రెండు కాళ్ళ జంతువుగా చేసి
ఊరికి దూరంగా నెట్టబడ్డ
వెలివాడలో నుంచి ఉదయించిన
ధిక్కార పతాకం నీవు
కలం నిండా ప్రేమతో పాటు
త్యాగాల రక్తాన్ని నింపుకొని
నీలాకాశంలో మెరిసిన
ఎర్రని నక్షత్రానివి నీవు
పీల్చే గాలి త్రాగే నీరు నిషిద్దమైన చోట
శత్రువు మీద దాని సాహిత్యం మీద
సముద్రంలోని కెరటం వలే
విరుచుకుపడిన అక్షర బాణం నీవు
పొత్తికడుపు వెన్నెముకకు అతికి
వెలివాడలోనున్న మూగజీవుల వెతల్ని
ఏటికి ఎదురీదుతున్న జీవన పోరాటాన్ని
అడవి బాట పట్టించిన ధీరుడవు నీవు
నీవు ఒరిగిన పొద్దున
వాడలో పొయ్యి వెలగకుండా దుఃఖించింది
కలం సిరా బదులు రక్తాన్ని స్రవించింది
పోరు నినాదాలతో ధరణి కంపించి ధ్వనించింది
మా గుండెకు తాకిన నీ కవిత్వం
మమ్మల్ని పోరు దారుల్లో నడిపించే యవ్వన శక్తి
నీకు నివాళిగా మేమేమివ్వగలం
యుద్దక్షేత్రంలో ప్రాణాలు తప్ప!
రచనా కాలం. 17-05-2020