కావడం లేదు. ఇంకా పట్టుమని 20 రోజులు లేదు ముహూర్తానికి. పత్రికలు  ప్రింట్ చేసి అందరికీ పంచడం లేదు. పిలవటం లేదు. మన కుటుంబాల వరకే కదా!  అయినా పిలిచినా ఎవరూ రావడం లేదు లే. పిలవటం మా బాధ్యత రాకుండా ఉండటం మీ బాధ్యత అన్నట్లుగా ఉంది ఇప్పుడు. ఇదివరకులా సకుటుంబ సపరివారంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించండి అనే రోజులు పోయాయి..."  సుజాతక్క మాట్లాడుతూనే ఉంది.  
      "నిశ్చితార్థం అయ్యాక ..,ముహూర్తం దగ్గర పడ్డాక వద్దంటే ఏదో బలీయమైన కారణం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలి కదక్కా!"
  " అది తెలుసుకుంటావనే నిన్ను రమ్మంటున్నది. ఇష్టం లేదు అన్న మాట తప్ప ఇంకేం చెప్పడం లేదు. తిట్టి.. కొట్టి అడగటానికి అది చిన్న పిల్ల కాదు కదా! నీతోనే కదా అది  మనసు విప్పి మాట్లాడేది .అందుకే నువ్వే వచ్చి అడుగు."
   "సరే ! అక్కా! రేపు ఉదయం వస్తాను."
" వంట... గింటా అంటూ కూర్చోకు. రఘు.. పిల్లలు కూడా వచ్చేయండి .నేను రమ్మన్నానని చెప్పు రఘుకు.  ఉంటాను మరి " సుజాతక్క ఫోన్ పెట్టేసింది.
    నేను ఆలోచనలో పడ్డాను. సుప్రజ చాలా మంచి అమ్మాయి. చిన్నపుడు చురుగ్గా..  చదువులో ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ ఉండేది. తర్వాత రాను రాను స్తబ్దుగా తయారయింది. చదువులో కూడా వెనకబడిపోయింది. అది చూసి సుజాతక్క భయపడిపోయింది.
"ఎందుకిలా అవుతోంది తెలియటం లేదు. కనీసం టెన్త్ పాస్ అవుతుందా అనిపిస్తోంది నాకు. ఎంత చెప్పినా వినడం లేదు. ఏమీ చెప్పదు. నువ్వు రా సునీతా! " సుజాత అక్క చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించి.. ఆత్రపడి.. ఆరాట పడిపోతుంది.ఆమె గుండె బరువు తగ్గించుకోవడానికి, ఆమె సమస్యలు పరిష్కరించడానికి.. నా తెలివితేటలు. ఓర్పు ..నేర్పు పనిచేస్తాయని ఆమె ప్రగాఢ విశ్వాసం .
అక్క బాధ పడితే.. ఏడిస్తే నేను తట్టుకోలేను. అక్క నాకు అమ్మతో సమానం. నేను ,అక్క, తమ్ముడు ..మేము ముగ్గురం సంతానం అమ్మకు. తమ్ముడు పుట్టాక  అమ్మ ఆరోగ్యం పాడైంది .యుట్రస్ క్యాన్సర్ తో అమ్మ చనిపోయింది .మగ బిడ్డ కావాలని.. నా తర్వాత.. అమ్మ గర్భవతి కావడం ..స్కానింగ్ చేయించడం.. కడుపులో వున్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించడం.. ఒక్కోసారి  బలహీనమైన గర్భాశయం వల్ల కూడా అబార్షన్లు కావడం వల్లనే ..అమ్మకు యుట్రస్ క్యాన్సర్ వచ్చిందట. తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు పూర్తి బెడ్ రెస్ట్ ఉండాలి అనడంతో పదేళ్ల వయసు నుండే ఇంట్లో పనులు.. నా పెంపకం కూడా అక్క మీద పడ్డాయి. నానమ్మ ఉన్నా కూడా ఎక్కువ కష్టపడింది అక్కే!  పాపం అందుకే పదోక్లాస్ కూడా చదువుకోలేక పోయింది. కానీ అక్కకు చదువు అంటే చాలా ఇష్టం . ఆ ఇష్టమే నన్ను ..తమ్ముణ్ణి ఉన్నత చదువులు చదివించింది పట్టుబట్టి. మరి తన కూతురు చదవకపోతే అక్కకు ఎంత బాధగా ఉంటుంది?
   నేను వెంటనే వెళ్లి సుప్రజ తో మాట్లాడాను. నిర్లిప్తంగా మన్ను తిన్న పాములా ఎందుకు తయారయిందో ..
నెమ్మది..నెమ్మదిగా రాబట్టాను.సుప్రజ తెల్లగా అందంగా బొద్దుగా ఉంటుంది .బొద్దుగా ఉండటమే ఇప్పుడు సమస్య అయిపోయింది. క్లాస్ లో ..స్కూల్లో.. ట్యూషన్ లో.. పిల్లలు, స్నేహితులు కూడా ఎగతాళి చేస్తుంటారట లావుగా వుందని.. ఏవేవో నిక్ నేమ్స్ తో పిలుస్తారట! అది తట్టుకోలేక పోతుంది. అందుకే చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతోంది.  క్లవర్ గర్ల్ అని పేరు పడ్డ అమ్మాయి డల్ అయిపోతే ...మార్కుల శాతం పడిపోతుంటే టీచర్స్ బాధపడి.. వాళ్ళూ  తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఇంట్లో అక్క ఆవేశపు అరుపులు ! ఇన్ని ఒత్తిళ్లను  సుప్రజ భరించలేకపోతోంది.
   " ఇలా ఉండటం నా తప్పా మమ్మీ ?"  నా ఒళ్ళో తల దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది సుప్రజ.  అక్కను 'అమ్మఅని నన్ను 'మమ్మీఅని పిలుస్తుంది.
  సుప్రజ ఏడుపు చూసి నాకు కడుపులో దేవినట్లయింది. ఒక్కతే కూతురు అని అక్క సుప్రజను  బాగా గారాబం చేసింది.  చిన్నప్పటి నుంచి.. వద్దు వద్దు అంటున్నా బలవంతంగా తినిపించేది. స్వీట్స్ బాగా అలవాటు చేసింది.
  "స్వీట్స్ వద్దు. బరువు పెరగడం తప్ప శక్తి రాదు. పండ్లు కూరగాయలు అలవాటు చేయ" మని నేను ..బావ చెబుతూనే ఉండేవాళ్ళం. అక్క వినేది కాదు.
"అయ్యో!  బిడ్డకు మీ ఇద్దరి దిష్టే తగిలేట్టు ఉంది." అని మమ్మల్ని కోప్పడేది.
    చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దొస్తారు. నిజమే కానీ పెద్దయ్యాక లావుగా ఉంటే ఇదిగో ఇలాగే మిగతా వాళ్ల హేళనకు గురి అవుతారు. డిప్రెస్ అవుతారు. చదువు సంధ్యలు అటకెక్కి..  ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో కూరుకుపోయి ..దేనికి పనికిరాకుండా పోతారు. ఇక్కడే చెక్ పెట్టాలి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము.వయసుకు తగ్గట్టు  ఎత్తు, బరువు ఉండాలి అన్నారు. తినే తిండికి తగ్గట్లు ఎక్సర్సైజులు చేయాలన్నారు. బలం ఇవ్వని ..బరువు పెంచే ఫాస్ట్ ఫుడ్.. స్వీట్స్ పట్ల నియంత్రణనిగ్రహం కలిగి ఉండాలన్నారు.
  పాపం డాక్టర్  చెప్పినట్లే నడుచుకొంది సుప్రజ. అయినా బరువు ఎక్కువగా తగ్గలేదు. మళ్ళీ డాక్టర్ కు చూపించాము. థైరాయి, టెస్ట్ వల్ల తెలిసింది తనకు హైపోథైరాయిడిజం ఉందని.. దీనివల్ల కూడా బరువు పెరుగుతారని. చికిత్స చేయించాము ..కానీ పూర్తిగా తగ్గలేదు.  నేను ఎక్కడో చదివాను.. తమలో ఉన్న బలహీనతను , లోపాన్నిఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నూ  చేయించాలంటే తమలో ఉన్న ఏదో ఒక టాలెంట్ కు మెరుగు పెట్టుకొని రాణించాలని ..గుర్తింపు తెచ్చుకోవాలని. ఒక రచయిత స్వయంగా చెప్పారు తను పొట్టి గా ఉన్నాను అన్న  ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి రచయితగా మంచి గుర్తింపు కోసం.. విరివిగా రాశానని.
   అలా బ్రెయిన్  వాష్ ..కౌన్సిలింగ్... నాకు తోచినవి, తెలిసినవి ,చదివినవి, విన్నవి.. మెల్లమెల్లగా చెప్తూ సుప్రజ దృష్టిని చదువు వైపు మళ్ళించాను. తెలివైన అమ్మాయి కాబట్టి పదో తరగతి లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. అది నా వల్లే  అని  అక్కకు నమ్మకం.
     "అది చదివి.. ర్యాంకు తెచ్చుకుంటే నన్ను మెచ్చుకోవడం ఏమిటి?"  అని నేను అన్నా ఒప్పుకోదు.
   "నువ్వు మాటల మరాఠివి. నీ మాటలతో  మాయోమంత్రమో  వేస్తావు. చిన్నప్పుడు కూడా మొహం అమాయకంగా పెట్టేసుకుని... నాన్నను, అక్కను  ఏమార్చి నువ్వు చేసే అల్లరి పనులు నా మీదకు నెట్టేసి నాకు తిట్లు, దెబ్బలు తినిపించేదానవు కాదూ!"  తమ్ముడు సునీల్ నవ్వుతూనే దెప్పిపొడిచాడు మా బాల్యం గుర్తుచేసుకుంటూ.
    మేము ముగ్గురమూ  సిటీలోనే ఉండటం మూలాన అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భం కల్పించుకుని  కలుసుకుంటుంటాము. ఎక్కువగా అక్క వాళ్ళ ఇంటికే వెళ్తాము. అక్క దగ్గరకు వెళితే పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ మాకు.  నానమ్మ చనిపోయాక నాన్నను బలవంతంగా తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకుంది. అక్క, బావ.. ఇద్దరూ నాన్నను చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఈ మధ్యన కాలం చేశారు .
  సుప్రజ  తన బాడీ షేమింగ్ గురించి పట్టించుకోకుండా చదువు మీదే దృష్టి పెట్టడంతో ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకొని బీటెక్ చదివి క్యాంపస్ సెలక్షన్స్ లోనే మంచి ప్యాకేజీ తో పేరున్న కంపెనీలో జాబ్ తెచ్చుకుంది.
తన తెలివైన పర్ఫార్మెన్స్ తో త్వరలోనే టీం లీడర్ కూడా అయింది. అందం , మంచి ఉద్యోగం , జీతం.. ఎన్ని ఉన్నా ..లావుగా ఉందన్న ఒకే కారణంతో చాలా సంబంధాలు  కుదరకపోవడం ..అక్కా బావలను చాలా కుంగదీసింది.
  సుప్రజ లోలోపల బాధపడిందేమో కానీ... పైకి ఏమి పట్టించుకోనట్లే ఉండేది.
నాకు ఫోన్ చేసి  "  పెళ్లి జీవితంలో ఒక భాగమే కానీ.. పెళ్లే జీవితం కాదని అమ్మకు చెప్పు.  అయినా ఇక లోకంలో అబ్బాయిలే లేనట్లు ..నేను ముసలి దానిని  అయిపోయినట్లు.. నాకిక   పెళ్లే కాదన్నట్లు తెగ బాధపడిపోతూ ఉంది. "  అనేది ఏదైనా సంబంధం తప్పిపోయినప్పుడు...తల్లి బాధ చూడలేక నన్ను వచ్చి అక్కను ఓదార్చమనేది. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు సంబంధం కుదిరి నిశ్చితార్థం అయ్యేదాకా కూడా మాకు నమ్మకమే . నిశ్చితార్ధం జరిగాక చాలా ఆనందించాము . కానీ ఇప్పుడు సుప్రజ పెళ్ళి వద్దనడం.. మాకు మింగుడు పడడం లేదు. సుప్రజతో మాట్లాడితే గాని అసలు విషయం తెలియదు. ఆ రాత్రి ఆలోచనలతో నిద్ర పట్టలేదు.
    " హాయ్ మమ్మీ ! ఇవాళో.. రేపో వస్తావని అనుకుంటూనే ఉన్నాను."  నేను తన గదిలోకి వెళ్ళగానే లాప్టాప్ లో ఏదో టైపు చేసుకుంటూ అంది సుప్రజ.
     నాకు ఎందుకో  చురుక్కుమన్పించింది. తమాయించుకుని అన్నాను.
    "పెళ్లి  దగ్గర పడింది.  ఇంకా ఏవన్నా పెండింగ్ పనులుంటే చేయాలి కదా! మరి రాకుండా ఎలా ఉంటాను?"
   " అబ్బా!  మమ్మీ...  చల్లకొచ్చి ముంత దాయడం అంటే ఇదే కదా! " సుప్రజ నవ్వింది. తను  పుస్తకాలు బాగా చదువుతుంది .ఇంగ్లీషు ,తెలుగు కూడా!
  "చల్ల ..ముంతా.. రెండూ దాచుకునేంత సమయం మనకు లేదు కదా సుప్రజాఅసలు సమస్య ఏమిటి?"  నేను సూటిగా రంగంలోకి దిగిపోయాను.
"పరిష్కారం అయిపోయిందిలే మమ్మీ!  ఓకే ! " ఎంతో నిర్లక్ష్యంగా అంది సుప్రజ. నేను నివ్వెరపోయాను.
   "సుప్రజా!  పెళ్లి అనేది నీ ఒక్కదానికే సంబంధించిన విషయం కాదు.  రెండు కుటుంబాలకు ..పరువు ప్రతిష్ట లకు సంబంధించిందని మర్చి పోతున్నావు."  నేను కాస్త తీవ్రంగా అన్నాను.
   "అంటే ? వాట్ డు యు మీన్ ? పరువు ప్రతిష్ట కోసం నా జీవితం పణం  పెట్టమంటారా? "  సుప్రజ ఉద్రేకంగా అంది.
" అలా ఎలా  అంటాను ? కానీ ..నువ్వు సరేనంటేనే కదా సంబంధం ఖాయపరిచింది. నిశ్చితార్థం జరిగింది."  నేను..నా స్వరాన్ని మెత్త పరిచాను.
  " నిజమే! కానీ ఇప్పుడు కాదంటున్నాను  కదా ! నేనేమన్నా చిన్న పాపనా? కాదు కదా!  నేను బాగా ఆలోచించే తీసుకున్న నిర్ణయం ఇది."
"కావచ్చు. కానీ ..దానికి కారణం తెలియాలి కదా! ముందు  మాకు తెలిస్తే కదా వాళ్లకు చెప్పడానికి? నిశ్చితార్థం అయ్యాక ..పెళ్లి క్యాన్సిల్ అంటే...."
"అయితే ఏంటట అసలే.. నేను కొబ్బరి బొండం..  పూరి.. పీపా .. బోండా...గుమ్మడి పండు ... లా ఇంత లావున వున్నాను కదా! నాకు పెళ్లి కుదరడమే  చా..లా గొప్ప విషయం . అందులోనూ.. అబ్బాయి అందగాడు.  అయినా సరే నన్ను పెళ్ళి చేసుకుంటున్నాడు.  సో ... ఒకవేళ ..అతనేమన్నా అన్నా గాని పట్టించుకోకూడదు. సర్దుకుపోవాలి. అని  నాకే నచ్చ చెప్తారు కానీ నా బాధ మీరు అర్థం చేసుకుంటారా? అందుకే నేను మీకు ఎవరికీ చెప్పలేదు. నేనే నిర్ణయం తీసుకున్నాను."  మొహం, కళ్ళు కోపంతోనోబాధతోనో  ఎర్ర పడిపోయాయి.
"మీరు ఎవరితోనూ మాట్లాడాల్సిన పని లేదు. ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. నేను ఇప్పుడే అతనికి మెయిల్  పెట్టేసాను. ఈ విషయం ఇంతటితో ముగిసిపోయింది. అంతే!"  గంభీరంగా మరి తిరుగే లేనట్లు స్పష్టంగా చెప్పింది సుప్రజ.
నేను నిర్ఘాంతపోయాను. హఠాత్తుగా సుప్రజ నా ఒడిలో తల పెట్టుకొని ఏడవటం మొదలెట్టింది. తను ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది.  ఓదార్పుగా తన తల  నిమురుతూ ఉండిపోయాను. కాసేపయ్యాక తేరుకొని లేచి కూర్చుంది. లాప్టాప్ నా ముందు పెట్టి తను పెట్టిన మెయిల్ నాకు చూపుతూ చెప్పింది.
  " అతనికి నచ్చింది ..నేనునా వ్యక్తిత్వం కాదు మమ్మీ.  నా ఉద్యోగం , హోదాజీతంనా వెనక ఉన్న ఆస్తి. అంతే!  అది నిశ్చితార్థం అయ్యాక అతని మాటలు, ప్రవర్తన చెప్పాయి. నిశ్చితార్థం అయ్యాక ఆడపిల్ల ..ఆమె తల్లిదండ్రులు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోరు అన్న ధీమాతో ఉన్నారు.థాంక్ గాడ్ !  పెళ్లికి ముందే అతను తన అసలు రూపాన్ని చూపాడు. తనేదో చాలా పెద్ద త్యాగం చేస్తున్నట్లు మాట్లాడేవాడు. మేమిద్దరం ఉన్నప్పుడే కాదు తన ఫ్రెండ్స్ ముందర కూడా బాడీ షేమింగ్ మాటల ఈటెలు గుచ్చుతూనే ఉన్నాడు. చివరకు... డన్లప్ బెడ్  అని కూడా... ఛీ ! ఛీ! వద్దు మమ్మీ ! కొంచెం కూడా అతడికి సంస్కారం లేదు ..కానీ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అతను నాకొద్దు గాడ్ ! పెళ్లికి ముందే తెలియటం.. రియల్లీ ఐ యాం లక్కీ! "  సుప్రజ రిలీఫ్ గా, ఆనందంగా, దృఢంగా చెప్పింది.
    మెయిల్ చూశాను. చదివాక ..నా పెదవుల మీద చిరునవ్వు విచ్చుకుంది అప్రయత్నంగా. నా చేయి సుప్రజ భుజాన్ని మెచ్చుకోలుగా పట్టుకొంది గట్టిగా, గర్వంగా.
    "మన పెళ్లి ఒప్పందాన్ని నేను రద్దు చేసుకుంటున్నాను. ఎందుకంటే ..జీవితంలో.. నా వేదనలోను, వేడుకలోనూ తోడునీడగా.. అడుగడుగు అండదండగా.. కలసి నడిచే ఒక జీవన సహచరుడ్ని కోరుకుంటున్నాను కానీ అనుక్షణం నన్ను బాడీ షేమింగ్ కు గురి చేసి ..పైశాచిక ఆనందం పొందే ఒక శాడిస్టు ను కాదు.   మీకు తెలుసో లేదో.. బాడీషేమింగ్ ,(శరీర అవయవాల్ని కామెంట్ చేయటం)కలరిజం  (శరీర వర్ణాన్ని కామెంట్ చేయటం) చట్టరీత్యా నేరాలు. అలా చేసిన వారిపై కేసు కూడా పెట్టొచ్చు. ఇటీవలే ఓ నటి  తన శరీర రంగు గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వారిపై కేసు పెట్టింది కూడా!  సో భద్రం గురూ!  మీకు తప్పకుండా పెళ్లి అవుతుంది.  పాపం ఆ అమ్మాయిని దేవుడే కాపాడాలి. గుడ్ బై ఫరెవర్ !"
 

                 -------------***---------
      
                                
                               

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు