మా రచయితలు

రచయిత పేరు:    కూకట్ల తిరుపతి

కవితలు

ఆజాది

బేపారంతో బత్మనీకచ్చిన బేయిజ్జతుగాళ్ళు
మన కంట్లెనే మన యేలు తోటే...
ఇస్సీ...! నంబకరాలు
తల్లిరొమ్మును గుద్దిన బేయిమానుగొట్టోళ్ళు

తెల్ల బంగారం, నల్ల బంగారం
అస్లీ బంగారమే కాదు, సకులం బాండువలకు బాండువలు
బొత్తిగ తెప్ప దాటిచ్చిన బట్టేబాజ్‌గాళ్ళు
కుటీర కార్ఖానాల కుంటువడగొట్టి
నకిలీ కొడుకుల దోప్కమే దోప్కం
మన గడ్డ మీదనే మనం పరాయోల్లం.

మన కట్టు, మన బొట్టు, మన జుట్టు
మన బోనం, మన మానం, మన పాణం
తెల్ల రక్కసులకు పరవా నహీ
పుల్లరి పితూరీల పయి
సలసల మసిలిన మజ్ఞారి మజ్జ
పరాయిపీడకులను ఉప్పు పాతరేయంగ
ఉరికొయ్యన ఉయ్యాలలూగిన ఉయ్యాలవాడ

కండ్ల ముందటే కన్నతల్లి వలపోత
పటపట పాలాలేగిన పండ్లు
చిటపొట నిష్కలయి దుంకిన కండ్లు
తుది నెత్తురు బొట్టు వడిసే దనుక
తెల్ల తోడేండ్లను తెగ నరికిన మణికర్ణిక

తంతెలకనంగ ఎట్టిసాకిరిల కట్టు బాంచె బత్కులు
చావలేక బత్కలేక తల్లడం మల్లడమాయే.
మా తాత ముత్తాతల తండ్లాటకు
త్యాగమే దారి దీపమయ్యింది
పదునెక్కిన గోండ్వానా పరగణం

బరిసెలు బరిల నిల్సినయి
విల్లంబులు విహంగాలయినయి
ఉరితాళ్ళను పేనిస వెయ్యి ఊడల మర్రి

దోపిడీదారుల్ని మార్చడమే కాదు
దోపిడీ నుండి విముక్తం కల్పించాలన్న
భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల బలిదానం
చిలచిలా నెత్తురు చిల్లి భాసిల్లినా
ముల్లును ముల్లుతోనే తీయాలన్న అల్లూరి ఆశయం.

మావా నాటే మావా గావ్‌
గొంతు పల్గొట్టుకొన్న జల్‌, జంగల్‌, జమీన్లు
కొదమ సింగపు కొట్లాట
ఆదివాసీల ఆత్మ గౌరవ పతాక.

బ్రిటీష్‌ రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్‌ దాడులు
దొడ్డి కొమురయ్య దుడ్డుకర్ర మోతలు
చాకలి ఐలమ్మ రోకలిబండ పోటులు
షోయబ్‌ ఉల్లాఖాన్‌ ఆజాది రాతలు
షేక్‌ బందగీ ఖానూనుకై లడాయి
మహ్మదాపూర్ల మారుమోగిన గుట్టలు
భూమి కోసం భుక్తి కోసం
వెట్టి చాకిరి విముక్తి కోసం
సాగిన రైతాంగ సాయుధ సమరం

ఇసిరెలు పసిరెలు మర్లవడ్డయి
అతారెలు పతారెలు తిరగవడ్డయి
గడీలు గజగజ వనికినయి
బూసాములు బుజబుజ వోసుకున్నరు
ఊరూవాడా కో... అంటే కో... అన్నయి
రజాకార్లను తరిమికొట్టినయి 
నిజాం పాలనకు గోరీ కట్టినయి.

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
తెలంగాణ అమరవీరులకు జోహార్లు!


 

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు