శరీరానికి అసౌకర్యంగా అనిపించడంతో ఉలిక్కి పడి లేచింది కానిస్టేబుల్ గీత. ఒక్క క్షణం ఆమెకి తనెక్కుడుందో గుర్తు రాలేదు. కుర్చీలో నుండి పడబోతూ సర్దుకొని అయోమయంగా పక్కకు చూసింది. హాస్పిటల్ బెడ్ ఖాళీగా ఉంది. వాస్తవ పరిస్థితి ఛళ్ళున చరిచినట్టుగా గుర్తుకొచ్చింది. ఠక్కున లేచి నిలబడి టైమ్ చూసింది. నాలుగయ్యింది. దాదాపు హాస్పిటల్ వార్డు అంతా నిశ్శబ్దంగా ఉంది. వార్డు చివర బాత్రూమ్ కేసి చూసింది. తలుపు మూసి ఉంది. హమ్మయ్య అనుకొని నిట్టూర్చింది. పక్కన తనకి సహాయంగా వచ్చిన హోమ్ గార్డు కింద పేపర్ పరుచుకొని గాఢ నిద్రలో ఉంది. హోమ్ గార్డుని నిద్రలేపి చీవాట్లేసింది. కాస్త అసహనంగా అనిపించింది. ఏంటీ ఈ పిల్ల ఇంకా రాలేదు? అనుకుంటుంటే బాత్ రూమ్ తలుపు తెరుచుకుంది. కానీ అందులోనుండి బయటకు వచ్చింది తాను కాపలా కాయాల్సిన ఖైదీ కాదు. ఆమెకు అంత చలిలోనూ ముచ్చెమటలు పట్టాయి. పిచ్చిదానిలాగా వెతకడం మొదలుపెట్టింది. వెనకాలే హోంగార్డు టోపీ సర్దుకుంటూ ఖంగారుగా అనుసరించింది. ఎక్కువ టైమ్ వేస్ట్ చేయలేం అనుకుంటూ ఇంచార్జ్ ఎస్సై కి ఫోన్ చేసింది. సస్పెన్షన్ ని తలుచుకుంటుంటే ఆమెకు కళ్ళు చెమ్మగిల్లి గొంతు పూడుకుపోయింది.
****
ఫోన్ మోగుతున్న శబ్దానికి జైలరు విసుక్కుంటూ లేచాడు. అవతలి వైపునుండి చెప్పింది విని, “ఎహే ఏ బాత్రూమ్ లోనో ఉండి ఉంటుంది చూడండి. ఆ పిల్ల ఎక్కడికి పోతది?” అన్నాడు నిద్ర చెడగొట్టినందుకు తిట్టుకుంటూ! కానీ అవతలి పక్క కొనసాగిన మాటలు విని గబుక్కుని లేచాడు. జైలు డాక్టరు నంబర్ కలుపుతూనే గబ గబ నైట్ డ్రెస్ లోనే క్వార్టర్ లో నుండి బయటకు వచ్చాడు.
****
జితినీ పారిపోయిందట!
హజారీబాగ్ సెంట్రల్ జైలులో ఈ వార్త గుప్పుమంది. ఆ తరవాత దావానలంలా పాకిపోయింది. అంతటా అదే చర్చ. మహిళా వార్డులో ఖైదీలు, వార్డర్లు కూడా గుంపులు గుంపులుగా చర్చిస్తున్నారు. ఒక పట్టాన ఎవ్వరికీ ఈ వార్త మింగుడు పడడం లేదు. ఇంకా వివరాలు తెలీదు. గేటు దగ్గర సిపాయి చెప్తే మహిళా వార్డు దాకా ఈ వార్త వచ్చింది.
“ఎంత అమాయకంగా ఉండేది! ఇంత పని చేస్తుందనుకోలేదు.”
“ఆ అట్లా ముంగి లాగా ఉండేవాళ్లే కొంపలు ముంచుతారు.”
ఇలా ఆరోజంతా ఎవరో ఒకరు ఏదో వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా ఆమె పారిపోయిందంటే మాత్రం నమ్మడానికి ఎవ్వరూ సిద్దంగా లేరు. రీలామాల ఒక్కతే మౌనంగా ఉంది. ప్రభుత్వాన్ని పడగొట్టటానికి కుట్ర చేసిందని ఆమె మీద అభియోగం. ఆమె కూడా ఆదివాసీనే. మహిళా సంఘం నాయకురాలు. ఆమె పట్ల జైలు సిబ్బంది కూడా మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. వార్డరు వచ్చి రీలామాలతో మాట కలిపింది. “అయినా ఎక్కడికని పారిపోయుంటుంది! డబ్బులు కూడా లేవు కదా. అక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. సర్చ్ పార్టీకి దొరికిపోతుంది చూడండి అన్నది. సరిగ్గా అప్పుడే జితినీ దోస్తు బుధిని వచ్చి, “నా దగ్గర రెండొందలు ఉంటే దాచిపెట్టమని జితినీకి ఇచ్చాను” అని ఏడ్చుకుంటూ వార్డర్ కి చెప్పింది. ఆమె తెల్లబోయింది.
రీలామాల ఆలోచిస్తుంది అదికాదు. జితినీ ఇంట్లో ఉండేది ఆమె భర్త, అత్త. భర్త పనికోసం వేరే రాష్ట్రం వెళ్ళాడు. అత్త చచ్చిపోయింది. ఎక్కడో అడవిలో ఉండే ఇల్లు. పెద్దగా బంధువులు ఉన్నట్టుగా కూడా లేదు. అసలు ఆమె ఉన్న స్థితిలో ఎక్కడికని వెళ్లగలదు? ఆమెకు జితినీ జైలుకు వచ్చిన మొదటిరోజు గుర్తుకొచ్చింది.
ఐదు నెలల క్రితం ఒక సాయంత్రం మహిళా వార్డు ఆవరణలో అందరూ కూర్చుని ఉండగా ఆమె లోపలికి అడుగుపెట్టింది. వయసు 18, 20 మధ్య ఉండొచ్చు. ఒళ్ళంతా దెబ్బలు. ముఖం ఒక వైపు వాచిపోయింది. బట్టల మీద రక్తం మరకలు. ఒక కాలికి లోతైన గాయం. ఆమె అందరినీ చూసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రీలామాల కలగజేసుకొని, పోలీసులు కొట్టారా? అని అడిగింది. ఆమె కాదన్నట్టు తల ఊపింది. “సరే వివరాలు తరవాత, ముందు ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేయించండి” అని రీలామాల వార్డర్ ని ఉద్దేశించి అన్నది.
“ఏ పిల్లా, గేటు దగ్గర డాక్టరు సాబ్ చూసిండా?” వార్డరు గద్దించింది. ఆమె భయంగా చూసి మళ్ళీ వెక్కుతూనే తల అడ్డంగా ఊపింది. వార్డరు హాస్పిటల్ నుండి ఎవరనినైనా పంపమని వాకీ టాకీ లో చెప్పింది. కాసేపటికి శిక్షపడిన ఖైదీ రంజన్ వచ్చాడు. మహిళా వార్డుకి ప్రతి రోజూ మందులు ఇచ్చే బాధ్యత అతనిది. ఆమె గాయాలు శుభ్రం చేస్తూ అతను “ఏం కేసులో వచ్చావమ్మా?” అని అడిగాడు. ఆమె భయంగా చూసింది. “ఏం భయం లేదు. ఇది కోర్టు కాదు, జైలు. నువ్వేం చెప్పినా ఇక్కడ శిక్షలు వేయరు, ఫరవాలేదు చెప్పు” అంటూ కాలికి కట్టు కట్టడం మొదలుపెట్టాడు.”
ఆమె వెక్కిళ్ళ మధ్య అత్త అత్త అంటూ మిగతా మాటలు మింగేసింది.
“శబ్భాష్ బేటా” వత్తి పలుకుతూ “చూడు ఇగో ఇక్కడ చాలామంది కోడళ్ళని చంపి వచ్చారు. ఒక్కరన్నా అత్తని చంపలేదు. వెరీ గుడ్. మంచి పని చేశావు. ఏం గాదు. మంచిగా ఈ మందులు వేసుకో. మంచిగా తిండి తిను. గాయాలు తగ్గే దాకా స్పెషల్ ఫుడ్డు రాయమని డాక్టర్ సాబ్ కి చెప్తాలే. ఏం ఫికర్ చెయ్యబాక. సరేనా! అంటూ మెడికల్ కిట్ తీసుకొని రీలామాల వైపు చూసి దీదీ జర చూసుకో” అని ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చెప్పి మందులు రీలామాల చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.
రీలామాల రెండు రోజులు ఆమెని సముదాయించాక మెల్లగా తన కథ చెప్పింది.
“మా ఇల్లు జంగల్ల (అడవిలో) ఉంటది. ఇప్పపూలు ఏరి మహువా (విప్ప సారా) కాస్తాం. మా ఆయన, మా అత్త నేనూ ఇప్పపూలు ఏరడానికి పోతం. సారా కాచి అమ్ముతాం. చేసిన సారాలో సగం అత్త తాగేస్తది. దానిమీద రోజూ గొడవలు. ఇదంతా కాదని కూలి పనులకోసం దేశం పోయే (బయట రాష్ట్రానికి) వాళ్ళతో తానూ పోతానని మా ఆయన అన్నాడు. ఊరు పోయి వచ్చేదాకా సారా అమ్మొద్దు, మగవాడు ఇంట్లో లేడని తెలిస్తే మంచిది కాదు, అమ్మకి సారా మొత్తం ఇవ్వద్దు. సగం దాచిపెట్టు అని చెప్పి పోయాడు. మా అత్త నన్ను బాగా సతాయిస్తుండే. పెళ్ళయి ఏడాదయింది, ఇంకా కడుపెందుకు కాలే అని బాగా తిట్టేది. ఆయన లేనప్పుడైతే చెయ్యిజేసుకుంటుండే. అందుకే నేను అత్తతో కలిసి ఉండను నన్ను కూడా తోలుకుపొమ్మన్న. ఒక్కడినే అయితే ఎక్కడో అక్కడ గడిపెయ్యచ్చు. ఇంకా పని చూసుకోకుండ నిన్ను ఎక్కడ పెట్టను? అన్నాడు. నన్ను కొట్టద్దని అత్తకు కూడా గట్టిగ జెప్పిండు.
ఒక్క రోజు ఊరకుండింది. ఇంక సారా కోసం తగవు మొదలుపెట్టింది. కొద్దిగా ఇస్తే సరిపోలేదు. మొగుడికి శాడీలు చెప్తవా అని తిట్లు మొదలుపెట్టింది. సారా కుండ గుంజుకొని బాగా తాగింది. ఇంక ఆమెకు అడ్డు లేదన్నట్టు కొట్టుడు మొదలుపెట్టింది. ఇంకా కడుపు ఎందుకు కాలే అని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. నా కొడిక్కి మారు మనువు జేస్తా అన్నది. మాటా మాటా పెరిగి నన్ను జుట్టు పట్టి పచ్చడి బండతో కొట్టడం మొదలు పెట్టింది. దెబ్బలకి ఓర్వలేక కలబడ్డా. నా తోపుకి కింద పడ్డది.” అని చెప్పి మౌనం వహించింది.
ఆమె ఇంకా కొనసాగించకపోతే రీలామాల కాసేపు చూసి.. “ఊ ..తరవాత అన్నది.
కాసేపు ఆగి, చూపు తిప్పుకుని మెల్లగా అన్నది. “కత్తిపీట మీద పడ్డది.”
****
జితినీ చాలా అమాయకంగా ఉండేది. ఎవ్వరితో గొడవలు పెట్టుకొనేది కాదు. ఆమెకు చాలా విషయాలు కొత్తగా అనిపించేవి. పోలీసులు అంటే భయం. వార్డరు కూడా ఖాకీ బట్టలు వేసుకుంటుంది కాబట్టి ఆమె అంటే కూడా భయమే. రెండు వారాల కొకసారి కోర్టుకి పోయి రావడంతో కాస్త సర్దుకొంది. ఆకలికి మాత్రం ఆగలేకపోయేది. ప్లేటు నిండుగా అన్నం పెట్టుకొని తినేది. జైల్లో ఉదయం పది గంటలకే అన్నం ఇస్తారు. మళ్ళీ సాయంకాలం 4 గంటలకి రొట్టెలు ఇస్తారు. జితినీకీ అవి సరిపోయేవి కావు. రెండు పూటలా అన్నం తినాలనిపించేది. రీలామాల తన వంతు అన్నంలో సగం పక్కకు పెట్టి జితినీకి ఇచ్చేదీ. అది సాయంకాలం వరకూ దాచుకొని రొట్టెలతో పాటు తినేది.
జైలుకి వచ్చిన మహిళా ఖైదీలకి నెలసరి బయట ఉన్నప్పుడు ఆఖరు సారి ఎప్పుడు వచ్చిందో నోట్ చేస్తారు. తరవాత జైల్లో మళ్ళీ నెలసరి వచ్చిందా లేదా కనుక్కొంటారు. గర్భం దాల్చితే ఆ విషయం కోర్టుకి తెలియజెయ్యాలి. జితినీ వచ్చి నెలరోజులు దాటిపోయినా నెలసరి కాకపోయేసరికి టెస్ట్ చేశారు. ఆమె గర్భవతి. గర్భం దాల్చినందుకేమో ఆమెకు విపరీతంగా ఆకలివేసేది. అప్పుడప్పుడూ రీలామాలని “నిజంగానే నా కడుపులో బిడ్డ ఉందా! నాకయితే ఏం అర్థం కావట్లేదు. పొరపాటుగా అయితే చెప్పలేదు కదా” అని అడిగేది.
సరిగ్గా ఐదో నెల నడుస్తుండగా ఆమెకు మలేరియా వచ్చింది. గర్భిణీ స్త్రీ కి అందరికీ ఇచ్చినట్టు మందులు ఇవ్వడం కష్టం కాబట్టి ఆమెను బయటి హాస్పిటల్ కి ఎస్కార్టుతో పంపారు. నాలుగో రోజు జితినీ పారిపోయింది. నోట్లో నాలుక లేని పిల్ల. బయట ప్రపంచం పెద్దగా తెలియదు. ఎక్కడికి పోయిఉంటుంది?
****
పోలీసులు కూడా అదే విషయం ఆలోచించారు. ఎక్కడికిపోయి ఉంటుంది? ఆమెకు ఉన్న అవకాశాలేంటి అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.
ఒకరోజు రీలామాల కోర్టుకి వెళ్లింది. కోర్టులోని లాకప్ రూమ్ లో ఉండగా బయట కూర్చున్న పోలీసాయన రీలామాలతో మాటలు కలిపాడు. జితినీ ప్రస్తావన తెచ్చి “భలే ఆశ్చర్యం వేసింది. ఎంత అమాయకంగా ఉండేది కదా. మంచి పనిచేసింది.” అని నవ్వాడు. రీలామాల నవ్వి “మరి మీ సిబ్బంది ఉద్యోగాలు పోయాయిగా” అంది. ఏమంటాడో చూద్దాం అనిపించింది. “వాళ్ళకి కూడా బాగా అయ్యింది. మరి కాపలా పెట్టేది ఎందుకు? పారిపోతారనేగా! అయినా అలా బందించి పెట్టినపుడు ఎవ్వరైన అవకాశం వస్తే వదులుకోరు. నేను ఉన్నా వదులుకోను. వాళ్ళు డ్యూటీ చేయకపోతే సస్పెండవ్వరా మరి. నిద్రపోడానికి జీతం ఇస్తారా?” ఇంతకీ ఎక్కడికి వెళ్లిఉంటుంది? అదే ఊపులో అన్నాడు. రీలామాల నవ్వేసి అది కనుక్కోడానికే మీకు జీతం ఇస్తున్నారేమో!” అంది సరదాగా. అతను కూడా నవ్వేశాడు.
****
సరిగ్గా ఏడాది తరవాత జితినీ పట్టుబడింది.
ఆ వార్త కూడా అంతే సంచలనంగా మధ్యాహ్నానికే తెలిసింది. సాయంత్రం ఆమె రాక కోసం జైల్లో అందరూ ఎదురుచూశారు. సాధారణంగా ఎవరైనా జైలు నుండి పారిపోతే సంబందిత సిబ్బందిని సస్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఆ కోపం ఉంటుంది కనక దొరికి నపుడు ఆ కసి అంతా తీరేటట్టు కొడతారు. రీలామాల జితినీ గురించి ఆందోళనతో ఎదురుచూసింది. ఆమె వచ్చీ రాగానే అందరూ గందరగోళంగా అయినా అడిగింది అదే ప్రశ్న. ఆమె మొహం చూసో ఏమో మరి ఆమెను ఒక్క దెబ్బ కొట్టకుండా తీసుకు వచ్చారు.
ఆరోజు అందరూ ఆమెని చుట్టుముట్టి ఒకటే అడుగుతుంటే ఏవేవో పొడి పొడి సమాధానాలు చెప్పింది. లాక్ అప్ అయ్యాక రీలామాల బిస్తర్ దగ్గరకి వచ్చి కూర్చుంది. మెల్లగా ఒక్కో విషయం మాట్లాడడం మొదలుపెట్టింది. అందరూ చుట్టూ చేరారు. ఆమె ఏం పట్టించుకోలేదు.
ఆమె తప్పించుకుని తన చెల్లెలి దగ్గరకు వెళ్లింది. ఆమెకి జరిగిన విషయాలు ఏవీ చెప్పలేదు. భర్త దేశం బోయిండని పురుడు పోసుకోవడం కోసం వచ్చానని చెప్పింది. కానీ ఆమెకున్న ఆందోళన, మంచి తిండి దొరక్కపోవడం వీటన్నిటితో ఆమెకు పిల్లాడు పుట్టి పురుట్లోనే చనిపోయాడు. ఇంకా ఎంతకాలం ఉంటుందీ, మగడు ఎందుకు రాలేదు అంటూ అందరూ గుచ్చి గుచ్చి అడుగుతుంటే భయపడి మళ్ళీ అత్తగారింటికే వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు ఇంటికి రాకపోతుందా అని ఊహించి పోలీసులు అక్కడ స్థానికులకి చెప్పి కాపలా పెట్టుకున్నారు. వచ్చీరాగానే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి జైలుకి పంపారు.
జితినీ దిగులుగా తిరుగుతుంటే రీలామాల కూర్చోబెట్టి మాట్లాడింది. నా కడుపునో కాయ కాయలేదనేగా అత్త కొట్టేది. నా తప్పు లేకపోయినా అత్త పోయింది. మగడు దూరం అయ్యే, పిల్లాడు దక్కకపోయే. రీలమాలని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. రీలామాల ఆమె భుజం మీద చెయ్యి వేసి ఓదార్చింది.
“సరే అప్పుడేదో జరిగిపోయింది. హాస్పిటల్ నుండి ఎందుకుపారిపోయావు?” అర్థంకాక అడిగింది.
“మూడు రోజులు ఉన్నానా రోజూ రెండు బ్రెడ్డు ముక్కలు, ఇన్ని నీళ్ళ పాలు. మధ్యాహ్నం, రాత్రి గుప్పెడంత అన్నం. రాత్రి పూట నిద్రపట్టక పోతుండే. ఆకలికి తట్టుకోలేకపోయా దీదీ.”
**** **** *****
(ఆ ఆకలి నేరానికి ఆమెకు వేరుగా ఏడాది జైలు శిక్ష పడింది.)