మా రచయితలు

రచయిత పేరు:    మందరపు హైమావతి

కవితలు

మగన్యాయం 

చర్మ లిపి మాత్రమే తెలిసిన వారికి అద్దంలో ప్రతిబింబంలా అవయవాలు మాత్రమే కనిపించే వారికి

బట్టల వెనక ఉన్న మనసు కనిపించదు

చర్మం పొరల కింద ఉన్న హృదయం అదృశ్యం

మాంసం భాష మాత్రమే తెలిసిన వారికి

తరతరాలనుంచి చేసిన గాయాలు ఆనవాళ్లు గుర్తుండవు

న్యాయమూర్తుల వారూ! అభినందనలు!

ఎంత మంచి తీర్పు ఇచ్చారు! పండగ చేసికొంటారు అందరూ! ఇప్పుడు బట్టలకీ చర్మానికి మధ్య అంగుళ్లలేక్కనా దూరమెంతో కొలవాలి

జాకెట్ కి దాని కింద ఉన్న గుండెలకి మధ్య

దూరాన్ని లెక్కించాలి

చీరకు శరీరానికి మధ్య ఎడాన్ని గణించాలి

దేహం మీద గాయం చేసిన వారినే శిక్షించే న్యాయమూర్తులు

శరీరం పోస్టర్లపై మురికి చూపులు పేడ ముద్దలు చల్లినా

దేహం ప్రతిమలను చూపుల చేతులతో తడిమినా

తనువు పూలవనంపై తుమ్మెదల తొండాలు గుచ్చినా

నేరమేమీ కాదు

చర్మాన్ని తాకి తేనే గదా శిక్ష

దేహాన్ని చీల్చి రెండు తొడల మధ్య వీరంగం వేసినా

సాక్ష్యం లేకపోతే శిక్ష పడదు అవమానాల మాటల తూటాలు గురిపెట్టినా

నిందల వడిసెల రాళ్ళు విసిరినా ఏం పర్వాలేదు

ఆడవాళ్ళు కదా! పురుషాహంకారం పర్వతం పాదాలతో తొక్కేస్తారు

అసలే న్యాయదేవత అంధురాలు! ఆపై మగ న్యాయం మరింత గుడ్డిది

 

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు