మా రచయితలు

రచయిత పేరు:    శ్రీ

కథలు

చిలకలు 

వాన వస్తుంది అనుకుంటా. తూనీగలు గుంపులుగా ఎగిరి గుసగుసలు చెప్పుకుంటున్నట్టు దగ్గరగా కూడుతుంటే వాన వస్తుందని మా అమ్మమ్మ చెప్పింది. ఒక్కోసారి ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు తన భయం దాచుకుని, నాకు ధైర్యం ఇవ్వడం కోసం "అర్జునా, పార్ధా "అని అర్జునుడి పది పేర్లు గడ గడా చదివేస్తుంది. 

ఆకాశం నల్ల మబ్బేసుకోగానే మొదలైంది నాలో ఆత్రం, అది స్కూలు వదిలే సమయం అయితే నాకు తిట్లు ఏ కోశానా తప్పవు. స్కూల్ నుంచి ఇంటికి హాయిగా తడుచుకుంటూ వెళ్ళాలి అనిపించింది. తెల్ల యూనిఫామ్‌ ఎందుకు పెట్టారో బడిలో. ఇంటికి వెళ్లే లోపు తడిచి ఎర్రగా చేయడంలో ఆరిందా. ఇంట్లో అల్లరి చేస్తున్నానని అమ్మమ్మ దగ్గర పెట్టి చదివిస్తున్నారు. అమ్మమ్మ నాకు కాపలాయో నేను అమ్మమ్మకు కాపలాయో.

దూరంగా ఆకాశంలో నా బొట్టుబిళ్లంత నల్లమబ్బు. అది నుదురంతయ్యి, నా పొడవాటి జుట్టు కొసంతయ్యి, నా కాలి మడమ అంత సాగి... బాబోయ్‌.. తొందరగా ఇల్లు చేరాలి.. లేకుంటే వానలో తడిచిపోతాను. ఈ వాన ఏదో పొద్దున పడుంటే స్కూల్ కి సెలవు వచ్చేది. ఎనిమిదో క్లాసు బి సెక్షన్‌లో మొత్తం ఎనిమిది మంది అమ్మాయిలు. నాతో వచ్చేది మా ఆల్ ఇండియా రేడియో, సౌజన్య ఒక్కతే. దీనికి తెలీని వార్త లేదు, చెప్పని కబుర్లు లేవు. ఇవాళ అది డుమ్మా. రోజూ మూడు కిలోమీటర్లు ఉండే స్కూల్‌ని ఆరు సినిమా మాటలతో నడిచేస్తాం. ఇవాళ అడుగులు సాగందే. ఏదో బోరు సినిమా చూస్తున్నట్టు.

ఇంకో వీధి దాటితే మా ఇల్లు. ఇంతలో వనజక్క ఇంటి ముందు షామియానా.

'ఓ... చిలకలు' అనుకున్నా సంబరంగా.

కాని అటువైపు వెళ్లడానికి లేకుండా వీధి మొదల్లో నాలుగు తాటి దుంగల్ని అడ్డుగా పడేశారు. ఒక పెద్దాయన భుజాన గళ్ళటి టవలు వేసుకుని రేకు కుర్చీలో కూచుని ఉన్నాడు బండ్లు, సైకిళ్లు రానీకుండా అనుకుంటా.

'ఇటు నుంచి కాదు అమ్మాయ్‌.. అటు నుంచి వెళ్లు' అన్నాడు. ఇంకో వీధి నుంచి మా ఇల్లు కొంచెం దూరమే. కాని చిలకల కోసం పరిగెత్తా.

ఇంటికెళ్లే సరికి అమ్మమ్మ లక్ష్మికి కుడుత్తొట్టిలో తౌడు కలుపుతోంది. గొడ్ల సావడి గేటు తీయగానే ఆ చప్పుడుకి నేను అని తెలిసినా లేచి చూసింది.

'త్వరగా రావచ్చు కదా. నా చేత్తో పెట్టేదాన్ని. ఇప్పుడు చూడు నువ్వూ ఆకలికి ఆగవు, ఇదీ ఆగదు' అంది మోచేతి వరకు చేతులు అందులో ముంచుతూ.

'ఖోఖో ఆడుకున్నాము' అన్నాను.

'సర్లే. ఆ జల్లెడ షెల్ఫులో బూంది పెట్టాను.  కాళ్ళు చేతులు కడుక్కొని తిను' అంది.

'చిలకలు ఎక్కడ పెట్టావు?'

'చిలకలు లేవు... ఎలకలు లేవు... వెళ్లి బూంది తిను'

'వనజక్క ఇంటి ముందు షామియానా వేశారుగా'

'వేస్తే? ప్రతిసారీ మనకు చిలకలు పంపాలని ఉందా? ఇంట్లోకి పో.' అంది.

అమ్మమ్మ అంత విసురుగా ఎప్పుడూ మాట్లాడదు. బెదిరి ఇంట్లోకి వచ్చి వంటింట్లోకి నడిచా.

జల్లెడ షెల్ఫు వంటింట్లో ఉంటుంది. అది ఒక చిన్న చెక్క జాలీ అల్మారా. ఫ్రిడ్జ్‌ లేని కాలంలో అదే ఫ్రిజ్జు అమ్మమ్మకు. చద్దన్నం, పిండి వంటలు ఇందులో పెట్టేది. దాని తలుపులకి చిన్న గొళ్ళెం ఉండేది. ఒక్కోసారి సరిగ్గా పట్టేది కాదు. ఒక పుల్లో లేక కొప్పు పిన్నో అందులో దూర్చేది. తెరిచి బూంది తిసుకున్నా. స్టీలు గిన్నెలో వేసుకొని బొక్కుతున్నానుగాని చిలకలు ఏమయ్యాయి చెప్మా అనేదే ఆలోచనా.

నేను ఐదో క్లాసులో ఉండగా వనజక్క ఇంటి ముందు షామియానా వేశారు. ఇంటికి వచ్చి చిలకలు, తాంబూలం ఇచ్చి శుభవార్త చెప్పారు. వనజక్క పెద్దమనిషి అయ్యిందంట. ఏడో క్లాసులో ఉండగా వనజక్క ఇంటి ముందు మళ్లీ షామియానా వేశారు. చిలకలు, తాంబూలం తెచ్చి శుభవార్త చెప్పారు. వనజక్క పెళ్లట. మొన్న ఆరునెలల పరీక్షలప్పుడు మళ్లీ షామియానా వేశారు. వనజక్క సీమంతం అట. ఈసారి చిలకలు చాలా ఇచ్చారు.

తియ్యగా ఉండే ఆ చిలకలు నాకు చాలా ఇష్టం. ఊళ్లో చాలా ఇళ్ల ముందు షామియానాలు వేసి ఫంక్షన్లు చేసేవారు. కాని వనజక్క వాళ్ల ఇంట్లోనే ఎప్పుడు షామియానా వేసినా చిలకలు ఇచ్చి మరీ పిలుపులు పిలిచేవారు. 

'ఎప్పుడూ ఇవే ఎందుకు ఇస్తారు?' అని అడిగాను ఒకసారి అమ్మమ్మను ఆ చిలకలు తింటూ.

'ఇంట్లో మంచి జరుగుతుంటే ఆ కబురును తీపితో చెబుతారులే' అంది అమ్మమ్మ.

ఒక్కోసారి చిలకలు వెగటు పుట్టి వదిలేసేదాన్ని. ఇంక తినను అని అమ్మమ్మ తేల్చుకుని మిగతావి పప్పు గుత్తితో దంచి పంచదార కింద వాడేసేది. 

'మరి? ఏమనుకున్నావు మా అమ్మంటే? ఆ తరం తెలివి, పొదుపు అలా ఉండేది మరి. మీలా తట్ట తగలేసి పేలాలు వేయించడం కాదు' అని మా అమ్మ ఆ తర్వాతి రోజుల్లో అనేది.

అమ్మమ్మ నన్ను గట్టిగానే పెంచింది. 

'అంత గట్టిగా రిబ్బన్‌ కట్టినా జడలు ఎందుకు కట్టినవి కట్టినట్టు ఉండట్లేదు? రోజూ ఎందుకు బడి నుండి వచ్చేసరికి మొత్తం ఊడిపోతున్నాయి?' అని వీపు విమానం మోత మోగించి, చిలకలు పెట్టలేదు ఒకరోజు నాకు. కొట్టినందుకు కాక చిలకలు పెట్టనందుకు నాకు ఎక్కువ బాధ వేసింది.

బూంది తినడం పూర్తి చేసి గ్లాసెడు నీళ్లు తాగేశాను. ఇప్పుడు ఆకాశం పూర్తిగా మూసుకుంది. ఇంక ఇప్పుడో మరునిమిషమో వాన కురిసేస్తుంది. 

అమ్మమ్మ పనులు ముగించుకుని లోపలికి వచ్చింది.

'నేను వనజక్క ఇంటికి వెళ్ళొస్తా. తాత, చిన్నమామ వచ్చే వేళయ్యింది. వేడి నీళ్ళకి కాగు కింద మంట పెంచి, రెండో పొయ్యి మీద ఎసరు పెట్టు, అరగంటలో వస్తా' అని హడావిడిగా బయల్దేరింది.

'నేను కూడా వస్తా ఫంక్షన్‌ కి' అని అమ్మమ్మ చీర కొంగు అంచు పట్టుకున్నా.

నా మాట పూర్తి అయ్యే లోపు, 'వద్దు. ఇది ఫంక్షన్‌ కాదు. పిల్లలు రాకూడదు. భయపడతారు' అని వెళ్ళిపోయింది.

ఆ రాత్రి చాలా వాన కురిసింది. తాత, మామ వచ్చే సరికి కరెంటు పోయింది. లాంతరు వెలుగులో భోజనం వడ్డిస్తూనే చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. "నెలలు నిండిన  వనజక్క హాస్పిటల్లో చాలాసేపు ఇబ్బంది పడిందట. పుట్టిన బిడ్డ కూడా అమ్మ మాట్లాడటం లేదని తనూ మాట్లాడలేదు" అని ఆ మరుసటి రోజు స్కూల్ కి వెళ్తూ సౌజన్య చెప్పింది.

అందుకని షామియానా వేశారట.

నేను ఈనాటి వరకూ మళ్లీ చిలకలు తినలేదు.

నెయ్యి బువ్వ

"ఇప్పుడు షాపింగ్ అని నా వీకెండ్ వేస్ట్ చేయకమ్మా"

"చెప్పేది విను. నీ వీకెండ్ ఏమీ వేస్ట్ అవ్వదు. ఇక్కడే హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో నల్గొండ జిల్లాలోనే పోచంపల్లి. 40 కిలోమీటర్లు ఏమో అంతే. మధ్యాహ్నానికి వచ్చేద్దాం"

"సరే పద, రానంటే ఊరుకోవు కదా" అని గొణుకున్నాను

సిటీ దాటి కాస్త దూరం వెళ్ళాక, ఎడమ చేతి వైపు 'భూదాన్ పోచంపల్లి' అని బోర్డు కనిపించింది. అక్కడ లెఫ్ట్ తీసుకుని కాస్త లోపలికి వెళ్ళాక ఒక మెయిన్ రోడ్డు, దానికి రెండువైపులా చిన్న చిన్న గల్లీలు. గల్లీకి రెండువైపులా పెంకుటిళ్లు. ప్రతి ఇంటి ముందు ఒక అరుగు, వసారాలో మగ్గం పనికి సంబంధించిన ఏదో ఒకటి కనిపించింది అక్కడ.

కార్ ఇంక ఆ గల్లీలో వెళ్ళేటట్టు లేదని తెలిసి, పక్కన పార్క్ చేసి, చీరలు ఎక్కడ కొనాలా అని వరుసగా చూసుకుంటూ వెళ్ళాం నేను, అమ్మ. ఒక ఇంటి దగ్గర నిలువు పేకల మగ్గంపై నేసిన నలుపూ తెలుపు రంగు చీర కనబడింది.

"అది బాగుంది, తీసుకో" అన్నాను .

"నలుపూ తెలుపు కాంబినేషన్‍లో ఏది చూసినా అదే ఫైనల్ అంటావు. ఇంకా చూద్దాం ఉండు" అంది అమ్మ.

వసారాలో ఒకతను రంగులద్దే పనిలో ఉన్నాడు. ఇదే కదా రంగు అని ఒక పెద్దాయన్ని అడుగుతున్నాడు.

"పసుపు రంగు తగ్గియ్. చీర కన్నా పెళ్లికూతురు ఎక్కువ మెరిస్తే బాగుంటది."

"అంచుకి కొండలు కాదు, కమలం వెయ్. కమలం విరబుయ్యాలె. ఆకులు రెపరెపలాడాలె. అట్లుండాలె. కొంగు రంగు మూర మూరకి మారాల. అది డిజైను" అని మగ్గం మీద కూర్చున్న ఇంకొక అతనితో చెప్తున్నాడు.

ఇంతలో మమ్మల్ని చూసి, "రా బిడ్డా రా, పోచంపల్లి చీరలు మస్త్ ఫేమస్ మాకాడ. ఓ నాల్గు చీరలు పట్కవోదువుతీయి" అని లోపలికి తీసుకువెళ్లాడు.

మూడు గదుల ఇల్లు అది. వంటింటి నుండి గిన్నెల చప్పుడు వినబడింది. కొత్త కోడలు అనుకుంటా, మెడలో పసుపు తాడు ఆమె మేని రంగుతో పోటీ పడుతోంది. చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి పెద్దావిడ పక్కన కూర్చుంది. ఆసు పోయడం నేర్చుకుంటోంది. కాసేపటి తర్వాత "నెయ్యి బువ్వ బిడ్డా" అని పెద్దావిడ కోడలికి చెప్పి లోపలికి వెళ్ళింది.

"నెయ్యి బువ్వ ఏంటి? అప్పుడే భోజనం వేళ అయ్యిందా?" అనుకున్నాను చేతికున్న గడియారం వంక చూస్తూ.

"సూడు బిడ్డా. గీ చీరలకి పాత బస్టాండ్ల మా పట్కరోల్ల దుక్నంల మంచి గాజులు పట్కవోదు, మస్త్ ఉంటై, లచ్మి దేవి లెక్క." అని చీరలు పట్టుకొచ్చి మా ముందు పెట్టాడు ఆ పెద్దాయన.

ఆయన ప్రతి డిజైన్, ప్రతి రంగు తీసి చూపించి, భుజంపై వేసుకుని, అటు ఇటు తిప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కొడుకు వాటిని తిరిగి మడతలు పెడుతున్నాడు.

"ఇది ఇక్కత్ నేత బిడ్డా. మన బతుకుల్లో అంకాలున్నట్టే ఇందులో కూడా చానా ఉంటై. ఇవి రెడీ కావడానికే మస్త్ టైం పడ్తది. జీవితం లెక్కనే చిక్కులు చిక్కులుగా ఉంటది పట్టు దారం. ఒక్కో సమస్య తీర్చి ముందుకు పోయినట్టే ఒక్కో పోగును రాట్నంపై వడుకుతం. వడికిన పట్టు కండెలకు సుట్టి, ఆడ నుండి దారమంతా ఆసు పోస్తం. అగో అట్ల" అని కోడలు వైపు చూపించిండు. "ఆసుకు రంగు అద్దకముందే డిజైన్లు వేస్తం. మస్తుంటయి ఆ డిజైన్లు. నెమళ్ళ నాట్యం, చిలుకల నవ్వులు కానొస్తయి ఈ ఇక్కత్ నేతల. డిజైన్లు ఆసుపై వేస్కొని, మిగిలిన ఆసుకు రబ్బర్లు చుట్టేస్తం. అచ్చం మనం జీవితంల దేని మీద మనసుపెట్టాల్నో దాని మీదనే పెట్టి, మిగతాది ఇడ్సినట్టు. వేడి చేసిన రంగునీటిలో రంగులద్ది, అది ఆరినంక రబ్బర్లు విప్పి వార్పు పరుస్తరు, దాన్ని మగ్గంపై నేస్తరు. మగ్గం నేసేటప్పుడు చేనేత కార్మికుడి చేతులు, కాళ్లు పని చేయాల్సిందే. ఏ ఒక్కటి ఆగినా చీర రాదు."

ఇంత ఉంటదా ఒక చీర వెనక కష్టం అన్నట్టు ఆ పెద్దాయన్ని చూస్తూ కూర్చున్నాను. అమ్మ ఓ నాలుగు చీరలు సెలెక్ట్ చేసుకుని బిల్లు కట్టింది. మళ్ళీ కావాలంటే తప్పకరండి అని చెప్పి, ఫోన్ నెంబర్ ఇచ్చి గుమ్మం వరకు వచ్చి సాగనంపాడు పెద్దాయన.

రెండు వారాల తర్వాత, 'మండే బ్లూస్' అని ఫ్యాన్సీగా చెప్పుకునే ఓ సోమవారం. పది గంటల సమయంలో నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర క్యాబ్ దిగాను. సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్ పెట్టి లోపలికి వెళ్తూ గ్లాస్ డోర్ అద్దంలో నేను కట్టుకున్న చీరని మరోసారి చూసుకున్నాను. మీటింగ్‍కి ఈ చేనేత చీర ఏంటని అమ్మని పదిసార్లు తక్కువ అడిగుండను. పెద్ద పెద్ద కంపెనీల నుండి సీనియర్ లీడర్స్, ఫారిన్ డిగ్నిటరీస్, ఎన్‌జిఓ నుండి ప్రతినిధులు, అందులోనూ ఆడవారు వస్తున్నప్పుడు కాస్త కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలంటే చీర సరైన డ్రెస్ కోడ్ అని నచ్చజెప్పింది.

'అన్ని ఫ్యాన్సీ చీరలు ఉంటే ఈ ఓల్డ్ మోడల్ చీర ఇచ్చింది అమ్మ.. ఏముంది ఇందులో? జ్యామితి పుస్తకంలో బొమ్మల్లా చీర అంచులో కొండలు, కమలాలు. ఎలా దీన్ని క్యారీ చేయడం?' అని ఆలోచనలో పడ్డాను.

వెనుక నుండి సంయుక్త వచ్చి భుజం తట్టగానే ఆలోచనల్లో నుండి బయటపడి తిరిగి చూసాను.

"ఏంటే, నువ్వేనా? ఆఫీస్‍కి సూట్ అంటేనే చిరాకు పడేదానివి, ఇవ్వాళ ఏకంగా చీర, అది కూడా ఇక్కత్.. అద్దిరిపోయింది లుక్.."

"థాంక్యూ.."

"వెల్కమ్ వెల్కమ్, సరే పద, మనం వెళ్ళాల్సింది ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ రూమ్‍కి"

అప్పటికే లాబీలో హై టీ నడుస్తోంది.

"లూజ్ హెయిర్ మీద ఈ ఇక్కత్ చీర భలే ఉంది" అని తెలిసినావిడ షేక్ హ్యాండ్ ఇస్తూ మెచ్చుకుంది. ఆవిడ మాటలకి అప్పటివరకు పడ్డ టెన్షన్ కాస్త తగ్గింది.

లోపలికి వెళ్ళగానే ఒక ఫారిన్ డెలిగేట్ ఎదురొచ్చి తన కంపెనీ బ్రోచర్ ఇచ్చింది. "ఓహ్! ఐ లైక్ యువర్ స్టైల్. ది సారీ అండ్ ది సిల్వర్ జ్యువలరీ, జస్ట్ బ్యూటిఫుల్" అని చీర కొంగు చేతిలోకి తీసుకుని బట్టని సవరతీసింది. మనసు ఇంకా తేలిక పడినట్టు అయ్యింది.

ఒకావిడ ప్రోగ్రాం గురించి చెప్తూ, "ఇక పరిచయాలకు వస్తే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ, ఇవ్వాళ మీరు వేసుకున్న డ్రెస్ గురించి లేక తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ గురించి, ఇక వేరే ఏదైనా సరే ఏమైనా స్పెషల్ ఉంటే మాట్లాడండి" అని చెప్పి ముందు వరుసలో కూర్చున్నావిడకి మైక్ అందించింది.

పరిచయాల పేరుతో వాతావరణం ఫ్రెండ్లీ గా అయేటట్టు, ఒకరినొకరు బాగా తెలుసుకోవచ్చని ఆవిడ ఉద్దేశం. ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ పక్కన పెట్టిన బ్యాగ్‍ని చూసాను. టీవీ యాడ్‍లో కరీనా కపూర్ ఆ బ్యాగ్ పట్టుకుని భలే స్టైల్‍గా నడిచిందని అమ్మ నాలుగు తిట్టినా, మూడు వేలు పోసి ఇనార్బిట్ మాల్‍లో కొన్నట్టు గుర్తు. అందులో ఏమీ స్పెషల్ కనిపించలేదు. ఇక చీర. ఇది అమ్మ చీర, అది కాక ఇందులో స్పెషల్ ఏముంది? తన కోసం, మేనత్తల కోసం ఇలాంటి చీరలు కొనడానికి వీకెండ్ పాడు చేసి మరీ పోచంపల్లి తీసుకెళ్లింది ఆ రోజు. ఆ చీరని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలీని అనుభూతి కలిగింది. ఎందుకో ఇక్కత్ ప్రక్రియ గురించి జీవితంతో పోల్చి ఆ పెద్దాయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి.

అంతే, ఆయన పూనుకున్నట్టు అనిపించింది. మైక్ నా చేతికి రాగానే..

"ఐ యామ్ వేరింగ్ ఇక్కత్ ఫ్రొం భూదాన్‌ పోచంపల్లి. ఇట్ ఈజ్ సిల్క్ సిటీ అఫ్ ఇండియా. ఎప్పుడో 1953లో మొదలయ్యింది ఈ కళ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతన్నలు నిలువు - పేకల కలబోత ఈ ఇక్కత్. 2005లో పోచంపల్లి చీరకు భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ ప్రొటెక్షన్ లభించింది. ఈ రోజు నేను కట్టుకుంది కూడా అక్కడ చీరే. నేను ఈ ట్రెడిషనల్ చీరని మోడరన్ క్రొషే టాప్‍తో మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను, టు గివ్ ఇట్ ఎ ట్రెండీ లుక్" అని ఆ పెద్దాయన నుండి మాట అందుకుని చెప్పినట్టు, గడ గడ మైక్‍లో చెప్పేసాను. జోరున చప్పట్లు వర్షం కురిసింది. ఆ రోజు ఆ పెద్దాయన అమ్మకి ఈ కళ గురించి చెప్తూ, మధ్య మధ్యలో నన్ను చూస్తూ ఉన్నాడు. నీకు కూడా చెప్తున్నా విను, అనే అర్థం కనపడింది ఆ చూపులో. ఇది తెలీకపోతే ఇవ్వాళ ఏం చెప్పేదాన్ని?

ఇక సంతోషం పట్టలేక మీటింగ్ అయ్యాక బయటకి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికని ఫోన్ చేశాను.

అటు వైపు నుండి, "హలో.. ఎవరు? బాపు లేరు మేడం. కోవిడ్ వచ్చి పోయిండు మేడం" అని ఆ అబ్బాయి గొంతు పూడుకుపోయింది.

"ఇప్పుడు మీ కుటుంబానికి ఎట్ల?" అని అడిగాను.

"నెయ్యి బువ్వ మేడం"

"నెయ్యి బువ్వ అంటే?"

"నేస్తేనే బువ్వ మేడం… మా బాపు నేర్పిందే"

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు