మా రచయితలు

రచయిత పేరు:    మొహమ్మద్ గౌస్

కథలు

మారని కథ

"రాప్పా... శంకరూ, ఏమి ఇయ్యాలదంకా ఉన్యావు? తొందరగానే వస్తావు అనుకుంటిమే?" అప్పుడే హాస్టల్ నుండి వస్తావున్న శంకరుని అడిగినాడు శీనా మామ.

"తొందరగానే బయలుదేరితిమి కానీ గండిలో ఆంజనేయసామి గుడి కాడ కొంచేపు ఉంటిమి మామా! అదీ గాక ఈ పొద్దు శనివారం గదా, తిరపతి నుండి పసాదం వచ్చింటే తెస్తి" అనుకుంట ఇంట్లోకొచ్చి బ్యాగు పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేకి పొయినాడు శంకరు.

శంకరు పులివెందుల్లో చదువుకుంటాండాడు. దసరాకి సెలవలిచ్చినారని ఇంటికొచ్చినాడు. శ్రీనివాసులు శంకరుకి మామయితాడు. శంకరోళ్ళ ఇంటి పక్కనే ఇల్లు.

"నాయన యాడున్నాడు మా?" అడిగినాడు శంకరు టవ్వాలతో మొహం తుడ్సుకుంట.

"పొద్దున పోయినాడురా మీ నాయిన, ఇంగా రాలా" చెప్పింది కామాక్షి.

కామాక్షి శంకరు వాళ్ళమ్మ. నాయన పేరు ఆదెప్ప.

"ఏంపా అల్లుడూ, కుచ్చో ఇట్ల. మాట్లాడుదాము" అన్యాడు శీనా మామ.

"చెప్పు మామా, ఏం విశేషాలు?"

"ఏముంటాయిబ్బా, ఈడ కొత్తగా ? అవే అప్పులే, అవే కతలే. మా సంగతి ఇడ్సిపెట్టు. నువ్ చెప్పు, ఎట్లుంది సదువు?"

"సదువుకేమైంది. బానే సదువుతాన్నా మామా..."

"సదువుకుంటేనే రొంత బాగుపడేది ఇప్పట్లో ఇంగ. సేద్యం చేస్కోనికి నీళ్ళుండవు. సదువుకుంటే ఉజ్జోగమొస్తే ఎట్లోగట్ల బతకొచ్చు."

"నీకేంలే మామా... సేద్యం ఇడ్సిపెట్టి షాపు పెట్టుకున్యావ్."

"ఇడ్సిపెట్టకపొతే యాడప్పా... సమచ్చరాలు గడిసేకొద్దీ అప్పులు పెరుగుతానే పోయినాయి గానీ తగ్గలా. షాపు పెట్టుకున్యా. రోంత మేలు."

"మా నాయనగ్గుడక చెప్పచ్చు గదా మామా? ఎప్పుడు సూడు సేను కోసం అప్పులు చేస్తానే ఉంటాడు. రోంత గూడ భయమే ఉండదు అప్పుల గురించి. అప్పులిచ్చేటోళ్ళు కూడా అట్లనే ఇస్తారు నాయనకి."

"ఎందుకీయరుప్పా, పదెకరాలుండాయి గదా ఆ దైర్నంతో ఇస్తారు. వాళ్ళేం ఊరికెనే ఇస్తాన్నారా..?"

"అది గూడ నిజమేలే..."

"మీ నాయన మొండోడు. ఎట్ల తిరిగి అప్పు తీర్చేస్తాడు. అందుకే అప్పు పుడ్తాది యాడైనా..."

"అది సరే గానీ మామా, నీకోటి తెలుసునా?"

"ఏందిప్పా..?"

"మన తుక్కు నీళ్ళకి బోర్ ఎయ్యల్లంటే ఎన్నడుగులు ఏస్తారు?"

"భూమిని బట్టి ఉంటాది. కొన్ని సాట్ల ఏడొందల అడుగులు, కొన్ని సాట్ల తొమ్మిదొందల అడుగులు. వెయ్యి దాటి గూడ ఏస్నారు సానా మంది."

"కాలేజీలో మా క్లాస్ మేటొకడు. వాంది గోదావరి జిల్లా. ఇట్ల నీళ్ళ గురించి మాట్లాడుకుంట అడిగితి. వాళ్ళ తుక్కు అస్సలు బోర్లేసేదే తక్కువంట. ఒక్యాళ యేసినా పదహైదు, ఇరవై అడుగులకే నీళ్ళు పడ్తాయంట."

"ఏందిరా నువ్ చెప్పేది? నిజమేనా?"

"నిజంగా మామా... అది గూడ వాళ్ళేసేది మిషన్ తో కాదంట. మనుషులే చేతుల్తో ఏస్తారంట."

"చేతుల్తోనే నీళ్ళు పడేంత ఉంటాయా వాళ్ళకి? ఈడ మనం కిందా మీదా పడి బోరేసినా నీళ్ళు పడటం ల్యా గదరా..."

"నాగ్గుడక నమ్మబుద్ది కాలా మామా... కానీ నిజమేనంట"."

ఇట్ల శంకరు, శీనా మామ మాట్లాడుకుంట ఉండంగ కామాక్షి వచ్చి కుచ్చుంది.

శంకరు శీనా మామతో "అవు మామా... బోరేస్తే ఎంత కర్చయితాది మనకి?"

"ఏసిన్నే అడుగుల్ని బట్టి ఉంటాదిరా. మూడొందల అడుగుల దాకా ఇంత, అది దాటితే ఇంత అని."

"అట్ల గూడ ఉంటాదా మామా?"

"అవుప్పా. మళ్ళ బోరేసేటప్పుడు రాయి అడ్డం పడిందనుకో అప్పుడు రేటింగా పెరుగుతాది. అయినా ఇయన్నీ నాకన్నా మీ నాయనకి బాగా తెలుసు. ఆర్నెళ్ళకోసారి ఏపిస్తాడు కదా..?"

అప్పుడు కామాక్షి "వచ్చిండే తిప్పలంతా అదే. నీళ్ళు పడటం ల్యా అని తెల్సినా ఏపిస్తానే ఉండాడు ఆ మనిషి. ఆ మొండితనమేందో గానీ, వస్తాండే దుడ్లన్నీ మళ్ళ ఆ బోర్లకే కర్చు పెడ్తాడు" అంది.

"బావ ఇనడులే క్కా. ఆ మనిషికి బోరేసేది జూదమాడినట్లు అయిపోయింది."

"అంటే ఏంది మామా?" శంకరు ప్రశ్న.

"చేతిలో డబ్బులుంటే ఒక్కోరికి ఒక్కోటి చేయబుద్దయితాది. కొంతమంది జూదమాడ్తారు. కొంతమంది పోరాని కొంపలకి పోతారు. ఇంకొంతమంది తాగుతారు. అట్ల మీ నాయనకి బోరెయ్యాలనిపిస్తాది."

"ఉన్నే కాలవ నీళ్ళు సాల్లే. ఆ నీళ్ళతోనే సేను తడిసిన కాడికి పండిచ్చుకోని సగం అమ్ముకోని సగం తిందాం అని చెప్పినారా, నా మాట వింటే గదా?" కామాక్షి బాధ.

"అయినా బోరేమీ ఊరికెనే పొద్దుపోక ఏపీలా కదు మా, నీళ్ళు పడి పదెకరాలు తడిస్తే ఎంత మేలని? అందుకే చేస్తాండాడులే నాయన."

"ఏం చేస్తాడో ఏమో. బోరేసి నీళ్ళు పడినాయని భోజనాలు పెట్టిస్తాడు. నీళ్ళు పడకపోతే ఇంటికొచ్చి నీళ్ళు తాగి అట్లే పనుకుంటాడు. మళ్ళా కొన్నిరోజులకి యాదో చిన్న పంటవి డబ్బులొస్తానే మళ్ళ బోరేసేకి పిలిపిస్తాడు. ఇదే కతే జరుగుతాంది."

శంకరు ఏం మాట్లాడలా.

"ఈసారి డబ్బులొస్తానే నువ్విప్పిచ్చుకో అడిగి. ల్యాప్ ట్యాపో ఏందో కావల్లని అడిగినావ్ కదా సదువుకున్నేకి. అది కొనుక్కో." అని చెప్తా ఉండంగ ఆదెప్ప ఇంట్లో కొస్తూ "రేప్పొద్దున తొందరగ లేయల్ల. అందరం సేను కాటికి పోయే పనుంది. బోరేపిస్తాన్నా..." అని జెప్పి లోపలికి పొయినాడు.

కామాక్షి ఆయన్ని అట్లా చూసి, తిరిగి శంకరుని చూసి బయటికి కనపడని కన్నీటి చుక్కల్ని కొంగుతో తుడుసుకుంది.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు