సింగయ్య, పోలమ్మ రేపు రెస్టారెంటులో కలవాలని అనుకున్నారు. సింగయ్య నెల రోజులనుండి పోలమ్మని కలవాలని పోరు పెడుతుంటే ఈ రోజు ఓకే చెప్పింది.
సింగయ్యకు నిద్ర రావటం లేదు.తన గురించి చెప్పాలి. ఎలా మొదలు పెట్టాలి.చెబితే తను ఒప్పుకుంటుందా. ఒకవేళ ఒప్పుకోకపోతే.
తన వాళ్ళు చేసిన తప్పుకు నేనెందుకు బలికావాలి. ఇంతకాలం సమాజం నన్ను ఎంత వెలివేసిన ఒక లక్ష్యం ప్రకారం ఈ రోజు ఒక స్థానానికి చేరుకున్నాను. త్వరలో సివిల్స్ రిజల్స్ లో ఏదో ఒక ర్యాంక్ తప్పకుండ వస్తుంది.సెలక్టు అయిన తరువాత నా పొజిషన్ చూసి పోలమ్మ ఒప్పుకోవచ్చు. కానీ నన్ను నన్నుగా వొప్పుకోవాలని రిజల్ట్స్ రాకముందే ప్రపోసల్ పెట్టాను.
పోలమ్మ నో అంటే తను తట్టుకోగలడా. ఒప్పుకోకపోతే ఏమి చెయ్యాలి. రిజల్టు వచ్చిన తరువాత తన హోదా చూసి ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ప్రేమ అయితే ఉండదుకదా.
తన తండ్రి చేసిన పనికి జీవితమంతా శిక్ష అనుభవించ వలసి వస్తుంది. నాన్న బేల్దారి పని చేస్తాడు. వచ్చిన కూలి వచ్చినట్లు తాగి తగలేస్తాడు. తన దగ్గరే కూలీగా చేసే అమ్మను పెళ్లిచేసుకున్నాడు. రోజు ఇద్దరు తన్నుకోవటమే ఉండేది. అమ్మ చాలా ఓర్పుగా ఉండేది.
నాకు అయిదేళ్లప్పుడు వేరే ఆమెతో సంభందం పెట్టుకున్నాడు. నాన్న ఎంత తాగిన అమ్మ ఓర్పు పట్టిందిగాని వెరోకరితో సంభందం పెట్టుకోవటం ఇష్టం లేక పుట్టింటికి నన్ను కూడా తీసుకొని వెళ్లింది.
నాన్న అమ్మను రమ్మని గొడవ చేసేవాడు. పెద్దల పంచాయతీ పెట్టించాడు. పెద్దలందరు కలిసి ఇవన్నీ మామూలేకదా సర్దుకుపొమ్మని అమ్మకి చెప్పి పంపించారు.
కొంతకాలం నాన్న బాగానే ఉన్నాడు. తరువాత ఆమెను ఇంటికి తెచ్చి పెట్టాడు. రోజు గొడవలు అవుతుండేవీ.ఆమెకూడా అమ్మను బాగా వేదించేది. ఒకరోజు ముగ్గురికి గొడవలు అయ్యాయి. నేను ఆ రోజు సినిమాకు వెళ్ళాను.నేను వచ్చేటప్పటికి అమ్మ రక్తపుమడుగులో నిర్జీవముగా పడివుంది. ఇంటిచుట్టూ పోలీసులు చేరిపోయారు. అమ్మను చూసి నోటిమాట రాలేదు. చకచకా పనులు జరుగుతున్నాయి. అమ్మను అంబులెన్సులో ఎక్కించారు. నాన్నను ఆమెను పోలీసులు తీసుకొని పోయారు. నన్ను చైల్డ్ లైను వాళ్ళు వచ్చితీసుకొని పోయారు.
నాలుగు రోజుల తరువాత అమ్మమ్మ మామయ్య నా దగ్గరకు వచ్చారు. నన్ను తీసుకొని పోయి పెంచలేమని చెప్పారు. నన్ను ఒక చిల్డ్రన్ హోముకు పంపించారు.అక్కడ నాలాంటి వాళ్లందరు చాలా మంది ఉన్నారు. నేను కొంచం కూడా అడ్జస్ట్ కాలేకపోయాను. నెల రోజులు ఎవ్వరితో మాట్లాడకుండా వంటరిగా ఉండి పోయాను.
పదే పదే అమ్మ గుర్తుకు వచ్చేది. చివరి చూపు కూడా సరిగా చూడలేదు.అమ్మ ఎప్పుడు మాలాగా కూలి పనులు వద్దు. చిన్నప్పుడు మేము చదువుకోలేదు. అందుకని ఈ పనులు చేసుకుంటున్నాము. నువ్వు బాగా చదుకోవాలి.మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పేది.
చిన్నప్పుడు అంగనవాడికి తేసికొనిపోయి అక్కడ టీచరుకు మా అబ్బాయికి ఇప్పటినుండే చదువు బాగా చెప్పు అని అడిగేది. నేను గవర్నమెంటు బడిలో బాగా చదువుతున్నానని మాస్టర్లు చెబితే సంతోషపడి బోలెడు ముద్దులు ఇచ్చేదీ.
అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుపు వచ్చేది. అమ్మకు ఇష్టమయిన పనిచేయాలి అనిపించేది.కొన్ని రోజులకు అందరితో కలవటం అలవాటు చేసుకున్నాను. అందిరిలా బడికి వెళుతున్నాను.నేను బాగా చదువుతానని మాస్టర్లు నన్ను బాగా ప్రోత్సహించేవారు. అన్నిటిలో మంచి మార్కులు వచ్చేవి. ఇంటెర్మీడియట్ అయిపోయిన తరువాత హోమునుండి బయటకు పంపించారు. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు.ప్రసాదు సారు తన ఇంటికి తీసుకొని వెళ్లారు.
ఇంటరులో స్టేటు అయిదవ రాంకు వచ్చింది. సివిల్స్ చదవాలని ఉండేది.సాయంత్రాలు ట్యూషన్లు చెబుతూ చదువుకునేవాడిని. ప్రసాదు సారు బాగా సహాయం చేసేవాడు.
కోచింగులో పోలమ్మ పరిచయం అయింది. మొదటలో ఛీ పోలమ్మ పేరేమిటి అని నాతో సహా అందరూ అడిగారు.పెద్దోల్లు దేముడికి మొక్కుకున్నారని చెప్పింది. మేమందరం పోలమ్మ పేరు మార్చి పూజ అని పిలిచేవాళ్లం. తనకు మేజిస్ట్రేటు కావాలని పట్టుదలతో ఉండేది. అందరితో అంతా ఫ్రీగా ఉండేదికాదు. తనకు నచ్చినవారితో బాగా ఉండేది.
నాన్న శిక్ష పడకుండా పోలీసులను మానేజి చేసుకున్నాడు. నాన్నలాంటి చీడపురుగులను ఈ సమాజంలో ఏరిపారేయటానికి పోలీసు ఆఫీసరు కావాలని పట్టుదలగా చదివాను. పదిరోజులలో రిజల్ట్స్ వస్తాయి. తప్పకుండ మంచి ర్యాంకు వస్తుందని సార్లందరు ఎదురుచూస్తున్నారు.
రేపు ప్రసాదు సారును కలవాలని అని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు.
......................................
పోలమ్మ కు నిద్ర పట్టక కింద మీద అవుతున్నది.రేపు అతను ఏమి చెబుతాడో తనకు తెలుసు. చాలా రోజులనుండి ఇద్దరము బయట పడలేదు కానీ మనస్సులలో ప్రేమ పునాదులు పడ్డాయని తెలుసు. తన గురించి తెలిస్తే ఒప్పుకుంటాడా. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమి చెయ్యాలి. అసలు తనలాంటి వాళ్ళను సమాజం అంగీకరించటానికి ముందుకు వస్తుందా.
అనాధను పెళ్లిచేసుకోవటానికి సింగయ్య ఒప్పుకున్నా అతని తల్లితండ్రులు ఒప్పుకుంటారా.
తను మెజిస్ట్రేటు అయిన తరువాత తన హోదా చూసి ఎవ్వరైన చేసుకోవచ్చు కానీ తనను కోరుకొనే మనిషి కావాలి.నా గురించి తెలిసి సింగయ్య ఒప్పుకుంటే అంతకన్నా ఏమికావాలి. కానీ అతనికి ఎలా చెప్పాలి.
తనకు చాలా దగ్గరగా ఉండే ప్రియాచేత చెప్పిస్తే అన్న ఆలోచన రాగానే పక్కనే నిద్రపోతున్న ప్రియాను లేపాలంటే మనస్సు ఒప్పుకోవటం లేదు. కానీ తన భవిష్యత్తు ప్రియమీద ఆధారపడి ఉన్నది.
ప్రియాను లేపుతుంటే ప అటుఇటు తిరిగి ఏంటి పూజా చూడు టైమ్ రెండు అయింది రేపు మాట్లాకుందాము అంటూ పక్కకు తిరిగింది.
లే ప్రియా చాలా ఇంపార్టంట్ విషయము నీవే ఈ విషయం పరిష్కరించగలవు.
ఎవరైనా తనను నీవే ఈ పని చేయగలవు అంటే ఎంత పెద్ద పని అయినా ఇట్టే చేస్తుంది.
ఆ మాట అనటం ఆలస్యం టఖీమని లేచికూర్చింది.
ఏంటి ఇంత అర్ధరాత్రి నీ సమస్య అంటూ కళ్ళు తుడుచుకుంది.
రేపు సింగయ్య నన్ను కలవటానికి రమ్మని చెప్పాడు.
ఓస్ ఇంతేనా ఏముంది.డియర్ పూజా నేను నిన్ను ఘాడంగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అంటాడు.
ఇద్దరికీ ఒకరంటే ఒకరకి ప్రేమే కదా కాకపోతే ఇద్దరు ఏమి ఎరగనట్లు దొంగాట ఆడుకుంటున్నారు. సింపుల్. ఒకే చెప్పేయి.
అంతా ఈజినా ప్రియా.
నీకేమి తక్కువ. కలరు తక్కువేగాని మంచి కళగల మీఖం. ఏదో తెలియని కళ ని ముఖంలో ఉంటుంది. అదీగాక త్వరలో జడ్జివి అవుతావుకదా. నువ్వు ఏది చెబితే అది శాసనం.
కానీ నా గురించి నీకు కూడా తెలియదు కదా.
నేను ఎవరి గురించి ఏమి అడగాను కదా.మీదే కులం మతం మీ ఊరు ఇలా వ్యక్తిగత సమాచారం అడగటం నాకు అలవాటులేదు.మనస్సుకు నచ్చితే స్నేహం చేస్తాను. మనిషి ముఖ్యం కానీ మిగతావన్నీ అనవసరం డియర్.
కానీ నా గురించి చెప్పాలి.
అయితే ఇదిఏదో ఇంటరెస్టుగా ఉండే ఉంటుంది చెప్పు అంటూ అటెన్షన్ లో కూర్చుంది.
మాది చాలా పల్లటూరు. అక్కడ అందరూ కూలీ పనులు చేసుకుంటారు. నాకు రెండు ఏళ్ల అప్పుడు ఊరిలో పనులు లేక టౌనుకు వచ్చాము. అక్కడ అమ్మకు ఒకతను పరిచయం అయ్యాడు.నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాన్న చాలా అమాయకంగా ఉంటాడు.ఇద్దరు గొడవపడ్డారు.అమ్మ అతని దగ్గరకు నన్ను తీసుకొనిపోయింది. ఎంతమంది చెప్పిన తిరిగి రాలేదు.నాన్న అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు.
నాన్న లాగా కాకపోయిన కొంచెం బాగానే చూసుకొనేవాడు. నన్ను హాస్టలులో పెట్టారు. సెలవులకు తీసుకొనివెళ్ళేవాళ్లు.
పదో తరగతికి వచ్చినగాని నేను పెద్ద మనిషి కాలేదు. అమ్మకన్న అతను నేను పెద్దమనిషి కాలేదని హైరానా పడేవాడు. అతనే దగ్గరుండి డాక్టరులకు చూపించేవాడు. పదో తరగతి మద్యలో పెద్ద మనిషి అయ్యాను.
పెళ్లిలాగా పెద్ద ఫంక్షన్ చేశాడు. వచ్చినవాళ్లందరు సొంత తండ్రి కాకపోయిన సొంత పిల్ల కన్నా ఎక్కువ చేశాడు అని అంటుంటే నాన్న గుర్తుకు వచ్చాడు. నా పుట్టిన రోజు అంటే నాన్న చాలా బాగా చేసేవాడు. ఉన్నదాంట్లో తన తోటి వాళ్ళను పిలిచి భోజనాలు పెట్టేవాడు.
పెద్ద మనిషి అయ్యిందికదా. ఇంక హాస్టల్లో వద్దు.ఇంటిదగ్గర ఉండమని చెప్పి హాస్టల్ నుండి తీసుకువచ్చారు.
అమ్మ లేని టైములో నన్ను అదో రకంగా చూసేవాడు. అమ్మతో చెబుదామంటే ధైర్యం చాలలేదు.
ఒకరోజు అమ్మ పక్క ఊరికి వెళ్లింది.రాత్రికి రాలేదు.అర్థరాత్రి నా పక్కలోకి వచ్చాడు. నోరు మూసి గట్టిగా ఎవరికి చెప్పకూ. నిన్ను ఏమి చేయను. నేను చెప్పినట్లు చేయి. మీ అమ్మ లేనప్పుడు మాత్రమే నాతో ఉండు. తరువాత టౌనులో మంచి కాలే జీలో చేర్పిస్తాను. అప్పుడు మీ అమ్మకు తెలియదు. అక్కడ నీకు బాగా డబ్బులు వచ్చే ఉపాయం చెబుతాను.
నువ్వు ఇలా నన్ను పట్టుకోకు. స్కూలులో బాడ్ టచ్ గుడ్ టచ్ అని చెప్పారు. నువ్వు బాడ్ టచ్ చేస్తున్నావు. మంచిదికాదు. నీమీద పోలీసులకు చెబుతాను. వాళ్ళు వచ్చి బొక్కలో తోస్తారు అని అనగానే సరే ఎలా లొంగవో చూస్తాను అని బూతులు తిడుతూ అప్పటికి వదిలేశాడు.
అమ్మ కు చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డాను. అయితే అతను కొన్ని రోజులు ఇంటికి రాలేదు. పీడ విరగడయిందనుకున్నాను.
అతను ఎందుకు రావటం లేదని అమ్మ పోను చేస్తే నీ కూతురు మంచిగా లేదు. ఎవడితోనో తిరుగుతుంది. నీ కూతురిని అదుపులో పెట్టు లేదంటే నా పరువు పోతుంది అని చెప్పాడు.
అది విన్న అమ్మ నన్ను ఎవడే వాడు అంటూ చచ్చేటట్లు కొట్టింది.
అమ్మను లోపల తిట్టుకుంటూ నువ్వు ఉంచుకున్న వాడే అని చెప్పాలని నోటిదాకా వచ్చి నిదానంగా తెలుస్తుందని నోరు మూసుకున్నాను.
పది రోజుల తరువాత వచ్చాడు. ఏమి ఎరగనట్లు మామూలుగా ఉన్నాడు. తాగిన మైకంలో ఇలా చేసిఉంటాడని నేనే సర్దుకున్నాను.
మళ్ళీ ఒక రోజు అమ్మ పనికి పోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం నా మీద పడ్డాడు. గట్టిగా అరిచిన అరుపులకు పక్కింటి వాళ్ళు వచ్చి అతనిని కొట్టబోయారు.
అమ్మ కు విషయం తెలిసింది. ఎలాగూ విషయం తెలిసింది కదా అని అతను నీ కూతురిని వ్యాపారంలో పెడితే మంచిగా డబ్బులు వస్తాయి.తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పెడతాను. ఎవరికి తెలియదు. కాలేజిలి చేరి చదువుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు. మంచిగా డబ్బులు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుని పరువుగా బ్రతకొచ్చు. ఈ విషయం బయటకు రాదు.అదేదో నాతో చెడితే ఈ పనికి అదే ఒప్పుకుంటుంది. నువ్వు ఊ అంటే నీ బతుకు నీ కూతురి బతుకు బాగుపడుతుంది ఆలోచించుకో అన్నాడు.
అమ్మ నా ముఖం చూడలేకపోయింది. నేనంటే తప్పు చేశాను. నీ బతుకు బుగ్గిపాలు చేయను అంటూ నన్ను ఒక్కసారిగా వాటేసుకుంది. నీవు బాగా చదువుకో. అతని సంగతి నేను చూసుకుంటాను అన్నది.
పగ బట్టిన వాడు లాగా అమ్మను బాగా గొడవ చేస్తున్నాడు. ఇద్దరికీ బాగా కొట్లాటలు అవుతున్నాయి.
ఒకరోజు బాగా తాగి అర్థరాత్రి వచ్చాడు. ఇదే ఆఖరుగా అడుగుతున్నాను. నీ కూతురిని పంపుతావా లేదా అంటూ గొడవపడ్డాడు. అమ్మకూడ అతనికి ఎదురు తిరిగింది.బయట పడుకున్న నేను లేచి అమ్మకు సపోర్టుగా వెళ్ళాను.
అతను ఖంగు తిని మూల ఉన్న కిరసనాయులు డబ్బా తీసుకొని అమ్మ మీద పోసి అగ్గిపుల్ల గీశాడు. భగ్గున మంట లేచింది. కేకలు వేస్తూ నీళ్ళు తెచ్చి పోసాను. సగం కాలిపోయిన అమ్మను హాస్పటలుకు తీసుకొనిపోయాము. వారం రోజులు బ్రతకటానికి పోరాటం చేసింది.
చనిపోయే ముందు మరణ వాగ్మూలంలో స్టవ్వు అంటుకుందని తనమీద ఎవ్వరూ ఏమి చేయాలే దని చెప్పి నన్ను ఒంటరిదాన్ని చేసింది. అతనిమీద కేసు లేకుండా పోయింది నన్ను అనాధ ఆశ్రమంలో చేర్చారు. అక్కడ నుండి ఇదుగో ఇక్కడకు చేరాను. అందుకే జడ్జి అయ్యి ఇలాంటి వెధవులకు మరణ శిక్ష వేయాలని పట్టుదలగా చదువుతున్నాను.
వింటున్నంతసేపు ప్రియాకు కన్నీళ్లు ఆగటంలేదు.
పూజనే కాదు ఇలాంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. పూజా సంధర్బం వచ్చింది కాబట్టి మనస్సు విప్పి చెప్పింది. కానీ తన గురించి చెబితే.
వద్దు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూ అని మనస్సు హెచ్చరిస్తూ ఉంది. తనది చాలా మంచి కుటుంబం దేనికి లోటు లేదు. నాన్న బాబాయి కలిసి వ్యాపారం చేస్తున్నారు.అందరమూ ఇంట్లో కలిసే ఉంటాము. కానీ బాబాయి అప్పుడప్పుడు తనను అనుభవిస్తూ ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పిన నమ్మరు. నోరు మూసుకుని భరించటమే తప్ప వేరే గత్యంతరం లేదు. నాకు మంచి రోజులు ఉన్నాయి అని పిస్తుంది. ఎందుకంటే ఈ మద్య బాబాయికి పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నాడు. ఇలాగ పీడ విరగడ అయ్యింది.
అందుకే తనకు పెళ్లి అన్న ప్రేమలు అన్న నమ్మకం లేదు. కానీ ఎలా గయిన వీళ్ళ ఇద్దరినీ కలపాలి.
పూజా నువ్వు హాయిగా కళలు కంటూ నిద్రపో. రేపు ఉదయమే సింగయ్య ను కలిసి విషయం చెప్పి తప్పకుండా మీ పెళ్లి చేస్తాను.
ప్రియా అనుకుంటే ఏదైనా సాధిస్తుంది.
.............
సింగయ్య కూడా డైరక్టుగా చెప్పలేక ప్రసాదు సారును రాయబారం పంపాడు. ప్రసాదు సారు ప్రియా ద్వారా పూజకు చెప్పించాలని, ప్రియా ప్రసాదు సారు ద్వారా సింగయ్యకు చెప్పించాలని అనుకున్నారు.
ముందుగా ప్రసాదు సారు ప్రియాకు పోను చేసి అర్జంటుగా నీతో మాట్లాడాలని అంటే నేను కూడా మీతో మాట్లాడాలని చెప్పింది. ఇద్దరు కలిసి ఆ ఇద్దరి గురించి మాట్లాడుకున్నారు. మొత్తానికి ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకుంటూ పెళ్లి ముహూర్తం పెట్టేశారు.
..................
పెళ్లి రిజస్టర్ ఆఫీసులో జరిగింది.వాళ్ళ ఇద్దరి జీవితంలో వాళ్ళకు సహరించినవారి నందరిని పిలిచి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని ఈ సమాజనికి తమ వంతు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
వచ్చిన వాళ్ళందరూ ఇంతకీ వీళ్ళ ఇద్దరి పెళ్లి చేసావు కదా ఇక నీ పెళ్లి ఎప్పుడు అని ప్రియాను ఆట పట్టిస్తున్నారు.
నేను పెళ్లి చేసుకొను. బ్రహ్మచారిణిగా ఉండిపోతాను. జీవితంలో చాలా పనులు ఉన్నాయి చేయటానికి. పెళ్లి పిల్లలు ఈ ఊబిలో పడలేను. హాయిగా నా ఇష్టమయినట్లు ఉండవచ్చు. ఒకరి పెత్తనంలో ఉండి ఏమిచేయలేను. ఇలా నన్ను వదిలేయండి.
ఈ మాటలు పైకి అంటున్న లోపల అగ్నిపర్వతాలు పేలిపోతున్నాయి.చిన్నతనంలోనే ఎంత లైగిక హింసకు గురియ్యింది. సొంత బాబాయే రాక్షసుడిలా తన జీవితాన్ని భస్మం చేశాడు. ఎవ్వరికీ చెప్పుకుందామన్న పెత్తనం బాబాయిదే ఇంట్లో. చెప్పిన ఎవ్వరూ నమ్మరు.నాకు ప్రెగ్నెస్సీ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. మందులు వాడి వాడి ఒళ్ళు హూనం అయ్యింది. తన శరీరం అంటే తనకే అసహ్యం వేసేది. ఆ లైంగిక హింస తరువాత ఎలాంటి ఫిలింగ్స్ రావటం లేదు. మనస్సు మొద్దుబారి పోయింది. సెక్సు అంటే రోత వచ్చింది. మగవాళ్లను చూస్తేనే ఆసహ్యం వేస్తుంది. అలాగని తను కన్య కాదుకదా. పాపం నన్ను చేసుకొనే వారిని మోసం చేయలేను.పూజా సింగయ్య లు అనాధ లుగా మారటానికి లైంగికతే కారణం. ఈ ప్రపంచం అంతా దీని చుట్టూనే తిరుగుతుందా అనిపిస్తుంది.
దేశంలో ప్రధాన చర్చ అయిన నిర్భయ, దిశ లాంటి కేసులు బాహ్య ప్రపంచానికి తెలిసినవి. ఈ కేసులలో మానభంగం మరణము జరిగింది.
కానీ నాలాంటి కేసులలో ఇష్టం లేకుండానే కార్యక్రమం నడుస్తుంది. ఎదుటివారికి ఇష్టం లేకుండ జరిగే లైంగిక చర్య మానభంగమే. కలిసిన ప్రతిసారి మరణిస్తూ మానభంగం భరిస్తూ ఉండటమే. ఇది మరీ భయంకర దారుణం. అదేదో వారిలాగా ఒక్కసారి చచ్చిపోతే బాగుండేది. ఇలా చస్తూ బ్రతకటం పెద్ద నరకం.
నాలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ బయటకు రారు. ఎందుకంటే పరువు ముఖ్యం.పరువు కోసం హత్యలైనా చేసే సమాజం మనది.
ఇలాంటి లైంగిక హింస చేసేదికూడా ఎక్కువగా తెలిసిన వాళ్లే. చాలా పకడ్బంధిగా మూడో కంటికి తెలియకుండా నడిపిస్తారు. ఏదిఏమైనా పరువు నిలబెట్టవలసింది ఆడవాళ్లే. అందుకని నోరుమూసుకొని గుడ్ల నీరు గుడ్ల కక్కుకొని బ్రతకవలసిందే నాలాగా.
కొన్ని జీవితాలు ఇలా బూడిద కావలిసిందే.కానీ జీవితమంటే ఇదే కాదు కదా.నాలాంటి వాళ్ళకు చెప్పుకోవటానికి మనుషులు ఉండరు. పోనీ చెప్పినా అర్థం చేసుకునేవాళ్లూ ఉండరు.చెప్పిన నమ్మరు కూడా. ఛ అలా ఎందుకు చేస్తారు అని ఎదురు ప్రశ్నిస్తారు.
అందుకే చెప్పుకోవటానికి రాలేక పోతున్నారు. ఇలాంటివారికి చెప్పుకోవటానికి ఒక ఓపెన్ విండో ఉండాలి. కొంత ఊరట అన్న దొరుకుతుంది.సమస్య బయటికి వస్తే పరిష్కా రం దానంతట అదే దొరుకుతుంది.
నాలాంటి భాదితులకు ఆసరా కావాలి. బాబాయిలాంటి దుర్మార్గులకు గుణపాఠం చెప్పాలి. మేము ముగ్గురము ఈ సమాజం చేసే దుర్మార్గాలకు బలి అయినవాళ్ళమే. పోలీసు ఆఫీసరుగా సింగయ్య, జడ్జిగా పూజా సహకారం ఉంటే తను అనుకున్న పని విజయవంతమవుతుందని, భాదితుల కోసం కొత్త ఆలోచనలు ప్రియ మదిలో రూపు దిద్దుకొంటున్నాయి.
.................................
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు