నువ్వైవరు
నేనెవరు
ఇద్దరం కలిసి బతుకుతున్న
ఈ నేల ఎవరిది
విజేత గర్వంతో విప్పదీసుకున్న ఛాతీ
ప్రకటించే తీర్పులు ఎవరివి
రక్తంతో తడసి
అనుభవంతో గడ్డకట్టి
విచక్షణ పట్టకం వక్రీభవించే సత్యమేమిటి??
ఎంత వద్దనుకున్నా తథాగతుడు గుర్తొస్తాడు
బహుజన హితాన్ని దీపకలికలా వెలిగిస్తాడు
క్రీస్తు గుర్తొస్తాడు
నీవలనే నీ పొరుగువాడినీ ప్రేమించమంటాడు
తథాస్తు అంటూ చర్చిగంటలా
మసీదు అజా మోగుతుంది.!!
తరతరాలుగా నీ కళ్లముందున్న 'ఇతరుడు'
నువ్వు అసురుడనే వాడి వారసుడు
ఇప్పుడు నువ్వు
ఎవరని ప్రశ్నిస్తున్న నీ పొరుగువాడు.
ఎంత వద్దనుకున్నా పురాణాలు మెదులుతాయి
మెదుడనబడే కణజాలంలోకి యెక్కించిన
కథలన్నీ దృశ్యాలై ఎదురెదురుగా
నిల్చుంటాయి
నీ మాటల వేదికల మీద
నీ ఆలోచనల హద్దు పైన
వికృతంగా కదలాడే నీడలు
మనుప్రవచనాలుగా నీనోట
ఉఛ్ఛరింపబడే మంత్రోఛ్ఛాటనలు.!
నువ్వు కట్టిన దృశ్యంలో
హతుడెవడో హంతకుడెవడో
పీడకుడెవడో పీడితుడెవడో
ఎవడి కాళ్ల కింద ఎవరు నలిగాడో
ఎవరి నేలను ఎవడాక్రమించాడో
దృశ్యంపైబడే వెలుగు తేటతెల్లం చేస్తుంది.!
తిరగబడ్డ పురాణం
నీ గుట్టురట్టు చేసే వాస్తవం
వాక్యాల మధ్య అదృశ్యమైవున్న అన్వయాలు
చరిత్ర కళ్లకు కట్టిన గంతలు
విప్పితేనే సాక్ష్యాత్కారాలు.
నువ్వెవరో
నేనెవరో
ఈ భూమెవరిదో
జాతులుగా యుధ్ధక్షేత్రంలో నిలబడ్డ నిజాలు
ఆయుధం లిఖించిన కట్టుకథలు
విప్పి చెప్పలేని భేతాళ ప్రశ్నలు
సత్యం తెలిసినవాడి తల వేయిముక్కలయ్యే
దురదృష్టాలు మూలవాసీ వ్యథలు.
ఇప్పుడు
నిజమొకటి నీ ముందు నిలబడి వుంది
నీ పొరుగువాడెవడొ నీకు తెలిసే వుంది
తన సకలసంపదలు నీచేతిలో వుంచి
నీచేత క్షీణతను పొందిన వాడు.!
పగలబడి నవ్వుతున్న కాలం సాక్షిగా
నువ్వు నిర్మించిన నమ్మకాలతోనూ
నువ్వల్లిన వలలోనూ బంధితుడు.
నువ్వు వ్యాప్తిజేసిన విశ్వాసాలతోనూ
నువ్వు పరచిన కుతంత్రాల వల్ల బాధితుడు
నువ్వు అలవాటు చేసిన
కట్టుబాట్ల లోని పడబాట్లనూ
ఆనందాలలోని వెకిలినీ
భద్రత లోని స్వయంహననాన్నీ
మోస్తూ మోస్తూ తన్నుతాను మరచిన వాడు.
నీ ధర్మపన్నాల పరిభాష
తనను ముట్టడించిన అదృశ్య సంకెళ్ల సవ్వడి
కాలం చేసిన గారడిలో
నువ్వు నువ్వుగానే మిగిలి
అతను మాత్రం నీ నకలులామిగిలి
తనను మింగిన కృష్ణబిళానివి నువ్వు.!
ఎంత వద్దనుకున్నా
నువ్వడుగుతున్న ప్రశ్న మళ్లీ మొదటికి
నువ్వెవరో - నేనెవరో
అనే విచికిత్స కు తెరతీస్తుంది.
దయనూ క్షమణనూ నేర్పిన గురువులు
సహిష్ణతను యీ దేశ ప్రజలకు
నరనరాని నింపిన శక్తులు
నీవలనే అందరినీ ప్రేమించమనే ఆదేశాలు
ఏం నీకందడం లేదా?
అని అడగుతున్నవి.