మా రచయితలు

రచయిత పేరు:    మేడి చైతన్య

కథలు

సమాధి తోట

ప్రతి ఆదివారంలాగే నిన్న కూడా ఇంట్లో చికెన్. ఎప్పుడులా కాకుండా సారి కూర బాగుందనిపించింది. కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా. మధ్య తినేటప్పుడు నాకు అలవాటైన వంటని తిట్టే గొణుగుడు ప్రోగ్రాం కాకుండా, అమ్మకి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చినా. ఎప్పుడూలేంది మారు అన్నం కూడా పెట్టుకున్నా. అంత నచ్చింది మరి. తిన్న పది నిముషాలకే టీవీ కట్టేసి, ముఖానికి ఆవులింతలు తగిలించుకుంది అమ్మ. లైటు ఆర్పేసి ఇవతలగదిలోకి పాకాను నేను. గచ్చుమీద బొంత, కాళ్ళ దగ్గర ఒక స్పాంజీ దిండు, తలదగ్గర ఇంకో మెత్త. కప్పుకోడానికి రెక్క దుప్పటి. దోమలు ఎక్కువ ఉన్నాయని కిటికీలు వేశా. లైటు తీసేసి ఫోన్ డిస్ప్లే వెలుతురులో పక్క సర్ది పడుకున్నా. నిద్రపోయ్యేముందు వాట్సప్ ఓపెన్ చేశా. చదవకుండా వదిలేసిన గ్రూప్ మెస్సేజులు మాత్రమే కనిపించాయక్కడ. ఒంటరోడినని గుర్తు చేసింది ఫోన్ మళ్లీ.

ఎంత తన్నుకులాడినా నిద్రరావట్లే. కొద్దిసేపయిన తరువాత పొట్టమీద మీద ఎవరో కూర్చున్నట్టు, లోపలికి గుండె అంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. గాలి సరిగా ఆడనట్టు, గొంతు ఎండిపోతున్నట్టు, ఇలా. గాలి పీల్చుకోడానికని నోరు తెరిచాను. రెండు నిముషాలు పర్వాలేదనిపించినా మళ్ళీ అదే ఇబ్బంది. గొంతు పట్టేసినట్టు, పీక ఎవరో నులుముతున్నట్టు అనిపించింది. భయం దాచుకుంటూ లేచి కూర్చున్నా. వీపు ఆనుకున్న గోడ కంపిస్తున్నట్టుగా గుండె దడ లోపల. చల్లగవుతున్న పాదాలను చేతులతో అదుముకుని, గోడవార  పడుతున్న సన్నని వెలుతురు దగ్గరికి వెళ్ళా. గదిలో గాలి తక్కువ ఉందేమోనని కిటికీలు తెరిచా. తెరలు తెరలుగా గాలొచ్చి మొహానికి తగిలింది. సారి ఇంకా గట్టిగా నోరు తెరిచా. గాలి నోట్లోకి పొయ్యి, వెంటనే బయటికి వస్తున్నట్టనిపించింది. కిటికీ దగ్గర నుంచున్నా, అంత గాలి బయటనుండి వస్తున్నా, వళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అటు ఇటు వేగంగా నడిచా గదిలో, చీకట్లోనే. ఊపిరాడటం లేదని స్పష్టంగా అర్థమయింది నాకు. కాళ్ళు వణకడం మొదలైంది. నడకలో తత్తర. గొంతు ఎండిపొయ్యి మాట పెగలట్లేదు సరిగా. భయం భయంగా లైటు వేసి అమ్మని లేపా. నా గోలకి గోపిగాడు కూడా లేచాడు. గాలాడటం లేదని సైగ చేశా. మెల్లగా నడిచి గాలి పీల్చుకో సర్దుకుంటుందని చెప్పారిద్దరు. ఎంత నడిచినా లాభం లేదు. నడిచే తొందరలో చావుమీద జడుపు పట్టుకుంది. చేతులు, కాళ్ళు సల్లబడుతున్నాయి. మంచం మీద పడుకోబెట్టారు. గోపి చేతులు రుద్దుతుంటే, అమ్మ కాళ్ళు రుద్దుతుంది. మెల్ల మెల్లగా కాళ్ళనుండి ఒకొక్క శరీరభాగం సల్లబడుతున్నాయి. నేను ఇలా అవుతుందని చెప్పేసరికి గోపిగాడికి కూడా భయం వేసినట్టయ్యింది. మనిషి దిట్టంగా ఉన్నా భయాన్ని మాత్రం లోపల దాచుకోలేడు వాడు. నా మొహంలో చావుని చూసినట్టున్నాడు. అమ్మని లోపలకెళ్లి మంచినీళ్లు తెమ్మన్నాడు. చల్లదనం గుండె దగ్గరికి చేరుకుంది. ఇలా కుదిరేట్టు లేదని మంట వేద్దామని అమ్మతో చెప్పాడు. అమ్మ కన్నీళ్లు దాచుకుంటున్నట్టుంది. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏదో కథల పుస్తకం పేజీలు చింపి మంట వేశారు ముందు గదిలో. మంచం మీద నుండి నన్ను లేపి మంట ముందు కూర్చోబెట్టారు. కూర్చొని కూర్చొని నీరసం ఎక్కువయ్యి కళ్ళు పూర్తిగా మూసుకుపోతున్నాయి. అదిగో అప్పుడే గోపి గాడు 'చొక్కా తీసేద్దాం, వేడి డైరెక్టుగా లోపలికి పోతుంది' అని, నా చొక్కా గుండీలు విప్పాడు. తరువాత అమ్మ ఏడుపు గట్టిగా వినొచ్చి, నా కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తరవాతే నాకు మెలుకువ వచ్చింది. గుండె దడగా ఉంటునట్టు, గాలి సరిగా ఆడటం లేదని చెప్పా డాక్టర్ కి. ఇంకా ఏదో చెప్తుంటే నా మాటలేమి పట్టనట్టు గుండె మీద స్టెతస్కోప్ పెట్టి గట్టిగా అదిమాడు. కళ్ళు నొసలు చిట్లించి శ్రద్ధగా విన్నాడు గుండె చప్పుడిని. కంగారు పడాల్సింది ఏమి లేదని మందుల చిట్టి రాసాడు. అందులో స్ట్రెస్ కి కూడా మాత్రలు రాశానని, అవి వేసుకున్నప్పుడు మొదట్లో తిక్క తిక్కగా ఉండొచ్చని జాగ్రత్త చెప్పాడు.

ఏదీ సరిగా గుర్తుపెట్టుకోలేని నేను మందులు మాత్రం టైంకి తింటున్నా. మందులు వేసుకోవడం మొదలెట్టిన దగ్గరనుండి నాలో రెండు మార్పులొచ్చాయి. ఒకటి- ఎంత లేటుగా పడుకున్నా గంట కొట్టినట్టు తెల్లారుజామున నాలుగ్గంటలకే మెలుకువ రావడం. మరొకటి- గతంలో జరిగిన ఈవెంట్స్ ని తలచుకొని, వర్తమానాన్ని, భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకోవడం. ఒకటి ఫిజికల్ మార్పు, రెండోది మెంటల్.

రోజు రాత్రి అలా జరిగిన దగ్గరనుండి అమ్మ నా మంచం పక్కనే పడుకుంటుంది. నిద్రపోయినా రాత్రుళ్ళు లైట్ ఆర్పడం మానేశారు ఇంట్లో. మా అన్న నా ఫోన్ కి కాల్ చేస్తున్నాడు కొత్తగా. అమ్మకి ఎవరూ లేవకముందే నిద్రలేచి పని చేయడం అలవాటు. కానీ మధ్య నాకు, అమ్మకి కూడా మెలుకువ రాని పొద్దప్పుడే నిద్ర తేలిపోతుంది. మొదటిరోజు అమ్మని లేపి చెప్దామనుకున్నా. కానీ ఇప్పటికే భయపెట్టింది చాలులే అని ఊరుకున్నా. ఇక మంచంలో అటు, ఇటు మెసలడమే తెల్లారేదాక. పెచ్చులూడుతున్న ఇంటి కప్పుని చూస్తూ ఒక రోజు, కిటికీ పక్కున్న నిమ్మచెట్టు మీద నాకు తెలీని పిట్ట అరుపు వింటూ మరొకరోజు గడిపా. మరుసటి రోజు ఏమీ తోచక ఫోన్ ఓపెన్ చేశా. ఎప్పటినుండో చదవాలనుకుంటున్న 'హౌ నాట్ టు ఫియర్ అబౌట్ డెత్' వ్యాసం ఓపెన్ చేశా. అది రెండు పేరాల దగ్గరే ఆగిపోయింది. నేను లోలోపల కూడబలుక్కుంటున్న అక్షరాల శబ్దాలను ఎవరో పక్కన కూర్చుని నా బదులు చదువుతున్నట్టనిపించింది. మొన్నెప్పుడో ఫేస్బుక్ లో ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ కింద నే పెట్టిన కామెంట్ గుర్తొచ్చింది- చావు గురించి తెలుసుకోవడం నాకు భలే సరదా. కానీ మొన్నటి ఎక్స్పీరియన్స్ తో ఒకటి రియలైజ్ అయ్యా. నాకు చావు గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం కాదు, చావంటే చెప్పలేనంత భయం. అది ఒప్పేసుకోలేకే ముసుగేమో!

ఎవరి చావైనా టీవీలో చూసినా, సీరియస్ గా లెక్చర్ వింటున్నప్పుడు ప్రొఫెసర్ చావు గురించి, ఇంకా బుద్ధిస్ట్ లు నమ్మేనైరాత్మావాదంకి సపోర్ట్ గా ఆర్గుమెంట్స్ ప్రెసెంట్ చేసినప్పుడైనా, నా ఆలోచనలన్నీ చావువైపు మళ్లుతాయి. నా చావు వైపు. నన్ను కట్టేసిన బంధాలు, నాకంటుకున్న స్నేహాలు, నాలో భాగమయిన మనుషులు, నా చావుతోనే మాయమవుతారా అని తోచేది. భయమేసేది. ఎంతో కష్టంగా వేరే విషయాల మీదకు నా ఆలోచనలను మళ్లించేవాడిని. అదొక నరకం. దెబ్బ తగిలితే రక్తం ఐనా కనపడుతుంది దాని ఆనవాలుగా. ఆలోచనల హింస మాత్రం ఎప్పటికీ బయటికి కనపడదు. నాకు చావు గురించి ఆలోచనలు ఎక్కువ రావడానికి ఒకానొక కారణం మా నాన్న.

ముందు మా నాన్న ఎలాంటోడో చెప్పాలి. పోనీ మా నాన్న అంటే నా దృష్టిలో ఏంటో మీకు తెలియాలి. ఎవరో తట్టినట్టుగా ఉదయం నాలుగింటికే లేచేవాడు నాన్న. దారంతా తెలిసినోడిలా దోవ తడుముకోకుండా ఇంట్లోంచి బయటకొచ్చి దొడ్లోకి పొయ్యేవాడు. పొగ తాగక నోరంతా పీకుతుందని ఉమ్మేసేవాడు. లుంగీ పైకిదోపి బీడీ వెలిగించేవాడు పొద్దు పొద్దున్నే. అప్పట్లో దొడ్డికి పైకప్పు ఉండేది కాదు. వాన, వెలుతురు, గాలి, అందరూ సమానమే దానికి. ఇష్టమొచ్చినప్పుడు వచ్చి పోతుండేవవి దానిలోపలికి. తెల్లారుజాము చీకట్లో ఎరుప్పచ్చని మిణుగురులా బీడీ వెలుగు. ఇంటికెదురు వేప చెట్టు నీడలో బీడీ ఆరిపోయేదాకా తిరిగేవాడు. గదిలోకి పోతూ, గదిలో ఉన్న నా మంచం దగ్గర ఒక్కోసారి ఆగేవాడు. మునగదీసుకుని పడుకున్న నన్ను పక్కకి జరిపి పడుకోవాలని చూసేవాడు. బీడీ వగరు వాసననో, బంకలా సాగే చర్మమనో, భరించలేని గురకనో చెప్పి, పడుకొనిచ్చేవాడిని కాదు నా దగ్గర ఆయనని. ఒక్కో రాత్రి సోయలేకుండా తాగొచ్చేవాడు. పొద్దున్నే బీడీకని లేచినప్పటికీ ఇంకా మత్తు దిగేది కాదు. అలాంటిరోజుల్లో నా దగ్గరకొచ్చి ముద్దు ఎక్కువ చేసేవాడు. మంచంకోడుని ఒక చేత్తో పట్టుకొని, బలంకొద్దీ నెట్టేవాడిని నా దగ్గర పడుకోవద్దని. నా ఉడుకుమోత్తనం చూసి ఇంకా నవ్వేవాడు. వాసనొస్తున్న నోటితో బుగ్గ మీద ముద్దుపెట్టేవాడు. గడ్డం అచ్చులు నా బుగ్గమీద పడేవి. (నేను ఇంటర్ లోకి వచ్చినప్పటికీ కూడా ముద్దులు ఆగలేదు). మా కుటుంబంలో మా నాన్నకొక్కడికే నిండైన గడ్డం. అమ్మతరపు ముగ్గురు మామయ్యలకి గడ్డిపోచల్లాంటి గడ్డం. వాళ్ళ కొడుకులకి అయితే పెళ్ళీడు వచ్చినా ఇంకా గోదుమ్మీసాలే. మా అన్నకి, నాకు వాళ్ళ పోలికే వచ్చిందనుకుంటా ఒక్క విషయంలో మాత్రం.

అసలు చిన్నప్పుడు మా నాన్నకు నా మీద ఇసుమంత కూడా ప్రేమ లేదని అనుకునేవాడిని. నా కారణాలు నాకున్నాయి మరి. నేను అయిదో తరగతి దాకా మా ఊరి చిన్నబడిలోనే చదువుకున్నా. తరువాత ఆరో తరగతికి పరీక్ష రాస్తే దూరంగా ఎక్కడో హాస్టల్ లో సీట్ వచ్చింది. కొత్త స్కూల్ యూనిఫామ్, పేజీలు నలగని నోటుబుక్కులు, మూడుపూటలా తిండి. నా ఇష్టంతో పనిలేకుండా పంపడానికే సిద్ధమయ్యారు ఇంట్లో వారందరూ. నాకంటూ ఒక ఇష్టం ఉంటుందని నాన్నకి అనిపించలేదు అప్పుడు. దసరా, సంక్రాంతికి వారం వారం రోజులు సెలవులుండేవి. ఉప్పుబిర్రాట, అయిసిరాట, వాలా వాలింకి ఆట, ఇవన్నీ తనివితీరా ఆడుకునేలోపే సెలవులయిపొయ్యేవి. హాస్టల్ కి వెళ్లే రోజు ఏడవని సంవత్సరం లేదు. హాస్టల్ కి పోవాలంటే మా మండలానికి నడిచి, అక్కడనుండి లారీ ఎక్కాలి. మాఊరి నుండి మండలానికి ఆరు కిలోమీటర్లు పైనే. అది కూడా మట్టి రోడ్డు. అడ్డదారిన రైలుపట్టాలెక్కి గేటు దగ్గరికి పోతే మూడు కిలోమీటర్లు తక్కువైద్ది. ఏడో తరగతిలోకి కొత్తగా పోతునప్పుడు, రైలు పట్టాల మీద మా నాన్నకి దొరక్కుండా చాలా దూరం ఉరికినా. వేగంగా పరుగెత్తాలని చెప్పులు తీసేసరికి పగులురాయి దిగబడి రక్తం విరగచిమ్మింది. తొందరలోనే నాన్న నన్ను దొరకబుచ్చుకున్నాడు. దగ్గర్లోనే కాలువ వంతెన ఒకటుండే. హాస్టల్ కి పోకపోతే గొంతుపిసికి కాలువలో నెడతా అని వీపు మీద రెండు దెబ్బలు గట్టిగా కొట్టిండు. ఏమనుకున్నాడో ఏమో గాని కాలువలో దించి దెబ్బ కడిగి, కండువతో కాలు కట్టిండు. దెబ్బతోనే హాస్టల్ కి ఏడ్చుకుంటూ వెళ్ళా. అప్పుడు అనిపించింది నాన్నకి నామీద ఏమాత్రం ఇష్టంలేదని.

కానీ, ఆయన మరీ ప్రేమ తెలియని గరుకు మనిషి కాదని ఒక పిల్లి వల్ల తెలిసొచ్చింది తర్వాతెప్పుడో నాకు. బొందలగడ్డ దగ్గర దొరికింది మాకా పిల్లి. పుట్టి ఎంతో కాలమయినట్టు లేదు. అప్పుడే విచ్చుకుంటున్న చిన్ని చిన్ని కళ్ళు. వళ్ళంతా ఇంకా పూర్తిగా కప్పెయ్యని బూడిదరంగు వెంట్రుకలు. పొట్టమీద అడ్డంగా రెండు మీగడరంగు గీతలు. ఎవరో గోనె బస్తాలో వేసి పారేశారక్కడ. బస్తా తాడువిప్పగానే నాన్న వళ్ళో వాలింది గోల చేసుకుంటూ. అది మొదలు నాన్నని విడిచిపెట్టింది లేదు అది. బ్రతుకులోనూ, చావులోనూ. దానికి లక్ష్మీ అని పేరు పెట్టాడు. కొంత కాలంలోనే నాన్న పళ్ళెంలో నాలుగు మజ్జిగన్నం మెతుకులు, పక్కమీద కొద్దిగా స్థలం, రెంటినీ ఆక్రమించేసింది అది. తను మా ఇంటికి వచ్చిన కొత్తలో నా దగ్గరకి వచ్చేది కాదు. మా ఇంటికొచ్చిన మూడోరోజు కళ్ళుమూసుకొని గాబు దగ్గర నీళ్లు తాగుతుంది. మెత్తగా తల నిమిరాను. అప్పటికింకా బెదురుతనం పోలేదు దానికి. రక్తమొచ్చేలా నా చేతులని గీరింది. నాన్న కూలికిపొయ్యి వచ్చేదాకా వాకిట్లోనే ఎదురుచూసింది. సాయంత్రంపూట ఇంటికిరాగానే నా మీద ఫిర్యాదు చేస్తున్నదానిలా నాన్న కాళ్ళలో తారకలాడింది చాలాసేపు.

అదంతా ఇంటికొచ్చిన కొత్తల్లో. తరవాత నాకు కూడా అలవాటు కావడానికి ఒక సంఘటన కారణమయ్యింది. రోజు మధ్యాహ్నం పిల్లులు పొడిచేవాళ్ళు బాడిశెలు పట్టుకొని మా గూడేనికి వచ్చారు. అప్పుడు అమ్మోళ్ళు మిరపతోటలో కలుపుకి పొయ్యారు. నేను గుడి దగ్గర సిర్రాట ఆడుతున్న. నాతో ఆడుతున్న అమ్మాయి మా పాక దగ్గర నుండి పిల్లి కేకలు వినొస్తున్నాయని చెప్పింది. తీరా చూస్తే మా లక్ష్మీ. పిల్లుల్ని వేటాడేవాళ్ళకి కనపడకూడదనే ప్రయత్నంలో సరుకారు కంపలో చిక్కుకుంది. ఎడం డొక్కకి ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతుంది. నే దగ్గరికెళ్లగానే సంజాయిషీ ఇస్తున్నట్టు తడి చూపు. కంపలోంచి తీసి, పసుపుతో కట్టు కట్టాను. కోళ్లు కప్పేసే తట్ట వెల్లకిలా వేసి, లోపల వెచ్చగా వేపాకులు వేసి పడుకోబెట్టా. సాయంత్రంకల్లా ఉషారుగా తిరిగింది. అప్పటినుండి నన్నూ దగ్గరికి రానిచ్చింది లక్ష్మి.

ఎంతైనా నాన్న దగ్గరే లక్ష్మికి చనువెక్కువ. ఒక్కోసారి లక్ష్మీ అలిగేది. ఎందుకు అలిగేదో ఎవరికీ తెలిసేది కాదు. ఇంట్లో ఎవరు పిలిచినా అన్నం తినడానికి వచ్చేది కాదు. అదే నాన్న సోయలేకుండా సారా తాగొచ్చి "లక్ష్మీ..." అని పిలిచినా, వళ్ళోకి దూకేది క్షణం ఆలస్యం చేయకుండా. కాలితో మొహమంతా తడిమేది. అలా నాన్నని తడుముతుంటే 'తాగుడు మానేయొచ్చుగా' అని బ్రతిమాలుతున్నట్లుండేది అది. పట్టలేనంత ఇష్టం వచ్చినపుడు మాత్రం పొట్ట కనపడేలా వెల్లకిలా పడుకొనేది. దగ్గరికి జరిగి వీపుమీద చెయ్యేసి ముద్దు చేయమని గోముగా కాళ్ళు జాపేది.

లక్ష్మి కడుపుతో ఉన్నప్పుడు నాన్న లోకమంతా దాని జాగ్రత్తలతోనే నిండిపోయింది. పొద్దున పనికి పొయ్యే ముందు దానికి హద్దులు చెప్పి, సాయంత్రం దాకా బయటకెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చేవాడు. లక్ష్మి కూడా నాన్న చెప్పేవన్నీ దానికి అర్థమవుతున్నట్టు చిన్నగా మూలిగేది. మధ్యాహ్నం పూట ఒక గొంతుకి బదులు, మూడు గొంతులు వినపడేసరికి తట్ట దగ్గరికి వెళ్లా. ఇంకా కళ్ళుతెరవని రెండు బుజ్జి ముండలు. ముట్టుకుందామని చెయ్యి పెట్టే లోపే కరుస్తా అన్నట్టు పళ్ళన్ని బయటపెట్టి పొగలు కక్కింది లక్ష్మి. నాటేసి అలసిపొయ్యి ఇంటికొచ్చారు అమ్మ, నాన్న. ఆయన మాట విని లక్ష్మి బయటకొచ్చింది. 'ఉన్నపళంగా వచ్చి నా పిల్లల్ని చూస్తావా? లేదా?' అని ఒకటే అరుపులు. ముట్టుకొని చూసిందాకా ఊపిరాడనీయలేదు నాన్ననప్పుడు.

అలాంటి లక్ష్మి ఇంటికి రావడం మానేసింది. నాన్న చనిపోయిన రోజు నుండి ఇంట్లో లక్ష్మి అలికిడి లేదు. అమ్మకి మాత్రం ఒక రోజు రాత్రి పూట కనిపించిందట. వెలుగు ఆరిపోయిన ఇంట్లో చీకట్లో వచ్చి పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోయిందట. నాన్న సమాధి కడుతున్న మేస్త్రీలకు బొందలగడ్డలో పిల్లి కనిపించిందని చెప్పారు. అది లక్ష్మినేమోనని వెతికా నేను. ఆచూకీ చిక్కలేదు. రోజులు గడిచేకొద్దీ రాత్రిపూట రావడం కూడా మానేసింది. పిల్లలు రోజురోజుకీ బక్కగయ్యాయి. రెండింటిలో ఒకటి ఇంటి ముందు రోడ్ మీద ఆడుకుంటుంటే ట్రాక్టర్ కింద పడి నుజ్జునుజ్జయింది. రక్తం కారిన దాని కనుగుడ్డు ఇప్పటికీ నాకు గుర్తే. దృశ్యం చూసిన వారికెవ్వరికైనా అన్నం సయించదు. మొదటిది చనిపోయిన తరువాత లక్ష్మీ ఒకసారి పగటిపూట ఇంటికి వచ్చింది. లోపలిగదిలో నేను కింద పడుకొని ఉన్నా. నా దగ్గరికి వచ్చి మౌనంగా తల పక్కన చేరింది. దాని బిడ్డని పిలిచింది ఇటు రమ్మని. అది కూడా వచ్చి నా పక్కన పడుకుంది. దాని చూపులో నాకెందుకో జాలి కనిపించింది. అదే చివరిసారిగా లక్ష్మీని చూడటం. మళ్ళీ కనిపించలేదు ఎవరికీమిగిలిన ఇంకొక పిల్లి ముభావంగా ఉండేది. (దానికి పేరు పెట్టడం మర్చిపోయ్యాం. అసలు పేరు పెట్టేవాడు లేడు కదా!). పెడితే తినేది, అంతేకాని నా హక్కు అని పొట్లాడేది కాదు ఎవరిమీదా. అది కూడా వారంరోజులుండి చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది. నాన్న చావుతోనే పిల్లి అరుపులు ఇంట్లోనుండి మాయమయ్యాయి. ఇప్పటికీ రోడ్డుమీద పోతుంటే పిల్లి అరుపు ఎక్కడైనా వినిపిస్తే, బొందలగడ్డలో మా నాన్న ప్రేమని వెతుక్కున్న లక్ష్మినే గుర్తొస్తుంది నాకు.

నాన్న మీద చిన్నప్పుడు అయిష్టత ఏర్పడడానికి పూర్తికారణం నాన్న చేష్టలే కాదు. దానికి ఇంకో కారణం మా పెదనాన్న ప్రేమ కూడా. మా పెదనాన్న కి ఇద్దరు మగ పిలగాళ్ళు, ఒక ఆడపిల్ల. అందరూ నాకంటే పదేళ్లు పైనే పెద్ద. ఇక మా ఇంట్లోనేమో నాకు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య. అందరికంటే నేనే చిన్న. మా ఇంట్లో కంటే ఎక్కువుగా నన్ను గారాబం చేసింది మా పెదనాన్న, పెద్దమ్మే. అసలు చిన్నప్పటినుండి నేను వాళ్ళని చెన్నూరమ్మ, చెన్నూరునాన్న అని పిలిచేవాడిని (చెన్నూరు వాళ్ల ఊరి పేరు). నేను హాస్టల్ కి వెళ్లకముందు అన్ని ఎండాకాలం సెలవులూ చెన్నూరులోనే గడిపా. గుంట గోలీలాట, డోకిచ్చులు, టెంకాటా ఆటలాడి ఊరు పిల్లాడినయ్యా. మొహం కడుక్కోగానే ఊర్లో ఇడ్లీల బండికాడకి పొయ్యి చెట్నీ అంతా చొక్కా మీద ఒలికించుకునేవాడిని. అప్పట్లోనే అక్కడ హోటల్ ఉంది, మా ఊర్లో ఇప్పటికి కూడా హోటల్ లేదు మరి. ముంజకాయలు, మామిడికాయలు తినడానికి తెంపే ఉండేది కాదు. వేడికి చెక్కగడ్డలు కాని వేసవి కాలం లేదు నా చిన్నప్పుడు. ఆయనకి కుడి కన్ను గనుపు దగ్గర పులిపిరి ఉండేది. దాన్ని గట్టిగా లాగి నా వంటిమీద అతికించుకోవాలని చూసేవాడిని. చెన్నూరునాన్న తెల్ల పంచె ఉదయం పట్టుకుంటే మళ్ళీ నిద్రపోయినప్పుడే వదిలేవాడిని. వానపడుతుంటే బట్టలు తీయలేదనో, వీపెనకాల చెమటకాయలు గీకలేదనో, పని దగ్గరనుండి ఇంటికొచ్చేలోపు బొచ్చలు రుద్దలేదనో నాన్న విసుక్కున్నప్పుడల్లా చెన్నూరునాన్న గుర్తొచ్చేవాడు నాకు. మా నాన్న చూపించని ప్రేమంతా చెన్నూరునాన్నలో వెతుక్కునేవాడిని.

నాకు చావంటే భయం అని చెప్పా కదా. అసలు అది చెన్నూరునాన్నతోనే మొదలయింది. నేను హాస్టల్ లో జాయినయిన ఏడాది చెన్నూరునాన్నని కాన్సర్ గడ్డ తినేసింది. విషయం నాకెవరూ చెప్పలేదు నేను హాస్టల్ లో ఉన్నప్పుడు. లాస్ట్ పరీక్షలు తరువాత ఇంటికొచ్చిన నాకు అమ్మ చెప్పింది. పెదనాన్న లేని చెన్నూరుని ఊహించుకోలేకపోయాను. అలిగిదాక్కున్న వడ్ల గుమ్ము, ఇద్దరం కూడబలుక్కొని బర్రెదూడలు కట్టేసిన కొబ్బరి చెట్లు, ఉప్పుబస్తా ఎక్కడానికి వీలుగా వంగిఉండే ఇంటిబయట బావిరాయి, వీటన్నింటికి అర్థాలు మారిపోతాయనిపించింది. నాకు మార్పు నచ్చలేదు. నచ్చడం కాదు, మార్పు వస్తే, దానితోపాటు పెదనాన్న కూడా అప్పుడప్పుడు తలచుకునే జ్ఞాపకం అయిపోతాడని భయం వేసింది. అందుకే నేను ఒకటి గట్టిగా అనుకున్నా అప్పుడే, ఊరికి వెళ్లకూడదని. ఇప్పటికి 13 సంవత్సరాలయింది ఊరిని చూసి. అక్కడికెళ్లి పెదనాన్న గుర్తులు కలుషితం చేసుకోవాలని లేదు నాకు. చావంటే నాకున్న భయం చెన్నూరునాన్న చెప్పాపెట్టకుండా కనపడని  రోజు నుండి మొదలయిందనుకుంటా.

నాన్న చనిపోయిన ముందురోజు రాత్రి తాగుడెక్కువైంది ఆయనికి. వీధిలో ఎవరితోనో పరాచికాలాడుతున్నాడు. ఇంటికి రమ్మని ఎంత బ్రతిమలాడినా రాలేదు. నాకు తెలిసి నేను గొంతు పెంచి నాన్నతో మాట్లాడింది అదే మొదటిసారి. అదే చివరిసారి కూడా. రాత్రి ఏదో పనుండి నేను మా ఇంట్లో పడుకోలే. రాత్రి తాలూకా చీకటి మచ్చలు ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయనుకుంటా. నిద్రపట్టక ఐదింటికే ఇంటిబాట పట్టా. చర్చీ మూల తిరుగుతుంటే  శ్రీనుగాడు ఉరుకులాంటి నడకతో నన్ను దాటేసి పొయ్యాడు. "ఆదాం మాయ్యా…" అని గొంతులో అదురు వినపడింది. మా ఇంటి బయటలైటు వేసుంది. అమ్మ ఏడుపు గట్టిగట్టిగా దగ్గరవుతుంది. నాన్న ఇవతలగదిలో కదలకుండా పడున్నాడు, నేను రోజూ మెదిలే మంచంలో, శాశ్వతంగా నిద్రపోతూ. ఏమి జరుగుతుందో ప్రాసెస్ కావడానికి టైం పట్టింది. మా అమ్మ ఏడుపులో నాన్న చివరి క్షణాల దృశ్యం కనపడింది. నాలుగింటికి దొడ్లోకని లేవడం, బీడీ ముట్టించడం, నా మంచం దగ్గరకొచ్చి నాకోసం వెతుక్కోవడం, పక్కమీద నా ఖాళీని పూరించడం, తొలిపొద్దు గుండెనొప్పి నాకు దూరంగా నాన్నని తీసుకెళ్లడం- ఇవన్నీ ఒక్కొక్కటిగా ముద్రపడుతున్నాయి నాలో.

మాటల్లో ఇమడ్చలేనంత శాంతం నాన్న ముఖంలో. చావు గడియ దగ్గరికొచ్చినప్పుడు నవ్వుతున్నట్టు అనిపించాడు. అసలు మంచం మీద నేనుంటే నాన్న ఇప్పుడు నాతోనే ఉండేవాడేమో? ఆలోచన వచ్చినప్పుడల్లా అమ్మ ముఖం చూడటానికి నాకు ధైర్యం చాలేది కాదు. నాన్నని బొందపెట్టిన మరుక్షణం నుండి లక్ష్మీ మా ఇంటికి రావడం మానేసింది. తను ప్రేమించే మనిషి ఇక లేడుగా.

నెలరోజులకి కొంత సర్దుకుంది ఇంట్లో. అమ్మ అప్పుడప్పుడు అంటుంది, నాన్న కల్లోకి వచ్చాడని, ఏదో చెప్పాడని. వెంటనే నా నుంచి బదులు రాదని తెలిసినా ఒక ప్రశ్న ఎప్పుడూ అడుగుతుంది "చిన్నోడానీకు రాడా కల్లోకి నాన్న?" అని. తనకి తెలీదు నాన్నతో పాటే, నాలో సగభాగం చచ్చిపోయిందని రాత్రి. స్పాంజిల దిండు, మంచి నీళ్లు తాగే రాగిబిందె, ముగ్గురం కల్సి దిగిన ఫోటో- ఇవన్నీ నాలోకం నుండి ఎంత బయటపడేద్దామనుకుంటానో, వాటి జ్ఞాపకాల గుర్తులు అంత లోలోపలికి విసురుగా వస్తాయి. బహుశా అప్పుడే చావు దాని ఉనికిని పూర్తిగా నా మీద వలలా కప్పేసింది.

డాక్టర్ ఇచ్చిన మాత్రల పవరు ఎక్కువుగా ఉందేమో, వేసుకోగానే మగత నిద్ర వస్తుంది రోజూ. మందులెందుకో చేదుగా అనిపించాయి ఇవాళ. ఏదో పనిగా వెతుకుతుంటే, టేబుల్ సొరుగులో నాన్న కళ్ళజోడు కనిపించింది. నల్ల ఫ్రేమ్, దానికి ఒక అద్దమే ఉంది. నాన్నతోనే ఇంకొకటి సమాధిలోకి జారుకుంది. అదే పనిగా వెతికితే, పాత ఉత్తరాలు కనిపించాయి. వానకి తడిసి ఎండకెండిన కాగితాలకి అంటుకునే మడతలు ఉత్తరాల నిండా. కొత్త ప్యాంట్ కొనివ్వమని ఒక దాంట్లో, కొబ్బరినూనె అయిపోయిందని మరొక దాంట్లో, క్రిస్మస్ కి ఇంటికి తీసుకుపొమ్మని ఏడుపు ఇంకొక దాంట్లో, కబడ్డీలో మోకాలి చిప్ప కొట్టుకుపోయిందని బాధ మరొక దాంట్లో- అన్నీ నేను రాసిన ఉత్తరాలే. నాన్న రాసినవి ఒక్కటి కూడా లేవు. ఆయన చదువుకుంది అప్పట్లో నాలుగే అయినా, బాగా తెలివుంది. నోటి లెక్కలు బాగా వచ్చు, నాకంటే బాగా. గొలుసు కొట్టు రాత కూడా. ఒకటికి రెండూ సార్లు చదివితే తప్ప అర్థమయ్యేవి కావు ఆయన ఉత్తరాలు అప్పట్లో. అన్నింటిలో ఒకటే రాగం- సరిగా తిను, ఎవరితో గొడవపెట్టుకోకు, బుద్ధిగా చదువుకో. ఉత్తరాలన్నీ నాన్నే దాచి ఉంచాడేమో? నా హాస్టల్ జీవితం, నాన్నతో నేను గడపని బాల్యం, ఉత్తరాల్లో చిక్కుకుంది.

నాలుగు రోజుల నుండి ఆగని వాన. ఇలా ఒకేసారి క్లైమేట్ మారిపోగానే నా తీరు మారిపోతుంది. ఇలాంటి ముసురు వాతావరణం బయట ఉన్నప్పుడు, వెంటనే దిగులు మేఘాలు కమ్ముకుంటాయి లోపల కూడా. ఇద్దరి నాన్నల జ్ఞాపకాలు దరిచేరతాయి. చావు నా రోజువారి జీవితంలో విడదీయలేనంతగా భాగమయిపోయిందని మెల్ల మెల్లగా స్పష్టమవుతుంది నాకిప్పుడు.

 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు