పాగ్రూపము లేక మూల రూపము లేక ప్రాతిపదిక రూపము అనే పేర్లతో పిలువబడే పదము పాశ్చాత్య సాహిత్యం నుండి వచ్చింది. జె.జి. ఫ్రెజర్ అనునతడు 1890-1915 వరకు పరిశోధించి ‘‘దిగోల్డన్‍బో’’ అనే పుస్తకం రచించాడు. ‘‘ఆంధ్రోపాలజి’’కి (నరజీవన శాస్త్రము) సంబంధించినంత వరకు ఇది మూలగ్రంథము. మూలరూపక పురాణాంశములు, పవిత్రాచారాలు, విభిన్న జాతుల వీర గాధలలోను, మతకర్మ నియమాలలోను పదే పదే పునరావృతమైన వని ఇతడు ప్రతిపాదించాడు. మూలరూప సిద్దాంతము ఈ విధంగా సాహిత్యంలోకి ప్రవేశించి, సి.జి.యూంగ్ మనో విజ్ఞాన సిద్దాంతము ద్వారా ప్రభావితమయినది.యూంగ్ ప్రకారము మన పూర్వుల జీవితాలలో సంభవించిన అనుభవాలు, అనుభూతులు, వారసత్వము ద్వారా మానవజాతి యొక్క సామూహిక సుప్తచేతనలో మానసికావశేషాలుగా నిలిచిపోయిన మౌలిక రూపాలే పాగ్రూపాలు (అర్కిటె•ప్స్). ఇవి అన్ని సంస్కృతుల కల్పిత గాధలలో, మత కర్మలలో, స్వాప్నిక జగత్తులో, వైయక్తిక అభూత కల్పనలో మరియు సాహిత్య గ్రంధాల్లో కూడా ప్రతిబింబించాయని తెలిపాడు.
ఆది మానవుడు ఆహారం కోసం జంతువుల్ని వేటాడి చంపాడు. అదే సమయంలో బలమైన జంతువులు, బలహీన •ంతువులతో పాటు మనిషిని కూడా చంపి తినడం గమనించాడు. వేట అనేది అతని మెదడులో స్థిరపడింది. చిత్రలేఖనంలో అది పులివేటగా చిత్రించబడింది. వేట కథలకు ‘‘పులి, మేక’’ రెండు పాత్రలు నమూనాలుగా మిగిలాయి. ఒకరకంగా ఇది మూలరూపం (ఆర్కిటె•ప్) మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీ యజమాని స్థానంలో ఉంది. పాలనాధికారం చేతబూని కనిపిస్తుంది. ఆ సమయంలో ఆమె సమాజ ఉపయోగం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకొనేది. కఠినాత్మురాలిగా కనిపించేది. ఇందుకు ఉదాహరణగా ‘‘తాటక’’ను తీసుకోవచ్చు. పితృస్వామ్య సమాజంలో యజమాని స్థానాన్ని పురుషుడు ఆక్రమించాడు. ఆకాలం నుండి పురుషుడు కఠినాత్ముడు కావడం కనపడుతుంది. ఈ సమయంలో కఠినంగా వ్యవహరించే స్త్రీలను తాటకతో పోల్చడం గమనార్హం. ఇక్కడ తాటక ఒక పాగ్రూపం. ‘‘సామాజిక ప్రయోజనం కోసం తనువు చాలించిన వీరులు, సాంఘిక కట్టుబాట్లను కాదని ప్రవర్తించిన తిరుగుబాటుదారులు, మనుషులు ప్రశాంత చిత్తులు కావడానికి దారి చూపిన శాంతికాముకులు, మానవాళిని భయవిహ్వాలులను చేసిన క్రూరజంతువులు, కొత్త స్థలాలను కనుగొన్న దేశద్రిమ్మరులు, శాంతి సుహృద్బావాలకు పీటవేసిన ప్రేమమయులు, ప్రతీకారజ్వాలలో మండిపోయి సర్వ నాశనం చేసిన దురాత్ములు, అన్వేషకులు, మాంత్రికులు, వీరులు, కుత్సితులు, మానసికోల్లాసం కలిగించే పూలు, స్థలాలు ఇలా అనేకం చరిత్రలోని విషయాలు, పాగ్రూపాలుగా మారి మనుషుల్లో స్థిరజీవనం చేస్తుంటాయి. అవి సృజన సమయాన వెలువడి, రచనలో చోటు చేసుకుంటాయి.’’ అని మేరువ వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డాడు.
పూర్వీకుల జ్ఞాపకాలు, అంతర్గతంగా వారసత్వ రూపంలో తరతరానికి అందుతుంటాయి. అలాగే అవి సాహిత్యంలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఇవి ప్రాచీన విశ్వాసాలను, అలవాట్లను, లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. జానపద, పౌరాణిక విజ్ఞాన, మత భావాలను కలిగి ఉంటాయి. స్త్రీ పురుషులకు చెందిన, మనిషి-పశుపక్ష్యాదులకు చెందిన, కుటుంబ సంబంధాలకు చెందిన పాగ్రూపాలు కూడా కథల్లో కనపడతాయి. కథాంశాలుగా, భావాలుగా, ప్రతీకలుగా, పాత్రలుగా సాహిత్యంలో ఇవి చోటుచేసుకున్నాయి.
ఆదిమ కాలాన ఆకలి కోసం మనుషులు, జంతువులు పరస్పరం చంపుకొని తినేవి. చంపడం, వేట ప్రధాన లక్షణం. చంపడానికి కావలసింది శారీరక బలం. ఆ తరువాత తెలివి. ఈ రెండు ఉన్నవాడు బలవంతుడు. అలా బలవంతుడు, బలహీనుణ్ణి చంపడం, హింసించడం సహజ న్యాయంగా స్థిరపడింది. మనిషి, జంతువును హింసించడం కాదు, మనిషి తోటి మనిషిని హింసించడం కూడా ఒప్పుకోదగిందిగా ఆ కాలంలో చలామణి అయింది. వేటాడం, వెంటాడడం అనేవి ఆదిమకాలంలో నిత్యకృత్యాలు. అవి మెల్లమెల్లగా రూపాలుమార్చుకొని నేటికీ కొనసాగుతున్నవి. చిన్న చేపను పెద్ద చేప మింగడం, బలవంతుడు బలహీనుణ్ణి హింసించడం అనేవి ఆధునిక కాలాన కూడా సాగుతున్నవి. ఇది పాత అలవాటుకు కొనసాగింపు. వేట ఒక పాగ్రూపం. నేడు ఎన్నిరకాల వేట సాగుతున్నా దాని ప్రధాన లక్షణమైన హింస, ఆదిమకాలపు మూల రూపమైన వేట నుండే వచ్చింది. ఇందులో వేటాడే జంతువు, వేటకు గురి అయ్యే జంతువు రెండూ ఉంటాయి. బలంకలవాడు వేటాడతాడు. దానికి ప్రతీకగా పులి కనిపిస్తుంది. వేటకు గురి అయ్యే జంతువు తక్కువ బలం కలదిగా ఉంటుంది. ఇందుకు ప్రతీకగా మేక కనిపిస్తుంది. ‘‘పులి-మేక’’ ఈ రెండు వేట సంబంధిత పాగ్రూపాలు. వేటాడే జంతువు ఎప్పుడు ఇతర జంతువుపై తన గురి పెడుతుంది. అది సమస్తాన్ని పరాయిగా భావిస్తుంది. ‘‘నేను-నీవు’’ భావనను కలిగి ఉంటుంది. ‘‘ద్వైతం’’ అనే భావనలో అది జీవిస్తుంది. పులిని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.
మేక లాంటి సాధు జంతువుకు వేటపై మక్కువ తక్కువ. అది తన ఆహారం కోసం, ప్రకృతిలో దొరికే శాఖాహారం పై ఆధారపడుతుంది. ఆహార సేకరణతో కడుపు నింపుకుంటుంది. ఈ క్రమంలో తన తోటి జంతువులతో కలిసి బ్రతుకుతుంది. మందగా ఒకచోట ఉంటుంది. తనకు, తన తోటి వారికి మధ్య అభేదాన్ని పాటిస్తుంది. ‘‘అద్వైత భావనతో అది జీవిస్తుంది. ‘‘పులి-మేక’’ అనే రెండు జంతువులు ‘‘ద్వైతాద్వైతం’’ అనే భావనకు ప్రతీకలు. ఈ విషయాన్నే రావిశాస్త్రి ‘‘ద్వైతాద్వైతం’’ అనే కథగా మలిచారు.
రావిశాస్త్రి కథలోని పెద్దపులి దాహం తీర్చుకోవడానికి పక్కనున్న కొండపైకి వచ్చి ఆ మేక పిల్లలను చూచి వాటిపై పడి ఒకమేక పిల్లను పట్టుకొని పోతుంది. మేకపిల్లను తన ఆహారంగా దేవుడు సృష్టించాడని వాదిస్తుంది పులి. ఇందులో వేట ఉంది. అదొక ప్రాగూపం. అలా మూలరూపం పెద్దపులి రూపంలో కనపడుతుంది. పులి ద్వైత వాది. చంపడం నా హక్కు. చావడం మేక కర్మ అని పెద్దపులి అంటుంది. సాధుజంతువైన మేక అద్వైత వాది. నువ్వు వేరు, నేను వేరు అనే భేదం దానికి లేదు. అందుకే కథలో అందరి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. నేడు విలువలు వదిలి, తన కోసం ఇతరులను హింసిస్తూ బతికేవాడు పెద్దపులిగా కనిపిస్తున్నాడు. అందరి కోసం, ఒక్కడుగా నిలిచి పోరాడేవాడు పెద్దపులి చేతిలో చచ్చే మేక లాగా మిగులుతున్నాడు. ‘‘పులి-మేక’’ లను ముందు పెట్టి కథ నడిపిన రావిశాస్త్రి, ఆదిమ కాలపు మూలరూపమైన వేటకు కథ రూపమిచ్చారు. ‘‘ఆర్కిటె•ప్’’ ద్వారా ఒక తాత్విక సందేశం ఇచ్చారు.
మూలరూపాల ప్రభావం ఒక తరం నుండి మరో తరంకు చేరుతుంది. సాంస్కృతిక పునరుజ్జీవన ప్రభావమే కావచ్చు. శాస్త్ర సాంకేతిక అభివృద్ది వల్ల కావచ్చు మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. విశ్వాసం ఒక వైపు, హేతువు మరో వైపు మనుషుల వైఖరిలో మార్పులు తెచ్చాయి. దాని వల్ల ప్రతిదాన్ని ప్రశ్నించడం అలవాటయింది. పునర్వ్యాఖ్యానించడం పునర్మూల్యాంకనం చేయడం సాధారణమయింది. అందులో భాగంగానే పురాణకథలను కొత్త దృక్కోణంలో తిరగరాయడం మొదలయింది. పురాణ కథల్లోని అసంబద్ధతను, హేతువుతో పరీక్షించి వాటిని కొత్తగా మలచి చెప్పే ధోరణి పెరిగింది. ఆధునికత పునాదిగా పురాణ కథలను విమర్శించడం భక్తి పారవశ్యంతో వైభవీకరించడం పరిపాటయింది. ఆ విధంగా పాగ్రూప కథా సాహిత్యం విరివిగా వచ్చింది. త్రిపురనేని రామస్వామి చలం గార్ల మీదుగా ఓల్గా నుండి నేటి వరకు ఈ ధోరణి కొనసాగుతుంది. ఇదే అలవరసలపై వరుసగా వచ్చినవి ‘‘విముక్త’’ కథలు. రచయిత్రి ఓల్గా చేసిన ఈ కథా ప్రయోగం పురాణం కథల్లోని స్త్రీలకు గొంతుకను ఇచ్చింది.
‘‘పురాణాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సమ్మోహన శక్తి ఉంటుంది. ఎందుచేతనంటే సమస్త మానవ జాతి యొక్క సమిష్టి బాల్యం వాటిల్లో ఇమిడి ఉంటుంది గనుక’’ అన్నాడు మార్క్సు అయితే ‘‘ఈ సమ్మోహక శక్తి ఎక్కడినుంచి వస్తుంది?’’ అని ప్రశ్నిస్తే పౌరాణిక సంఘటనల కన్నా కూడా ప్రధానంగా ఆయా పురాణగాధల్లోని పాత్రల సంక్లిష్టత, సంపూర్ణత, ఉదాత్తత, సార్వకాలీనత, విశ్వజనీనత-వీటి నుంచే అని జవాబు చెప్పుకోవచ్చు. రాముడు, భీముడు, కర్ణుడు, అభిమన్యుడు, ద్రౌపది, సీత... వీళ్ళంతా సజీవంగా, శాశ్వతంగా పండిత పామర హృదయాల్లో నిలిచిపోయే వ్యక్తులు.
అయితే పౌరాణిక పాత్రల ఉదాత్తత, ఎదుగుదల, సంపూర్ణత, ఆయా పరిస్థితుల్లో వాళ్ళు చేసిన సంఘర్షణల ఫలితాలే. చరిత్రనీ, పురాణాల్నీ కలగా పులగం చేసి, గందర గోళం సృష్టించే కొంత మంది వ్యక్తులు, ఈ సంఘర్షణని దాటవేసి పురాణాలని సమతుల్యానికి ఆదర్శంగా చిత్రించబూనుతాయి. అంతేగాని ఆధునికతవైపు, సత్యాన్వేషణ వైపు పాఠకులని తీసుకెళ్ళరు.’’
‘‘ఇతిహాసపు వెలుతురు కోణాలు’’ ‘‘విముక్త’’ కథా సంపుటి ముందుమాట
డా।। యు.సంధ్య, డా।। యు.సుధాకర్
పై వాక్యాల్లో పురాణాల్ని తిరగదోడే కొత్త దృష్టి కనిపిస్తుంది. ‘వేదాల్లోనే అన్ని ఉన్నాయష’’ అనే పాత దృష్టి కూడా కొనసాగుతుంది. కొత్త దృష్టిని ఆలంబనగా చేసుకొని ఓల్గా రాసిన కథల్లో ‘‘సమాగమం’’ ఒకటి. ఇందులో సీత, శూర్పణఖల మధ్య మైత్రి కనపడుతుంది. ఇతిహాసంలో వీరిరువురి మధ్య సఖ్యతకనిపించదు. ధర్మపరి రక్షణ పేరుతో రాముడు శూర్పణఖకు దండన విధిస్తాడు. జనాభిప్రాయం పేరుతో రాముడు, సీతను అడవులకు పంపుతాడు. ఇద్దరు స్త్రీలు వేరువేరు కారణాలతో ఒకే పురుషుని వల్ల బాధలకు గురి అవుతారు. ఇద్దరి జీవితాలు కూడా వనవాసంతో పెనవేసుకొనే ఉన్నాయి. ఈ సారూప్యతను గ్రహించిన ఓల్గా ‘‘సమాగమం’’లో వారి మధ్య మైత్రిని ధృఢపరిచింది. ‘‘పురుషులు సృష్టించిన యుద్దానికి స్త్రీలు కారణం కాదు’’ అనే భావన ఆధారంగా ఈ కథ రాసింది. ఇద్దరు స్త్రీల మధ్య స్నేహం, ముఖ్యంగా శూర్పణఖ మాటలు, సీతలో కొత్త ఆలోచనలు పురిగొల్పాయి. ‘‘సాఫల్యానికి అర్ధం పురుషుని సాహచర్యంలో లేదని గ్రహించాను. అది తెలిశాకే నాకీ పురుష సాహచర్యం కలిగింది’’ అనే శూర్పణఖ మాటలు రచయిత్రి కొత్త దృష్టిని స్పష్టపరుస్తాయి. శూర్పణఖ ఒక పాగ్రూపం. ఈ కథ ఒక ప్రయోగం. ఇలా పాగ్రూపాలు కథా సాహిత్యాన్ని సంపద్వంతం చేస్తున్నాయి.