మా రచయితలు

రచయిత పేరు:    అక్షర మాలి

కవితలు

ఓపెన్ ద విండో...ప్లీజ్..

రాస్తా కనుమరు గైంది ..

ప్రయాణం ముగిసే లా వుంది ..

ఇక చాలు!

ఈ ఎండమావుల వెంట పరిగెత్తలేేను..

ప్లీజ్ ఓపెన్ ద విండో..

 

చుట్టూ మనుషులు

వికారమైన కళ్లు..

అమాయకపు చూపులు

ఇది కన్నుల అడవి.. 

కళ్లలోంచి జారుతున్న మంచు పొగ

చలిగా వుంది..

ప్లీజ్ ఓపెన్ ద విండో...

 

 

బాల్కనీలో నిలబడవు

మల్లె మొగ్గల్ని  సుతారంగా తాకవు

మిద్దె మీద అటూ ఇటూ నడవవు

మూల మలుపు వైపు 

నీ చూపుల నీడ కురవదు 

ఎంత ఎండగా వుందో తెల్సా ఇక్కడ.. 

అందుకే ఓపెన్ ద విండో ప్లీజ్..

 

నీ బాసలు  ముసురుకున్న హృదయం

ఆవేదనతో మూలిగింది..

తలుపులు మూసిన నీ ప్రపంచం వురిమింది..

కళ్లు మేఘాలయ్యాయి..

జోరు వానలో తడిసి ముద్దయి పోయాను..

ఇకనైనా..

కిటికీ మనసు తెరచ వా  ప్లీజ్...!!

ఇంటర్వ్యూలు

కథలో లోతు ఉంటుంది. నవలలో విస్తృతి ఉంటుంది

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బండి నారాయణ స్వామి గారితో  గోదావరి పత్రిక  కోసం         అక్షర మాలి  చేసిన  ఇంటర్వ్యూ..

1.         కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆనందాన్నిచ్చిందా?

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆనందాన్ని ఇచ్చింది అనడం కంటే ,ఎందుకు ఆనందాన్నిచ్చింది అనే ప్రశ్న నాకు ఇష్టం.అవార్డుల గురించి నాకు ముందు నుంచి పెద్దగా ఆసక్తులు లేవు.సమాచారం లేదు. కానీ శప్తభూమి చదివిన తర్వాత చాలామంది పాఠకులు ఈ నవలకు అవార్డు వస్తుంది. వస్తే బాగుంటుంది. అని చాలామంది అన్నారు ఫోను ద్వారా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. అంతవరకు నా మైండ్లో అవార్డు అన్నది లేదు. ఈ నవలను నేను దళిత బహుజన అస్తిత్వం తోను రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వమ్ తోనూ రాయడం సంభవించింది.అవార్డు వచ్చిన తర్వాత నా రాయలసీ మ పాఠకులు ఎక్కువగా సంతోషపడ్డారు. నా కులానికి సంబంధించిన పాఠకులు, వర్గానికి సంబంధించిన పాఠకులు ఎక్కువగా సంతోషపడ్డారు. ఈ నవలను నేను ఏ అస్తిత్వ వాదాల తో అయితే రాసినా నో ఆ అస్తిత్వానికి సంబంధించిన పాఠకులు ఆనంద పడినప్పుడు రచయితగా నాకు కూడా సహజంగానే ఆనందం వేసింది. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు జరిగిన ఆనందం, అనుభవం.

‌2.         మీ బాల్యం, కుటుంబ నేపథ్యం చెప్పండి?

నేను శ్రామిక కులంలో పుట్టినాను. శ్రామికులైన బంధు వర్గాల మధ్య పెరిగాను. అనంతపురం పాతూరు లో పుట్టి,బీరప్ప గుడి కట్టలమీద ఆడుకున్నాను. బీరప్ప గుడి లోని రావి చెట్టు నా శ్రామిక ప్రజల జీవన స్పందనలను వినిపిస్తూ ఉండేది. మా తాత రైల్వే కూలి.మా అమ్మ పుట్టింటి వాళ్ళు గొర్రెల కాపరులు. ఇతర బంధువులు ఇ ళ్లు కట్టే వాళ్ళు, పొలాలు దున్నేవాల్లు,బండి తోలే వాళ్ళు,, సున్నం వేసే వాళ్ళు ఇట్లా అనేకమైన శ్రామిక వృత్తుల మధ్య పెరిగి పెద్దయిన వాణ్ని.మా అప్ప డ్రిల్లు టీచర్ నుండి రైతుగా మారడంతో రైతు బిడ్డ అనుభవాలు అయిన గాలి, వాన , చలి , ఎండ అన్ని నా అనుభవంలోకి వచ్చినాయి.కాయకష్టం ఎట్లా ఉంటుందో తెలిసింది. నీళ్లు లేని వ్యవసాయం లో ఎంతటి విషాదం ఉందో అర్థమైంది. నా బాల్య జీవితం నుంచి నాలో కుల అస్తిత్వం,ప్రాంతీయ అస్తిత్వం, గ్రామీణ అస్తిత్వం బలపడి భవిష్యత్తులో నా రచనకు గరిమనాభి గా మారింది.

‌3.         మీరు రచనా వ్యాసంగం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు? ఏమిటి?

బాల్యంలో అంటే ఐదో తరగతి చదివే రోజుల్లో నాకు ఒక తమిళ కుటుంబం తో పరిచయమైంది. ఆ తమిళకుటుంబంలోని పిల్లవాడు దక్షిణామూర్తి అని నా సహాధ్యాయి. ఆ కుటుంబం బాగా చదువుకుంది వారి ఇంటి నిండా చందమామలు, బాలమిత్రలు గూళ్ళలో పేర్చి ఉండేవి.వారం వారం చక్రభ్రమణం, శంకు తీర్థం, సమాంతర రేఖలు వంటి వివిధ సీరియల్స్ మోసుకొని ఆంధ్రప్రభ వారపత్రిక వారి ముంగిట కొచ్చేది.ఆ తమిళ కుటుంబంలో క్లియోపాత్ర , హెర్క్యులస్ వంటి సినిమాలనుసత్యజిత్ రే వంటి సినిమా డైరెక్టర్లను ప్రస్తావిస్తూ ఉండేవారు." కణ్ణగి " కేంద్రంగా తమిళ సంస్కృతిని చెప్పుకొచ్చేవాళ్ళు. వారి ఇంట్లో గోడకు వయోలిన్ వేలాడుతూ ఉండేది.సంగీత సాహిత్య పరిజ్ఞానం నుంచి సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది. మడికట్లలో బొమ్మా బొరుసు, వీధుల్లో గోలి గుళ్లు, బొంగరాలు ఆడుకుంటూ కాలం గడిపే నన్ను మా అప్ప జిల్లా గ్రంథాలయంలో సభ్యుడిగా చేర్పించడం నా జీవితంలో ఒక పెద్ద పరిణామం.తమిళ బ్రాహ్మణ కుటుంబ వాతావరణం, ఈ గ్రంథాలయ పరిచయం రెండూ నాలో సాహిత్యం పట్ల అనురక్తిని కలిగించాయి. ఇంకా చెప్పాలంటే సాయిబాబా హై స్కూల్ లో పని చేసిన అప్పటి డ్రాయింగ్ టీచర్ చెప్పిన కథలు నన్ను చాలా ఉత్తేజితు న్ని చేసినాయి.ఇప్పటి స్కూల్లో మాదిరి కాకుండా అప్పట్లో సాయి బాబా హై స్కూల్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఎక్కువగా నిర్వహించేవారు.వక్తృత్వం వ్యాసరచన, పద్య పఠనం, డిబేట్ లు ఇలాంటివన్నీ నాలో జీవితం పట్ల జ్ఞానం పట్ల కళల పట్లఆసక్తిని పాదు  కొలిపి నాయి.

4.  మీలోని కథకుడిని గురించే ప్రపంచానికి తెల్సు, మరి మీలో గొప్ప కవి వున్నాడని విన్నాం . ఇంతకూ ఆ ఇద్దర్లో ఎవరిష్టమో చెప్పండి?

నేను నిజానికి కవిత్వంతో మొదలైన వాడిని. నేను, పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి  జిల్లా గ్రంథాలయంలో "అరుణిమ" అనే పేరుతో లిఖిత మాస పత్రికను నడిపిన అనుభవం ఉంది.కవిత్వం నుంచి నన్ను కథలోకి అనువదించిన వాడు నా స్నేహితుడు దేవపుత్ర. కవిత్వం రాసిన నేను కథ రాస్తానని అనుకోలేదు, కథ  రాసినప్పుడు నవల రాస్తానని అనుకోలేదు.ఆ తర్వాత వ్యాసరచనకు కూడా పోతానని నాకు తెలియదు.కవి నుంచి కథకుడిగా నవలా రచయితగా విమర్శకుడిగా మారడం నాలో ఒక పరిణామం.కానీ కథకుడిగా మారిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే నా భౌతిక జీవిత మూలాలకు వచన రచన దగ్గర కానీ కవిత్వం కాదు అని. నేను చెదురుమదురుగా నా వచనంలో కవిత్వం రాస్తే రాసి ఉండవచ్చు గానీ కవుల కవిత్వంలో ఒక మొత్తానికి సంబంధించిన శిల్పాన్ని సాధించలేకపోయాను. ఠాగూర్, ఇస్మాయిల్పల్లవ హనుమయ్య వంటి వారి కవిత్వం చదవడం నాకిష్టం.

 

5.         మీ తొలినాళ్ల నాటి అనంత పురం సాహిత్య వాతావరణం ఎలా ఉండేది?

మంచి రెడ్డి శివారెడ్డి అనే ఒక పెద్దాయన ఉండేవాడు.ఆయన అటు తిరిగి ఇటు తిరిగి అంతో ఇంతో రాసే కుర్ర వాళ్లను పట్టుకొని ఒక చోట చేర్చి సాహిత్య చర్చలు చేసేవాడు . అట్లా అతని దగ్గర చేరిన గుంపులో దేవపుత్ర, బద్వేలి రమేష్, కార్తికేయ శర్మ ,రాయుడు ,రమణ, కైలాష్ నాథ్, వై శ్రీరాములు ,మల్లెల వంటి కాబోయే రచయితలు, కవులు పరస్పరం పరిచయం అయినాము.వెన్నెల క్లినిక్ అని డాక్టర్ దక్షిణామూర్తి నడిపే ఒక క్లినిక్ ఉండేది. గ్రంథాలయం ఆవరణలో ఒక పెద్ద శిరీష కుసుమ వృద్ధ వృక్షం ఉండేది. పెద్ద వేపచెట్టు ఉండేది. గ్రంథాలయంలో స్నేహితులు ముందు వెనక పోయి పుస్తకాలు చదివే వాళ్ళం.క్రిందికి దిగి వచ్చి గౌసియ కాకా హోటల్ లో టీలు తాగి,వేప చెట్టు కింద కూర్చుని చర్చలు జరిపే వాళ్ళం. మరొక గొప్ప సంఘటన ఏమిటంటే గ్రంథాలయం లో మా లిఖిత మాసపత్రికకు తోడుగా మరో రెండు లిఖిత మాస పత్రికలు కూడా ఉండేవి. ఈ లిఖిత మాస పత్రికల వెనక ఉన్న వర్ధమాన కవులు రచయితల్ని గ్రంథాలయమే కలిపింది. లలిత కళా పరిషత్ లో అష్టావధానాలు జరిగేవి. గ్రంథాలయ వరండాలో సాహిత్య సమావేశాలు జరిగేవి. పాతూరి గాంధీ పార్క్ వద్ద తరిమెల నాగిరెడ్డి ఉపన్యాసాలు, హోటల్ ఆరామ్ లో వామపక్ష భావాల స్నేహితుల మధ్య పంచాది నిర్మల, వెంపటాపు సత్యం ల గురించిన చర్చలు జరిగేవి. సమాంతరంగా జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్ రమణ మహర్షి, బౌద్ధం గురించిన చర్చలు జరిగాయి. రకరకాల సిద్ధాంతాలు, భావజాలాలు, అభిప్రాయాల మధ్య ఏదో ఒక జ్ఞాన సర్వస్వం మా వర్ధమాన కవులు రచయితలతో దోబూచులాడుతున్నట్లు ఉండేది. వాటి ఆధారంగానే పుస్తకాలు సంపాదించే వా ళ్ళం. చదివేవాళ్ళం. చర్చించే వాళ్ళం.ఘర్షణ పడే వాళ్ళం. అనంతపురం సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ వాతావరణం నుంచి ఇక్కడ ఒక రసాయనిక చర్య మొదలైంది ఈ రసాయనిక చర్యల్లో భాగంగానే ఎంతోమంది రచయితలు కవులు తో పాటు ఈ రచయిత కూడా పుట్టుకొచ్చినాడు. తిరుమామిళ్ల సుబ్బారావు గారి నేతృత్వంలోని లిటరరీ వర్క్ షాపుల్లో బోసు, జూపల్లి ప్రేమ్చంద్ వంటి మరికొందరు మాతో కలవడం జరిగింది.

 

6.        ఇప్పటి దాకా ఎన్నో గొప్ప కథలు రాశారు అయితే మీకథల్లో మీకు సంతృప్తినిచ్చిన కథ ఏది ?

మీకు ఇష్టమైన కథ ఏది అని చాలా మంది అడుగుతుంటారు నేను రాసిన వాటిలో నాకు ఇష్టమైన కథ ఏదో నేను చెప్పలేను. నాకు ఇష్టంలేని ఒకటి రెండు కథలు మాత్రం ఉన్నాయి . మాస్టర్ పీస్ అంటారు కదా అలా ఈ మధ్య చాలామంది 'శప్త భూమి' ఈ రచయిత మాస్టర్ పీస్ అంటున్నారు. కానీ నాకు ఒక శిల్ప కారుడు గా ఎక్కువ సంతృప్తినిచ్చిన నవల "రెండు కలల దేశం" అని చెబుతుంటాను.

7.         కథా,నవలా రచనలో రచయితగా ఎక్కడ మీరు స్వేచ్ఛను అనుభవిస్తారు?

నా స్నేహితుడు గురువు అయిన దేవపుత్ర ఒక మాట అంటుండేవారు" కథ తాడు మీద నడవడం లాంటిది. నవల విశాలమైన మైదానంలో  అరబ్బు గుర్రం మీద స్వారీ చేయడం లాంటిది" అని. నవల రాయడం కంటే కథ రాయడం కష్టం భౌద్ధిక శ్రమ ఎక్కువ. కథలో లోతు ఉంటుంది. నవలలో విస్తృతి ఉంటుంది. కథలో వ్యక్తీకరించలేని సిద్ధాంతాలు భావజాలం నవలలో ఒక విశాలమైన కాన్వాస్ మీద వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది.కథా ప్రత్యేకత కథ ది. నవల ప్రత్యేకత నవలది.ఈ రెండు రుచులలో ఏది సంతోష పెడుతుంది అంటే దానికి కూడా జవాబు చెప్పడం కుదరదు.

‌8.         ప్రస్తుత రాయలసీమ అస్తిత్వవాద రచయితలకు మీరిచ్చే సూచనలు ఏమిటి?

‌"జీవితంలో కలం అద్ది రాయి"అంటాడు చలం. జీవితం అంటే ఏమిటి భౌతిక జీవితంలో కులం, వర్గం, భాష, ప్రాంతం, జెండర్ ఈ అస్తిత్వాలన్నీ కలిసి ఉంటాయి. జీవితంలో కలం అద్ది రాయడమంటే ఈ అస్తిత్వాలతో నిర్మించబడిన జీవితాన్ని వ్యక్తీకరించడమే. ఈ విధంగా రాయలసీమ లో ఒక రైతుబిడ్డగా పుట్టినందుకు రాయలసీమే నా సాహిత్య వస్తువు అయింది. రాయలసీమలోని వర్షాభావం, కరువులు, వలసలు, అప్పులు,ఆత్మహత్యలు, రైతులు ఇతర రాష్ట్రాలకు పోయి యాచకులుగా మారడం, కరువులో పుట్టిన పిల్లలను అమ్ముకోవడం, ఇటువంటి దుర్భర విషయాలు రాయలసీమ రచయితలకు సాహిత్య వస్తువులుగా మారుతాయి. తెలంగాణ విడిపోయిన తర్వాత కథారచనలో వస్తు పరంగా పెద్ద మార్పు వచ్చింది.నూరు సంవత్సరాల రాయలసీమ కథ ఒకచోటికి వచ్చి ఆగిపోతే , 2014 నుంచి రాయల సీమ కథ కొత్త మలుపు తీసుకుంది. రాయలసీమ కథా వస్తువులకు 2014 నుంచి చారిత్రక జ్ఞానం అబ్బింది. రాయలసీమ వందేళ్ళ కథ, జీవితం ఇట్లా ఉంది అని రాయలసీమ జీవితాన్ని చిత్రీకరిస్తే, 2014 నుంచి మొదలైన కథ జీవితం ఇట్ల ఎందుకు ఉంది అనే చారిత్రక జ్ఞానం తో కొత్త పుంతలు తొక్కింది.జీవితం ఇట్లా ఉంది, జీవితం ఇట్ల ఎందుకుంది,జీవితం ఏమి చేస్తే బాగుంటుంది, అనే ఈ మూడు సాహిత్య సూత్రాలను ప్రాంతానికి అన్వయిస్తే

‌- రాయలసీమ ప్రాంతం ఇట్లుంది.

‌- రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకు ఉంది.

‌- రాయలసీమ ప్రాంతం ఏమి చేస్తే బాగుంటుంది.

అనే ఈ మూడు సాహిత్య సూత్రాలు రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ రచనలను బలోపేతం చేస్తాయని భావిస్తాను.

‌9.         బహుజన సాహితీవేత్తలు తమ కలాలను ఎలా పదును పెట్టుకోవాలి ?

బహుజనులు మొదటగా తమ కుల అస్తిత్వాన్ని గుర్తించాలి. కులం తో ముడిపడిన వృత్తిని గుర్తిం చాలి. ఆ వృత్తి తో ముడిపడిన సంస్కృతిని గుర్తించాలి. చరిత్రలో తన కులం యొక్క సామాజిక అస్తిత్వాన్ని గుర్తించాలి. అంటే తన కులం యొక్క చరిత్రను, భాషను, సంస్కృతిని, ఆర్థిక స్థాయిని అవగాహన చేసుకుని వివిధ పార్శ్వాలలో తనకులపు శ్రమ జీవితాన్ని చిత్రించ వలెను. " He may born in Church,but don't die in church "అని ఇంగ్లీషులో ఒక ప్రోవేర్బ్ వుంది. కాబట్టి కులంలో పుట్టిన రచయిత కులంలోనే మిగిలిపోకుండా ఇతర శ్రామిక కులాల లోకి ప్రయాణించి ఒక ఉమ్మడి శ్రామిక భావనను సృష్టించే ప్రయత్నం కూడా అవసరం.ఇది శ్రామిక కులాల రాజ్యాధికారానికి ఒక ఓటు బ్యాంకుగా ఐక్యం అవుతుంది, అనడంలో సందేహం లేదు. ఈ చారిత్రక అవసరం కోసం బహుజన రచయితలు కృషి చేస్తారని ఆశిస్తా..

‌10.       శప్తభూమి రచనకు నేపథ్యం ఏమిటి

శప్తభూమి రచన ఈ రచయిత చేసింది కాదు. ఈ రచయిత చేత రాయలసీమ రాయించింది. రచయిత ఆకాశం నుండి ఊడి పడడు. సామాజిక సందర్భాలే ఏది రాయాలో రచయితను శాసిస్తాయి. తెలంగాణ పోరాట నేపథ్యంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైన సమయంలో రాయలసీమను సాంస్కృతికంగా చారిత్రకంగా సామాజికంగా రాజకీయంగా ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో  శప్త భూమి నవల రాయడం జరిగింది. ఈ రచయిత రాయలసీమలో పుట్టి ఉండకపోతే ఈ ప్రాంతీయ అస్తిత్వ నవల రాసే వాడు కాడు అని మాత్రం చెప్పగలను.

‌11.       యువ రచయితలకు మీరిచ్చే సూచనలు ఏమిటి?

‌ఈ రచయిత ఎదుగుతున్న క్రమంలో చాలా విషయాలు, పెద్ద వారి ముఖతః విని నేర్చుకున్నాడు. ఇస్మాయిల్ గారు, సుదర్శనం గారి వంటి మహానుభావుల సమక్షంలో ఇతడు ఒక సాహిత్య సంస్కారాన్ని అలవర్చుకున్నాడు. ప్రస్తుతం గూగుల్ గురువైన ఈ ప్రపంచంలో సమాచారమే జ్ఞానం కాదని, సమాచారాన్ని విశ్లేషించడం రచనకు అవసరమని ఇప్పటి ఆధునిక యువ రచయితలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు