1
"ఆరాధ్యా! ఆశ్రిత్! త్వరగా లేవండి.కషాయం ఐపోయినట్టే.బ్రష్ చేసుకుని రండర్రా!" అంటూ సుప్రభాతం పలుకుతూనే స్టౌమీద కాగుతున్న నీళ్ళలోఅల్లంముక్క,మిరియాలు, దాల్చిన చెక్క,లవంగాలు, ,పసుపు, తులసి ఆకులు వేసి మరో ఐదు నిమిషాలు మరిగించింది మాలిని.ఆగిన్నె కిందికి దించి తేనె, నిమ్మరసం కలుపుతుండగా వచ్చిన ఆరాధ్య
"మమ్మల్నేమొ తొందర పెట్టి లేపావు.ఇంకా నీ దిక్కు మాలిన కషాయం కానేలేదు." అంటూ విసుక్కుంది.
"ఇదిగో రెండు నిమిషాల్లో నీ చేతిలోకషాయం గ్లాస్ రెడీ. సరేగాని మీ బెడ్ షీట్స్ మడతేసి నానమ్మ స్నానం చేస్తుందేమో కనుక్కొని బాత్రూంలో బట్టలు వేసి రాపో."మాలిని.
"కనబడితే కాల్చివేతన్నట్లు ..ఎప్పుడు ఏదో ఓ పని చెప్తుంటావు.బెడ్ షీట్స్ మడతెయ్యక పోతే ఏమైందట. మళ్ళీ కప్పుకునేవేగా."
"అది నీ కర్మగాని..కనీసం నానమ్మకు బట్టలన్నవేసిరావే."అంటూ బుజ్జగించింది.
"నానమ్మే వేసుకుంటుంది లే.బెడ్రూంలోనేగా బట్టలున్నవి" సవరించి చెప్పిందా కూతురు.
"ఆ మాటే నేనెప్పుడూ చెప్పేది.కనీసం నా పనులు నన్ను చేసుకోనివ్వండ్రా."ఆంది అనసూయమ్మ.
"అది కాదులే నానమ్మ.నువ్వేమాత్రం ఇబ్బంది పడ్డా నాన అమ్మకో క్లాసు పీకుతాడు. అదన్నమాట సమస్య."ఆశ్రిత్.
"ఐనా ఒక్క నానమ్మే కాదు. ఈ ఇంట్లో ఎవరిబ్బంది పడ్డా నాన ఊరుకోరుగా." మళ్ళీ అన్నాడు ఆశ్రిత్."
"అదేం కాదులే.మగ పిల్లాడివని నీ మీద గారాలెక్కువే కుమ్మరిస్తాడులే" అక్కసుగా అంది ఆరాధ్య
"ఆడపిల్లవైతే మాత్రం నువ్వేం పని వెలగబెడుతున్నట్లో" ఒద్దించి అడిగాడు ఆశ్రిత్.
"సరె సరే.మీ వాదనలకేంగాని ఈ కషాయం తాగండి."అంటూ పిల్లలకు చెప్పి
కషాయం నింపిన ఓ గ్లాసు అత్తగారికిచ్చి మరో గ్లాసుతో ప్రత్యక్ష దైవం దగ్గరికి పోయింది మాలిని.ఆ గ్లాసు అందుకుంటున్న పతి దేవుడు
" అమ్మకిచ్చావా? తప్పకుండా రోజుకు మూడు సార్లు చేసి తగలడు.లేదంటే కరోనాతో చావు తప్పదు. బాగ్స్ రెడీగా పెట్టు.కూరగాయల తేవాలి. "అని శాపనార్థాల సుప్రభాతం మొదలు పెట్టాడు వర్ధన్. మాలిని కిమ్మనకుండా వెళ్ళి బాగ్స్ తెచ్చిచ్చి తన పనిలో తాను మునిగి పోయింది. అదంతా ఆమెకు అలవాటైన తతంగమే.
"ఏయ్! పిల్లలు.స్నానాలు కానిచ్చెయ్యండి.బామ్మ చేసేసినట్టుంది.ఎలాగూ నాదీ ఐపో యింది. మీరు చేస్తె..బట్టలు వాషింగ్ మిషన్లో వేస్త.ఎండగా ఉన్నప్పుడే ఆరేయొచ్చు." అని చెప్తూనే చట్నీ చేయడానికి వంటింట్లోకి వెళ్లింది మాలిని.
2.
"ఏమేవ్? ఎక్కడ చచ్చావ్? తొందరగా బకెట్లు తీసుకొని తగలడు."అంటూ రెండు సంచుల కూరగాయలతో స్కూటర్ దిగాడు వర్ధన్.
మంచినీళ్ళు కాస్తున్న మాలిని భర్త గొంతు వినబడగానే స్టౌ ఆపేసి కూరగాయలు కడగటానికి కెటాయించిన బకెట్లను తెచ్చి గబగబా టాప్ కింద పెట్టి సగానికి నింపింది. ఆ బకెట్లలో కాసింత ఉప్పు కొంచెం సర్ఫ్ వేసి కూరగాయలు కుమ్మరించింది.ఆకు కూరలను ఓ వెడల్పాటి డిష్ లో వేసి నీళ్ళు పోస్తూనే ఓ కంట భర్త చిర్రుబుర్రులు గమనిస్తూనే ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనంతగా ఇరవై నాలుగు గంటలూ ఆమె కాళ్ళూ చేతులు ఆడుతూ ఇంటిని చక్కదిద్దుతూనే ఉన్నా ఆ చిర్రుబుర్రులు ..సాగతీతలు ..తిట్లూ శాపనార్థాలు దారి తప్పవు.ఆమెకవి గాలి పీల్చుకోవడమంత సాధారణం.ఎప్పటికప్పుడు ఎదురు తిరుగమని మనసు చెప్తూనే ఉన్నా మాలిని ఆంతర్యం దాన్ని వాయిదా వేస్తూ వస్తుంది.
"బాత్రూం లో టవలేసి చావు.ఇంతకీ గీజర్ ఆన్ చేసావా? లేదా? ప్రతిదీ పది సార్లు చెప్పి చావాలి".వర్ధన్
"వస్తున్నానండి.ఒక్క నిమిషం. గీజర్ వేసి పదినిమిషాలైంది.."అంటూనే మాలిని తన చేతుల్ని సానిటైజర్ తో శుభ్రం చేసుకుని బాత్రూం లో టవలేసి వెనక్కి తిరిగింది.
"మొద్దు మొహమా! డెటాల్ సోప్ తెచ్చాను కదా! మళ్ళీ ఈ లక్స్ సోపేంటి?"
ఆయన నోట్లోనుండి మాటొస్తుండగానే కూరగాయలతో వచ్చిన కవర్లోని సోప్ తీసి వర్ధన్కు అందించి గిరుక్కున తిరిగి మళ్ళీ సానిటైజర్ తో చేతులు కడుక్కుంది.అదే స్పీడుతో వంటింట్లో చొరబడి చకచకా రెండు దోసెలు వేసిందో లేదో పతి దేవుడు డైనింగ్ టేబుల్ ముందు ప్రత్యక్షమయ్యాడు నా టిఫినెక్కడ అన్న పోజుతో.వేసిన దోసెలతో పాటు చట్నీని వడ్డించి మళ్ళీ దోసెలు వేయడానికి పూనుకుంది మాలిని.
" ఇదేం చట్నీ? " డైనింగ్ టేబుల్ నుండి ప్రశ్న
"టొమాటో ". వంటింటి నుండి సమాధానం.
"కొబ్బరి చట్నీ చేసి ఏడవొచ్చు కదా?" డైనింగ్ టేబుల్ నుండి
"అత్తయ్య గారడిగారని....." వంటింటి నుండి
"రెండు చట్నీలు చేసి ఏడవొచ్చు కద"డైనింగ్ టేబుల్ నుండి
" చేద్దామనే అనుకున్నా. పని మనిషిని మాన్పించటంతో పాచిపనులు..స్నానం. దేవుడి పూజ...టైమే దొరకలేదు." వంటింటి నుండి .ఇలా డైనింగ్ రూం నుండి ప్రశ్నలకు వంటింటి సమాధానాల పరంపర కొనసాగింది.
" మహా రాణిలా పడుకుంటే టైమెట్లా దొరుకుతుంది..కాస్త పెందరాళే లేచి చావొచ్చు కదా!"డైనింగ్ టేబుల్ నుండి మరో ప్రశ్న.
ఇక ఆ ప్రశ్నకు మాత్రం మాలిని నుండి సమాధానం రాలేదు.ఆమె సమాధానం చెప్పదలచుకో లేదు కూడా. ఎంచేతంటే సమాధానం ఇచ్చినా లాభం లేదని ఆమెకు బాగా తెలుసు .అది ఆమెకు అనుభవం ఇచ్చిన గుణపాఠం.తన లోటుపాట్లను చూసి మరో శాపనార్థం రాకముందే వేడి చేసిన నీళ్ళను ఓ గ్లాసులో తీసుకొచ్చి వర్ధన్ ముందు పెట్టింది మాలిని
"నీళ్ళు వేడి చేసి ఎంతసేపైంది? "
"అరగంటైంది."
" ఇంత చల్లగా ఏడ్చాయేంటి?.ఇవి తాగినా ...మామూలు నీళ్ళు తాగినా ఒకటే."
"వెచ్చగనే ఉన్నాయండి"
"వేడిగా ఉండాలంటే వెచ్చగా అంటూ అఘోరించి చస్తావేంటే?ఎడ్డెమంటె తెడ్డె మనే మొహం నువ్వూను"
"అందరూ వెచ్చగా అనే అంటున్నారు కదా...." అనిఏదో సర్ది చెప్పబోయింది మాలిని
"ఏడ్చావు లే. ఎవరేది చెప్తే అది నమ్మి చస్తావు.ఇంట్లో ఓ మానవుడున్నాడు అన్నీ చెప్పడానికి అన్న ధ్యాసే లేదు."అంటూ చిర్రుబుర్రులాడాడు వర్ధన్.నోరుమూసుకోవడం మాలిని వంతైంది.
పతిదేవుడి ఆత్మారాముణ్ణి శాంత పరిచిన మాలిని ఉతకాల్సిన బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి మళ్ళీ సాని టైజర్ తో చేతులు కడుక్కుంది.గిర్రున ఇంట్లోకి వెళ్ళి రెండు వెడల్పాటి పళ్ళాలను తెచ్చుకుంది. బకెట్లలో ఉన్న నీళ్ళను వంపేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి ఆ కూర గాయలను రుద్ది కడిగి పళ్ళాలలో వేసింది. ఆకు కూరలను పురుగు లేకుండా చూసి మట్టి భాగాన్ని కడిగింది. కొంచెం ఎండగా ఉన్న చోట ఓ బట్ట పరిచి వాటిని ఆర పెట్టింది కూడా.సీతాఫలాలు...సంత్రాలు ...ఆపిల్స్ ను మరో బట్టలో ఆరబెట్టింది.
మాలినికి ఓ పని చేస్తుండగానే మరో పని ఒత్తిడి బుర్రలో తిరుగుతూ ఉంటుంది.. వాట్ నెక్స్ట్ అన్నట్లుగా .టైం చూస్తే పదకొండున్నర.ఒకటింబావుకల్లా వంట సిద్ధంగా ఉండాల్సిందే. అన్నం,పప్పు,కూరా,చారు,పచ్చడితో సహా.లేకపోతే ఆస్తమా పేషంట్ అత్తగారి అపసోపాలు.. ఆన్ లైన్ క్లాసుల ప్రహసనంలో పిల్లల అసహనం...ఆపై వర్క్ ఫ్రం హోం మొగుడి శాపనార్థాలు ఉండనే ఉంటై. అందుకే పనిలో పరుగులు మాలినికి తప్పని తిప్పలు.ఏదైతేనేం..రెండో తడవ కషాయాలు..వంట-వార్పు-వడ్డింపుల తతంగం ముగించ గానే వాషింగ్ మిషన్లో బట్టలు కేకేసాయి.వాటి మాట ఆలకించిన తర్వాతే ఇంత ఎంగిలి పడటం మరి.ఆమె మధ్యాహ్నం నడుం వాల్చడానికి ససేమిరా వీల్లేదు. పొద్దున్నే ఆరేసిన అందరి బట్టలు తీసి మడతేసి కబోర్డ్స్ లో సర్దిపెట్టాలి.పిల్లశాల్తీలకాముచ్చట పట్టదు. చెప్పినా ఆలకించే ప్రసక్తే లేదు.ఆపై అంట్లు తోమడం షరా మామూలే.జనం సహనం పరీక్షించడానికా అన్నట్లు టాప్ నాలుగు గంటలకు అటెండెన్స్ తీసుకుంటుంది. హాజరు పలుకుతేనే నీళ్ళు.సో టాప్ కు అటెండెన్స్ పలికి మొక్కల దాహం తీర్చాల్సిందే. మాలిని ఆ రోజు నిర్విఘ్నంగా ఆ పనులన్నీ పూర్తి చేసి గృహ ప్రవేశం చేసే వరకు నాలుగున్నర కావచ్చింది.ఇక పాక శాలలోకి పోకతప్పదని ఆలోచిస్తుండగానే
"ఏమేవ్ ఈ షుగర్ పేషంట్ను ఇలాగే చంపుతావా? టీ నీళ్ళేమైన మొహాన కొట్టే దుందా? "అంటూ మొగుడి ఆర్తనాదాలు కర్ణభేరులను బద్దలు చేసాయి.
మరోవైపు నుండి "అమ్మాయి ..తినడానికేమైనా ఉందా?"అంటూ అత్తగారు
"అమ్మా ! జంతికలున్నాయా "అంటూ ఆశ్రిత్ ఆరాధ్యలు మాలినికి సాయంకాలం అల్పాహార బాధ్యతను గుర్తు చేసారు.
"నాన సీతా ఫలాలు..ఆరెంజెస్..ఆపిల్స్ తెచ్చారు .ఇవ్వమంటారా?"అడిగింది మాలిని.
"నో..నో..మాకు జంతికలే..."అన్నారు పిల్లలిద్దరూ.
"మురమరాలకు కారం పట్టించి ఇవ్వమ్మాయ్"అత్తగారి సున్నితపు ఆజ్ఞ. అందరి ఆజ్ఞలను ఆకాంక్షలను శిరసావహించెదనంటూ నడుం బిగించడం మాలతి వంతు..కనీసం బాక్స్ లో ఉన్న జంతికలను తీసుకోలేని పిల్లల సోమరితనాన్ని ఏమనాలో మాలతికి అర్థం కాలేదు.తన గొంతు వినబడిందంటే చాలు...పతి దేవుడి గర్జనలు భరించక తప్పదు. దాని కన్న నడుం బిగించడమే నయమనుకుంటుంది మాలతి. అది తేనీటి సమయం మాట.ఆపై ఆమెకు మరో రెండు మూడు హార్డిల్స్ ఉండనే ఉంటాయి.మళ్ళీ కషాయం .. వేడి నీళ్ళు కాచడం..డిన్నర్ కు చపాతీలు ..కూర.ఎట్ ది ఎండ్ అంట్లు తోముకోవడాలు.ఆ రోజు వర్ధన్ మాత్రం సాయంకాలం సుష్టుగా సీతాఫలాలను ఆరగించి..బ్రేవ్ మంటూ త్రేన్చి..డిన్నర్ ను క్విట్ చేశాడు. పై తతంగ మంతా మార్చ్ 23 మొదలుకొని ఓ రెన్నెల్లు కొనసాగింది ఏదోకొంత మార్పుతో
3
అన్నయ్య వదిన ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారని తెలియగానే మాళవిక ఖంగు తింది.ముందు కరోనా వల్లేమో అని హైరానా పడ్డది.ఆశ్రిత్ కు ఫోన్ చేస్తే వర్ధన్ డి హ్రేడ్రేషన్ అండ్ గాస్ ప్రాబ్లం వల్ల ,మాలిని నీరసంతో బి పి డౌనై పల్స్ రేట్ పడిపోవడం వల్ల అని తేలింది.తన పిల్లలకు భర్తకు తగు జాగ్రత్తలు చెప్పి ఉన్న ఫళంగా హైదరాబాద్ కు ఊడి పడింది మాళవిక.వారం రోజులు అనారో గ్యంతో పోరాటం చేసి ఆసుపత్రి ఆజ్ఞాపించినంత బిల్లు చెల్లించి ఇల్లు చేరుకున్నారా దంపతులు.మాళవిక డాక్టర్స్ తో మాట్లాడి వాళ్ళు అనారో గ్యం పాలు కావడానికి దారి తీసిన పరిస్థితులను ఆరా తీసింది.ఇంట్లో పిల్లల ోజువారీ దినచర్యను గమనించింది.పిల్లలతో పనిమనిషికి ఫోన్ చేయించి పిలిపించింది.
"లాక్ డౌన్ ఎత్తేసారు కదా! పని చేయడానికి రాలేదేంటమ్మా!"పనిమనిషినడిగింది మాళవిక.
"అమ్మగారే రావద్దన్నారండి. నేనొత్తాననే చెప్పానండి.ఆయ్"
"సరె .ఇప్పుడు రమ్మంటున్నారు కదా! వచ్చేసెయ్"
"తప్పకుండా వచ్చేత్తానండి.ఇంటికాడ కూసుంటె నాకేటి తోచదండి.గోల్లు గిల్లుకోవడ మేనండి.ఆయ్."
"వస్తూనే శుభ్రంగా టాప్ దగ్గర కాళ్ళు కడుక్కో .సానిటైజర్ తో చేతులు కడుక్కో.మాస్క్
పెట్టుకోవడం మరిచి పోకు.వింటున్నావా?"
"అదేటమ్మగారండి.అలాగంటారండి..మడిసి పుట్టుక పుట్టాక ఒకపారి సెప్తే ఇనుకోవాలండి.అలాగేనండి.ఇంతకీ ఏ టేముకి రమ్మంటారండి.? పెందరాళే ఏడింటికల్లా రమ్మంటారా?"పనిమనిషి.
"సరే!అలాగే వచ్చేసెయ్."అని పనిమనిషిని పంపించి ఆశ్రిత్ ను కూరగాయలు కట్ చేయమని ఆరాధ్యను బట్టలు మడతేయమని చెప్పి తను వంట చేయడంలో లీనమైంది మాళవిక.ఓ అరగంటలో వంట పూర్తి చేసి అందరినీ తినడానికి పిలిచింది.మాలిని రాక పోవడంతో మరో సారి పిలిచింది.
మీరంతా భోచెయ్యండమ్మ.పక్కలు సర్దుతున్నాను. నేను తర్వాత తింటానులే." అంది మాలిని
"అదే వద్దంటున్న.అందరితోపాటు నువ్వూ తినేసెయ్.పిల్లలకు పని అలవాటు కానివ్వు."అంటూ అందరికి వడ్డించింది మాళవిక.భోజనాలైపోవడంతో గిన్నెలు సార్టౌట్ చేసి వాషింగ్ ఏరియాలోకి చేర్చింది.
"వదినా పొద్దున్నే పనిమనిషి వస్తుంది.మరిచి పోయి గిన్నెలు కడిగేవు సుమా! " అంటూ మాలినిని సున్నితంగా మందలించింది.అంతాభోంచేసి టివి ముందు సెటిలయ్యారు. టివి ముందు కూర్చున్న ఆమె ఆలోచనంతా వదిన గురించే .
"అన్నయ్యా! ఇంతకీ నువ్వు హాస్పిటల్ లో ఎందుకు అడ్మిట్ కావలసి వచ్చిందట? " తనకు ఏమీ తెలియనట్లుగానే అడిగింది మాళవిక.
" మోషన్స్ వల్ల డి హైడ్రేషన్ ఐందని తెలిసిన విషయమే కదా! "
" మోషన్స్ కు కారణమేంటంటావు ?"
"ఫుడ్ పాయిజనని .......... "
"ఇంటి భోజనం కదా! నీ ఒక్కడికే ఈ ప్రాబ్లం ఎందుకైందంటావు?"
"నే చెప్పనా అత్తయ్య?" ఆరాధ్య
" తెలుసు కోవడానికేగా అడిగేది. చెప్పు"
"నాన అదే పనిగా సీతాఫల్ తిన్నారు . పైగా వాటిని ఉప్పు సర్ఫ్ వేసి కడిగించారు"
అది విన్న మాళవిక నోరు వెళ్ళబెట్టింది.
"అత్తయ్యా!అంతేకాదు.నాన రోజుకు మూడుసార్లు కషాయం తాగేవారు"
"మీరో....?"
" ఒకరికి తెలియకుండ ఒకరం నెమ్మదిగా పారబోసేవారం.నానమ్మతో సహ.వారానికి ఓ రెండు మూడుసార్లు తాగుంటామేమో."
"మీ అమ్మో?"
"పొద్దస్తమానం చాకిరీతో గాలి పీల్చుకొనే టైమే లేక సతమతమయ్యా.ఇక కషాయమేం తాగను"అంది మాలిని
"అదన్నమాట..అసలు విషయం.ఏమొదినా! పండ్లు కూరగాయలు ఉప్పు సరే..సర్ఫ్ తో కడగటమేంటి?"
"మీ అన్నయ్య ఉవాచ"చెప్పింది మాలిని కొంచెం భయంగానే భర్త వేపు చూస్తు
"ఏరా!అన్నయ్య.రోజు మూడుసార్లు కషాయం..సర్ఫ్ తో కూరగాయలు పండ్లు కడగడం
నీకెవరు చెప్పారురా?"
"ఎవరు చెప్పేదేంటి.వైరస్ చావాలని ..ఇమ్యూనిటీ పెరుగాలని..."
"వాటి సంగతి దేవుడరుగు. నువ్వు చచ్చేవాడివిగా.ఒక్కరోజు బగారా రైస్ కే కడుపు పాడవుతుంటే రోజూ ఆ మసాలాలతో కషాయమేమిట్రా? ఇమ్యూనిటీ మంచి తిండి వల్ల,శారీరక శ్రమలో ఉంటుందని నేను నీకు చెప్పడమేంట్రా? నీ శాస్త్రీయ విజ్ఞానమెక్కడ మాయమైంది?"
చెల్లెలు మాటలువిన్న వర్ధన్ నాలిక కరచుకున్నాడు. మాళవిక అంతటితో ఆగలేదు.
"అవును అన్నయ్య! వదినకు పల్స్ రేటు ఎందుకు పడిపోయినట్లో? అదైనా నీకర్థమైందా?మాళవిక ప్రశ్నకు ఎవరి దగ్గరి నుండి సమాధానం రాలేదు.సో మాళవిక మాట్లాడడం మొదలు పెట్టింది.
"ఏరా అన్నయ్య! నీకు అమ్మకు అదేదో శ్లోకంలో ఉన్నట్లు కరణేషు మంత్రి తప్ప మిగతా లక్షణాల కోడలు కావాలి.పిల్లలు మాత్రం ఏపనీ పాట లేకుండ కేవలం పుస్తకాలకు సెల్ఫోన్లకు అతుక్కుపోవాలి. రేపు ఆరాధ్యకు నీలాంటి మొగుడే దొరికితే ..ఆశ్రిత్ కు ఏ ఐ టి ఉద్యోగం చేసే పెళ్ళాం దొరికిందనుకో ...అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటావు? "
"నా పిల్లలకేంటి? చదువుకుంటుంన్నారు.మంచి ఉద్యోగాలు చేస్తారు. నౌకర్లను పెట్టుకుంటారు. మీ వదినంటే చదువుకోని దద్దమ్మ .ఇంట్లో పనులన్న చేయక ఏంచేస్తుందట"
"నీ కూతురు కొడుకుతోపాటు అల్లుడూ కోడలు ఉద్యోగాలు చేసి ఏడుస్తారు కదా! మరి ఇంటి చాకిరీ ఎవరు చేస్తారట ."
"పని మనిషి వంట మనిషిని పెట్టుకుంటారు.ఈ చాకిరీ చేయాల్సిన కర్మవాళ్ళకేంటి?"
"ఓకె.నా ఓటు నీకే.కానీ ఓ నెల రోజులు వదినను నాతో తీసుకెళ్తా.వంటమనిషి డబ్బు లు నేనే పే చేస్తాను లే.సరేనా.ఏం లేదు వదినకు కొన్నాళ్ళు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు."
ఆ మాటకు వర్ధనేకాదు, ఇంటిల్లిపాది ఖంగు తిన్నారు.మాళవిక ఆ ప్రపోజల్ పెడు తుందని ఎవరూ ఊహించలేదు.వాళ్ళ మొహాలు కొంచెం కళ తప్పాయి కూడా.అంతా మౌనం పాటించారు.
"ఏంటీ? ఎవరూ నోరు విప్పడం లేదు.అంటే దీనర్థమేంటీ?మీరంతా కాలికి మట్టంట కుండా కాలం వెళ్ళబుచ్చుతారు. వదిన మాత్రం మూడు తరాలకు బొంగరంలా తిరుగుతూ పని చేయాలి.లాక్ డౌన్ లో పని మనిషి లేదన్నస్పృహే లేదు మీ అందరికి. తలో చెయ్యి వేస్తే ఇంత వరకు వచ్చేదే కాదు కదా!అమ్మ కూడా చిన్న చిన్న పనులు స్వయంగా చేసుకోవడం వల్ల ఆరో గ్యంగా ఉంటుంది.మొక్కలకు నీళ్ళు పోయడం వల్ల ప్రత్యేకించి వ్యాయామం చేయ కుండానే ఆరోగ్యం అందుబాటులోకి వస్తుంది నీకు.పిల్లలకూ ఎంతో కొంత పని చెప్పండి. భవిష్యత్తులో సుఖ పడుతారు. యూ ట్యూబ్ లో చూసిన వాటినన్నిటిని అదే పనిగా పాటించడ మేంటి? ఆ నిబంధనలు పాటించి తీరాలి అన్న నిబంధనే మీ అనారోగ్యాలకు దారి తీసింది. సానిటైజర్ తో కడగి కడిగి వదిన చేతలు పాడయ్యాయన్న విషయం నీకు తెలుసా ?ఐనా ఎట్లా తెలుస్తుంది లే! నీ దృష్టిలో ఆమె ఓ పనిముట్టు.ప్రాణమున్న బొమ్మ.అంటూ దీర్ఘ నిశ్వాస నొదిలింది మాళవిక
***********~~~~~~~~~****************~~~~~~~~~~~*************
4
సంక్రాంతి పండుగ రోజులు.వర్ధన్ నుండి ఫోన్ రావడమే తడవు చేయకుండా పిల్లలతో సహా పుట్టింటికి చేరుకుంది మాళవిక.ఇంటి వాతావరణంలో తేడా కొట్టవచ్చినట్టలుగా కనపడింది. మాలిని కూడా పిల్లలకు పని చేయడం అలవాటు చేసింది. భర్తకు సమయోచిత సమాధానాలు... సలహాలివ్వడం నేర్చుకుంది.ఆ కుటుంబం యూ ట్యూబ్ లను పాలూ నీళ్ళను వేరు చేసినట్లుగా చేసి చూస్తున్నారు.గొర్రెదాటు వ్యవహారారినికి గుడ్ బై చెప్పి మెదడుకు మేత పెట్టడం అలవాటు చేసుకున్నారు .శ్రామిక సౌందర్య రుచికి అలవాటు పడిపోయారంతా వర్ధన్ తో సహా. ఇక మాళవిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అర్థవంతంగా...ఆరోగ్యంగా.. ఆనందంగా కుటుంబం కొనసాగడానికి ఈ చిన్నపాటి సాహసాలు...చైతన్యం అవసరమేకదా!
##############
Jun 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు